చలించకు, ప్రలోభ తరంగాలు తాకుతున్నప్పుడు…

0
9

[dropcap]షై[/dropcap]నీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ కంపెనీలో సీనియర్ అనలిస్టుగా అప్‍గ్రేడేషన్ అందుకుని చెన్నై మెయిన్ బ్రాంచీ నుండి హైద్రాబాదు వచ్చిన స్నిగ్థ డిప్యుటీ ప్రోజెక్టు మేనేజర్ మందాకిని క్యూబికల్ చేంబర్‌కి వచ్చి పలకరింపుగా ‘హాయ్’ అంటూ చేతులు కలిపి- “అలా నడచుకుంటూ క్రిందకు వెళ్ళి ఫ్రెష్ అరోమాతో కాఫీ తాగొద్దామా!” అని అడిగింది.

అడిగిందే తడవుగా మందాకిని సీటులోనుండి లేచి నిల్చుంది. “ఫైన్! గోల్డన్ అవర్‌లో వచ్చినట్టున్నావు. నాకూ అలానే అనిపిస్తుంది. రా!” అంటూ తన చేంబర్‍కి కాఫీ పంపనవసరం లేదని పీ.ఏ.కి చెప్పి బయటకు నడచింది. వాళ్ళ మధ్య ముందే పరిచయం ఉంది, కాలేజీ రోజులనుంచి – వాళ్ళిద్దరూ అలా వామప్ కోసం నడుస్తూ ప్యాంట్రీలోకి వచ్చి బల్ల ముందు కూర్చున్నారు. ఇద్దరూ సీనియర్ గ్రేడ్ ఆఫీసర్లు. ఇద్దరూ యవ్వనపు మిసమిసలతో ఊగుతూ తుళ్ళే సింగల్స్. విదేశాలలో ముఖ్యంగా లాటిన్ అమెరికాలో అసైన్మెంటు చేసి తగినంత మేర ఎక్స్‌పోజర్ స్వంతం చేసుకుని యిండియా చేరిన యాంబీటియస్ సుందరాంగులు. భామినిలు. కామినిలు, నవరస మోహనాంగులు.

ఇద్దరూ అలా కుర్చీలలో ఆసీనులయారో లేదో ప్యాంట్రీ స్టాఫ్ పరుగున వచ్చి- “గుడ్ మోర్నింగ్ మేడమ్. చెప్పండి మేడమ్ యేం కావాలో?” అని వినయంగా అడిగారు. స్నిగ్థ వాళ్ళను ప్రక్కకు తప్పుకోమని చెప్పి అటు చూడమని మందాకినికి చూపుతో సైగ  చేసింది. పొడవుగా ట్రిమ్‌గా మ్యాస్కులైన్ షేప్‌తో పొంగారే రూపంతో అల్లంత దూరాన కూర్చున్న యువకుణ్ణి చూసి మందాకిని సాలోచనగా తలూపింది. మిగతాది తర్వాత చెప్తానంటూ రెండు కప్పుల కాఫీకి ఆర్డర్ యిచ్చి ఆ యువకుడి వేపు సూటిగా చూపులు సారించి అడిగింది – ఎలాగున్నాడని. “ఉఁ! మ్యాన్లీ హ్యాండ్‌సమ్. కళైన ముఖవర్ఛస్సుతో కండలు తీరిగిన సిక్స్ ప్యాక్ బాడీతో బాగున్నాడు.”

స్నిగ్థ నవ్వి కాఫీ కప్పుని ముందుకు తోసి అంది – “నేను చెప్పబోయే మేటర్ అది కాదు మందాకినీ!”

మరేమిటన్నట్టు చూసిందామె.

“పాముకి ఒళ్ళంతా విషం అన్నట్టు, విశుకి ఒళ్ళంతా టెక్కే! ఎవరి ముందూ యెన్నటికీ తలవంచని అస్ఖలిత బ్రహ్మచారినని బెలూనంత పొగరు. ప్రవరాఖ్యుడిలా తలబిరుసు.”

