తెలంగాణ మలితరం కథకులు – కథనరీతులు-5: చెరబండరాజు కథలు

    1
    3

    [box type=’note’ fontsize=’16’] 60వ దశాబ్దంలో వస్తున్న కథలకు భిన్నంగా – చెరబండరాజు తన కథల్లో ఆర్థిక ఇబ్బందులతో వేసారిపోయిన చిరుద్యోగుల జీవన పోరాటాన్ని, దొరల పీడన – వెట్టిచాకిరిలో నలిగిపోతున్న గ్రామీణ ప్రజల వ్యథాభరిత జీవితాలను చిత్రించగలిగారని వివరిస్తున్నారు కె.పి. అశోక్ కుమార్. [/box]

    [dropcap]చి[/dropcap]న్నతనం నుండే పద్యాలు, పాటలు రాస్తూ వచ్చిన బద్దం భాస్కరరెడ్డి దిగంబరకవి చెరబండరాజుగా మారి ఒక్కసారిగా జనం దృష్టిని ఆకర్షించగలిగాడు. అప్పటికి అతనికి పాతికేళ్ళు కూడా లేవు. హైదరాబాదులోని ఒకానొక ఓరియంటల్ కాలేజీలో తెలుగును అభిమాన విషయంగా తీసుకుని మలక్‌పేట్ జూనియర్ కాలేజికి అనుబంధించిన హైస్కూల్లో తెలుగు పండిట్ ఉద్యోగానికి యోగ్యత సంపాదించుకున్నాడు. స్వగ్రామమైన అంకుశాపురంలోనూ, హైదరాబాదులోనూ చాలా కాలం వరకూ తాను బద్దం భాస్కరరెడ్దిగానే వుంటూ, ఆ తర్వాత దిగంబర కవిగా చెరబండరాజు అనే కలం పేరు పెట్టుకున్నాడు. అసలు పేరు మరుగున పడిపోయి, కలం పేరే అసలు పేరుగా స్థిరపడిపోయింది.
    చెరబండరాజు ‘దిక్చూచి’, ‘ముట్టడి’, ‘గమ్యం’, ‘కాంతి యుద్ధం’, ‘గౌరమ్మ కలలు’, ‘జన్మహక్కు’, ‘పల్లవి’ అనే కవితా సంకలనాలను వెలువరించారు. ‘గౌరమ్మ కలలు’, ‘కాంతి యుద్ధం’, ‘ఊరు మేలుకొన్నది’ అనేవి ఆయన రాసిన కథా గేయాలు. ఆయన రాసిన ‘కొండలు పగలేసినం’ గీతం గొప్ప దృశ్యరూపకంగా రూపొందింది. ‘మాపల్లె’, ‘ప్రస్థానం’, ‘నిప్పులరాళ్లు’, ‘గంజినీళ్లు’ అనే నవలలు రాశాడు. ఆయన రాసిన నాటకాలు అన్నింటిని కలిపి ‘గ్రామాలు మేల్కొంటున్నాయి’ పేరిట పుస్తకంగా తీసుకువచ్చారు. ఆయన రాసిన కథలు 1964 నుండి పత్రికల్లో వస్తూనే వున్నాయి. బద్దం భాస్కరరెడ్డిగా ‘గోలకొండ పత్రిక’, ‘ఆంధ్రభూమి’ వగైరా పత్రికలలో కథనరంగంలో ప్రవేశించినవాడు. హైదరాబాద్ దిగంబర కవుల్లో ఒకడయ్యాక చెరబండరాజుగా ఆ వ్యాసంగం కొనసాగించాడు.
