చదువు-సంస్కారాలు : చాక్ అండ్ డస్టర్

0
6

[dropcap]వి[/dropcap]ద్య అనే అంశం మీద, టీచర్ల, స్కూళ్ళ కథలతో ఈ మధ్య సినిమాలు బాగానే వస్తున్నాయి. వాటిలో 2016 లో వచ్చిన “చాక్ అండ్ డస్టర్” ఒకటి. సినిమాగా గొప్పది కాదుగాని, తీసుకున్న సబ్జెక్ట్ కారణంగా ఆసక్తికరంగా వుంది.
కాంతాబేన్ స్కూల్ లో ప్రిన్సిపాల్ ఇందు శాస్త్రి (జరీనా వాహబ్). విద్యా సావంత్ (షబానా ఆజ్మీ) ఒక సీనియర్ లెక్కల టీచర్. జ్యోతి (జుహీ చావ్లా), మంజీత్ (ఉపాసనా సింఘ్) ఇంకొందరు ఉత్సాహవంతులైన టీచర్లు. అన్‌మోల్ పారేఖ్ (ఆర్యా బబ్బర్) ఆ స్కూల్ ట్రస్టీలలో ఒకడు. మేనేజిమెంట్ లో అతని జోక్యం ఎక్కువైనప్పటి నుంచి త్వరగా చాలా మార్పులొస్తాయి. ఇందు శాస్త్రీ ని తొలగించి ఒక జూనియర్ అయిన కామినీ గుప్తా (దివ్యా దత్తా) ను ప్రిన్సిపాల్ చెయ్యడం. ఆమె ఆ స్కూల్ ని ఒక పక్కా కార్పొరేట్ స్కూల్ గా మార్చడానికి P A System, కంప్యూటర్లు, కేంటీన్లు ఇలాంటివన్నీ ప్రవేశపెట్టి టీచర్ల కుర్చీలు తీయించేసి వాళ్ళ మీద రకరకాల వత్తిడులు తెస్తుంది. ఆ నగరంలో గొప్ప స్కూల్ గా పేరు తెచ్చుకున్న జాకీ ష్రాఫ్ డి జి ఎం స్కూల్ కంటే గొప్ప పేరు సంపాదించాలని కంకణం కట్టుకుంటారు అన్‌మోల్, కామినీ లు. కామిని కి స్కూల్ నిర్వహణ మీద శ్రధ్ధ కంటే వ్యక్తిగతంగా టీచర్లందరి మీదా కక్షా, చిన్న చూపు ఎక్కువ. ముందు ఫీజులు పెచడం, టీచర్లకు ఇవ్వబడే కేంటీన్ సబ్సిడీలు రద్దు చెయ్యడం, ఒక టీచర్ కొడుకు ఆ బడిలో ఫ్రీగా చదువుతుంటే అతనికి కూడా ఫీజు కట్టమనడం లాంటివి చేస్తుంది. కానీ ఉద్యోగం అవసరం వుండి ఎవరూ నోరు మెదపలేకపోతారు. ఒకరోజు విద్య తో మాటా మాటా పెరిగి అసమర్థ టీచర్ కారణంగా చెబుతూ ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తుంది కామినీ. ఆ అవమానానికి కుప్ప కూలిపోయిన విద్యను ఆసుపత్రికి తరలిస్తారు. గుండె ఆపరేషన్ అవసరమవుతుంది. ఒక్క జ్యోతి తప్ప పక్కన ఎవరూ వుండరు. మేనేజిమెంట్ పట్టించుకోదు. ఒక విలేఖరి అయిన రిచా చడ్డా ఈ కేసును టీవీ లో వార్తగా ప్రసారం చేస్తే దేశంలోని ప్రజలు, విద్యార్థులు, మేనేజిమెంట్ అందరూ ఎలా స్పందిస్తారు. ఎత్తుకు పై ఎత్తులు మేనేజిమెంట్ ఎలా వేస్తుంది. విద్య ఏ విధంగా కార్పొరేటీకరణ జరుగుతోంది, గురువులను ఇదివరకులాగా గౌరవించకపోవడం వగైరా విషయాలు చర్చలోకొస్తాయి. ఇదంతా మిగతా కథ.


ఈ చిత్రం ఒక మామూలు మసాలా చిత్రం లాగానే వుంది. కొంత సమాచారం, కొంత డ్రామా, కొన్ని సినేమేటిక్ మలుపులు వగైరా ఉన్నాయి. అయినా ఎందుకు చూసేలా చేస్తుందీ అంటే తీసుకున్న వస్తువు, నటుల నటన. వస్తువు తీసుకుంటే మనకు తారే జమీఁ పర్, 3 ఇడియట్స్, హిందీ మీడియం, నిల్ బట్టే సన్నాటా, స్టాన్లీ కా డబ్బా లాంటి మంచి చిత్రాలు వచ్చాయి. వాటితో పోలిస్తే ఇది సోదిల్లోకి కూడా రాదు. అయితే షబానా, జరీన, జుహీ, దివ్యా దత్తా, రిచా చడ్డా ల నటన ఎప్పటిలా బాగుంది. ముఖ్యంగా షబానా. జయంత్ గిలాతర్ దర్శకత్వం స్కూల్ భాషలో చెప్పాలంటే పాస్ మార్కులివ్వచ్చు. ఆసక్తి వున్నవారు చిత్రాన్ని యూట్యూబ్ లో చూడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here