జీవితంలో స్పర్శ కరువైతే : Call Him Eddy

0
7

[dropcap]మ[/dropcap]నమిప్పుడు వాస్తవిక ప్రపంచంలో కంటే వేరే వింతైన ప్రపంచంలో ఎక్కువ బ్రతుకుతున్నాం. అందరం కలిసినట్టే వున్నా కలవనట్టే వుంటుంది. ముఖ్యంగా ఈ సాంకేతిక ప్రగతి అనంతరం. మనిషికి మైళ్ళ దూరంలో వున్న మరో మనిషి కేవలం ఫోన్ కాల్ దూరం. అయినా పలకరింపులు వాట్సాపుల్లోనే ఎక్కువ. ఇదివరకు తరాలు పడ్డ కష్టం మనం పడట్లేదు. పనులన్నీ బటన్ నొక్కితే అయిపోతున్నాయి. అయినా సమయం లేనట్టే వుంటుంది. ఇది కాస్త అతిశయోక్తి అనిపించవచ్చు, కానీ ఎంతో కొంత నిజం కూడా వుంది. ఎంత, ఎన్ని పాళ్ళు వగైరా మనిషికీ మనిషికీ మారొచ్చుగాక.

కొన్నేళ్ళ క్రితం ఒక ఫ్యూచరిస్టిక్ స్కిఫై చిత్రం వచ్చింది “హర్” అని. వాకిన్ ఫీనిక్స్ నటించాడు. స్పైక్ జాంజ్ దర్శకుడు. ఆ పూర్తి నిడివి చిత్రం జీవితంలోని అనేక పార్శ్వాలను తడుముతుంది. కానైతే ప్రారంభం మాత్రం ఇలా వుంటుంది. సమీప భవిష్యత్తులో, మనుషులు తీరిక లేకుండా వున్నారు; మాటలకు తడుముకుంటున్నారు. ఒకప్పటిలా ప్రేమపూర్వక సంభాషణలు, ఉత్తరాలూ-ఈమేల్స్ మరచిపోయారు. కాని దగ్గరివాళ్ళ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలలో నాలుగు మాటలు వ్రాయలేని దుస్థితి. పెట్టుబడిదారి విధానం లో వొకటుంది. అవసరాన్ని బట్టి వ్యాపారాలు కూడా విస్తరిస్తాయి. ఒక పెద్ద కంపెనీ అలాంటి వాళ్ళ కోసమే తయారవుతుంది. అలా వ్రాయలేనివారికోసం మనుషులను పెట్టి వ్రాయిస్తుంది అది. అక్కడే మనల్ను చేయి పట్టుకుని దర్శకుడు ఇంకా వింత వింత జరగగల పరిణామాల దిశగా నడిపించుకెళ్తాడు.

