చంద్రునికో నూలుపోగు-4

1
17

[ప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘చంద్రునికో నూలుపోగు’ అనే నవలని ధారవాహికగా అందిస్తున్నాము.]

[విశ్వాంతరాళంలో భూమికి సుదూరంగా ఉన్న ఓ నక్షత్రం చుట్టూ తిరుగుతున్న రెండు గ్రహాలు.. నిఫిలిక్స్, నిక్స్. భూమి కొలతల్తో పోలిస్తే దాదాపు సమానమైన వైశాల్యం, ద్రవ్యరాశిని కలిగి ఉండటంవల్ల ఆ రెండు గ్రహాల్లో గురుత్వాకర్షణ శక్తి కూడా భూమి గురుత్వాకర్షణ శక్తితో సమానం. నిఫిలిక్స్ గ్రహానికి అధినేత అజుపస్. ఓ రాత్రి తమ భవంతి బాల్కనీలో కూర్చుని భార్య మోజోతో మాట్లాడుతుంటాడు. తమ గ్రహానికి చంద్రుడు లేనందున్న వెన్నెల లేకపోవడం ఓ పెద్ద లోటు అని అంటుందామె. అది తమ దురదృష్టమని అంటాడు అజుపస్. అదృష్ట దురదృష్టాల్ని నమ్ముకుని జీవించే కాలంలో లేమని, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పురోగతి సాధించామని అంటుందామె. మన గ్రహానికి లేని ఉపగ్రహాన్ని ఎక్కడ్నించి తేవాలని అంటాడు అజుపస్. అప్పుడు మోజో ఒక ఆలోచన చెబుతుంది. దాన్ని సాధ్యం చేసేందుకు తమ గ్రహంలోని శాస్త్రవేత్తలను సమవేశపరిచి – నిక్స్ గ్రహం చుట్టూ తిరుగుతున్న రెండు చందమామలలో ఒకదాన్ని లాక్కొచ్చి తమ గ్రహం చుట్టూ తిరిగేలా చేయడానికి మార్గాలు కనుగొనమని ఆదేశించమంటుంది మోజో. మర్నాడు శాస్త్రవేత్తలతో సమావేశమై, తన మనసులో మాటని చెప్తాడు అజుపస్. అది అసంభవమని ఓ సీనియర్ శాస్త్రవేత్త అంటాడు. క్రిస్టోన్ అనే యువశాస్త్రవేత్త మాత్రం అది సాధ్యమేనంటూ, తన ఆలోచనని వివరిస్తాడు. తమ నియంత్రణలో ఉండే బ్లాక్‍హోల్ లాంటి పదార్థాన్ని తయారుచేయాలని, దాని సాయంతో నిక్స్ నుంచి ఓ చంద్రుడిని తెచ్చేయవచ్చని అంటాడు. ఒక సంవత్సరం లోపల సాధించాలని చెప్తాడు అజుపస్. తమ ప్రణాళికని వివరిస్తాడు క్రిస్టోన్. తన టీమ్‍లోకి ఇద్దరు సీనియర్, ఇద్దరు యువ శాస్త్రవేత్తలను తీసుకుంటాడు క్రిస్టోన్. యువ శాస్త్రవేత్తల్లో ఒకరు అతని భార్య ఎథీనా. ఇక చదవండి.]

[dropcap]క్రి[/dropcap]స్టోన్ బృందం తన పరిశోధనల్ని వెంటనే మొదలెట్టింది. మొదట బ్లాక్‌హోల్ ఏర్పడే ప్రక్రియను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని, దాన్ని ప్రయోగశాలలో విజయవంతంగా అనుకరించగలిగారు. ఈవెంట్ హొరైజన్‌ని నియంత్రించడం ద్వారా దాన్ని స్విచాన్, స్విచాఫ్ చేయడం మీద పట్టు సాధించారు. ఇదంతా సాధించడానికి ఆరు నెలల కాలం పట్టింది.

అత్యంత సాంద్రతను, తద్వారా ఏర్పడే అత్యధిక పీడనాన్ని తట్టుకోగల పదార్థాన్ని కనుక్కోవడమే వాళ్ళకు ఎదురైన పెద్ద సమస్య. రకరకాల లోహాలతోపాటు లోహ మిశ్రమాల్ని కూడా పరీక్షకు పెట్టి చూశారు. సాంద్రత ఓ స్థాయి దాటగానే అవి రాయి మీదికి విసిరేసిన గాజు సీసాల్లా భళ్ళున పేలిపోతున్నాయి.