మందాకిని బ్రాడ్ స్మైల్ చేసింది. “చెప్పుడు మాటలు విని అడ్వర్స్ నిర్ణయానికి రాకు స్నిగ్థా! ఆడాళ్ళకు అసూయెక్కువ. అనుకున్నది అందుకోలేకపోతే యిగో దెబ్బతిని కుడితిలో పడ్డ యెలుకలా పెట్రేగిపోతారు.”

స్నిగ్థ ఆ మాటకు అనంగీకారంగా తల అడ్డంగా ఆడించింది. మందాకిని మళ్ళీ అంది “ఓకే – అలాగే అనుకుందాం. నీ వద్ద అతడెప్పుడైనా అలా తలబిరుసుతో బిహేప్ చేసాడా?” ఆమె  రూపంలోని యెత్తు పళ్ళాలను దగ్గరగా పరీక్షగా చూస్తూ మందాకిని అడిగింది.

“నా వద్దనే కాదు. అందరివద్దా అలానే తలబిరుసు చూపిస్తుంటాడు. అంతేనా – వివాహ పందిరి వాకిట నిల్చున్నంత వరకూ తన బ్రహ్మచార్యానికి యెవరూ భంగం కలిగించలేరని మేల్ స్టాఫ్ వద్ద డాంబికాలు పలుకుతుంటాడు.”

మందాకిని కళ్ళు పెద్దవి చేసి చూసింది- “అందరి వద్దా లేక కొందరి వద్దా అన్నది కాదు. నీ వద్ద అలా యెప్పుడైనా రిటార్ట్ చేసాడా?”

‘ఊ’ అందామె.

“నీ వద్ద కూడానా? ఏదీ ఓసారి వివరించి చెప్దూ!”

స్నిగ్థ కాసేపాగి యెగిసి పడుతూన్ని అహాన్ని అదుపులో పెట్టుకుంటూ చెప్పసాగింది- “ఓసారి యేదో గ్రాఫిక్ పిగర్సు వ్రాసుకుంటున్నప్పుడు చేతిలోని కలర్స్ పెన్ క్రింద పడి పోయింది. అది సరిగ్గా నా బల్ల ముందు పడిపోయింది. అటూ యిటూ చూస్తే అక్కడెవ్వరూ అటెండర్ కనిపించలేదు. నాకేమో కదల బుధ్ధి కాలేదు. సరిగ్గా అప్పుడు అటు వెళ్తూన్న విశు కనిపించాడు. ‘ఇఫ్ యు డోంట్ మైండ్, క్రిందపడ్డ కలర్స్ పెన్ను తీసిస్తారా?’ అని అడిగాను. అప్పుడతడేమి చేసాడో తెలుసా!”

“ఏం చేసాడు? అదే అదననుకొని మిస్‌చీఫ్ చేసాడా!”

దానికి స్నిగ్థ “అయ్యో! పూర్తిగా వినవు కదా!” అంటూ నెత్తిపైన చేయి పెట్టుకుంది.

“ఘోరమే చేసాడన్న మాట!”

