బుజ్జిగాడి పెళ్ళి

1
7

[డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి రాసిన ‘బుజ్జిగాడి పెళ్ళి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“రా[/dropcap]ధికా! ఓ రాధికా! ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు చూడు. నేను పూజగదిలో ఉన్నాను. వెంటనే లేచి రాలేను” అత్తగారి పిలుపువిని పెరటిలో పనిలో ఉన్న రాధిక గబగబా చేతులు కడుక్కొని “వస్తున్నానత్తయ్యా!” అంటూ వాకిట్లోకి వచ్చింది. కాలింగ్ బెల్ మళ్ళీ వినిపించింది. హడావిడిగా తలుపులు తెరిచిన రాధిక అక్కడ నిలబడిన వాళ్ళని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయింది.

“ఇన్నాళ్ళ తరువాత నా మీద దయ కలిగిందా సుమతీ! బాగున్నారా? రండి అన్నయ్యగారూ! కూర్చోండి” – ఆత్మీయంగా ఆహ్వానించింది రాధిక.

“అదేం లేదు రాధీ! పనుల ఒత్తిడి. నా కొడుకు కాశ్యప్ పెళ్ళి. మీరంతా తప్పకుండా రావాలి. నా పక్కన నువ్వుండాలి” సంతోషంగా శుభలేఖ మీద పేరు రాసి ఇచ్చింది.

“కాశ్యప్ పెళ్ళా! చాలా సంతోషం అమ్మా!” అన్నారు నెమ్మదిగా బయటికి వచ్చిన రాధిక అత్తగారు కామేశ్వరమ్మగారు.

“కాఫీ తీసుకొస్తాను సుమతీ!” రాధిక వంటగదిలోకి వెళ్ళబోయింది. “ఇప్పుడేం వద్దు రాధీ! ఇంకా చాలమందికి శుభలేఖలు ఇవ్వాలి. వెళ్తాం” అంటూ లేచింది సుమతి.

“ఏమిటోనమ్మా! అహ్వానపత్రిక వీడియో తీసి అందరికి వాట్సప్‌లో పంపిద్దాం అంటే మీ ఫ్రెండ్ ఒప్పుకోలేదు. స్వయంగా ఇస్తేనే నాకు తృప్తి – అని బయలుదేరింది” అన్నాడు సుమతి భర్త నరేంద్ర.

“అవునన్నయ్యగారూ! సుమతి చిన్నప్పటి నుండి అంతా పద్ధతి ప్రకారం జరగాలని కోరుకుంటుంది.”

“అత్తయ్యగారిని కూడ తీసికొని తప్పకుండా రావాలి” మరిమరి చెప్పి నరేంద్ర, సుమతి వెళ్ళారు. వారికి వీడ్కోలు పలికి లోపలికి వచ్చిన రాధిక “ఏమిటో? నా స్నేహితురాళ్ళ పిల్లలందరికి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయ్. మన బుజ్జి పెళ్ళి ఎప్పుడవుతుందో?” అన్నది దిగులుగా అత్తగారితో.

“నా మనవడికేవిటే! వాడు బాగా చదువుకున్నాడు. దర్జాగా ఉంటాడు. ఎవరైనా కళ్ళకద్దుకొని పెళ్ళిచేసుకుంటారు” గర్వంగా చెప్పారు కామేశ్వరమ్మగారు.

“ఇప్పుడు బుజ్జిగాడు 27 సంవత్సరాలు నిండి 28 సంవత్సరంలోకి వచ్చాడు. వద్దువద్దు అంటున్నా అమెరికా పంపించారు మీరు, మీ అబ్బాయి కలిసి. ముందు ఎమ్. ఎస్. అవ్వాలని, తరువాత H1 రావాలని ఇలా ఏదో ఒకటి చెప్తున్నాడు. మా పెదనాన్నగారి అబ్బాయి చాలాసార్లు అడిగాడు. శ్రావ్యను బుజ్జిగాడికి చేసుకోమని. ఉన్నచోట బంధువులతో కలిసి హాయిగా ఉండకుండా అమెరికా అంటూ వెళ్ళాడు. నామాట ఎప్పుడూ, ఎవ్వరూ వినరు”

స్వగతమే అయినా గట్టిగానే అనుకుంది రాధిక.

