చేసిన కర్మము..

26
12

[dropcap]సో[/dropcap]మవారం కావడంతో బ్యాంక్ అంతా కోలాహలంగా, హడావిడిగా, కస్టమర్స్‌తో నిండి పోయి వుంది. భోజన విరామం సమయంలో కౌంటర్ మూసేసి, అన్ని సర్దుకోసాగింది స్వాతి. అదుగో అప్పుడు కంగారుగా లోనికి అడుగుపెట్టాడు శ్రీకాంత్. వెంటనే కౌంటర్ ముందుకెళ్లి “ఏమండీ అర్జెంటుగా డిడి కావాలి.. ప్లీజ్” అన్నాడు.

“టైం అయ్యిపోయింది రేపు రండి” అంది స్వాతి తల దించుకుని పేపర్స్ అన్నీ లోపల పెట్టుకుంటూ.

“మేడం. ప్లీజ్, కాస్త అర్జెంటు” అభ్యర్థనగా అన్నాడు శ్రీకాంత్.

శ్రీకాంత్ వేపు తలెత్తి చూసి మెడలో స్టెతస్కోప్ కనపడుతూ వుంటే. “మీరు డాక్టరా?” అంది.

“ఇంకా పూర్తి కాలేదు.. హౌస్ సర్జన్” అన్నాడు చిన్నగా నవ్వి.

“సరే ఇవ్వండి” అని మర్యాద పూర్వకంగా నవ్వి చేతిలోని డబ్బులు తీసుకుంది స్వాతి.

చక్కని పలువరస, అందమైన నవ్వు అనుకున్నాడు. డబ్బులు తీసుకుని లెక్క పెట్టుకుంటున్న స్వాతిని చూసాడు శ్రీకాంత్. రింగులు తిరిగిన జుట్టు, తీర్చి దిద్దిన పెద్ద కళ్ళు, విల్లు లాంటి కనుబొమలు, అందమైన అమ్మాయి అనుకుని “మీ పేరేంటి మేడం” అన్నాడు.

“నా పేరు స్వాతి. అరగంట ఆగి రండి మీ పని అయిపోతుంది” అని లేచి శ్రీకాంత్ వేపు చూడకుండా వెళ్ళిపోయింది.

వెనకనుండి తననే చూస్తున్న శ్రీకాంత్‌ని గమనించి వీపు  వైపు  కొంగు సర్దుకుంది.

బయటకు వచ్చి అక్కడ నిలబడ్డ స్నేహితులను చూసి నవ్వి “పదండి ఇంకో అర గంట తర్వాత మళ్ళీ రావాలి.” అన్నాడు శ్రీకాంత్.

“మళ్ళీ రావాలా? అబ్బా” అని విసుక్కున్నాడు రమేష్.

“మరేం పర్లేదు, చక్కటి అమ్మాయి వుంది కౌంటర్‌లో” అన్నాడు శ్రీకాంత్ కొంటెగా నవ్వి.

“నీకు కొత్త టార్గెట్” అన్నాడు వెంకట్.

“అన్నట్లు శాంతి విషయం ఏం చేసావ్” అడిగాడు రమేష్.

“శాంతి మామూలు అమ్మాయి. నాకెక్కడ సరిపోతుంది.” అన్నాడు శ్రీకాంత్ ముందుకు నడుస్తూ.

“మొదట్లో ఆ అమ్మాయే అప్సరస అన్నావు” అని వెక్కిరింతగా అన్నాడు వెంకట్.

“ఒరేయ్ నువ్విలా ముందు లక్ష్మిని తర్వాత శాంతిని ఇలా వెంట తిప్పుకుని తర్వాత ఇప్పుడిలా చేయటం బాగాలేదు” అన్నాడు రమేష్.

“ఒరేయ్ మీరిలా అర్థం లేకుండా మాట్లాడకండి, నా జీవిత భాగస్వామి కావాలంటే అంత సులభం కాదు. నేను కలెక్టర్ కొడుకునని మీరు మర్చిపోతున్నారు. పైగా నేనేమీ వాళ్ళని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు.” అని విసుక్కున్నాడు శ్రీకాంత్.

ఎవరూ మాట్లాడలేదు.

హాస్పిటల్‌లో పేషెంట్ లను అన్యమనస్కంగా చూస్తున్నాడు శ్రీకాంత్. అది గమనించి పక్కన కూర్చున్న రమేష్ “ఏంటలా వున్నావు” అన్నాడు

“ఏమీ లేదు రమేష్, స్వాతి మొహమే కళ్ళ ముందు కదలాడుతోంది” అన్నాడు.

“అంటే.. బ్యాంకులో చూసిన అమ్మాయేనా?” అన్నాడు రమేష్.

“అవును.. ఏదో తెలియని ఆకర్షణ ఆ అమ్మాయిలో” అన్నాడు శ్రీకాంత్ స్టెత్ పక్కన పెట్టి.

“నీకందరూ మొదట్లో అందంగా కనపడతారు. కొన్ని నెలల అయింతర్వాత నీ రుచులు మారిపోతాయి.” అని నవ్వేసాడు రమేష్.

“అలా ఏమీ లేదు కానీ.. ఈ అమ్మాయిలో విపరీతమైన ఆకర్షణ ఉందిరా. నేవెతుకుతున్న అమ్మాయి తనేనేమోనని అనుమానంగా వుంది.”

“సరే కావొచ్చు.. కానీ అమ్మాయికి పెళ్లి అయిపోయిందేమో చూసుకో” అన్నాడు వెంకట్.

“అసంభవం.. నేనిక్కడ ఉండగా అదెలా!!” అన్నాడు శ్రీకాంత్

ఆ మాట విని అందరూ నవ్వేశారు.

“బ్యాంకుకు వెళ్ళాలి.. పదండి” అని లేచాడు శ్రీకాంత్.

***

బ్యాంకు లోపల ఒకరిద్దరు వెయిటింగ్ రూమ్‌లో కూర్చుని వున్నారు. అంతా ఖాళీగా వుంది. లోనికెళ్లి చుట్టూ పరికించాడు శ్రీకాంత్. దూరంగా మేనేజర్ కేబిన్‌లో నుండీ బయటకు వస్తూ కనిపించింది స్వాతి.

అక్కడనుండి శ్రీకాంత్‌ని చూసి కౌంటర్ దగ్గరకు వెళ్లి టేబుల్ మీదున్న డిడి తీసి ఇచ్చింది.

“థ్యాంక్ యు మిస్..” అంటూ ఆగిపోయాడు.

“స్వాతి” అంది స్వాతి.

నవ్వుతూ చూసాడు స్వాతి కళ్ళలోకి శ్రీకాంత్. ఏ మాత్రం నవ్వకుండా సీరియస్‍గా చూసి “వెల్‌కమ్” అని వెళ్ళిపోయింది స్వాతి

బయటకు వచ్చాక అన్నాడు రమేష్ “నిజమే మంచి అందమైన అమ్మాయే.. కానీ చూసావుగా నీ చిరునవ్వుకు ఏ మాత్రం కరిగి పోలేదు.. సీరియస్‌గా సమాధానం చెప్పి వెళ్ళిపోయింది. నువ్వనుకున్నంత తేలిక కాదు”

ఆ రాత్రి గదిలో చాలా సేపు నిద్ర పోకుండా ఆలోచించసాగాడు శ్రీకాంత్.

మధ్య రాత్రి లేచి చూసిన రమేష్‌కు నిద్ర పోకుండా వరండాలో పచార్లు చేస్తున్న శ్రీకాంత్ కనిపించాడు.

లేచి వచ్చి అడిగాడు “ఏంటి నిద్ర పోకుండా.. ఏంటి ఆలోచన?”

“ఏమీ లేదు పద” అని మంచం వేపు నడిచాడు శ్రీకాంత్.

మరుసటి రోజు సర్జరీ కేసెస్‌లో క్షణం తీరిక లేకుండా పనిలో వున్నారందరూ. మధ్యాహ్నం కాంటీన్‌లో స్నేహితులు ముగ్గురూ కూర్చున్నారు.

“ఒకసారి బ్యాంకు వెళ్లి స్వాతిని చూసి వద్దామని అనిపిస్తోంది. సరేనా” అని లేచాడు శ్రీకాంత్.

“నీ ఇష్టం” అంటూ లేచారు స్నేహితులు రమేష్,వెంకట్.

బ్యాంకులో అడుగు పెట్టి కౌంటర్ వేపు చూసాడు శ్రీకాంత్. తీరిక లేకుండా పని చేసుకుంటూ వుంది స్వాతి. కౌంటర్ వద్దకు వెళ్లి నిలబడి “హలో స్వాతి గారు” అన్నాడు.

ఆ మాటకు తలెత్తి చూసింది స్వాతి. నల్లని ఒత్తయిన జుత్తు, తెల్లని స్ఫురద్రూపంతో యువకుడిని చూసి “ఎస్.. చెప్పండి” అంది.

“అరె.. నేనండీ డాక్టర్ శ్రీకాంత్, హౌస్ సర్జన్.. నిన్న కూడా కలిసాం” అన్నాడు.

“చెప్పండి..ఏం కావాలి?” అంది మర్యాద వుట్టిపడుతున్న స్వరంతో. ఆమె కళ్ళలో ఎటువంటి భావం కనపడటం లేదు.

“అదీ.. అదీ.. సేవింగ్స్ ఖాతా తెరవాలి” అన్నాడు తడపడుతూ.

“అదుగో అక్కడ కనపడుతున్న కౌంటర్ వద్దకు వెళ్ళండి” అని పక్కకు చూపించి, తిరిగి తన పనిలో తాను మునిగిపోయింది స్వాతి.

ఇక ఏం చేయాలో తెలీక వెళ్లి రమేష్‌ని పిలిచి “అదుగో అక్కడ ఒక ఖాతా తెరవాలి పద” అని రమేష్‌ని పట్టుకుని వెళ్ళాడు శ్రీకాంత్. అంత చూసి పకపకా నవ్వుకుంటూ వెళ్ళాడు రమేష్.

పక్క టేబుల్ వద్ద కూర్చొని తన వేపే చూస్తున్న శ్రీకాంత్‌ను గమనించి చిరాకుగా మొహం పెట్టింది స్వాతి.

మరుసటి రోజు కూడా ఒపి అయిపోగానే బ్యాంకు లోకి ప్రవేశించాడు శ్రీకాంత్.

కౌంటర్ ముందు నిలబడి పాస్ బుక్ ముందు పెట్టి డబ్బులు కౌంటర్‌లో పెట్టాడు. డబ్బులు తీసుకుని పాస్ బుక్ అందుకుని రసీదు ఇచ్చేప్పుడు కళ్ళు పైకి లేపి చూసింది స్వాతి.

“హలో స్వాతి గారు” అన్నాడు చిరునవ్వుతో శ్రీకాంత్.

సీరియస్‌గా శ్రీకాంత్ వేపు చూసి “హలో..” అని “మీరు పక్కకు జరిగితే మీ వెనక క్యూ లో వున్న వారు వస్తారు” అంది స్వాతి.

“ఓహ్ సారీ” అని పక్కకు తప్పుకున్నాడు శ్రీకాంత్.

ఆ రోజంతా స్వాతి గురించే ఆలోచిస్తున్నాడు శ్రీకాంత్. సాయంకాలం ఒక ఆలోచన మనసులో తట్టింది. రేపే దాన్ని ఆచరణలో పెట్టాలి అనుకున్నాడు.

***

ఉదయం బ్యాంకులో సంతకం పెట్టి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి తన కౌంటర్ దగ్గరకెళ్ళి రిజిస్టర్స్ అన్నీ సర్దుకోసాగింది. ఇంతలో మేనేజర్ నుండి పిలుపు వచ్చింది.

కౌంటర్ వేపు నుండీ నడుస్తూ వస్తున్న స్వాతిని చూసి ‘మెరుపు తీగె’ అనుకున్నాడు శ్రీకాంత్.

మేనేజర్ కేబిన్ లోకి అడుగు పెట్టి “గుడ్ మార్నింగ్ మేడం” అంది.

“స్వాతి.. ఇదుగో.. డాక్టర్ శ్రీకాంత్, విజయవాడ కలెక్టర్ గారి అబ్బాయి. మన దగ్గర ఫిక్స్డ్ డిపోసిట్స్., వగైరా డీటెయిల్స్ ఇవ్వండి. మీరు తెలుసనీ చెప్పారు.” అని, శ్రీకాంత్ వేపు చూసి “మీకేది కావాలన్నా స్వాతిని కలవండి. మీ నాన్నగారు మాకు పరిచయం కూడా” అంది మేనేజర్ సుమలత.

“ఓకే మేడం.. థ్యాంక్యూ” అని లేచి నిలబడి స్వాతి కేసి చూసాడు. స్వాతి మొహంలో ఎటువంటి భావం కనపడలేదు.

“రండి” అని ముందు నడుస్తున్న స్వాతి వెనకాల మంత్రముగ్ధుడిలా అనుసరించాడు శ్రీకాంత్.

