చదివింపులు

0
15

[శ్రీమతి పైడిమర్రి పద్మ రచించిన ‘చదివింపులు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“ఏ[/dropcap]మండీ!! వింటున్నారా! మనం వచ్చే వారం మా అన్నయ్య కూతురి పెళ్లికి వెళ్ళాలి కదా! ఏమి చదివిద్దాం?” అని అడిగింది జమున భర్త చంద్రని.

“మనం ఏమి చదివిస్తాం? పెళ్ళికూతురు అమెరికాలో M.S. చేసింది. పెళ్ళికొడుకు ఆస్ట్రేలియాలో M.B.A చేసాడు. ఇంత కన్నా పెద్ద చదువులు ఏమున్నాయి? నువ్వూ, నేను చదివించడానికి.” అన్నాడు చంద్ర నవ్వుతో.

“మరి అదే! ఇలాంటి కుళ్ళు జోకులు వెయ్యకండి, నాకు నవ్వు రావడం లేదు.” అంది జమున చిరాగ్గా.

“అయినా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే, వెళ్ళే ఫంక్షన్ని బట్టీ ఆలోచించాలి మనం. నీకు అంత తెలివితేటలు ఎక్కడ వున్నాయి? నేను ఆలోచించ వలసిందే!” అన్నాడు చంద్ర.

“అందుకేగా మిమ్మల్ని అడిగా! నాకు తెలుసు అండీ, మీ తెలివితేటలు గురించి. ఎప్పుడూ మీరేగా చెబుతారు ఏమి కొనాలో! ఈసారి గూడా సరి అయినది మీరే చెప్పండి. అసలే మా మేనకోడలి పెళ్లి.” అంది జమున.

‘ఏంటబ్బా! ఇంత ప్రశాంతంగా ఒప్పేసుకుంది దాని తెలివితేటలు గురించి. వాదనా, గొడవా, ఏమీ లేవు! ఆశ్చర్యంగా వుందే’ అని అనుకున్నాడే గానీ అది ‘తుఫాన్ ముందర ప్రశాంతత’ అని తెలుసు కోలేకపోయాడు చంద్ర.

“నీ మేనకోడలేగా! బంగారం దుద్దులు కొందాం. గొప్పగా వుంటుంది చెప్పుకోడానికి” అన్నాడు చంద్ర.

“అమ్మో!! బంగారమే! ఎంత మేనకోడలు అయితే మాత్రం! బంగారం రేటు ఎలా వుందో తెలిసే మాట్లాడుతున్నారా? ఒక్క గ్రాము గూడా కొనలేము. వద్దు” అంది జమున.

“పోనీ! దేవుని విగ్రహాలు వెండివి కొందామా? పూజలో పెట్టుకుంటారు” అన్నాడు చంద్ర.

“అయ్యో! మీకు అసలు ఏమీ తెలియదు. ఎవరికైనా దేవుడి విగ్రహాలు ఇస్తే, దేవుడు మన ఇంట్లోంచి వెళ్లిపోతాడుట. టివీలో స్వామీజీ చెప్పారు” అంది జమున.

“అవన్నీ నమ్మకూడదే! దేవుడికి కోపం వుండదు.” అన్నాడు చంద్ర.

“నాకు మీ మాటలుకన్నా, స్వామీజీ మాటలే ఎక్కువ. ఇంకేదన్నా చెప్పండి! ఇది తప్ప!” అంది జమున.

“మరి ఇంక ఏమున్నాయీ! ఆ.. పూజా సామగ్రి ఇద్దాం. ఇవి ఇస్తే దేవుడు ఎక్కడికీ వెళ్లడుగా! సరేనా?” అన్నాడు చంద్ర.

“ఆలోచన బానే వుంది! కానీ! మొన్నా మధ్యన మీ చెల్లి పూజలో వాడుకోవడానికి ‘గంట’ లేదు వదినా కొనిపెట్టావా? అంది. సరే కదా! అని కొనిచ్చా. తరువాత ఏమందో తెలుసా? ‘వదినా! ఇది కొన్నావా? కొట్టుకొచ్చావా?’ అంది. ఒళ్ళు మండింది నాకు. అదేమిటి? అలా అడిగావూ?” అన్నా కోపంగా.

“ఆ.. గంట తిరగేసి వుంటే కొట్టుకొచ్చినట్టు, మాములుగా వుంటే కొన్నట్టు. ఇది అట్టపెట్టెలో తిరగేసి వుంది. అందుకే అలా అడిగా” అంది నవ్వుతూ.

“ఇది ఎవరు చెప్పారు దానికి.” అన్నాడు చంద్ర.

“త్రివిక్రమ్ సినిమాలో చెప్పాడుట. పెళ్లి వాళ్ళు గూడా అలాగే ఆ సినిమా చూసి గంట మనం ఎక్కడో కొట్టుకొచ్చాం అనుకుంటే మన పరువేం కాను? వద్దు లెండి.” అంది జమున.

‘ఇదేంటీ! ఏది చెప్పినా ఏదో ఒకటి వంక పెడుతోంది?’ అనుకున్నాడు చంద్ర.’