లోహాల్లో కెల్లా అత్యంత అధిక సాంద్రత గల ఆస్మియంని వాడి ప్రయోగాలు చేశారు. దాని సాంద్రత ఒక ఘనసెంటీ మీటర్‌కి 22.6 గ్రాములు. అది కూడా కొంత ద్రవ్యరాశిని పోగేసుకోగానే ఒత్తిడిని తట్టుకోలేక పేలిపోయింది. ఇరిడియంతో కూడా ప్రయత్నించారు. ప్రయోజనం కన్పించలేదు. ఆస్మియం, ఇరిడియం మిశ్రమాన్ని వాడినా, ఆశించిన ఫలితం దక్కలేదు.

మరో నెల గడిచిపోయింది. యిక మిగిలింది ఐదు నెలలే. క్రిస్టోన్ చాలా ఒత్తిడికి లోనవుతున్నాడు. అతని భార్య ఎథీనా కూడా ఆందోళన పడసాగింది. తమ బృందం అజుపస్‌కి మాటిచ్చినట్టు ఏడాది లోపల నిక్స్ గ్రహం చుట్టూ తిరుగుతున్న ఓ ఉపగ్రహాన్ని లాక్కొచ్చే ఉపకరణం తయారు చేయగలదో లేదోననే ఒత్తిడికన్నా తన భర్త ఆరోగ్యం గురించే ఆమె ఎక్కువ దిగులు పడసాగింది. అధిక పీడనాన్ని తట్టుకోలేక అత్యంత బలమైన లోహాలు కూడా ముక్కలుగా పేలిపోతున్నట్టు, ఒత్తిడిని తట్టుకోలేక తన భర్త గుండె ఎక్కడ ఆగిపోతుందోనని భయపడసాగింది.

ఆ రోజు రాత్రి నిద్రరాక మంచం మీద అశాంతిగా దొర్లుతున్న క్రిస్టోన్‌ని గమనించిన ఎథీనా, అతడ్ని పసిపిల్లాడిని గుండెలకు హత్తుకున్నట్టు, హత్తుకుని “ఎందుకంత టెన్షన్కి లోనవుతున్నావు? మనకింకా ఐదు నెలల సమయం మిగిలుంది. ఆ లోపలే తప్పకుండా విజయం సాధిస్తామన్న నమ్మకం నాకుంది” అతన్ని వూరడిస్తూ అంది.

“నాకా నమ్మకం కలగడం లేదు ఎథీనా. మన గ్రహం మీద దొరికే అన్ని రకాల లోహాల్ని, అలోహాల్ని పరీక్షించి చూశాం. ఏవి కూడా మనం ఆశిస్తున్న స్థాయి పీడనంలో వెయ్యోవంతు పీడనాన్ని కూడా తట్టుకోలేకపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అతి క్లిష్టమైన బుల్లి బ్లాక్‌హోల్‌ని ఎలా తయారుచేయాలో కనుక్కోగలిగాం. దాన్ని స్విచాన్ స్విచాఫ్ చేయడంలో కూడా విజయం సాధించాం. కానీ ప్రయోజనం ఏమిటి? కొన్ని కోట్ల టన్నుల పదార్థాన్ని అతి తక్కువ వైశాల్యం ఉన్న తనలో ఇముడ్చుకుని, తద్వారా ఏర్పడే అత్యధిక ఒత్తిడిని తట్టుకోగల పదార్థాన్ని కనుగొంటే తప్ప మన ప్రయోగం సంపూర్ణం కాదు” అన్నాడు క్రిస్టోన్.

“మనం మన గ్రహంలో దొరికే పదార్థాల గురించే ఆలోచిస్తున్నాం. వేరే గ్రహాల్లో దొరికే పదార్థాల్ని పరీక్షిస్తే ఫలితం ఉంటుందేమో ఆలోచించు” అంది.

వెంటనే మంచం మీద స్ప్రింగ్‌లా లేచి కూచున్నాడు క్రిస్టోన్. “అవును కదా. ఇన్ని రోజులూ ఈ ఆలోచన మనకెందుకు రాలేదు? కానీ ఇప్పుడు ఏ గ్రహానికెళ్ళి వెతకాలి? ఏ గ్రహంలో మనక్కావల్సిన పదార్థం దొరుకుతుందో ఎలా తెలుస్తుంది?”