“ఏమిటీ? మీ అన్నయ్య కూతుర్నివ్వాలా? నా మనవడెక్కడా? ఆ పిల్ల ఎక్కడా? అది పల్లెటూరు దాటి ఎక్కడికీ వెళ్ళలేదు. చదువులేదు.”

“అది కాదత్తయ్యగారూ! వాళ్ళ కుటుంబం మంచిది. పిల్ల సంప్రదాయబద్ధంగా పెరిగింది. మన కళ్ళముందుంటారు” కాస్త నొచ్చుకుంటూ చెప్పింది రాధిక.

“వాళ్ళిద్దరికీ జాతకాలు కలవలేదని పంతులు గారు చెప్పారు కదా! మరచిపోయావా?”

“జాతకాలదేముందిలే అత్తయ్య! మనసులు కలిస్తే చాలు కదా!”

“వీల్లేదు. అమెరికాలో ఉద్యోగం చేసే పిల్లనే నా మనవడికి చూడాలి” ఖండితంగా చెప్పారు కామేశ్వరమ్మగారు.

“అమెరికాలో ఉద్యోగం చేసే ఆడపిల్లలు చాలా దూకుడుగా ఉంటారని, భర్తని, కుటుంబాన్ని గౌరవించరని ఆమధ్య నా స్నేహితురాలు చెప్పింది. అలాంటి పిల్లలతో మనవాడు ఎలా వేగుతాడు?”

“ఇద్దరి జాతకాలూ బాగా కుదిరిన పిల్లనిచ్చి పెళ్ళి చేయవలసిందే నా మనవడికి” – ఇక రెండో మాట లేనట్లు లోపలికి వెళ్ళిపోయారు కామేశ్వరమ్మగారు.

***

“ఏవండీ! అమెరికా పెళ్ళి సంబంధాలు చూసే మారేజ్ బ్యూరో వాళ్ళని కలిశారా?” అడిగింది భర్తని రాధిక.

“కలిశాను. ముందుగా 10,000/- రిజిస్ట్రేషన్ ఫీజు కట్టమన్నారు. కట్టేశాను. ఇది 3 నెలలవరకు మాత్రమేనట. ఆ తరువాత కంటిన్యూ చెమ్మలంటే మళ్ళీ డబ్బులు కట్టాలి” చెప్పాడు రమేష్.

“మరి కట్టకపోయారా? మన బుజ్జికి హెచ్ 1 వచ్చింది. వయసు కూడ దాటిపోతుంది.”

“కట్టేశాను. ముందుగా నాలుగు సంబంధాలు వాట్సప్ పెట్టారు.”

“ఏవీ? ఏవి? చూపించండి” ఆత్రంగా అడిగింది రాధిక. “చాలా ముచ్చటగా ఉన్నారండి పిల్లలు. ఏదో ఒకటి ఖాయం చేద్దాం అండి” రాధిక సంబరపడిపోతూ చెప్పింది.

“అమ్మా! ఈ ఫోటోలు ఒకసారి చూడమ్మా!” తల్లికి చూపించాడు రమేష్. ఒక్కొక్కటీ చూస్తూ తలపంకిస్తున్నారు కామేశ్వరమ్మగారు. ముఖంలో చిత్రవిచిత్రమైన హావభావాలు, మూతి విరుపులు, కళ్ళు తిప్పటాలు ఇత్యాది విన్యాసాలు ప్రదర్శించసాగారు.

“ఇదిగో ఈ పిల్ల సన్నగా పీలగా ఉంది.

