పండిత విమర్శకుడు ఆచార్య కె. గోపాలకృష్ణారావు

0
11

[dropcap]ఆ[/dropcap]చార్య కె. గోపాలకృష్ణారావు అనగానే ‘శతక వాఙ్మయం’పై వెలువరించిన ప్రామాణిక పరిశోధనా గ్రంథాలు జ్ఞాపకం వస్తాయి. అలాగే వారు సంకలించిన తెలుగు-ఉర్దూ నిఘంటువు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారు 60, 70వ దశకాలలో విస్తృతంగా విమర్శనా వ్యాసాలు రాసినప్పటికీ, అవేవీ పుస్తక రూపంలో రాకపోవడం ఆశ్చర్యం. ఆ అంతరాన్ని పూడ్చడానికి తమకు దొరికిన పది పరిశోధనా వ్యాసాలతో ‘బురుజు’ వేసిన సంగిశెట్టి శ్రీనివాసును అభినందించాల్సిందే.

ఉత్తర భారతదేశమున రాజకీయంగా స్థిరపడిన తర్వాత మహమ్మదీయులు పదమూడవ శతాబ్ది చివర్లో దక్షిణాపథముపై దండయాత్రలు సాగించి, పదనాల్గవ శతాబ్దిలో తెలుగునాట మహమ్మదీయ సామ్రాజ్యమును స్థాపించారు. నాటి నుండి మహమ్మదీయులతో తెలుగువారికి సంబంధం ఏర్పడినది. మన దేశమునకు వచ్చిన మహ్మదీయులలో తుర్కీ, అరేబియా, పారశీకాది దేశస్థులుండిరి. తొలి దశలో వారి భాషలలో తుర్కీ, అరబీ, పారశీక భాషల తోడనూ, అనంతర దశలో ఉర్దూ భాషతోను తెలుగువారికి సాన్నిహిత్యమేర్పడినది. దక్కన్‌లో మహమ్మదీయ జన వ్యవహారమున ప్రచురితమైన భాష దక్కన్ ఉర్దూ. బహమన్‌ల కాలంలో బీజప్రాయముగ నుండి కుతుబ్‌షాహీల కాలమున అంకురమై, అనంతర దశలలో బహుముఖ వికాసం పొందినదీ భాష. దక్కన్ భూమి ఈ భాషా సాహిత్యాలకు, కొన్ని శతాబ్దముల వరకు ప్రముఖ కేంద్రంగా వర్ధిల్లినది. ఈ భాషలో విశిష్ట సాహిత్యం ఆవిర్భవించినది. అపూర్వమైన జీవశక్తి కలదని ప్రశంసింపబదిన దక్కన్ భాష అధ్యయన పరిశీలనములకై ఉత్తర భారత విద్యాలయములందు కొన్ని పీఠములు కూడా ఏర్పడినవి.

దక్కన్ భాషా సాహిత్యముల వికాసమును దాదాపు మూడు దశాబ్దాల కాలముగా గ్రహింపవచ్చును. తనలో బహమనీ, గోలకొండ సుల్తానుల కాలమును ప్రాచీన కాలముగాను, అసఫ్‌జాహీల కాలమును ఆధునిక కాలముగాను పరిగణించవచ్చు. ఈ దశలలోని భాషా సాహిత్యముల ప్రభావమును పరిశీలించినచో, సాహిత్యము కంటే, భాషా ప్రభావమే స్వల్పముగా నున్నట్లు తోచును. తెలుగు భాషా సాహిత్యముల అధ్యయనము పట్ల దక్కన్ ఉర్దూవారు అంతగా శ్రద్ధాసక్తులు చూపలేదనే చెప్పాలి.

