చరిత్రకెక్కని స్వాతంత్ర్య సమరయోధుడు కల్లుట్ల రామకృష్ణ శాస్త్రి

0
11

[స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘చరిత్రకెక్కని స్వాతంత్ర సమరయోధుడు’ శ్రీ కల్లుట్ల రామకృష్ణ శాస్త్రి గారి గురించి వివరిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ]

కల్లుట్ల రామకృష్ణ శాస్త్రి బి.ఏ., స్వాతంత్ర్య సమరయోధులు, కడప జిల్లా. (జననం 1903 మరణం 1960)

[dropcap]స్వా[/dropcap]తంత్రోద్యమంలో అప్పటి రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం నుండి ఎక్కువమంది సమరయోధులు పాల్గొన్న దాఖలాలు లేవు. బహుశా నవాబుల పాలనలో ఇవి ఉండడం వల్ల, ఇక్కడ రాజకీయ చైతన్యం కానీ, ప్రోత్సాహం కానీ లభించకపోయి ఉండవచ్చు. ఇక్కడ సముద్రం దగ్గరగా లేకపోవడంతో,  కోస్తా జిల్లాలలో ఉన్నంత పోరాట స్ఫూర్తి , ఉప్పు సత్యాగ్రహం యొక్క ప్రభావం కూడా వీటి మీద లేకపోయింది. ఇక కడప జిల్లా విషయానికొస్తే, కడప నుండి 194 మంది స్వాతంత్రోద్యమకారులుగా గుర్తింపు పొందారు. వీరిలో మొట్టమొదటి సమరయోధుడుగా పీర్ సాహెబ్ అనే ఆంధ్రుడు, బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసి, పది సంవత్సరాలు కారాగారంలో ఉన్నట్టు, కడప గజిట్ ద్వారా తెలుస్తున్నది. ఇక కర్నూల్‌లో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన కడప కోటిరెడ్డి, ప్రముఖంగా గుర్తింపు పొందారు. కానీ చాలామంది ఎటువంటి గుర్తింపుకు నోచుకోకుండా, మరుగున పడిపోయారు. ఈ విధంగా చరిత్రకు అందకుండా, మరుగున పడిన మహనీయులలో రామకృష్ణ శాస్త్రి ఒకరు.

కల్లుట్ల రామకృష్ణ శాస్త్రి గారు శ్రీమతి ఈశ్వరమ్మ, శ్రీ రామస్వామి శాస్త్రి దంపతులకు, 1903వ సంవత్సరంలో జమ్మలమడుగు కన్నెలూరులో జన్మించారు. మగ సంతానం లేని ఆయన అమ్మమ్మ (వెల్లాల) తనని దత్తత చేసుకోవడంతో, తన కుమారులు కొందరికి ‘వెల్లాల’ ఇంటి పేరును కూడా పెట్టారు. అప్పట్లో ప్రేమలు అలా ఉండేవి. ఈ ఇంటి పేరు వల్ల బంధువుల మధ్య కాస్త అయోమయంగా కూడా ఉండేది. కడప జిల్లా నుండి స్వాతంత్ర సమరంలో పాల్గొన్న, సమరయోధులలో కల్లుట్ల (వెల్లాల) రామకృష్ణ శాస్త్రి కూడా ఒకరు. అప్పటి కృష్ణా పత్రికలో కూడా ఈయన గురించిన వివరాలు అక్కడక్కడ లభిస్తాయి. అయితే స్వాతంత్రానంతరం వీరు సమరయోధులుగా గుర్తింపు పొందడం కోసం ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అందువల్ల ఈయన పేరు మనకు జిల్లా చరిత్రలో సరైన వివరాలతో దొరకదు. పైగా, “మన దేశానికి మనం సేవ చేసుకుంటే, మన తల్లికి చేసుకున్నట్టే కదా! దీనికి ఎవరి నుండైనా ప్రశంసలు పత్రాలు కావాలా? నాకు ఎటువంటి గుర్తింపు అవసరం లేదు.” అనేవారట! ఎంత ఉత్తమ వ్యక్తిత్వం! ఆయనకు సంబంధించిన జీవిత విశేషాలను కొంత తెలుసుకుందాం. ఆయన తదనంతరం ఆయన సంతానం కూడా దీనిపై ఎటువంటి ప్రయత్నం చేయలేదు.

