చంద్రమోహన్ గారి నటనా వైదుష్యం ‘బంగారు పిచిక’ చిత్రం

0
10

[ఇటీవల దివంగతులైన ప్రముఖ నటులు చంద్రమోహన్ గారి జ్ఞాపకంగా ఈ రచన అందిస్తున్నారు డా. సి. భవానీదేవి.]

[dropcap]శ్రీ [/dropcap]గణేశ్ పిక్చర్స్ పిక్చర్స్ వారి ‘బంగారు పిచిక’ సినిమా గురించి మాట్లాడాలంటే విశిష్టంగా ఉంటుంది. ద్రవ పదార్థాల గురించి ఓ మాట చెప్తారు, ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని పొందుతాయని. చంద్రమోహన్ గారు అలాంటి నటులు. వారు ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్రలో లీనమౌతారు. ఇక చంద్రమోహన్ కనిపించరు. ఆ పాత్ర లోనే మనమూ లీనమవుతాము.

1968వ సంవత్సరంలో విడుదల అయిన ‘బంగారు పిచిక’ వినోద నాటకీయ చిత్రరాజం. బాపుగారి దర్శకత్వంలో ముళ్ళపూడి వెంకటరమణగారి కలం బలంతో కొమ్మన నారాయణరావు గారు నిర్మాతగా వెలువడింది. చంద్రమోహన్ విజయనిర్మల నాయికానాయకులు. కె.వి. మహదేవన్ గారు సంగీతం అందించారు. పాటలు ఆరుద్ర రాశారు. సుశీల, బాలు, వసంత పాటలు పాడారు.

టైటిల్స్ పూర్తయే లోపు ప్రేక్షకులకు పాత్రలు, కథాపరిచయం జరుగుతుంది. బాపు మార్కు సినిమాగా ఆనందింప జేసే ఈ చిత్రకథ ఇలా ఉంటుంది.

అనగనగా ఒక రాజు. ఆయన పేరు మట్టికొట్టి సన్యాసిరాజు. ఈ రాజు గారికి ఒక రాణి గారుంది. ఆమె పేరు రాజేశ్వరీ దేవి. ఆమెకు బోలెడంత ఆస్తి ఉంది.

పంటలు, పొలాలు, మేడలు, గొడ్లు, మిల్లులు, పిల్లులు, ఇలా..

ఈ ఆస్తి వ్యవహా రాలు చూడటానికి నమ్మిన బంటు ఆమెకో ప్రధాన మంత్రి మల్లయ్య ఉన్నాడు. పర్సనల్ సెక్రటరీ, ఇంకా చాలా మంది సైన్యం, పనిమనిషి రామచిలక, పనివాడు, వంటవాడు, డ్రైవర్, తోటమాలి వంటి భారీ సంస్థానం లాంటి కుటుంబం వీరిది. ఈ దంపతులకు ఒక్కగానోక్క కొడుకు బంగారు కొండ, వరహాల్రాజు. ఈ పాత్రను చంద్రమోహన్ గారు చేశారు. ఇంట్లో రాణి రాజేశ్వరీ దేవి అంటే అందరికీ భయమూ, భక్తి కూడా! ఆమె పెత్తనంలోనే ఇంట్లో అందరికీ తిండీ తిప్పలు, బట్టలు అన్ని సౌకర్యాలు జరిగి పోతుంటాయి. వరహాల్రాజుకు పెళ్ళి సంబంధాలు చూసే రాజేశ్వరీ దేవి తల్లిగా తాను ఎంపిక చేసిన పిల్లల్లో ఎవరినైనా చేసుకోవాలని సూచిస్తుంది. కానీ, వాళ్ళెవ్వరూ వరహాల్రాజుకు నచ్చరు. ఇష్టమయిన అమ్మాయిని చేసుకుని స్వతంత్రంగా బతకాలని ఆలోచిస్తుండగా తండ్రి కూడా వరహాల్రాజుకు చాలా ప్రోత్సాహాన్నిస్తాడు. వరహాల్రాజు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. రాజేశ్వరీ దేవి చాలా దిగులుపడి తన కొడుకును వెనక్కి తీసుకొచ్చి అప్పగించిన వాళ్ళకి 50,000 బహుమతి ఇస్తానని ప్రకటించి ఇంట్లో పనివాళ్ళందరినీ కొడుకును వెదికి తెమ్మని పంపిస్తుంది. అంతా రోడ్డున పడుతారు.

