చంద్రునికో నూలుపోగు-7

0
6

[ప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘చంద్రునికో నూలుపోగు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[బిగ్‍మాస్‌ని నాశనం చేయడానికి బయల్దేరిన భూగ్రహ వ్యోమగాముల స్పేస్‌షిప్ కంట్రోల్ తప్పి అంతరిక్షంలో సుదూరంగా దూసుకుపోతుంది. కొద్ది రోజుల్లో తమ ప్రాణాలు పోక తప్పదని వారు గ్రహిస్తారు. రాబర్ట్ దుఃఖిస్తుంటే అయాన్ష్ వారిస్తాడు. గతంలో ఎందరో వ్యోమగాములు ప్రాణత్యాగం చేస్తేనే అంతరిక్ష రంగంలో పురోగతి సాధ్యమయిందని చెప్తాడు. త్వరలో తన కూతురి పెళ్ళి చేయాలని అనుకున్నానని, ఇంతలోనే మృత్యుముఖంలోకి వెళ్తున్నానని బాధపడ్తాడు రాబర్ట్. స్పేస్ టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ కాలంలో తమకెందుకీ పరిస్థితి ఎదురయిందని అడుగుతుంది మహిక. బహుశా బిగ్‍మాస్‍ని ప్రయోగించినవాళ్ళే తమ స్పేస్ షిప్‍ని హ్యాక్ చేసి ఉంటారని అంటాడు అయాన్ష్. చంద్రుణ్ణి కాపాడుకోలేకపోతే ఆర్యమిహిర క్షమిస్తాడో లేదో తెలియదుకానీ భూగ్రహవాసులెవ్వరూ మనల్ని క్షమించరని సకూరా అంటుంది. వ్యోమనౌక కుజగ్రహాన్ని దాటిపోతున్నట్టు తెర మీద కనిపించిన మెసేజ్‍ని చూసి నలుగురూ స్తబ్ధుగా కూర్చొని, గతానుభవాలని, అనుబంధాల్ని, ఆత్మీయుల్ని తల్చుకుంటారు. తాము మరికొన్ని రోజులు బతికుండాలంటే ఆహారం, నీళ్ళని అతి తక్కువగా తీసుకోవడం అవసరమని అంటాడు అయాన్ష్. రాబర్ట్, సకూరా అంగీకరించరు. ఏదైనా అద్భుతం జరగొచ్చని అయాన్ష్ వారిని ఒప్పిస్తాడు. కొన్ని రోజులకి స్పేస్‌షిప్ సౌరమండలపు చివరి అంచుని కూడా దాటి ఇంటర్‌స్టెల్లార్ స్పేస్‌లోకి ప్రవేశిస్తుంది. కొన్ని గంటల ప్రయాణం అనంతరం అది దిశను మార్చుకుని మరింత వేగంతో కిందకి దూసుకుపోతుంది. ఏదో గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తికి లోనై దానివైపుకి ప్రయాణిస్తున్నామని గ్రహించిన అయాన్ష్ తోటివారికి జాగ్రత్తలు చెప్పి, ఎవరికీ ఏ ప్రమాదమూ లేకుండా, లేజర్ గన్స్ భద్రపరిచిన స్టీల్ కంటెనర్లని ప్యారాచూట్లకి కట్టేసి కిందకి తోస్తాడు. తర్వాత అందరూ ప్యారాచూట్లు కట్టుకుని కిందకి దూకేస్తారు. వాళ్ళు కిందికి దూకిన కొన్ని క్షణాల వ్యవధిలోనే వ్యోమ నౌక నేలను ఢీకొని, ముక్కలైపోతుంది. ఇక చదవండి.]

[dropcap]న[/dropcap]లుగురూ ధడ్‌మంటూ శబ్దం చేస్తూ నేలకు గుద్దుకున్నారు. ఎముకలు విరిగినంత బాధ.. సకూరా అయితే నొప్పిని తట్టుకోలేక ‘అమ్మా’ అంటూ అరిచింది. మహికకు కూడా భుజాలు, నడుములు విరిగిపోయినంత బాధనిపించినా పంటి బిగువున భరించింది.

నలుగురూ లేచి నిలబడ్డారు. శరీరబరువు ఒక్కసారిగా రెండింతలైనట్టు అడుగులు భారంగా పడ్తున్నాయి.

