సి. నరసింహారావు గారికి నివాళి

3
8

[dropcap]చ[/dropcap]ల్లగుళ్ల నరసింహారావుగారు మరణించారన్న వార్త ఉదయం (12/5/22) లేవగానే ఫేస్‍బుక్‌లో కనిపించింది.

మనస్సు గతంలోకి పరుగులు తీసింది.

సి. నరసింహారావు గారు హైదరాబాదులో ‘చెలిమి’ పత్రికను ఆరంభిస్తున్నప్పుడు వారి నుంచి నాకు ఫోను వచ్చింది. అప్పటికి నేను ‘అంతర్యాగం’ నవలను ఆంధ్రపభ వార పత్రికలో బహుమతి పొందిన ఉత్సాహంలో ఉన్నాను. సీరియల్ కూడా పాఠకుల ఆదరణ పొందింది. రాజతరంగిణికథలు రాస్తున్న ఆనందంలో వున్నాను.  జాగృతిలో ‘అసిధార’ నవల సీరియల్‌గా ప్రచురితమయిన ఆనందంలో వున్నాను. ‘నడుస్తున్న చరిత్ర’ మాసపత్రిక  ‘అంతర్మథనం’ నవల ప్రచురించేందుకు ఆమెదం తెలిపింది. వార్తలో రెగ్యులర్ గా రియల్ స్టోరీ వారం వారం రాస్తున్నాను. అలా రచన పరంగా ఒక ‘హై’లో ఉన్నాను. కథలు ప్రచురితమవుతున్నాయి. ఆ సమయంలో సి.నరసింహారావుగారి నుంచి ఫోను రావటం నా ఉత్సాహాన్ని పెంచింది. ‘I am born to write’ అన్న నా విశ్వాసానికి బలం వచ్చింది. ఎవ్వరినీ కలవని, ఎవ్వరూ చెప్పినట్టు వినని, ఎవ్వరికీ సలామ్‌లు కొట్టని, ఏ గ్రూపుల్లోనూ చేరని, ఏ సిద్ధాంతాలు, ఉద్యమాల జోలికి వెళ్లని, పెద్దవాళ్ళ మెప్పుకోసం అయినా పొలిటికల్లీ కరెక్ట్ మాటలు మాట్లాడని వాడిని అయినా,  పత్రికలలో ఇలా విరివిగా ప్రచురితమవటం నాకు విశ్వాసాన్నిస్తే, సి. నరసింహారావు గారి నుంచి ఫోను రావటం నా విశ్వాసాన్ని స్థిరపరచింది. ఆయన ఇచ్చిన అడ్రసు పట్టుకుని వెళ్లాను. ‘మహావీర్ హాస్పటల్ ఎదురు సందు, ఎదురుగానే అపార్టమెంట్ ఉంటుంది. 402 అపార్టమెంట్ నెంబరు’ (నెంబరు కరెక్టోకాదో కానీ నాలుగవ  అంతస్తు అన్నదాన్లో సందేహం లేదు) అని ఆయన చెప్పిన సూచనలను పాటిస్తూ చెలిమి ఆఫీసు/ఆయన ఇంట్లో అడుగు పెట్టాను. ఆంతకు ముందు ఎడిటర్లతో నా అనుభవాలు, మనసులో మొదుల్తుంటే, ఏ మాత్రం అవమానకరంగా అనిపించినా ‘వాకౌట్’ చేయటానికి నిశ్చయించుకుని ఆయనను కలసేందుకు సిద్ధమయ్యాను.

