చైతన్యవంతమైన ఆత్మ

0
7

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘చైతన్యవంతమైన ఆత్మ’ అనే రచనని అందిస్తున్నాము.]

అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్।
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి॥
(భగవద్గీత, 2వ అధ్యాయం, సాంఖ్య యోగం, 17వ శ్లోకం)

[dropcap]ఓ[/dropcap] అర్జునా, ఆత్మ అనేది శరీరమంతా వ్యాపించి ఉన్నది. దీనిని ఏ విధంగా కూడా నాశనం చేయలేనిదిగా తెలుసుకో. ఈ విధంగా నశించని ఆత్మ నాశనానికి ఎవరూ కారణం కాలేరు అన్న సంగతి తెలుసుకో అని పై శ్లోకం భావం.

ఆత్మ చైతన్యవంతమైనది అనగా చైతన్యాన్ని కలిగి ఉంటుంది. శరీరం స్పృహ లేని, అవ్యక్త పదార్థంతో తయారైంది. అది ఎప్పటికీ జడంగా వుంటుంది. జడమైన శరీరంలో ఆత్మ నివసించడం ద్వారా శరీరానికి కూడా చైతన్య గుణాన్ని అందజేస్తుంది. అప్పుడు శరీరం చైతన్యవంతమై తన విధులను నెరవేరుస్తుంది.  ఆత్మ తన చైతన్యాన్ని సృష్టిలో ప్రతిచోటా వ్యాపింపజేయడం ద్వారా శరీరంలో కూడా వ్యాపించి ఉంటుంది అని ఆత్మ తత్వాన్ని శ్రీ కృష్ణ భగవానుడు అద్భుతంగా తెలియజేసాడు.

జడమైన ఈ శరీరము అన్నపానాదులతో ఏర్పడుతోంది. అన్నముతోనే వృద్ధిచెంది నిలుస్తున్నది. అన్నము  లేనిచో అది త్వరగా కృంగి కృశించిపోయి, నశించిపోతుంది. త్వక్, చర్మం, మాంసము, రక్తము, ఎముకలు, మలముతో కూడుకొనిన శరీరము క్షయమగుట నిశ్చితము. కల్మష పూరితము, అశాశ్వతమైన శరీరమునకు, నిత్యనిర్మలమైన ఆత్మ అయే అర్హత లేదు అని.

‘అన్నాధ్దేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి’ అని శ్రుతి వచనం (అన్నము తినుట వలనే సమస్త ప్రాణులు జన్మిస్తున్నవి దాని కారణముగానే) వివేక చూడామణిలో శ్రీ శంకర భగవత్పాదులు వివరించారు.

బ్రహ్మకుమారీల సిద్ధాంతం ప్రకారం ఆత్మల సంఖ్య పరిమితమైనది మరియు అన్ని ఆత్మలు ప్రత్యేకమైనవి మరియు శాశ్వతమైనవి. అవి ఎప్పుడూ సృష్టించబడలేదు మరియు ఎప్పటికీ నాశనం చేయబడవు. అలాగే, ఆత్మలు కంటితో కనిపించవు కానీ వాటి ఉనికిని అనుభవించవచ్చు. ఆత్మకు లింగం లేదు. ఆత్మ యొక్క అంతర్గత స్వభావం ప్రేమ, శాంతి, ఆనందం, సత్యం, ఆనందం మరియు స్వచ్ఛత. అందువల్ల, ఆత్మలు ఎల్లప్పుడూ ఈ లక్షణాల అనుభవాన్ని కోరుకుంటాయి.

ప్రశ్నోపనిషత్తులో ప్రాణం ఆత్మ నుంచే అంటే బ్రహ్మము నుండే ఉద్భవించినట్లుగా చెప్పబడింది. ప్రాణానికీ ఆత్మకూ గల సంబంధం మనిషికీ నీడకూ ఉండే సంబంధం వంటిదని అంటోంది. అంటే నీడను మనిషి నుంచి విడదీయలేం. అలాగే ప్రాణానికీ ఆత్మకూ ఉండే సంబంధం కూడా విడదీయలేనిదే అని చెప్పవచ్చు.

కఠోపనిషత్‌లో ఆత్మతత్వం గురించి చక్కని అంశాలు పొందుపరచబడి వున్నాయి. ఆత్మకు జనన మరణాలు లేవు. దేని నుండి ఆత్మ ఉద్భవించదు. ఆత్మ నుండి ఏది ఉద్బవించదు. జన్మ లేనిది.. శాశ్వతమైనది అయిన ఈ ఆత్మ తన దేహము హత్య గావింపబడునప్పుడు తాను చంపబడుట లేదు. ఆత్మ అసంగ స్వభావము కలది. ఆత్మ తత్వము అణువుకంటే అణువు గాను, మహత్తుకంటే మహత్తుగాను ప్రతి జీవి హృదయ కుహరము నందు నివసించుచున్నది. ఆత్మ కూర్చుని వుండే దూరముగా వెళుతుంది. పడుకునే సర్వత్ర సంచరిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here