“అయ్యో రామ! నీకాపాటి ఓపిక లేకపోతే యెలా మందాకినీ? పూర్తిగా విను. ఒక్క నిమిషం లోపల సర్రున అక్కణ్ణించి వెళ్ళిపోయాడు. నాకు బుర్ర దిమ్మెక్కిపోయింది. కాస్తంత వంగి కలర్స్ పేనా అందివ్వకుండా యెందుకతడు అలా గరుడ వేగంతో వెళ్ళిపోయాడా అని ఆశ్చర్యపోతున్నప్పుడు ప్యాంట్రీలో పని చేస్తూన్న రమణమ్మను పిలుచుకు వచ్చి ఆవిడ సహాయంతో ఆ రంగుల పేనాను నాకిప్పించాడు. నాకు ఒళ్ళు మండిపోయిందనుకో – రమణమ్మ అలా వెళ్ళిపోయిన తరవాత విశుని నిలదీసాను; ‘పేనా ఒక టన్ను బరువుగా ఉంది కదూ – ఒక లేడీ సహాయంతో యిప్పించావు?’ అని యెద్దేవా చేసాను.. దానికతడు కారణం ఉందంటూ కదలబోయాడు. నేను వదల్లేదు. కారణం చెప్పి వెళ్ళమన్నాను, గొంతు హెచ్చిస్తూ – దానికతడేమన్నాడో తెలుసా! ‘అన్యథా భావింప వలదు. అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మీ చేతినుండి నేల రాలిన రంగుల ఘంటాన్ని అందుకోవడానికి నేను క్రిందకు వంగాలా! అప్పుడే మవుతుందో ఆలోచించండి. సూర్యరశ్మి వంటి నా చూపు మొదట మీ పాదాల పైన పడుతుంది. ఆ తరవాత అలా అలా యెగబ్రాకి మీ మోకాళ్ళ వరకూ సాగుతూంది. అంతటితో ఊరుకుంటుందా? ఇంకేదో వెతుకుతుంది. యవ్వన దాహం కదండీ – అప్పుడు అదుపు తప్పి నా కుడి చేయి మీ నునుపైన తొడపైన వాలుతుంది. అప్పుడు మీకేమవుతుందో యిప్పుడే యిక్కణ్ణుంచే చెప్పగలను. అప్పుడు మీ యవ్వన శరీరమంతటా జ్వాలలు వ్యాపిస్తాయి. కోర్కెల మంటల్లో సల సలా మాడిపోతారు. అంతటి యిబ్భంది మీ కెందుకని రమణమ్మగారిని పిలిచి మీ రంగుల పైనాను మీకప్పగించాను’ అతగాడి అహంకారపు ధిక్కార స్వరం విని ఆవేశం కట్టలు త్రెంచుకుంది. టిట్ ఫర్ టేట్‌గా అడిగాను – ‘జ్వాలలు మాకు మాత్రమే యెగిసి పడతాయి. మీలో జ్వాలలు రేగవు. కోర్కెలు జ్వలించవు. అంతేకదూ!’ దానికతడు చెదరకుండా బెదరకుండా యెటువంటి బదులిచ్చాడో తెలుసా! విను చెప్తాను. ‘నాకలా యెన్నటికీ జరగదు స్నిగ్థా! ఎందుకో తెలుసా? నేను శుధ్ధమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను. ప్రతి రోజూ ధ్యాన నిమగ్నుడనై ఆధ్యాత్మిక ఆసనాలు చేస్తుంటాను. ఆ అభ్యసన వల్ల నన్ను నేను అదుపులో ఉంచుకుంటాను. ఎదుటివారిని అదుపు తప్పనీయకుండా చూసుకుంటాను’ అని సరసరా వెళ్ళిపోయాడు.” అంతటితో స్నిగ్థ చెప్పడం ఆపి మందాకిని వేపు తదేకంగా చూస్తూండిపోయింది. కొన్ని క్షణాల తరవాత మందాకిని నోరు విప్పింది- “నో మ్యాన్ హేజ్ ఎవర్ బోర్న్ టు సేటిస్ ఫై ఎ ఉమన్ అంటారు. మరొక మెట్టు ముందుకు వెళ్ళి దానిని మనకనుకూలంగా తిరగ వ్రాస్తాను” అంది. అదెలా అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది స్నిగ్థ. “చెప్తాను – నో మ్యాన్ హేజ్ ఎవర్ బోర్న్ టు రెసిస్ట్ ఎ ఉమన్” స్నిగ్థ నవ్వింది.

“గుడ్ మందాకినీ! నువ్వు గాని అందులో సక్సీడ్ ఐతే నేను నీకు మేలిమి ముత్యాల మాలొకటి బహుకరిస్తాను.”

“అది తర్వాతి మాట. ముందు నేనడిగింది చెయ్యి. హచ్చారెమ్ వింగుకి వెళ్ళి హయ్యర్ గ్రేడేషన్ ప్రమోషన్‌కి అర్హులైన క్యాండిడేట్స్ లిస్టులో విశు పేరుందో లేదో రహస్యంగా కనుక్కొని చెప్పు. మిగతాది నేను చూసుకుంటాను.” స్నిగ్థ నవ్వుతూ కవ్వింపుగా మందాకినితో చూపులు కలుపుతూ మరొకసారి కాఫీల కోసం ఆర్డర్ చేసింది. ఇక ఆమె సగానికి పైగా కక్ష సాదించినట్లే – విశు తిన్నగా వెళ్ళి బంకమన్ను బురదలో బోర్లా పడ్డట్టే – ఎంతటి వారలైనా కాంతల ముందు దాసులే కదా!

