బుచ్చిబాబు

0
11

[dropcap]గా[/dropcap] ‘లోకులు బండ్ల’ల్ల పైనం జేసేటోళ్ళండ్ల ఎక్కోమంది సిన్న, సితుక బేపారాలు జేసుకునెటోళ్ళు, ఆళ్ళు పండిచ్చిన గిన్నన్ని మక్కలు, జొన్నలు, సజ్జలు, పెసర్లు, కందులు, సెనిగలు, అనుములు, సిక్కుళ్ళు, బబ్బెర్లు గిసుంటియి ముల్లెలల్ల గట్టుకోని పల్లెల్లల్ల నుంచి కాలేర్లకు పొయ్యి అమ్ముకునేటోళ్ళు, మేదరి బుట్టలు, గంపలు, సాటలు అమ్ముకునెటోళ్ళు, రొండుమూడు టేసన్ల అవుతల ‘మారాష్ట్ర’ల రోజుకో వూర్లె అంగళ్ళు సాగే వూర్లకు పొయ్యి అగ్గోల సిన్నసితుక బేరాలు జేసుక కాలేర్లల్ల మునాఫాల మీద అమ్ముక బతికేటోళ్ళు.. గిసుంటోళ్ళళ్ళ ఆరె, బారె, లంబడి, ముత్తరాసి, కోయ, గొండోళ్ళ అసుంటళ్ళే ఎక్కో. అంతగూడ పొద్దుంటే మాపుండది, మాపుంటే రేపుండది అన్నసుంటోళ్ళు.. కుడిసికట్టగలేక, కట్టి విడువగలేక అన్నసుంటోళ్ళు. మైల కోకలతోడ, మాసిన తల తోడ, ఒడల మురికి తోడ అన్నసుంటోళ్ళే ఎక్కోగ గీ బండ్లల్ల పైనాలు జేస్తుంటరు. ఎక్కో దూరాలు గాదు. రొండు మూడు టేసన్లంత దూరం పైనాలే.

గా మందిల టికీటు తీసుకోనోళ్ళు గూడ వుండెటోళ్ళు. మామూలి సంసారపోళ్ళు ఎప్పుడో ఏండ్లకో, నెల్లకో పైనాలు జేసేటోళ్ళు గీ బండ్లల్ల – పెండ్లిల్లప్పుడు, పేరంటాలప్పుడు. తప్పుతె రోజు గూడ అన్నట్టుగ పైనాలు జేసేటోళ్ళు సిన్న, సితుక బేపారం జేసుకునేటోళ్ళే.. అమ్ముకునెటోళ్ళే.. గిసుంటోళ్ళళ్ళనే టికీటు తీసుకోనోళ్ళు వుండెటోళ్ళు.

‘ఆఁ.. ఎంతేళ్ళం! గీ టేసన్ల ఎక్కి, అచ్చేటేసన్ల దిగుడునాయె. గింతంత సేపట్లనే సెకిన్ మాస్టరుకు దొరుకుతమా! ఓగేళ దొరికితె టికీటు పైసలు గట్టవచ్చు. దొరుకకుంటె ఏం లేదు! దొరుకుతె ఏదన్న బొంకవచ్చు’- “టికీటు తీసుకునుటానికి లైన్ల వున్నం. గని, గింతేళ్ళమే బండి వచ్చింది. టికీటు తీసుకునుడ గాలేదు, వురుక్కుంట వచ్చి బండ్లెక్కినం..” అని సెప్పెటోళ్ళు వుండెటోళ్ళు. నువ్వద్దిల గూడ టికీటు కొనుటానికి పెద్ద లైను వుండేటిది. బండి రావుటానికి గింతంతముందే టికీట్లు యిచ్చే ఆయిన వచ్చెటోడు. గింతంత మందికి టికీట్లు యిచ్చి, యిచ్చుడు బందువెట్టెటోడు! రోజు గూడ ఎంతోమందికి టికీట్లు దొరుకక పొయ్యేటియి. గసుంటోళ్ళు సెకిన్ మాస్టరుకు సెప్పో, సెప్పకనో బండి ఎక్కెటోళ్ళు. సెకిన్ మాస్టర్లల్ల ఎక్కోమందిగా టికీటు తీసుకోనోళ్ళ దగ్గర పైసలు వసూలు జేసి ఆళ్ళ జేబులల్లనే ఏసుకునెటోళ్ళు. రైల్వేకు అందిచ్చుడు గిట్ట ఏంలేదు! పైనం జేసెటోళ్ళళ్ళ లేని కాలమునకు మనమునొందు అన్నసుంటోళ్ళు గోంతమంది వుంటే, సెకిన్ మాస్టర్లల్ల – వున్న కాలమునకు గూడ లేని మనము అన్నట్టుగనే ఎక్కోమంది. టికీట్లు యిచ్చే ఆయిన తీరా ఏళ్ళకే, బండి యిగవస్తంది అనంగనే ఎందుకు రావాలె? అచ్చినంక ఏగిరమే ఎందుకు టికీట్లు యిచ్చుడు బందువెట్టాలె? బగ్గమంది టికెట్లు దొరుకక బండి ఎక్కుతె గా పైసలు ఆళ్ళు పంచుకోవచ్చు! గందుకే ‘డిపాటు’కు నుక్‍సాను.. పైనం జేసెటోళ్ళు నేర్సింది గోంత, సెకిన్ మాస్టర్లు నేర్పింది గోంత. టికీటు తీసుకోకుంట పైనం జేసేటోళ్ళండ్ల నువద్దిగ పైసలు లేక తీసుకోనోళ్ళు గోంతమంది, వుండిగూడ తీసుకోనోళ్ళు గోంతమంది.. పెద్దపెద్ద పిల్లగండ్లకు, పైసలు లేక టికీటు తీసుకోనోళ్ళు గోంతమంది, వుండిగూడ తీసుకోనోళ్ళు గోంతమంది, పిల్లజెల్లనేసుకోని – చింకిపాతగుడ్డలోన సిగ్గులన్ని దాచుకోని, చిరుగుపాతల – బడుగుబతుకు – లోల్లు గోంతమంది..