దేవ గుడికి చెందిన వెంకటసుబ్బమ్మను వివాహం చేసుకున్న తర్వాత ఆయన నివాసాన్ని కడపకు మార్చారు. వివాహం తరువాత, బనారస్ హిందూ యూనివర్సిటీలో బి.ఏ., పూర్తి చేశారు. మద్రాస్ ఆంధ్ర సంయుక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈయన కృష్ణా పత్రికకు రాయలసీమ మొత్తానికి పత్రికా విలేఖరిగా ఉండేవాళ్ళు. తర్వాత కొంతకాలానికి భారత జ్యోతి అనే పక్ష పత్రికను ప్రారంభించారు. దీని ప్రారంభోత్సవం సరిహద్దు గాంధీగా పేరుపొందిన ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ చేతుల మీదుగా జరిగింది. అప్పట్లో ఈ పత్రిక, తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లో ఆంధ్ర, మద్రాస్ రాష్ట్రాల్లో సర్కులేషన్‌లో ఉండేది. స్వాతంత్రోద్యమం గురించిన వివరాలు, అద్భుతమైన సంపాదకీయాలు, సినిమా రివ్యూలు వంటి ఆర్టికల్స్‌తో ఎంతో ఉత్తేజితంగా అందరిని ఆకట్టుకునేవి.

కడప జిల్లాలో మొట్టమొదటిసారి డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తి కల్లుట్ల రామకృష్ణ శాస్త్రి గారు. జిల్లాలో మొట్టమొదట ఖద్దరు కట్టింది కూడా ఆయనే. గాంధీ గారితో కలిసి, ఖాదీ ఉద్యమంలో కడప జిల్లాలో ఈయన పర్యటించారు.

రామకృష్ణ శాస్త్రి గారికి అప్పటి చాలామంది స్వాతంత్రోద్యమ నేతలతో పరిచయాలు ఉండేవి. శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారు, కడప జిల్లా ఎర్రముక్కపల్లిలోని శాస్త్రి గారి నివాసంలో వారం రోజులు బస చేశారు. వారిద్దరూ కలిసి ఎక్కువ రాజకీయ చర్చలు జరిపే వారిని తెలిసింది.

అప్పటి మద్రాస్ ముఖ్యమంత్రి అయిన శ్రీ సి.వి రాజగోపాలాచారి, కడప మీదుగా చెన్నై వెళ్లేటప్పుడు, శాస్త్రిగారు ఆయనకు ఇడ్లీ సాంబారు, మంచి ఫిల్టర్ కాఫీ అందించేవారట. రాజాజీ గారు తన రాకను ముందుగానే రామకృష్ణ శాస్త్రికి తెలియజేసేవారట.

కడపకు బదిలీ మీద వచ్చిన కలెక్టర్లు, కడప నుండి బదిలీ అయిన కలెక్టర్లకు వీరి ఇంట్లో విందులు జరిగేవి. ఇన్చార్జి తీసుకున్న వెంటనే కలెక్టర్లు శాస్త్రి గారిని కలిసే వారట. మీరు ఇంటిలో బస చేసిన ప్రముఖ గాయకులు ఘంటసాల వీరి ఇంటి మేడపైన సంగీత కచేరి చేశారు.

