[box type=’note’ fontsize=’16’]మానవ సంబంధాలు వ్యాపారమయమైన దౌర్భాగ్యమైన స్థితిని ప్రదర్శించే కథ “చెట్టు నీడ”.[/box]
రాత్రి పది గంటలు అయింది.
చిన్న గది. పలచని కొద్దిపాటి వెలుతురు. గోడని ఆనుకుని ఉన్న చిన్న మంచం మీద ముసలమ్మ కళ్ళు మూసుకుని పడుకుని ఉంది.
తల్లిని నిద్ర లేపి కాసిని మజ్జిగ నీళ్ళు తాగిద్దామని శేషగిరి ఆమెను తట్టి లేపుతున్నాడు. కదలడం లేదు. కళ్ళు తెరవడం లేదు. మనిషిలో చలనం లేదు.
ఎంత నీరసంగా ఉన్నా, రోజూ తట్టి లేపితే కళ్ళు తెరిచి చూసేది. ఇవాళ అదీ లేదు. ఊపిరి తీస్తున్న దాఖలాలు లేవు. నోట్లో నీళ్ళు పోసి చూశాడు. గుటక వేయటం లేదు.
శేషగిరి ఎన్నాళ్ళ నుంచో భయపడుతున్న క్షణాలు రానే వచ్చాయని అర్థమైంది. సాధారణంగా తల్లీ కొడుకుల మధ్య ఉండే అనుబంధం వాళ్ళ మధ్య ఉన్నది. తల్లితో పాటు ఆ అనుబంధమూ తెగిపోతుందన్న బాధ శేషగిరిని భయపెడుతోంది.
ఎముకల గూడులా ఉన్న తల్లిని లేపి కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆమె కదలటం లేదు. ఇంత కాలం శేషగిరిని భయపెడుతున్న ఘడియలు రానే వచ్చాయి.
ఇప్పుడేం చెయ్యటం? కిం కర్తవ్యం?
శేషగిరికి ఉన్న ఒకే ఒక్క స్నేహితుడు సుందరం. వాడికి ఫోన్ చేశాడు.
“గంట కిందటి దాకా కల్సే ఉన్నాం గదా… ఇంతలోనే ఏమైందిరా?” అని అడిగాడు సుందరం.
తల్లి చనిపోయిందన్న మాట తన నోట రావడం ఇష్టం లేదు శేషగిరికి.
“నువ్వు ఉన్న పళంగా అర్జంటుగా మా ఇంటికి రా…” అన్నాడు శేషగిరి.
ఏం జరిగి ఉంటుందో సుందరం తేలికగానే ఊహించాడు.
“మీ అమ్మకెలా ఉంది?” అని అడిగాడు.
“నువ్వు రారా…” అన్నాడు శేషగిరి.
“రెండు మెతుకులు నోట్లో వేసుకుని ఒక గంటలో వస్తా…” అన్నాడు సుందరం.
శేషగిరి గోడకు చేరగిల బడ్డాడు.
అతనిది విచిత్రమైన జీవితం. పృథ్వి మీద ఇలాంటి వాడొకడు ఉన్నాడని చెబితే నమ్మటం కష్టం. విపరీతమైన బద్ధకం. అది ముదిరి సోమరితనంగా మారింది. ఏ పనీ చెయ్యడు. ఎవరినీ ఏదీ అర్థించడు. అందరూ అన్నీ అతనికి అయాచితంగా ఇవ్వాలి. తనని తాను సమర్థించుకునేందుకు అతను చెప్పే మాటలు మాత్రం కోటలు దాటుతాయి.
శేషగిరి తండ్రి రైల్వేలో పనిచేశాడు. ఆయనకు ముగ్గురూ కొడుకులే. శేషగిరి చివరివాడు. పెద్ద కొడుకులు ఇద్దరూ మెరికల్లాంటి వాళ్ళు. చదువుల్లో అందరికంటే ముందుండేవాళ్ళు. కనుకనే ఖర్చుకు వెనకాడకుండా వాళ్ళిద్దర్నీ ఎంత వరకూ చదువుకుంతే అంతవరకూ చదివించాడు. పెద్దవాడు అమెరికాలో ఒక పెద్ద కంపెనీకి డైరక్టరుగా ఉన్నాడు. రెండో వాడు ఆస్ట్రేలియాలో డాక్టరు. ఇద్దరికీ క్షణం తీరుబడి లేదు. బాగా సంపాదిస్తున్నారు.