“ఈ గ్రహానికి మన భూమితో పోలిస్తే ఎన్ని రెట్ల గురుత్వాకర్షణశక్తి ఉందో?” తనలో తను మాట్లాడుకుంటున్నట్టు అంది సకూరా. ఆమెకు నడుస్తుంటే నెత్తిమీద అరవై కేజీల బరువును మోస్తున్నట్టు అన్పిస్తోంది.

“నా ఉద్దేశంలో మూడు రెట్లు అధిక గురుత్వాకర్షణశక్తి ఉందనిపిస్తోంది” అన్నాడు అయాన్ష్.

“మన శరీరాలు అంతటి గురుత్వాకర్షణని తట్టుకోగలవో లేదో?” అంది సకూరా. ఇతర గ్రహాలనుంచి సేకరించిన మట్టి నమూనాలను, భూమ్మీద పడిపోయిన ఆస్టరాయిడ్ శకలాలను విశ్లేషించి వాటి కెమికల్ నిర్మాణాల్ని కనుక్కోవడమే ఆమె బాధ్యత. అంతరిక్షయానాల గురించిన అనుభవం లేకపోవడం వల్ల ఆమెకు అనేక అనుమానాలు వస్తున్నాయి.

“మనం చంద్రుడితో పాటు వేరే గ్రహాల మీద కాలనీలు నిర్మించుకోడానికి కొన్ని వందల యేళ్ళ క్రితమే ముగ్గురు భౌతిక శాస్త్రవేత్తలు ఈ విషయంలో పరిశోధనలు చేసి, మానవ శరీరం భూమి గురుత్వాకర్షణశక్తి కన్నా నాలుగున్నర రెట్ల గురుత్వాకర్షణశక్తిని తట్టుకోగలదని సిద్ధాంతీకరించారు. ఈ గ్రహం మీద అంతకన్నా తక్కువే గ్రావిటీ ఉన్నట్టనిపిస్తోంది. దానికి తోడు మనం తొడుక్కున్న ఎంపీరియన్ సూట్ వల్ల గురుత్వాకర్షణ ప్రభావం మనమీద సగానికి మించి పడదు. మనం సురక్షితంగా ఉన్నాం. మన బరువు కన్నా రెండింతల బరువు మోయడం కష్టమేమీ కాదుగా” అన్నాడు అయాన్ష్.

ముందు జారవిడిచిన స్టీల్ కంటెయినర్‌ని వెతుక్కుంటూ నడుస్తున్నారు. కొంత దూరం నడిచాక, అక్కడి గ్రావిటీని తట్టుకుని నడవడానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు నడక ఇబ్బందిగా లేదు. సునాయాసంగా నడవగలుగుతున్నారు. ఎటొచ్చి వేగం కొద్దిగా మందగించింది.

ఎండ పడ్తున్నప్పటికీ వాతావరణం చల్లగా ఉంది. నలువైపులా గుబురుగా పెరిగిన చెట్లు కన్పిస్తున్నాయి. అవి ఏ చెట్లో అర్థం కావడం లేదు. భూమ్మీద పెరిగే చెట్ల మాదిరి లేవు. చెట్లన్నీ ఆరడుగుల ఎత్తుకి మించి పెరగలేదు. కొన్ని చెట్ల కొమ్మలమీద ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం రంగులో ఉన్న పళ్ళు కన్పిస్తున్నాయి.

“చాలా ఆకలిగా ఉంది. ఆ పళ్ళను తినాలనిపిస్తోంది” వాటి వైపు ఆశగా చూస్తూ అంది సకూరా.

“వద్దు. అవి తినడానికి పనికొచ్చే పళ్ళో కాదో తెలియకుండా తినడంవల్ల ఆరోగ్యం పాడుకావొచ్చు. అవి విషపూరితమైతే ప్రాణాలు కూడా పోవచ్చు. స్టీల్ కంటెయినర్‌ని ఎవరి కంటా పడకుండా జాగ్రత్తగా ఎక్కడైనా దాచిపెట్టాక, ఈ గ్రహాన్ని సర్వే చేద్దాం. మనం తినడానికి పనికొచ్చే ఆహారం దొరికే అవకాశం ఉంది. అప్పటివరకు ఆకలిని ఓర్చుకుందాం” అన్నాడు అయాన్ష్.

