చేతులు కాలాక…

    0
    6

    [box type=’note’ fontsize=’16’] ఆడపిల్ల జీవితంలో అతి ముఖ్యమైన పెళ్ళి విషయంలో అవసరమైన జాగ్రత్తలు కోకపోతే జరిగేదేమిటో సలీం కల్పిక చేతులుకాలాక లో తెలుసుకోండి. [/box]

    [dropcap]ఈ[/dropcap] రోజుల్లో పెళ్ళిళ్ళు వైభవంగా జరుపుతున్నారు. కట్నాలూ లాంఛనాలతో పాటు పెళ్ళికయ్యే ఖర్చు కోట్లలో ఉన్నా ఆడపిల్ల తల్లిదండ్రులు వెనకాడటం లేదు. జీవితంలో ఒకేఒక్కసారి జరిగే ముచ్చట కదా అనుకుంటూ మురిసిపోతున్నారు. కానీ ఆడపిల్ల జీవితంలో అతి ముఖ్యమైన ఈ పెళ్ళి విషయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవటంలో విఫలమౌతున్నారు. పర్యవసానంగా ఆడపిల్లల బతుకుల్ని బలి చేస్తున్నారు.

    పెళ్ళికొడుకు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అంటే చాలు ఎగబడిపోతున్నారు. అమెరికాలో అతను పని చేస్తున్న ప్రదేశానికెళ్ళి అతను చేసే ఉద్యోగం, జీతభత్యాలు, అతని ప్రవర్తన, అలవాట్లు మొదలైన విషయాల్ని కనుక్కునేంత తీరుబడి ఎవ్వరికీ ఉండటం లేదు. అమెరికాలో అతను నిజంగానే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడా లేక పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్నాడా అనేది తెల్సుకోవాలిన బాధ్యతని విస్మరిస్తున్నారు.

    అమెరికా దాకానో ఆస్ట్రేలియా దాకానో పోనక్కరలేదు. మన రాష్ట్రంలో పొరుగు జిల్లాలో చూసిన సంబంధమైనా పెళ్ళికొడుకు గురించి ఖచ్చితమైన వివరాలు కనుక్కోవడంలో విఫలమౌతున్నారు. నేను ఇన్‌కమ్ టాక్స్ అధికారిగా ఉద్యోగం చేస్తున్న కొత్తలో నాకెదురైన అనుభవం చెప్తాను. నేనప్పుడు టాక్స్ రికవరీ ఆఫీసర్‌గా పని చేస్తున్నాను. మా ఆఫీస్‌లో వెంకట్రావ్ అనే కుర్రవాడు కంటిన్జెంట్ బాయ్‌గా పని చేసేవాడు. ఇరవై రెండేళ్ళ వయసు… ఆఫీస్‌కి చక్కగా తయారై, మంచి డ్రెస్ వేసుకుని, టక్ చేసుకుని, నిగనిగలాడే బూట్లు తొడుక్కుని, స్కూటర్ మీద వచ్చేవాడు.

    కంటిన్జెంట్ ఎంప్లాయీ కాబట్టి రోజుకింత చొప్పున శెలవు దినాలు తీసేసి మిగతా దినాలకు జీతం లెక్క కట్టి ఇస్తారు. అంత తక్కువ జీతంతో ఒక్కడు బతకడమే కష్టం. మరి ఇంత ఖరీదైన బట్టలూ, స్కూటర్ లాంటివి ఎలా సమకూర్చుకోగలుగుతున్నాడు అనే అనుమానం వచ్చింది. మొదట వాళ్ళ నాన్నకు మంచి ఆదాయం వచ్చే ఉద్యోగమో వ్యాపారమో ఉన్నాయనుకున్నా, లేదట. ఆయన ఏదో ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి అని తెల్సింది. నా సిబ్బందిలో కొంతమందిని విచారిస్తే తెల్సిందేమంటే ఆ కుర్రవాడికి ఆర్నెల్ల క్రితమే పెళ్ళయిందని. అమ్మాయి డిగ్రీ పాసయిందట. గవర్నమెంట్ టీచర్‌గా ఉద్యోగం చేస్తుందట. దండిగా కట్నం కూడా తీసుకున్నాడని చెప్పారు. అదీ విషయం. మామగారిచ్చిన కట్నంతో, భార్య సంపాదనతో జల్సా చేస్తున్నాడని అర్థమైంది. ఎటొచ్చీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏడో తరగతి వరకే చదువుకున్న ఓ టెంపరరీ ఉద్యోగికి విద్యాధికురాలైన ఉద్యోగస్థురాలైన అమ్మాయినిచ్చి పెళ్ళెలా చేశారనేదే. బహుశా ప్రేమ వివాహమేమో. ప్రేమ గుడ్డిదంటారు కదా. అందునా ఆడపిల్లల ప్రేమ మరీ గుడ్డిది అనుకున్నా.