తేనెను సేకరించే తేనెటీగలు తేనెతుట్టెను అంటి పెట్టుకుని ఉండవు. అవి తేనె సేకరించే పనిలో అవిశ్రాంతంగా తిరుగుతూనే ఉంటాయి. అలాగే ధనార్జనపరులైన పెద్దవాళ్ళిద్దరూ ఎక్కడెక్కడికో రెక్కలు గట్టుకుని ఎగిరిపోయి, కీర్తిప్రతిష్ఠలతో పాటు డబ్బూ సంపాదిస్తున్నారు.
ఎటొచ్చీ శేషగిరి పరిస్థితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. అతను తన అసమర్థతకూ, చేతగానితనానికీ ఎదుటివాళ్ళే కారణం అని అంటూంటాడు. చిన్నప్పటి నుంచీ అతని జీవితంలో ఏదీ జరగవలసిన పద్ధతిలో జరగలేదు. మొదటి నుంచీ అన్నీ అస్తవ్యస్తంగానే ఉండిపోయాయి.
స్కూల్లో తను చదువుకోకపోవటానికి కారణం, ఆ స్కూల్లో టీచర్లేనంటాడు శేషగిరి. ‘స్కూల్లో టీచర్లు చెబితే ఇంక ఇంటి దగ్గర చదువుకోవాల్సిన పని ఉండగూడదు. పూర్వం టీచర్లు అంత విపులంగా చెప్పేవాళ్ళు. ఇప్పటి టీచర్లకు వాళ్ళకే రాదు. క్లాసులో ఏమీ చెప్పరు. హోం వర్క్‌లు ఇస్తారు. పిల్లలకు ఎవరూ చెప్పకుండా చదువు ఎలా వస్తుంది?’ అని ఎదురు ప్రశ్నిస్తాడు. ఏమీ చదవకుండా ఒక్కో సంవత్సరం దాటుకుంటూ వెళ్ళినా పదో తరగతి దాటటం మాత్రం శేషగిరి తరం కాలేదు.
చదువులేకపోయినా వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలన్న ఉద్దేశంతో చిన్న చిన్న ఉద్యోగాలు ఇప్పించాడు తండ్రి. ఉద్యోగంలో చేరినట్టే చేరి మానేసేవాడు.
బ్యాంక్‌లో అటెండర్ ఉద్యోగంలో చేరాడు. చీపురు పట్టుకుని ఊడవమంటున్నారని మానేశాడు. హోటల్లో కౌంటర్లో కూచోబెడితే, అన్ని గంటలు పని చేయటం కష్టమని మానేశాడు. చివరకు ఒక కాటరింగ్ యజమాని దగ్గర చేరిస్తే అతను పుచ్చిపోయిన వంకాయలతో పులుసు చేయిస్తున్నాడని ఎగనామం పెట్టాడు. ఈ కాటరింగ్‌లో కూరలు తరుగుతున్నప్పుడే సుందరంతో పరిచయం అయింది. అతనిదీ ఇదే మనస్తత్వం కావటంతో ఇద్దరూ ప్రాణస్నేహితులు అయిపొయ్యారు.
శేషగిరి జీవితంలో ఏదో రకంగా స్థిరపడాలని తండ్రి ఎంత ప్రయత్నించినా, ఆ కోరిక తీరకుండానే ఆయన కన్ను మూశాడు. తండ్రి ప్రభుత్వోద్యోగి కాబట్టి, తల్లికి ఫామిలీ పెన్షన్ అందుతోంది. పేరుకు మాత్రమే ఆమె పెన్షన్ గానీ శేషగిరే బ్యాంక్ నుంచి డబ్బు తెచ్చుకుంటాడు. తనే ఖర్చు చేస్తుంటాడు.
పొద్దున్నే నిద్దర లేచి తల్లికి కాఫీ ఇస్తాడు. రోడ్డు మీద నుంచి రెండు ఇడ్లీ తెచ్చి పెడతాడు. పూజ పునస్కారాలతో రెండు గంటలు గడిపేస్తాడు. అన్నం వండి ఏదో ఒక పచ్చడి తయారు చేస్తాడు. కర్రీ పాయింట్ నుంచి కూర తీసుకొస్తాడు. పది రూపాయల పెరుగు తెస్తాడు. తల్లికి భోజనం పెట్టి తను తినేస్తాడు. సాయంత్రం మళ్ళీ కాఫీ. రాత్రికి కర్రీ పాయింట్ కూరతో భోజనం… పెద్దగా కష్టపడాల్సిన పనేం లేకుండానే రోజులు గడిచిపోతున్నాయి.
సాయంత్రం సుందరంతో పాటు పనీ పాటా లేని మరో నలుగురు బస్‌స్టాప్ పక్కన చెట్టుకింద చేరుతారు. ఇంక అక్కడే శేషగిరి తన విశ్వరూపం చూపిస్తుంటాడు. ప్రతివాడినీ తిట్టిపోస్తాడు. తన గొప్పలు చెప్పుకుంటాడు.