గసుంటి కాలంల గా బండ్లల సెకిన్ మాస్టరుగ ‘బుచ్చిబాబు’ కొత్తగ వచ్చిండు. బుచ్చిబాబు సెకింగు మాస్టరంటే అందరు సెకిన్ మాస్టర్ల వారం కాదు.. టికీటు తీసుకోకుంట పట్టువడితె గా పైనానికి సగపడ సార్జీల తోటి యిడువడు. జెంక్షన్‍కు జెంక్షన్‍కు నడుమ వుండే టికీటు సార్జి వసూలు జేస్తడు!

గోంతమంది టికీటు తీసుకోనోళ్ళు, సెకిన్ మాస్టరు ఏ డబ్బల ఎక్కుతడో సూసి, రైలు కదులుడు మొదలైనంక సెకింగు మాస్టరు ఎక్కిన డబ్బకు దూరంగ వున్న డబ్బల ఎక్కుతరు. సెకిన్ మాస్టరుగా డబ్బలకు అచ్చేటంత సేపట్ల ఆళ్ళు దిగవల్సిన టేసన్లల్ల దిగిపోతరు!

మామూలిగనైతే సెకిన్ మాస్టరు టేసనుకు, టేసనుకు నడుమల ఒక్క డబ్బనే సెకిన్ జెయ్యజాల్తడు. ఎందుకంటే గప్పట్ల బండ్లకు ఏడబ్బకు ఆ డబ్బనే. గిప్పటి వారం డబ్బలన్ని కల్సి వుండేటియి గాదు. గసుంటప్పుడు పైనం జేసే పడుసు పోరగండ్లు టికీటు తీసుకోకుంటనే తప్పిచ్చుకునెటోళ్ళు – యుపముతోనె – యుక్తియున్నది కనవలె అన్నట్టుగ.. ఏరే ఏరే సెకిన్ మాస్టర్ల ముందు గీళ్ళ చాలాకితనాలు సాగుతుండేటియి గని, బుచ్చిబాబు సెగింగు మాస్టరు ముంగట ఎవ్వరి  ఏషాలు సాగక పొయ్యేటియి. ఎందుకంటే బుచ్చిబాబు అందరు సెకిన్ మాస్టర్లవారం టేషనుకు ఒక్కడబ్బనే సెకిన్ జెయ్యడు. టేసన్ టేసన్ నడుమ ఎన్నన్న డబ్బలని తిరిగి సెకిన్ జేస్తడు. బండినంతగూడ, ఈ కొసనుంచి ఆ కొసకు, ఆ కొసనుంచి ఈ కొసకు ఎన్నన్న సార్లు తిరుక్కుంట సెకిన్ జేస్తడు! ఆయిన టేషన్ల బండి ఆగినంకనే యింకో డబ్బల ఎక్కుడు గాదు. బండి నడుస్తాండంగనే ఒగ డబ్బలనుంచి యింకో డబ్బలకు చేరెటోడు డబ్బకిటికీల సువ్వల్ని పట్టుకోని! గా సుతంగ, సుతారంగ బండి అంతటిని ఎన్నోసార్లు సెక్కర్లు గొట్టెటోడు! టికీటు తీసుకోనోళ్ళు తప్పిచ్చుక పోవుట మన్నదేవుండది. ఎక్కేటోళ్ళు, దిగెటోళ్ళు ఎవ్వరుగూడ తప్పిచ్చుకోలేరు బుచ్చిబాబు వున్నడంటే..

