[dropcap]చ[/dropcap]ల్లగుళ్ల నరసింహారావుగారు మరణించారన్న వార్త ఉదయం (12/5/22) లేవగానే ఫేస్బుక్లో కనిపించింది.
మనస్సు గతంలోకి పరుగులు తీసింది.
సి. నరసింహారావు గారు హైదరాబాదులో ‘చెలిమి’ పత్రికను ఆరంభిస్తున్నప్పుడు వారి నుంచి నాకు ఫోను వచ్చింది. అప్పటికి నేను ‘అంతర్యాగం’ నవలను ఆంధ్రపభ వార పత్రికలో బహుమతి పొందిన ఉత్సాహంలో ఉన్నాను. సీరియల్ కూడా పాఠకుల ఆదరణ పొందింది. రాజతరంగిణికథలు రాస్తున్న ఆనందంలో వున్నాను. జాగృతిలో ‘అసిధార’ నవల సీరియల్‌గా ప్రచురితమయిన ఆనందంలో వున్నాను. ‘నడుస్తున్న చరిత్ర’ మాసపత్రిక ‘అంతర్మథనం’ నవల ప్రచురించేందుకు ఆమెదం తెలిపింది. వార్తలో రెగ్యులర్ గా రియల్ స్టోరీ వారం వారం రాస్తున్నాను. అలా రచన పరంగా ఒక ‘హై’లో ఉన్నాను. కథలు ప్రచురితమవుతున్నాయి. ఆ సమయంలో సి.నరసింహారావుగారి నుంచి ఫోను రావటం నా ఉత్సాహాన్ని పెంచింది. ‘I am born to write’ అన్న నా విశ్వాసానికి బలం వచ్చింది. ఎవ్వరినీ కలవని, ఎవ్వరూ చెప్పినట్టు వినని, ఎవ్వరికీ సలామ్‌లు కొట్టని, ఏ గ్రూపుల్లోనూ చేరని, ఏ సిద్ధాంతాలు, ఉద్యమాల జోలికి వెళ్లని, పెద్దవాళ్ళ మెప్పుకోసం అయినా పొలిటికల్లీ కరెక్ట్ మాటలు మాట్లాడని వాడిని అయినా, పత్రికలలో ఇలా విరివిగా ప్రచురితమవటం నాకు విశ్వాసాన్నిస్తే, సి. నరసింహారావు గారి నుంచి ఫోను రావటం నా విశ్వాసాన్ని స్థిరపరచింది. ఆయన ఇచ్చిన అడ్రసు పట్టుకుని వెళ్లాను. ‘మహావీర్ హాస్పటల్ ఎదురు సందు, ఎదురుగానే అపార్టమెంట్ ఉంటుంది. 402 అపార్టమెంట్ నెంబరు’ (నెంబరు కరెక్టోకాదో కానీ నాలుగవ అంతస్తు అన్నదాన్లో సందేహం లేదు) అని ఆయన చెప్పిన సూచనలను పాటిస్తూ చెలిమి ఆఫీసు/ఆయన ఇంట్లో అడుగు పెట్టాను. ఆంతకు ముందు ఎడిటర్లతో నా అనుభవాలు, మనసులో మొదుల్తుంటే, ఏ మాత్రం అవమానకరంగా అనిపించినా ‘వాకౌట్’ చేయటానికి నిశ్చయించుకుని ఆయనను కలసేందుకు సిద్ధమయ్యాను.
“నేను చెలిమి అనే వార పత్రికను తీసుకువస్తున్నాను. ఆరంభసంచిక నుంచీ మీరు సీరియల్ రాయాలి” సూటిగా నాతో అన్నారాయన.
పత్రిక ‘డమ్మీ’ చూపించారు.
“ఒక సీరియల్ మేర్లపాక మురళి రాస్తున్నారు. ఇంకో సీరియల్ కూడా ప్రఖ్యాత రచయిత రాస్తున్నాడు. (ఎంత ప్రయత్నించినా రచయిత పేరు గుర్తుకు రావటం లేదు). మేర్లపాక మురళి సీరియల్ ఎలా ఉంటుందో తెలుసు. మీరు ఓ సీరియల్ రాయాలి. టాపిక్‌లు ఏమైనా ఉన్నాయా?” అడిగారు.
నేను అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ టాపిక్ల కోసం వెతుక్కునే ప్రసక్తి లేదు. వెంటనే కొన్ని చెప్పాను.
ఆయన మౌనంగా విన్నారు. ఓపికగా విన్నారు. ఎందుకంటే నేను చెప్పే టాపిక్‌లు ఏవీ ఆయనకు రుచించటం లేదని ఆయన ముఖ కవళికలు స్పష్టం చేశాయి.