“ఇప్పుడు కొత్తగా వెతకాలంటే సమయం సరిపోదు. మన శాస్త్రవేత్తలు స్పేస్ షటిల్‌లో ప్రయాణించి, విశ్వంలోని కొన్ని గ్రహాలు నివాసయోగ్యం అవునో కాదో తెల్సుకోవడం కోసం అన్వేషించారు కదా. ఆ గ్రహాల్లోని మట్టితో పాటు అక్కడి రాళ్ళని, శిలల్ని కూడా మోసుకొచ్చి, మ్యూజియంలో భద్రపరిచారు. వాటిలో ఇరవై ఐదవ శతాబ్దంలో కనుగొన్న కొరోట్ 25 బి గ్రహం గురించిన సమాచారం గుర్తుందా? పరిమాణంలో మన నిఫిలిక్స్ గ్రహంతో పోలిస్తే ఇరవై శాతం మాత్రమే ఉన్న ఆ గ్రహం ద్రవ్యరాశి మన గ్రహం ద్రవ్యరాశికన్నా ఇరవై రెట్లు ఎక్కువ. ఇప్పటివరకు విశ్వంలో మనకు తెల్సిన అన్ని గ్రహాల కంటే అత్యంత అధిక సాంద్రత కలిగిన గ్రహం అదే.”

“అవును. గుర్తుంది. అక్కడ దొరికిన రాళ్ళని, మనకు తెలియని ఏదో లోహంతో మిళితమై ఉన్న మట్టి పెళ్ళల్ని సేకరించి, తీసుకొచ్చారు. అది ఎటువంటి లోహమో కనుక్కో డానికి ఎన్నో ప్రయోగాలు చేసినా, దాని గుట్టు తెలియలేదని నేను సైన్స్ జర్నల్స్‌లో చదివాను.”

“మనం ప్రభుత్వ అనుమతి తీసుకుని, ఆ లోహాన్ని వాడుకుంటే మనక్కావల్సిన ఫలితం లభిస్తుందనిపిస్తోంది క్రిస్టోన్” అంది ఎథీనా.

ఆ ఆలోచనకే క్రిస్టోన్ చాలా ఉత్తేజితుడైనాడు. ప్రస్తుతం ఆ గ్రహంనుంచి సేకరించిన మట్టి నుంచి, రాళ్ళనుంచి లోహాన్ని వేరు చేయాల్సిన అవసరం లేదు. ఆ పని శాస్త్రవేత్తలు ఎప్పుడో చేసి, ఆ లోహం గురించి తెల్సుకోడానికి పలు ప్రయోగాలు చేశారు.

అజుపస్ అనుమతితో అనేక గ్రహాలనుంచి సేకరించిన మట్టి నమూనాలను భద్రపర్చిన ‘కాస్మోస్ మ్యూజియం’ నుంచి కొరోట్ 25 బి మట్టి నుంచి వేరు చేసిన లోహాన్ని తెచ్చుకున్నారు. అతని అంచనా నిజమైంది. చంద్రుణ్ణి ఆకర్షించడానికి అవసరమైనంత గురుత్వాకర్షణ శక్తిని పొందేలా అది తన ద్రవ్యరాశిని, తద్వారా సాంద్రతను పెంచుకుంటూ పోయింది.

తమ బృందానికిచ్చిన గడువులోపలే తన కప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేసిన క్రిస్టోన్ అజుపస్‌ని కల్సుకున్నాడు. “స్పేస్ షటిల్‌తో సహా అంతా సిద్ధంగా ఉంది. మీరెప్పుడంటే అప్పుడు ప్రయోగించడానికి తయారుగా ఉన్నాం” అన్నాడు.

అజుపస్ క్రిస్టోన్‌ని, అతని బృందాన్ని మనసారా అభినందించాడు. “అప్పుడే కాదు. సమయం ఆసన్నమైనపుడు చెప్తాను. అప్పటివరకు దాన్ని జాగ్రత్తగా చూసుకోండి” అన్నాడు.

ఆ రోజు రాత్రి మోజోతో ఈ శుభవార్తను పంచుకున్నాక, “ఇప్పుడు చెప్పు ఏంచేయాలో” అన్నాడు.