మహిక తలయెత్తి ఆకాశంలోకి చూసి, ఆశ్చర్యంతో అక్కడే నిలబడిపోయింది.

“ఏమైంది? ఎందుకు నిలబడిపోయావు? కాళ్ళునొప్పులు పుడ్తున్నాయా?” అని అడిగాడు అయాన్ష్

“లేదు. ఆకాశంలోకి చూడు. ఓ అద్భుతం కన్పిస్తుంది” అంది.

అయాన్ష్‌తో పాటు మిగతా ఇద్దరు కూడా తలయెత్తి ఆకాశం వైపు చూశారు. అక్కడ రెండు సూర్యబింబాలు కన్పించాయి. ఓ సూర్యబింబం తెల్లగా మెరుస్తూ ఉంటే మరో సూర్య బింబం లేత నారింజ రంగులో ఉంది.

“ఈ గ్రహం రెండు నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తుందన్నమాట. బైనరీ సిస్టం.. ఇందులో అద్భుతం ఏముంది? అంతరిక్షంలో ఇలాంటి గ్రహాలు ఎన్నో ఉండొచ్చు. కెప్లర్ 16బి అనే గ్రహం కూడా రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతూ ఉందని మన ఖగోళశాస్త్రవేత్తలు ఎప్పుడో కనుక్కున్నారు కదా” అన్నాడు అయాన్ష్.

“అటువంటి గ్రహాలు ఉన్నాయని పవర్‌ఫుల్ టెలిస్కోప్‌ల ద్వారా చూసి మనవాళ్ళు తెల్సుకొన్నారు. కానీ మనం అటువంటి గ్రహంలో తిరుగాడుతున్నాం. ఇది అద్భుతమే కదా” అంది మహిక.

“నాకైతే పరమాద్భుతంలా ఉంది. ఎటొచ్చీ నాకో విషయం అర్థం కావడం లేదు. రెండు నక్షత్రాల చుట్టూ రివాల్వ్ అవుతున్నా, ఎందుకు వాతావరణంలో ఉండాల్సినంత వేడి లేదు?” అని అడిగింది సకూరా

“ఆ నక్షత్రాలు ఈ గ్రహం నుంచి చాలా దూరంలో ఉండి ఉంటాయి. వాటిల్లో ఒకటి రెడ్ జయంట్. దాన్నుంచి వచ్చే వేడి చాలా తక్కువగా ఉంటుంది” అన్నాడు అయాన్ష్.

మరి కొంతసేపు వెదికాక, వాళ్ళకు స్టీల్ కంటెయినర్ కన్పించింది. పక్కనే ఉన్న పొదలమధ్య గుంట తవ్వి, కంటెయినర్‌ని అందులో పెట్టి, పైకి కన్పించకుండా మట్టితో కప్పేశారు. దానిమీద ఆకులు, కొమ్మలు పరిచారు. చుట్టూ ఉన్న పొదలన్నీ ఒకేలా ఉన్నా యి. అందుకే గుర్తుగా ఉండటం కోసం కంటెయినర్ని దాచిపెట్టిన పొదలో ఉన్న నాలుగు చెట్ల బోదెల మీద పదునైన రాతితో ఏ, ఎమ్, ఆర్, ఎస్ అనే ఆంగ్ల అక్షరాల్ని చెక్కారు.

“మన తదుపరి కార్యక్రమం ఏమిటి?” అని అడిగాడు రాబర్ట్.

“ఇది నివాసయోగ్యమైన గ్రహం. మనలాంటి మనుషులో లేకపోతే మనకంటే విభిన్నమైన రూపురేఖలతో ఉండే ఏలియన్సో ఎక్కడో నివసిస్తూ ఉండాలి. మనం దిగిన ప్రాంతం అడవిలా ఉంది. ఈ దరిదాపుల్లో మనుషులెవరూ ఉండే అవకాశం లేదు. మనం వాళ్ళను వెతుక్కుంటూ వెళ్దాం” అన్నాడు అయాన్ష్.

“వాళ్ళు మంచి ఏలియన్స్ కాకుండా దుర్మార్గులైతే మన పరిస్థితి ఏమిటి? మనల్ని బంధిస్తారేమో? మనల్ని చంపేస్తారేమో?” అంది మహిక.

