మంచి చెప్పే ‘చెన్నై బామ్మ’

0
7

[dropcap]ప్ర[/dropcap]సిద్ధ రచయిత్రి శ్రీమతి దాసరి శివకుమారి రచించిన ఐదు కథల సంపుటి ‘చెన్నై బామ్మ’. నేటి పిల్లలు, పెద్దల అనాలోచిత చర్యలకు పరిష్కారాలు సూచిస్తూ చెప్పిన చిన్న కథలివి.

ఈ చిన్న పుస్తకంలో సంఘర్షణ, మన ఊరు – మన భాష, గెలుపు, తేనె మనసు, చెన్నై బామ్మ అనే కథలు ఉన్నాయి.

“చదువులకు సరైన మార్గదర్శనం చేయగల సాహిత్యం ఎంతైనా రావలసిన ఆవశ్యకత గల నేటి తరుణంలో, పిల్లల చదువుల చుట్టూ నడిచే దాసరి శివకుమారి గారి కొన్ని కథలను ఈ పుస్తక రూపంలో మీ ముందుకు తేవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు ప్రచురణకర్తలు.

***

‘సంఘర్షణ’ కథలో రచయిత్రి పిల్లల చదువుల గురించి చెప్పారు. ముఖ్యంగా ఇంటర్మీడియెట్ కార్పోరేట్ రెసిడెన్షియల్ కాలేజీల్లో చదివే పిల్లలు – అక్కడ ఎదుర్కునే సమస్యలు వివరిస్తారు. టీచర్ల ప్రవర్తన ఎలా ఉంటుందో చెబుతారు. అలాగే ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఎంతో ఒత్తిడి చేస్తూ వారిని సరిగా అర్థం చేసుకోకుండా – తాము అనుకున్న, తాము కలలు కన్న డాక్టర్ లేదా ఇంజనీరింగ్ మాత్రమే అయితీరాలని – పట్టుపడుతుంటే – పిల్లలు ఎంతో నలిగిపోయి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. వైద్య విద్య, ఇంజనీరింగ్ చదువులకి ప్రత్యామ్నాయంగా పిల్లలకి ఎన్నో ఇతర మంచి కోర్సులు ఉన్నాయని, తల్లిదండ్రులు వాటి మీద కూడా దృష్టి పెట్టాలని ఈ కథ లో ఓ పాత్ర ద్వారా చెప్పించారు రచయిత్రి.

***

‘మన ఊరు – మన భాష’ కథలో పల్లెటూర్ల గురించి, తెలుగు భాష గురించి ఎంతో చక్కగా కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు రచయిత్రి. ఇప్పటి పిల్లలు, పెద్దలు కూడా పాశ్చాత్య పోకడలకి, సెల్ ఫోన్‌లకి ఎలా బానిసలవుతున్నారో ఈ కథలో వివరించారు. వారికి మన ఊరుని, తెలుగు భాషని పరిచయం చేయడం ఎంత అవసరమో సవివరంగా తెలిపారు రచయిత్రి.

***

‘గెలుపు’ కథ నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా, పిల్లలు శ్రద్ధగా పట్టుదలతో చదివితే ఎంత ఎత్తుకు ఎదగగలరో ఈ కథలో చెప్పారు రచయిత్రి. ఈ కథలో – వెనుకబడిన తరగతులకు చెందిన ఒక పదవ తరగతి విద్యార్థిని ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుని – తన తల్లిదండ్రుల మద్దతుతో – ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో – పదవ తరగతి పరీక్షలలో వారి మండలంలో మూడవ స్థానంలో నిలుస్తుంది. ట్రిపుల్ ఐటికి ఎంపికై తన కలను నెరవేర్చుకుంటుంది. పాత విద్యార్థి నాగరాజు ఆమెకు ఎంత ప్రేరణిచ్చాడో ఈ కథలో తెలుస్తుంది.

***

‘తేనె మనసు’ కథలో బంధువులైన రెండు కుటుంబాల మధ్య గొడవలు రేగుతాయి. కలహాలతో వారు ఎంతకి తెగించారో వివరిస్తారు రచయిత్రి. అయితే ఆ ఇరు కుటుంబాలకు చెందిన పిల్లలు ఎంత సఖ్యంగా, స్నేహితులలాగా మసలుకుంటారో చెబుతారు. తమ కుటుంబ గొడవలు వారి స్నేహానికి ఆటంకాలు కలుగజేయలేవు. పెద్దలు చేసిన తప్పులను చిన్నపిల్లలు సరిదిద్దడం అనే కొసమెరుపు బావుంది.

***

‘చెన్నై బామ్మ’ కథలో రచయిత్రి చదువు విలువను గొప్పగా చెప్పారు. చిన్నప్పుడే పెళ్ళి చేసిన పంపిన తన కూతురు విదేశాలలో పడే ఇబ్బందులను ప్రస్తావిస్తుంది బామ్మ. అవెంతో వాస్తవికంగా ఉన్నాయి. అలాగే తాను కోడలుగా తెచ్చుకున్న పిల్ల కూడా ఎక్కువగా చదువుకోకపోవడం ఆమెని ఆలోచింపజేస్తుంది. మార్పు వైపు అడుగులు వేయిస్తుంది. అనారోగ్యంతో కొడుకు చనిపోతే కోడలిని చదివించి మరో పెళ్ళి చేస్తుంది బామ్మ. తన కూతురుని కూడా చదువుకోమని ప్రోత్సహిస్తుంది. వాళ్ళ పిల్లలని తానే పెంచుతూ, తాను కూడా చదువు కొనసాగిస్తుంది.

ఈ కథ పేరునే పుస్తకానికి పెట్టడం ఎంతో సమజంసంగా ఉంది.

***

చెన్నై బామ్మ (కథల సంపుటి)
రచన: దాసరి శివకుమారి
ప్రచురణ: విజ్ఞాన ప్రచురణలు, నెల్లూరు
పుటలు: 64
వెల: ₹ 50.00
ప్రతులకు:
విజ్ఞాన ప్రచురణలు,
ప్రజా సైన్స్ వేదిక,
జి. మాల్యాద్రి, ప్రచురణల విభాగం,
ప్లాట్ నెం 162, విజయలక్ష్మి నగర్,
నెల్లూరు 524004
ఫోన్: 9440503061

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here