“నిక్స్ గ్రహం అధిపతి సిసిరస్‌ని, అతని భార్యను మన గ్రహానికి అధికారికంగా ఆహ్వానించండి. ఓ వారం రోజులు మన అతిథి గృహంలో ఉంచి, రాచమర్యాదలన్నీ చేద్దాం. అతను తిరిగి వెళ్ళేముందు మన కోరికను బైటపెట్టండి. అతను అంగీకరించాడా సరే, లేదా బలవంతంగా ఓ చంద్రుణ్ణి లాగేసుకోవడమే” అంది మోజో.

కుటుంబసమేతంగా తమ గ్రహానికి విచ్చేసి, కొన్ని రోజులు గడపవల్సిందిగా సిసిరస్‌కి అజుపస్ నుంచి ఆహ్వానం అందింది. ఆహ్వానం అందుకున్న రెండు వారాల తర్వాత సిసిరస్ తన భార్యతో సహా నిఫిలిక్స్ గ్రహాన్ని చేరుకున్నాడు. రాజప్రాసాదాన్ని తలదన్నే లాంటి అద్భుతమైన వసతి గృహంలో వారికి విడిది ఏర్పాటు చేశారు. పంచభక్ష్య పరమాన్నాల్ని భోజనంలో వడ్డించారు. అజుపస్, మోజో ఇద్దరూ దగ్గరుండి వాళ్ళకు తమ గ్రహంలోని వింతలూ విశేషాల్ని చూపించారు.

వాళ్ళు తిరిగి తమ గ్రహానికి ప్రయాణమయ్యేరోజు రానే వచ్చింది. “మీరిచ్చిన అపూర్వమైన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. ఈ వారం రోజులు ఎన్ని అందమైన అనుభవాల్ని, అనుభూతుల్ని మాకు కానుకగా ఇచ్చారో.. మీకు మా దంపతులం రుణపడిపోయాం” నవ్వుతూ అన్నాడు సిసిరస్.

“మా ఆతిథ్యం మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు మీరు రుణపడటం కాదు. మా రుణాన్ని ఇలా తీర్చుకున్నాం. మీ గ్రహానికి మేము అతిథులుగా వచ్చినపుడు మీరెంత బాగా మమ్మల్ని ఆదరించారో మేమెలా మర్చిపోగలం?” అన్నాడు అజుపస్.

“మాతో పోలిస్తే మీ గ్రహం దేన్లోనూ తక్కువ కాదు. ఆర్థికంగా, సామాజికంగా, విజ్ఞానపరంగా మాతో సమానమైన అభివృద్ధిని సాధించారు. అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో అలరారే మీ గ్రహంలో కొన్ని రోజులు గడపగలగడం మా అదృష్టం” అన్నాడు సిసిరస్.

“మా గ్రహంలో హరితవనాలున్నాయి. అందమైన సరస్సులున్నాయి. నదులు, సముద్రాలు, జలపాతాలు.. అన్నీ ఉన్నాయి. కానీ ఒక్క చంద్రుడు కూడా లేకపోవడం మమ్మల్ని చాలా కలచివేస్తో ఉంటుంది” బాధగా అంది మోజో.

“నా భార్యకు వెన్నెలంటే చాలా ఇష్టం. నా భార్యకే కాదు మా గ్రహవాసులందరికీ వెన్నెలంటే ఇష్టం. కానీ మాకా అదృష్టం లేదు. ఈ విషయంలో మీకూ మాకు ఎంత వ్యత్యాసం ఉందో కదా. మీకు రెండు చంద్రుళ్ళున్నారు. మాకు ఒక్క చంద్రుడు కూడా లేడు” అన్నాడు అజుపస్.

“మీరు దయతో మాకో చంద్రుణ్ణి బహుమతిగా ప్రసాదిస్తే, మీరిందాక చెప్పినట్టు మన రెండు గ్రహాలు అన్ని విషయాల్లో సమానంగా ఉంటాయి” అంది మోజో.

సిసిరస్ వెంటనే ఏమీ మాట్లాడలేదు. చంద్రుణ్ణి బహుమానంగా ఇవ్వడం అనేదే అతనికి వింతగా అన్పించింది. ఈ సమయంలో తొందరపడి మాట తూలకూడదని నిర్ణయించుకున్నాడు.

అతను మౌనంగా ఉండటం గమనించిన అతని భార్యకు అసౌకర్యంగా అన్పించింది. వారం రోజులు తమకు రాజభోగాల్ని అందించిన దంపతులు ఓ కోరిక కోరితే దాన్ని తీర్చడం తమ బాధ్యత కదా అని ఆలోచించింది.