పాలక భాషా ప్రభావము పాలిత భాషపై ప్రసరించుట సహజము. తెలుగుదేశములోని వివిధ ప్రాంతాలు దాదాపు ఆరు శతాద్బాల వరకు మహమ్మదీయుల ఏలుబదిలో వున్నందున తెలుగు వారు వేలకొలది అరబీ, పారశీక, ఉర్దూ భాషా పదములను తమ భాషలో చేర్చుకుని ప్రాచుర్యాన్ని కలిగించారు. ఉర్దూ భాషా సాహిత్యములతో సుపరిచితులైన తెలుగువారు ఆ భాషను గూర్చిన పరిశీలనాత్మక వ్యాసములు, గ్రంథములు రచించి ఆయా భాషా సాహిత్యముల వైశిష్ట్యమును వెల్లడించి అభిరుచిని, అధ్యయనాసక్తిని కలిగించారు. అంతేకాదు, ఉర్దూ సాహిత్యములోని ఉత్తమ గ్రంథాలను తెలుగులోకి, తెలుగు గ్రంథాలను ఉర్దూలోకి అనువదించి, ఉభయ భాషలకు సంబంధించిన ఆదాన ప్రదాన సాహిత్య వ్యాసంగాలకు పుష్టిని చేకూర్చారు. అలాగే ఉర్దూ భాషలో రచనలు చేసిన తెలుగువారి గురించి, వారి రచనల గురించి వివరంగా తెలియజేయడం బాగుంది. ప్రాచీన చారిత్రక కావ్యములలో, ప్రస్తావవశాత్తు చెప్పిన చాటు పద్యాలు అన్యదేశ్యముల ప్రయోగములు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిలాగే “పద్మనాభ యుద్ధము” నందలి అన్యదేశ్యములు విశిష్టములై, ప్రత్యేకముగా పరిశీలింపదగియున్నవి. ఇది ఏకాశ్వాస చారిత్రక ప్రబంధము. చట్రాతి లక్ష్మీ నరసకవి ఈ కావ్యమును రచించినట్లు కవి, చరిత్రకారుల నిర్ణయము. ఇతడు పద్దెనిమిదవ శతాబ్ది వాడు. పద్మనాభ క్షేత్రమున పూసపాటివారు ఒనర్చిన యుద్ధము ఈ కావ్యము నందలి ఇతివృత్తము. ఈ కావ్యమునందు పారశీక, అరబీ, ఉర్దూ మాండలిక రూపములు, దక్కన్ ఉర్దూ పదాలు కొన్ని వున్నాయి. లక్ష్మీ నరసకవి ప్రాచీన కవుల వలె అన్యదేశ్యములను కొన్నింటిని ఎట్టి మార్పులు లేకుండా యథాతథంగా ప్రయోగించడం విశేషం.

వ్యక్తి లేక సమాజమునందలి గుణదోషములను పరిహాసము లేక హేళనా పూర్వకంగా విమర్శిస్తు, రచింపబదిన గ్రంథములను “అధిక్షేప కావ్యములు”గా చెప్పుకొనవచ్చును. కొన్ని నీతులను సామాన్య రీతులలో ఉపదేశించుట కంటే ఉపాయాన అధిక్షేప రూపమున బోధించినప్పుడు దాని విలువ, ప్రభావం మరింత అధికమగును. కీలెరిగి వాత పెట్టినట్లు లోపమును గుర్తించి దానిని ఖండితముగా వేలెత్తి చూపుట అవసరమని గుర్తించి అధిక్షేప కావ్యములు వెలువడినాయి. తెలుగులో చాటువులు, కావ్యములు – లఘుకావ్యములు, శతకముల రూపమున అధిక్షేప రచనలు వెలువడినవి. తెలుగులో మొదటిసారిగా చాటువులు చెప్పినవాడు భీమకవి. శాపానుగ్రహ శక్తియుక్తుడయిన భీమకవి చాటువులు, వ్యక్తి దూషణము మరియు జాతి దూషణమునకు సంబంధించినవై వున్నాయి. ఇక మహాకవి శ్రీనాథుని చాటువులనంతములు. వక్రోక్తి, వ్యాజోక్తి, శ్లేష మున్నగు నలంకారములతో చాటువులు చెప్పి నాటి వ్యక్తులను, సమాజమును శ్రీనాథుడు కన్నులకు గట్టినట్టు వర్ణించాడు. మూడు దశాబ్దములందు వెడలిన ముక్తకములు తరువాత దూషణ కావ్యములు, అధిక్షేప, వ్యాజోక్త శతక రచనలకు రాజమార్గమును ఏర్పరచినవి. భీమకవి శాపానుగ్రహశక్తి, అడిదము సూరకవి, శ్రీనాథుని పరిహాసోక్తులు శతకకర్తలకు, నాతని పద్యములు చౌడప్ప వంటి కవులకు, వ్యాజోక్తిపరములైన పద్యములు వ్యాజోక్తి శతకకర్తలకు మార్గదర్శకములైనాయి.