ముందు వేపు కూర్చొని స్వాతి చెప్తున్న విషయాలు వింటున్న శ్రీకాంత్‌కి స్వాతి కళ్ళు, అందంగా కదులుతున్న పెదాలు తప్ప ఇంకేమీ అర్థం కావటం లేదు. కొద్దిసేపటికి వున్నట్లుండి చెప్పటం ఆపి “డాక్టరు శ్రీకాంత్ గారు మీరు వినటం లేదు.. నా సమయం వృథా చేస్తున్నారు” అంది.

అది విని స్పృహ లోకొచ్చాడు శ్రీకాంత్. వెంటనే తడుముకుని “నిజమే స్వాతి గారు.. మీ మధురమైన స్వరం వింటుంటే ఏమీ అర్థం కావటం లేదు” అన్నాడు మెల్లిగా.

“సరే అయితే.. మీరిక వెళ్లొచ్చు. నిజంగా అవసరం వున్నప్పుడు రండి” అని లేచి నిల్చుంది చిరాకుగా.

“అలాగే స్వాతి గారు.. సారీ” అని చెప్పి వెళ్ళిపోయాడు.

శ్రీకాంత్ బ్యాంకు తలుపులు దాటగానే చిన్నగా నవ్వుకుంది స్వాతి.

రాత్రి కాంటీన్‌లో మెడికల్ కాలేజీ విద్యార్థులందరూ డిన్నర్ చేస్తూ వున్నారు. హాల్ అంత కోలాహలంగా వుంది. ఒక పక్కన కూర్చున్న వెంకట్, రమేష్, శ్రీకాంత్ కూర్చొని హాస్పిటల్ విషయాలు మాట్లాడుకుంటున్నారు.

“ఇంతకూ మమ్మల్ని రేపు ఫిక్స్డ్ డిపోసిట్స్ చేయమంటున్నావ్.. స్వాతి గురించేనా?” అన్నాడు రమేష్.

“స్నేహంలో ఇంత మాత్రం చేయలేరా?” సూటిగా ప్రశ్నించాడు శ్రీకాంత్.

“సరే రా.. శ్రీకాంత్ రేపు వస్తాం, ఇక వేరే విషయాలు మాట్లాడుకుందాం.” అన్నాడు వెంకట్

మరుసటి రోజు సాయంత్రం ముగ్గురూ స్వాతి కౌంటర్ ముందు కూర్చున్నారు.

“మీకు కొద్ది సేపటిలో ఎఫ్ది సర్టిఫికేట్స్ ఇస్తాను.. కూర్చోండి. కాఫీ తెప్పిస్తాను. సరేనా” అంది స్వాతి.

“పర్వాలేదండి స్వాతి గారు.. సాయంకాలం మీ బ్యాంకు ఎదురుగా వున్న కాంటీన్‌లో కాఫీ త్రాగుదాం. ఇది మా ఆహ్వానం. కాదనకండి” అన్నాడు వెంకట్ నవ్వుతో.

“అవును మీరు రావాల్సిందే” అన్నారు రమేష్, శ్రీకాంత్ ఒకే స్వరంతో.

అందరినీ పరికించి చూసింది స్వాతి. వారి మొహాల్లో తన పట్ల గౌరవం చూసి “సరే డాక్టర్, కానీ బిల్ నాది” అంది చిరునవ్వుతో.

“బిల్ దేముందమ్మా, నా కంటే చిన్నదానివిగా, నువ్వు కట్టకూడదు” అన్నాడు వెంకట్.

“అలాగా సరేనండి, ఆరు గంటలకు కలుద్దాం” అని నవ్వింది. ఆరాధన వుట్టిపడే చూపులతో తననే చూస్తున్న శ్రీకాంత్ వేపొకసారి చూసింది స్వాతి.

“ఓకే” అంటూ లేచారందరూ.

***

“మీరెప్పుడు వుద్యోగంలో చేరారు” అన్నాడు రమేష్, కాఫీ కప్ చేతిలోకి తీసుకుని.

“నా ఇంజనీరింగ్ పూర్తి కాగానే పరీక్ష రాశానండి. ఆరునెలల్లో, ఇంటర్వ్యూ, అపాయింట్మెంట్ ఆర్డర్ అన్నీ వచ్చేసాయి. ప్రస్తుతం ప్రొబేషన్‌లో వున్నా” అంది స్వాతి.

“మీరు అందరూ ప్రస్తుతం ఏం చేస్తున్నట్లు” అంది ముగ్గురి వంక చూసి.

“మెడిసిన్ అయిపోయింది.. ఇప్పుడు హౌస్ సర్జెన్సీ ఆఖరులో వున్నామమ్మా” అన్నాడు వెంకట్.

శ్రీకాంత్ మటుకు ఏమీ మాట్లాడకుండా కూర్చోవటం ఆశ్చర్యంగా వుంది స్వాతికి.

“మీరుండేది?” వున్నట్లుండి అన్నాడు శ్రీకాంత్.

“ఇక్కడే, మా అన్నయ్య కలెక్టర్ ఆఫీస్‌లో వుద్యోగం. తనింట్లోనే ఉంటున్నా. అమ్మా, నాన్న అందరూ బాపట్ల. నాన్న రిటైర్డ్ బ్యాంకు మేనేజర్.” అంది స్వాతి

“అయితే మీ స్వంత ఊరు బాపట్ల అన్నమాట. మాది చిలకలూరిపేట, శ్రీకాంత్‌ది విజయవాడ, వెంకట్ వాళ్ళది ఇదే ఊరు. కాకపోతే మాతోటే మా రూమ్‌లో ఉంటాడు” అన్నాడు రమేష్.

“ఈ వచ్చే ఆదివారం మా ఇంటికి రా స్వాతి. మా అమ్మ నాన్నను పరిచయం చేస్తాను” ఆప్యాయంగా అన్నాడు వెంకట్.

“సరే డాక్టర్ గారు” అంది స్వాతి.

“నన్ను పేరు పెట్టి పిలవచ్చమ్మా స్వాతి” అన్నాడు వెంకట్

ఇంతలో సర్వర్ చేతిలో బిల్ తీసుకుని వచ్చాడు. బిల్ కట్టి మళ్ళీ కలుద్దాం అనుకుంటూ అందరూ బయటకు వచ్చేసారు.

ఆ రోజు రాత్రి గదిలో టేబుల్ లాంప్ కింద పుస్తకం పక్కకు పెట్టి అన్నాడు వెంకట్ “స్వాతి మంచి కుటుంబం నుంచీ వచ్చిన అమ్మాయి. చక్కని మనసు, ఆలోచనలు ఆరోగ్యకరంగా వున్నాయి. నీ ఉద్దేశం ఏంటి శ్రీకాంత్?”

శ్రీకాంత్ కూడా తాను చదువుతున్న పుస్తకము మూసేసి వెంకట్ వేపు చూసాడు. “నాకు చాలా ఇష్టంగా వుంది వెంకట్. నా జీవిత  భాగస్వామిగా  కుదిరితే అదృష్టంగా భావిస్తాను. పైగా తన అందం, ఆకర్షణ నన్ను తలకిందులు చేసింది. ఇప్పడేగా పరిచయం. మనసులు కలుస్తాయో లేదో చూడాలి. ఇంకా ముఖ్యంగా తనకు నేను నచ్చాలిగా” అన్నాడు.

“కానీ అమ్మాయితో సరదా స్నేహం చేస్తానంటే మేమేమాత్రం సహకరించం” అన్నాడు వెంకట్ మొహం కాస్త అదో రకంగా పెట్టి.

వెంటనే సర్దుకున్నాడు శ్రీకాంత్. “అలా ఎందుకు చేస్తాను.. అబ్బెబ్బే.. అలాంటిది జరగదు.” అన్నాడు.

అతని గొంతులో తత్తరపాటు చూసి అన్నాడు రమేష్ “స్వాతి కాస్త అమాయకురాలు అని నాకర్థం అయ్యింది. దురుద్దేశాలు రానివ్వకు.”

“మీరెందుకలా అంటున్నారో కానీ నాకమ్మాయంటే మంచి భావన కలుగుతోంది” అన్నాడు శ్రీకాంత్ తల పైకెత్తి శూన్యం లోకి చూస్తూ. స్నేహితులిద్దరూ కాసేపు శ్రీకాంత్‌ని చూసి తృప్తిగా నిట్టూర్చి తిరిగి పుస్తకాలు తెరిచి అందులో మునిగి పోయారు.

***

ఆ రోజు ఆదివారం. వెంకట్ ఆహ్వానం మేరకు వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి నిశ్చయించుకుంది స్వాతి.

డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ రఘురాం వేపు చూసి అంది. “అన్నయ్యా.. డాక్టర్ వెంకట్, ఇంటికి ఆహ్వానించాడు. మధ్యాహ్నం వెళ్ళొస్తా. సరేనా “

సరేనంటూ తలూపాడు రఘురాం, ఉప్మా నములుతూ.

“ఎవరు ఈ వెంకట్.. ఎక్కడ డాక్టర్” అంది రమ.

“ఇక్కడే వదినా.. మెడిసిన్ చదువుతున్నారు. బ్యాంకులో పరిచయం.” సమాధానం చెప్పింది స్వాతి.

“మన వాళ్ళేనా?” అంది రమ, స్వాతి కళ్ళలోకి చూసి.

“అనుకుంటాను.. తెలీదు” అంది స్వాతి కళ్ళెగరేసి.

సాయంత్రం వెంకట్ ఇంట్లో ముందు హాల్లో తివాచీ మీద కూర్చున్నారు స్నేహితులు ముగ్గురూ. ఒక వేపు వెంకట్ తండ్రి రామశాస్త్రి వయోలిన్ మ్రోగిస్తూ త్యాగరాయ కీర్తన పాడుతున్నారు. మరో పక్కన తల్లి సీతమ్మ తాళం వేస్తున్నారు.

ఆ సమయంలో వెంకట్ ఇంటి బయట మేజోళ్ళు వదలి లోనికి అడుగు పెట్టింది స్వాతి. వెంకట్ లేచి వెళ్లి ఏమీ మాట్లాడకుండా చేతులతో లోనికి ఆహ్వానించాడు. అందరికీ మౌనంగా నమస్కరించి సీతమ్మ పక్కన కూర్చుంది స్వాతి. కీర్తన పది నిముషాలు సాగింది. రామశాస్త్రీ ఆపి వయోలిన్ పక్కన పెట్టి, ఎవరీ అమ్మాయి? అన్నట్లుగా చూసారు కొడుకు వెంకట్ వేపు.

“నాన్నా.. తను స్వాతి.. ఇక్కడే బ్యాంకులో వుద్యోగం” అని చెప్పి తల్లి వేపు కూడా చూసాడు.

ఇద్దరి వేపు చూసి “నమస్కారం బాబాయి గారు, పిన్ని గారు” అని నమస్కరించింది స్వాతి.

స్వాతిని ఆశీర్వదించి ఇద్దరూ లేచి లోనికెళ్ళారు.

“స్వాతి ఇల్లు తేలికగానే దొరికిందిగా” అన్నాడు వెంకట్.

“మీరు చెప్పినట్లుగా వచ్చేసా.. ఏమీ కష్టం కాలేదు” అంది నవ్వుతూ.

“కాఫీ తీసుకుంటావుగా” అడిగింది సీతమ్మ వంటింట్లోనుండీ స్వాతి కేసి చూసి.

“అవునండీ.. కానీ నే వస్తున్నా.. నే చేస్తా కాఫీ” అని లేచి గబగబా వంటింట్లోకి వెళ్ళింది స్వాతి.

అది చూసిన రామశాస్త్రి “భలే అమ్మాయి.. కలుపుగోలు” అని నవ్వుతూ సోఫాలో చేరగిలపడ్డాడు.

వంటింట్లోనుంచీ స్వాతి గలగలా మాట్లాడుతుండటం వినపడుతోంది. కాసేపటికి ట్రే లో కాఫీ గ్లాస్‌లు పట్టుకుని బయటకు వచ్చి, ముందుగా రామశాస్త్రి గారికి ఇచ్చింది స్వాతి. మిగిలినవి అందరికీ అందించి ఆఖరున శ్రీకాంత్‌కు ఇచ్చింది.

కప్ తీసుకుని కాఫీ రుచి చూడసాగాడు శ్రీకాంత్.

“భలే వుందోయ్ ఈ రోజు కాఫీ..” అన్నారు రామశాస్త్రి, సీతమ్మ వేపు చూసి.

“నేను కాదు.. అదుగో స్వాతి చేసిందీ రోజు” అని నిండుగా నవ్వింది సీతమ్మ.

“స్వాతి గ్రేట్” అన్నాడు రమేష్.

“అయితే రోజు కాఫీ పెట్టటానికి స్వాతిని రమ్మంటే సరి” అన్నాడు వెంకట్. అందరూ నవ్వేశారు.

అలా మాట్లాడుకుంటూ రెండు గంటలు అలవోకగా గడిచిపోయాయి. అందరూ చాలా హ్యాపీగా వున్నారు. శ్రీకాంత్, స్వాతి మాత్రమే తక్కువగా మాట్లాడుకున్నారు. స్వాతిని దగ్గర నుండీ చూస్తుంటే నోట్లో మాట రాకుండా అక్కడే ఆగిపోతూవుంది శ్రీకాంత్‌కి.