ఈ అమ్మాయి కొంచెం ఎత్తు తక్కువలా ఉంది.

దీని ముఖాన బొట్టేలేదు. ఈ పిల్ల కాస్త రంగు తక్కువ.

ఆఁ ఇదిగో ఈ అమ్మాయి కాస్త బాగానే ఉంది. జాతకం చూపిద్దాం. పంతులుగారిని ఇంటికి రమ్మని చెప్పు” ఆజ్ఞాపించారు.

“అలాగేనమ్మా! ఇప్పుడే ఫోను చేస్తాను.”

ఫోను చెయ్యగానే రెక్కలు కట్టుకొని వాలిపోయారు పంతులు గారు ఉరుములు మెరుపులు లేని వానలా.

“అమ్మా! కామేశ్వరమ్మగారూ! అమ్మాయి నక్షత్రం తదితర వివరాలు చెప్పండి” ఆరోజు వచ్చిన అమ్మాయిల జాత కాలు అన్నీ పరిశీలించారు పంతులుగారు. లెక్కలు వేశారు.

“అమ్మగారూ! ఇదిగో ఈ అమ్మాయి జాతకం చాలా బాగుంది. అబ్బాయితో కలిసిపోతుంది. కాస్త రంగు తక్కువైనా కనుముక్కు తీరు బాగుంది” చెప్పారు పంతులుగారు.

“అబ్బే! మా మనవడు మంచిరంగు. పోయినేడాది వచ్చినప్పుడు మీరే చూసారుగా – ఈ పిల్ల వద్దు.”

“అమ్మాయి ముఖంలో కళ ఉంది అత్తయ్యగారూ!” సర్దిచెప్పబోయింది రాధిక.

“లేదు లేదు. నేను ఒప్పుకోను” మొండిగా చెప్పారు కామేశ్వరమ్మగారు.

“సరేలే పంతులుగారూ! వేరే సంబంధాలు చూద్దాంలే. పాపం మిమ్మల్ని ఎండలో రప్పించాం- కాస్త మజ్జిగ తీసుకొని వెళ్ళండి” అన్నాడు రమేష్.

“పరవాలేదు సార్! ఎక్కడ రాసిపెట్టి ఉందో మనకేం తెలుసు. వెళ్ళి వస్తానమ్మ!”

***

“రాధికా! ఇవాళ కొన్ని సంబంధాలు వచ్చాయ్. వాట్సప్ చూద్దాం.”

“అలాగేనండీ” అంటూ గబగబా చేతిలో పని ముగించుకొని వచ్చి కూర్చుంది రాధిక.

“అమ్మాయ్ రాధికా!” పంతులు గారికి కబురుపెట్టు ఆదేశించారు అత్తగారు. మళ్ళీ ముగ్గురూ పంతులుగారితో కలిసి సమావేశం అయ్యారు.

“ఇదిగో ఈ అమ్మాయి చూడండి జాతకం చాలా బాగుంది చూడండి అమ్మగారు!”

“ఏదీ? ఇలా చూడనీ? ఏ నక్షత్రం అంటారు?”

“రోహిణి నక్షత్రం అమ్మా!”

“అబ్బాయిది పుష్యమి కదా. ఆ నక్షత్రానికి ముందరి నక్షత్రం వాళ్ళతో పెళ్ళి చెయ్యకూడదంటారు కదా” – సందేహం వ్యక్తంచేశారు కామేశ్వరమ్మగారు.

“పోనీ! ఈ అమ్మాయి జాతకం చూడండి. ఇది బాగానే ఉంది. కాకపోతే పిల్ల, పిల్లవాడికి షష్ఠాష్టకాలు అయ్యాయి.”

“అయితే అస్సలు వద్దు. మరో అమ్మాయిని చూడు” అన్నారు కామేశ్వరమ్మగారు.

