చండీఘర్ రాక్ గార్డెన్

0
11

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘చండీఘర్ రాక్ గార్డెన్’ అనే రచనని అందిస్తున్నాము.]

2024వ సంవత్సరం మార్చి నెల 15వ తేదీ ఉదయం ఇండిగో ఫ్లైట్లో బయలుదేరి వయా ముంబయి మీదుగా చండీఘర్ కు మధ్యాహ్నం 12 గంటలకు చేరాము. ఇక్కడ ప్రఖ్యాతి చెందిన పీజీఐ హాస్పిటల్లో మావారికి కాన్ఫరెన్స్ ఉన్నది. ‘Evidence based management of Respiratory disorders in children’ అన్న అంశంపై కాన్ఫరెన్స్ జరుగుతున్నది. ‘చండీఘర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు’లో దిగగానే అంతటా తలపాగాలు చుట్టుకున్న సిక్కులు కనిపించారు. మేము ఇదే మొదటిసారిగా పంజాబ్ రాష్ట్రంలో అడుగుపెట్టడం. అందులోనూ చండీఘర్ లాంటి ప్లాన్డ్ సిటీని చూడాలని ఎప్పటి నుంచో అనుకున్నాము. అది ఇన్నాళ్ళకు తీరింది. సరోవర్ గ్రూపు వాళ్ళ ‘Hometel’ అనే హెూటల్లో 509 అనే రూములో దిగాము. హోటల్ చాలా పెద్దదిగా ఉంది కానీ కన్‌ప్యూజింగ్‌గా ఉంది. సెకండ్ ఫ్లోర్‌లో రిసెప్షన్ పెట్టారు. చండీఘర్ నుంచి అమృత్‌సర్ 250 కి.మీ దూరంలో ఉంది. అమృత్‌సర్‌కు వెళితే వాఘా బార్డర్ కూడా చూడవచ్చు. అది అమృత్‌సర్‌కి కేవలం 50 కి.మీ దూరమేనట. కాన్ఫరెన్స్‌లో టైం దొరికితే అమృత్‌సర్ చూడాలని అనుకున్నాను. హెూటల్‌లో లగేజి పెట్టేసి పీజీఐకు వెళ్ళాము. ఇది దగ్గర అవుతుంటే నా మనసు ఆనందంతో పులకరించింది. భారతదేశంలోనే ప్రసిద్ధమైన PGIMER (Post Graduate Institute of medical Education & Research) లో నేను అడుగు పెట్టానని సంతోషంగా ఉంది. దీనిలోని హాస్పిటల్‌ను ‘నెహ్రూ హాస్పిటల్’ అంటారు. చండీఘర్ కేంద్ర పాలిత ప్రాంతం. ఇక్కడి ప్రజలు పంజాబీ, ఇంగ్లీషు భాషలు మాట్లాడతారు. 10 లక్షల జనాభా కలిగిన ప్రాంతం. ఉత్తర భారతదేశంలోని పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాల రాజధాని చండీఘర్, భారత్ పాకిస్తాన్‌ల విభజన సమయంలో తూర్పుపంజాబ్ భారతదేశానికి వచ్చింది. పశ్చిమ పంజాబేమో పాకిస్తాన్ లోకి వెళ్ళి పోయింది. విభజనకు పూర్వం పంజాబుకు రాజధానిగా ఉన్న ‘లాహోర్’ కూడా పాకిస్తాన్‌కు వెళ్ళిపోయింది. అందువలన మన దేశంలో ఉన్న పంజాబుకు కొత్త రాజధాని అవసరం పడింది. అలా పక్కా ప్రణాళికతో చండీఘర్ నగరం నిర్మించబడింది. ప్రస్తుతం ఇక్కడి మేయర్ ‘హర్‌పూర్ చంద్ర హేల్యాన్’, ‘శివరాజ్ వి పాటిల్’ ఈ నగరానికి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా పని చేస్తున్నారు. హిమాలయాలలోని శివాలిక్ కొండల వరస యొక్క పాదాల చెంతనే ఈ నగరమున్నది.

ఇక్కడ ఎక్కడ చూసినా మర్రిచెట్లు, యూకలిప్టస్ చెట్టు కనిపిస్తున్నాయి. దారిలో వెళ్తుంటే సర్కిల్స్ దగ్గర చక్కని లాన్లు, మంచి పువ్వులు కనిపించాయి. ఇంకా ఇక్కడి అడవుల్లో అశోక, మల్బరీ, కాషియా చెట్లు ఉంటాయట. ప్రఖ్యాత క్రికెటర్లు అయిన యువరాజ్ సింగ్, కపిల్ దేవ్ చండీఘర్‌కు చెందినవారే. కామన్‌వెల్త్ క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించిన మిల్కాసింగ్ కూడా ఇక్కడివాడే. ప్రఖ్యాత షాపింగ్ వెబ్‌సైట్ అయినటువంటి ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించిన వారైన బిన్ని బన్సల్, సచిన్ బన్సల్ ఇరువురూ చండీఘర్‌కు చెందినవారే.