    ఈ సమాచారం తెల్సిన ఓ వారానికి నా వద్దకు ఓ పెద్దాయన వచ్చాడు. వయసు యాభైకి అటూ ఇటుగా ఉండొచ్చు. కానీ మరో పదేళ్ళ వయసు పైనబడినట్టు కన్పించాడు. మొహం నిండా విచారం గూడు కట్టుకుని ఉంది. కొద్దిగా కదిలించినా ఏడ్చేసేలా ఉన్నాడు. వ్యాపారాలు దివాలా తీసేయటం వల్ల పన్ను బకాయిలు చెల్లించలేని ఏ దురదృష్టవంతుడో అనుకున్నా. కాదట.

    మరి ఎందుకొచ్చాడో అర్థం కాక “చెప్పండి ఏం పనిమీద వచ్చారో?” అన్నాను. “నేను మీ వద్ద పని చేసే వెంకట్రావుకి పిల్లనిచ్చిన దౌర్భాగ్యపు తండ్రిని సార్” అన్నాడు.

    “ఎందుకలా అనుకుంటున్నారు? వెంకట్రావు చూడటానికి చక్కగా ఉంటాడు. మంచి కుర్రవాడు. అంతకన్నా ఏం కావాలి?” అన్నాను.

    “మంచివాడు కాదు సార్. మోసగాడు. పచ్చి మోసగాడు” అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

    అసలేం జరిగిందని విచారిస్తే తెల్సిన విషయం ఏమిటంటే పెళ్ళి సంబంధం మాట్లాడినపుడు వెంకట్రావు తను ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నానని చెప్పాడట. ఏడెనిమిదేళ్ళకు ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌గా ప్రమోషన్ వస్తుందనీ, కుర్రవాడికి మంచి భవిష్యత్తుందనీ, పిల్ల సుఖపడ్తుందనీ నమ్మి పెళ్ళి చూపులు ఏర్పాటు చేశారట. పిల్లకు పిల్లవాడు నచ్చటంతో పెళ్ళి ఖరారు చేసుకుని ముహుర్తాలు పెట్టుకున్నారట.

    “మరి వెంకట్రావు చెప్పింది నిజమో కాదో ఎంక్వయిరీ చేయాలనిపించలేదా?” అని అడిగాను.

    “ఎందుకు చేయలేదూ? పిల్లవాడు రోజూ ఇన్‌కమ్ టాక్స్ ఆఫీస్‌కి వెళ్ళి వస్తుంటాడన్న సమాచారాన్ని సేకరించాం. అతని బంధువుల్లో ఒకరిద్దరిని విచారిస్తే కుర్రవాడు ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడని చెప్పారు. మాకేం తెలుసు సార్ ఈ త్రాష్టుడు గొప్పకోసం తన స్నేహితులతో బంధువుల్లో తను ఇన్‌స్పెక్టర్ అని చెప్పుకున్నాడని”

    “మీరు అతను పనిచేసే ఆఫీస్ కెళ్ళి కనుక్కోవాలి కదా”

    “అతని కళ్ళెదురుగా ఆఫీస్లో ఎంక్వయిరీ చేస్తే కుర్రవాడు ఏదైనా అనుకుంటాడని సంశయించాం సార్. తన మాటమీద నమ్మకం లేనివాళ్ళతో సంబంధం వద్దంటాడేమోనని అనుకున్నాం. కుర్రవాడికి కోపం తెప్పిస్తే బంగారంలాంటి సంబంధం తప్పిపోతుందని భయపడ్డాం. అదే మా కొంప ముంచింది సార్” అంటూ మరోసారి వలవలా ఏడ్చాడు.

    అంత పెద్దాయన ఏడుస్తుంటే ఎలా సముదాయించాలో అర్థం కాక మంచి నీళ్ళ గ్లాస్ అతని వైపుకు జరిపి “మంచినీళ్ళు తాగండి. కాఫీ తెప్పించమంటారా?” అని అడిగాను.

    వద్దన్నాడు. నేను కూడా కాఫీ ఆర్డర్ చేయకూడదనే అనుకున్నాను. వెంకట్రావే క్యాంటీన్ నుంచి కాఫీ తెచ్చి, కప్పుల్లో పోసి మా ముందు పెట్టాలి. మేము తాగాక ఆ ఎంగిలి కప్పుల్ని అతనే తీసుకెళ్ళి కడిగి పెట్టాలి. ఇదంతా చాలా ఇబ్బందికరంగా ఉంటుందని అర్థమై మిన్నకుండిపోయాను.

    “ఆఫీస్! మీరే రావాలని ఎక్కడుంది? ఎవర్నయినా పంపి ఎంక్వయిరీ చేయించాల్సింది” అన్నాను.