ముందు అంతలా మాట్లాడిన శ్రీకాంత్ ఇప్పుడిలా మౌనంగా ఎందుకున్నాడో అనుకుంది స్వాతి.

భోజనాల వేళ అయ్యింది. “నువ్వు కూడా ఇక్కడే మాతో కానిచ్చి వెళ్ళమ్మాయి” అంది సీతమ్మ

“అలా అయితే వచ్చే వారం మా ఇంట్లో మీకు లంచ్” అంది స్వాతి.

అందరూ సంతోషంగా భోజనాలు కానిచ్చారు. కాసేపు చిన్న నిద్ర తీర్చుకుంటామని లేచి వెళ్లారు శాస్త్రి, సీతమ్మ

“డాక్టర్ రమేష్ గారు మీ విశేషాలు చెప్పండి” అంది స్వాతి

“మేమిద్దరం అన్నదమ్ములం, తమ్ముడింకా ఇంటర్ చదువుతూ వున్నాడు.. మాది చిట్‌ఫండ్ వ్యాపారం.” అని ఆగాడు రమేష్.

“మరి మీరు?” అంది స్వాతి శ్రీకాంత్ కేసి చూసి.

“నాన్నగారు అసిస్టెంట్ కలెక్టర్. ఇంట్లో పనులన్నీ అమ్మే చూస్తుంటుంది. నేనిక్కడ. ఇంతకీ మీరు ఇంజనీరింగ్ చదివారు కదా? ఎక్కడ?” అన్నాడు శ్రీకాంత్.

“యెన్ ఐ టి, త్రిచ్చి.” అంది స్వాతి.

“అబ్బో మంచి రాంక్ వున్న కాలేజీ అది” అన్నాడు వెంకట్ మెచ్చుకోలుగా.

“అవునండీ ఇండియాలో ఎనిమిదవ రాంక్. 1964లో స్థాపించారు. ఫీజు దాదాపుగా లక్ష కట్టాలి. ఇవన్నీ కూడా అటానమస్ కాలేజీలు. అత్యున్నతమైన స్థాయిలో విద్యాబోధన జరుగుతుంది, ముఖ్యంగా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్‌కి ఇందులో విపరీతమైన డిమాండ్ వుంది. 17 విభాగాల నుండీ ఏటా 1700 డిగ్రీల ప్రధానం చేస్తారు. దాదాపు అందరికీ క్యాంపస్ సెలక్షన్‌లో ఉద్యోగాలొచ్చేస్తాయి.” అని చెప్పటం ఆపింది స్వాతి.

“అవన్నీ వదిలేసి మరి మీరెందుకిలా బ్యాంకు ఉద్యోగానికి వచ్చారు” అన్నాడు రమేష్

“నాకలాంటి తలనొప్పి వుద్యోగం వద్దు.. ఆ డబ్బులు వద్దు. ప్రశాంతంగా ఇలాంటి ఊరిలో సంతోషంగా జీవితం గడపటం ముఖ్యం. ఆశకు అంతెక్కడ. ఆనందంగా జీవించటం కావాలి” అంది స్వాతి. ఆమె మొహంలో తృప్తి కనపడుతోంది.

“గ్రేట్ డెసిషన్” అన్నాడు శ్రీకాంత్.

“నేనిప్పుడే కాస్త బయటకి వెళ్ళొస్తాను” అంటూ లేచాడు రమేష్.

“నేను కూడా కాస్తలో వస్తాను.. మీరు మాట్లాడుతూ వుండండి” అంటూ లేచాడు వెంకట్.

హాల్‌లో స్వాతి, శ్రీకాంత్ ఇద్దరే మిగిలారు.

“వీళ్లిద్దరు ఎటెళ్ళారు శ్రీకాంత్ గారు” అంది స్వాతి

“వూ.. బహుశా సిగరెట్‌కై ఉండాలి” అనుమానంగా అన్నాడు

“మరి మీరు?”

“నాకు ఆ వాసన చూస్తేనే తల నొప్పి” అని మొహం చిట్లించాడు.

“మరి మిగిలిన అలవాట్లు?” అంది స్వాతి అతడి కళ్ళ లోకి సూటిగా చూసి.

“నాకేవీ లేవు.” నవ్వుతూ అన్నాడు శ్రీకాంత్.

“రేపటి నుండీ బ్యాంకులో ఇంకేదైనా పని ఉంటే, ఫోన్ చేసి చెప్పండి డాక్టర్ శ్రీకాంత్. నే చేసి పెడతాను. రోజూ మీరెందుకు పని మానుకుని బ్యాంకు చుట్టూ తిరగటం” అంది చిరునవ్వుతో.

అది విని గతుక్కుమన్నాడు శ్రీకాంత్ “అలాగే స్వాతి” అన్నాడు ఏమీ చేయలేక.

స్వాతి పాదాలను చూసాడు. గోరింటాకుతో మెరిసిపోతు వున్నాయి. శ్రీకాంత్ చూడటం గమనించి చీరె కుచ్చెళ్లతో పాదాలు కప్పుకుంది స్వాతి. వెంటనే దృష్టి మరల్చాడు శ్రీకాంత్.

“ఇక్కడ హౌస్ సర్జెన్సీ చేసాక తర్వాత ఏం చేస్తారు” అంది.

“అయితే పీజీ లేదా ఉదోగంలో చేరి కొన్ని రోజులు ఏజెన్సీ అడవుల్లో గిరిజనులకు సేవ చేస్తాను” అన్నాడు.

అతని ఉన్నతమైన ఆశయాన్ని విని ఆశ్చర్యపోయింది స్వాతి. శ్రీకాంత్ కేసి చూసింది. లోపల వుండే భావాలకు బయట కనిపించే ఇతని స్వభావానికి ఎక్కడా పోలిక లేదు అనుకుంది.

పక్కింట్లో నుండీ ‘మనసున వున్నదీ చెప్పాలనున్నదీ’ అనే పాట వినపడసాగింది. ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. శ్రీకాంత్ మనసులో స్వాతి మీద ఎన్నో భావాలు ఎగసి పడుతున్నాయి. అన్నింటినీ అదుపులో పెట్టుకుని బయటకు ఏమీ కనపడకుండా స్థిమితంగా కూర్చున్నాడు.

‘ఇతనిలో ఏదో ప్రత్యేకత వుంది’ అనుకుంది స్వాతి.

“మీ హాస్పిటల్ ఉద్యోగం ఎలా వుంది” అంది స్వాతి

“ప్రభుత్వ ఆసుపత్రి కదా.. అంతా బీదవాళ్ళు వస్తారు. మా దగ్గర మందులుండవు. బయట కొనుక్కోవటానికి వారి దగ్గర డబ్బులుండవు. సరి అయిన పోషణ లేక మందులు పని చేయవు. ప్రభత్వాలు పట్టించుకోవు. ఏదో చేస్తాము.” అన్నాడు శ్రీకాంత్.

“మరెలా” అంది స్వాతి.

“ఏం చేయలేము. అసలు నాకీ చదువే ఇష్టం లేదు. పెద్ద వాళ్ళు చదివిస్తే అలాగే వెళ్ళిపోయాను. మ్యూజిక్, ఫోటో గ్రఫీ నాకిష్టం. ఎప్పటికైనా ఫొటోగ్రఫీ ఫీల్డ్‌కి వెళ్లి పోతాను” అన్నాడు తల వంచుకుని.

శ్రీకాంత్‌ని తేరిపారా చూసింది స్వాతి, ఏమిటో చాలా విచిత్రమైన వ్యక్తి అనుకుంది.

ఇంతలో వున్నట్లుండి తడబడుతూ అన్నాడు శ్రీకాంత్ “స్వాతి మిమ్మల్ని రోజూ చూడాలని వుంది”

“దేనికి, అందం కోసమా, టైం పాస్ కోసమా..” అంది స్వాతి చాలా గంభీరమైన చూపులతో.

స్వాతి మొహం కేసి చూసి “అలాంటిదేమీ కాదు కానీ.. ఏమిటో మిమ్మల్ని చూసినప్పటి నుండీ నా మనసు మీద నాకు అదుపు లేకుండా పోయింది.” అన్నాడు.

“ఏదీ డిడి గురించి వచ్చినప్పటి నుండా?” అంది స్వాతి ముందుకు వంగి శ్రీకాంత్ కళ్ళలో భావాలను చదవటానికి ప్రయత్నిస్తూ.

శ్రీకాంత్ ఏదో చెప్పేలోగా రమేష్, వెంకట్ హాల్ లోనికి వస్తున్నట్లుగా చప్పుడు వినిపించి చెప్పటం ఆపేసాడు.

“భోజనం చేసి చాల సేపయ్యింది ఒక సారి కాఫీ తీసుకుందామా?” అన్నాడు వెంకట్

“తీసుకుందాం కానీ అమ్మను డిస్టర్బ్ చేయకండి. కాఫీ నేనే చేస్తాను” అని నవ్వుతూ లేచింది స్వాతి.

“సరే అలాగే మీ ఇష్టం” అన్నాడు వెంకట్.

కాఫీలు తీసుకున్నాక అందరికీ థాంక్స్ చెప్పి ఇంటికి బయలుదేరింది స్వాతి. “నా కారులో డ్రాప్ చేస్తాను” అంటూ బయటకు వచ్చి కార్ తలుపు తీసాడు శ్రీకాంత్.

“అది బెస్ట్.. ఇల్లు చూసుకుని రా.. మనం వెళ్ళటానికి సులభంగా ఉంటుంది” అన్నాడు వెంకట్.

చేసేదేమీ లేక కారెక్కి కూర్చుంది స్వాతి. ఇంటికి చేరే వరకూ ఇద్దరూ మాట్లాడకోలేదు. ఇల్లు రాగానే కిందకు దిగి “ఇంట్లోకి రండి శ్రీకాంత్ గారు” అంది స్వాతి.

“ఇప్పుడు కాదు.. అందరం వస్తాముగా అప్పుడు” అని చెప్పి కార్ వెనక్కి తిప్పాడు శ్రీకాంత్.

ఆ రోజు రాత్రి వెంకట్ ఇంట్లో ఉండిపోయారు శ్రీకాంత్, రమేష్.

“ఏమంటోంది స్వాతి.. మొత్తానికి మంచి మనసు” అన్నాడు వెంకట్.

“ఏమీ లేదు. నా కెరీర్ గురించి అడిగింది. నాకు నచ్చింది. అసలు వదల లేనేమో ఇక.” అన్నాడు శ్రీకాంత్ కళ్ళు మూసుకుని.

“కానీ తనకు కూడా నువ్వు అంతలా నచ్చాలిగా. అమ్మాయికి జీవితం మీద మంచి అవగాహన వుంది.” అన్నాడు రమేష్

“నాకేం తక్కువ.. అందులో, మంచి అందగాడిని కూడా” అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ.

“అదే చెప్పటం.. ఆ అమ్మాయి నీ ఆస్తి, అందంని చూసి పడిపోదు” అన్నాడు వెంకట్.

స్నేహితులను ఒకసారి చూసి సమాధానం చెప్పలేక తల తిప్పుకున్నాడు శ్రీకాంత్.

***

బ్యాంకు మేనేజర్ గదిలో చిన్న మీటింగ్ జరుగుతూ వుంది. బంట్రోతు తలుపు తీసి “స్వాతి మేడం! మీ గురించి ఎవరో వచ్చారు.” అన్నాడు.

కేబిన్ అద్దాలలో నుండీ బయటకు చూసింది స్వాతి. ఎవరూ కనపడ లేదు. “సరే వస్తాను కూర్చోబెట్టు” అని మీటింగ్‌లో మునిగి పోయింది.

అరగంట తర్వాత బయటకు వచ్చేసరికి టేబుల్ ముందు వేచి చూస్తూ వున్న డాక్టర్ శ్రీకాంత్ కనిపించాడు.

“అరె మీరా! సారీ చూడలేదు” అని చెప్పి తన కుర్చీలో కూర్చుంది.

“పర్లేదు స్వాతి గారు.. చెక్ బుక్ రాలేదు” అన్నాడు.

స్వాతి మొహంలో నవ్వు మాయం అయ్యింది

“చెక్ బుక్ ఇక్కడ రాదండి. మీ అడ్రస్‌కే వస్తుంది. పైగా ఏదైనా ఉంటే ఫోన్ చేయండి.” అంది సీరియస్‌గా.

“సరే స్వాతి గారు.. కలుస్తాను” అంటూ లేచాడు శ్రీకాంత్. మొహం ఎర్రగా కందిపోయి వుంది.

“ఆగండి కాఫీ తీసుకుని వెళ్దురు గానీ.” అంది అతడి మొహం చూసి కాస్త నొచ్చుకుంటూ.

“నో. థ్యాంక్యూ” అని వెళ్ళిపోయాడు.

