చెట్టు చేసిన మేలు

1
6

[dropcap]కాం[/dropcap]తయ్యకు చెట్లు అన్నా పంటపొలాలు, తోటలు అన్నా ఎంతో ఇష్టం. ఆఖరికి రహదారి కిరువైపుల ఉన్న చెట్లకు కూడా నీళ్ళు పోయడం, వాటికి చీడ పడితే మందు చల్లి రక్షించడం చేస్తుంటాడు. అందుకే ఆ ఊర్లో అందరూ అతన్ని ‘చెట్ల ప్రేమికుడు’ అని పిలుస్తుంటారు.

ఇలా ఉండగా కాంతయ్య ఇంటి పక్కనున్న కామయ్య అనే వాడికి ఊరు బయట ఓ ఎకరం బంజరు భూమి ఉంది. మరి దానిలో పంటలు పండవు, నీటి వసతి లేదు! ఏదో విధంగా దానిని కాంతయ్యకు తక్కువ ధరకిస్తే తనకు కొంత డబ్బు లభిస్తుంది, తనకు భారమైన ఆ బంజరు భూమి భారం వదలి పోతుందని దుష్ట ఆలోచన చేసి కాంతయ్య కు ఆ బంజరు భూమి విషయం వివరించాడు.

ఏ భూమి అయినా దానికి తగిన చెట్లు వేస్తే పెరుగుతాయనే మంచి ఆలోచన గల కాంతయ్య ఆ భూమిని కొంటానన్నాడు.

ఆ ఎకరా బంజరు భూమిని ఐదు వేలకు కాంతయ్యకు అమ్మివేశాడు కామయ్య.

కాంతయ్య వెళ్ళి మరొకమారు భూమిని పరిశీలించాడు. ఆ భూమిలో చెట్లు లేవు! పడమరన ఒకే ఒక ఎండిన పెద్ద చెట్టు ఉంది! దానికి ఎక్కడా పచ్చదనం లేదు. ఆ చెట్టును స్పృశిస్తూ కాంతయ్య దానిని ఏం చెయ్యాలో ఆలోచించసాగాడు.

ఇంతలో ఆ ఎండిన చెట్టునుండి కొన్ని కాంతి కిరణాలు వెలువడ్డాయి! “నాయనా కాంతయ్యా, నా వయసు అయిపోయింది. నేను నూట ఏభై సంవత్సరాలు బతికి కొంతమందికి మేలు చేశాను, నా చేతనైనంతలో పశువులు పక్షులకు సేవ చేశాను, అంటే నాలో పచ్చదనం ఉన్నప్పుడు పక్షులు గూళ్ళు కట్టుకొని హాయిగా జీవించాయి. నాకు గుబురు ఆకులు ఉన్నప్పుడు ఆ నీడలో పశువులు, మనుషులు సేద తీరేవారు, మరి నా పూర్వ వైభవం అంతా పోయి నిర్జీవిగా మిగిలాను, నీవు చెట్లను అమితంగా ప్రేమిస్తావని తెలుసు, అందుకే నీకు మేలు చేయాలనుకొంటున్నాను, నా కాండం, కొమ్మల్లో ప్రాణం లేకుండా ఎండి పోయాయి కాబట్టి నన్ను సమూలంగా గొడ్డలితో కొట్టి నా కాండం నుండి లభించే పెద్ద చెక్కతో ఓ రెండు అడుగుల పెట్టె చేయించి పెట్టుకో, నీవు ఎవరికైనా అన్నదానం చేయాల్సి వచ్చినా నీకు ఆ పెట్టె నుండి భోజనం లభిస్తుంది, ఆకలి గొన్నవారికి తృప్తిగా అన్నం పెట్టి పంపు, కానీ ఒకటి ఈ పెట్టెలో లభించే ఆహారంతో వ్యాపారం చేయాలని చూసినా, లేని పోని కోరికలు కోరినా ఆ పెట్టె దుష్ఫలితాలను ఇస్తుంది, బాగా గుర్తు పెట్టుకో…,” అని చెప్పింది, వెంటనే దాని ఎండిన కొమ్మ విరిగి పడిపోయింది.

రెండో రోజు కాంతయ్య ఆ చెట్టును కొట్టించి దాని కాండంతో ఓ పెట్టె చేయించాడు. మిగిలిన కొమ్మల్ని వంట చెరకుగా బీదవారికి ఇచ్చివేశాడు. ఎప్పుడూ రాని వంట ఘుమఘుమలు కాంతయ్య ఇంటినండి కామయ్య ఇంటికి వచ్చేసరికి కామయ్య ఆశ్చర్య పోయాడు.

ఒకరోజు ఐదుగురు ముష్టి వాళ్ళ బృందం కాంతయ్య ఉండే వీధిలో బిక్ష అడుక్కో సాగారు. ఎందుకో ఆ రోజు వారికి సరిగ్గా బిక్ష లభించలేదు, కాంతయ్య ఇంటికి వచ్చి బిక్ష అడిగారు, వెంటనే కాంతయ్య ఆయన శ్రీమతి ఇంటివరండాలో ఆకులు వేసి వేడిగా అన్నం మిఠాయిలు వడ్డించారు.