“ఇద్దరికీ వాచీలు కొందాం. ఇప్పుడు జంట వాచీలు వస్తున్నాయి కదా! ఇద్దరూ ఒకలాంటివే పెట్టుకుంటారు. బాగుంటాయి. సరేనా?” అన్నాడు చంద్ర.

“ఏమి బాగు, నా మొహం! ఇప్పుడు వాచీల్లో టైం చూసుకునే అంత టైం వాళ్ళకెక్కడది. అంతా సెల్లు లోనే.” అంది జమున ఆ సలహా కొట్టి పారేస్తూ.

చంద్రానికి ఒళ్ళు మండిపోయింది. “అన్నిటికీ వంకలు పెడతావు ఏంటి?” అని గట్టిగా అరిచాడు జమున మీద.

“సరి అయింది ఒక్కటీ చెప్పలేదుగాని, నామీద అరుస్తారు ఏమిటీ?” అని చిరాకు పడింది జమున.

‘ఇలాంటి అప్పుడే మనం సహనంగా వుండాలి. మన తెలివి తేటలకే పరీక్షలా వుంది.’ అనుకున్నాడు చంద్ర.

“సరే సరే! మంచి గంటల గడియారం ఇద్దాం. గంట, గంటకీ, గంటలు కొడుతుంది. మా చిన్నప్పుడు మా ఇంట్లో వుండేది. భలే బాగుంటుంది.” అన్నాడు చంద్ర.

“ఇద్దరూ ఉద్యోగాలకు పొద్దున్న పోతే, రాత్రి వస్తారు. ఇంక ఆ గంటలు ఎవరు వింటారు? అలసిపోయి వచ్చాకా ఆ గంటల శబ్దం వింటే తలనొప్పి వస్తుంది. మీ చిన్నప్పటివి ఇప్పుడు చెప్పకండి.” అంది జమున.

“ఇదంతా ఎందుకూ? డబ్బులు ఇచ్చేద్దాం. వాళ్ళకి నచ్చినది వాళ్ళు కొనుక్కుంటారు. చూసావా! మరి అదీ తెలివి అంటే! సమస్య తీరిపోయిందిగా?” అన్నాడు చంద్ర గర్వంగా.

“ఏమి తీరింది?, పెళ్లి అంటేనే బోలెడు ఖర్చులు. ఎంత డబ్బు వున్నా సరిపోదు. మనం చదివించిన డబ్బులు గూడా ఏదో ఖర్చులో వాడేసుకుంటారు. మన గుర్తుగా ఏముంటుంది? వద్దు” అంది జమున.

“ఓరి నాయనో! నావల్ల కాదు. నన్ను వదిలేయి. బుర్ర వేడెక్కిపోయింది.” అన్నాడు చంద్ర.

“ఎప్పుడూ నాకన్నా తెలివితేటలు మీకే ఎక్కువని గొప్పలు పోతారు, సరి అయ్యింది ఒక్కటీ చెప్పలేక పోతున్నారు.” అని దెప్పింది జమున.

“అబ్బా!! నీతో భలే కష్టమే! బట్టలు పెట్టేద్దాం. కొంచం పెద్దరికంగా వుంటుంది గూడా! సరేనా?” అన్నాడు చంద్ర.

“బట్టలు అయితే అసలే వద్దు. రంగు నచ్చలేదు. అంచు బాలేదు. ఇలాంటిది నాదగ్గర ఇంతకుముందే వుంది. మళ్ళీ ఏమీ చేసుకోవాలి! అని చాలా వంకలు పెడతారు. పైగా బిల్లు వుందా? మార్చుకుంటాం అంటారు.” అంది జమున.

“బిల్లు ఇచ్చేద్దాం!” మనకి ఎందుకు అది. నచ్చకపోతే మార్చుకుంటారు” అన్నాడు చంద్ర.

“మరి అదే! తెలివితేటలు ఇంతేనా? ఎవరికైనా బట్టలు పెట్టేటప్పుడు ఏమీ చేస్తాం? రేట్ వున్న టాగ్ తీసేస్తాం కదా! ఎందుకూ? ఖరీదు ఎంతో తెలియకూడదని. ఇప్పుడు అడిగారని బిల్లు ఇచ్చామనుకోండి, ఇంతేనా! ఏదో ఆఫర్‌లో కొనేసినట్టు వున్నారు అని మూతి ముఫ్పై వంకర్లు తిప్పుతారు” అంది జమున.

‘ఇందులో అంత వుందా?’ అనుకున్నాడు చంద్ర.

“పోనీ! విదేశాల నుంచీ వచ్చే పూలతో పెద్ద బొకే కట్టిద్దాం. చాలా బాగుంటుంది. ఖరీదు గూడా ఎక్కువే. పెద్ద పెద్ద వాళ్ళు ఇవే ఇస్తో వుంటారు. సరేనా!” అన్నాడు చంద్ర.

“మతి వుండే మాట్లాడుతున్నారా? ఎంత ఖరీదు వున్నా, నా మేనకోడలికి బొకే ఏంటీ? బొకే ఇచ్చి బానే తినేసి వెళ్లిపోయారు అనుకుంటారు. సరిగ్గా ఆలోచించండీ” అంది జమున.