***

మూడు రోజులు దాటిన తరవాత మందాకిని విశుకి కబురందించింది తన డూప్లెక్స్ అపార్టుమెంటుకి రమ్మనమని. అతడికి సంబంధిత అప్‌గ్రేడేషన్ ఫైలు గురించి పర్సనల్‍గా మాట్లాడాలని. వార్త అందుకున్న వెంటనే విశుకి పట్టున అనుమానం తగిలింది; తన గురించి స్నిగ్థ కసి కసిగా లేనిపోనివన్నా జోడించి తనకు వ్యతిరేకంగా చెప్పి ఉంటుందని; క్వరీలు లేవదీసుంటుదని. దాని ఫలితమే తనకు వచ్చిన అపరాహ్నపు ఆహ్వానమని తెలుస్తూనే ఉంది. ఏది యేమైతేనేమి; సారంగధరకు యేర్పడ్డ గతి తనకు పట్టకుండా తెలివిగా చూసుకోవాలి – పామూ చావకూడదు కర్రా విరక్కూడదన్న రీతినన్నమాట. ఏది అడిగినా యెందుకోసం అడుగుతుందన్నదానికోసం తలపోయకుండా ఔనంటూనే తలూపాలి. తన ప్రమోషన్ ఫైల్ క్లియర్ చేసుకోవాలి.

అతడు వచ్చి డోర్ బెల్ ప్లగ్ అదిమేలోపల మందాకిని పల్స్ పాయింట్సు చుట్టూ ముఖ్యంగా మణికట్టు చుట్టూ రెండు మోకాళ్ళ చుట్టూ చెవి చుట్టు ప్రక్కలా – అలా ప్రెంచ్ జాస్మిన్ సెంట్ స్ప్రే దట్టంగా చల్లుకుంది. విశు తలుపు తట్టి లోపలకు వచ్చేటప్పటికి గది అంతా జాస్మిన్ అత్తరుతో ఘుమఘుమ లాడిపోతూంది. అతడు కూనిరాగం తీస్తూ “గుడ్ ఈవ్నింగ్ మేడమ్!”అని అభివాదం చేసాడు. మిక్కిలి అలర్ట్‌గా ఉన్న మందాకిని అతడు ఆలపిస్తూన్న కూనిరాగాన్ని విడిచి పెట్టలేదు. “కుషీగా పాడుతున్నట్టున్నారు. అదేమి పాటో తెలుసుకోవచ్చా!” ఆమెలో ట్రాన్పపరెంటు వలువల్లో విరాజిల్లుతూన్న శరీర సొగసుల్ని ఓపారి అలవోకగా చూసి అది పాట కాదని కీర్తనని బదులిచ్చాడు.

“మేం తెలుసు కోకూడదా!” అని అడిగిందామె. ఎందుకు చెప్పనూ అంటూ బదులిచ్చాడతడు- ‘ఏ తీరుగ నను దయచూ చెదవో ఇన వంశోత్తమ రామా’ అన్న రామదాసు  కీర్తనను తను కూనిరాగంలో పాడుతున్నానని. సంగీతాభిమానం యెక్కువేనన్న మాట అంటూ ఏవో క్వరీలు అడిగి ప్రమోషన్ ఫైల్ క్లియర్ చేసి దానిని అలా మూలన పెడ్తూ ఉన్నపళంగా “అబ్బా!” అని కూర్చుండిపోయింది. “ఏమైంది మేడమ్” అంటూ అటు పరుగెత్తాడు విశు.