“మనకు రెండు చంద్రుళ్ళు ఉండటం వల్ల అదనంగా ఒనగూడుతున్న ప్రయోజనం ఏముంది? ఒక చంద్రుడైనా అదే వెన్నెల, రెండు చంద్రుళ్ళయినా అదే వెన్నెల. మీరెప్పుడూ అంటూ ఉంటారుగా నిక్స్, నిఫిలిక్స్ గ్రహాలు కవల సోదరులవంటివని. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండటం న్యాయం కాదు కదా. ఒక చంద్రుణ్ణి ఇచ్చేద్దామండి” అంది తన భర్త వైపు మురిపెంగా చూస్తూ.

సిసిరస్ సాలోచనగా తల పంకించాడు. అజుపస్ వైపు తిరిగి, “ఒకవేళ మేము ఓ చంద్రుణ్ణి మీ గ్రహానికి బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నా, దాన్నెలా అక్కడినుంచి యిక్కడికి తరలిస్తారు? అది అసాధ్యం కదా” అన్నాడు.

“మీరు పెద్దమనసు చేసుకుని, ఓ చంద్రుణ్ణి బహుమతిగా ఇవ్వాలేగానీ, దాన్ని ఇక్కడికి తరలించే మార్గాల్ని అన్వేషించమని నేను మా శాస్త్రవేత్తల్ని పురమాయిస్తాను. దానికి మార్గం సుగమం అయ్యాకే మీరిచ్చే అపూర్వమైన బహుమతిని మా గ్రహానికి తెచ్చుకుంటాం” అన్నాడు అజుపస్. తమ శాస్త్రవేత్తలు అటువంటి అసాధ్యమైన పనిని తమ అపారమైన జ్ఞానసంపదతో అప్పటికే సుసాధ్యం చేసిన విషయాన్ని మాత్రం బహిర్గతపర్చకుండా దాచి ఉంచాడు.

సిసిరస్ కొన్ని క్షణాలు ఆలోచించాక, “నేను నిక్స్ గ్రహాన్ని పరిపాలించేవాడినే తప్ప దాని మీద హక్కుదారుణ్ణి కాదు. మా గ్రహానికి వెళ్ళాక, మంత్రిమండలితో ఈ విషయం చర్చిస్తాను. ప్రజల అభీష్టాన్ని కూడా కనుక్కుంటాను. అందరూ అంగీకారం తెలిపితే, ఓ చంద్రుణ్ణి మీకు బహుమతిగా ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు” అన్నాడు.

“అలాగే కానివ్వండి. మీనుంచి అందే తీపికబురు కోసం మేము ఎదురుచూస్తుంటాం” అన్నాడు అజుపస్.

సిసిరస్ తన గ్రహానికి చేరుకున్న మరునాడు మంత్రిమండలిని సమావేశపరచి, నిఫిలిక్స్ గ్రహం అధిపతి కోరిన కోరికేమిటో తెలిపి, “ఈ విషయంలో మీ అభిప్రాయమేమి టి?” అని అడిగాడు.

“అసలు వారి కోరికే వింతగా ఉంది. మన ఉపగ్రహాన్ని బహుమతిగా అడగడంలో వారి ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన మన రెండు గ్రహాలు ఒకే నక్షత్రం చుట్టూ పరిభ్రమించడానికి, నిఫిలిక్స్ గ్రహానికి చంద్రుళ్ళు లేకుండా మన గ్రహానికి మాత్రమే రెండు ఉపగ్రహాలు ఏర్పడటానికి దోహద పడిన ఖగోళ పరిస్థితులేమిటో మనకు తెలియదు. అవేమిటో తెలియకుండా ఉపగ్రహాల్ని వాటి స్థానాలనుంచి కదిలించడం అంత శ్రేయస్కరం కాదు. అలా చేయడం వల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతాయో మనకు తెలియదు” అన్నాడో మంత్రి.

“ఒకవేళ దానివల్ల ఎటువంటి అనర్థమూ జరగదని మన శాస్త్రవేత్తలు నిర్ధారిస్తే, అప్పుడు ఒక ఉపగ్రహాన్ని నిఫిలిక్స్ గ్రహానికి ఇవ్వొచ్చా? అందువల్ల మనక్కలిగే నష్టం ఏమిటి?” అని అడిగాడు సిసిరస్.