వేగంగా వెళ్తున్న శ్రీకాంత్‌నే చూస్తూ నిలబడింది స్వాతి.

ప్రతి రోజూ బ్యాంకులో పని చేస్తున్నంత సేపూ కౌంటర్ బయటకు చూసుకుంటూ పని చేసుకుంది స్వాతి. శ్రీకాంత్ వస్తాడేమో ఇంకాసేపట్లో అని చాలా సార్లు అనుకుంది. కానీ శనివారం సాయంత్రం వరకూ శ్రీకాంత్ కనపడలేదు.

ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో, స్వాతి భోజనాల ఏర్పాట్లలో మునిగి పోయి వుంది. ఇంతలో స్వాతి మొబైల్ మ్రోగింది.

“హలో.. వెంకటన్న.. ఏంటి ఇంకా రాలేదు.. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా” అంది ఉత్సాహంగా.

“ఆ. స్వాతి ఇదుగో పది నిముషాల్లో వస్తున్నాం.. అందుకే కాల్ చేస్తున్నానమ్మా” అటునుండి సమాధానం చెప్పాడు వెంకట్.

“రండి త్వరగా.. పెట్టేస్తున్నా మరి” అని ఫోన్ పెట్టేసింది స్వాతి.

సరిగ్గా పది నిముషాల్లో స్వాతి ఇంట్లోకి అడుగు పెట్టారు వెంకట్, రమేష్, శ్రీకాంత్.

వారిని కూర్చోపెట్టి అన్నా, వదినలను పరిచయం చేసింది.

“ఇంత మంది డాక్టర్‌ల స్నేహం కలిశాక, ఇక మనకే జబ్బులొచ్చినా చింత లేదు మరి” అని నవ్వాడు స్వాతి అన్నయ్య రఘురాం. ఆ మాటతో అందరూ నవ్వేశారు.

భోజనాల సమయంలో అందరితో గల గలా మాట్లాడుతూ శ్రీకాంత్ పక్కనే నిలబడి కొసరి కొసరి వడ్డించింది స్వాతి. అది చూసిన శ్రీకాంత్ మనసులో మతాబులు వెలుగుతూ వున్నాయి.

“మీరు కూడా కూర్చుంటే బావుంటుంది” అన్నాడు శ్రీకాంత్

“ఇదుగో.. ఒక వరస వడ్డించి కూర్చుంటా” అంది స్వాతి. శ్రీకాంత్ మాటలకు స్వాతి మనసు కాస్త నెమ్మదించింది.

సాయంత్రం వరకూ హాస్పిటల్ విషయాలు, బ్యాంకు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. స్వాతి, శ్రీకాంత్‌ల మధ్యన ఏర్పడుతున్న ప్రత్యేక బంధాన్ని గమనించింది రమ.

“మా శ్రీకాంత్ మాంచి గాయకుడు, మీకు తెలీదు కదా” అన్నాడు రమేష్. అందరి కోరిక మీద రఫీ పాట పాడాడు శ్రీకాంత్.

‘ముఝే తుంసే ముహబ్బత్ హై, మగర్ మైన్ కహె నహీన్ సక్తా’ ( నేను నిన్ను ప్రెమిస్తున్నాను. కానీ బహిరంగంగా వ్యక్త పరచలేను) అనేపాట స్వాతి వైపు ఒక్కసారికూడా చూడకుండా పాడేడు.

పాట అయిపోగానే సంతోషంతో అందరూ చప్పట్లు కొట్టారు. సాయంకాలం కాఫీలు త్రాగి వెళ్లిపోయారందరూ.

హాల్‌లో స్వాతి ఒక్కతే కూర్చుని ఆలోచించ సాగింది. ఒక నిశ్చయానికొచ్చి మొబైల్ తీసుకుని నెంబర్ కలిపి “వెంకటన్న!.. డాక్టర్ శ్రీకాంత్ నెంబర్ చెప్పు.. చెక్ బుక్ గురించి మాట్లాడాలి” అంది.

అటునుండి వెంకట్ చెప్పిన నెంబర్ విని “సరే అన్నయ్య వుంటాను.. వీలైనప్పుడల్లా రండి” అని ఫోన్ పెట్టేసింది.

కాసేపు చేయాలా వద్దా అని ఆలోచించింది మళ్ళీ. ఫోన్ తీసుకుని శ్రీకాంత్ నెంబర్ డయల్ చేసింది. చాలా సేపు ఫోన్ రింగ్ అవుతోంది కానీ జవాబు లేదు.

ఆ రోజు రాత్రి రూమ్‌లో శ్రీకాంత్ పుస్తకం చదువుతున్నాడు.

“అన్నట్లు చెప్పటం మరిచాను స్వాతి నీ నెంబర్ తీసుకుంది.. కాల్ చేసిందా?” అన్నాడు వెంకట్.

“అరె అలాగ.. ఛార్జింగ్ పెట్టి చాలా సేపయ్యింది. చూడలేదు” అంటూ కుర్చీలోనుంచీ ఒక్క ఉదుటున లేచి ఫోన్ దగ్గరకు పరుగులు తీసాడు శ్రీకాంత్.

అది చూసి పకపకా నవ్వసాగారు రమేష్, వెంకట్.

“ఏమీ కొంపలంటుకోలేదు, స్లో” అన్నాడు వెంకట్.

వెంటనే ఫోన్ చూసుకుని కంగారు పడి వెంకట్‌ను చూసి “మరీ విషయం అప్పటునుండీ చెప్పలేదేంటి” అన్నాడు చిరాకుగా శ్రీకాంత్.

“ఇప్పుడేమైంది, నువ్ కాల్ చేసి మాట్లాడు” అన్నాడు రమేష్

“చేస్తున్నాను” అని డయల్ చేయ సాగాడు శ్రీకాంత్.

“హలో” అని అటునుండి వినపడింది స్వాతి స్వరం.

“నేనే శ్రీకాంత్‌ని.. మీ మిస్సెడ్ కాల్ వుంది” అన్నాడు గొంతులో సంతోషాన్ని అదుపు చేసుకుని.

“అవునండి.. రేపు బ్యాంకు అయిపోయే సమయంలో ఒకసారి కలుస్తారా” అంది స్వాతి అటునుండి.

 ఏం చెప్పాలో తెలీక ఉక్కిరి బిక్కిరి అయ్యాడు శ్రీకాంత్.

“సరేనండి” అన్నాడు.

“పోయిన వారం మనం కాఫీ తీసుకున్న హోటల్‌లో కలుద్దాం” అంది.

“సరేనండి” అన్నాడు.

అమ్మయ్య అనుకుని ఫోన్ పెట్టేసింది స్వాతి.

స్వాతి ఫోన్ పెట్టెయ్యగానే, ఎగిరి ‘యాహూ’ అని అరిచి గంతులు వేస్తున్న స్నేహితుడిని చూసి నవ్వసాగారు వెంకట్, రమేష్.

***

మరుసటి రోజు హోటల్ ముందు కార్ ఆపి, లోపలికి వెళ్లి మూలనున్న టేబుల్ దగ్గర కూర్చుని బయట వేపున్న కిటికీలో నుండీ బ్యాంకు వేపు చూడసాగాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. టెన్షన్ పెరిగి పోయింది.

అసహనంగా వాచీ చూసుకున్నాడు. ఇంతలో బ్యాంకు బయటకు వచ్చి, అటూ ఇటూ చూసి రోడ్ దాటింది స్వాతి.

సంతోషంతో శ్రీకాంత్ మనసు ఉరకలేసింది. అలాగే చూడసాగాడు. క్రీం కలర్ కాటన్ చీర కట్టుకుంది. జడ వేసుకోకుండా రబ్బర్ బ్యాండ్ వేసిన వెంట్రుకలు గాలికి ఎగురుతూ వున్నాయి. అలాగే చూస్తూ మైమరచి పోయాడు శ్రీకాంత్.

“హలో డాక్టర్.. ఏమాలోచిస్తున్నారు” అని నవ్వసాగింది స్వాతి.

ఆ మాటతో ఈ లోకం లోకి వచ్చాడు శ్రీకాంత్.

“అబ్బే ఏం లేదు.. కూర్చోండి” అన్నాడు.

“ఈ రోజు ఏ డ్యూటీ చేశారు” అంది రెండు చేతులు కట్టుకుని.

“సర్జరీ” అన్నాడు కాలర్ సర్దుకుంటూ

“మీ అమ్మగారి, నాన్న గారి పేరేంటి?” అంది

“జానకి దేవి, కృష్ణ శర్మ” అన్నాడు.

“ఇంకా ఎన్ని నెలలు వుంది మీ చదువిక్కడ?” కుతూహలంగా అడిగింది.

“మరో అయిదు నెలలు” అన్నాడు.

“మీ చెక్ బుక్ రాకపోతే రేపు బ్యాంకు నుండి ఒకటి ఇప్పిస్తాను” అంది నవ్వుతూ.

“మళ్ళీ ఇక్కడే కలుద్దామా?” అన్నాడు ఉత్సాహంగా.

“మరే, ఆశ దోస” అని నవ్వసాగింది.

ఇంతలో కాఫీ తెచ్చాడు సర్వర్. ఇద్దరూ కాఫీ రుచి చూసి, ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకున్నారు.

“అబ్బే.. మీరు చేసినంత రుచిగా లేదు” అన్నాడు శ్రీకాంత్.

“అలా కావాలంటే మా ఇంటికి రండి రోజూ” అంది చిలిపిగా.

“ఎందుకూ.. మిమ్మల్నే మా ఇంటికి తీసుకెళ్ళిపోతా” అన్నాడు మరింత కొంటెగా.

ఆ మాటలో ఏదో భావం స్ఫురించి ఒక క్షణం శ్రీకాంత్ కళ్ళ లోకి చూసింది. వెంటనే తేరుకుని “దేనికి డాక్టర్.. కాఫీ చేసివ్వటానికే.. బ్యాంకు జీతం ఇస్తారా చెప్పండి. హాయిగా వుద్యోగం మానేసి వచ్చేస్తాను.” అని సమాధానం ఇచ్చింది.

“సరే ఇస్తాను అలాగే, అంతకంటే నాక్కావలసిందేముంది” అంటూ నవ్వేసాడు.

“సరే వెళ్దాము, ఇంట్లో వదిన ఎదురు చూస్తూ ఉంటుంది” ఇబ్బందిగా అంది స్వాతి.

“పదండి మీ ఇంటి వద్ద దింపేస్తాను” అన్నాడు శ్రీకాంత్.

స్వాతి కార్ దిగగానే “రేపు మళ్ళీ కాఫీ సమయం” అని నవ్వి కారు తిప్పుకున్నాడు శ్రీకాంత్. చేయి ఊపి ఇంట్లోకి వెళ్లి పోయింది స్వాతి.

 రాత్రి భోజనం అయింతర్వాత పక్క మీద వాలి మొబైల్‌లో చూస్తే శ్రీకాంత్ మెసేజ్ కనపడింది

“ఈ రోజు కాఫీకి ధన్యవాదాలు, రేపు సాయంకాలం కొరకు ఎదురు చూస్తున్నాను”

తుంసే మిల్నేకొ దిల్ కర్తా హై.. అన్న పాటను యూట్యూబ్ నుంచి షేర్ చేశాడు.

నవ్వి, బోర్లా పడుకుని “తప్పకుండా” అని సమాధానం పెట్టింది స్వాతి.

ఇలా రోజూ కలవటం, మెసేజీలు, కాల్స్‌తో ఇద్దరి మధ్య సమయం గిర్రున మూడు నెలలు తిరిగి పోయింది.

“మా ఇంటికి వచ్చి మా అన్నయ్యను మీ పెద్దలు కలిస్తే బావుంటుంది. మీరు అప్పుడెప్పుడో భోజనాలకి వచ్చారు మళ్ళీ రాలేదు.” అంది స్వాతి తన అరచేతిని శ్రీకాంత్ చేతుల్లోనుండీ విడదీస్తూ.

“సరే మరి.. చేతులెందుకు విడిపించుకోవటం” అన్నాడు శ్రీకాంత్.

“డాక్టర్ శ్రీకాంత్.. ఇది కోవెల.. ఇక్కడ ఇలాంటివి బావుండదు. ఎప్పుడూ చేతులు ఊరుకోవు కదా” అంది చుట్టూ చూస్తూ.

“ఇది భగవంతుడి సామ్రాజ్యం.. ఏమీ కాదు. రేపు మీ వాళ్ళను ముందుగా, నేను కలుస్తాను” అన్నాడు.

ప్రపంచంలోని సంతోషమంతా స్వాతి కళ్ళలో తొణికిస లాడింది.

***

“రేపు స్వాతి ఇంటికి వెళ్లి పెద్దవాళ్ళతో చూచాయగా నా ఉద్దేశం బయట పెడదామని అనుకుంటున్నా” అన్నాడు శ్రీకాంత్.

“శుభస్య శీఘ్రమ్” అని నవ్వాడు వెంకట్.

“మీరు కూడా ఉంటే బావుంటుంది” అన్నాడు శ్రీకాంత్.

