చెలిమి కలిమి

0
8

[dropcap]రా[/dropcap]మ రావణ యుద్ధం ముగిసింది. రావణ వధ జరిగింది.

రామచంద్రుడు సీతా, లక్ష్మణుల తోనూ, సుగ్రీవాది వానర వీరులతోనూ అయోధ్యకు పుష్పక విమానంలో ప్రయాణమయ్యాడు. అయోధ్యలో రాజభవనానికి ఆకుపచ్చ గుర్రాలు కట్టిన రథంలో వచ్చే రామ విభుడు ఇంద్రుడిలా ప్రకాశిస్తున్నాడు. రథ సారథ్యం చేయటానికి భరతుడు పూనుకోగా, లక్ష్మణుడు ముందర నిల్చుని వింజామరతో విసురుతున్నాడు. శత్రుఘ్నుడు రామునికి గొడుగు పట్టాడు. సమస్తాభరణాలు ధరించిన సుగ్రీవాది వానరముఖ్యలు, వానర స్త్రీలు తొమ్మిది వేల ఏనుగుల మీద రథం వెంట బయలుదేరారు.

శ్రీరాముడు రాజ భవనంలో ముగ్గురు మాతలను దర్శించి వచ్చాక, భరతునితో “తమ్ముడా, మన ఆవరణలో అశోకవనం పక్కన మణిఖచితమైన నా మందిరంలో ఈ సుగ్రీవునికి విడిది ఏర్పాటు చెయ్యి” అని చెప్పాడు. భరతుడు సుగ్రీవుని చెయ్యి పట్టుకుని రామ మందిరం లోకి తీసుకువెళ్ళాడు. శత్రుఘ్నుడు ఆ మందిరంలో తైల దీపాలు, మెత్తటి శయ్యను ఏర్పాటు చేశాడు. సుగ్రీవుడు సుఖంగా అందులో విడిది చేశాడు.

రామ పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. భరతుడు సుగ్రీవునితో “వానర రాజా, నీవు రామాభిషేకం కోసం సముద్రజలాలు తెప్పించాలి” అన్నాడు. ఈ మహాత్కార్యం తనపై పెట్టినందుకు సుగ్రీవుడు పులకించిపోయాడు. వెంటనే, నలుగురు వానర వీరులను పిలిచి బంగారు కలశాలను వారికిచ్చి తెల్లవారే లోపల సముద్ర జలాలను తెమ్మని ఆజ్ఞాపించాడు. సుగ్రీవాజ్ఞకు తిరుగు లేదు. వారే కాదు, జాంబవంత, హనుమంతాది వీరులు కొందరు ఐదు వందల నదుల జలాలను కాంచన కలశాలతో తెచ్చారు.

రామ పట్టాభిషేకసమయాన రాముడు అనేక దానాలు చేసాడు. సూర్య కిరణాల్లా కళ్ళు మిరుమిట్లు గొలిపే మణిమయ దివ్య కాంచన మాలను సుగ్రీవునికి బహుమతిగా ఇచ్చాడు. తనకెన్ని ఆభరణాలున్నా, సుగ్రీవునికి ఆ కాంచన మాల అపురూపం! పట్టాభిషేకానంతరం సుగ్రీవాదులందరు రామునికి వీడ్కోలు పలికారు. రాముడు సుగ్రీవునితో “మిత్రమా! నీ చెలిమి కలకాలం ఇలాగే కొనసాగాలి” అన్నాడు. సుగ్రీవుడు, “రామా! నీ చెలిమిని మించిన కలిమి నాకు వేరే లేదు” అని కిష్కింధకు ప్రయాణమయ్యాడు. రామ సుగ్రీవులిద్దరి మనసులలో ఒకే అనుభూతి! దివ్య స్నేహానుభూతి!

‘తామిద్దరి పరిచయం జరిగిన ఆ సుదినం ఎంత గొప్పది! ఆ రోజు నుంచి నేటి వరకు తమ మైత్రి దిన దిన ప్రవర్ధమానమై వెలుగొందుతోంది’ అనుకుంటుండగా సుగ్రీవునికి ఒక్కసారిగా గత స్మృతులు మదిలో మెదిలి శరీరం పులకాంకితమైంది.