ఐదుగురు తృప్తిగా తిని దంపతులిద్దరినీ ఆశీర్వదించారు. ఈ తతంగమంతా పక్కింటి కామయ్య గమనించి ఐదుగురు ముష్టి వాళ్ళకు మిఠాయిలతో అన్నం పెట్టగలిగిన ధనం కాంతయ్యకు ఎక్కడినుండి వచ్చిందో అని తీవ్రంగా ఆలోచించసాగాడు. రెండో రోజే బీద దంపతుల జంటవస్తే వారికి కూడా ఘుమఘుమలాడే భోజనం, పాయసం వడ్డించారు కాంతయ్య దంపతులు. ఈ సంఘటనను కూడా గమనించిన కామయ్య ఏది ఏమైనా ఈ రహస్యం తెలుసుకోవాలనుకున్నాడు. ఒకరోజు ఈ విషయాన్ని కాంతయ్యను అడిగితే “దైవం మాకు ఇస్తున్నాడు, మేము బీదవాళ్ళకు దానం చేస్తున్నాము” అని చెప్పాడు.

ఏది ఏమయినా కాంతయ్య దగ్గర ఉన్న ఆ రహస్యం కని పెట్టాలనుకుని ఒక మధ్యాహ్నం వేళ రహస్యంగా కాంతయ్య పెరడులోకి ప్రవేశించి కిటికి సందులో నుండి కాంతయ్య గదిలోకి చూశాడు కామయ్య. కాంతయ్య ఆ పెట్టెకు నమస్కారం పెట్టి అందులోనండి వేడి వేడిగా ఘుమఘుమలాడే ఆహార పదార్థాలు బయటకు తీశాడు. ఇదంతా చూసి కామయ్య ఆశ్చర్య పోయి, ఏది ఏమైనా ఆ పెట్టె దొంగతనం చేస్తే తన కుటుంబం కూడా పంచభక్ష్య పరమాన్నాలు రోజూ భుజించవచ్చునని దుష్ట పన్నాగం పన్నాడు.

ఒక రాత్రి వేళ రహస్యంగా కాంతయ్య ఇంటిలో ప్రవేశించి ఆ పెట్టె దొంగతనం చేసి ఇంటికి తెచ్చుకుని దానికి నమస్కారం పెట్టి పంచభక్ష్య పరమాన్నాలతో కూడిన భోజనం కావాలని అన్నాడు. అంతే పెట్టె తలుపు తీసేసరికి వేడి వేడిగా పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం ప్రత్యక్షం అయింది. బోలెడు సంతోషంతో ఆ భోజనం బయటకు తీసి తినేసరికి ఇంకేముంది భోజనం, పాయసం కటిక చేదుగా ఉన్నాయి. అవంతా పారవేసి, మరలా భోజనం కోరాడు, అది కూడా చేదే!

ఆ పెట్టెలో నండి వెలుగు వచ్చి ఈ విధంగా మాటలు కామయ్యకు వినబడ్డాయి.

“చూడు కామయ్యా, నీవు తప్పుగా ఈ పెట్టెను దొంగతనం చేశావు. అందుకే దీనిలోని పదార్థాలు నీకు చేదుగా లభిస్తున్నాయి. అదే కాంతయ్య చెట్ల ప్రేమికుడు, స్వార్థం లేకుండా తనకు చేతనైన సహాయం అవసరమైన వారికి చేస్తున్నాడు. నీవు స్వార్థంతో బంజరు భూమి అతనికి అమ్మావు. అందులో కూడా చెట్లు వేయాలని చూస్తున్నాడు. నీవు పెట్టెను కాంతయ్యకు ఇచ్చి క్షమాపణ అడుగు” అని వినపడింది.

“నా బుద్ది గడ్డి తిని ఈ పెట్టె దొంగతనం చేశాను, మర్యాదగా అతని పెట్టె అతనికి ఇచ్చివేస్తాను” అని అనుకుంటూ పెట్టె తీసుకవెళ్ళి కాంతయ్యకు ఇచ్చి, తాను తప్పు చేశానని తనను క్షమించమని అడిగాడు.

“అయ్యో ఎంత పని చేశావు? అది దైవం ఇచ్చిన పెట్టె నన్ను భోజనం అడిగితే నేను పెట్టేవాణ్ణి కదా!” అన్నాడు కాంతయ్య.

“వద్దు కాంతయ్యా, ఏదైనా కష్టపడి సంపాదించాలి, ఉన్నదానిలో దానం చెయ్యాలి, నీ పెట్టె ఈ మంచి విషయం నాకు చెప్పింది” అని చెప్పి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు కామయ్య.

ఇంట్లో పెట్టిన పెట్టెలో నుండి కాంతయ్యకు ఈ విధంగా మాటలు వినిపించాయి.

“కాంతయ్యా, ఇక నా పని ముగిసింది నీవు కామయ్య దగ్గర కొన్నభూమి ఈశాన్యం మూల బావి త్రవ్వించు, పుష్కలంగా నీరు పడుతుంది, అది ఇక ఏ మాత్రం బంజరు భూమికాదు, మంచితోట వేయించు ఆ తోటలో కాసే పండ్లు ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. నీకు అంతా మేలు జరుగుతుంది, ఇక నేను మామూలు పెట్టెనే” పెట్టెలో నుండి వెలుగు వచ్చి ఆరిపోయింది.

పెట్టె చెప్పినట్టుగానే బంజరు భూమి బావిలో పుష్కలంగా నీరు పడింది, మంచి చెట్లు పెరిగాయి, ఎండిన చెట్టు కొట్టిన చోట ఓ మంచి చెట్టు మొలచింది! చూశారా మనం ప్రకృతిని కాపాడితే అదే మనల్ని కాపాడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here