లోకములోని వివిధాంశములను, నిత్యజీవితములోని అంశములను స్వానుభవ దృష్టితో, నిశిత దృష్టితో సమగ్రముగా పరిశీలించి, విభిన్న ధోరణులలో వ్యక్తీకరించుటకు శతక ప్రక్రియను వాహికగా స్వీకరించినవారు అధిక్షేప శతక కర్తలు. తెలుగులో మొదటి అధిక్షేప శతకము కుక్కుటేశ్వర శతకమే. బీజప్రాయముగా నున్న యిదియే వేమన పద్యములలో విస్తృత ప్రాతిపదిక నొందినది. వేమన ప్రజాకవి. తన దృష్టికి వచ్చిన ప్రతి అంశమును గురించి అశువుగా అప్పటికప్పుడే ప్రస్తావించినాడు. అతని మాటలో, నుడికారములో అధిక్షేపము నానా విధములుగా రూపొందినది. కూచిమంచి తిమ్మకవి, వేమన వలె విస్తృత వస్తువును గ్రహించి సాంఘిక రంగములోని అన్ని అంశములను నిశిత దృష్టితో పరిశీలించిన కీర్తి అడిదము సూరకవికి లభించుచున్నది. పదునేడవ శతాబ్ది ఆరంభం నుండి అధిక్షేప శతకములకు నూతన సాంఘిక వ్యవస్థ, మానవుని నైతిక స్థాయి, వ్యక్తుల చిత్తవృత్తులు, అధికారుల తత్త్వము మున్నగు అంశములు ప్రధాన వస్తువు అయినది. కవి చౌడప్ప బూతు మార్గము నింకను రెండడుగులు పొడిగించి శతకకవులు కొందరు జుగుప్సాకరముగా నొనర్చిరి. ఆధునిక కాలంలో తమకు నచ్చని వాటిని, విదేశీయ నాగరికతా వ్యామోహమును, వారి ఆచార వ్యవహారములను తమ శతకాలలో నిశితంగా ఖండించారు. ‘గువ్వలచెన్న’ శతకమునందీ అంశము ప్రస్ఫుటముగా నున్నది. చివరగా అధిక్షేప శతకకారుల భావవ్యక్తీకరణ విధానము, భాష, శైలి మొదలైన వాటిని ప్రత్యేకముగా పరిశీలించిన విధానం ఆకట్టుకుట్టుంది.

నన్నయ నుండి నేటి వరకు సజీవ స్రవంతి వలె ప్రవహించినది, ఒక శతక ప్రక్రియయే అని నిస్సందేహంగా చెప్పవచ్చును. నన్నయ్య, నన్నెచోడుల యందు బీజప్రాయముగా నుండి మల్లికార్జున పండితులు, యథావాక్కుల అన్నమయ్య, పాల్కురికి సోమన అను శతక కవిత్రయంము వారి యందు సంపూర్ణమైన స్వరూపమును సంతరించుకొనినది శతకప్రక్రియ. ఈ కవిత్రయము చూపిన రాచబాటలందు ఇతర శతక కర్తలు స్వేచ్ఛా విహారమొనర్చి శతకమును సర్వాంగ సుందరమైన సాహిత్య ప్రక్రియగా రూపొందించింది. పురాణయుగము నుండి ఆధునిక యుగము వరకు సాహిత్య సంప్రదాయములు తారుమారు అవుతున్నా, శతకములు మాత్రము స్థిరమైన రూపమున నిలిచినవి. తెలుగు శతకములు భక్తి, శృంగార, నీతి, వైరాగ్య ప్రధానములని ఒక విభజన యున్నది. కాని వాటిలో విస్తృతమైన వైవిధ్యమున్నదని విమర్శకుడు విభజించి చూపారు.