“సరే మీ ఇష్టం ఇది చూడండి, భేషుగ్గా ఉంది” అన్నారు పంతులు గారు తనకు రాబోయే సంభావనను మనసులో భారీగా ఊహించుకుంటూ.

“ఏదీ? అమ్మాయిది ఏ రాశి? కర్కాటకమా? అబ్బాయిది కూడా అదే రాశి. ఒకే రాశివాళ్ళకి, ఒకే నక్షత్రం వాళ్ళకు వివాహం కుదరదని చిన్నప్పుడు నేను విన్నాను. బాగుండదు.”

“ఒకే రాశి అయినా దోషం లేదమ్మ గారూ! గోత్రం వేరు కాబట్టి కుదురుతుంది” ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు పంతులుగారు.

“నా మనవడికి భవిష్యత్తులో ఏ ఇబ్బందీ రాకూడదు. నా కిష్టం లేదు తీసెయ్యండి.”

రాధిక పరిస్థితి అడకత్తెరలో చిక్కుకున్నట్లు అయింది. అత్తగారి చాదస్తం చూస్తుంటే తనకి మతిపోతోంది. ఇలా సంబంధాలు చూడటం మొదలుపెట్టి ఇప్పటికే దాదాపు సంవత్సరం కావస్తోంది. నిస్సహాయంగా చూస్తూ ఉండి పోయింది.

“అమ్మా! కామేశ్వరమ్మగారూ! ఈ వేళకి ఇది చివరి జాతకం, ఇదిగో చూడండి. ఈ అమ్మాయికి కుజుడు కాస్త అనుకూలంగా లేడు. అయితే ఆ దశ చిన్న వయసులోనే పూర్తయిపోయింది. తిరిగి 80 ఏళ్ళ వయసులో దాని ప్రభావం ఉంటుంది. కుటుంబ జీవనం సాఫీగా సాగిపోతుంది. ఏమంటారు?” ఆశగా అడిగారు పంతులుగారు.

రాధిక అత్తగారి సమాధానం కోసం గుండెలు చిక్క బట్టుకొని చూడసాగింది. మనసులో తనకు గుర్తుకు వచ్చిన దేవుళ్ళందరికి మొక్కకోసాగింది.

“ఏవిటేమిటీ? కుజదోషమా?” వీల్లేదు గట్టిగా చెప్పారు.

అయిపోయింది. ఈ ఆశ కూడా పోయింది రాధిక మనసు క్రుంగిపోయింది. ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటి? అత్తగారి మీద గౌరవంతో తను ఏమీ మాట్లాడలేకపోతుంది. అసలు జాతకం అంత ముఖ్యమా? ఇంత చాదస్తంగా చూస్తే అసలు పెళ్ళిళ్ళు అవుతాయా? రకరకాల సందేహాలు తన మనసును తొలిచివేస్తున్నాయ్.

తన చిన్నతనంలో పక్కింటి బామ్మగారు జాతకాల పిచ్చితో అన్నీ సవ్యంగా ఉన్నాయనుకొని చేసిన తన మనవరాలికి భర్త విడాకులిచ్చేశాడు. జాతకాలు మన సంప్రదాయం ప్రకారం కొంతవరకు మాత్రం ఆలోచించదగినవే కాని వాటి మీదే ఆధారపడి తక్కిన విషయాలను వదిలి పెట్టటం మంచిది కాదు. తన గోడు ఎవరు వింటారు? దిక్కుతోచని స్థితిలో రాధిక నిద్రకు దూరం అయిపోయింది. భర్త ఏమో చొరవ చూపించరు. తల్లిమాటే ఆయనకు వేదవాక్కు.

“అమ్మా! ఇవాల్టికి నాకు సెలవిప్పించండి” అంటూ నిరుత్సాహంగా వెళ్ళిపోయారు పంతులుగారు.

***

“అమ్మా! బాగున్నావా?” చైతన్య ఫోనులో హుషారుగా పలకరించాడు.

రాధిక మనసు ఆనందంతో ఉప్పొంగి పోయింది.