సద్బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఈయన, బ్రాహ్మణ సాంప్రదాయాలను ఎంతగానో గౌరవించేవారు. బయట ఎక్కడ ఏవి తినేవారు కాదు. వెంట ఎప్పుడూ మరచెంబులో నీళ్లు తీసుకుని వెళ్లేవారట. అయితే, ఈయన ఒక మంచి సంఘసంస్కర్త. సమాజంలో ప్రతి ఒక్కరిని సమానంగా చూసేవారు. అప్పట్లో, అంత కఠినమైన కుల వ్యవస్థ ఉన్నప్పుడే, వారి ఇంటిలో పని చేసే పారిశుద్ధ్య పనివారితో సహా పండగల సమయంలో, తన ఇంటిలోనే సహపంక్తి భోజనం చేసేవారు. ఇంకా చెప్పాలంటే వారి ఇంటిలో జరిగే వివాహాలకు ఇంటి ఆడపిల్లలకు ఎంత ఖరీదైన చీరలు కొంటారో, అదే రకమైన చీరలు పనివారికి కూడా కొని, ఆ శుభ సందర్భాల్లో కట్టుకోమని చెప్పేవారట. ఆయన సహాయం కోరి వచ్చిన వారు ఎవరికైనా లేదనకుండా ఆర్థిక సహాయం కూడా చేసేవారు.

కల్లుట్ల రామకృష్ణ శాస్త్రి – వెంకట సుబ్బమ్మ దంపతులు

ఆయన భార్య వెంకటసుబ్బమ్మ కూడా చేతికి ఎముక లేకుండా బ్రతికారు. ఆమె చేసే దానధర్మాల గురించి, పేదవారి మీద ఆమె చూపించే ప్రేమ గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇంటి నిండా వచ్చి పోయే బంధువులతో, ఎనిమిది మంది నౌకర్లతో ఆ ఇల్లు ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది. వీరి ఇంటిలో చాలా జంతువులతో పాటు, ఒక చిలుక కూడా ఉండేది. ఒక చిరుత పిల్ల తప్పిపోయి కడపలో ప్రవేశిస్తే, దాన్ని శాస్త్రి గారి ఇంట్లో కొంతకాలం పెట్టి పోషించి, అటవీ శాఖ వారికి అప్పగించారట. అయితే 57 సంవత్సరాల వయసులో, అకస్మాత్తుగా శాస్త్రి గారు మరణించడంతో ఎటువంటి బాండ్లు పత్రాలు లేకుండా జమ్మలమడుగు లోనూ దేవగుడిలోనూ వీరు కౌలుకు ఇచ్చిన రైతులు దాదాపుగా భూములను స్వాధీనం చేసుకున్నారు. వీరి సంతానం మాత్రం తల్లిదండ్రులకు సంబంధించిన ఎటువంటి ఆస్తిపాస్తులు లేకుండా (ఏదో కాస్తో కూస్తో తప్ప), తప్పనిసరిగా తమ స్వయంకృషి మీదనే బ్రతుకు గడపాల్సి వచ్చింది.

వీరికి పదిమంది సంతానం; ఆడపిల్లలు ఐదు మంది, మగసంతానం 5 మంది. వీరంతా కూడా, అదే ఉత్తమ వ్యక్తిత్వంతో పెరిగి, తల్లిదండ్రుల బాటలోనే నడిచారు. శారదమ్మ, సరస్వతమ్మ, అన్నపూర్ణమ్మ, హేమలత, భారత జ్యోతి ఈయన కుమార్తెలు. ఇప్పుడు పదిమందిలో ఇద్దరు చిన్న కుమార్తెలు తప్ప ఎవరు సజీవంగా లేరు. అయితే ఆశ్చర్యకరంగా, నలుగురు కుమారులు పత్రికా విలేకరులుగా రాణించారు; పెద్ద కుమారుడు గోపాలకృష్ణ ‘ద హిందూ’ విలేఖరిగా, (ఈయన తరువాత రాయలసీమ జోన్ మొత్తానికి రోవింగ్ కరస్పాండెంట్‌గా ఉండేవారు), సీనియర్ పాత్రికేయులుగా, ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. ఈయన కొత్త కాలం ఆర్మీలో పైలట్‌గా పనిచేశారు. నాలుగవ కుమారుడు ద్వారకనాథ్ ఆంధ్ర పత్రిక, డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి పత్రికలకు విలేకరిగా, చిన్న కొడుకు కృష్ణ భగవాన్ ఆల్ ఇండియా రేడియో, ఈనాడు పత్రికలకు విలేఖరిగా ఉంటూ, ఎంతో సామాజిక సేవ చేశారు. వీరిద్దరూ తరువాత భారత జ్యోతి పత్రికను చాలాకాలం నడిపించారు. కృష్ణ భగవాన్ ట్రేడ్ యూనియన్ తరఫున, పేదవారి తరఫున ప్రభుత్వంతో పోరాడుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక రెండవ కొడుకు, నందకుమార్, ‘సారూప్య ఔషధం’, అని స్వంత పత్రికను స్థాపించిన నడుపుతూ, ప్రజలకు ఉచితంగా త్రాగునీరు, హోమియో వైద్యం అందిస్తూ, జమ్మలమడుగులో ‘ట్యాంకయ్య’గా పేరు పొందారు. మూడవ కొడుకు దేవకీనందన్ కూడా ఎక్కువ కాలం సమాజసేవలోనే గడిపారు. ఈ విధంగా ఒక కుటుంబం అంతా అదే నేపథ్యంతో, అదే స్ఫూర్తితో సమాజ సేవలో తరించడం కడప జిల్లా వాసుల ఎవరూ మర్చిపోలేని సత్యం.