టికెట్ తీసుకోకుంట వున్న ఆడోళ్లను గూడ అడమోటు మాటలంటడు. మానం దీసే మాటలంటడు. టికీటు తీసుకుంటా మన్నా టికీటు దొరుకక తీసుకోలేదా, లేకుంటే కావాల్సుకునే టికీటు తీసుకోలేదా, గవన్ని సూడడు. గుడ్డెద్దు సేండ్ల వడ్దట్టు పైసలు బరుకుడే.. గది గూడ జెంక్షను నుంచి జెంక్షను నడుమ వుండే సార్జీలు! గంత గంత సార్జీల పైసలు లెవ్వు అని అన్నాగూడ వినడు, విడువడు. ఆళ్ళ దగ్గెర అంతట సెకిన్ జేస్తడు, సేతులతోటి. ఆడోళ్లనైతే రెయికలల్ల సేతులువెట్టి సెకిన్ జేస్తడు! ఆడోళ్ళ బొడ్లె సంచులల్ల, కొంగుముడులల్ల పైసలు దొరుకకుంటె రెయికలల్ల సేతులువెట్టి సండ్లల్ల దేవులాడుతడు! ఆడోళ్ళ మానందీసే మాటలు, సేతలు. పైసలు లేకుంటే పోలీసోల్లకు అప్పజెప్పుతడు.

బుచ్చిబాబు సెంకింగ్ మాస్టరంటే అందరికిగూడ అదురే. యముడు తప్ప వెరతురందరు వానికి అన్నట్టుగ. గీ సుతంగ వసూలు జేసిన పైసల నన్నీటిని బుచ్చిబాబు డిపాటుకే అప్పజెప్పుతడు. ఒక్కపైస గూడ ఆయిన జేబులేసుకోడు. బుచ్చిబాబు అందరి సెకిన్ మాస్టర్ల వారంకాదు.. బుచ్చిబాబు సెయ్యవట్టి డిపాటుకు ఎంతో ఆముదాని పెరిగింది. గని, గా పక్కపొంటే బుచ్చిబాబు మీద కండ్లవడ్డ పైనం జేసెటోళ్ళుగూడ పుట్టిండ్రు. బెదిరిచ్చుళ్ళుగూడ పుట్టినై. గింతగూడ ఎనుక ముందు జూడకుంట ఆడోళ్ళ పజీతు దీస్తడా, రెయికలల్ల సేతులు వెట్టి సండ్లను పునుకుతడా! గిదోంతోటి కార్జాలు మసిలే మొగోళ్ళు గోంతమంది. సిన్నసితుక బేపారం జేసుకుంట రోజుగూడ ఎన్నన్న సార్లు బండ్ల మీద టికీటు తీసుకోకుంట తిరిగే పడుసు పోరగండ్లు గోంతమంది. గీళ్ళకోపం బుచ్చిబాబు అడ్డంవున్నందుకు, గాళ్ళకోపం ఆడోళ్ళ మానం దీస్తన్నందుకు.. అందునిందుననక అన్నింట వెదుకునా!

బుచ్చిబాబు మీద బెదిరిచ్చుళ్ళు పెరుగంగనే, డిపాటు బుచ్చిబాబుకు ఇస్పెషల్‍గ ‘రైఫిల్’ మంజూరు జేసింది – ఏ సెకిన్ మాస్టరుకు లేనిది! ఉక్కుకత్తిని చేబూని యున్నవాడు, కుక్కనక్కలు బెదిరింపగొంకువడడు అన్నట్టుగ బుచ్చిబాబు రైఫిల్ తోటి మునుపటి వారమే పైసలు వసూలు జేసుడు, ఆడోళ్ళ రెయికలల్ల సేతులులెట్టుడు జెయ్యవట్టిండు. గసుంటియి ఏం మానలేదు. డిపాటు బుచ్చిబాబు బహదూర్‍తనానికి సెబాస్ అని ఎన్నుజర్సింది. బుచ్చిబాబు వుబ్బి పొయ్యిండు గిప్పుడు రైఫిల్ యిచ్చి మర్యాద జేసిండ్లు, ఆనెంక ఆనెంక జీతం పెంచుడు, ప్రమోషన్లు గిట్టయిచ్చుడు వుంటై అనుకున్నడు.. రాజ్యపదవులు.. ఈనిన పులిరీతి – నెరుగకుండు.. కీడుమేలెరుంగక కిందాయె జూడరా.. కన్నుగానక నెల్ల గర్వములను.. మదముచేత తన్ను మరచునెపుడు.. విజయుడైనవాడు విల్లందినంతనే అన్నట్టుగ రైఫిల్ అందిన బుచ్చిబాబు. శిష్యధర్మ మెరిగి చిక్కని భక్తితో అన్నట్టుగ.. వేటతో శునకంబు వెలయ నిక్కుచునుండు అన్నట్టుగ.. నింగి కెగయుకైపు నిలువ నీదు.