ఆ వూరిలోనే మహాలక్ష్మి అనే బీదింటి అమ్మాయికి తండ్రి పెళ్ళి చేయలేడు కాబట్టి ఆమె వరహాల్రాజును పెళ్ళాడితే సమస్యలు తీరతాయని పెద్దలు, మిత్రులు సూచిస్తారు. మహాలక్ష్మి, రాధ అనే మారు పేరుతో వరహాల్రాజును కలుస్తుంది. తాను బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన దాన్ననీ, ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నందు వల్ల ఇల్లు వదిలి పారిపోయి వచ్చాననీ రాధ వరహాల్రాజుకు చెప్తుంది. వరహాల్రాజు కూడా తాను చాలా బీదవాడిననీ, హైద్రాబాద్ వెళ్ళి బతుకు తెరువు చూసుకుంటానని చెప్తాడు. రాధ కూడా తాను హైద్రాబాద్ వెళ్తున్నాననీ, మనసుకు విలువనిచ్చే మనిషి దొరికితే పెళ్ళి చేసుకుంటాననీ చెప్తుంది. ఈ విధంగా ఇద్దరి ప్రయాణం హైదరాబాద్ వైపు నడుస్తుంది. దారిలో జరిగే అనేక సంఘటనల వల్ల వాళ్ళిద్దరి మధ్య నిజమయిన ప్రేమ చిగురిస్తుంది. ఈ సమయంలోనే మేనేజర్ మల్లయ్య పన్నిన కుట్ర రాజేశ్వరీ దేవికి తెలుస్తుంది. వరహాల్రాజు, రాధలు అసలు వివరాలు అంతా తెలుసుకుంటారు. రాజేశ్వరీ దేవి కొడుకు మనసెరిగి అతనికి రాధతో వివాహం చేయిస్తుంది. కథ సుఖాంతమౌతుంది. ఈ చిత్రంలో సీనియర్ నటీనటులయిన శాంతకుమారి, విన్నచోట రామన్న పంతులు గార్లతో చంద్రమోహన్ పోటీపడి నటించటం విశేషం. అందం, అమాయకత్వం, ఒక అమ్మాయి చూపు కోసం ఆలాటపడే నవతరం ప్రతినిధిగా నటనా పటిమతో, ఉదాత్తంగా, హృద్యంగా, హాయిగా నటించారు చంద్రమోహన్. ఆ ఇంట్లో నాలుగు తరాల తర్వాత పుట్టిన మగ నలుసుగా ఎంత గారాబం ఉన్నా, ఎన్ని ఎన్ని ఆంక్షలున్నా సౌకర్యాలు అమిరినా వరహాల్రాజు పాత్రకి స్వంత వ్యక్తిత్వం ఉండటం ప్రత్యేకతే! ‘బంగారు పిచిక’ అనే పేరు చంద్రమోహన్ పాత్రకు సంబంధించి పెట్టిందే. బాలా డబ్బు గలవాళ్ళనూ, సంపన్నులను, బంగారు పిచికగా సంబోధించడం ఒక తరం వాళ్ళకి బాగా తెలుసు.

చిత్ర ప్రారంభంలో ఒక పంజరంలో తండ్రితో పాటు హీరో కూర్చొని తల్లి అదుపాజ్ఞలలో వ్యవహరించటం చూస్తే ఆ పాత్రల స్వభావం మనకు తెలుస్తుంది. పూజగదిలోకి ఆ సమయానికి ఆ సముచిత వేషధారణతో పరిగెత్తుతూ ప్రవేశించటం నవ్వు పుట్టిస్తుంది. వరహాల్రాజుకు తల్లి అంటే గల భయభక్తులు వెల్లడించే ఈ దృశ్యంలో చంద్రమోహన్ నటన సహజసుందరంగా ఉంది. పూజ తర్వాత వచ్చి పళ్ళు తోముకునే ఆధునిక తరాన్ని ఆనాడే మనం చూశాం. బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ దగ్గర మల్లయ్య న్యూస్ పేపర్ చదువుతూ “ఒక అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళిందట” అనే వార్తను చదివినప్పుడు విననట్లు అమాయకత్వాన్ని నటించే చంద్రమోహన్‌ను తల్లి మాత్రం నమ్మకుండా ఎలా ఉండగలదు. తన తండ్రి పుట్టిన రోజు సందర్భంలో తల్లి తనకు కొనిపెట్టిన కొత్త బట్టలు అమ్మి ఆ డబ్బును వెనకనించి తండ్రికి ఇవ్వటంలో వరహాల్రాజుకు తండ్రి మీదున్న ప్రేమను ప్రకటించిన దృశ్యంలో చంద్రమోహన్ గారి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఇష్టం లేచి అమ్మాయిని పెళ్ళి చేసుకోకూడదంటూ తండ్రి ఇచ్చిన సలహాతో తన ఆస్తి కోసం వచ్చే అమ్మాయిల్ని వద్దనుకుని మగవాడిలా బతకాలని ఇల్లు వదిలిన సందర్భంలో వట్టి వరహాల్రాజుగా అమ్మకి రాసిన ఉత్తరంలో అతని మనసు, హావభావాలు చూసి పంజరంలోని చిలుక బయటికొస్తే ఎలా బతుకుతుందా అని దిగులేస్తుంది. “చక్కని కోడల్ని తేవాలి” అని నౌకర్లు అన్నప్పుడు మన ఇళ్ళల్లో పెళ్ళి కెదిగిన కొడుకులాగా చంద్రమోహన్ సిగ్గుపడతారు. ఇడ్లీలన్నీ తినేసి దారిలోనే తనని వదిలేసి వెళ్ళే లారీ డ్రైవర్ కేసి నోరు తెరుచుకుని చూసే అమాయకపు నటన, చెప్పలేనంత సానుభూతిని, నవ్వును కలిగిస్తుంది. ఆడుతూ పాడుతూ స్వేచ్ఛ లోని ఆనందాన్ని అనుభవిస్తూ రాధని రక్షించే పోరాటాలలో కూడా హీరోయిజం ప్రకటిస్తూ ఆనందింపజేస్తాడు వరహాల్రాజు.

