బృహస్పతి యాగం

0
8

[dropcap]ఆ[/dropcap] వూళ్ళో భూమయ్య ఓ పెద్ద భూస్వామి. అదే వూళ్ళో అతడితో సరితూగగల మరో భూస్వామి రాజయ్య మాత్రమే. వారిద్దరి మధ్య ఎప్పుడూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ వుంటుంది. దానికి కారణం- వారిద్దరి మధ్య సరిహద్దు తగాదా ఒకటి ఎప్పటినుంచో రాజుకుంటోంది. మధ్యవర్తుల రాజీ ప్రయత్నాలు ఫలించక ఇద్దరూ కోర్టుకెక్కారు. పట్నం వెళ్ళి ఓ పెద్ద లాయర్ని కలిశాడు భూమయ్య. రాజయ్య కూడా అంతకన్న పెద్ద లాయర్ని పెట్టుకున్నాడు.

ఈ మధ్య కొంతమంది లాయర్లు సుప్రీంకోర్టు సూచన మేరకు కక్షిదారుల మధ్య రాజీకి ప్రయత్నిస్తున్నారు. దానివల్ల వాళ్ళకు కోర్టు ఫీజులు, దారి ఖర్చులు కలిసి వస్తాయి. ఎంతో సమయం, శ్రమ కలిసి వస్తాయి. అంతేకాక కోర్టులపై ఒత్తిడి తగ్గుతుంది. అది దృష్టిలో వుంచుకుని కేసంతా విని రాజీపడమని సలహా ఇచ్చాడు భూమయ్య లాయరు. అలాగే రాజయ్య లాయరు కూడా సలహా యిచ్చాడు. కాని వాళ్లు వింటేగా, ససేమిరా అన్నారు వాళ్ళు.

రెండేళ్ళు గడిచాయి, వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. కాని కేసు మాత్రం కొలిక్కిరాలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన వుంది. అయితే కోర్టు ఖర్చుల నిమిత్తం వాళ్ళ ఆస్తులు మాత్రం కొంతమేర తరిగాయి.

ఓ రోజు భూమయ్య పొద్దుటే టి.వి ముందు కూర్చున్నాడు. టైం ప్రకారం ఓ జ్యోతిష పండితుడు తెరపై కొచ్చాడు. నిండుగా కషాయ వస్త్రాలు ధరించాడు. నుదుట కొత్త రూపాయ కాసంత కుంకుమ బొట్టు పెట్టాడు. మెడలో నేపాలు రుద్రాక్షమాలలు రెండు ధరించాడు. బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతోంది ఆయనలో. ఆ వారం ఏఏ రాశులవారికి ఏఏ ఫలితాలుంటాయో గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తున్నాడు. భూమయ్యకు కుతూహలం పెరిగింది. తన రాశికి ఏం చెబుతాడోనని చెవులు రిక్కించి వినసాగాడు. తనది సింహరాశి. సింహరాశి వారికి మంచి జరుగుతుందని కోర్టు వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయని చెప్పాడు. ఐతే ఆ రాశివారు ఐదు రోజులపాటు సమవర్తికి వడపప్పు, పానకం నైవేధ్యం పెట్టాలని, రావిచెట్టు చుట్టూ ఐదు రోజులపాటు ప్రదిక్షిణ చెయ్యాలని, ఐదో రోజు ఐదుశేర్ల ఉలవలు దానం చెయ్యాలని అలా చేస్తే మంచి ఫలితం ఉంటుందని సూచించాడు. సమస్యల సత్వర పరిష్కారానికి తనని స్వయంగా సంప్రదించ వచ్చునని ప్రకటించాడు.

జ్యోతిషుడిని కలవాలని తక్షణమే పట్నం బయలుదేరాడు భూమయ్య. సమస్య చెప్పాడు. కేసెలాగయినా గెలవాలన్నాడు. బంగారు బాతుని వదులుకోదల్చుకోలేదు జ్యోతిష్యులు నారయణదత్తు. వేళ్ళతో చిటికెలు వేశాడు. ల్యాప్‍టాప్ మీద టప్.. టప్ మని కొట్టాడు. తలపంకించాడు. చివరికిలా అన్నాడు.

“మీ జాతకంలో కొన్ని దోషాలున్నాయి. ఆ దోషాల నివృత్తికి కొన్ని హోమాలు, జపాలు చెయ్యాలి. అంతేకాక మూడురోజుల పాటు ఒక యాగం చెయ్యాలి. అది కూడా ఒక రహస్య ప్రదేశంలో ఖర్చు బాగా అవుతుంది. తమరు ‘ఊ….అంటే?'” నసిగాడు సిద్ధాంతి.

