బుజ్జి దూడ భయం

0
17

[dropcap]ఒ[/dropcap]క ఊరిని ఆనుకుని ఉన్న అడవిలో ఆవులు, గేదెలు నివాసం ఉండేవి. అందులో ఒక ఆవు నెల క్రితమే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దూడ తెల్లగా అక్కడక్కడా గోధుమ వర్ణపు మచ్చలతో అందంగా ఉన్నది. పెద్ద పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా ప్రపంచాన్ని చూస్తుంటుంది. అదేమిటి, ఇదేమిటి అంటూ అన్నింటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. తల్లి కూడా దానికి అన్ని విడమరిచి చెపుతుంది.

గోవులన్నీ మందగా వెళ్ళి అడవిలో గడ్డి మేసేసి వస్తుంటాయి. దూడ కూడా అమ్మా వెనకే జాగ్రత్తగా వెళుతుంది. ఈ బుజ్జి దూడకు కొంతమంది స్నేహితులు కూడా అయ్యారు. అందరూ పులి గురించి భయంగా చెప్పుకుంటుంటే బుజ్జి దూడ కూడా భయపడింది. స్నేహితుల దగ్గర పులి గురించిన విశేషాలు తెలుసుకుంది. చాలా వేగంగా పరిగేడుతుందని, మాటువేసి దాడి చేస్తుందని, చాలా బలమైనదనీ ఎన్నో విషయాలు తెలిశాయి. ఇంకా తాతలు ముత్తాతల కాలం నాటి ఆవు పులి కథ కూడా విన్నది. ‘ఛీ ఇంత క్రూరమైనదా పులి’ అని మనసులో కోపంగా తిట్టుకున్నది. పులి అరాచకాలకు నిస్పృహ చెందింది.

బుజ్జి దూడ రాత్రికి పడుకోకుండా ఆలోచిస్తూ ఉన్నది. తాము పులికి ఏమి హాని చెయ్యటం లేదు. అయినా పులి తమను ఎందుకు తినేస్తుంది చాల అన్యాయం కదా అనిపించింది. ‘ఇంత అన్యాయం రాజ్యమేలుతుందా? ఇలాంటి అడవిలో ఎలా బ్రతకాలి, పొలంలో గడ్డిమేస్తుంటే చెట్ల చాటు నుంచి వచ్చి మీద పడుతుండట. చెరువులో నీళ్ళు తాగుతుంటే వెనక వైపు నుంచి లాఘిస్తుందట, సాధు జంతువులైన తమను ఇలా చంపి తినేస్తే ఎలా?’ బుజ్జి దూడ ఆలోచిస్తూ ఆలోచిస్తూ భయందోలనలకు గురయింది. నిద్ర పట్టక భయంతో వణుకుతూ ఉండిపోయింది.

తల్లి ఆవు నిద్రలేచే సరికి బుజ్జి దూడ వణుకుతూ ఉన్నది. వళ్ళంతా వేడెక్కిపోయి ఉన్నది. తల మీద చెయ్యేసి చుసిన తల్లి ఆవు ప్రేమగా తల నిమిరింది. దనతో కొద్దిగా తేరుకున్న బుజ్జి దూడ “అమ్మా పులి నిన్ను కూడా చంపేస్తుందా? నాకప్పుడు పాలేవరు ఇస్తారు. మన ముత్తాత కథను నా స్నేహితులు చెప్పారు. నాకు చాల భయంగా ఉందమ్మా” అంటూ తల్లిని అల్లుకుపోయింది.

“అయ్యో! చిట్టి తండ్రి దీని కోసం భయపడుతున్నావా? అలా భయపడకూడదు కన్నా. మన అడవిలో పులి ఆకలేసినప్పుడు మాత్రమే మనల్ని వేటాడుతుంది. కానీ మానవ సమాజంలో ఆకలితో సంబంధం లేకుండా అమాయకులను వేటాడుతుంటారు. నీ స్నేహితులు నీకు పూర్తి కథను చెప్పలేదు. మన తాతమ్మ బిడ్డకు పాలిచ్చి పులికి ఇచ్చిన మాట ప్రక్రారం తిరిగి పులి వద్దకు వెళ్ళింది. తన నిజాయితీని గుర్తించిన పులి మన తాతమ్మను తినకుండా వదిలి పెట్టింది.

చూడు తండ్రి! ఎప్పుడూ భయపడకూడదు. ఆ రోజు మన తాతమ్మ చూపించిన నిజాయితీని ఈ రోజు దాకా చెప్పుకుంటున్నారు. మానవులు కూడా మన స్వభావాన్ని గుర్తించి, దేవతల్లా మనల్ని పూజిస్తుంటారు. మనం ఎదురు తిరగాట్లేదంటే చేతకానితనం కాదు మన మంచితనం. సమాజంలో చెడ్డవాళ్ళుంటారు మంచి వాళ్ళుంటారు. సమాజంలో ఎవరూ ఏమిటో గుర్తించి మసులు కోవాలి. అది మన తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. చెడు వారికీ దూరంగా ఉండాలి. మంచి వారితో స్నేహం చేయాలి.

చూడు నాన్నా! ఎప్పుడూ పులి వచ్చి చంపేస్తుందేమో అని భయపడకుండా తెలుసుకోవాల్సిన జ్ఞానం గురించి ఆలోచించాలి. పులి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అనుకోకుండా దాడి చేసినా పోరాటం సాగించాలి. చివరి వరకూ సమరం సాగించే వాడే వీరుడు. మన ప్రాణాన్ని కాపాడుకునేందుకు పోరాడుతూనే ఉండాలి. కానీ భయపడి పిరికిపందలా వెనక్కి వెళ్ళకూడదు. జీవితంలో నిజాయితీ చాలా ముఖ్యం.” అంటూ చక్కని హిత బోధ చేసింది తల్లి ఆవు.

బుజ్జి దూడ మనసులో ఆందోళన మాయమైంది. దాని స్థానంలో కొత్త జ్ఞానం వచ్చి చేరింది. గట్టిగా ఉపిరి పీల్చుకుంది. “ఎప్పుడూ నిజాయితీని వీడనమ్మా! పులిని చూసి భయపడనమ్మా. నా జాగ్రత్తలో నేనుంటాను” అంటూ తేలికపడ్డ మనసుతో అమ్మను హత్తుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here