“చెప్పలేం. నువ్వు చెప్పినట్టు జరిగే అవకాశం కూడా ఉంది. కానీ మనకు వేరే మార్గం లేదు. పాజిటివ్ గానే ఆలోచిద్దాం. మనం తిరిగి చంద్రుణ్ణి చేరుకోడానికి ఏదైనా మార్గం దొరుకుతుందేమో అన్వేషిద్దాం” అన్నాడు అయాన్ష్.

“నేనంత పాజిటివ్‌గా ఆలోచించలేను. ఐనా నిన్ను అనుసరించక తప్పదుగా. మాకు ప్రత్యామ్నాయం లేదు” అన్నాడు రాబర్ట్.

నలుగురూ మెల్లగా నడవసాగారు. పోను పోను చెట్లు మరింత దట్టం కాసాగాయి. రకరకాల చెట్లు.. వింత వింత రూపాల్లో కన్పిస్తున్న చెట్లు..

“మనం అడవి నుంచి బైటికెళ్తున్నామా లేక అడవి మధ్యలోకి వెళ్తున్నామా?” నలువైపులా అనుమానంగా చూస్తూ అడిగింది మహిక.

“ఏదైనా కావొచ్చు. ఏలియన్స్ నివాసగృహాలు ఎటువైపు ఉంటాయో తెలియనప్పుడు ఏదో ఒక వైపు వెళ్ళక తప్పదు కదా. ఎంత నడిచినా అడవే వస్తుంటే, తిరిగి వెనక్కి నడుద్దాం” అన్నాడు అయాన్ష్.

అదే సమయంలో మహిక దృష్టి ఓ చెట్టు కొమ్మ మీద కూచుని, తమని జాగ్రత్తగా గమనిస్తోన్న పక్షి మీద పడింది.

చాలా వింతగా ఉందా పక్షి.. చిన్నప్పుడు కథల్లో చదివిన గండభేరుండ పక్షిలా ఉంది. కళ్ళు ఎర్రగా పిడికిలంత పరిమాణంలో నిప్పు కణికల్లా ఉన్నాయి. ముక్కు వెడల్పుగా బాతుముక్కులా ఉంది. రెక్కలు బలంగా కన్పిస్తున్నాయి. ఈకలు పంచరంగుల్లో ఉన్నాయి.

“అయాన్ష్.. ఆ పక్షి చూడు ఎంత భయంకరంగా ఉందో” అంది మహిక.

అందరూ తలయెత్తి దానివైపు చూశారు. అదే క్షణంలో ఆ పక్షి భీకరంగా అరిచింది. దాని ముక్కు తెర్చుకున్నప్పుడు దానికి ఇరువైపులా పదునైన పళ్ళు కన్పించడంతో వాళ్ళు భయంతో కొయ్యబారిపోయారు.

“అది మనమీద ఎటాక్ చేసేలా ఉంది. మనం ఓ తప్పు చేశాం అన్పిస్తోంది. ఒక్క లేజర్ గన్నైనా మనతో పాటు తెచ్చుకోవాల్సింది” చాలా మెల్లగా అన్నాడు రాబర్ట్.

“నాక్కూడా ఆ ఆలోచన వచ్చింది. కానీ మనం లేజర్ గన్‌తో తిరుగుతూ కన్పిస్తే ఏలియన్స్ మనల్ని శత్రువులనుకుని పొరబడి, మనం నోరు విప్పకముందే కాల్చేసే ప్రమాదముందనిపించడంతో, ఆ ఆలోచనని విరమించుకున్నాను” అయాన్ష్ కూడా మెల్లగా సమాధానం చెప్పాడు.

“ఆ పక్షి పళ్ళు చూశావా? అల్లిగేటర్ పళ్ళలా కన్పిస్తున్నాయి. ఒకవేళ అది మన మీద దాడి చేస్తే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి?” దాని వైపే కన్నార్పకుండా చూస్తూ అడిగింది సకూరా.

“మన శరీరాల్ని కప్పి ఉంచిన ఎంపీరియన్ సూట్సే మనకు రక్షణ. ఈ సూట్లు సన్నటి స్టీల్ దారాల్తో అల్లినంత దృఢంగా ఉంటాయి. పదునైన కత్తులు కూడా వాటిలోకి దూరలేవు. ఈ పక్షి పళ్ళేం చేస్తాయి? ధైర్యంగా ఉండండి” అన్నాడు అయాన్ష్.