నన్ను నేను పరిచయం చేసుకోగానే, విశాలంగా నవ్వుతూ, మల్లెపూలలాంటి స్వచ్ఛమైన దుస్తులలో  ఉన్న నరసింహారావుగారు లేచి నిలబడి ఓ పెద్ద రచయితను ఆహ్వానించినట్టు నన్ను ఆహ్వానించారు. ఆయన ఎంత పొడుగంటే నా మనసులో ‘He towered over me’ అన్న వాక్యం మెదిలింది. నన్ను ఆయన అంత సాదరంగా ఆహ్వానించి  నాలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని అయెమయానికి గురి చేశారు. రచయితగా అంత మర్యాద పొందటం అదే ప్రథమం. (చివరికి రెండవ బహుమతి రవీంద్ర భారతిలో అందుకున్నప్పుడు కూడా అంత ప్రాధాన్యం ఎవ్వరూ ఇవ్వలేదు. హడావిడిగా  బహుమతులు పంచి ఏదో సినిమా కార్యక్రమాన్ని అసలైన  సాహిత్య కార్యక్రమంలా ఆరంభించారు. నేను నిరసనగా బయటకు వచ్చి రవీంద్ర భారతి మెట్లు మీద ఒక్కడినీ కూర్చుని – నేను పెద్దగయిన తరువాత ఎట్టి పరిస్థితులలో నా సాహిత్య కార్యక్రమాలలో సినిమా ప్రసక్తి తేవద్దనీ, సినిమా వాళ్లుండే సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనద్దనీ నిశ్చయించుకున్నాను. ఇప్పటికీ ఆ నిశ్చయం మీదే నిలబడి ఉన్నాను. సినిమాకన్నా సాహిత్యమే గొప్ప. సినిమా వాళ్లకన్నా సాహిత్య సృజనకారులకే  ప్రాధాన్యం ఇవ్వాలన్నది అప్పుడు, ఇప్పుడూ నా అభిఫ్రాయం. అందుకే సినిమా వాడు రాసింది కాబట్టి ఎలాగవున్నా  పొగడడాలు నిషిద్ధం). అందుకే అంత గౌరవమిచ్చిన సి. నరసిహారావుగారి ఔదార్యానికి, సహృదయానికి ఆ క్షణం నుంచి నేను అభిమానిని అయిపోయాను. ( నేను పత్రికకు ఎడిటర్ అయ్యాక, స్థాయితో సంబంధం లేకుండా అందరినీ గౌరవించాలని నిర్ణయించుకున్నాను. నేను ఏదో ఒక రోజు పత్రికకు ఎడిటర్‌గా చేస్తాన్న విషయంలో నాకు ఏనాడూ సందేహం లేదు. సమయం కోసం ఎదురు చూశానంతే).

“నేను చెలిమి అనే వార పత్రికను తీసుకువస్తున్నాను. ఆరంభసంచిక నుంచీ మీరు సీరియల్ రాయాలి” సూటిగా నాతో అన్నారాయన.

పత్రిక ‘డమ్మీ’ చూపించారు.

“ఒక సీరియల్ మేర్లపాక మురళి రాస్తున్నారు. ఇంకో సీరియల్ కూడా ప్రఖ్యాత రచయిత రాస్తున్నాడు. (ఎంత ప్రయత్నించినా రచయిత పేరు గుర్తుకు రావటం లేదు). మేర్లపాక మురళి సీరియల్ ఎలా ఉంటుందో తెలుసు.  మీరు ఓ సీరియల్ రాయాలి. టాపిక్‍లు ఏమైనా ఉన్నాయా?” అడిగారు.

నేను అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ టాపిక్‍ల కోసం వెతుక్కునే ప్రసక్తి లేదు. వెంటనే కొన్ని చెప్పాను.

ఆయన మౌనంగా విన్నారు. ఓపికగా విన్నారు. ఎందుకంటే నేను చెప్పే టాపిక్‌లు ఏవీ ఆయనకు రుచించటం లేదని ఆయన ముఖ కవళికలు స్పష్టం చేశాయి.

చివరికి “మీకు ఎలాంటి నవల కావాలి?” అడిగాను. (అప్పటి నుంచీ ఏ ఎడిటర్ నన్ను రాయమని అడిగినా “మీకు ఎలాంటిది కావాలి?” అని అడగటం అలవాటు చేసుకున్నాను . ఇప్పటికీ ఆ అలవాటు కొనసాగుతోంది. అందుకే సంచికలో రచయితలను మీరేం రాయాలనుకుంటున్నారు అని అడుగుతాను).

ఆయన చెప్పారు.

“నేను సెక్స్, వయోలెన్స్ రాయను, అది నా సిద్ధాంతం” నిక్కచ్చిగా చెప్పాను.

నా మాటలకు ఆయన నొచ్చుకోలేదు సరి కదా, హాయిగా నవ్వేశారు.