“తప్పకుండా వస్తాం. ఇప్పటికైనా నువ్వొక మంచి మార్గాన్ని ఎంచుకున్నందుకు సంతోషం” అన్నాడు రమేష్

విషయం స్వాతికి వెంటనే ఫోన్‌లో చెప్పేసాడు శ్రీకాంత్.

“నేనిప్పుడే అన్నయ్యకు చెప్తాను” అంటూ సంతోషంగా అన్నయ్య పక్కన వెళ్లి నిలబడి, “అన్నయ్యా.. డాక్టర్ శ్రీకాంత్, మిమ్మల్ని రేపు సాయంత్రం మనింట్లో కలుస్తాడట.” అంది స్వాతి మెల్లిగా.

“నన్నా. దేనికి?” అన్నాడు టివి చూస్తూ రఘురామ్

“అబ్బా మీరు మరీను.. ముందా టివి ఆపి ఇటు చూడండి” చిరాకుగా అంది రమ భర్తను చేతితో తట్టి.

“ఓహో.. ఓకే ఓకే, అర్థం అయ్యింది. సరే రమ్మను” అన్నాడు ఏదో ఆలోచిస్తూ.

మరుసటి సాయంకాలం స్వాతి ఇంటి ముందు స్నేహితులు ముగ్గురూ కార్ దిగారు. బయటకు వచ్చి ఆహ్వానం పలికాడు రఘురామ్.

అందరూ హాల్ మధ్యలో వున్నా సోఫాల్లో కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడుకోసాగారు. అలా గంట గడిచి పోయింది. తలుపు పక్కన నిలబడి శ్రీకాంత్ కేసి చూసి అసలు విషయం మాట్లాడమని సైగ చేసింది స్వాతి.

పక్కన కూర్చున్న వెంకట్‌ని చేతితో నొక్కాడు శ్రీకాంత్. అది గమనించి అసలు విషయం మొదలుపెట్టాడు వెంకట్.

“రఘురాం గారు.. శ్రీకాంత్ గురించి మీతో మాట్లాడాలని వచ్చాము.” అన్నాడు.

వెంటనే రఘురాం తేరుకుని “చెప్పండి” అన్నాడు

“శ్రీకాంత్‌కి కొన్ని నెలల్లో మెడిసిన్ అయిపోతుంది. వీళ్ళు విజయవాడ వాస్తవ్యులు. నాన్నగారు అక్కడే   కలెక్టర్. మన చెల్లెలు స్వాతిని, మీ అనుమతితో వివాహం చేసుకోవాలని..” అని చెప్పి ఆగిపోయాడు.

“మంచి విషయం చెప్పారు డాక్టర్ వెంకట్. వారి పెద్ద వాళ్ళతో మాట్లాడితే బావుంటుంది” అన్నాడు రఘురాం.

“సమయం చూసుకుని అలాగే చేద్దామండి” నవ్వులు చిందిస్తూ అన్నాడు శ్రీకాంత్.

లోపల గదిలోకెళ్ళి దేవుడి పటానికి దండం పెట్టుకుంది స్వాతి.

సంధ్యా సమయం. వెనక్కి చేతులు పెట్టుకుని కూర్చున్నాడు శ్రీకాంత్. రెండు మోకాళ్ళకు చేతులు వేసి కూర్చొని వుంది స్వాతి. ఇద్దరూ మాట్లాడుకుంటూ రెండు గంటలు గడిచి పోయాయి.

“మనం కలిసి దాదాపుగా ఆరు నెలలు.. ఈ అందాన్ని చూస్తూ దూరంగా ఉండటం చాలా కష్టం”

“ఎవరుండమన్నారు. మీ ఇంట్లో మాట్లాడి ముహుర్తాలు పెట్టించండి” అంది స్వాతి కిలకిలా నవ్వుతు.

 వెనక్కి వాలి, స్వాతి ఒడిలో పడుకున్నాడు శ్రీకాంత్.

“ముందు మా నాన్న గారిని ఒప్పించాలి. అమ్మతో ఇబ్బంది లేదు” అన్నాడు కళ్ళు మూసుకుని, స్వాతి ఒడి వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ.

“ఏదో ఒకటి త్వరగా చెయ్యి బాబు” అంది శ్రీకాంత్ తల వెంట్రుకల్లో వేళ్ళు జొనిపి.

“హనీమూన్ ఎక్కడికి వెళ్దాము” అన్నాడు. స్వాతి జడ లోని మల్లెల్ల సువాసన లు శ్రీకాంత్‍ను మరోలోకం లోకి తీసుకెళ్లాయి

“మీరే చెప్పండి” అంది.

కొద్దిగా పైకి లేచి స్వాతి గడ్డాన్ని ముద్దు పెట్టుకున్నాడు.

‘‘ఇది అందరూ తిరుగాడే స్థలం . ఇక్కడ అయ్యగారు జాగ్రత్తగా వుండాలి” అంది స్వాతి, శ్రీకాంత్‌ను దూరంగా జరిపి.

పక్కన భుజం మీద తల ఆనించి, ‘మరుగేలరా ఓ రాఘవా’ అని పాడుతూ కూర్చుంది స్వాతి.

ఆకాశం యెర్ర బడింది. అలల ఒరవడి పెరిగింది. మరి కొద్దిసేపట్లో చీకట్లు అలుముకున్నాయి.

స్వాతి జడ లోని మల్లెల వాసన పీలుస్తూ, కురులలో మొహం పెట్టి లోకాన్ని మర్చిపోయాడు శ్రీకాంత్.

అలాగే మెడను ముద్దాడుతుండగా స్వాతి పట్టు తప్పి వెనక్కి వాలింది. మీదకు ఒరిగాడు. కొద్ధి సేపు ప్రపంచం స్తంభించి పోయింది.

స్పృహలోకొచ్చిన స్వాతి తన రెండు చేతులతో శ్రీకాంత్‌ను వెనక్కి నెట్టుతూ “శ్రీకాంత్.. మిమ్మల్నే” అంది.

పక్కకి జరిగి “అబ్బా స్వాతి రెండు నిముషాలు ఎక్కడున్నానో ఏంటో అర్థం కాలేదు. నీ అందం పిచ్చివాడిని చేస్తోంది” అన్నాడు పెదవులను తుడుచుకుంటూ.

“నేనేమీ గొప్ప అందగత్తెను కాదు. మీకు నచ్చాను. అదీ నా అదృష్టం. ఇంతకీ ఇంట్లో వాళ్ళను ఎప్పుడు పంపిస్తారు.”

“ఈ నెల ఆఖరు వారం వెళ్తానుగా, అప్పుడు ఇంట్లో చెప్పి వస్తాను.” అన్నాడు

“ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ ఉండటం శ్రీవారు”

“ఇంకో నెలన్నర అలివేలు” అన్నాడు నవ్వుతూ..

మరుసటి రోజు సాయంత్రం వెంకట్ ఇంటి డాబా మీద చాపలు వేసుకుని కూర్చుని వున్నారు అందరూ. ఒక పక్కగా స్వాతి కూర్చొని వుంది. ఇంకో వేపు రమేష్, వెంకట్ పక్కకు ఒరిగి కూర్చున్నారు.

‘మరుగేలరా ఓ రాఘవా’ పాట పాడుతూ వుంది స్వాతి.

పాట ఆగిపోగానే చప్పట్లు కొట్టారు సీతమ్మ, శాస్త్రి గారు.

“అదృష్టవంతుడు శ్రీకాంత్, అమ్మాయి స్వరం కూడా అద్భుతం” అన్నాడు శాస్త్రి.

“వాడు పుట్టినప్పటి నుండీ అదృష్టమే, కలెక్టర్ కొడుకు, బోలెడు పూర్వీకుల ఆస్తి. ఇప్పుడు ఇది మరొక అదృష్టం.” అన్నాడు వెంకట్ శ్రీకాంత్ భుజం తడుతూ.

అది విని మనసులో భగవంతుడిని తలచుకుంది స్వాతి.

‘ఆప్కే హసీన్ రుఖ్ పె ఆజ్ నయా నూర్ హై, మేర దిల్ మచల్ గయా తో మేరా క్యా కుసూర్ హై’ ( నీ వదనంపై అందమైన వెన్నెల విరుస్తోంది. నా హృదయం చలిస్తే దోషం నాది కాదు)  రఫీ పాట పాడేడు శ్రీకాంత్.

బ్యాంకులో మధ్యాహ్నం లంచ్ తర్వాత మొబైల్ తీసి శ్రీకాంత్ నెంబర్ డయల్ చేసింది స్వాతి.

అటునుండి “అలివేలు మంగ.. చెప్పు” అన్నాడు శ్రీకాంత్.

“ఏమీ లేదు. ఈ రోజు సాయంత్రం ఇంటికి రండి. కాసేపు కూర్చొని వెళ్దురు కానీ” అంది.

“సరే.. వుంటాను కాస్త బిజీగా వున్నా” అన్నాడు శ్రీకాంత్.

సాయంకాలం స్నేహితులు ముగ్గురూ కలిసి స్వాతి ఇంటి ముందు కార్ దిగారు. బయట ఇంటి ముందు చెట్ల కింద కూర్చొని కాఫీ త్రాగుతూ మాట్లాడుకోసాగారు.

“రేపు అన్నయ్యా, వదిన ఊరెళ్తున్నారు. మూడు రోజులయిన తర్వాత వస్తారు” అంది స్వాతి.

“అవును వెంకట్.. మొదటిసారి ఇలా ఒక్క దాన్ని వదిలేసి వెళ్తున్నాం. ఈ వూర్లో మాకు పెద్దగా ఎవరూ పరిచయం లేరు. మీరు కాస్త చూసుకోవాలి” అన్నాడు రఘురాం.

“మరేం పర్లేదండి.. ప్రస్తుతం స్వాతి మా ఇంటి అమ్మాయి కదా” అన్నాడు ఆప్యాయంగా వెంకట్.

“థ్యాంక్యూ వెంకట్” గౌరవంగా చూసాడు రఘురాం.

స్వాతి వేపు చూసాడు శ్రీకాంత్. అతడి మనసులో ఎన్నో ఆలోచనలు, చిలిపి కోరికలు రూపుదిద్దుకుంటున్నాయి.

శ్రీకాంత్ కళ్ళలోకి చూసి అతని భావాలను చదవటానికి ప్రయత్నించింది స్వాతి.

***

మరుసటి రోజు మధ్యాహ్నం పనిలో చాలా నిమగ్నమై వుంది స్వాతి. మొబైల్ మ్రోగసాగింది.

ఫోన్‌లో పేరు చూసి సంతోషంగా అంది “హలో డాక్టర్ శ్రీకాంత్ గారు” చిలిపిగా.

“అలివేలు.. సాయంత్రం కలుద్దామా” అన్నాడు శ్రీకాంత్ అటువేపునుండీ.

“మా ఇంటికి వచ్చేయండి వంట చేస్తాను. వెంకటన్నకి, రమేష్‌కు చెప్పండి” అంది ఉత్సాహంగా

“వాళ్ళకీ రోజు రాత్రి డ్యూటీ.. బహుశా రాలేరేమో? అయినా చెప్తాను. సీ యు” అన్నాడు.

సాయంత్రం డ్యూటీ కాగానే ఇంటి కెళ్ళి గబగబా పనులు మొదలెట్టింది స్వాతి. వంట పనిలో సమయం తెలీలేదు. బయట కాల్లింగ్ బెల్ మ్రోగగానే ఉలిక్కి పడి గడియారం వేపు చూసింది. ‘అబ్బో అప్పుడే ఎనిమిది’ అనుకుంటూ పరుగెత్తు కుంటూ వెళ్లి తలుపులు తీసింది.

“హలో అలివేలు మంగ” అని నవ్వుతూ నిలబడ్డాడు శ్రీకాంత్.

చుట్టూ చూసింది స్వాతి. “ఏరీ వాళ్లిద్దరూ?” కనుబొమ్మలు ముడివేసి ప్రశ్నించింది.

“చెప్పానుగా వాళ్లకు కుదరదన్నారు” అన్నాడు సమ్మోహనంగా నవ్వుతూ.

“అబ్బా చేసిందంతా వేస్ట్ అయ్యింది” అని నిరుత్సాహంగా వెనక్కి తిరిగింది స్వాతి.

చటుక్కున ముందుకు జరిగి వెనక నుండీ వాటేసుకుని స్వాతి వీపు వెనక పెదాలతో స్పృశించాడు శ్రీకాంత్.

ఒళ్ళంతా కరెంట్ షాక్‍లా అనిపించి “అబ్బా కోతి పనులు మానండి బాబు. ముందలా కూర్చోండి. వంటింట్లో కాస్త పని వుంది.. రెండు నిమిషాల్లో వస్తా” అంటూ శ్రీకాంత్ చేతులు విడిపించుకుని లోపలి కి వెళ్ళింది.

కాసేపటికి స్వాతి వంటింట్లోనుంచి బయటకు వచ్చి “రండి భోంచేద్దురు కానీ.” అని చేతులు కట్టుకుని చెప్పింది.