అదే సమయంలో చెట్ల మధ్యలోంచి ఏదో జంతువు పరుగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ ఎదురుగా నిలబడింది. అది మూడడుగుల పొడవుంది. ఎత్తు మాత్రం అడుగున్నరే ఉంది. దాని ఒక్కో పాదం ఏనుగు పాదం అంత మందంగా అడుగు పొడవుంది. కళ్ళు నల్లగా ఉండి నిగనిగా మెరుస్తున్నాయి. తల చిన్నగా ఉంది. అది కదలకుండా వాళ్ళ వైపే చూస్తూ నిలబడిపోయింది.

“ఏం చేద్దాం?” గుసగుసగా అడిగింది మహిక.

“మనం కూడా కదలకుండా నిలబడదాం. ఇది మాంసాహారో శాకాహారో మనకు తెలియదు. ఒకవేళ శాకాహారి అయితే ప్రమాదం లేదు. మాంసాహారి అయితే అది మనలో ఒకర్ని చంపేలోపల మనం నలుగురుం కలిసి దాన్ని చంపేయగలం” అన్నాడు అయాన్ష్.

పదిహేను క్షణాలు భారంగా గడిచిఉంటాయి. చెట్టుమీద కూచుని ఉన్న పక్షి మరోసారి భయంకరంగా అరిచింది. ఆ అరుపుకి అదిరిపడిన జంతువు వెనక్కి తిరిగి పరుగెత్తసాగింది. పక్షి తన విశాలమైన రెక్కల్ని చాచి, ఎగురుతూ దాని వెంటపడి, దాని మెడని తన బలమైన పళ్ళతో కరచి పట్టుకుంది. జంతువు దాని పట్టునుంచి తప్పించుకోడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. పక్షి దాన్ని ఈడ్చుకుంటూ చెట్ల మధ్యలోకి వెళ్ళిపోయింది.

“అమ్మో.. ఎంత పెద్ద గండం గడిచిందో చూశారా? పులి జింక మెడను నోటితో కరిచి పట్టుకుని పొదల్లోకి లాక్కెళ్ళినట్టు, అంత బరువున్న జంతువుని ఎంత సునాయాసంగా లాక్కెళ్ళిందో” అంది సకూరా.

“మనం వేగంగా ఈ చోటు నుంచి వెళ్ళిపోవడం మంచిది” అంటూ అయాన్ష్ ముందుకు నడిచాడు. మిగతా ముగ్గురూ అతన్ని అనుసరించారు.

మరికొంత దూరం నడిచాక అడవి పలుచబడసాగింది. అడవిని దాటాక విశామైన మైదానం కన్పించింది.

“ఈ గ్రహం మీద భయంకరమైన జంతువులు, పక్షులు తప్ప మనుషులెవరూ లేరేమో” అన్నాడు రాబర్ట్.

“తప్పకుండా ఉంటారు. థీరీ ఆఫ్ ఎవల్యూషన్ అన్ని గ్రహాలకు వర్తిస్తుంది. వింత వింత జంతువులున్నట్టే వింతగా, మనకంటే విభిన్నంగా ఉండే మనుషులుంటారేమో తప్ప హోమోసేపియన్స్ ఆవిర్భవించకుండా ఉండరు” అన్నాడు అయాన్ష్.

మెల్లగా వెల్తురు తగ్గసాగింది. హొరైజన్లో అస్తమిస్తున్న రెండు నక్షత్రాల వైపు అబ్బురంగా చూస్తూ నిలబడింది మహిక.

“ఎంత అద్భుతమైన దృశ్యమో కదా. రెండు సూర్యుళ్ళు ఒకేసారి ఉదయించడం, ఒకేసారి అస్తమించడం అనే అరుదైన ఖగోళ వింతని చూసే అదృష్టం మనకు కలిగింది” చిన్నపిల్లలా సంబరపడిపోతూ అంది మహిక.

“అదృష్టం సంగతి తర్వాత. చీకటి పడ్డాక మనకెదురయ్యే ప్రమాదాలేమిటో ఆలోచించు మొదట. ఎక్కడ తలదాచుకోవాలి? చీకట్లో ఆహారాన్ని వెతుక్కుంటూ బైటికొచ్చే క్రూరజంతువులనుంచి ఎలా రక్షణ పొందాలో ఆలోచించు” అంది సకూరా.