“తల్లికి సేవ చెయ్యాలండి. ఎంత సేవ చేసినా తల్లి ఋణం తీర్చుకోలేమని శాస్త్రాలు చెబుతున్నాయండీ. మా అన్నయ్యగార్లు ఇద్దరూ బాగా సంపాదిస్తున్నారు. కానీ తల్లికి ఒక పూట అన్నం పెట్టడం లేదండి. నాకు డబ్బు లేదు. అయినా తల్లిని దేవతలా పూజిస్తున్నానండి.. ఈ పుణ్యం ఊరికే పోదండి. వచ్చే జన్మలో దీని ఫలితం కనిపిస్తుందండీ…” అంటాడు శేషగిరి.
‘ఏదైనా పని చేసుకోవచ్చు గదా శేషగిరీ?’ అంటే, ‘నాకు ఏలినాటి శని నడుస్తోందండీ… ఇంకో రెండేళ్ళు పొయ్యేదాక ఏ పనీ చెయ్యలేమండీ’ అంటాడు.
చుట్టుపక్కల ఉండే ఇద్దరు ముగ్గురు అమ్మాయిల వెంటబడి, ‘ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ’ అని పాటలు పాడాడు. వాళ్ళు ‘పోరా, పోకిరి వెధవా’ అని వెళ్ళిపొయ్యారు.
‘పెళ్ళి చేసుకోలేకపొయ్యావా శేషగిరీ’ అంటే ఆ అమ్మాయిది మూలా నక్షత్రమండీ, ఎవడు పెళ్ళి చేసుకున్నా మూడేళ్ళకంటే ఎక్కువ కాలం బతకడండీ – అంటాడు. మూడో నెలలో ఉండగా పెళ్ళి చేసుకుంది – అంటూ తన అసమర్థతను కప్పి పుచ్చుకుంటూ ఎదుటివాళ్ళ మీద ఏదో ఒక నెపం వేశేస్తాడు.
‘నిరుద్యోగుల భృతి ఇవ్వాలండీ… నాయకులు గాదె కింద పందికొక్కుల్లా తినేస్తుంటే, దేశం ఏం బాగుపడుతుందండీ…. పలుకుబడి గల వాడు అడ్డగోలుగా తినేస్తున్నారండీ… సామజము చెరకు మేసిన, దోమలు పదివేలు జేరి త్రోలంగగలవా?… అన్నాడో కవి… పూర్వం రాజులు దానాలు చేసేవారండి. అందుకే వాళ్ళు అష్ట ఐశ్వర్యాలతో తులతూగేవారండీ’ అంటూ ఉపన్యాసం దంచుతాడు.
ప్రతీ సినిమా చూస్తాడు. భక్తి ముక్తి రక్తి – అన్నీ నచ్చుతాయి. ‘నిది పుణ్యమని కంటి నిది గణ్యమని కంటి నిది యోగమని కంటి నిది భోగమని కంటి నిది ధర్మమని కంటి నిది నిత్యమని కంటి నిది సత్యమని కంటి’ అంటాడు.
చూస్తుండగానే, బద్ధకంగా ఒళ్ళు విరుస్తుండగానే ఒకదాని తరువాత మరొకటి గ్రహపీడలు విడవకుండానే శేషగిరికి నలభై ఏళ్ళు దాటిపోయినయి. ఒకప్పుడు అతను పెళ్ళి చేసుకుందామనుకున్న అమ్మాయిల అమ్మాయిలు పెళ్ళీడుకొచ్చారు. ఇప్పుడు ఆ పాపలనూ పెళ్ళి చేసుకోవాలన్న కోరిక ఉన్నా… తీరేది కాదని… వాళ్ళంతా బాయ్‌ఫ్రెండ్స్‌తో తిరుగుతుంటారని వ్యాఖ్యానించి తనకు తాను తృప్తి పడతాడు.
రాత్రి పన్నెండు గంటల సమయంలో సుందరం వచ్చాడు. శేషగిరి తల్లి చనిపోయిన విషయం తెలుసుకున్నాడు.
“ఇప్పుడు మీ అన్నయ్యలకు ఫోన్లు చెయ్యి… వాళ్ళు రావాలి గదా…” అన్నాడు సుందరం.
“వాళ్ళు రారు. వారం రోజుల ముందే వాళ్ళ ప్రోగ్రామ్‌లు ఫిక్సయిపోయి ఉంటాయి. అద్దెగదిలో శవాన్ని పెట్టుకుని ఎలా ఉంటాను? తెల్లారే లోపల అందరూ నిద్ర లేచే లోపలనే, శవాన్ని తీసుకుని పోవాలి…. నక్షత్రం మంచిది కాదు… ఇల్లు మూడు నెలలు మూసేయాల్సి వస్తుంది…” అన్నాడు శేషగిరి.