స్వాతిని కళ్లప్పగించి చూసాడు శ్రీకాంత్. లేత గులాబీ రంగు కాటన్ చీర కట్టుకుంది. కళ్ళకు నిండుగా కాటుక,నుదుటన చిన్న బొట్టు, వదులుగా అల్లిన జడ, చెవులకు బంగారు జూకాలతో, పసిమి బంగారు వన్నెతో అప్సరసలా మెరిసి పోతూ వుంది.

“ఏంటలా చూస్తున్నారు స్వామీ” అని నవ్వింది స్వాతి.

“ఏమీ లేదు” అని తల విదిల్చి లేచాడు శ్రీకాంత్.

భోజనాలైన తర్వాత సోఫాలో కూర్చొని టివి చూస్తున్నాడు శ్రీకాంత్.

“వక్క పొడి లేదు. సరేనా” వంటింట్లోనుండీ అడిగింది స్వాతి.

ఇంతలో గాలి వేగంగా వీయసాగింది. వాతాహవరణం చలిగా అయిపోయి వర్షం వచ్చే సూచనలు కనపడ సాగాయి. గాలి ఎక్కువయి ఇంటి ముందు ఆవరణలో వున్న చెట్లు గాలికి ఊగిపోసాగాయి.

“ఏమిటో వున్నట్లుండి ఇలా” అంది స్వాతి బయటకు చూసి.

“వర్షం వచ్చేట్లుగా వుంది స్వాతి” అన్నాడు శ్రీకాంత్.

అంతలో లైట్స్ పోయి చిమ్మని చీకటి అలుముకుంది.

“కరెంట్ పోయింది.. స్వాతి, ఇన్వెర్టర్ లేదా?” అన్నాడు.

“లేదు.. అలాగే కూర్చోండి, వస్తున్నా” అని చెప్పి లోనుంచీ వెలుగుతున్న కాండిల్ పట్టుకుని వచ్చింది.

“గాలికి ఆగేట్లు లేదు, కాస్త తలుపులు,కిటికీ రెక్కలు వేసేయండి” అంది స్వాతి, కాండిల్ దీపాన్ని అరచేతితో మూసి.

లేచి వెళ్లి అన్ని కిటికీ రెక్కలు, తలుపులు వేసేశాడు శ్రీకాంత్.

వచ్చి స్వాతి పక్కన సోఫాలో కూర్చొని, “వాతావరణం మనకు కావలసినట్లుగా వుంది కదా” అన్నాడు స్వాతి చేతిని తన చేతిలో తీసుకుని. ఇద్దరి మధ్య మాటలు కరువైపోయాయి. ఒక చేయి స్వాతి వెనక వేపు వేసి దగ్గరికి లాక్కున్నాడు శ్రీకాంత్. బయట ఆకాశంలో ఉరుములు, మెరుపులు.

“ఆగండి శ్రీకాంత్” అంది నీరసంగా స్వాతి.

సమాధానంగా శ్రీకాంత్ కౌగిలి మరింతగా బిగుసుకుంది. గాలి రివ్వున వీచింది. కాండిల్ జ్వాల ఆరిపోయింది.

గది నిండా ఉచ్ఛ్వాసనిశ్వాసాలు.

“వద్దు శ్రీకాంత్.. వద్దు ప్లీజ్” అంది స్వాతి. ఆమె గొంతులో శక్తి లేదు.

“భయం ఎందుకు నీవు నా మనిషివి ఎప్పటికీ, నా స్వంతం” గుసగుసగా అన్నాడు.

“ఇంకా కొద్దీ రోజుల్లోనే పెళ్లి కదా.. ఆగండి శ్రీకాంత్” అంది. నిస్సత్తువ ఆవహించింది స్వాతిలో. ఏదో తెలియని మత్తులో మునిగి పోయింది స్వాతి.

పూర్తిగా ఆక్రమించుకున్నాడు శ్రీకాంత్.

***

“రాత్రి ఎటెళ్ళావు? ఆలస్యమైనట్టుంది” అనుమానంగా అడిగాడు వెంకట్.

“చిన్నప్పటి స్నేహితుడు కలిసాడు.. బార్‌కు వెళ్లాం” అన్నాడు శ్రీకాంత్, వెంకట్ చూపులను తప్పించుకుంటూ

“నువ్వసలు డ్రింక్స్ తీసుకోవుగా?” మళ్ళీ గుచ్చి గుచ్చి చూసాడు వెంకట్.

“నేను తీసుకోలేదు.. కంపెనీ ఇచ్చాను” అని చెప్పి బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు శ్రీకాంత్.

“సాయంకాలం స్వాతి ఇంటికోసారి వెళ్ళొద్దామా?” అడిగాడు వెంకట్.

“ఇవ్వాళ వద్దులే వెంకట్” అన్నాడు శ్రీకాంత్ నొసలు చేతి వేళ్ళతో నొక్కుకుని.

ఏమీ మాట్లాడకుండా శ్రీకాంత్ వేపు చూసి బయటకు అడుగులు వేసాడు వెంకట్.

ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో స్వాతి ఇంటి కాలింగ్ బెల్ మ్రోగింది.

లేచి వెళ్లి నీరసంగా తలుపులు తెరిచింది స్వాతి.

“హలో స్వాతి” నవ్వుతూ లోపలి వచ్చాడు శ్రీకాంత్.

నీరసంగా నవ్వి సోఫాలో పడుకుంది స్వాతి. మొహమంతా లంఖణాలు చేసినట్లుగా వుంది.

“ఏంటలా వున్నావు. బ్యాంకుకు రాలేదని చెప్పారు. పైగా నీ ఫోన్ ఆఫ్ అయ్యింది.” అన్నాడు పక్కన కూర్చొని.

శ్రీకాంత్ ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంది స్వాతి. కళ్లలోనుండి నీళ్లు కారుతున్నాయి.

“చ చ ఏంటిది స్వాతి. ఎందుకలా. నీకేం కావాలి? ఊరుకో” అని కళ్ళు తుడిచాడు.

స్వాతి ఏం మాటలాడలేదు

“వంట ఏం చేసావు?”

“బ్రెడ్ తిన్నాను.. వంట చేసే ఓపిక లేదు.”

“సరే నువ్వలాగే పడుకో.. నే బయటకు వెళ్లి కాస్త టిఫిన్ ఏదైనా తెస్తాను” అని లేచి బయటకు వెళ్ళాడు శ్రీకాంత్.

వద్దు వద్దు అంటున్న స్వాతి మాటలు అతను పట్టించుకోలేదు.

కొద్దిసేపటికి అతను తెచ్చిన టిఫిన్ ఇద్దరూ కలిసి తిన్నారు.

“సరే పది దాటింది. నే వెళ్లి రానా” అన్నాడు మెల్లిగా.

“నీ ఇష్టం శ్రీకాంత్, మీ ఇంటి వాళ్ళను తొందరగా తీసుకుని రా” అంది.

“పద పడుకుందువు కానీ” అని పట్టుకుని బెడ్ రూమ్ లోకి నడిపించాడు శ్రీకాంత్.

పడక మీద ఒరిగిన కాసేపటికే గాఢ నిద్ర లోకి వెళ్లిపోయింది స్వాతి.

అర్ధరాత్రి స్వాతికి నిద్రలో, ఏం జరుగుతుందో అర్థం కాని మత్తులో, “వద్దు శ్రీకాంత్ ప్లీజ్” అంటున్నా మళ్ళీ మళ్ళీ ఆక్రమించుకున్నాడు శ్రీకాంత్.

***

ఉదయం మత్తుగా లేచి గోడ గడియారం చూసింది స్వాతి. సమయం తొమ్మిది కావస్తోంది. శ్రీకాంత్ ఎక్కడా కనిపించలేదు.

నీరసంగా లేచి సమయానికి బ్యాంకుకి వెళ్లి మెట్లు ఎక్కింది స్వాతి.

కొద్దిసేపటికి స్వాతి టేబుల్ సొరుగులో మొబైల్ మ్రోగసాగింది. తీసి చూసి “హలో శ్రీకాంత్” అంది.

“సాయంత్రం, వెంకట్, రమేష్‌తో కలిసి వస్తాను. మన విషయాలు బయటకు రాకుండా జాగ్రత్త” అన్నాడు.

“సరే శ్రీకాంత్.. ఎన్ని గంటలకు వస్తావు. నాకు నిన్ను చూడాలని వుంది. ఇంక నీవు లేకుండా నే వుండలేను” అంది గొంతులో దుఃఖాన్ని ఆపుకుని.

“నే వస్తానుగా.. టెన్షన్ పడకు. మా ఇంటర్న్‌షిప్.. అదే హౌస్ సర్జెన్సీ అయిపోతోంది. నే వెళ్ళాలి కదా” అన్నాడు.

“అలాగే శ్రీకాంత్ లంచ్ సమయంలో ఒక సారి కలసి వెళ్ళొచ్చుగా” అంది బేలగా.

“తప్పకుండా వస్తాను.” అని ఫోన్ పెట్టేసాడు శ్రీకాంత్.

మొబైల్ ఫోన్‌ను అలాగే చూసింది కాసేపు స్వాతి. నిట్టూర్చి మొబైల్ మూసేసి తిరిగి డ్రా లో పెట్టేసి, ఆలోచనలో పడింది.

అటువైపు స్వాతి పెట్టేయగానే తన ఫోన్ జేబులో ఫోన్ పెట్టేసి, కుర్చీలో వెనక్కి జేరగిలా పడ్డాడు శ్రీకాంత్. అతని మనసంతా ఆలోచనలతో నిండి పోయింది. ఇంతలో మెసేజ్ వచ్చినట్లుగా మొబైల్‌లో బెల్ మ్రోగింది. నిరాసక్తతతో దాని వేపు చూసాడు.

‘నాన్న నుండీ మెసేజ్, ఏంటో’ అనుకుంటూ చూసాడు.

‘గుడ్ ప్రపోసల్. చూడు’ అని వుంది. దాని కింద అయిదు ఫోటోలు వున్నాయి. పరికించి చూసాడు.

ప్రణీత.. మెడిసిన్ మూడవ సంవత్సరం. రాజా బహద్దూర్ ఏకైక సంతానం. రాజా ఎయిర్ లైన్స్. రాజా స్టీల్స్ అండ్ ఐరన్ ఫ్యాక్టరీ. రాజా మైన్స్. అమ్మాయి ఫోటోలు చూసాడు. కళ్ళు చెదిరి పోయే అందం అనుకున్నాడు. మనసంతా హుషారుగా అయిపోయింది. లేచి ఈల వేసుకుంటూ డ్రెస్ చేసుకోసాగాడు.

“ఏంటి చాలా హుషారుగా వున్నావ్. స్వాతి పిలిచిందిగా సాయంకాలం రమ్మని” అన్నాడు రమేష్ నవ్వుతూ.

“అవును” అన్నాడు శ్రీకాంత్. అతడి కంఠంలో నిరాశ గమనించాడు వెంకట్.

బ్యాంకులో పని చేస్తున్నంత సేపు స్వాతి మనసంతా దిగులుతో నిండి పోయింది. కళ్ళ ముందు శ్రీకాంత్ నవ్వు కదలాడ సాగింది. శ్రీకాంత్ వస్తాడని రోజంతా ఎదురు చూసింది. కానీ అతను రాలేదు. పని పూర్తి చేసుకుని ఇంటి దారి పట్టింది స్వాతి.

రాత్రి ఏడు గంటలకు స్వాతి ఇంటిలోకి అడుగు పెట్టాడు శ్రీకాంత్.

“రండి రండి” అంటూ నమస్కరించాడు రఘురాం.

ప్రతి నమస్కారం చేసారందరూ.

“ఎలా వున్నాయి వెంకట్ గారు మీ హాస్పిటల్ పనులు” అన్నాడు రఘురాం సంభాషణ మొదలెడుతూ.

“ఇంకో రెండు వారాలు.. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ కాన్వొకేషన్ నాడు కాలేజీకి వెళ్ళటమే.” అన్నాడు వెంకట్.

“మరి తర్వాత ఏం చేద్దామనుకుంటున్నారు” అన్నాడు రఘురాం, శ్రీకాంత్ వేపు చూసి.

“చూడాలండి.. పీజీ ఎంట్రన్స్ వ్రాయాలి.” అన్నాడు ముక్తసరిగా.

ఏం మాట్లాడాలో తెలీక మౌనంగా వుండిపోయాడు రఘురాం. శ్రీకాంత్‌లో వచ్చిన తేడా గమనించి వెంకట్‌లో అనుమానం మొదలయ్యింది.

అందరికీ కాఫీలు తీసుకుని వచ్చి వదిన పక్కన కూర్చుంది స్వాతి. అందరూ మాట్లాడుకుంటూ గంట గడిపేశారు. స్వాతి, శ్రీకాంత్‌లు తక్కువగా మాట్లాడటానికి కారణం అర్థం కాలేదు వెంకట్, రమేష్ లకు.

“వస్తామండి.. త్వరలో కలుద్దాం మళ్ళీ” అని లేచి నించున్నాడు వెంకట్. అందరూ బయటకు నడిచారు.