***

వనవాసం చేస్తున్న రామలక్ష్మణులిద్దరు పంపా సరస్సు వద్దకు వచ్చారు. అందులో కమలాలు, కలువలు వికసించి ఆ ప్రాంతాన్నంతా శోభాయమానం చేస్తున్నాయి. రాముడు లక్ష్మణునితో “తమ్ముడా! ఇది వసంత కాలం. చెట్లన్నీ రంగు రంగుల పుష్పాలతో వికసించి ప్రకృతి కాంతకు మనోహర అలంకారాలుగా భాసిస్తున్నాయి. పక్షుల, కోయిలల మధుర, మంజుల రావాలు అరణ్యమంతా ప్రతిధ్వనిస్తున్నాయి. కాని, ఇక్కడ నా సీత లేక, నేను దుఃఖ పడుతుంటే ఈ వసంత సమీరం నన్ను అమితంగా బాధిస్తోంది. ఇక్కడ నేను ఉండలేను” అంటూ వ్యథ చెందాడు.

లక్ష్మణుడు “అన్నా, నీవు పురుషోత్తముడవు. నీ వంటి ధీరుడు ఈ విధంగా మాట్లాడరాదు. దుఃఖాన్ని అణచుకో. నీకు త్వరలోనే శుభం కలుగుతుంది” అని అనునయించాడు.

తమ్ముడి మాటలకి రాముడికి కొంత ఊరట లభించింది. అక్కడ ఋష్యమూక పర్వతం మీద తిరుగుతున్న వానర శ్రేష్ఠుడు సుగ్రీవుడు వీరిద్దరినీ చూసి, వాలి పంపగా వచ్చినవారే అయివుంటారు అని భయపడిపోయాడు. వెంటనే తన మంత్రులతో సమాలోచనం జరిపాడు. సంభాషణా చతురుడైన హనుమ సుగ్రీవుని చూసి “ఓ వానర పుంగవా! వాలి ఇక్కడకు రాలేడు. నీవు భయపడనవసరం లేదు. నీవు లోకజ్ఞానం కలవాడవు. మనోబలాన్ని కోల్పోవద్దు” అని అనునయించాడు

హనుమ మాటలు ఇచ్చిన ధైర్యంతో సుగ్రీవుడు “అయితే హనుమా! నువ్వు వెంటనే వారి వద్దకు వెళ్లి, వారు ఎవరో, ఎందుకు ఇటు వచ్చారో తెలుసుకో” అని పంపాడు.

హనుమ భిక్షు రూపంతో రామలక్ష్మణులను చేరాడు. తన వాక్పటిమతో వారిని మెప్పించాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు. రామునికి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లయింది. తాము సుగ్రీవుని కలవాలనుకున్నారు. సుగ్రీవుడే హనుమను తమ వద్దకు పంపాడు. తమ కార్య సానుకూలతకు ఇది శుభసూచకం. రాముని పెదవులపై చిరు దరహాసం మెరిసింది. హనుమ మాటతీరుకు రాముడు ముగ్దుడయ్యాడు.

సుగ్రీవునితో రామునికి కావలసిన కార్యం ఉంది అని సూక్ష్మగ్రాహి అయిన హనుమ గ్రహించాడు. ‘రాముని పని నెరవేరిస్తే, సుగ్రీవునికి తన రాజ్యం వస్తుంది. వీరిద్దరికీ పరస్పరం ఒకరి తోడు ఒకరికి అవసరం. వీరికి స్నేహం కలపాలి’ అనుకున్నాడు. లక్ష్మణుని ద్వారా రాముని వృత్తాంతమంతా హనుమ తెలుసుకున్నాడు. రామలక్ష్మణులిద్దరినీ సుగ్రీవుని వద్దకు తీసుకెళ్లాడు. రామ కథ అంతా వినిపించాడు. “నీతో స్నేహం చేస్తే నువ్వు తన భార్యను వెతకటంలో సాయం చేస్తావనే ధైర్యంతో నిన్ను రాముడు వెతుక్కుంటూ వచ్చాడు. నువ్వు వీరిద్దరినీ గౌరవించి, వీరితో స్నేహం చేయి. ఇది నీకూ మేలవుతుంది” అన్నాడు హనుమ సుగ్రీవునితో.