    ప్రేమ, ప్రేయసి, ఊహాలోకం, ఆకాశ ఉద్యానవనం, నేల పట్టులేని సదాశయాలు – అవన్నీ అతనికిగానీ, మరో కొత్త రచయితకు గానీ సహజ చాపల్యాలే. అయితే పాటిమన్ను, పేడదిబ్బ, ఒక పట్వారీ చేతి దుడుకు, మరో పట్వారీ మనసు వంకర, చేత మొలకలు కావలసిన పిచ్చిమొక్కల్లాంటి సాదా మనుషుల నోటి బాసలు, గుండె ఘోషలు పల్లెల నుంచి పట్నాలకు వలసపోక తప్పనివాళ్ళకు ఎదురయ్యే జీవన సమస్యలు, గుమాస్తాల లాంటి బడి పంతుళ్ళు, అప్పుసప్పులు, కష్టనష్టాలు, ఇంకా బడుగు మనుషుల ఆకలి, అసహాయత, రోగాలు, రొష్టులూ – ఇలాంటివి నేటికైనా ఎందరు రచయితల గుండెలకు నిజంగానే బలంగానే పట్టుతున్నాయి? బద్దం భాస్కరరెడ్డి తనలో కూడా కథకుడిగా చెరబండరాజు చూపెట్టింది, ఇలాంటి ‘వ్యథార్థ జీవిత యథార్థ దృశ్యాల’నే.
    విరసం ఏర్పడ్డాక రాసిన కథలు అట్టే లేకపోయినా, “ఇప్పుడు వీస్తున్న గాలి” సంకలనంలోని కథ “చిరంజీవి” అతని కథాశిఖరం కాగలిగింది. ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలోనూ, మండలిలోనూ అప్పటి హోం శాఖా మంత్రి ఆ సంకలనం మీద ప్రభుత్వం నిషేధం గురించి ఓ శాసన సభ్యుడు అభ్యంతరం చెప్పినప్పుడు, ఎలాంటెలాంటి ప్రమాదకరమైన కథల వల్ల దాన్ని తాము నిషేధించక తప్పింది కాదని వివరించడానికి ఆ కథను స్వయంగా చదివి వినిపించిన సన్నివేశం అపూర్వం.
    చాలీచాలని జీతంలో భార్యాపిల్లల్ని పోషించలేని పరమేశ్వరం, పట్నం జీవితంతో విసిగిపోయి తిరిగి పల్లెకు వెళ్ళిపోవాలనుకుంటాడు. ఈసారి గర్భిణిగా వున్న భార్య పోషకాహార లోపం వల్ల అకాల ప్రసవంతో పాప మరణించగా, బాలెంత రోగంతో ఆమె విషమ పరిస్థితులలో ఉంటే దిక్కుతోచని పరమేశ్వరం “నన్ను ‘పల్లె పిలవడం’ లేదు. మరణమే ఆహ్వానిస్తుందని కుమిలిపోతాడు.
    మందు” కథలో, ఊళ్ళో బతకలేక యాదగిరి భార్యబిడ్డలతో హైదరాబాద్ మురికివాడకు చేరుకుని అక్కడో గుడిసె వేసుకుని రిక్షా నడిపిస్తూంటాడు. వారం రోజులుగా కురిసే కుంభవృష్టిలో కొడుకు చావు బ్రతుకుల్లో వుంటే, ఆ వాడ డాక్టరును తీసుకు రావడానికి వెళితే, వాడు ఈసడించుకుని వెళ్ళగొడతాడు. కోపం పట్టలేక యాదగిరి చేయి చేసుకోవడంతో పోలీసులు పట్టుకెళ్ళి కుళ్ళబొడుస్తారు. దెబ్బలతో ఇంటికి వెళ్తే ఇల్లంతా శ్మశానంలా మారిపోతుంది. ఏ పోలీసులు యాదగిరి రిక్షాను ఫ్రీగా వాడుకుంటున్నారో, అదే పోలీసులు యాదగిరి జీవితాన్ని, అతని కుటుంబాన్ని నాశనం చేయడం విషాదం.