“ఏం చేస్తావు?” అడిగాడు సుందరం.
“దగ్గర్లో కొత్తగా ఒక స్మశానం ఏర్పాటు చేశారు గదా… తెల్లారగట్ల టాక్సీలో అక్కడికి తీసుకెళ్దాం…. ఎవరికంటా పడకుండా వెళ్ళిపోవాలి… స్మశానంలో వాళ్ళకు ఏదో ఒకటి చెప్పి పని పూర్తి చేయాలి…” అన్నాడు శేషగిరి.
“డబ్బు ఏమన్నా ఉందా?” అడిగాడు సుందరం.
“మొన్ననే మా అమ్మ పెన్షన్ వచ్చింది గదా…. పాతికవేలు తెచ్చి పెట్టుకున్నాను. ఆ డబ్బు ఇప్పుడు ఇలా అక్కరకొచ్చింది…” అన్నాడు శేషగిరి.
తెల్లారగట్ల అయిందింటికి ఫోన్ చేసి టాక్సీ పిలిపించారు. ముందు హాస్పిటల్‌కు తీసుకెళ్తున్నామన్నారు. కొంచెం దూరం పోగానే ‘ప్రాణం పోయింది, హాస్పిటల్‌కి అక్కర్లేదు, స్మశానానికి తీసుకెళ్ళ’మన్నారు.
అంత పెందరాళే శవాన్ని తీసుకొచ్చినందుకూ, అదీ టాక్సీలో తెచ్చి దించినందుకూ స్మశానం వాడికి అనుమానం వచ్చింది. హాస్పటల్ వాళ్ళు వెంటనే తీసుకెళ్ళమన్నారనీ, అద్దె ఇంటివాళ్ళు ఇంటికి తేవద్దన్నారనీ – కథలు కల్పించి చెప్పాడు శేషగిరి.
వాడికో వెయ్యి రూపాయలు చేతిలో పెట్టాడు.
సూర్యోదయం అవుతుండగానే దహనకాండ జరిగిపోయింది.
తిరిగి వస్తున్నప్పుడు సుందరం అడిగాడు.
“మరి వచ్చే నెల నుంచీ మీ అమ్మకు పెన్షన్ రాదేమో..”
“మా అమ్మ చనిపోయినట్లు ఎవరికి తెలుసు? నీకూ నాకు తప్ప….”
“చుట్టు పక్కల వాళ్ళు…”
“మా అన్నయ్య వచ్చి ఆస్ట్రేలియా తీసుకెళ్ళాడని చెబుతాను. మా అమ్మ ఎక్కడుంటే ఎవడికి కావాలి? లేకపోతే ఎవడికి కావాలి?…”
“అంటే మీ అమ్మ చనిపోయినా పెన్షన్ వస్తూనే ఉంటుంది… నీకు… ఏడాదికోసారి బతికి ఉన్నట్టు సర్టిఫికెట్టు ఇవ్వాలేమో….”
“రెండేళ్ళ నుంచీ మంచంలో ఉంది. లేవలేదు… కావాలంటే మా ఇంటికొచ్చి చూడమంటున్నాను… సంతకాలు పెట్టేస్తున్నారు.”
“అంటే మీ అమ్మ లేకపోయినా యథాప్రకారం నీకు రావల్సిన డబ్బు వస్తూనే ఉంటుందన్న మాట…” అన్నాడు సుందరం.
శేషగిరి నవ్వి ఊరుకున్నాడు.
సాయంత్రం ఇద్దరూ బార్‌లో కూర్చుని తాగుతుండగా అమెరికా నుంచి పెద్దన్నయ్య ఫోన్ చేశాడు…
“అమ్మని మళ్ళీ ఆస్పత్రిలో చేర్చాను… మూడు రోజులు అయ్యింది. యాబైవేలు ఖర్చయ్యింది… నువ్వు రానక్కర్లేదులే… డబ్బు బ్యాంక్ ఎకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చెయ్యి… ప్రాబ్లం ఏంటంటే ఒంట్లో బిపి, సుగర్, సోడియం లెవెల్స్ పడిపోయాయి…”
మర్నాడు బ్యాంక్ బాలెన్స్ పడిపోకుండా సరిపోయింది. వచ్చే వారం… ఆస్ట్రేలియా నుంచి… వస్తుంది డబ్బు.
“కుటుంబం అనే చెట్టు నీడ ఉన్నంతకాలం, మనకేం ఫర్వాలేదు…” అన్నాడు శేషగిరి, గ్లాసు నింపుతూ.
[review]
– శ్రీధర