ఉదయాన్నే మొబైల్ తీసుకుని శ్రీకాంత్‌కు ఫోన్ చేసింది స్వాతి.

పక్క మీద నుండీ లేచి “హలో” అన్నాడు శ్రీకాంత్.

“శ్రీకాంత్ ఈ రోజు గుడికి వెళ్దామా “అడిగింది ఆతృతగా.

“ఊఁ.. సరే” అన్నాడు.

“ఇప్పుడే లేచారా?”

“ఊఁ” అన్నాడు

“నిన్న సరిగా మాట్లాడ లేదే?” అడిగింది స్వాతి. ఆమె గొంతులో బాధ కనిపెట్టాడు శ్రీకాంత్. సమాధానం చెప్పలేదు శ్రీకాంత్.

“సాయంత్రం ఆరు గంటలకు గుడిదగ్గర వుంటాను.” అంది.

“సరే”

ఇంకా ఏదో చెప్ప బోయింది. కానీ అటువైపు లైన్ కట్ అయ్యిందని అర్థం అయ్యింది స్వాతికి. అనుకున్నట్లుగానే శ్రీకాంత్ వచ్చాడు కానీ ఏమీ మాట్లాడుకోలేదు ఇద్దరూ. చాలాసేపు శ్రీకాంత్ చెయ్యి పట్టుకుని భుజం మీద తల వాల్చి కూర్చుంది స్వాతి.

పదిహేను రోజుల తర్వాత స్వాతి ఇంటి ముందు కార్ ఆపాడు. ఆ రోజు ఆదివారం. హాల్‌లో కూర్చొని టీవీ చూస్తూ వుంది. కార్ చప్పుడు విని బయటకు పరుగెత్తింది స్వాతి. కార్ దిగుతూ స్వాతి కేసి చూసి నవ్వాడు శ్రీకాంత్.

“రండి” అని లోనికి వెళ్ళింది స్వాతి.

హాల్ లోకి అడుగు పెట్టాడు శ్రీకాంత్.

“నమస్కారం” అన్నాడు శ్రీకాంత్, రఘురాంను చూసి.

“రండి.. శ్రీకాంత్ గారు కూర్చోండి” అని సోఫా చూపించాడు రఘురాం.

సోఫాలో కూర్చొని చిరునవ్వుతో అన్నాడు శ్రీకాంత్ “విజయవాడ వెళ్లిపోతున్నానండి.. ఇక్కడ మా పని అయిపోయింది” అన్నాడు.

“సంతోషం.. మరి..” అంటూ ఏం చెప్పాలో తెలీక ఆగిపోయాడు రఘురాం.

“నే వెళ్లి కబురు చేస్తాను.. మీ అందరికీ ఒక సారి చెప్పి వెళదామని వచ్చాను.” అని లేచాడు.

“కూర్చోండి కాఫీ తెస్తాను” అని చెప్పి వంటింట్లోకి కి వెళ్ళింది స్వాతి.

కాఫీ తాగి, స్వాతి వేపు చూసి నవ్వి బయలుదేరాడు శ్రీకాంత్. బయట నిలబడి వెళ్తున్న శ్రీకాంత్‌ని చూస్తూ చేయి ఊపుతూ నిలబడింది స్వాతి.

శ్రీకాంత్ కార్ చాలా దూరం వెళ్ళిపోయింది. ఎంతో సేపు బయటే నిలబడింది స్వాతి.

***

“నాన్నగారు మీతో ఒక విషయం మాట్లాడాలి” అన్నాడు శ్రీకాంత్.

“నేను కూడా మాట్లాడాలి. ముందుగా ఆ అమ్మాయితో పెళ్లి చూపులు పెట్టించాను.. జస్ట్ ఫార్మాలిటీ అనుకో. ఫలక్‌నామా పాలస్‌లో రేపు చిన్న పార్టీ వుంది. అక్కడ మనం వెళ్లి వారితో కలిసి వద్దాం. అమ్మాయి, నువ్వూ అక్కడ ఒకరినొకరు చూసుకోవచ్చు. అమ్మాయికి చదువు, ఆస్తి అద్భుతంగా వుంది. అమ్మాయి ఫోటో చూసావుగా. చక్కగా వుంది. పైగా ఏదో పెళ్లిలో నిన్ను అమ్మాయి చూసిందట కూడా.” అని చెప్పి టేబుల్ మీదున్న పేపర్స్ అన్నీ సర్దుకో సాగాడు రామకృష్ణ శర్మ.

మౌనంగా నిలబడ్డాడు శ్రీకాంత్.

“ఏంటి శ్రీ మాట్లాడవేంటి. అది సరే నువ్వేదో చెప్పాలన్నావ్.” అని ప్రేమగా కొడుకు వేపు చూసాడు రామకృష్ణ శర్మ.

“ఏమీ లేదు నాన్నా. అదే పీజీ స్టడీ గురించి. రేపు.. ఫలక్‌నామా పాలస్ ఎన్ని గంటలకు వెళ్ళటం” అన్నాడు.

“రేపు మధ్యాన్నం” అని కొడుకుని కళ్లద్దాల పై నుండీ చూసాడు రామకృష్ణ శర్మ.

“సరే నాన్న నీ ఇష్టం” అని నవ్వాడు శ్రీకాంత్

***

“ఆఖరి వారంలో వస్తాను. అప్పుడు మాట్లాడదాం స్వాతి” అన్నాడు శ్రీకాంత్ చేతిలో మొబైల్ గట్టిగా నొక్కుతూ.

“ఇంట్లో ఒప్పుకున్నారా?” ఆదుర్ధాగా అడిగింది స్వాతి.

“నే వచ్చినప్పుడు నీకన్నీ చెప్తాను.. ఊరికే టెన్షన్ పడకు స్వాతి” నింపాదిగా అన్నాడు శ్రీకాంత్

“శ్రీకాంత్ నువ్వెళ్ళి అప్పుడే నెల. నే ప్రతి రోజూ ఎదురు చూస్తున్నాను.” అంది స్వాతి.

“ఇంకెంత పది రోజులు ఓపిక పట్టు” అని ఫోన్ కట్ చేసి ఊపిరి పీల్చుకున్నాడు శ్రీకాంత్.

***

“రేపు వస్తే బావుంటుంది. అన్నయ్య వదిన ఊరెళ్ళారు” అంది స్వాతి.

“అలాగే.. ఉదయం వస్తాను” అని ఫోన్ పెట్టేసాడు శ్రీకాంత్.

ఆ రోజు స్వాతి బ్యాంకుకు వెళ్లకుండా ఇంట్లోనే వుండి పోయింది. పదకొండు గంటల సమయంలో కారు ఇంటి ముందు ఆగిన శబ్దం వచ్చింది. బయటకుచూసింది. శ్రీకాంత్ ఒక్కడే వస్తూ కనిపించాడు.

రాగానే “స్వాతి” అంటూ దగ్గరగా వచ్చి చేతులు పట్టుకున్నాడు.

స్వాతి మనసంతా వెన్నెల పరుచుకుంది. మనస్ఫూర్తిగా శ్రీకాంత్‌ను హత్తుకుంది.

“స్వాతి ఎలా వున్నావు” యాంత్రికంగా అన్నాడు శ్రీకాంత్.

“ఇంట్లో ఏమన్నారు శ్రీకాంత్. నాకు భయంగా వుంది. త్వరగా మనం పెళ్లి చేసుకుంటే బావుంటుంది” అంది.

స్వాతి మొహంలో ఆదుర్ధా చూసి “ఎందుకంత టెన్షన్. మా ఇంట్లో ఒప్పుకునే పరిస్థితి లేదు.” అన్నాడు చల్లగా.

“మరెలా శ్రీకాంత్.. త్వరగా వివాహం జరిగితే బావుంటుంది” అంది.

“అదే ట్రై చేస్తాను. కానీ నాకు నమ్మకం లేదు. ఇంట్లో వాళ్ళు కాదంటే నేను చేసుకోవటం కష్టం” అన్నాడు శ్రీకాంత్.

“నాకు పీరియడ్స్ మిస్ అయ్యాయి.. నెల తప్పాను” అంది కంగారుగా, భయంగా, నిస్సహాయంగా.

 శ్రీకాంత్ మొహంలో కళ తప్పింది. “జాగ్రత్తలు తీసుకోలేదా. చదువుకున్నదానివి ఆ మాత్రం తెలీదా” అన్నాడు విసుగ్గా

స్వాతి కళ్లలోనుండీ ధారగా నీళ్లు కారిపోతున్నాయి.

“సరే.. సరే.. టెన్షన్ పడకు. నాకు తెలిసిన గైనకాలజిస్ట్ వుంది. అబార్షన్ చేయించుకో. రెండో నెలే కదా” అన్నాడు మొహం చిట్లించి.

“అలా ఎందుకు శ్రీకాంత్.. మనం వివాహం చేసుకుంటాం కదా. పైగా అబార్షన్ చేయటం అన్యాయం, పాపం కూడా” అంది.

“లేదు లేదు స్వాతి.. అదంతా ఈజీ కాదు. మన పెళ్లి కుదిరేలా లేదు. నాకు నమ్మకం లేదు” అన్నాడు.

“మరయితే ఎలా శ్రీకాంత్?” స్వాతి కళ్ళలో మొదటిసారిగా భయం కనపడుతూ వుంది.

“చెప్పానుగా. అయినా అంత భయం వున్నప్పుడు అంత ఈజీగా ఎందుకు..” అంటూ ఆగిపోయాడు.

దెబ్బ తిన్నట్టు అతని వైపు చూసింది. అతను అనకుండా ఆగిన  మాటలు ఆమె హృదయంలో తుఫానులు రేపుతున్నాయి.   రెండు చేతులతో మొహం కప్పుకుని ఏడవసాగింది.

“ఇదుగో స్వాతి అనవసరంగా బాధపడకు. తప్పు చేసాం సరే. సరిదిద్దుకోవాలి. అంతే కానీ ఏడ్చి పెడబొబ్బలు అనవసరం” చిరాకుగా అన్నాడు.

“ప్లీజ్ శ్రీకాంత్.. ఎలాగైనా మనం పెళ్లి చేసుకునే మార్గం చూడు” అంది కళ్ళు తుడుచుకుంటూ.

“మా ఇంట్లో వాళ్లకు ఈ విషయం తెలిస్తే అసలు ఒప్పుకోరు. మాది మంచి సంప్రదాయమైన కుటుంబం. మా ఇంట్లో అందరూ ఉన్నతమైన స్థానాల్లో వున్నారు.” అన్నాడు కరకుగా.

 నిస్త్రాణగా అయిపోయింది ఆమె.

“జరిగిన దానికి నన్ను అపరాధిని చేయకు. అంత తేలికగా ఎవరు లొంగిపొమ్మన్నారు?  మా ఇంటికి రావాల్సిన కోడలికి ఎంతో సంస్కారం ఉండాలి, క్యారెక్టర్ ముఖ్యం. ఈ విషయంలో నేనేమీ చేయలేను. బి ప్రాక్టికల్. అబార్షన్ చేయించుకో. అన్నీ మరచిపోయి కొత్త జీవితం చూసుకో” అని చెప్పి స్వాతిని ఇంకే విధంగా ఒప్పించాలి అని ఆలోచించసాగాడు. ఏం చేయాలో పాలు పోలేదు స్వాతికి.

పీడకల దారుణమైన నిజమయినట్టుందామెకి. చిన్నప్పటినుంచీ అందరూ చెప్పిన జాగ్రత్తలను ఒక బలహీనమైన క్షణంలో మరచిపోయింది. లేడి మరోసారి పులికి బలయింది!!!!!

“వెళ్ళొస్తాను స్వాతి. ఏదైనా డబ్బులు కావాలంటే అకౌంట్ వివరాలు మెసేజ్ చేయి పంపిస్తాను. విజయవాడ బందర్ రోడ్‌లో మంచి గైనకాలజిస్ట్ వుంది. ఎక్కవ ఇబ్బంది లేకుండా తీసేస్తుంది. జాగ్రత్త” అని లేచాడు.

చటుక్కున లేచి   “శ్రీకాంత్ ప్లీజ్.. నువ్ లేకుండా నేనుండలేను..” అంది అతడిని గట్టిగా పట్టుకుని. కానీ, గతంలో తన స్పర్శకు అతని స్పందనకూ ఇప్పటి స్పందనకూ తేడా తెలుస్తోంది ఆమెకు.

“ఇదుగో ఇలా చేసి నన్ను విలన్‌లా చేయకు’’ అని  స్వాతిని వదిలించుకుని బయట కార్ వేపు వేగంగా నడిచాడు.

పక్కకు పడిపోయింది స్వాతి.  “శ్రీకాంత్ ప్లీజ్.. శ్రీకాంత్, నే బ్రతకలేను, నువ్ లేకుండా నే బ్రతకలేను”  మ్స్వన్తసు మౌనంగా రోదిస్తోంది.   ఆమెని పట్టించుకోకుండా  పట్టించుకోకుండా కార్ ముందుకి వేగంగా ఉరికించాడు.

