‘చెంగల్వ పూలు’ కథాసంపుటి ఆవిష్కరణ – నివేదిక

0
10

[డా. చెంగల్వ రామలక్ష్మి గారి ‘చెంగల్వ పూలు’ కథాసంపుటి ఆవిష్కరణ నివేదికని అందిస్తున్నారు శ్రీ ఘండికోట విశ్వనాధం.]

21 మే 2024 వ తేది, మంగళవారం, విశాఖపట్నం విశాఖ సాహితి, ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత్రి డా. చెంగల్వ రామలక్ష్మి కథాసంపుటి ‘చెంగల్వపూలు’ పుస్తక ఆవిష్కరణ అంతర్జాల మాధ్యమంలో జరిగింది.

సభ ఆచార్య పాండురంగ విఠల్ గారి ప్రార్థనతో ప్రారంభమయింది. శ్రీ ఘండికోట విశ్వనాథం గారు రచయిత్రి రామలక్ష్మిని సభకు పరిచయం చేసారు.

విశాఖ సాహితి అధ్యక్షులు శ్రీమతి కోలవెన్ను మలయవాసిని సభకు ఆధ్యక్షత వహిస్తూ చేసిన సందర్భోచిత వ్యాఖ్యానం సభను రక్తి కట్టించింది.

రచయిత్రి కుమార్తె చి. లలితావాసంతి పుస్తకాన్ని ఆవిష్కరించింది. ఇది అందరికి ఒక మధురానుభూతి నిచ్చింది.

పుస్తక ఆవిష్కరణ చేసిన చి. లలితావాసంతితో ఆమె తల్లిదండ్రులు – రచయిత్రి డా. చెంగల్వ రామలక్ష్మి, శ్రీ బొడ్డపాటి చంద్రశేఖర్

అనంతరం, ప్రసిద్ధ కథా రచయిత, విశాఖ సాహితి గౌరవ అధ్యక్షులు శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు సభను ప్రారంభిస్తూ “చిన్న కిటికి తలుపు తెరిస్తే మనం నివసిస్తున్న సమాజం ఎలా కనిపిస్తుందో, చిన్న కథ అలా జీవితాన్ని ప్రతిబింబించాలి అని Henry James అనే ఆంగ్ల విమర్శకుడు అన్నాడు” అని అన్నారు. కథ సమాజాన్ని, ముఖ్యంగా మనిషి మనస్తత్వం, అతని ప్రవర్తనకు అద్దమవ్వాలని చెప్పారు. తరువాత పుస్తక సమీక్ష జరిగింది.

మొదటి సమీక్షకులు ప్రముఖ సాహితీ వేత్త, విమర్శకులు శ్రీ దామెర వెంకట సూర్యారావు మాట్లాడుతూ, “కథలు మానవ జీవితం నుండే పుడతాయి. చెంగల్వ రామలక్ష్మి కథల్లో చెంగల్వపూలు సహజ పరిమళాలు వెదజల్లాయి. ఎటువంటి వర్ణనలు, ఉపోద్ఘాతం, సందేశ కుతూహలం లేకుండా చక్కని ఎత్తుగడతో, సంభాషణంతో, సహజ పాత్ర చిత్రణతో కథలు సాగుతాయి. ఆమె కథల్లో దుష్ట పాత్రలుండవు. తాను పుట్టిన, పెరిగిన జీవిత నేపథ్యం, దానిలోని మనుషులు, సంఘటనలే ఆమె కథలకు ఇతివృత్తాలు. ఇవే వాటికి బలాన్ని, గొప్ప సహజత్వాన్నిచ్చాయి. అందుకే ఎంతో హృద్యంగా ఉంటాయి” అన్నారు.

రెండవ సమీక్షకులు శ్రీ భమిడిపాటి గౌరీశంకర్ మాట్లాడుతూ చెంగల్వ రామలక్ష్మి కథలు మధ్యతరగతి జీవితాన్ని దృశ్యమానం చేస్తాయన్నారు. “క్లుప్తత, సంఘర్షణ, నిర్మాణ సౌష్టవం ఆమె కథల్లో ఉంటుంది. భాష ఎంతో సరళంగా ఉంటూ వాడుకభాషలో సాగుతూ మధ్యతరగతి జీవితంలోని ఉన్న వైవిధ్యతను చూపుతూ మనసును ఎంతగానో ఆకట్టుకుంటాయి” అన్నారు.

ఆత్మీయ స్పందన తెలియచేసిన ప్రఖ్యాత కథకుడు, నవలా రచయిత శ్రీ. పి.వి.బి. శ్రీరామమూర్తి “ఆకట్టుకునే చక్కని శైలితో, అలతి పదాలతో మధ్యతరగతి జీవితం లోని పలు కోణాలను తెలిపే ఆమె ‘చెంగల్వ పూలు’ పరిమళాలను ఆస్వాదించండి” అన్నారు.

మరొక ఆత్మీయ అతిథి, ప్రఖ్యాత కథకుడు, నవలాకారుడు శ్రీ ఎమ్. వేంకటేశ్వరరావు “చెంగల్వ రామలక్ష్మి వ్యక్తిత్వంలోని నిరాడంబరత, స్వభావంలోని సరళత, మంచితనం, ఆమె కథల్లో చూస్తాం. కుటుంబం, బంధాలు, అనుబంధాలకు ఆమె కథలు పెద్ద పీట వేస్తాయి” అన్నారు.

చి. లలితా వాసంతి, తను ఈ పుస్తకాన్ని ఆవిష్కరించటం ఎంతో సంతోషంగా ఉంది. అమ్మ కథలు చదువుతానని అంది.

రచయిత్రి డా. చెంగల్వ రామలక్ష్మి తన ‘చెంగల్వ పూలు’ కథా సంపుటి ఈ విశాఖ సాహితి ద్వారా, ఇంతమంది సాహితీ దిగ్దంతుల సమక్షంలో ఆవిష్కృతం కావటం తనకు ఎనలేని ఆనందాన్ని కలిగించిందని, తన  అదృష్టమని అన్నారు. శ్రీమతి కోలవెన్ను మలయ వాసిని, శ్రీ ద్విభాష్యం రాజేశ్వర రావు గార్లకు కృతజ్ఞతలు తెలియచేసారు.

పుస్తకంలోని కథలను అద్భుతంగా విశ్లేషించిన శ్రీయుతులు దామెర వెంకట సూర్యారావు, భమిడిపాటి గౌరీశంకర్ గారికి, ఎంతో ఆత్మీయ సంభాషణం చేసిన శ్రీయుతులు శ్రీరామమూర్తి, ఎం. వెంకటేశ్వరరావు గార్లకు కృతజ్ఞతలు తెలియచేసారు. “నా మధ్యతరగతి జీవితం, బోధనా వృత్తి, పఠనం నా కథలకు ఎన్నో ఇతివృత్తాలనిచ్చాయి” అని ముక్తాయించారు.

ఈ దిగ్విజయసభ శ్రీ ఘండికోట విశ్వనాధం వందన సమర్పణతో ముగిసింది.

ఘండికోట విశ్వనాధం

విశాఖ సాహితి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here