ఫీల్ గుడ్ చిత్రం ‘బుట్టబొమ్మ’

2
11

[dropcap]2[/dropcap]020లో మళయాళంలో వచ్చిన ‘కప్పేలా’ (చిన్న చర్చి) అనే చిత్రం ఆధారంగా మన తెలుగు వాతావరణంలో తీయబడ్డ చక్కని రీమేక్ చిత్రం ఈ బుట్టబొమ్మ. ‘డీజే టిల్లు’ నిర్మాతల నుంచి వచ్చిన చిన్న బడ్జెట్ ఫీల్ గుడ్ చిత్రం.

ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలా ఆహ్లాదంగా ఉంది. ఇంటిల్లిపాది కలిసి కూర్చొని చూడదగ్గ చిత్రం. ఈ సినిమా కథని మూడు ముక్కల్లో చెప్పేయవచ్చు. చాలా చిన్న కథ. కానీ చెప్పిన విధానంలో స్పష్టత ఉండటం వల్ల కుదురుగా కూర్చుని ఆసక్తిగా తిలకించవచ్చు.

అసలు కథ ఏమిటి అంటే:

అరకులోయలో అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో కల్లాకపటం ఎరుగని అందమైన అమ్మాయి. ఆమె పేరు సత్య. ఆ పిల్లని అమితంగా ప్రేమించే తలితండ్రులు, ఒక చిన్నారి చెల్లి. వాళ్ళది దిగువ మధ్య తరగతి కుటుంబం. ఎంతో పొదుపు చేసి డబ్బు కూడబెట్టుకుని గానీ ఒక వస్తువు కొనలేని స్థితిలో ఉంటారు. ఈ సత్యకి ఒక స్నేహితురాలు. ఆ స్నేహితురాలికి ఒక చిన్న ప్రేమ కథ ఉంటుంది.

మన సత్యకి పెద్ద కోరికలేమి ఉండవు, ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కుని రీల్స్ చేయాలని కోరిక, వైజాగ్ కెళ్లి బీచ్ చూడాలనే చిన్న కోరిక అంతే.

ఒకసారి పొరపాటున తల్లి చెప్పిన నెంబర్‌కి చేయబోయి, ఒక నెంబర్ తప్పుగా టైప్ చేయటం వల్ల వైజాగ్‌లో ఉన్న ఒక ఆటో డ్రైవర్‌కి ఫోన్ కలవటం జరుగుతుంది. అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది.

ఇక ఏ మాత్రం చెప్పినా కథలో మజా పోతుంది. మిగతా కథ తెరపై చూడాల్సిందే.

ముఖ్యాంశాలు:

మళయాళం సినీ రంగంలో ఒక కథానికకి పనికివచ్చే స్థాయి చిన్న ఇతివృత్తాన్ని తీసుకుని పాటలు, డాన్సులు వంటి హడావుడి లేకుండా హాయిగా సినిమా తీసేస్తారు. అలాంటి కోవకి చెందిన చిన్న చిత్రం ఇది.

ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, దృశ్యం, సినిమాలలాగా అరకులోయ అందాలు ఈ సినిమాలో కూడా కనులవిందు చేస్తాయి. కాకపోతే కథకి ఎంత మేరకి అవసరమో అంత మేరకు హాయిగా అరకు అందాలు చూడవచ్చు. వంశీ సినిమాలలో కనిపించే అరకులోయకి ఈ చిన్ని బడ్జెట్ సినిమాలలో కనిపించే అరకులోయకి అసలు పోలిక ఉండదు. వీళ్ల దృష్టంతా ఎంతసేపున్నా మళయాళ సినిమాలో కన్పించిన నేపథ్యాన్ని ఇక్కడ కూడా చూపించాలి అని మాత్రమే. అందుకు ఉన్నంతలో అరకు లోయ సరిగ్గా సరిపోతుంది.

నటీనటులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా చేశారు.

ఆర్కేగా నటించిన అర్జున్ దాస్‌కి మంచి భవిష్యత్ ఉందనిపించింది. మురళీగా నటించిన సూర్య వశిష్ఠ కూడా చక్కగా చేసాడు.

ఆర్కే పాత్రలో అర్జున్ దాస్‌ని మన ముందు ప్రవేశపెట్టింది లగాయతు అతని పాత్ర చిత్రీకరణలో, నేపథ్యాన్ని సృష్టించటంలో రాంగోపాల్ వర్మ తొలినాళ్లలో తీసిన శివ, అంతం, గాయం తాలూకు ప్రభావం కనిపిస్తుంది.

మొత్తానికి చక్కటి సందేశంతో తీయబడ్డ చిత్రం అని చెప్పవచ్చు.

వయసులో ఉన్న ఆడపిల్లలు తెలిసి తెలియని అమాయకత్వంతో సెల్ ఫోన్ వాడితే ఎలాంటి ముప్పులు పొంచి ఉంటాయనే విషయాన్ని ఒళ్ళు గగుర్పొడిచేలా చిత్రీకరించారు. గుంటనక్కలు, తోడేళ్లు లాంటి మగాళ్ళు సదా ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవటానికి సిద్ధంగా ఉంటారు సుమా అనే విషయాన్ని బాగా బలంగా చెప్పారు.

ముగింపులో ఆర్కే చెప్పిన మాటలు మనసుకు హత్తుకుంటాయి.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన సూర్య వశిష్ఠ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన అర్జున్ దాస్ టెర్రిఫిక్‌గా కనిపించారు. తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్‌తో అర్జున్ దాస్ చాలా బాగా మెప్పించాడు. ఇక హీరోయిన్‌గా నటించిన అనికా సురేంద్రన్ కూడా తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది.

ఈ సినిమాలో సత్య (అనికా సురేంద్రన్) పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మురళి పాత్ర.. అలాగే అర్జున్ దాస్.. ఆ పాత్ర తాలూకు పాయింట్ అఫ్ వ్యూ.. ముఖ్యంగా సినిమా నేపథ్యం.. ఇలా మొత్తానికి ఈ సినిమాలో గుడ్ పాయింట్‌తో పాటు గుడ్ మెసేజ్ ఉంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

***

నటీనటులు: అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ, నవ్య స్వామి తదితరులు

దర్శకుడు : శౌరి చంద్రశేఖర్ టి రమేష్

నిర్మాతలు: నాగ వంశీ ఎస్, సాయి సౌజన్య

సంగీత దర్శకులు: గోపీ సుందర్

సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు

ఎడిటర్: నవీన్ నూలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here