“రెండు చంద్రుళ్ళు ఉండటం వల్ల మన ప్రజలకు అమావాస్య అంటే ఏమిటో తెలియదు. ప్రతి రాత్రి పున్నమి రాత్రిలా వెన్నెల ధారాళంగా కురుస్తూ ఉంటోంది. వెన్నెల మరింత చిక్కగా, ప్రకాశవంతంగా ఉంటోంది. మనం ఒక చంద్రుణ్ణి కోల్పోతే దాంతో పాటు వెన్నెట్లోని సగం సౌందర్యాన్ని కోల్పోతాం. అప్పుడు కొన్ని గ్రహాల్లో ఉన్నట్టే మనకూ నెలలో ఓ పౌర్ణమి, ఓ అమావాస్య ఏర్పడతాయి. మనకు సహజంగా లభించిన అద్భుతమైన జంట చంద్రుళ్ళు వెలువరించే వెన్నెల్లో పావు వంతు తగ్గినా మన ప్రజలు ఒప్పుకోరు” అన్నాడు మరో మంత్రి.

“మనం ప్రజల అభీష్టాన్ని కూడా తెల్సుకోవడం మంచిదేమో” అన్నాడు సిసిరస్.

“రేపే మన గ్రహవాసులందరికీ చేరేలా ఓ వార్తను పంపుదాం. మనకున్న రెండు చంద్రుళ్ళనుంచి ఓ చంద్రుణ్ణి ప్రభుత్వం నిఫిలిక్స్ గ్రహానికి బహుమతిగా ఇవ్వదల్చుకుంటోందని, ఈ విషయంలో ప్రజల అభిప్రాయమేమిటో తెల్సుకున్నాక, చివరి నిర్ణయం తీసుకుంటుందని తెలియపరుద్దాం. చూద్దాం ప్రజలెలా స్పందిస్తారో” అన్నాడు సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రి.

“సరే. అలాగే కానివ్వండి” అన్నాడు సిసిరస్.

మరునాడు గ్రహవాసులందరి కళ్ళ ముందు గాల్లోనే ఓ టీవీ తెరలాంటిది ప్రత్యక్షమైంది. అందులో సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రి కన్పించి మాట్లాడసాగాడు. “మనకున్న రెండు చంద్రుళ్ళలో ఒక చంద్రుణ్ణి తమకు బహుమతిగా ఇవ్వమని నిఫిలిక్స్ గ్రహవాసులు అడుగుతున్నారు. ఈ విషయంలో ప్రజల మనోభీష్టం ప్రకారమే నడుచుకోవాలని మన అధినేత నిర్ణయించుకున్నారు. తెర మీద మీకు ఎడమ వైపు ఆకుపచ్చ బటన్, కుడి వైపు ఎర్రని బటన్ కన్పిస్తున్నాయి కదా. మీకు సమ్మతమైతే ఆకుపచ్చ బటన్ని నొక్కండి. లేకపోతే ఎర్రబటన్ని నొక్కండి. మీ అభిప్రాయాన్ని తెలియచేయడానికి ఐదు నిమిషాల సమయం మాత్రమే ఉంది. పధ్నాలుగేళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనవల్సిందిగా మనవి” అన్నాడు. అతను మాట్లాడటం పూర్తయిన వెంటనే తెరమీద ఆకుపచ్చ బటన్, ఎర్రబటన్ ప్రస్ఫుటంగా కన్పించసాగాయి.

ఐదు నిమిషాలు పూర్తయిన వెంటనే సిసిరస్ ఎదురుగా ఉన్న తెరమీద ఫలితాలు కన్పించాయి. వందశాతం ప్రజలు ఎర్రబటన్ని నొక్కి తమ అసమ్మతిని తెలియచేశారు.

“వెన్నెలంటే మన ప్రజలకు ఎంతిష్టమో అర్థమైంది. నాకూ ఇష్టమే. కానీ ఈ గ్రహాధినేతగా తీరిక లేనంత పనిలో మునిగి ఉండటం వల్ల వెన్నెలని ఆస్వాదించడమే మరిచిపోయాను” సిసిరస్ తన మంత్రులతో అన్నాడు. ‘ఎన్ని రోజులైందో నేనూ నా భార్య వెన్నెట్లో తడిసి.. ఈ రోజు రాత్రి ఎలాగైనా సరే వెన్నెల జల్లులో ఇద్దరం ముద్దయిపోవాలి’ అని మనసులో అనుకున్నాడు.