    అవసరాలు పెరుగుతున్నాయి. వాటి సరసన ధరలు పెరుగుతున్నాయి. ఇంటింటి అవస్రాలు తీర్చుకోవడంలో పోటీ పెరుగుతుంది. ఇంట్లో పూట గడవని రోజులు. వాటికి తోడు రోగాలు, మందులు అన్నీ పెరుగుతున్నాయి. చాలీచాలని జీతంతో పూటగడవని వాళ్ళు తమ అవసరాల కోసం అప్పులు చేయక తప్పదు. మొదటి తేదీ వస్తుందంటేనే భయం. అప్పులు తీర్చాలి. ఇల్లు నడపాలి. మళ్ళీ అప్పులు చేయక తప్పదు. ఈ విషవలయంలో చిక్కుకుపోయిన పాపారావు తన కూతుర్ని బళ్ళో వేయడానికి ఒక పలక కొనలేకపోతాడు. పొదుపు చేసి తన అవసరాలను తగ్గించుకోబోయి మరింత ఖర్చు చేయాల్సి వస్తుంది. 1969లో రాసిన ఈ కథలో ఒక చిరుద్యోగి… అందునా ప్రభుత్వోద్యోగి తన బిడ్డకు ‘పలకా-బలపం‘ కొనలేని దుస్థిత్లో వున్నాడంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది.
    తాను చేయని తప్పుకు గొడ్ల కాపరి మల్లేశం యజమాని చేత చావు దెబ్బలు తినడంతో, వాడు అలిగి వెట్టి చాకిరి మానేసి చదువుకొని పైకెదగాలనుకుంటాడు. షావుకారు దొంగలెక్కలతో విసిగిపోయిన వాడి తండ్రి పోచయ్య, చదువుకుంటే ఈ మోసాల బారి నుండి బయటపడచ్చు అనుకుంటాడు. అలా తండ్రీ కొడుకులు రాత్రి పాఠశాలలో “ఒకే దీపం కింద” చదువుకునే సన్నివేశంతో కథ ముగుస్తుంది. అజ్ఞానం, అమాయకత్వం, నిరక్షరాస్యత వల్లే పేద ప్రజలు దోపిడికి గురవుతున్నారనీ, చదువు ఒక్కటే వారికి తెలివిడిని కలిగిస్తుందని ఈ కథ తెలియజేస్తుంది.
    చరిత్ర పాఠాలు” చెప్పడమంటే యుద్ధాలు వర్ణించడం, తేదీలు వల్లించడం కాదు. విద్యార్థులలో నూతన దృక్పథం కలిగించడం, పారుతున్న కాలం కన్నా వేగంగా మనుషుల్ని పరిగెత్తించడం అని నమ్మిన రామయ్య పంతులు – నేటి సమాజంలో విద్యార్థుల పాత్ర గురించి చెబుతూ, అన్యాయాలు చేసేవారు తల్లిదండ్రులయినా క్షమించకూడదు, వాటిని నిర్భయంగా బయటపెట్టాల్సిందే అంటాడు. ఆ మాటలకు ప్రభావితుడైన కిరణ్ తన తండ్రి బ్లాక్ మార్కెట్ చేస్తున్నాడని పోలీసులకు రిపోర్ట్ ఇస్తాడు. ఈ సంగతి తెలిసిన కిరణ్ నాన్న వాడిని చితగ్గొట్టి, గదిలో బంధించి, దీనికంతా కారకుడైన రామయ్య పంతులును దూరప్రాంతాలకు బదిలీ చేయిస్తాడు. అప్పుడు రామయ్య పంతులు – చదువులకూ, వాస్తవ జీవితానికి సంబంధం లేకుండా పోయిందని తన ప్రియ శిష్యుడు కిరణ్‌కు చెబుతూ, ‘ఎప్పుడూ అన్యాయలను సహించవద్దు. అదే నేను చెప్పే చివరి పాఠం’ అని చెప్పి వెళ్ళిపోతాడు.