“మిమ్మల్ని సెక్స్, వయెలెన్స్ రాయమని ఎవరన్నారు? అందుకే ఇతర సీరియల్స్ ఎవరు రాస్తున్నారో  చెప్పాను. వాటికి భిన్నంగా నేను మిమ్మల్ని ఆసక్తికరంగా రాయమని అడిగాను అంతే” అన్నారు.

“కాని మీరు రాయమని అడుగుతున్నది కమర్షియల్ నవల. నేను కమర్షియల్ నవలలు రాయను” అన్నాను.

“కమర్షియల్ నవల అనకు. ఆసక్తికరమైన రచన అను. అంశం ఏదైనా దాన్ని రచయిత ఎలా ప్రజెంట్ చేస్తాడన్న దాని మీద ఆ రచన పాఠకుల ఆదరణ పొందటం ఉంటుంది. ఆలోచనలతో, చర్చలతో రాస్తే, ఎవరు చదువుతారు? కాబట్టి నేను ఒక ఆసక్తికరమైన రచన చేయమంటున్నాను. అది హిట్ అయితే కమర్షియల్ రచన అవుతుంది. లేకపోతే మామూలు రచనలా మిగిలిపోతుంది. పాఠకులు ఆసక్తికరంగా చదివే ఫార్మాట్ లోనే నువ్వు నీ అదర్శాలు, సత్ప్రవర్తనలు పెట్టు. వెయ్యి చర్చలు, ఉపన్యాసాలతో చెప్పలేనిది ఒక్క సంఘటనతో చెప్పవచ్చు. అలాంటి సంఘటనలను సృజించి ఆసక్తికరంగా రాయి. పేజీలకు పేజీలు ఉపన్యాలు రాయటంలో గొప్ప లేదు. దాని సారాన్ని ప్రస్ఫుటం చేసే సంఘటనను సృజించటంలో ఉంటుంది గొప్పతనం” అన్నారు.

ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఈ  రోజుకీ నాకు మార్గదర్శకత్వం చేస్తున్నాయి. ఆసక్తికరంగా రాయటం వైపు నా దృష్టి మళ్లించిన వారాయన. కమర్షియల్ రచనలంటే చిన్న చూపు చూడటం వ్యక్తి అజ్ఞానానికి నిదర్శనం అనీ, ఆసక్తికరంగా రాయటం చేతకాని వారు తమ చేతకానితనానికి వేసుకున్న అందమైన ముసుగు, ఆసక్తికరమైన రచనలను చిన్న చూపు చూడటం, ఆ రకంగా ప్రచారం చేయటం అనీ అర్థమయింది. ఆయనను కలసిన తరువాత నా రచనల తీరు మారింది. అంతకుముందు ఉన్న ఉపన్యాసాలు, చర్చలు తగ్గి, సంఘటనలు పెరిగాయి.

నేను   ఓ టాపిక్ చెప్పాను.

అది ఆయనకు వెంటనే నచ్చింది. నాకు ఆయన అడ్వాన్స్ ఇచ్చారు. “నవల పూర్తయిన తరువాత మిగతా ఇస్తాను” అన్నారు. అది నేను రచనా జీవితం ఆరంభించినప్పటినుంచీ అందుకున్న తొలి అడ్వాన్స్.

నేను లేవబోతుంటే “భోజన సమయం అయింది. భోజనం కలసి చేద్దాం” అన్నారు.

ఆశ్చర్యపోయాను.

ఏదో గొణిగాను, తప్పించుకునేందుకు.

అప్పటికే ఆయన శ్రీమతిగారు వచ్చి ‘అన్నీ సిద్ధం’ అన్నారు.

భోజనం చేస్తుంటే చెప్పారు.

“రచన ఎలావుండాలంటే కొండపైనుంచి రాయిని దొర్లించినట్టుండాలి. రాయిని మోస్తూ కొండ ఎక్కుతున్నట్టుండకూడదు. రచన ఎప్పుడూ దృశ్య ప్రధానంగా ఉండాలి. రాసేటప్పుడు రచయిత కళ్ల ముందు దృశ్యాలను దర్శించాలి. ఆ దృశ్యాలను అక్షర రూపంలోకి తర్జుమా చేయాలి. అప్పుడు రచన దృశ్యాత్మకం అవుతుంది. పాఠకుడి మనస్సు కూడా రచయిత రాసిన అక్షరాల దృశ్యాన్ని దర్శిస్తుంది” అన్నారు.