అదే సమయంలో నాలుగు వింత ఆకారాలు వాళ్ళని చుట్టుముట్టాయి. వాళ్ళు ఎటునుంచి వచ్చారో అర్థం కాలేదు. గాల్లోంచి బైటికొచ్చినట్టు అకస్మాత్తుగా కళ్ళముందు ప్రత్యక్షమైనారు. వాళ్ళు మూడున్నర అడుగుల పొడవున్నారు. కాళ్ళు దిమ్మెల్లా పొట్టిగా బలంగా ఉన్నాయి. పైకి వెళ్ళే కొద్దీ శరీరం సన్నబడుతూ, తల తాటికాయంత ప్రమాణంలో ఉంది. కళ్ళు సన్నటి గీతల్లా ఉండి, చూపులు తీక్షణంగా ఉన్నాయి. శరీరాలు నీలంరంగులో ఉండి, చర్మం పొలుసుల్తో నిండి ఉంది. వాళ్ళ చేతుల్లో మారణాయుధాలేవో ఉన్నాయి. అవి తుపాకుల్లా లేవు. అరచేయంత సైజులో దీర్ఘచతురస్రాకారంలో ఉన్నాయి. వాటి స్క్రీన్స్ లేత నారింజ రంగులో మెరుస్తూ కన్పిస్తున్నాయి.

“ఎవరు మీరు? ఎక్కడినుంచి వచ్చారు?” అంటూ వాళ్ళలో ఒకతను కోపంగా ప్రశ్నించాడు. అతను ఏదో భాషలో మాట్లాడాడు. వాళ్ళకు అర్థం కాని భాష.. కానీ ఆ శబ్దాలు నలుగురి మెదళ్ళకి చేరిన వెంటనే అతనేమంటున్నాడో స్పష్టంగా అర్థమైంది.

“మేము భూగ్రహం నుంచి వచ్చాము” అన్నాడు అయాన్ష్.

“భూగ్రహమా? అదెక్కడుంది?”

“మిల్కీవే అనే గెలాక్సీలో కేంద్రం నుంచి దూరంగా ఉన్న అరాయన్ స్పైరల్ ఆర్మ్‌లో ఉంది మా గ్రహం.”

“ఎందుకొచ్చారు?” మరొక వింత ఆకారం ప్రశ్నించింది.

“మేము రావాలనుకుని రాలేదు. మా వ్యోమనౌకలో ఏదో సమస్య ఏర్పడటం వల్ల పొరపాటున మీ గ్రహాన్ని చేరుకున్నాం” అన్నాడు అయాన్ష్.

“మీ స్పేస్‌షిప్ ఎక్కడుంది?”

“లేదు. కంట్రోల్ ప్యానెల్ పని చేయకపోవడం వల్ల వేగంగా కిందికి జారి, ముక్కలైపోయింది.”

“మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదు. స్పేస్‌షిప్‌లు కంట్రోల్ ఎందుకు తప్పుతాయి? అసంభవం. మీరు ఏదో దురుద్ధేశంతోనే మా గ్రహానికి చేరుకున్నట్టున్నారు. మా గ్రహాన్ని ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో ఏదో గ్రహం నుంచి వచ్చిన ఏలియన్స్ కదా మీరు. నిజం చెప్పండి?” అతను హూంకరించాడు.

“లేదు. మా గమ్యం మీ గ్రహం కానే కాదు. అసలు మీ గ్రహం గురించి మాకు అవగాహన కూడా లేదు. వ్యోమనౌక ప్రమాదానికి గురైతే ఎలాగోలా దాన్నుంచి బైటపడి నవాళ్ళం. మీ గ్రహాన్ని ఆక్రమించుకునే ఉద్దేశం అస్సలు లేదు. కావాలంటే మమ్మల్ని తనిఖీ చేయండి. మా దగ్గర ఆయుధాలేమీ లేవు” అన్నాడు అయాన్ష్.

“మీరు ఏలియన్స్.. ఆయుధాలు చేతుల్లో ఉండాలని లేదు. మీ చేతులే ఆయుధాలు కావొచ్చు. మీ వ్రేళ్ళ కొసలనుంచి ప్రాణాంతక కిరణాలు దూసుకురావొచ్చు. మీ శరీరాల్ని స్కాన్ చేస్తే తప్ప మీ లోపల ఏముందో తెలియదు. నిజ నిర్ధారణ జరిగేవరకు మీరు మా బందీలు” అన్నాడతను.