చండీఘర్‌లో అతిపెద్ద ‘రోజ్ గార్డెన్’ ఉన్నది. ఇది ఆసియా ఖండంలోనే పెద్ద గార్డెన్. ఈ గార్డెన్ మొత్తం 27 ఎకరాల స్థలంలో వ్యాపించి ఉన్నది. ఈ గార్డెన్ లో దాదాపు 17,000 గులాబీలకు పైగానే ఉన్నాయి. అవి 1600 వెరైటీల గులాబీలట. ఈ వివరాలన్నీ బయట టికెట్లు ఇచ్చే గది దగ్గర ఉన్నాయి. అమ్మో! మనం ఇదంతా తిరగగలుగుతామా! అనుకున్నాం. సరే కొన్నైనా చూడవచ్చు కదా అని లోపలికి వెళ్ళాం. మేం వెళ్ళింది ఎండాకాలం కాబట్టి పూల మొక్కలన్నీ ఎండిపోయి ఉన్నాయి. వర్షాకాలంలో చూస్తే దీని సొగసు బాగుండేదేమో. అయినా తక్కువేమీ లేదు నేను చాలా గులాబీల మధ్య నిలబడి ఫొటోలు తీసుకున్నాను. నేను సైన్స్ స్టూడెంట్ నేమో అక్కడున్న గులాబీల వెరైటీల శాస్త్రీయ నామాలను ఓ యాభై రకాల వరకు నా నోట్ బుక్‌లో రాసుకున్నాను. ‘ఏం చేస్తావు ఆ పేర్లంటినీ, టైం వేస్ట్ తప్ప, ఆ టైం కూడా ఎంజాయ్ చెయ్యి’ అని మావారు అంటున్నా నేను రాసుకున్నాను. అదో ఆనందం అంతే. పోనీ మీకు కొన్ని పేర్లు చెప్పనా? January linen, February skarlet, March lavender, April yellow, May erram pink, June peach, July Bright pink August orange, September Red Yellow, October Apricot, November Russet, December Crimson అని పన్నెండు నెలల పేర్లతో పన్నెండు రకాల గులాబీలు ఒక వైపంతా ఉన్నాయి. ఇవి చూస్తుంటే చాలా గమ్మత్తుగా ఉన్నాయి. గులాబీ మొక్కల మధ్య అనేక నీటి ఫౌంటెన్లు ఉన్నాయి.

‘ఓపెన్ హాండ్ మాన్యుమెంట్’ అని ఒక చెయ్యి పైకి ఎత్తినట్లుగా ఉంటుంది. అక్కడికెళ్ళి ఫొటోలు తీసుకున్నాం. దీనిని చెక్కి డిజైన్ చేసింది ‘లీ కార్బుసియర్’. సెక్రటేరియట్ బిల్డింగ్, అసెంబ్లీ, హైకోర్టు భవనాలన్నీ ఇతనే డిజైన్ చేశాడు. చంఢీఘర్ మ్యూజియమ్ అండ్ ఆర్ట్ గ్యాలరీ, మ్యూజికల్ ఫౌంటెన్ వాలీ ఆఫ్ యూనిమల్స్, కాక్టస్ గార్డెన్, పిన్ జోర్ గార్డెన్, ఇంటర్నేషనల్ డాల్ మ్యూజియమ్ వంటివి ఎన్నో ఉన్నాయి. క్రికెట్ స్టేడియమ్, హాకీ స్టేడియమ్, చండీఘర్ గోల్ఫ్ క్లబ్, వాలీబాల్ కోర్టులు వంటివి చండీఘర్‌లో చాలా ఉన్నాయి. హైకోర్టు లోపలి దాకా వెళ్ళి చూశాము గానీ ఫొటోలు తియ్యనివ్వలేదు.

ప్రఖ్యాతమైన పంజాబ్ యూనివర్సిటీని చూశాము. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ, DAW కాలేజీ, గోస్వామి గణేష్ దత్తా సనాతన ధర్మా కాలేజీ, మెడికల్ కాలేజీలు ఎన్నో ఉన్నాయి. నేను ఏ రాష్ట్రం వెళ్ళినా అక్కడ ప్రసిద్ధ యూనివర్సిటీలు చూసి ఫొటోలు దిగడం అలవాటుగా చేసుకున్నాను. అంతేకాదు ఆ రాష్ట్ర ప్రముఖ పత్రికలు కూడా సేకరిస్తున్నాను. ఇక్కడ వీధుల పేర్లుండవు. సెక్టార్లు అని ఉంటాయి. సెక్టార్ 17లో పెద్ద షాపింగ్ మాల్ సిటీ సెంటర్ ఉన్నది. రోడ్లు చాలా నీట్ గా ఉన్నాయి. రేపు రాక్ ఫెస్టివల్, మాంగో ఫెస్టివల్ జరుగుతాయి. రోజ్ ఫెస్టివల్ ఫిబ్రవరిలో జరుగుతుంది. ఇది జాకీర్ హుస్సేన్ రాక్ గార్డెన్‌లో జరుగుతుంది.