అజుపస్‌తో మాట్లాడాడు. “మా మంత్రి మండలితో పాటు గ్రహవాసులందరి అభిప్రాయం తెల్సుకున్నాను. ఓ చంద్రుణ్ణి మీకివ్వడానికి వాళ్ళు అంగీకరించడం లేదు. అన్యథా భావించవద్దు. ఈ విషయంలో నేనేమీ చేయలేను” అన్నాడు.

అప్పటివరకు నవ్వుతూ మాట్లాడుతున్న అజుపస్ మొహం క్రోధంతో ఎర్రబడింది. “మాకో చంద్రుణ్ణి ఇవ్వక తప్పదు” అన్నాడు.

“మా అంగీకారం లేకుండా ఎలా తీసుకుంటారు?” అన్నాడు సిసిరస్.

“బలవంతంగా లాక్కుంటాం.”

“అదంత సులభం కాదు. మేము స్నేహానికి ప్రాణం ఇస్తాం. వైరం తలెత్తితే ప్రాణాలు తీయడానికి వెనుకాడం.”

“మీ చంద్రుణ్ణి మీ కళ్ళముందే వలవేసి, లాక్కొచ్చి మా గ్రహం చుట్టూ కట్టేసుకుంటాం చూస్తూ ఉండండి” అన్నాడు అజుపస్.

“ఓరి పిచ్చివాడా.. మేము కళ్ళు మూసుకుని ఉన్నామనుకుంటున్నావా? మా కళ్ళు ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటాయి. మీ శాస్త్రజ్ఞులు కనిపెట్టిన బ్లాక్‌హోల్ శకలం లాంటి అత్యధిక గురుత్వాకర్షణ శక్తి గల పదార్థం గురించి మాకు తెలియదనుకున్నావా? మీ వాళ్ళు చేసిన ప్రయోగాలు, వాటి ఫలితాల గురించి మా వేగుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. మన మధ్య ఉన్న స్నేహ సంబంధాల కారణంగా మా చంద్రుళ్ళ మీద వాటిని ప్రయోగించే అవకాశం లేదనుకున్నాం. అయినా ముందుజాగ్రత్త చర్యగా దాన్ని విధ్వంసం చేయగల శక్తివంతమైన ఆయుధాల్ని మా శాస్త్రవేత్తలు తయారుచేసి ఉంచారు. మా చంద్రుణ్ణి లాక్కునే సాహసం చేయకు. నువ్వు దేన్నయితే వల అనుకుంటున్నావో దాన్ని క్షణాల వ్యవధిలో తుత్తునియలు చేసేయగలం. జాగ్రత్త” సిసిరస్ హూంకరించాడు.

అతని బెదిరింపులు వినటంతోటే అజుపస్ పిచ్చి ఆవేశంతో వూగిపోయాడు. వెంటనే తన మంత్రుల్తో పాటు సైన్యాధ్యక్షుణ్ణి పిలిచి మంతనాలు జరిపాడు.

“ఆ సిసిరస్ పొగరు అణచాలంటే ఏం చేయాలో చెప్పండి” అన్నాడు.

“చంద్రుణ్ణి లాక్కుని వచ్చే మన బేబీ బ్లాక్‌హోల్‌ని ధ్వంసం చేసే ఆయుధాలు వాళ్ళ దగ్గర నిజంగా ఉన్నాయని అనుకోను. కేవలం మనల్ని బెదిరించడానికే అలా చెప్పి ఉంటాడు. మనం ఒకటి కాదు రెండు చంద్రుళ్ళని మన గ్రహం వైపుకి లాక్కు వచ్చేద్దాం. ఆ దెబ్బతో అతని పొగరు అణిగిపోతుంది” అన్నాడో మంత్రి.

“దానివల్ల ఓ ప్రమాదముంది. నిజంగానే వాళ్ళ దగ్గర శక్తివంతమైన ఆయుధాలుండి, మన బేబీ బ్లాక్‌హోల్‌ని ధ్వంసం చేస్తేనో.. మన శాస్త్రజ్ఞుల యేడాది శ్రమ బూడిదైపోతుంది. మనం మరో మార్గం ఆలోచించడమే మంచిది” అన్నాడు మరో మంత్రి.