***

తమ గ్రహం మీద దాడి చేసే ఉద్దేశంతో నలుగురు ఏలియన్స్ వచ్చారని, వాళ్ళని సైనికులు బంధించి కారాగారవాసంలో ఉంచారని సాల్మోనియస్ గ్రహవాసులందరికీ తెలిసిపోయింది. ఏలియన్స్ ఎలా ఉంటారో చూడాలన్న ఉత్సుకతతో సాల్మోనియన్లు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అంతమందిని నియంత్రించడం సైనికులకు పెద్ద తలనొప్పిగా మారింది.

సైనికాధికారులు గ్రహాధినేత ఓసిరస్‌ను కలిసి సమస్యను వివరించారు.

“ఏలియన్స్ ఎలా ఉంటారో చూడాలన్న కుతూహలం ఉండటం సహజమే కదా. ప్రజల సౌకర్యార్థం ఆ నలుగుర్ని కారాగారం వెలుపల గ్లాస్ కంటెయినర్లో ప్రదర్శనకు పెట్టండి. అందరికీ కన్పించేలా ఎత్తయిన వేదిక మీద గాజు గదిని అమర్చండి. ఏలియన్స్ తప్పించుకుని పోకుండా అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు తీసుకున్నాకే ప్రదర్శన ఏర్పాటు చేయండి. ఉదయం ఎనిమిది గంటలనుంచి సాయంత్రం ఆరు గంటలవరకు ఏలియన్స్‌ని చూడొచ్చని ప్రకటన విడుదల చేయండి” అన్నాడు ఓసిరస్.

సైన్యాధ్యక్షుడివైపు తిరిగి, “ఇంతకీ వాళ్ళు మన గ్రహానికి ఎందుకొచ్చారో తెల్సుకున్నారా?” అని అడిగాడు.

“వాళ్ళ స్పేస్‌షిప్‌లో ఏదో సమస్య ఏర్పడటం వల్ల పొరపాటున మన గ్రహాన్ని చేరుకున్నట్టు చెప్తున్నారు. వాళ్ళు ప్రయాణం చేసిన స్పేస్‌షిప్ మన గ్రహాన్ని ఢీకొని ముక్కలైన విషయం వాస్తవమే. ధ్వంసమైన వ్యోమనౌక శకలాల్ని మన సైనికులు అడవంతా గాలించి తీసుకొచ్చి మన ప్రయోగశాలలో ఉంచారు” అన్నాడు సైన్యాధ్యక్షుడు

“వాళ్ళు చెప్పేది నిజమేనా? వాళ్ళ వల్ల మన గ్రహానికి గానీ గ్రహవాసులకు గానీ ప్రమాదమేమీ లేదని నిర్ధారణకు వచ్చారా?”

“వాళ్ళ దగ్గర ఆయుధాలేమీ లేవు. మనవాళ్ళు వాళ్ళ శరీరాల్ని క్షుణ్ణంగా స్కాన్ చేసి, పరిశీలించారు. శరీరాల్లో కూడా సూక్ష్మపరిమాణంలో దాచుకున్న విధ్వంసకర పదార్థాలేమీ లేవు. స్పేస్‌షిప్ ముక్కలయ్యే లోపల ప్యారాషూట్ల సాయంతో కిందికి దూకి ప్రాణాల్తో బైటపడ్డామని చెప్పారు. మన వాళ్ళకు ఆ ప్యారాషూట్లు కూడా కన్పించాయి. ఎత్తయిన ప్రదేశంలో నిలబడి, వాటిని నడుముకి కట్టుకుని, కిందికి దూకితే అవి విశాలమైన గొడుగుల్లా విచ్చుకుంటాయని మన సైనికులు ప్రయోగపూర్వకంగా తెల్సుకున్నారు. వీటన్నిటిని బట్టి చూస్తే వాళ్ళు నిజమే చెప్తున్నారనిపిస్తోంది. వాళ్ళ వల్ల మన గ్రహానికి ఎటువంటి ప్రమాదమూ లేదనిపిస్తోంది.”

