[dropcap]చె[/dropcap]రువు అమ్మలాగే నిండుకుండ లాగుంది
అలలెన్నో రేగుతోన్నా…
అంతరంగాన మాత్రం ప్రశాంతంగా
‘కట్ట’మగాడిని కట్టుకున్న నాటినుండి
కలిసే ఉంది… కౌగిలించుకునే ఉంది
ఒళ్ళంతా ఒక్కటిగా పెనవేసుకునే ఉంది
ఎంతటి అనురాగమో… ఎంతటి ఆప్యాయతో
మేఘాల రథాలెక్కి
గాలి అలల దారులవెంట పరుగులెడుతూ
నేలతల్లి పిలించిందనీ కిందికి జారి
పాయలై పారుతోన్న నీటిపాపల్ని
ఆప్యాయంగా పిలిచి అక్కున చేర్చుకుంది
భద్రంగా తన కడుపులో దాచుకుంది
పంటపొలాల పసికూనలకు లాలపోసి,
కడుపునిండా కమ్మని నీరు త్రాపి
పచ్చదనపు పట్టుపరికిణీ కట్టి
ఎదగనిచ్చి… ఎదిగి ఒదగనిచ్చి
పల్లె ముత్తైదువకు పంటల వాయినాలిచ్చింది
లెక్కతప్పిన ఆకాశం అప్పుడప్పుడు
హద్దుదాటేంత నీటిని పంపకమేస్తే
అదుపు తప్పుతోన్న
తన అంత’రంగం’లోని అలలజడికి వెరిసి
పల్లె మేలుకోరి
తన ‘కట్ట’ మగని ఒంటిని గండికొట్టించి
నిండు గర్భాన తానే చిచ్చుబెట్టుకుంటుంది
అలిగిన మేఘమాలికలు ఎప్పుడైనా
పలకరించకుండా వెళ్ళిపోతే
వర్షపు చినుకులు చిలకరించకుండా పోతే
తన వంటి నిండా ఉండిన నీళ్ళు
అడుగంటిపోయి
అసలు అగుపించకుండాపోతే
ఆశల కళ్ళేసుకుని ఆకాశాన్ని చూస్తూనే ఉంటుంది
తన కడుపునిం(పం)డే ఘడియ
త్వరలోనే ఉందా అని అడుగుతూనే ఉంటుంది
వట్టిపోయినా, చెరువెన్నడూ వెరువదు
మంచిరోజులు ముందుంటాయన్న మాట మరువదు
చెరువు
ఆకలెరిగిన అమ్మ… అన్నఫూర్ణమ్మ