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’, సందర్భంగా చరిత్రకు ఎక్కని, ఇటువంటి స్వాతంత్ర సమరయోధుల్ని తలుచుకోవడం ఎంతో మంచి విషయం. శాస్త్రిగారు మా తాతగారని తెలుపుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది.

ఆయన నాలుగవ కుమారుడైన ద్వారకనాథ్ నలుగురు సంతానంలో నేను పెద్ద కూతురిని, నాకు ముగ్గురు తమ్ముళ్ళు. మా తాతగారు నాన్నమ్మల నుండి, అదే సామాజిక చైతన్యాన్ని, మానవత్వాన్ని, మా తండ్రిగారు కూడా పుణికి పుచ్చుకున్నారు. తాతగారి నుండి మా నాన్న, పెదనాన్నలకు, మాకు, మా కజిన్స్ అందరికీ కూడా అదే సేవా దృక్పథం, మానవతా విలువలు వచ్చాయి. మాకు చేతనైనంత వరకు వాటిని కొనసాగిస్తూనే ఉన్నాం. నిజం మాట్లాడాలంటే అదే మా పారంపర ఆస్తి.

తాతగారు స్థాపించిన భారత జ్యోతి పత్రికకు మా నాన్న ఎడిటర్‌గా, ఆంధ్రభూమి, ఆంధ్ర పత్రిక, డెక్కన్ క్రానికల్ పత్రికలకు విలేకరిగా ఆయన సేవలను కొనసాగించారు. ఆయన డిక్టేట్ చేస్తూ ఉంటే, న్యూస్ ఆర్టికల్స్ రాయడం, మా చిన్నాయన కృష్ణ భగవాన్ శిక్షణలో, న్యూస్ రిపోర్టింగ్ ఎలా చేయాలి? న్యూస్ ఆర్టికల్స్ ఎలా రాయాలి? ఒక అంశాన్ని అన్ని కోణాల నుండి ఎలా చూడాలి అన్న విషయాలు నేర్చుకున్నాను. నేను కూడా కడప నుండి చాలా కొద్ది కాలం ఈనాడు, వార్త పేపర్లకు రిపోర్టర్ గా పనిచేశాను.