రాధ తన మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటానంటే ప్రేక్షకుల వైపు తిరిగిన వరహాల్రాజు తనకు నచ్చిన అమ్మాయి దొరికినట్లు భావప్రకటన చేయటం ఆనందింపవేస్తుంది.

గిల్లికజ్జాల సన్నివేశాల్లో కూడా చంద్రమోహన్ వరహాల్రాజుగా అత్యంత పేదవాడిగా నటించిన తీరు అమోఘం.

‘ఓహో హో బంగారు పిచికా

పలుకలేని పంచదార చిలుకా’

పాటలో అల్లరిగా, మానవత్వం ఉన్న మంచి మనిషిగా కనిపిస్తారు. ఈ పాత్రని చూస్తుంటే మనకి కొడుకయినా అల్లుడయినా ఎలా ఉండాలని కోరుకుంటామో అలా అనిపిస్తారు. ఎటువంటి సందర్భంలోనూ అతి చొరవ ప్రదర్శించని సంస్కారవంతుడు.

‘పో పో నిదురపో

వచ్చినా రాకున్నా నిదురపో’

సన్నివేశంలో వరహాల్రాజుకు రాధ మీదుండే ప్రేమ వెన్నెలని మరిపిస్తుంది

చిత్రీకరణ బాపుగారిది కాబట్టి ప్రేక్షకుల్ని ఆ దృశ్యం లోకి లాగేస్తారు. రాధ మీది అలక, చిరుకోపం ప్రదర్శించినపుడు పసివాడిలాగా మారాం చేస్తాడు వరహార్రాజు.

‘మనసే గని తరగని గని

అది చక్కని గని’

యుగళగీతంలో ఇద్దరూ నిజమయిన ప్రేమికుల్లా చక్కగా అలరించారు. పరస్పరం నిజాలు తెలుస్తాయి. రాధ చుట్టూ అల్లుకున్న విలనిజంలో సాక్షి రంగారావు ఉండటం విశేషం. రాధని చేసుకుంటూ – తల్లి ఆస్తిలో చిల్లి గవ్వ వద్దంటాడు వరహాల్రాజు. చంద్రమోహన్‌లో ఆరితేరిన నటనా పరిణతి శిఖరాయమానంగా కన్పిస్తుంది. తల్లి వచ్చి రాధని నిర్మలమైన మనస్సుతో కోడలిగా స్వీకరిస్తుంది. కథ కంచికి. మనం ఇంటికి.

ఇలా అందమైన దృశ్యరాజంగా రూపొందించిన ‘బంగారు పిచిక’ లో చేయాలన్నా మోసం చేయలేని ఆదర్శ పాత్రలో చంద్రమోహన్ అద్భుతంగా నటించారు. ఇప్పటి సినిమాల్లోలాగా ప్రత్యేక డైలాగులు, విపరీతమైన దుస్తుల తీరు ఏమీ లేకుండా హాయిగా సాగిపోయే నలుపు తెలుపుల చిత్ర కావ్యం! ‘రచన’లో కూడా ఫోటోలు కథ ప్రచురించారు. ఈ సినిమాను నేను బాపట్లలో శ్రీనివాసా థియేటర్‌లో చూశాను. ఇంత మంచి సినిమాను గుర్తు చేసుకోవటం ఓ మంచి జ్ఞాపకం కదూ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here