    దృష్టి” కథలో సరోజకు శ్రీనివాసరావుతో గల ప్రేమను చిదిమేసి, చివరకు ఆమెను గృహిణిగా కూడా బ్రతకనివ్వకుండా, ఆమె భర్తతో స్నేహం చేసుకుని ఆమెను వేధిస్తుంటాడు రఘు. కన్నవారిని కష్టాలకు వదిలిపెట్టి పంటపొలాల్నీ, ఇంటిని గాలికి వదిలేసి కవిత్వం, సాహిత్యం అంటూ రాత్రులకు రాత్రులు కనిపించకుండా పోయే భర్త. వచ్చి పోయేవారికి ఆతిథ్యం ఇవ్వాలి. తనకు ప్రతినిధిగా మెలగాలి. తన రాతప్రతులు ఫెయిర్ చెయ్యాలి. స్త్రీ జనోద్ధరణ మీద నవలలు, కానీ ఇంట్లో భార్య పరిస్థితిని పట్టించుకోడు. విచిత్రం ఏంటంటే, సరోజ గతం, రఘు నిజస్వరూపం అన్నీ భర్తకు తెలుసు. వాళ్ళందర్ని పాత్రలుగా వదిలేసి, దూరం నుండి రచయితగా గమనిస్తున్నానని తెలియజేయడం కొసమెరుపు. ఈ కథలో సరోజ గిల్టీ ఫీలింగ్‌ను చిత్రీకరించిన విధానం బాగా వచ్చింది.
    నాట్లు వేసినా, కలుపు తీసినా, చెలుకలతో చెట్టు కొట్టినా, విత్తనాలు వేసినా ఊళ్ళోని కూలీ జనం అంతా, ముందు పట్వారీ నారాయణ రెడ్డి దగ్గరకు రావలసిందే. తరతరాలుగా సాగివస్తూ నేటికి నిరంతరంగా సాగిస్తున్న”కట్టడి” ఇది. అతడు వడ్లు కొలవందే, వూళ్ళో కూడా ఎవరూ కొలవకూడదు. కుండకి ఇంత ధరని అతడు నిర్ణయించాల్సిందే. చిన్న రైతులు వడ్లమ్మిన్నా, ఆముదాలమ్మిన్నా, ఏవమ్మినా అతను కాదంటేనే ఇతరులకు అమ్మాలి. పుట్ట బేరం తనది. కుండల, కుంచాల బేరం వూళ్ళో చిల్లరకొట్ల వారిది. కళ్ళంలో కుప్ప నూర్పిళ్ళు జరిగినప్పుడే సబ్బండ వర్ణాల వారు వచ్చి వారి వంతలు, బిచ్చాలు తీసుకుని పోవాలి. ఆ సమయం మించితే, మళ్ళీ ఏడాది వరకూ నోరెత్తకూడదు. కళ్ళంలో వున్న నారాయణ రెడ్డి ధాన్యాన్ని ఆ రోజే పంపిస్తే మంచి రేటు ఇస్తానని సేఠ్ పన్నాలల్ ఆశపెడతాడు. దాంతో నారాయణ రెడ్డి ఎంత రాత్రయినా సరే ఇవాళ కుప్ప కొట్టాల్సిందే, వడ్డు లారీల కెక్కాలసిందే అని హుకుం జారీ చేస్తాడు. పిల్లలూ, ముసలివాళ్ళు, ఆడా మగా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు లీనమైపోతారు. కూలెక్కువ ఇస్తాం, కళ్ళెం నుంచి వడ్లు లేచిందాకా ఎవరూ అన్నాల కెళ్ళద్దు అని శాసిస్తాడు. ఎదురు జవాబు చెప్పలేకి కూలోళ్ళు మౌనంగా పనిచేసుకుంటూ పోతారు. అంతలో కొంతమంది బడిపిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి ‘గుడిసెలకు నిప్పంటుకుని వాడకట్టంతా కాలిపోతోంది రమ్మ’ని చెబితే, కూలీలు మంటలార్పడానికి వెళ్ళబోతుంటే దొర ఆపుతాడు. “మీ గుడిసెల్లో ఏమున్నాయి? కాలిపోతే