“నాన్నా బాగున్నావా? బుజ్జీ?”

“బాగున్నానమ్మా! నువ్వు, నాన్న, బామ్మ ఎలా ఉన్నారు?”

“బాగున్నారు బుజ్జీ! మీ బామ్మ నీకు సీరియస్‌గా పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు.”

“అమ్మా! నేను next month వస్తాను. అప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోవద్దని చెప్పు.”

“అలాగే నాన్నా! నువ్వు జాగ్రత్తగా రా బుజ్జీ!” చాలా రోజుల తరువాత కాస్త ఊరట పొందింది రాధిక. బుజ్జి వస్తే అత్తయ్య కొంత మారతారేమో. తన మనసుతో ఆశతళుక్కుమంది. దైవం మీద భారం వేసి బిడ్డ రాక కోసం ఎదురు చూడసాగింది.

***

చైతన్య ఆరోజే వస్తున్నాడు. ఇంటిల్లిపాది చాలా ఉత్సుకతతో నిమిషాలు లెక్కపెట్టుకుంటున్నారు.

“అమ్మా! నేను ఇంటికి వచ్చేస్తాను. ఎయిర్‌పోర్ట్‌కు ఎవ్వరూ రావద్దు శ్రమ తీసుకొని. మీకొక సర్ర్పెజ్ గిఫ్ట్ తెస్తున్నాను.”

చైతన్య మాటలకు రాధిక పులకించి పోయింది. ‘ఏం తెస్తున్నాడు తన కోసం? బుజ్జి నా గురించే ఎప్పుడూ ఆలోచిస్తాడు’ అని మురిసిపోయింది.

‘పిచ్చిసన్నాసి! నేనంటే చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమ. నా ఒడిలో పెరిగాడు. నాకేదో తెస్తానంటున్నాడు’ బామ్మగారు ఆలోచనలో పడిపోయింది. ఒక్కగానొక్క కొడుకు ప్రయోజకుడయ్యాడు. నాకు అంతకంటే గిఫ్ట్ ఏం కావాలి? అనుకున్నాడు రమేష్.

ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండగానే వాకిట్లో కారు హారన్ వినిపించింది. అందరూ ఒక్క ఉదుటున వాకిట్లోకి పరుగు తీశారు.

“రాధికా! ఆ దిష్టి తీసే వస్తువులు అన్నీ సిద్ధంగా ఉన్నాయా?” తొందర పెట్టేశారు కామేశ్వరమ్మగారు.

కారులో నుండి ముందు చైతన్య దిగాడు. అవతలి డోర్‌లో నుండి దిగి ఇటుగా వచ్చిన యువతి చెయ్యి పట్టుకొని ఇద్దరూ కలసి లోపలికి రాసాగారు. ఒక్కసారిగా ముగ్గురి ముఖాల్లోనూ మిలియన్ డాలర్ల ప్రశ్ననిండిపోయింది.

“అమ్మా, నాన్న బామ్మా! ఇదిగో నీ కోడలు శ్రావ్య, మమ్మల్ని ఆశీర్వదించండి” అంటూ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించారు. ముగ్గురిలో ముందుగా తేరుకున్నాడు రమేష్.

ఇద్దరినీ పైకి లేపాడు. శుభమస్తు అని దీవించాడు. “రాధికా! హారతి సిద్ధం చేసి తీసుకురా వెంటనే.”

భర్త మాటలతో ఈ లోకంలోకి వచ్చిన రాధిక తడబడుతూ హారతి తెచ్చి ఇద్దరికి అద్దింది. లోపలికి తీసుకు వెళ్ళింది. కామేశ్వరమ్మగారు ఇంకా షాకు నుంచి తేరుకోలేదు. నెమ్మదిగా ట్రాన్స్‌లో నడుస్తున్నట్లుగా లోపలికి వచ్చింది.