“మరేం లేదు విశూ. సాయంత్రం కారులోనుండి దిగుతున్నప్పుడు మోకాలు దేనికో ఒరసుకున్నట్లుంది. కొంచం క్రీమ్ పూస్తావా విశూ!” అని సిల్కీ గాగ్రాను పైకి లాగింది. అతడు యెటు వంటి తడబాటుకీ లోనుకాకుండా ఆమె మోకాలిపైన ఆయింట్మెంటు తడిమాడు. తడమడం అయింతర్వాత “బాగుంది” అందామె కవ్వింపుగా చూస్తూ. “నాకు మరి కొంత స్వేచ్ఛగాని యిచ్చారంటే ఇంకా బాగుంటుంది”.

“అదెలా!” అని గోముగా విరహగీతం ఆలాపిస్తూ అంది; మనసున పర్వాలేదు నరుడు రససిధ్ధి తెలిసిన వాడే అనుకుంటూ.

“చెప్పేదా లేక చేసి చూపించేదా!” తన అంగసౌష్టవానికి ఫ్లాటయిపోతున్నాడని లోలోన మురిసి పోతూ -”రెండూనూ-” అందామె,  అతడికి మరింత దగ్గరకు వస్తూ.

అప్పుడు విశు కాస్తంత తొలగుతూ అన్నాడు- “పెద్దనామాత్యుడు యెట్టెదుట నిల్చుని యేదో గుర్తు చేస్తున్నట్లున్నాడు.”

ఏమిటో అది-అన్నట్టు భుజాలెగరేసిందామె.

“గుర్తున్నంత మేర చెప్తాను. ‘ఆహ్లాదకరమైన పరిసరమూ, యిష్టమైన స్త్రీ తెచ్చిచ్చే కర్పూర తాంబూలమూ, జిహ్వకు నచ్చేటటు వంటి భోజనమూ, భోజనానంతము తాంబూలం నోట బిగించి కాసేపు విశ్రమించడానికి ఉయ్యాల మంచమూ. వ్రాసి వినిపించే కవిత్వంలో హెచ్చు తగ్గులు తెలుసుకోగల రసజ్ఞులూ, నా ఊహను నా మనసుని తెలుసుకోగల లేఖకులూ, పాఠకులుగా ఉండాలే గాని, ఊరకనే కవిత్వం పొంగి పొరలాలంటే దానికదే వచ్చేస్తుందా యేమిటి?’ అన్నాడాయన. చెప్తే యేలోకంలో ఉన్నాడో గాని కోపగించుకోవచ్చు. వీటికి తోడు నాకు మరొకటి కలగాలి.” అని ఆగాడతను.

ఏమిటది-అన్నట్టు షార్పుగా చూసిందామె.

“మత్తు కావాలి. చిత్తుగా మత్తు లేకపోతే నాకు కిక్కన్నది రాదు”

మందాకిని ఆశ్యర్యంగా చూస్తూ అడిగింది-”నువ్వుహాట్ డ్రింక్స్ తీసు కుంటావన్నమాట!”

అతడు నవ్వాడు – “అది తీసుకోని రోజెప్పుడని? దానినిప్పుడు తెచ్చే యేర్పాటు చేస్తావా  మందాకినీ!”

“ఎక్కడికో వెళ్ళి తేవడమెందుకూ? ఇక్కడే ఉందిగా!”అంటూ కబోర్డు తెరిచి విస్సీ బాటిల్ అందించింది.

“వావ్!ఫారెన్ లిక్కరన్న మాట!గ్రేట్” అంటూ మూత విప్పడానికి చేయి బిగించాడు విశు.

“ఆగు విశూ! అంత తొందరేమిటి? ఇద్దరికీ గ్లాసులు తెస్తాను” అంటూ కిచెన్ వేపు నడచింది మందాకిని.

ఆమె అలా లోపలక వెళ్ళి గాజు గ్లాసులు శుభ్రం చేసి సోడా బాటిల్‌తో వచ్చేటప్పటికి విశు సగం బాటిల్ ఖాళీ చేసేసాడు. విస్తుపోయిందామె.

“రా–గా తాగేసారా!”

“అదేమిటి అలా ఆశ్చర్యపోతున్నావు? ఇది నీకు కొత్తేమో గాని మనకు అలవాటేగా!” అంటూ ఆమె చేతినుండి గ్లాసు అందుకుని విస్కీతో నింపి చిప్స్ కావాలన్నాడు.