ఎవరైనా ఒక కౌలు రైతు, పంట సరిగ్గా రాలేదనో, తన కుమార్తె వివాహం ఉందనో చెబితే, వారి దగ్గర నుండి ఏమి తీసుకోకుండా, పంటనంతా వారినే ఉపయోగించుకోమని మా తాతగారు చెప్తూ ఉండేవారని, ఆయన ఉదారత్వం గురించి మా నాన్నగారు చాలాసార్లు చెప్పేవారు. ఒకసారి మా నాన్నగారు పుట్టినరోజుకి రెండు మూడు వీశెల నెయ్యితో మైసూర్ పాకులు (నెయ్యి ధర బాగా పెరిగిపోయిన కాలంలో) చెయ్యమని చెప్పి, ఉద్యోగరీత్యా బయటికి వెళ్లారట. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి చేసిన మైసూరుపాకులన్నీ, మా నాన్నమ్మ ఇంట్లో వాళ్లకి, ఇరుగుపొరుగుకి పంచేసి మా నాన్న కోసం ఒక అయిదారు స్వీట్లు దాచిపెట్టిందట. ఇంతలో కడుపుతో ఉన్న పనిమనిషి రావడంతో, అవి కూడా ఆమెకి ఇచ్చేసిందట. మా నాన్న సాయంత్రం ఇంటికి వచ్చి, స్వీట్ పెట్టమని అడిగితే, ఆ పాకం చేసిన పొడి అంతా గోకి (దాదాపు రెండు స్పూన్లు), ఒక చిన్న కప్పులో వేసి, తినడానికి ఇచ్చిందట. “ఏంటమ్మా ఇంతే మిగిలిందా?” అని అడిగితే.. “అవును రా! లేని వాళ్ళకి ఇస్తేనే కదా మనకు పుణ్యం. నీ పుట్టినరోజున నీకు బోలెడంత పుణ్యం వచ్చిందిలే!” అని నవ్వేసారట. ఆ విషయాలన్నీ మా నాన్నగారు ఎన్నోసార్లు తలుచుకునేవారు. జీవితంలో బాగా సంపాదించి, ఎవరికైనా ఇవ్వడంలో మనం ఎప్పటికీ పైచేయిగా ఉండాలని మా నాన్న కోరుకునేవారు.

ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, డబ్బు గురించి ఆయనకి ఎప్పుడు చింత ఉండేది కాదు. “రాముడున్నాడు రాజ్యముంది..” అంటూ ఉండేవారు. “పెద్దవాళ్ల పెళ్లికి వెళ్లి, వాళ్ల స్థాయికి తగిన సమర్పించాల్సిన అవసరం లేదు. మనకన్నా ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ పెళ్లికి వెళితే వాళ్ళు ఎంతో ఆనందిస్తారు, అంతేకాక మనం వారికి చదివింపులు ఇచ్చే యాభయ్యో వందో కూడా వారికి ఎంతో ఉపయోగపడుతుంది”, అని మమ్మల్ని అలాంటి చోట్లకు తీసుకెళ్లేవారు. వీధిలో పేద పిల్లలందరికీ స్వీట్లు పంచిపెట్టి, ఐస్ క్రీములు కొనిపెట్టి తన పుట్టినరోజు జరుపుకునే వారు. మేము డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ ఉన్నప్పుడు, వాణి హెలినా అనే అమ్మాయికి వాళ్ళ నాన్న చనిపోయారు. డిగ్రీ రెండవ సంవత్సరం మా స్నేహితులమంతా కలిసి 250 రూపాయలు అనుకుంటా.. పరీక్ష ఫీజును జమ చేసి కట్టాము (మేమందరము మధ్యతరగతి వాళ్ళమే అప్పట్లో అది మాకు చాలా ఎక్కువ మొత్తమే!). డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్నప్పుడు, ఆ అమ్మాయి ఫీజు కట్టడానికి ఎవరూ పూనుకోలేదు. రెండేళ్లు చదివాక మూడో సంవత్సరం ఫీజు కట్టలేకపోవడం, ఫీజు కట్టడానికి ఆరోజే ఆఖరి రోజు అవడంతో ఆ అమ్మాయి కాలేజీలో వెక్కివెక్కి ఏడ్చింది. నాకేం చేయాలో తోచలేదు. దాంతో నాకోసం ఇచ్చిన ఫీజును, ఆరోజు అమ్మాయికి ఇచ్చేసాను. ఇంకా ఫైన్ తో ఫీజు కట్టడానికి వారం రోజులు గడువు ఉంది. ఇంటికి వెళ్లి మా నాన్నకి ఈ విషయం చెప్పాను. “ఏం భయపడొద్దు. మంచి పని చేశావు. రాముడు ఉన్నాడు రాజ్యం ఉంది” అన్నారు. నేను కూడా నిశ్చింతగానే నిద్రపోయాను. ఆ రోజు రాత్రి, మా మేనత్త సరస్వతమ్మ మద్రాసు నుండి వస్తూ, కడపలో రెండు గంటలసేపు రైలును ఆపడంతో, అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మా ఇంటికి వచ్చారు. గంట తర్వాత ఆమె బయలుదేరుతూ, “దేనికైనా ఖర్చులకు ఉంచుకోరా!” అని మా నాన్నకి 300 రూపాయలు ఇచ్చారు. ఉదయాన్నే ఆ డబ్బు తీసుకువెళ్లి మా కాలేజీలో ఫీజు కట్టాను. ఒక మంచి పని చేస్తే, భగవంతుని మీద విశ్వాసం ఉంటే, జీవితంలో ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని ఆ రోజు అర్థం చేసుకున్నాను. అదే విధంగా నా జీవితం కొనసాగించాను. పెళ్లయిన తర్వాత మా వారు శ్రీ ఆర్.ఎన్. శర్మ కూడా ఎవరికైనా పెట్టడంలో నాకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ఎవరికి సహాయం చేయాలన్నా, ఆయన నాకు అండగా నిలబడ్డారు. తండ్రి ఆదరణ లేని ఇద్దరు పిల్లలను పదేళ్లుగా చదివిస్తున్నాం. ప్రొద్దుటూరులో Trendz అనే Spoken Institute ని పెట్టి, గ్రామీణ విద్యార్థులకు ఎంప్లాయిబిలిటీ స్కిల్స్ పెంచుతూ, పేద విద్యార్థులకు తక్కువ ఫీజు లేదా అవసరమైన వారికి ఉచితంగా ఇంగ్లీషు నేర్పిస్తూ 25 ఏళ్లుగా దాదాపు 12 వేలకు పైగా విద్యార్థులకు అభివృద్ధికి నిచ్చెనలాగా ఉపయోగపడగలిగాను. Institute లో నాకు వచ్చిన ఆదాయంతో కొంత భాగాన్ని క్యాన్సర్ పేషెంట్స్‌కు సహాయంగా వినియోగిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా 12 ఏళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడ్డాను, ఆ తరువాత ఒకటి రెండు సాధారణ శస్త్ర చికిత్సలు, ఇంకా రెండేళ్ల క్రితం న్యూరో (బ్రెయిన్) సర్జరీ కూడా జరిగింది. మా ఊరిలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ, క్యాన్సర్ బాధితుల ఇళ్లకు వెళ్లి, వారికి ధైర్యాన్ని ఇస్తూ మోటివేట్ చేస్తూ ఉంటాను. కళాశాలలో క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులు కూడా నిర్వహిస్తాను. వీరందరి ఆదరాభిమానాలే ఎన్నోసార్లు నా ప్రాణాలు కాపాడాయి. దేవుడు ఈ విషయంలో కూడా నాకు ఎంతో మేలు చేశాడని అర్థమైంది.

ఈ విధంగా మా తాత గారిని గుణాలని, స్వభావాలను మేమందరం కొనసాగించగలుగుతున్నాం. కాకపోతే, మా తాతగారు, నానమ్మలు నేను పుట్టక ముందే గతించారు. వారితో గడిపిన ఏ స్మృతులు కాని, ఫోటోలు కానీ మాకు లేవు. అంత ఉన్నతమైన వ్యక్తులతో కాలం గడపలేకపోవడం, వీళ్లూ, వాళ్ళూ చెప్పడం ద్వారా మాత్రమే తెలుసుకోవడం, మనసుని అప్పుడప్పుడు బాధిస్తూనే ఉంటుంది. వారి గురించిన జీవిత విశేషాలు తెలుసుకొని మురిసిపోతూ ఉంటాను.

అయినా అంతటి గొప్ప వ్యక్తిత్వం కలవారు మాకు తాతగారు అయినందుకు నేను ఎంతో గర్విస్తూ ఉంటాను. ఆయన ఆశీస్సులు మాపై ఎల్లప్పటికీ ఉంటాయని నేను ప్రగాఢంగా నమ్ముతాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here