సుగ్రీవుడు ఆనందంగా అంగీకరించాడు. రామ సుగ్రీవులు ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేశారు. “మనం ఎప్పటికీ స్నేహితులుగా ఉందాం” అన్నాడు సుగ్రీవుడు. రాముడు గాఢాలింగనం చేసుకున్నాడు.

అగ్ని సాక్షిగా మిత్రులయ్యారిద్దరూ! అపురూపమైన క్షణం అది! జాజ్వల్యమానంగా మండుతున్న అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసారిద్దరూ. రామ సుగ్రీవులిద్దరు ఒకరి నొకరు ఎంతసేపు చూసుకున్నా తనివి తీరని మధుర క్షణాలవి! తమ మధ్య నీ, నా బేధాలుండవని, ఒకరి దుఃఖం మరొకరిదని, ఒకరి సుఖం మరొకరిదని సుఖ దుఃఖాలు ఇద్దరికీ సమానం అని పరస్పరం ప్రమాణాలు చేసుకున్నారు. దట్టమైన ఆకులతో, విరగబూసిన పువ్వులతో ఉన్న చెట్టు కొమ్మ నరికి, సుగ్రీవుడు ఆకులు పరిచి రాముని కూర్చుండ బెట్టి తనూ పక్కనే కూర్చున్నాడు. ఆ పచ్చని కొమ్మ లాగే తమ స్నేహం పచ్చగా కలకాలం ఉండాలని సుగ్రీవుని భావన! రామ సుగ్రీవుల మైత్రీ బంధానికి వారధి హనుమ.

హనుమ చందన వృక్షశాఖను విరిచి తెచ్చి లక్ష్మణుని కూర్చోబెట్టాడు.

సుగ్రీవుడు రాముని, వాలి నుంచి తనకు అభయమిమ్మని కోరాడు.

రాముడు, “స్నేహానికి ఉపకారమే ఫలం. నేను తప్పక వాలిని సంహారిస్తాను” అని అభయమిచ్చాడు. “సీతాదేవిని వెతికి తెచ్చే బాధ్యత మాది” అన్నాడు సుగ్రీవుడు. ఇరువురి మనసులు భారం తగ్గి తేలిక పడ్డాయి. “స్నేహమే ప్రతివారికి పరమ గతి. ఉత్తమ స్నేహాన్ని మించిన అదృష్టం లేదు. మంచి స్నేహితుడు తన స్నేహితుడి కోసం ప్రాణాన్ని అయినా వదులుకుంటాడు” అన్నాడు సుగ్రీవుడు ఉద్విగ్నతతో.

“మన స్నేహం అలాంటిదే మిత్రమా” అన్నాడు రాముడు ఆనందంగా.

***

రామబాణం తాకిడికి వానర రాజు వాలిమొదలు నరకిన చెట్టులా నేల కూలాడు. రామాజ్ఞ ప్రకారం సుగ్రీవుడు కిష్కింధకు రాజయ్యాడు. అంగదుని యువరాజుని చేసాడు.

రాముడు సుగ్రీవునితో, “మిత్రుడా!ఈ నాలుగు మాసాలు వర్షాలు వచ్చే కాలం. సీతాన్వేషణకు ఇది సమయం కాదు. నువ్వు కిష్కింధలో ఇప్పుడు సమస్త సుఖాలు అనుభవించు. నేను, లక్ష్మణుడు ఇక్కడ కనబడే పర్వతగుహలో నివసిస్తాం. శరదృతువు రాగానే సీతాన్వేషణ మొదలుపెట్టాలి. ఇది మన ఒడంబడిక” అన్నాడు రాముడు.

ప్రకృతి సౌందర్యం ఉట్టి పడే లతా గృహాలతోనూ, ఫల, పుష్ప భరిత మైన వృక్షరాజాల తోనూ విరాజిల్లే ప్రస్రవణ పర్వతం లోని ఒక గుహలో లక్ష్మణునితో ఉన్న రాముడు సీత ఎడబాటును భరించలేక వర్షాకాలం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూస్తున్నాడు.