చివరికి “మీకు ఎలాంటి నవల కావాలి?” అడిగాను. (అప్పటి నుంచీ ఏ ఎడిటర్ నన్ను రాయమని అడిగినా “మీకు ఎలాంటిది కావాలి?” అని అడగటం అలవాటు చేసుకున్నాను . ఇప్పటికీ ఆ అలవాటు కొనసాగుతోంది. అందుకే సంచికలో రచయితలను మీరేం రాయాలనుకుంటున్నారు అని అడుగుతాను).
ఆయన చెప్పారు.
“నేను సెక్స్, వయోలెన్స్ రాయను, అది నా సిద్ధాంతం” నిక్కచ్చిగా చెప్పాను.
నా మాటలకు ఆయన నొచ్చుకోలేదు సరి కదా, హాయిగా నవ్వేశారు.
“మిమ్మల్ని సెక్స్, వయెలెన్స్ రాయమని ఎవరన్నారు? అందుకే ఇతర సీరియల్స్ ఎవరు రాస్తున్నారో చెప్పాను. వాటికి భిన్నంగా నేను మిమ్మల్ని ఆసక్తికరంగా రాయమని అడిగాను అంతే” అన్నారు.
“కాని మీరు రాయమని అడుగుతున్నది కమర్షియల్ నవల. నేను కమర్షియల్ నవలలు రాయను” అన్నాను.
“కమర్షియల్ నవల అనకు. ఆసక్తికరమైన రచన అను. అంశం ఏదైనా దాన్ని రచయిత ఎలా ప్రజెంట్ చేస్తాడన్న దాని
ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఈ రోజుకీ నాకు మార్గదర్శకత్వం చేస్తున్నాయి. ఆసక్తికరంగా రాయటం వైపు నా దృష్టి మళ్లించిన వారాయన. కమర్షియల్ రచనలంటే చిన్న చూపు చూడటం వ్యక్తి అజ్ఞానానికి నిదర్శనం అనీ, ఆసక్తికరంగా రాయటం చేతకాని వారు తమ చేతకానితనానికి వేసుకున్న అందమైన ముసుగు, ఆసక్తికరమైన రచనలను చిన్న చూపు చూడటం, ఆ రకంగా ప్రచారం చేయటం అనీ అర్థమయింది. ఆయనను కలసిన తరువాత నా రచనల తీరు మారింది. అంతకుముందు ఉన్న ఉపన్యాసాలు, చర్చలు తగ్గి, సంఘటనలు పెరిగాయి.
నేను ఓ టాపిక్ చెప్పాను.
అది ఆయనకు వెంటనే నచ్చింది. నాకు ఆయన అడ్వాన్స్ ఇచ్చారు. “నవల పూర్తయిన తరువాత మిగతా ఇస్తాను” అన్నారు. అది నేను రచనా జీవితం ఆరంభించినప్పటినుంచీ అందుకున్న తొలి అడ్వాన్స్.
నేను లేవబోతుంటే “భోజన సమయం అయింది. భోజనం కలసి చేద్దాం” అన్నారు.
ఆశ్చర్యపోయాను.
ఏదో గొణిగాను, తప్పించుకునేందుకు.
అప్పటికే ఆయన శ్రీమతిగారు వచ్చి ‘అన్నీ సిద్ధం’ అన్నారు.
భోజనం చేస్తుంటే చెప్పారు.
“రచన ఎలావుండాలంటే కొండపైనుంచి రాయిని దొర్లించినట్టుండాలి. రాయిని మోస్తూ కొండ ఎక్కుతున్నట్టుండకూడదు. రచన ఎప్పుడూ దృశ్య ప్రధానంగా ఉండాలి. రాసేటప్పుడు రచయిత కళ్ల ముందు దృశ్యాలను దర్శించాలి. ఆ దృశ్యాలను అక్షర రూపంలోకి తర్జుమా చేయాలి. అప్పుడు రచన దృశ్యాత్మకం అవుతుంది. పాఠకుడి మనస్సు కూడా రచయిత రాసిన అక్షరాల దృశ్యాన్ని దర్శిస్తుంది” అన్నారు.
