యువభారతి వారి ‘చైతన్య లహరి’ – పరిచయం

0
11

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువ భారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశ్యంతో ఇకపై ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి  వరకూ సాగుతుంది.]

చైతన్య లహరి

[dropcap]“చు[/dropcap]ట్టూరా ఆవరించుకుని ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చునే కంటే ప్రయత్నించి ఎంతచిన్న దీపాన్నైనా వెలిగించడం మంచిది” అన్న సూక్తి యువభారతి సాహితీ సాంస్కృతిక సంస్థకు ఊపిరి.  యువభారతి ప్రయత్నం ఉడుతాభక్తి.

ప్రాచీనాంధ్ర సాహిత్యం గురించి లబ్దప్రతిష్ఠులైన సాహితీవేత్తలతో ఉపన్యాస మంజరీ కార్యక్రమాలను ఏర్పాటు చేయడమే కాక, వారి ఉపన్యాస సారాంశాన్ని ఒక పుస్తకరూపంలో ప్రచురించి, రసజ్ఞులైన భాషాభిమానులకు అందజేయడమే – యువభారతి నిర్వహించిన “లహరి” కార్యక్రమాల లక్ష్యం. ఈ లహరీ కార్యక్రమాలలో మొట్టమొదటిది “కావ్య లహరి” కాగా, రెండవది ఈ “చైతన్య లహరి”.

మానవుడిని ఉన్నతపథాలవైపు పయనించేందుకు సంసిద్ధుణ్ణి చేయడానికి తమ ఆలోచనలను సారించి, కృతార్థులైన కవితామూర్తుల కృషి యొక్క సమగ్ర అవగాహన అవసరమని యువభారతి భావన.

ద్రష్టలై, కవితా స్రష్టలై, తమ తరాలవారికే కాక రానున్న తరాలకు సైతం వెలుగుబాటను చూపిన దివ్యజ్యోతులు వీరు. సాహిత్యానికే కాక, సమాజానికి కూడా ప్రగతి శీలాన్ని ప్రసాదించి, యుగపురుషుల్లా వెలుగొందే ప్రజ్ఞామూర్తుల సాహిత్య సమాలోచనం సమాజ కర్తవ్యం. ఈ ఆశయంతోనే ఆంధ్ర సాహితీ ప్రగతికి సారథ్యం వహించి తమ ప్రతిభా పాటవాలతో తరతరాలను తీర్చిదిద్దిన ప్రజ్ఞామూర్తుల కవితా చైతన్యాన్ని యువభారతి నవమ వార్షికోత్సవాల సందర్భంగా సాహితీప్రియులకు అందించింది – యువభారతి.

మార్గదేశీ కవితా స్రవంతులకు సంగమ స్థానమై సాటిలేని సాహిత్యాచార్య పీఠాన్ని అధిరోహించిన “ఉభయకవి మిత్ర”, “కవిబ్రహ్మ” తిక్కన సోమయాజి  గురించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు;

ద్విపదపథంలో దివ్యయానం సాగించిన “దేశికవితాసనాథుడు” పాల్కురికి సోమనాథుని గురించి శ్రీ గడియారం రామకృష్ణ శర్మ గారు;

ప్రబంధ భువన విజయంలో “సాహితీ సమరాంగణ సార్వభౌములు”  శ్రీకృష్ణ దేవరాయల గురించి ‘సరస్వతీపుత్ర’ శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు;

నిత్యం జోతలు పెట్టుకోదగిన నీతులతో “విశ్వదాభిరామ వినురవేమ” గా వినుతికెక్కిన వేమన  గురించి శ్రీ మరుపూరు కోదండరామరెడ్డి గారు;

క్రొత్త పాటల మేలు కలయిక తో ఆంద్ర భారతికి క్రొత్త గొంతుక నిచ్చిన గురజాడ గురించి డా. కొత్తపల్లి వీరభద్రరావు గారు;

ఇచ్చిన ఉపన్యాస మంజరికి కల్పించిన గ్రంథ రూపమే – ఈ “చైతన్య లహరి”.

మహాభారతం నుండి ముత్యాల సరాల వరకు సాహిత్య చరిత్రలో ఉజ్వలంగా మెరిసిన ద్రువతారల ప్రతిభా ప్రభా లహరి – ఈ “చైతన్య లహరి”.

క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ  పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://drive.google.com/file/d/1z_R-siMsEf3N4CMfFRtvCxlg4hM4ypTs/view?ts=62fd0e1f

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగానే గ్రోలవచ్చు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here