    “పెళ్ళి చూపుల సమయంలో అతను పనిచేసే ఆఫీస్ ఫోన్ నంబర్ తీసి పెట్టుకున్నాను సార్. ఓ రోజు ఆ నంబర్‌కి ఫోన్ చేసి మీ ఆఫీస్‌లో వెంకట్రావు అనే ఇన్‌స్పెక్టర్ పని చేస్తున్నాడా?” అని అడిగాను. “అవును. ఉన్నారు. ఆయనతో మాట్లాడతారా?” అని సమాధానమొచ్చింది. “నా ఖర్మ ఎలా కాలిందో చూశారా? మాట్లాడినా బావుండేది. ఆ వెంకట్రావు ఈ వెంకట్రావు కాదని అర్థమయ్యేది. పెళ్ళయిన మూణెల్లకి కానీ మాకు నిజం తెలియలేదు. ఇదే ఆఫీస్‌లో వెంకట్రావు పేరుతో ఓ ఇన్‌స్పెక్టర్ ఉన్నారని, ఆయనకు దాదాపు నా అంత వయసుంటుందని”

    నాకు టెంపరరీ ఉద్యోగి వెంకట్రావు ఆడిన నాటకం అర్థమైంది. కనీసం వీళ్ళు పూర్తి ఇంటిపేరుతో ఎంక్వయిరీ చేసినా నిజం తెలిసేది. అయినా ఇలాంటి విషయాల్లో మొహమాటాలేమిటి? అక్కడ పందెం కాస్తుంది అమ్మాయి జీవితం. నేరుగా ఆఫీస్ కొచ్చి ఆ కుర్రవాణ్ణి చూపించి వివరాలు కనుక్కోవాలి కదా. అతని పై అధికారిని కల్సుకుని అతను ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నాడో లేదో, అతని ప్రవర్తన ఎలాంటిదో కనుక్కోవాలి కదా. అతని ఐడి కార్డ్ జెరాక్స్ తీసి పెట్టుకోవాలి కదా. దాంతో పాటు అతని శాలరీ సర్టిఫికెట్ కాపీని కూడా అడిగి తీసుకోవాలి కదా. దానివల్ల అతని చేతికందే జీతంతో పాటు ఏమైనా అప్పు చేసి ఉంటే ఆ వివరాలు కూడా తెలుస్తాయి కదా.

    “అంతా మా ఖర్మ. మా అమ్మాయి దురదృష్టం సార్” అన్నాడతను.

    అది ఖర్మ కాదు. నిర్లక్ష్యం… నిజం తెలిశాక బాగా గొడవలైనాయట. మోసం చేశారన్న కోపంతో అ మ్మాయిని ఇంటికి పిల్చుకెళ్ళారట. రెణెళ్ళు ఇంట్లో ఉంచుకున్నాక ‘ఎలాగూ పెళ్ళయిపోయింది. దాని తలరాతలో వాడే భర్తగా రాసి పెట్టి ఉంటే ఎవరేం చేయగలరని సర్ది చెప్పుకుని అమ్మాయిని మళ్ళా కాపురానికి పంపారట.

    “తన ఉద్యోగం తొందర్లోనే పర్మనెంట్ అవుతుందని అమ్మాయితో చెప్పాడట. నిజమో కాదో తెల్సుకుందామని వచ్చాను సార్. ఈ విషయంలో మీరే సాయం చేయాలి” అంటూ నాకు నమస్కారం పెట్టాడు.

    అది నా చేతుల్లో లేదని చెప్పాను. పది పదిహేనేళ్ళనుంచి టెంపరరీ ఉద్యోగులుగా పని చేస్తున్నవాళ్ళున్నారనీ వాళ్ళు పర్మినెంట్ కాకుండా రెండేళ్ళనుంచి పని చేస్తున్న వెంకట్రావు పర్మినెంట్ కావడం ఎలా జరుగుతుందని చెప్పాను. అతను దుఃఖ సాగరాల్ని కళ్ళల్లో మోసుకుంటూ వెళ్ళిపోయాడు.

    పెళ్ళికి ముందే మరికొంత జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే ఈ ఉపద్రవం తప్పి ఉండేదిగా. నాకా అమ్మాయిని తల్చుకుంటే చాలా బాధేసింది. తన దురదృష్టానికి ప్రతిరోజూ కుమిలిపోతూ ఉండి ఉంటుంది. ఇలాంటి ఎంతమంది ఆడపిల్లల జీవితాలు తల్లిదండ్రుల అజాగ్రత్త వల్ల, అలసత్వం వల్ల, తొందరపాటువల్ల, మొహమాటాల వల్ల నాశనమైపోతున్నాయో. ఆడపిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా ఎన్నారై సంబంధాల విషయంలో మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఖర్చుకు వెనుకాడకుండా కుర్రవాడు ఉద్యోగం వెలగబెడున్న దేశానికెళ్ళి, అక్కడ కొన్ని రోజులుండి అబ్బాయి గురించి పూర్తి సమాచారం సేకరించాకే పెళ్ళికి అంగీకారం తెల్పటం మంచిది. పెళ్ళి తర్వాత ఆడపిల్ల జీవితం ఎలా ఉండబోతుంది అనేది అద్భుతమైన, అమోఘమైన ముహూర్తంలో పెళ్ళి చేయటం మీదో, భారీగా సమర్పించుకున్న కట్నకానుకల మీదే ఆధారపడి ఉండదు. పిల్లవాడి గురించి ఎంత క్షుణ్ణంగా, ఎంత కూలంకషంగా, ఎంత తెలివిగా సమాచారం సేకరించారనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఆడపిల్లల తల్లిదండ్రులూ… బహు పరాక్.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here