కొత్త గుడిసెలు వేయిస్తాను. మీరీవాళ వొడ్లు నింపకపోతే నాకు వేల మీద నష్టం వస్తుంది. పైగా వర్షం వస్తే మీకూ, నాకు గింజ దక్కదు” అని బెదిరిస్తూ, ముందుకు వెళ్ళబోయిన వాడి కాలు విరగ్గొట్టడంతో అంతా చేసేది లేక పనుల్లో మునిగిపోతారు. ధాన్యం లారీకెక్కుతుంది. అంతలో వర్షం. ‘వానకు మీ గుడిసెలు ఆరిపోతాయి. కళ్ళెంలో తడిసిన వొడ్లు తలో పానెడు తీసుకుపోయి పక్కకుబెట్టి ఆరబెట్టుకోండి. ఇవాళ కాదనుకుంటే ఇంటి దగ్గర గింజ దొరకదు’ అనడంతో అంతా తడిసిన వొడ్లు తీసుకుని ఊరిలోకి వస్తారు. కళ్ళెం దగ్గర పడ్డ వాన, ఊళ్ళో లేకపోవడం వలన వాళ్ళ గుడిసెలన్నీ కాలిపోతాయి. ‘పంట పట్వారీకి దక్కింది, బూడిద మనకు మిగిలింది. ఉన్నోన్ని, వానను నమ్మినోడెవడు?’ అన్న లచ్చుమన్న పాటే నిజమవుతుంది. “కట్టడి” పేరుతో పట్వారీ నారాయణ రెడ్డి నిరంకుశత్వాన్ని, నియంతృత్వాన్ని ఈ కథలో చక్కగా చిత్రించారు.
    నమ్మకంగా ఉప్పరి పని చేసి, యజమాని కోసం పెద్ద మేడ కట్టిన రాజాలు – అదే యజమాని దుర్మార్గానికి, స్వార్థానికి బలయి తన రెండో భార్యను, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, తన కుమారుడు నారాయణను అతని దగ్గరే వెట్టిచాకిరికి పెట్టాల్సి వస్తుంది. చివరికి నారాయణ యజమానిని రక్షించబోయి కన్నతండ్రిని పోగొట్టుకుంటాడు. పేదవాడికి, యజమాని ఇంటి కుక్క కూడా యజమానే అని ఈ “దారిపొడగునా” అనే కథ తెలియజేస్తుంది.
    చైతన్యం రెక్కవిప్పింది” కథలో, 16 ఏళ్ళప్పుడు ఏ జీతమో 40 ఏళ్ళప్పుడూ అదే జీతం ఎందుకు ఇస్తారో బాలిగానికి అర్థం కాదు. వాడు పెరుగుతున్న కొలది కొత్త ఆశలు, ఉత్సాహం, ఆత్మ విశ్వాసం నింపుకుంటూ వస్తాడు. కంపెనీల మాదిరిగా పనివేళలు వుండాలని వాదించి పెదకాపుతో దెబ్బలు తింటాడు. ఇంట్లోంచి పారిపోయి, పట్నంలో ఫాక్టరీలో పనికి చేరి హక్కుల గురించి, ఉద్యమాల గురించి తెలుసుకుంటాడు. ఊరికి వెళ్ళి రాత్రి పాఠశాలలో చేరి జీతగాళ్లను చైతన్యపరుస్తాడు. సంస్కరణల పేరిట ప్రభుత్వం చేసే మోసాల్ని, బంజరు భూముల స్వాధీనం విషయంలో కుహానా కమ్యూనిస్టుల వైఖరిని ఎండగడతాడు. పేద రైతులు, కూలీలను ఏకం చేసే దిశగా రైతు సంఘం ఏర్పాటు చేస్తాడు. జీతగానిగా పుట్టి, బతికినంత కాలం జీతగాడిగా వుండాల్సిన బాలిగాడిలో బీజప్రాయంగా అతడిలో పొడసూపిన ప్రశ్నించే తత్త్వం, క్రమంగా అతడ్ని చైతన్యవంతుడిగా, ఉద్యమశీలిగా తీర్చిదిద్దిన వైనం ఇందులో కనిపిస్తుంది.