ఊరు దాటి, కార్ వేగంగా నడపసాగాడు శ్రీకాంత్. పక్కన మొబైల్ మ్రోగింది. స్వాతి అయ్యి ఉంటుంది అనుకుని ఫోన్ వేపు చూసాడు.

కానీ అది ప్రణీత కాల్. వెంటనే ఫోన్ అందుకుని “ఎస్ ప్రణీత డార్లింగ్” అన్నాడు. అతని దృష్టి రోడ్డు మీదనుంచి మళ్ళింది.

“ఎక్కడ కలుస్తారు స్వీట్ కాంత్” అంది ప్రణీత.

అంతలోనే పెద్ద ట్రక్ రోడ్ డివైడర్ మీదెక్కి అదుపు తప్పి రోడ్‌కు ఇటువైపు తోసుకు వచ్చి, అతి వేగంగా ఎదురుగా వస్తున్నశ్రీకాంత్ కార్ ముందు భాగాన్ని కొట్టింది. ఆ తాకిడికి శ్రీకాంత్ కార్ మూడు పల్టీలు కొట్టి రోడ్ పక్కన వున్న పెద్ద గొయ్యిలో పడిపోయింది. పగిలిన అద్దాలలోనుండీ మొబైల్ ఫోన్ బయటకు పడిపోయింది.

ఆ ఫోన్ రాత్రంతా చాలా సార్లు అది మ్రోగుతూనే వుంది.

***

అదొక పెద్ద కార్పొరేట్ ఆసుపత్రి. ప్రత్యేకమైన గదిలో మంచం మీద వంటి మీద గాయాలకు బ్యాండేజీలతో పడుకుని వున్నాడు శ్రీకాంత్.

దాదాపుగా నెల నుండీ స్పృహలో లేని శ్రీకాంత్ మెల్లిగా కళ్ళు తెరిచాడు.

బాధతో మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ కళ్ళు తెరిచి చుట్టూ చూసాడు. కొద్దిసేపటికి తాను ఆసుపత్రిలో వున్నాడని అర్థం అయ్యింది. పక్కకు చూసాడు. చిన్న బెడ్ లైట్ వెలుగులో తల్లి నిద్ర పోతూ కనిపించింది.

“అమ్మా..” అని పిలిచాడు. రెండవ పిలుపుకి లేచింది జానకి. దగ్గరగా వచ్చి కొడుకుని పట్టుకుని మెల్లిగా అంది “డాక్టర్‌ను పిలుస్తాను. అలాగే పడుకో” అని చెప్పి పక్కనే వున్న బజర్ నొక్కింది.

మరి కొద్దీ క్షణాల్లో డాక్టర్, నర్సులు చుట్టూ చేరారు.

ఉదయానికి శ్రీకాంత్ తల్లి తండ్రి, ప్రణీత,ఆవిడ తల్లి తండ్రి వచ్చేసారు.

డాక్టర్, గది లోకి ప్రవేశించి “ గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. హౌ అర్ యు?” అని నవ్వి రిపోర్ట్స్ అన్నీ చూసాడు.

చుట్టూ నిలబడి వున్న అందరిని చూసి బయటకు రమ్మన్నట్లుగా సైగ చేసి గదిలోనుండీ వెళ్లి పోయాడు.

రెండు చేతులూ పక్కకు పెట్టి, వెనక్కి జరుగుదామని ప్రయత్నించాడు శ్రీకాంత్. శరీరమంతా బరువుగా తోచి కదల లేక పోయాడు. కాళ్లను పక్కకు జరిపాడు, అవి కదలటం లేదు.

డాక్టర్ తన గదిలో ఎదురుగా కూర్చున్న జానకి, రామకృష్ణ, రాజా బహద్దూర్, ప్రణీతల వేపు చూసి, “ప్రాణాలకు ప్రమాదం తప్పింది. మీ అబ్బాయి అదృష్టవంతుడు. అంత పెద్ద ప్రమాదంలో నుండీ తప్పించుకున్నాడు. చిన్న ప్రాబ్లెమ్.. నడుం కింద వెన్నుపూస దెబ్బ తినింది. నడుము కింద భాగం పూర్తిగా పని చేయటం లేదు,. నడవటానికి రాదు. సంసారానికీ పనికిరాడు.” అని చెప్పటం ఆపాడు.

రాజా బహద్దూర్, ప్రణీతలు మొహాలు చూసుకుని లేచి బయటకు నడిచారు.

“నాన్నగారు! ఒకసారి శ్రీకాంత్‌ని కలిసి వెళ్తే బావుంటుందేమో” అనుమానం వెలిపుచ్చింది ప్రణీత.

“ఇక ఆ అవసరం లేదనుకుంటా.” అంటూ గేట్ వేపు అడుగులు వేసాడు రాజా బహదూర్. తండ్రి వెనకాలే వెళ్ళిపోయింది ప్రణీత.

***

కొద్ది రోజుల తర్వాత శ్రీకాంత్‌ను కలవటానికి ఇంటికి వెళ్లారు వెంకట్, రమేష్‌లు.

అదొక విశాల మైన హాల్. కింద చల్లని రాజస్థాన్ మార్బుల్‌తో నేల మెరిసి పోతూ వుంది. పైన పెద్ద దీపపు చెమ్మ వేలాడుతూ వుంది. వీల్ చైర్‌లో కూర్చొని వున్నాడు శ్రీకాంత్. ఎదురుగా పెద్ద లెదర్ సోఫాలో ఒరిగారు వెంకట్, రమేష్‌లు.

“అసలు లేవటానికి కూడా వీలు కావటం లేదా” బాధగా అడిగాడు రమేష్.

“రెండు కాళ్ళు పని చేయటం లేదు. జీవితంలో అనుభవించాల్సిన సౌఖ్యాలన్నీ అనుభవించేశాననుకున్నట్టున్నాడు దేవుడు.  ఇక ఎప్పటికీ అంతే అన్నారు”  అన్నాడు శ్రీకాంత్ చిన్న చిరునవ్వుతో..అతని కళ్ళల్లో విషాదం గూడు కట్టుకుని వుంది.

“అసలెందుకిలా జరిగింది.. కార్ బ్రేకులు పని చేయలేదా” అన్నాడు వెంకట్ దుఃఖంతో.

“ప్రణీత మోజులో దారిని  చూడలేదు. స్వాతికి చేసిన అన్యాయానికి బహుశా దేవుడు విధించిన శిక్ష అయివుంటుంది” అని నిరాశతో కూడిన చిరునవ్వుతో అన్నాడు.

ఎవరూ సమాధానం చెప్పలేదు. తలలు కిందకు వేసుకుని కూర్చున్నారు.

“ఇంతకీ స్వాతి ఎలా వుంది. వస్తుందేమో అని ఎదురు చూసాను” ఆతృతగా అన్నాడు శ్రీకాంత్.

“స్వాతి ఎందువల్లో మాతో ముభావంగా వుంది. నీకు ప్రమాదం జరిగిన తర్వాత ఫోన్ చేసాను. సమాధానం లేదు. గత వారం బ్యాంకుకు వెళ్లి నీ విషయం చెప్పాను. ఏమీ మాట్లాడలేదు. అసలేం జరిగింది. వివాహం చేసుకుంటానని అన్నవాడివి మళ్ళీ పాత బాట పట్టావు” అన్నాడు వెంకట్

కాసేపు మౌనంగా కళ్ళు మూసుకున్నాడు శ్రీకాంత్.

“ఒకసారి స్వాతిని కలవాలి” అన్నాడు శ్రీకాంత్.

“సరే నువ్వొస్తే బ్యాంకుకి వెళదాం” అన్నాడు వెంకట్.

మరుసటి వారం బ్యాంకు స్పెషల్ కస్టమర్స్ కేబిన్‌లో కూర్చున్నారు వెంకట్, శ్రీకాంత్.

ఇంతలో బంట్రోతు వచ్చి “స్వాతి గారు పదిహేను నిముషాల్లో వస్తానన్నారు” అని చెప్పి వెళ్ళాడు.

అన్నట్లుగానే స్వాతి లోనికి వచ్చి వెంకట్‍కు నమస్కారం చేసింది.

“బావున్నావా స్వాతి” అన్నాడు వెంకట్.

చిన్నగా నవ్వి “చెప్పండి అన్నయ్య, ఏదైనా పనా” అంది. శ్రీకాంత్ వేపు అసలు చూపు కూడా తిప్పలేదు స్వాతి.

“మీరిద్దరూ మాట్లాడుతూ వుండండి ‘‘అని లేచి బయటకు వెళ్ళాడు వెంకట్.

స్వాతి, శ్రీకాంత్ మౌనంగా ఒక క్షణం కూర్చున్నారు.

“నాతో పొరపాటు జరిగి పోయింది స్వాతి. దాన్నిసరిదిద్దుకుందామనుకుంటున్నాను. నువ్వెప్పటికీ నా దానివే” అన్నాడు స్వాతి వేపు ప్రేమగా చూస్తూ.

అది విని పకాలున నవ్వింది స్వాతి. విస్తుపోయాడు శ్రీకాంత్. చాలా సేపు నవ్వుతూనే వుంది. బలవంతాన నవ్వు ఆపుకుని –

“డాక్టర్ శ్రీకాంత్ నేను నిజంగా గర్భవతిని కాదు. చదువుకున్న దాన్ని. లోకం తీరు తెలిసినదాన్ని. ఇంట్లో నేను ఒంటరిగా వున్నానని తెలియగానే నువ్వు వస్తానన్నప్పుడు నీ అంతరంగం గ్రహించలేనంత అమాయకురాలిని కాదు. ఒకరినొకరు ఇష్టపడిన యువతీ యువకులు ఒంతరిగా కలిస్తే ఏం జరిగే వీలుందో తెలియనిదాన్ని కాదు.  నా జాగ్రత్తలలో నేనున్నాను.  నీ అసలు రూపం తెలుసుకునేందుకు ఆబద్ధం చెప్పాను. నీ బుద్ధికి తగ్గ శిక్ష  దేవుడే ఇచ్చాడు.  అమ్మాయిలను పెళ్లి పేరుతో లొంగదీసుకుని అనుభవించి తప్పించుకునే  నీకు ఆ దేవుడే శిక్ష వేసాడు. ఇప్పుడు నీవు నన్ను పెళ్లి చేసుకుని ఉద్ధరిద్దామనుకున్నట్టు నటిస్తున్నావు. ఎందుకూ పనికిరాని నీ వైపు ఎవ్వరూ చూడరు కాబట్టి, నీకు ఒక ఆసరా కావాలి కాబట్టి నన్ను ఉధ్ధరిస్తున్నట్టు పోసు పెడుతున్నావు. నీ జీవితం వీల్ చైర్ కే అంకితం. నేను స్వేచ్చా విహంగాన్ని. నన్ను నీ వీల్ చైర్ కి కట్టేసి జీవితాంతం నీకు బందీని చేసుకోవాలనుకుంటున్నావు.  నాకు నీ మీద ఇసుమంత ఆసక్తి లేదు.. నీ కోట్ల ఆస్తి, ఐశ్వర్యం, డబ్బులు నాకక్కర లేదు. నువ్వు పూర్వజన్మలో చేసిన ఏదో పుణ్యం నాలాంటి స్వచ్చమయిన ప్రేమను కొద్దికాలమయినా అనుభవించే అదృష్టాన్నిచ్చింది.  ఆ అనుభూతుల్లో, జ్ఞాపకాల్లో జీవితం గడిపేయ్,  and,  thanks for few lovely moments.  ఇంకెప్పుడూ నన్ను కలిసే ప్రయత్నం చేయకు.  నా  పేరు కూడా తలవకు. తలిస్తే బాధపడతావు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టి నిన్ను చూస్తే అసహ్యం  వేయటంలేదు. జాలిగా వుంది.” అని శ్రీకాంత్ వేపు  జాలిగా  చూసి, వెనక్కి తిరిగి   నిండైన ఆత్మవిశ్వాసంతో, ఎనలేని ధైర్యంతో  తన కౌంటర్ వైపు  నడిచింది స్వాతి.

ఆమెకు దారిచ్చి తలవంచుకుని నిలబడ్డారు శ్రీకాంత్ స్నేహితులు. ఆమె వారివైపు చూసి పలకరింపుగా నవ్వి ముందుకు సాగింది.

ఇంతలో బ్యాంకులో ఎవరి సెల్లో మ్రోగింది. రింగ్ టోన్ ఖంగు మని మ్రోగింది.

‘చేసిన కర్మము చెడని పదార్థము, వచ్చును నీవెంటా’ పాడుతున్నాడు బాల మురళీకృష్ణ.

వీల్ చైర్  తోసుకుని బయటకు నడిచారు స్నేహితులు.

అప్పుడే అందిన డాక్టర్   నుంచి  అబార్షన్ తేదీ   కన్ఫర్మేషన్ మెసేజీ  చూసి, జారుతున్న కన్నీటి చుక్కను అదిమిపట్టి    కౌంటర్  పనిలో నిమగ్నమయింది స్వాతి , పెదిమలపై చెరగని చిరునవ్వుతో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here