సరె. ఇప్పుడు ఈ చిత్రం లో ఎడిత్ డిసూజా (సంజయ్ సూరి) ఇంటికి ఓ విలేఖరి రియా (ఈషా చోప్రా) ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్తుంది. మొదట్లోనే అంటాడు నన్ను ఎడిత్ అంటే చాలు అని. పూర్తి పేరుతో పలకరిస్తాము, వెస్ట్ లో ఇంటి పేరుతో పలకరిస్తారు. ఇది ఫార్మల్. ఇక చనువు వున్న వారే అసలు పేరుతో పిలవగలుగుతారు. ఆ రెండు పలకరింపుల్లో అంత తేడా వుంటుంది. ఒక రకంగా నువ్వు, మీరు ల మధ్య వున్నటువంటిది. ఇందులో మొదట్లోనే ఆ దూరాన్ని చేరిపేసే ప్రయత్నం జరుగుతుంది. ఆమె అతన్ని ఇంటెర్వ్యూ తీసుకోవడానికి వెళ్ళిందంటే అతనిలో ఏదో విశేషం వుండాలిగా. ఖచ్చితంగా వుంది. మన జీవితాల్లో అనేక కారణాలుగా మనుషుల మధ్య ఎడం పెరుగుతూ వస్తోంది. పదేళ్ళ వయసు వచ్చేదాకా పిల్లవాడు తల్లిని కరచుకుని గారాలు పోతూ కబుర్లు చెబుతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక్కటే. అతనికి సాంత్వన, ఆమెకు అనురాగం లభిస్తుంది ఆ స్పర్శలో. స్పర్శ మాటలు పుట్టిస్తుంది, నవ్వులు పూయిస్తుంది, బాధలను, క్లేశాన్నీ చేరిపే ప్రయత్నం చేస్తుంది. కాని ఆ తర్వాత? పెద్దయ్యేకొద్దీ క్రమంగా ఆ స్పర్శ కూడా తప్పుకుంటుంది, ఎడం మధ్యన వచ్చేస్తుంది. ఇలా ఈ స్పర్శ అందకే ప్రతి మనిషీ ఒక దీవిలా మారి పైక కనబడకపోయినా లోలోన అగాథంలా ఫీల్ అవుతాడు. సరిగ్గా అలాంటి వాళ్ళ కోసమే ఎడిత్ సేవలందిస్తున్నాడు. వెచ్చని కౌగిలింత. గంటకు రెండువేలకి. చట్ట బధ్ధత లేని ఈ పని తనను జైలుకు తోసేసినా వెరవక చేస్తానంటాడు. మొదట్లో రియా కి ఇదంతా అయోమయంలా, నవ్వులాటలా, నమ్మడానికి లేనిదానిలా అనిపిస్తుంది. గోడమీద ఎడిత్ భార్యా కొడుకుల ఫొటోను చూస్తూ, వాళ్ళకి ఇదంతా తెలుసా అడుగుతుంది. నేను రోజూ తెలియజేస్తాను అన్నీ అంటాడు. ఒక అపరిచిత వ్యక్తిని కౌగిలించుకున్నప్పుడు ఇరువురిలో ఎవరికీ అలాంటి భావన కలగదా అని అడుగుతుంది. నవ్వి, కలగవచ్చు అది సహజం కదా, దాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్ళడమే చేస్తానంటాడు. ఇంటర్వ్యూ అయిపోయింది. ఆమె వెళ్ళే ముందు అడుగుతాడు, చివరిసారిగా ఒకరిని కౌగిలించి ఎన్నాళ్ళైందని. ఆమె బిడియ పడుతుంది. కావాలంటే ఒకసారి ఈ ప్రయోగం చేసి చూడమంటాడు. అసమంజసంగానే ఒప్పుకుంటుంది. ముందు భుజాలు రాసుకుంటూ కూర్చోవడం. తర్వాత ఆమె పడుకుంటే, వెనుక నుంచి చేతులు వేసి నిమురుతాడు. క్షణాల్లో ఆమె ఏడవడం మొదలుపెడుతుంది. ఆ స్పర్శ ఆమె మనసులో తాళం వేసి మరీ వుంచుకున్న విషయాలను నెమ్మదిగా బయట పెడుతుంది. తను ఆరేడేళ్ళ వయసులో చివరిసారిగా తండ్రిని చూసింది. తర్వాత అతనెప్పుడు ఫోన్ చేసి సారీ చెప్పినా స్పందించనే లేదు. పోనీలే మరచిపో అని తల్లి అన్నా కూడా వినలేదు. తను మాత్రం తప్పు చెయ్యలేదా. ఆ ప్రాణిని ఇన్నేళ్ళు, తన మృత్యువు వరకూ, బాధ నుంచి విముక్తి ఇవ్వలేకపోయిందే. మంచి మాట, లాలింపు, స్నేహ స్పర్శా ఏదీ ఇవ్వలేదు, తీసుకోలేదు. ఇద్దరూ నరకం అనుభవించారు. ఇప్పుడు అన్నిటికీ అవకాశాలు మూసుకుపోయాయి అతని చావుతో. ఎడిత్ వింటూ వున్నాడు. భుజాలు నిమురుతూ, జుత్తు సవరిస్తూ, శాంతి వచనాలు చెబుతూ బుజ్జగిస్తూ వున్నాడు. ఆమె మనసులో బరువు దిగి దీర్ఘ నిద్రలోకి జారుకుంటుంది. వెళ్ళే ముందు అడుగుతుంది, ఇలా చెయ్యాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చింది అని. నవ్వి వూరుకుంటాడు. ప్రేక్షకులకు చెప్పాలి కాబట్టి, అతన్ని భార్యా, కొడుకుల ను ఖననం చేసిన సిమెటరీ కి వెళ్ళడం చివరి షాట్ గా చూపిస్తాడు దర్శకుడు సంజీవ్ విగ్.

నాకు ఈ స్పర్శ గురించిన కాన్సెప్ట్ తెలుసు. మొదట్లోనే అనిపించింది ఇది వ్యాసానికీ, కథకీ లొంగే విషయం. సినిమాకు కష్టం అని. కానీ సంజీవి విగ్ నేను తప్పని నిరూపించాడు. విశాలమైన ఆ ఇంటిలో ఒక్కడే వుంటున్న ఎడిత్ దగ్గరికి ఒక్కొక్కరుగా (అపాయింట్మెంట్ ని బట్టి) రకరకాల మనుషులు వచ్చి స్వస్థత పొంది పోతుంటారు. ఆ స్పేస్ లోని వైశాల్యం, ఆ హృదయాల్లోని శూన్యం రెంటినీ juxtaposeచెయ్యడం తెలివైన పని. తర్వాత ఆ చుట్టుపక్కలా పచ్చదనం వుంటుంది, ఈ మానవ స్పర్శ అనేది కూడా అంతే ప్రకృతి సహజం, మనం దాన్ని ఇప్పుడు మరోలా చూస్తున్నప్పటికినీ అని చెప్పడానికి. సంజయ్ సూరి రాటుదేలిన నటుడు. మొత్తం సినిమా (20 నిముషాలు) స్టెడీగా చేసాడు. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఈషా చోప్రా గురించి. వచ్చినప్పుడు ఒకలా, ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒకలా, వ్యక్తిగత ప్రశ్న అడిగినప్పుడు మరోలా, థెరపిలో వున్నప్పుడు తన అసలు స్వరూపంలోకి వచ్చిన మనిషిలా చాలా వేరియేషన్స్ చూపించింది. శరీర స్పర్శ వలన శరీరంలో ఆక్సిటోసిన్ అనే కెమికల్ విడుదల అయ్యి మనిషి సంతోషంగా ఫీల్ అవుతాడు అన్న మొదట్లోని వాక్యం తప్ప ఎక్కడా “వ్యాసం” లేదు. సంభాషణలన్నీ చాలా సహజంగా వున్నాయి. ఇంకా ఈ చిత్రాన్ని ఒక లెవెల్ కు తీసుకెళ్ళినది ఆదిత్య దేవ్ సంగీతం. చాలా బాగుంది.

శషభిషలు కాసేపు పక్కన పెట్టి ఈ చిత్రాన్ని చూస్తే మనకు ఒక చిన్నదే అయినా ముఖ్యమైన ఇన్సైట్ ఇస్తుంది. యూట్యూబ్ లో వుంది. చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here