దీర్ఘ కష్ట కాలం తర్వాత ప్రాప్తించిన సుఖ భోగాలకు వశులై కాలాన్ని, కర్తవ్యాన్ని మర్చిపోవటం ఎవరికైనా సహజమే! సుగ్రీవుడు రాజ్య భోగాలలో మునిగి శరదృతు ఆగమనాన్ని గమనించలేదు. రాముని మనసులో చిన్న బాధ! చేసిన మేలును సుగ్రీవుడు మర్చిపోయాడని కినుక! లక్ష్మణునితో, సుగ్రీవుని వద్దకు వెళ్లి కర్తవ్యాన్ని గుర్తు చేయమన్నాడు. రాముని బాధ చూడలేక కోపంతో వస్తున్న లక్ష్మణుని చూసి సుగ్రీవుడు కాలాతిక్రమణం జరిగినందుకు క్షమించమని వినయంతో ప్రార్థించాడు. రాముని కూడా వేడుకున్నాడు. వివేకవంతులైన మిత్రుల మధ్య అలకలు ఎక్కువసేపు నిలువవు.

తక్షణం సుగ్రీవుడు కార్యాచరణకు ఉపక్రమించాడు. వానర వీరులందరినీ సమావేశపరిచాడు. నాలుగు దిక్కులకు తగిన వారిని ఎంపిక చేసి పంపాడు. అమితవేగంతో వానర సేనా నాయకులు సీతాన్వేషణ చేశారు. హనుమ సీత జాడ తెలుసుకున్నాడు. రామునికి సీతా సందేశాన్ని తెలియజేసాడు. రామరావణ యుద్ధ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అశేష వానర వీర సైన్యాన్ని రావణుడు చూశాడు. రామునికి సుగ్రీవుడు పరమ మిత్రుడని తెలుసుకున్నాడు. సుగ్రీవుని తన వైపు తిప్పుకుంటే జయం తనదే అనుకున్నాడు.

శుకుడనే దూతను సుగ్రీవుని వద్దకు రావణుడు పంపాడు. “బ్రహ్మ పుత్రుడి వయిన రుక్ష రజుడికి పుత్రుడవయినందున నాకు తోబుట్టువువు. రామునితో చేరటం వల్ల నీకు ఎటువంటి లాభం లేదు. మన బాంధవ్యాన్ని గుర్తుంచుకుని నీ వానర సైన్యంతో కిష్కింధకు తిరిగి వెళ్ళటం నీకు మంచిది” అని శుకుడు తెచ్చిన రావణ సందేశం విని, సుగ్రీవుడు, “నా రామునికి విరోధి వైన నువ్వు నాకూ విరోధివే. నా మహా సైన్యంతో నీ లంకా నగరాన్ని భస్మం చేస్తాను” అని ప్రతి సందేశం పంపాడు.

సుగ్రీవుడు రావణునితో భయంకర యుద్ధం చేసాడు. ఇద్దరూ మహా బలవంతులు. వ్యాయామ శిక్షణ పొందినవారు. ఒకరినొకరు ఘోరంగా గాయపరచుకున్నారు. ఒంటి నిండా గాయాలతో వచ్చిన సుగ్రీవుని చూసి రాముడు, కౌగిలించుకుని “మిత్రుడా, ఎంతో సాహసం చేసావు. నువ్వేమైపోతావోనని నేను, విభీషణుడు, వానర సైన్యం తల్లడిల్లిపోయాము” అన్నాడు ప్రేమతో. సుగ్రీవుడు యుద్ధంలో ఎందరినో వధించాడు.

అయోధ్యకు వెళ్లి, రామ పట్టాభిషేకంలో ఆత్మీయ మిత్రుడు చేసే ప్రధాన కార్యాలు, సముద్రజలాలు అభిషేకం కోసం తేవటం వంటివి సుగ్రీవుడు ప్రేమతో నిర్వర్తించాడు.

***

‘రాముని చెలిమి మలయమారుతంలా, మంచి గంధంలా, చల్లని వెన్నెలలా, పూల పరిమళంలా, నులి వెచ్చని సూర్య కిరణంలా నన్ను నిరంతరం ఆహ్లాదపరుస్తూనే ఉంటుంది. రాముడన్నాడుగా – మన చెలిమి ఎప్పటికీ ఇలాగే ఉంటుందని – ఇది నిజం. నేనెంతో అదృష్టవంతుణ్ణి’ అనుకున్నాడు సుగ్రీవుడు తృప్తిగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here