“సారీ! మరిచే పోయాను!” అంటూ  లోపలకు నడిచింది. ఆమె అలా వెళ్ళి చిప్స్‌తో వచ్చేటప్పటికి లావుపాటి విస్కీ బాటిల్ ఖాళీగా దర్శనిమిచ్చింది.

“ఇంతలో బాటిల్ ఖాళీ చేసేసారా!”

“ఇది ప్రశ్నలు వేసే అంతాక్షరి కాదు, మరొక బాటిల్ తీసుకురా, కిక్కు వదలిపోయేముందు”

ఆమె అలాగే అంటూ కదలి వెళ్ళి రమ్ బాటిల్ తెచ్చిచ్చి, మనసులో అనుకుంది “ఇంత హెవీగా లిక్కర్ తీసుకున్నవాడు  ఆడదానికి  తృప్తిని యెలాగిస్తాడు?” అనుకుంటూ తన వంతు విస్కీ గ్లాసుని పూర్తి చేసి చూసే ప్పటికి విశు నాల్గవ రౌండుకి వచ్చేసాడు. సగం రమ్ బాటిల్‌ని ఖాళీ చేసాడు. ఈసారి మందాకిని చిరాకు ఆపుకోలేకపోయింది.

“ఏంవిటిది విశూ! ఇక చాలించు. రా బెడ్ పైకి!” అని పిలిచేటప్పటికి చప్పుడు లేదు. విశు ఫ్లాట్‌గా పడిపోయి   నిద్రపోతున్నాడు. ఇక చేసేది  లేక మందాకిని బయట నిరీక్షిస్తున్న డ్రైవర్ని పిలిచి అతడి తోడ్పాటుతో విశుని లేవనెత్తి కారులో కుదేసింది. అతడప్పటికీ లేవలేదు. మత్తులోనుండి బైట పడలేదు.

మరునాడు ఉదయం స్నిగ్థ అడవి లేడిలా ఉషారుగా గెంతుతూ వచ్చింది. “విజయీ భవ! మొత్తానికి గువ్వని మోహపు మత్తులో ముంచి కార్యం సాధించేసావన్నమాట!” అని తను తెచ్చిన కొత్త మేలిమి ముత్యాల హారం మందాకిని మెడన వేయబోయింది.

“ఆగాగు! నీ మొహం – ఏ కార్యం సాధించానంటావు? రాత్రి ఆ కార్యమూ ఈ కార్యమూ కాదు. ఏ కార్యమూ జరగలేదు-ప్రమోషన్ ఫైలు ఫైన నా సంతకం తీసుకోవడం తప్ప” అని రాత్రి జరిగింది వివరంగా చెప్పింది. అంతా విన్న స్నిగ్థ కళ్లు తేలేసింది.

“ఇక్కడేదో చిన్నపాటి కిరికిరి జరిగినట్లుంది” మందాకిని అడ్డు వచ్చింది.

“చిన్న కిరికిరీ కాదు. పెద్ద కిరికిరీ కాదు. అసలేమీ జరగలేదంటుంటే -”

“నేను చెప్పేది దాని గురించి కాదు మందాకినీ! నిన్ను బాగానే బోల్తా కొట్టించి ప్రమోషన్ ఫైలు అందుకున్నాడు ఆ కపటధారి.”

అదెలా అన్నట్టు అయోమయంగా చూసింది మందాకిని.

“అతడికి తాగే అలవాటే లేదు. ఎక్కడా యెప్పుడూ తాగడన్న పేరు అతడికి ఉంది. అలాంటప్పుడు రెండు బాటిల్స్- అదీను రా – గా తాగేసాడా! నమ్మలేని హిమజల ప్రళయం” అంటూ గది చుట్టూ పరకాయించి చూసి బెడ్ ప్రక్కనున్న పూలకుండీ తీసి మందాకినికి అందించింది. పూలకుండీ నిండా ఖరీదైన ఫారిన్ సోమపానం భగ భగ మంటూంది. అప్పుడు ముఖం తేలేయడం మందాకిని వంతయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here