    చిరంజీవి” కథలో ముక్కు పచ్చలారని పద్నాలుగేళ్ళ బాలుడ్ని పట్టుకున్న పోలీసులు విప్లవ స్థావరాలు ఎక్కడ వున్నాయో చూపమని అడవికి తీసుకువస్తారు. వాడ్ని ఎన్‌కౌంటర్ చేయమంటే ఏ పోలీసూ ముందుకు రాడు. దాంతో కోపం పట్టలేక డి.యస్.పి. స్వయంగా ఆ పిల్లవాడ్ని కాల్చిపారేస్తాడు. తిరుగు ప్రయాణంలో పోలీసు జీపు నీళ్ళు లేక ఆగిపోతుంది. నీళ్ళు తేవడానికి భయంతో ఎవరూ దిగకపోతే, డి.యస్.పి., రామ్మూర్తి అనే కానిస్టేబుల్ అడవిలోనికి వెళతారు. అక్కడ రామ్మూర్తి డి.యస్.పి.ని తుపాకీతో కాల్చి చంపి, అతని రివార్వర్ తీసుకుని అడవి లోనికి పారిపోతాడు. రెండు రోజుల తర్వాత – పోరాటంలో ఇద్దరు నక్సలైట్లు మృతి. అందులో ఒకడు పద్నాలుగేళ్ళ కుర్రవాడని అధికారయుతంగా తెలుస్తుంది – అనే వార్త పేపర్లో వస్తుంది. ఆ రెండో వ్యక్తి కానిస్టేబుల్ రామ్మూర్తి అని ఊహించవచ్చు. కథ ఇతివృత్తం బాగానే వుంది. కాని పద్నాలుగేళ్ళ కుర్రవాడు తన వయసుకు మించిన పరిజ్ఞానాన్ని, విప్లవ పంథాను కలిగి వుండడం నమ్మశక్యంగా లేదు. జీపులో కూర్చుని ఆ కుర్రాడు దారి పొడుగునా – మానవుడు, నిజమైన స్వేచ్ఛ, ఈనాటి దేశ పరిస్థితులు, రాజకీయ సిద్ధాంతాలు, రాజీ మార్గాలు, ప్రపంచం నిండా రగులుతున్న విప్లవజ్వాలలు, పోరాటాలు, దోపిడి వర్గాలు, కోర్టులు చేస్తున్న మోసాలు, వర్గాలుగా చీలిపోతున్న భారతీయులు – ఇలా ఒకటేమిటి ఎన్నో తెలిసినవాడిలా అంత చిన్న వయసులో అనర్గళంగా మాట్లాడుతూ వుంటాడు. “పోలీసులూ మీరందరూ పేరులే” అంటాడు. “మీరొట్టి అంకెలు కాదు. మీకూ పేర్లున్నాయ”ని గుర్తు చేస్తాదు. చచ్చేముందు “అన్నలారా! ఆలోచించండి. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమో, దోపిడి ప్రభుత్వమో తర్కించుకుని శాస్త్రీయమైన మా పోరాటంలో చేరండి. తుపాకులు అప్పగించి దేశం కోసం వీరుల్లా పోరాడండి” అని హితోపదేశం చేస్తాడు. ఇంకో వైపు ఈ కథలో పోలీసుల వెట్టిచాకిరి గురించి వివరిస్తారు. కూటి కోసం తప్పిస్తే ప్రభుత్వానికి కీలుబొమ్మలా ఉపయోగపడడం తప్పిస్తే, దేశాన్ని కాపాడేది పోలీసే అనుకోలేకపోతాడు రామ్మూర్తి. మంచీ మర్యాదా లేనిదే పోలీసు ఉద్యోగం. డి.యస్.