ఇప్పటికీ ఈ రెండు సూత్రాలను నేను ఏ రచన చేసేప్పుడయినా స్మరిస్తూంటాను. ఎప్పుడయితే రచన రాయిని మోస్తూ కొండ ఎక్కుతున్నట్టనిపిస్తుందో, అప్పుడు ఆ ఆలోచనా ధోరణి వదిలి కొండ మీదనుంచి రాయిని దొర్లించాలని ఆలోచిస్తాను. కథ అయినా, నవల అయినా , వ్యాసం అయినా దృశ్యం కళ్లముందు కదలందే దానికి అక్షరరూపం ఇవ్వలేదు. ఎప్పుడయితే, అక్షరం దృశ్యాన్ని చూపటం లేదనిపిస్తుందో అప్పుడా అక్షరం భారమై కథ నుంచి జారిపోతుంది. ఇందువల్ల నేను రాసిన కథలను నేనే ఎడిట్ చేసుకునే పద్ధతి నాకు అలవడింది. అనవసరమైన అక్షరం, వర్ణన, పాండితీ ప్రదర్శనలు, ఆ రోజు నుంచీ నా రచనల్లో పరిహార్యమయ్యాయి.

“మీరు చెప్తున్నది సినిమా స్క్రిప్ట్ రచన పద్ధతి” అన్నాను.

“సినిమాకీ నవలకీ తేడా ఏముంది? సినిమాలో దృశ్యం చూపేది, నవలలో అక్షరాలు చూపిస్తాయి. వర్ణనను పేజీకి ఎడమ వైపు రాసి, సంభాషణలు కుడివైపు రాస్తే నవల సినిమా స్క్రిప్టు అయిపోతుంది. తెలీని వారే నవల రచన  వేరు, సినిమా స్క్రిప్టులు వేరు అంటారు” అన్నారు.

ఆయన అభిప్రాయంతో సంపూర్ణంగా ఏకీభవిస్తాను ఈనాటికీ. ఆయన చేసిన సూచన నాకు స్క్రిప్టు రచనలలోనూ పనికి వచ్చింది. ముందుగానే నేను నవల రచయితను కాబట్టి స్క్రిప్టులు రాయలేనని నన్ను డిఫెన్స్‌లో పెట్టాలని ప్రయత్నించిన వారందరినీ ఈ వాదనతోనే తిప్పికొట్టాను.  అయితే స్క్రిప్ట్ అంటే తెలియని వారు స్క్రిప్ట్ మంచిదో,  చెడ్డదో నిర్ణయించేవారవటంతో నా స్క్రిప్టులు చూసే అర్హత లేని వారికోసం రాయకూడదని నిర్ణయించుకున్నాను. స్క్రిప్టు రచన మానుకున్నాను.