“ఎంత డబ్బైనా ఫరవాలేదు సిద్ధాంతిగారూ! ఇది నా ప్రెస్టేజి కొశ్చను. మనం కేసు నెగ్గాలి. అంతే.”

“ఇంతకీ యాగం పేరేమిటన్నారు? ఐదులక్షలు చేతిలో పెడుతూ” అడిగాడు భూమయ్య.

“బృహస్పతి యాగం. జ్యోతిశ్శాస్త్రానికి అధిపతి బృహస్పతి. బృహస్పతి కరుణిస్తే తీర్పు మనవైపే. మీరు నిశ్చంతగా వుండండి” భరోసా యిచ్చాడు సిద్ధాంతి డబ్బు కళ్ళ కద్దుకుని.

“అయితే ఒక్క విషయం…” సిద్ధాంతే అన్నాడు.

ఏమిటన్నట్టు చూశాడు.

“ఈ విషయం గోప్యంగా ఉంచాలి. మూడోకంటివాడికి తెలియకూడదు. “

“సరే స్వాములూ” అంటూ లేచాడు భూమయ్య.

ఎత్తులకి పై ఎత్తులు వేసే రాజయ్య ప్రత్యర్థి తలపెట్టిన యాగం గురించి ‘కొరియరు’ ద్వారా తెలుసుకుని తను కూడా కౌంటరు యాగం చేయించాలని సంకల్పించాడు. యాగం తెలుగువాళ్ళ చేత కాకుండా కర్ణాటక పండితుల చేయించాలని నిర్ణయించుకున్నాడు. దానికి కారణం లేకపోలేదు. అరబ్బు దేశాలలో ఓ రాజుగారి కుమారుడికి కాన్సర్ వస్తే తమ జపతపాలతో నయం చేస్తామని వాళ్ళు ప్రకటించారట. ఈ వార్త ఎప్పుడో పేపర్లో చదివాడు రాజయ్య. వెంటనే బెంగుళూరు బయలుదేరాడు. డిండిమభట్టును కలిశాడు. డిండిమభట్టు కర్ణాటకలో కెల్లా గొప్ప సిద్థాంతి.

“బృహస్పతి మీవైపే చూస్తున్నాడు. గెలుపు ఖాయం” హామీ ఇచ్చాడు డిండిమభట్టు దుడ్డు తీసుకుంటూ.

నారాయణ దత్తు నైమిశారణ్యంలోను, డిండిమభట్టు సత్యమంగళ అడవుల్లోను తమతమ బృందాలతో ఒకే ముహూర్తానికి యాగాలు ప్రారంభించారు. వేదమంత్రాలతో పరిసర ప్రాంతాలన్నీ ప్రతిధ్వనిస్తున్నాయి. మూడో రోజుకి కాని బృహస్పతిలో చలనం రాలేదు. ఓసారి బద్దకంగా వొళ్ళు విరుచుకుని ఇక తప్పదురా అన్నట్టు దివి నుండి భువికి దిగివచ్చాడు బృహస్పతి. నైమిశారణ్యం వేపు అడుగులు వేశాడు. అల్లంత యాగశాల వుందనగా డిండిమభట్టు యాగధాటికి తలొగ్గి సత్యమంగళం వైపు పరుగెత్తాడు. ఇంతలో నైమిశారణ్యంలో నారాయణదత్తు మంత్రాల జోరు పెంచడంలో వెనక్కి తిరిగాడు. అంతలో డిండిమభట్టు బృహస్పతి ‘ఆవాహయామి’ అంటూ స్వరం పెంచడంతో ఎవళ్ళో తాళ్ళతో లాగినట్టూ సత్యమంగళం వైపు పరుగెత్తాడు. అటు నారాయణదత్తు, ఇటి డిండిమభట్టు ఒకరిని మించి ఒకరు మంత్రశక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇటునుంచి అటు, అటునుంచి ఇటు పరుగెడుతూ ఎటువెళ్ళాలో తెలియక మధ్యలో ఆయాసమొచ్చి నల్లమల్ల అడవుల్లో చతికిల పడ్డాడు బృహస్పతి. శోష వచ్చి పడిపోయాడు.

కాలక్రమంలో భూమయ్య, రాజయ్య కాలం చేశారు. ఇప్పుడు తగాదా వాళ్ళ వారసుల మధ్య నడుస్తుంది. వ్యాజ్యం వెయ్యేళ్ళు మరి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here