“దానికి ఒకటే మార్గం.. ఆ గ్రహం మీద యుద్ధం ప్రకటించడమే. మన వద్ద ఉన్న అపారమైన ఆయుధ సంపత్తితో ఆ గ్రహాన్ని సునాయాసంగా ఓడించవచ్చని నా నమ్మకం. నిక్స్ గ్రహం మన స్వంతమయ్యాక ఆ రెండు చంద్రుళ్ళ మీద కూడా ఆధిపత్యం మనదే అవుతుంది. వాటితో బంతులాట ఆడుకున్నా మనల్ని అడిగేవాడుండడు” అన్నాడు సైన్యాధ్యక్షుడు

“ఒకవేళ మన ఆయుధ సంపత్తి కన్నా వాళ్ళ వద్ద ఎక్కువ ఆయుధాలుంటేనో? అప్పుడేమిటి మన పరిస్థితి?” ఓ మంత్రి తన అనుమానాన్ని బైట పెట్టాడు.

“అలా అనుకుని మన శక్తియుక్తుల్ని తక్కువ అంచనా వేసుకోవడం మంచిది కాదు. గెలుపు తప్పకుండా మనదే అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను” అన్నాడు సైన్యాధ్యక్షుడు.

“నేను కాదనడం లేదు. కీడెంచి మేలెంచమని కదా పెద్దవాళ్ళు అంటుంటారు. ఒక వేళ మన అంచనా తప్పయితే ఏమౌతుందనే విషయం ఆలోచించి పెట్టుకోవాలిగా” అన్నాడా మంత్రి.

“అప్పుడు సంధి చేసుకుందాం” అన్నాడు అజుపస్.

“సంధికి వాళ్ళు పెట్టే షరతులు మనకు ఇబ్బంది కలిగించేవి, అవమానానికి లోను చేసేవి ఉండే అవకాశం ఉంది కదా” అన్నాడు మరొక మంత్రి.

“నేనలా అనుకోను. సిసిరస్ మనస్తత్వాన్ని సరిగ్గా అంచనా వేసిన వాడిగా చెప్తున్నాను. సంధి కోరుకుంటే బేషరతుగా ఒప్పుకుంటాడు తప్ప మన మీద కక్ష తీర్చుకోవాలనుకోడు” అన్నాడు అజుపస్.

“ఐతే యిక ఆలస్యం దేనికి? రేపే వాళ్ళ మీద యుద్ధ ప్రకటన చేద్దాం” అన్నాడు సైన్యాధ్యక్షుడు

“మనం గెలవాలంటే ఒక్కోసారి రుజుమార్గం వదిలేసి వక్రమార్గం అవలంభించాల్సి వస్తుంది. మనం యుద్ధం చేయబోతున్నట్టు ముందుగా హెచ్చరించి, యుద్ధం మొదలెడితే వాళ్ళు బలంగా తిప్పి కొట్టే ప్రమాదముంది. అకస్మాత్తుగా దాడి చేయడం మంచిది. ఏం జరుగుతుందో తెల్సుకుని, షాక్ నుంచి తేరుకునే లోపల వీలైనంత నష్టం కలుగచేయాలి. మొదటి దాడిలోనే అపారమైన ఆస్తినష్టం, ప్రాణ నష్టంతో పాటు ఆయుధాగారాల్ని ధ్వంసం చేయడం ద్వారా శత్రువుని బలహీనపర్చాలి. అప్పుడు విజయం మనదే” అన్నాడు అజుపస్.

“హెచ్చరిక లేకుండా దొంగ దెబ్బ తీయడం అధర్మం కదా. మీరేగా అన్నారు సిసిరస్ మంచివాడని. మంచివాళ్ళతో మనం కూడా మంచిగా వ్యవహరించడం ఉత్తమం కదా” మంత్రుల్లో కెల్లా వయసులో పెద్దవాడు, నీతి నియమాల్ని ప్రాణం కన్నా మిన్నగా భావించే సాంస్కృతిక శాఖ మంత్రి మృదు స్వరంతో, మెల్లగా అన్నాడు.

“ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మన గ్రహానికి కూడా ఓ చంద్రుడు కావాలి. దాన్ని సాధించడం కోసం ధర్మాధర్మ విచక్షణను విస్మరించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను” అన్నాడు అజుపస్.

“ధర్మమో అధర్మమో.. యుద్ధంలో గెలుపు ముఖ్యం. మన గ్రహాధిపతి శెలవిచ్చినట్టు అధాట్టుగా దాడి చేయడం వల్ల శత్రువుని కోలుకోలేని దెబ్బ కొట్టొచ్చు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో దాడికి వ్యూహరచన చేస్తాను” అన్నాడు సైన్యాధ్యక్షుడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here