“ఏలియన్స్ విషయంలో తొందరపడి ఓ నిర్ణయానికి రావడం అంత శ్రేయస్కరం కాదు. మనం ప్రస్తుతం ఇరవై ఆరో శతాబ్దంలో ఉన్నాం. ఐదువందల యేళ్ళ క్రితం కార్లలో ప్రయాణించినంత సునాయాసంగా ఇప్పుడు వ్యోమనౌకల్లో ప్రయాణాలు సాగుతున్నాయి. ఇన్నేళ్ళలో ఎప్పుడూ కంట్రోల్ ప్యానెల్ వైఫల్యం కావడం వల్ల స్పేస్‌షిప్ కూలిపోవడం అనే ది జరగలేదు. ఆ విషయం నమ్మశక్యం కావడం లేదు. ఇంతకూ భూమి అనే గ్రహం నిజంగా ఉందో లేదో తెల్సుకున్నారా?”

“మన ఖగోళశాస్త్రజ్ఞులు భూమి గురించి పూర్తి వివరాలు సేకరించారు. మన మిల్కీవే గెలాక్సీలోనే మన గ్రహానికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉందట ఆ గ్రహం. ఓ నక్షత్రం చుట్టూ ఎనిమిది గ్రహాలు పరిభ్రమిస్తున్నాయట. వాటిలో నక్షత్రం నుంచి లెక్కబెడితే భూమి మూడో గ్రహమట. దాదాపు మన గ్రహంలానే ఉన్నప్పటికీ అక్కడ గురుత్వాకర్షణ శక్తి మన గ్రహంతో పోలిస్తే ముప్పయ్ శాతమే ఉందట. మనకు మల్లేనే ఆ గ్రహం చుట్టూ ఓ ఉపగ్రహం తిరుగుతూ ఉందట.”

“అంత దూరం నుంచి మన గ్రహానికి వచ్చారంటే ఏదో బలమైన కారణంతోనే వచ్చి ఉంటారు. కంట్రోల్ బోర్డ్ పని చేయకపోవడంవల్ల స్పేస్‌షిప్ కూలిపోయిందని చెప్పడం కట్టుకథ కావొచ్చు. మనల్ని నమ్మించడానికి వీళ్ళే స్పేస్‌షిప్‌ని కూల్చేసి ఉండొచ్చు” అన్నాడు ఓసిరస్.

“స్పేస్‌షిప్‌ని కావాలని కూల్చేసుకుంటే తిరిగి ఎలా వెళ్ళగలుగుతారు? లేదు. వాళ్ళు చెప్తున్నది నిజమే అన్పిస్తోంది” గ్రహాధిపతి అభిప్రాయం తప్పని చెప్పడానికి జంకుతూనే తన మనసులో మాటని వెలిబుచ్చాడు సైన్యాధ్యక్షుడు.

“తిరిగెళ్ళడానికి ఇబ్బంది ఏముంటుంది? మన గ్రహం మీద ఆధిపత్యాన్ని సంపాయించాక, భూగ్రహం నుంచి మరో స్పేస్‌షటిల్‌ని తెప్పించుకుని తిరిగెళ్ళొచ్చు కదా. అసలు తిరిగెళ్ళాలని ఎక్కడుంది? భూగ్రహవాసుల కోసం ఇక్కడే కాలనీలు నిర్మించి, మన సాల్మోనియన్లని బానిసలుగా చేసుకుని, ఈ గ్రహాన్ని పరిపాలిస్తూ ఇక్కడే ఉండిపోవాలనే ఉద్దేశంతో వచ్చి ఉండొచ్చుగా.”

తమ గ్రహాధిపతి చెప్తున్నట్టు జరిగే అవకాశం ఉందని సైన్యాధ్యక్షుడికి అర్థమైంది.

“ఈ ఆలోచన నాకు కలగనందుకు క్షమించండి. అటువంటి అవకాశం ఉంది. ఏం చేయమంటారో శెలవివ్వండి” అన్నాడు.

“వాళ్ళు నలుగురూ ప్యారాషూట్లతో దిగిన ప్రదేశం నుంచి చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో అంగుళం అంగుళం జాగ్రత్తగా గాలించండి. ఏదైనా అనుమానాస్పదంగా కన్పిస్తే మన దృష్టికి తీసుకురమ్మని సైనికులకు చెప్పండి” అన్నాడు ఓసిరస్.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here