ఇప్పటికీ ఈ రెండు సూత్రాలను నేను ఏ రచన చేసేప్పుడయినా స్మరిస్తూంటాను. ఎప్పుడయితే రచన రాయిని మోస్తూ కొండ ఎక్కుతున్నట్టనిపిస్తుందో, అప్పుడు ఆ ఆలోచనా ధోరణి వదిలి కొండ మీదనుంచి రాయిని దొర్లించాలని ఆలోచిస్తాను. కథ అయినా, నవల అయినా , వ్యాసం అయినా దృశ్యం కళ్లముందు కదలందే దానికి అక్షరరూపం ఇవ్వలేదు. ఎప్పుడయితే, అక్షరం దృశ్యాన్ని చూపటం లేదనిపిస్తుందో అప్పుడా అక్షరం భారమై కథ నుంచి జారిపోతుంది. ఇందువల్ల నేను రాసిన కథలను నేనే ఎడిట్ చేసుకునే పద్ధతి నాకు అలవడింది. అనవసరమైన అక్షరం, వర్ణన, పాండితీ ప్రదర్శనలు, ఆ రోజు నుంచీ నా రచనల్లో పరిహార్యమయ్యాయి.
“మీరు చెప్తున్నది సినిమా స్క్రిప్ట్ రచన పద్ధతి” అన్నాను.
“సినిమాకీ నవలకీ తేడా ఏముంది? సినిమాలో దృశ్యం చూపేది, నవలలో అక్షరాలు చూపిస్తాయి. వర్ణనను పేజీకి ఎడమ వైపు రాసి, సంభాషణలు కుడివైపు రాస్తే నవల సినిమా స్క్రిప్టు అయిపోతుంది. తెలీని వారే నవల రచన వేరు, సినిమా స్క్రిప్టులు వేరు అంటారు” అన్నారు.
ఆయన అభిప్రాయంతో సంపూర్ణంగా ఏకీభవిస్తాను ఈనాటికీ. ఆయన చేసిన సూచన నాకు స్క్రిప్టు రచనలలోనూ పనికి వచ్చింది. ముందుగానే నేను నవల రచయితను కాబట్టి స్క్రిప్టులు రాయలేనని నన్ను డిఫెన్స్‌లో పెట్టాలని ప్రయత్నించిన వారందరినీ ఈ వాదనతోనే తిప్పికొట్టాను. అయితే స్క్రిప్ట్ అంటే తెలియని వారు స్క్రిప్ట్ మంచిదో, చెడ్డదో నిర్ణయించేవారవటంతో నా స్క్రిప్టులు చూసే అర్హత లేని వారికోసం రాయకూడదని నిర్ణయించుకున్నాను. స్క్రిప్టు రచన మానుకున్నాను.
ఆ రకంగా చెలిమి పత్రిక ఆరంభ సంచిక నుంచీ నేను రాసిన ‘ఒంటరి పోరాటం’ సీరియల్ ఆరంభమయింది. నేను అంత
నా స్వభావం వల్ల ఆ తరువాత ఆయనను నేను కలవలేదు. చెలిమి పత్రిక మూత పడింది. ఫేస్బుక్లో వారి అబ్బాయి ‘చల్లగుళ్ల హర్ష’ ద్వారా విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ‘వాట్స్అప్’లో నరసింహారావుగారు ఆయన రాసిన వ్యాసాలను టీవీ ఇంటర్వ్యూలనూ పంపుతూంటారు. నేను నా రాతల లింకులను పంపుతాను. అప్పుడప్పుడు ఫోను చేసి మాట్లాడేవారు. ఇటొచ్చినప్పుడు కలవండి అనేవారు. రచయితగా నేను సాధిస్తున్న అభివృద్ధికి సంతోషించేవారు. అభినందించేవారు. ఈ రకంగా చెలిమి పత్రికతో ఆరంభమయిన మా ‘చెలిమి’ ప్రత్యక్షంగా కాకున్నా, పరోక్షంగా సాగుతూ వస్తోంది. ముఖ్యంగా నేను రచనలు చేస్తున్నంతకాలం ‘ఆసక్తికరంగా రాయటం’ అన్న ఆలోచన ద్వారా ఆయన నాకు గుర్తుకు వస్తూనే ఉంటారు. రచన జీవితంలో నా పై అత్యంత ప్రభావం చూపించిన సంపాదకుడిగా, రచయితను గౌరవించే వ్యక్తిగా, మంచి మనిషిగా సి. నరసింహరావు గారు, నాకు ఎప్పుడూ గుర్తుంటారు. వారిని మరచి పోవటమంటే నేను ‘రాతను’ మరచిపోవటమే. ఆ రోజు రాకూడదని రోజూ భగవంతుడిని ప్రార్థిస్తుంటాను. ఎందుకంటే రాస్తున్నాను కాబట్టే నేనున్నాను.
సి. నరసింహరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తున్నాను.
నరసింహారావుగారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.