“ఇప్పటికే నా బుర్ర వేడెక్కిపోయింది. ఇంక నా వల్ల కాదు! ఇదే నా ఆఖరి సలహ. దేవుడి ఫోటో ఫ్రేమ్ ఇచ్చేద్దాం.” అని లేవబోయాడు చంద్ర.

“ఏమిటి? లేస్తున్నారు? కూర్చోండి. ఇదేమి సలహా అండి బాబూ! ఈ రోజుల్లో ఇళ్ళల్లో మేకులు కొట్టి ఫోటో ఫ్రేమ్స్ ఎవరు పెడుతున్నారు? అద్దె ఇల్లు అయితే, ఇంటి వాళ్ళు పెట్టనివ్వరు. సొంత ఇల్లు అయితే మనమే పెట్టం. పైగా! అవి చాలా బరువు. వాటిని కవర్లో పెట్టుకుని పెళ్లిలో చాంతాడు అంత లైన్లో నుంచుంటే చెయ్యి లాగేస్తుంది. లైన్ పెద్దది వుంది కదా! అని భోజనానికి వెళ్ళామనుకోండి, ఒక చేతిలో ఈ కవరూ, మరో చేతిలో ప్లేటు పట్టుకుని భోజనం చెయ్యాలంటే విరక్తి వస్తోంది.” అంది జమున.

“అసలు ఇది సమస్యా? ఎక్కడో అక్కడ కింద ఓ పక్కగా పెట్టి తింటాము. బుర్ర వాడు” అన్నాడు చంద్ర చిరాకుగా.

“పెద్ద బుర్ర మీకే వుంది మరి! దేవుడు ఫోటోలు కింద పెట్టకూడదు” అంది జమున.

‘ఇప్పటిదాకా నాకు తెలియలా! ఫోటో ఫ్రేమ్స్ వల్ల ఇన్ని ఇబ్బందులా,’ అని ఆశ్చర్య పోయాడు చంద్ర.

“మీకు తెలియదు గానీ! మొన్న మన పక్కింటి వాళ్ల గృహప్రవేశానికి ఎక్కువమంది దేవుడి ఫోటోలు ఇచ్చేసారు. అన్నీ ఏమి చెయ్యాలో అర్ధం కాక, పాపం వాళ్ళు ఎవరో చెప్పారని, గుడిలో పెడదామని వెళ్ళారు. అంతే! పంతులుగారు ‘అందరికీ ఇదో అలవాటు ఐపోయింది. ఫోటోలు, పుస్తకాలు తెచ్చి ఇక్కడ పడేస్తున్నార’ని తిట్టి పంపేశారు. సరేలే నదిలో వేద్దామని వెడితే, గాజు ముక్కలు, మేకులు గుచ్చుకుని చేపలు చచ్చి పోతాయని అక్కడి వాళ్ళు గసిరి పంపేసారుట.” అని ఆగింది జమున.

“మరి ఏంచేశారు అవన్నీ?” అన్నాడు చంద్ర ఆసక్తిగా.

“ఏంచేస్తారు! ఎవరు ఫంక్షన్‌కి పిలుస్తారా! అని ఎదురు చూస్తున్నారు. ఎందుకో అర్దమయ్యిందిగా” అంది నవ్వుతూ.

“ఒప్పుకుంటున్నా! ఇంక నావల్ల కాదు. నువ్వే చెప్పు! ఏమీ యిద్దామో” అన్నాడు చంద్ర.

“సరే, అయితే! హాయిగా ఒక అరడజను మంచి మొక్కలు ఆన్‌లైన్‌లో పంపేద్దాం వాళ్ళ ఇంటికి. ఇద్దరికీ మోత బరువు తగ్గుతుంది. పర్యావరణానికీ మంచిది, మొక్కలు యిస్తే. ఏమంటారు?” అంది జమున.

“నువ్వు ముందే నిర్ణయించేసుకుని ఇంత సేపూ నన్నుఎందుకు అడిగావు?” అన్నాడు చంద్ర ఆశ్చర్యంగా.

“నాకు ఏమీ తెలియదు అన్నారుగా! అందుకే ఇదంతా.” అంది జమున.

“నేను మామూలుగా అన్నానే!” అన్నాడు చంద్ర.

“కానీ నేను సీరియస్‌గా తీసుకున్నా!” అంది జమున నవ్వుతో.

ఏమనాలో అర్థం కాక అలాగే వుండిపోయాడు చంద్ర.

“ఇంక బుర్రలకి పని ఆపి తయారై వెళ్లి ఓ వెయ్యి నూట పదహర్ల ఆశీర్వచనాలు చదివించేసి, హాయిగా కడుపునిండా తినేసి వచ్చేద్దాం. ఏమంటారు?” అని అంది జమున.

“అనడానికి ఏముందీ? అంతేగా!” అన్న చంద్ర మాటకి హాయిగా నవ్వుకున్నారు ఇద్దరూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here