ఆ రకంగా చెలిమి పత్రిక ఆరంభ సంచిక నుంచీ నేను రాసిన ‘ఒంటరి పోరాటం’ సీరియల్ ఆరంభమయింది. నేను అంత వరకూ రాసిన వాటన్నింటికీ భిన్నమైన ‘రెవెంజ్ డ్రామా’ అది. ఈ స్ఫూర్తితోనే ఆసక్తికరమైన నవలలు ‘ఇది నా హృదయం’, ‘ఆపరేషన్ బద్ర్’, ‘నీ పేరు తలచినా చాలు’, ‘సత్యం-స్వప్నం’ వంటివి ఆంధ్రభూమి వార పత్రికలో రాశాను. ‘ఆసక్తికరంగా రాయటం’ అన్న ఆలోచన ఈనాటికీ ప్రతి అక్షరం రాసే ముందు నా చెవిలో వినిపిస్తుంది. రాస్తున్నది ఏ మాత్రం ఆసక్తికరంగా అనిపించకపోయినా, రాసినదంతా వదిలేసి, కొత్తగా, మరో కోణంలో కళ్లముందు దృశ్యాన్ని ఊహించుకుని, రచన సాగిస్తాను. కొండ మీదనుంచి రాయిని దొర్లించటం తప్పనిసరి.  ఈ రకంగా నా రచనలపై శ్రీ సి. నరసింహరావుగారి ప్రభావం అమితంగా ఉంది. నేను డిటెక్టవ్ కథలు రాసినా, హరర్ కథలు రాసినా, థ్రిలింగ్ – చిల్లింగ్ స్టోరీ రాసినా, సైన్స్ ఫిక్షన్ రాసినా, హిస్టారికల్ ఫిక్షన్ రాసినా, చివరికి పౌరాణిక ఫిక్షన్ రాసినా, ‘ఆసక్తికరంగా రాయటం’ అన్న మాట ప్రభావం కనిపిస్తుంది. చివరకి ‘సౌశీల్య ద్రౌపది’ నవల – ‘ఎలా ఆరంభించాలి?’ అన్న ప్రశ్న వచ్చినప్పుడు సినిమాకు స్క్రిప్టు రచనకూ తేడా లేదన్న ఆయన మాట గుర్తుకు వచ్చింది. దాంతో నవల ఆరంభంలోనే రాయిని కొండమీదనుంచి దొర్లించి ,  ఫ్లాష్‌బ్యాక్‌తో ఆరంభించాను. నవల చదివిన వారంతా ఆ ఆరంభాన్ని మెచ్చుకున్నారు.

ఈ రకంగా నా రచనలపై అమితంగా ప్రభావం చూపించిన వారు సి. నరసింహారావు. ‘ఒంటరి పోరాటం’ సీరియల్ అయిన తరువాత ఆయన బాలల కథలు వరుసగా రాయమన్నారు. వాటికి రంగులతో చక్కటి బొమ్మలు గీయించారు. అయితే, నేను రాస్తున్న బాలల కథల ఫీచర్‌ మధ్యలో  వేరే వారి కథ ప్రచురించటంతో, నేను రాస్తున్న ఫీచర్‌లో వేరే వారి రచన  ప్రచురిస్తే నేను ఫీచర్ రాయటం మానుకుంటానన్న సిద్ధాంతం ప్రకారం బాలల కథలు రాయటం మానేశాను.

నా స్వభావం వల్ల ఆ తరువాత ఆయనను నేను కలవలేదు. చెలిమి పత్రిక మూత పడింది. ఫేస్‌బుక్‌లో వారి అబ్బాయి ‘చల్లగుళ్ల హర్ష’ ద్వారా విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ‘వాట్స్అప్’లో నరసింహారావుగారు ఆయన రాసిన వ్యాసాలను టీవీ ఇంటర్వ్యూలనూ పంపుతూంటారు. నేను నా రాతల లింకులను పంపుతాను. అప్పుడప్పుడు ఫోను  చేసి మాట్లాడేవారు. ఇటొచ్చినప్పుడు కలవండి  అనేవారు. రచయితగా నేను సాధిస్తున్న అభివృద్ధికి సంతోషించేవారు. అభినందించేవారు. ఈ రకంగా చెలిమి పత్రికతో ఆరంభమయిన మా ‘చెలిమి’ ప్రత్యక్షంగా కాకున్నా,  పరోక్షంగా సాగుతూ వస్తోంది. ముఖ్యంగా నేను రచనలు చేస్తున్నంతకాలం ‘ఆసక్తికరంగా రాయటం’ అన్న ఆలోచన ద్వారా ఆయన నాకు గుర్తుకు వస్తూనే ఉంటారు. రచన జీవితంలో నా పై అత్యంత ప్రభావం చూపించిన సంపాదకుడిగా, రచయితను గౌరవించే వ్యక్తిగా, మంచి మనిషిగా సి. నరసింహరావు గారు, నాకు ఎప్పుడూ గుర్తుంటారు. వారిని మరచి పోవటమంటే నేను ‘రాతను’ మరచిపోవటమే. ఆ రోజు రాకూడదని రోజూ భగవంతుడిని ప్రార్థిస్తుంటాను. ఎందుకంటే  రాస్తున్నాను కాబట్టే  నేనున్నాను.

సి. నరసింహరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తున్నాను.

నరసింహారావుగారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here