తన మనవడి పెళ్ళి గురించి తను ఎన్ని కలలుకన్నది? ఎన్ని ఆలోచనలు చేసింది? ఆమెకు పట్టరాని ఉక్రోషం వచ్చేసింది. ఎవ్వరితోనూ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది.

“అమ్మా! అబ్బాయి వచ్చాడా?” పంతులు గారు అడుగుతూ లోపలికి వచ్చారు అప్పుడే అందరి ముఖాల్లోనూ ఇదీ అని చెప్పలేని ఒక ఆశ్చర్యమో, ఆనందమో, సంభ్రమమో, ఏదో తెలియని స్థితిని గమనించారు పంతులుగారు.

“పంతులుగారూ! అబ్బాయి పెళ్ళి చేసికొని వచ్చాడు” నెమ్మదిగా చెప్పాడు రమేష్.

“మంగళకరమైన విషయం చెప్పారు. చాలా సంతోషం.”

“ఏవిటయ్యా! మంగళకరం, పుట్టు పూర్వోత్తరాలు, జాతకం తెలియకుండానే ఆ పిచ్చి సన్నాసి పెళ్ళి చేసుకొని వస్తే నువ్వు కూడా దాన్ని సమర్థిస్తావా?” విరుచుకుపడ్డారు, బయటకొచ్చిన కామేశ్వరమ్మగారు.

“అమ్మగారూ! మనిషి మనసులో కల్మషం లేకుండా స్వచ్ఛంగా, ఆనందంగా ఉండటం కంటే మంచి జాతకం ఏముంటుంది చెప్పండి? ఏదో పొట్టకూటి కోసం కొంతమంది మీలాంటి వాళ్ళ బలహీనతలు అడ్డం పెట్టుకొని, అసలు ఉన్నదానికి చిలవలు పలవలు అల్లి లేనిపోనివి అంటగట్టి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇద్దరూ ఒకరినొకరు అర్ధంచేసుకొని ప్రేమతో ముందుకు సాగగలం అనే నమ్మకమే జీవితానికి మొదటిమెట్టు. మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి. నామాట వినండి. పిల్లలిద్దరిని ఆశీర్వదించండి” నచ్చచెప్పారు పంతులుగారు.

పంతులు గారి మాటలతో అందరి హృదయాలు ఆనందతరంగాలలో తేలియాడాయి. రాధిక గబగబా కొడుకు కోడలిని పంతులుగారికి నమస్కరించమని సైగ చేసింది. అక్షింతలు తెచ్చి పంతులు గారి చేతిలో ఉంచింది. పంతులు గారు నిండు మనసుతో ‘శుభమస్తు-ఆయురారోగ్య ఐశ్వరాభివృద్ధిరస్తు’ అని ఆశీర్వచనం ఇచ్చారు.

“చూశారా అమ్మా! అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది” అన్నారు కామేశ్వరమ్మ గారినుద్దేశించి.

“ఔనమ్మా! నువ్వు వాళ్ళని ఆప్యాయంగా అక్కున చేర్చుకో”- రమేష్ సానునయంగా చెప్పాడు.

“నేను ఒప్పుకోనురా. బుజ్జిగాడి పెళ్ళి నేను దగ్గరుండి మళ్ళీ జరిపించవలసినదే మన సంప్రదాయం ప్రకారం. అప్పుడే నాకు తృప్తి, ఆనందమూనూ.”

అందరూ హాయిగా నవ్వేశారు.

తన సంభావన తనకు దక్కబోతుందని పంతులుగారు తేలికగా ఊపిరిపీల్చుకున్నారు.

సాయం సంధ్యా సమీరాలు సుతిమెత్తగా స్పృశించాయి. సూర్య భగవానుడి భగభగల నుండి ప్రకృతి మెల్లగా సేద తీరుతుంది. మల్లెల పరిమళాల వంటి ఆలోచనలతో అందరి మనసులు రంజిల్లాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here