పి. రెడ్డిని చూశాక అక్రమంగా ఆర్జించడానికి, పెద్దిళ్ళ విద్యావంతులు ఈ డిపార్టుమెంటులోకి వచ్చి ఎంత కర్కశంగా ప్రవర్తిస్తారో, కానిస్టేబుళ్ళను ఎంతగా హింసిస్తారో రామ్మూర్తి కళ్ళారా చూస్తాడు. ఆత్మరక్షణ పేరుతో పోలీసులు చేసే అన్యాయాలకు లెక్కా పత్రం వుండదు. ఇన్‌స్పెక్టర్ల దృష్టిలో పోలీసులు మనుషులు కారు, గానుగెద్దులు వాళ్ళు. ఆత్మవంచనతో కూడిన ఈ ఉద్యోగాన్నుంచు, నటన నుంచి విముక్తి ఎన్నాళ్ళకో అని చింతించిన రామ్మూర్తి, డి.యస్.పి.ని చంపి అడవిలోకి పారిపోతాడు. బాలుడి ఎన్‌కౌంటర్ కంటే పోలీసుల్లో తిరుగుబాటును ప్రబోధించినందువల్లే, అప్పట్లో ప్రభుత్వం ఈ కథను నిషేధించింది. “చిరంజీవి” తామాడ చినబాబు, పాణిగ్రాహి జముకుల కథ దళంలో పద్నాలుగు సంవత్సరాల పసివాడు. 1969 మే 27న పోలీసులు పంచాది కృష్ణమూర్తితో పాటు ఇతన్ని కాల్చి వేశారు. ఆ యథార్థ గాథనే చెరబండరాజు రాశాడు. అప్పట్లో విపరీతంగా ప్రశంసలందుకున్న ఈ కథ, ఇప్పుడు చదువుతుంటే చాలా కృతకంగా, అతి నాటకీయత నిండి వుందని మనం గుర్తించవచ్చు.
    పల్లెల నుండి పట్నాలకు వచ్చిన కూలోళ్ళు కానీ, చిరుద్యోగులు కాని అక్కడి జీవన వ్యయాన్ని తట్టుకోలేక, ఉన్న సంపాదన సరిపోక, అప్పులతో పస్తులతో కాలం గడుపుతూ – విసిగిపోయి – దీనికంటే పల్లెనే బాగుంది. అక్కడికి వెళ్ళిపోదామని తలచే పాత్రలు కొన్ని కథలలో కనిపిస్తాయి. దీనికి సంబంధించి ఏకంగా “పల్లె పిలుస్తోంది” అనే కథను రాసేశారు. నిజానికి పల్లెలు అంత బ్రహ్మాండంగా ఏం లేవు. అక్కడ దొరల నియంతృత్వం, వెట్టిచాకిరిలతో ఇంకా ఘోరంగా వున్నాయి. అది తెలిసి కూడా రచయిత పల్లెకు పోదామనడంలో, పల్లెల పట్ల మమకారం అని కాకుండా మానవ సంబంధాల పట్ల రచయితకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది.
    మొత్తానికి 60వ దశాబ్దంలో వస్తున్న కథలకు భిన్నంగా – చెరబండరాజు తన కథల్లో ఆర్థిక ఇబ్బందులతో వేసారిపోయిన చిరుద్యోగుల జీవన పోరాటాన్ని, దొరల పీడన – వెట్టిచాకిరిలో నలిగిపోతున్న గ్రామీణ ప్రజల వ్యథాభరిత జీవితాలను చిత్రించగలిగారు. తరతరాలుగా అణచివేతలకు గురయిన ప్రజల నుండి ప్రశ్నించెే తత్త్వం మొదలయ్యిందనీ, దోపిడి స్వభావాన్ని గుర్తించగలుగుతున్నారనీ, అది తిరుగుబాటు చైతన్యానికి దారితీస్తుందని రచయిత అన్యాపదేశంగా సూచిస్తారు. నిజం చెప్పాలంటే చెరబండరాజు వచన రచనల కంటే ఆయన కవిత్వం, పాటలే ఆయనను “చిరంజీవి”గా నిలబెడతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here