ఈ రాక్ గార్డెన్ కు వెళ్ళాము. నేను ఈ రాక్ గార్డెన్ ను చూడాలని ఎన్నో ఏళ్ళుగా కలలు కంటున్నాను. మా పిల్లలు ఫస్ట్ క్లాసులో ఉన్నప్పుడు ఈ రాక్ గార్డెన్ గురించిన పాఠం ఉన్నది. దాని గురించి పిల్లలకు చెబుతున్నప్పుడు అనుకున్నాను, ‘ఎప్పటికైనా ఈ గార్డెన్ చూడాల’ని. ఎందుకు ఇంత గట్టిగా అనుకున్నానంటే ఈ రాక్ గార్డెన్ మొత్తం వ్యర్థమైన పదార్థాలతోనే నిర్మితమైనది. 1924లో నేక్ చంద్ ఈ గార్డెన్‌ను ఏర్పాటు చేశాడు. తన జీవితకాలమంతా శ్రమించి ఇటుకలు, రాళ్ళు, గాజు ముక్కలు, ప్లాస్టిక్ డబ్బాలు, గోనె సంచులు ఒకటేమిటి మనం పారేసే ప్రతి వస్తువునూ ఉపయోగించి కళాఖండాలు రూపొందించాడు. దానిని ప్రభుత్వం గుర్తించి నేక్ చంద్ తయారుచేసిన కళాఖండాలన్నింటినీ ఒక చోటకు చేర్చి రాక్ గార్డెన్ పేరుతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. నేను కూడా మా ఆసుపత్రిలోని వ్యర్థపదార్థాలతో బొమ్మలు తయారుచేస్తున్నాను. కాబట్టి నాకీ ఆనందం. నేను కూడా ఎప్పటికైనా నేక్ చంద్ లాగా పెద్దగార్డెన్ ను నా బొమ్మలతో ఏర్పాటు చేయాలని కలలు కంటున్నాను.

రాక్ గార్డెన్ చాలా అద్భుతంగా ఉన్నది. మధ్యలో నీటి సెలయేరులు, కొండలు, చిన్న చిన్న ఇరుకుదారులు అంతా ప్రకృతిలో ఏర్పడినట్లుగా తయారు చేశారు. మధ్య మధ్య గోడలు కూడా ఈ రాళ్ళ వరసలే. రాళ్ళలో ఇంత అందం ఉన్నదా అని ఆశ్చర్యపోక మానరు ఎవరైనా. సందర్శకులలో చాలామంది ఫారినర్స్ కూడా ఉన్నారు.

ఒకచోట గుర్రాలను వరుసగా నిలబెట్టినట్లుగా రాళ్ళు పేర్చబడి ఉన్నాయి. అక్కడ ఊగటానికి ఉయ్యాలలు ఉన్నాయి. అలాగే కోడి పుంజులు, నెమళ్ళు, చిలకలు, పక్షులు, కుక్కపిల్లలు, పులులు, సింహాలు ఒకటేమిటి అడవి ప్రపంచమంతా అక్కడే కొలువు దీరింది. ఇంకా మనుష్యుల బొమ్మలు రకరకాల వాయిద్యాలతో ఉన్నాయి. చూస్తున్నంతసేపూ ఎక్కడా బోర్ కొట్టలేదు. ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని చూడటమే. ఇదంతా ఒక వ్యక్తి తన జీవిత కాలంలో పడిన శ్రమ అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చండీఘర్‌కు ఇదొక పెద్ద ఎట్రాక్షన్.

సభానా లేక్‌కు వెళ్ళినపుడు మన ‘లుంబినీపార్క్’ లా అనిపించింది. సాయంత్రం పూట సరదాగా పిల్లల్ని తీసుకుని తల్లిదండ్రులు వస్తున్నారు. మేం వాళ్ళ ఆటపాటల్ని చూస్తూ తిరుగుతున్నాం. ఇంతలో అక్కడ ఒక చోట ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు కూర్చుని మన ఫొటోలు గీస్తున్నారు. నాకూ సరదాగా అనిపించి క్యూలో నిలబడి మరీ నా ఫొటో గీయించుకున్నాను. బాగా వచ్చింది. తొమ్మిదింటి దాకా ఉండి తర్వాత రూముకు వెళ్ళిపోయాము. ఆ తెల్లవారి చండీఘర్ నుండి బయలుదేరి హైదరాబాద్ వచ్చేశాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here