‘డిపాటు’ బుచ్చిబాబును సెబ్బాస్ అనవట్టింది. గదీంతోటి బుచ్చిబాబు పైసలు వసూలుజేసుటానికి కిందమీద ఏం జూసుడులేదు. బడుగునెరుగలేని ప్రాభావంబది యెట్లు?

వసూళ్ళకు వున్నోళ్ళు, లేనోళ్ళు అన్నదిగిట్ట ఏం జూడకుంట పీడియ్య వట్టిండు.. అబ్బయున్న వానికన్ని యున్నట్టులే తన దగ్గర రైఫిలున్నది గద! అడ్డమెవ్వడు! మంచి కాలమపుడె మర్యాద నార్జింపు! బగ్గ పేరువడి పద్దవతుల ఎదుగాలె.. వన్నెవచ్చు, మేలులెన్ని యైననుగూడు.. అనుకోని గట్లనేనడువవట్టిండు. పండ్లుపడిన కుక్క పసురమున్ గరువదా.. సత్తు పొత్తు జేసి సాధించిజూడరా.. అన్నట్టుగ బుచ్చిబాబు..

బుసగొట్టేవాడున్నాడంటే కసి దీర్చేవాడుంటాడు. కాటేసి నువ్వుంటే, మాటేసిపొంచి నిన్ను వేటేసి వదులుతాము.. తాటినెక్కువాడున్నాడంటే తలదన్నే వాడుంటాడు. తుంటరైనవాని తొలగించమేలురా.. అట్లుగాదని దూరనామంబు నిలువదు.. మరుగు తెలిసి పిదప మార్కొనవలెనయా..

బుచ్చిబాబు మీద పగవట్టినోళ్ళు బుచ్చిబాబును ఖతం జెయ్యాల్నని ఏళ్లకోసం ఎదిరిసూసుకుంటవున్నరు.. ఒగనాడు – బుచ్చిబాబు డబ్బ కిటికీ సువ్వల్ని పట్టుకోని ఆ డబ్బలనుంచి ఈ డబ్బలకు కాళ్ళు పెడుతాంటే దర్వాజకు అడ్డంగ నిల్సున్నోళ్ళు బుచ్చిబాబుకు సందు దొరకకుంట జేసి రోకుతోటి నడుస్తాన్న బండిమీది నుంచి కిందికి దొబ్బేసిండ్రు. గంత రోకుమీది బండి మీదికెళ్ళి పడ్డ బుచ్చిబాబు పాణాలు యిడ్సిండు!

బుచ్చిబాబు సచ్చిపొయ్యిన ముచ్చట తెల్సినంక గా సుట్టూతోళ్ళు, అందరుగూడ ‘మా మంచిగైంది. సచ్చిండు, వున్నగోంతకాలం గంతగానం సెల్లచ్చుకున్నడు. గంతగానం సెల్లిచ్చుకోవద్దు ఎవ్వరైనా గూడ.. కిందలేదు, మీదలేదు, మంచిలేదు సెడ్డలేదు. నడుమంతురాన్నే పొయ్యిండు..’ అనుకున్నలు సంబురంతోటి – కొంకనక్కజావ గొర్రెలేమిటి కేడ్చుఅన్నట్టుగ..

గీ సుట్టూత టేసన్లల్ల తిరిగే ఏ సెకిన్ మాస్టరుకు గూడ బుచ్చిబాబుకన్న ముందుగాని, బుచ్చిబాబు సచ్చిపోయినంక గానీ డిపాటు రైఫిల్ యియ్యనేలేదు. డిపాటుమెంటే యియ్యద్దు అనుకున్నదో లేకుంటే, డిపాటుమెంటు యిస్తనన్న గూడ సెకిన్ మాస్టర్లు తీసుకోమన్నరో.. ఎగురవేయబంతి ఎందాక నిల్చురా అన్నట్టుగ, డిపాటుకు ఆముదాని పెంచుతే సెబ్బాస్ అంటది, గని, సస్తే? ఎవని పాణానికి ఆడే పొయ్యిండు అంటది, పాణం మీదికి తెచ్చుకొమ్మన్నమా అంటది డిపాటు.. మెరమెచ్చుల దాతయతడు అన్నట్టుగ డిపాటుమెంటు నిన్నమొన్నటేడు, నిన్నమొన్న, నీల్గి చచ్చినోడు తమకన్న, తక్కువా అనుకోని రైఫిల్ తీసుకునుటానికి ఎవ్వరు ముందుకు రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here