సామాన్యముగా ప్రబంధ స్త్రీలు ఒకే అచ్చులోని బొమ్మలని పండితుల విమర్శ. కాని వరూధిని, సత్యభామలు ఒకే యంత్రపు బొమ్మలు కారు. అల్లసాని పెద్దన, నంది తిమ్మనలు వస్తు రస పాత్ర పోషణములో అవలంబించిన భిన్న మార్గములు, వరూధిని సత్యభామలందు ఇమిడియున్నవి. ఆ కవీశ్వరుల విభిన్న దృక్పథాలను, వరూధిని – సత్యభామల ప్రత్యేకతలను వివరించిన విధానం బాగుంది. అలాగే పింగళ సూరన కళా పూర్ణోదయంలో సుగాత్రీ శాలీనుల కథను భక్తి రస ప్రధానంగా, అనుకూల దాంపత్య శృంగార రస భరితంగా సృష్టించాడు. సూరన సుగాత్రి పాత్ర పోషణలో ప్రబంధ సాంప్రదాయములకే మాత్రము లొంగక స్వతంత్ర మార్గము ననుసరించినాడు. ఈ స్వతంత్రమే సుగాత్రి పాత్ర పోషణ కొక విశిశ్టత నాపాదించినది. గాథాకావులు రచించిన ముక్తకములను పరిశీలించినచో నాటి కులాంగనల జీవన విధానము, వారి మానసిక ప్రవృత్తి సుస్పష్టముగా గ్రహించుట కవకాశము కలదు. గాథాకవులు నాయికా నాయకుల భిన్న విభిన్నములైన ప్రకృతులను సరసముగా చిత్రించిరి. ఆదర్శ దాంపత్య జీవిత సౌఖ్యము నందోలలాడిన కులాంగనలు కొందరుండిరి. అట్టివారిలో ప్రాకృతాంధ్ర గృహిణీ ధర్మములు మూర్తీభవించి వున్నాయంటారు.

ఆధునిక విద్యా విధానము – విద్యలు, వివిధ ప్రక్రియలు, రచనలు, సాహిత్య రంగమున నూతన మార్గమును నిర్దేశించినవి. పరిశోధన స్వరూప స్వభవములను నిరూపించిన విద్వాంసులు, విమర్శకులు ఆధునిక పరిశోధన పరిధిని – విస్తృతిని నిశిత దృష్టితో వివరించినారు. తెలుగులో పరిశోధనము వ్యక్తులు, పత్రికలు, సాహిత్య సంస్థలు, గ్రంథమాలలు, అకాడమీల పరంగా సాగిందని, వాటిని పూర్తి వివరంగా తెలియజేసిన వ్యాసం మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తుంది.

ఆచార్య కె. గోపాలకృష్ణారావు గారు తెలుగుపై ఉర్దూ ప్రభావం గురించి తెలియజేసినా, శతక వాఙ్మయం గురించి విశ్లేషించినా, ప్రబంధ నాయికల విశిష్టతల గురించి వివరించినా, పరిశోధన ఎన్ని రకాలుగా వికసించిందో తెలియజేసినా – ప్రతి వ్యాసంలో ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియజేయాలన్న తపన కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. సమాచారాత్మకములు, విజ్ఞానాత్మకములైన ఈ వ్యాసాలన్నీ పాఠకుడ్ని ఆలోచింపజేస్తాయి కూడా. విమర్శకుడు వివిధ సందర్బాలలో రాసిన తొమ్మిది పరిశోధక వ్యాసాలు ప్రచురితమైనవే. “అధిక్షేప శతకములు” అనే వ్యాసం మాత్రం, అదే పేరుతో వచ్చిన పుస్తకానికి రాసిన ముందుమాటగా గుర్తించవచ్చును. ఇందులోని వ్యాసాలకు ముగింపులోనే ప్రచురణ వివరాలు ఇచ్చి, ఇందులో లేని వాటికి చివర్లో పట్టిక ఇస్తే బాగుండేది. ఈ వ్యాసాలన్నీ సులభ గ్రాంథికంలో వుండడం వల్ల ఇప్పటి పాఠకులు కొంత కష్టపడి చదవాల్సి వుంటుంది.

***

బురుజు (ఆచార్య కె. గోపాల కృష్ణారావు సాహిత్య వ్యాసాలు)

సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్,

‘కవిలె’ తెలంగాణ రీసెర్చ్ అండ్ రిఫరెల్ సెంటర్, హైదరాబాద్.

పేజీలు: 112, వెల: రూ.100/-

ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్ మరియు 98492 20321

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here