చిదానందరూప శ్శివోహం, శ్శివోహం!!

0
9

[శ్రీ సముద్రాల హరికృష్ణ రాసిన ‘చిదానందరూప శ్శివోహం, శ్శివోహం!!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]మ[/dropcap]లమల మాడ్చే రోహిణీ కార్తె ఎండలు.

సీతాపతి పచ్చటి దేహం రెండు కావిళ్ళ నీళ్ళు  మోస్తూ, చెమటలు కారిపోతోంది.

నీళ్ళు కుండల్లో చెంగు చెంగున తుళ్ళుతూంటే, కావిడి బద్ద అతని బుజాన వెలసిన ఏకవర్ణ హరివిల్లుగా కనబడుతూంటే – పరుగులాంటి నడకతో, ఏదో తనలో తానే మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, కామేశ్వరమ్మ గారింటి వైపు దూసుకొస్తున్నాడు!

ఒక శుభ్రమైన ధావళి, నుదుటిపై కుంకుమ బొట్టు, బుజంపైన ఒక ఎర్రగళ్ళ తుండు! ఇదీ అతని అవతారం. చూడగానే ఆకర్షించే చురుకైన, ప్రసన్నమైన చూపు!

అవును,అతనిది నడక కాదు, పరుగే!

కామేశ్వరమ్మ గారంటే,సాక్షాత్తు పార్వతీదేవే,అతని దృష్టిలో! ఆమె చెప్పింది వేదవాక్కే అతనికి! ఆమె ఏమి చెపితే అది తక్షణం అమలు చేయాల్సిందే. అంతటి గురి, అతనికి, ఆమె గారి మీద! ఆమెకు కూడా అవ్యాజమైన వాత్సల్యం అతనంటే!

సుమారు 40 ఏళ్ళకు పై వాడైనా, చిన్న పిల్లవాడే ఆమె దృష్టిలో అతను! ఆమె పిలిచి పెడితే తింటాడు, అంతే!

మిగతా అందరితోనూ సౌజన్యమే కానీ, సమ దూరం కూడా!

ఒక్కరి ముందు చేయి చాపి ఎరుగడు!

ఆ అగ్రహారంలో ఎవరికి, చిన్న చితకా, ఏ పని కావాల్సినా, సీతాపతికి చెప్పి చేయించుకుంటారు. అతనికి చెప్తే ఆ పని పూర్తి అయిపోయినట్టే అనుకుంటారు అందరూ! వారు మర్చిపోయినా, అతను మాత్రం మర్చిపోకుండా పని పూర్తి చేస్తాడు.

ఎక్కడి వాడో ఎవరికీ తెలియదు, దాదాపు 30 ఏళ్ళ నుంచి, ఉన్న అన్ని ఇళ్ళ వాళ్ళకు నీళ్ళు తెచ్చి పోయడమే అతని  ముఖ్యమైన పని. మొదట్లో కావడి, తరువాత సైకిలు! ఇంతే తేడా! పని అదే!

ఎంతిస్తారయ్యా ఈ పనికి అని ఎవరో అడిగారట ఆ మధ్య! ఆఁ ఇస్తారండీ, పదో వందో అని ఇతని సమాధానం!

పది ఎక్కడా, వంద ఎక్కడా?!

వేళాకోళం చేస్తున్నాడు, మనం అడగటం నచ్చక అని అనుకున్న వాళ్ళే ఎక్కువమంది.

కానీ నిజానికి అతను ఏది ఇస్తే అది తీసుకునే రకం!

అడగటాలు, బేరాలు, దాచుకోవటాలు అతని నైజంలోనే లేవు.

కోపం వస్తే, మూగనోము పట్టి రెండు రోజులు రాములవారి గుళ్ళో, దాని చుట్టు పక్కలా ఉంటాడు. మళ్ళీ మూడో రోజు, చలాకీగా పనిలో నిమగ్నమై పోతాడు! నిన్న రాలేదేం అని ఎవ్వరూ అడగరు, ఇతనికి చెప్పాల్సిన అవసరం రాదు! ఆ కోపం కూడా ఎవరి మీదో, ఎందుకో ఎవ్వరికీ తెలియదు. ఆ ఊరి వారు అతని తత్త్వం బట్టి నడుచుకుంటారు అని చెప్తే అతిశయోక్తి మటుకు కాబోదు! అదో విచిత్ర బంధం!

తనలో తానే మాట్లాడుకుంటూ, ఎప్పుడూ ఎవరినో మెచ్చుకుంటున్నట్టు ఆహా, అబ్బో అంటుండటం, అతని వింత అలవాటు! మొదట్లో ఇది గమనించే, కొంత మంది సీతాపతికి  కాస్త పిచ్చేమో అని కూడా అనుకున్నారు, అన్నారూ. కానే కాదు అని, అతని మాటల్లోని చురుకునీ, తర్కాన్ని చూసి నిర్ధారణ కొచ్చేశారు. తరువాత అడిగే, అనుకునే సాహసం కూడా ఎవ్వరూ చేసినట్లు లేదు!

అమ్మాయి శ్యామలాంబ గారు సన్నజాజి తీగను సరిచేస్తూ, పందిరి గురించి అనటం విన్నాడు ఒకరోజు మామిడి చెట్టు నీడలో పడుకున్న సీతాపతి!

అంతే మర్నాడు మధ్యాహ్నం మొదలుపెట్టి, జాజిపూలంత అందమైనది ఒక పందిరి వేసి, తల్లీకూతుళ్లు ఇద్దరికీ పిలిచి మరీ, చూపించి మురిసిపోయాడు.

అవతలి వాళ్ళని సంతోషపరచటం, ఇతనికి అంత ఆనందం!

భర్త పోయి, తల్లి దగ్గరే ఉంటున్న అమ్మాయి గారంటే అంత అపేక్ష అతనికి. వనరాణిగా ఉండవలసిన ఆమె, ఒంటరియై పోయిందే అన్న దిగులు, సానుభూతి ధ్వనిస్తుంది అతను ఎప్పుడు ఆమెతో మాట్లాడినా! కానీ ఏదీ బయటపడకుండా సున్నితంగా తన పరిధి ఎరిగి నడుచుకొనేవాడు.

అతనికి మతి స్థిమితం లేదేమో అన్న వాళ్ళ మతులే చూపించుకోవాలేమో అన్నట్టు ఉండేది అతని ప్రవర్తన. పరమ సహజంగా,  అతినిర్మలంగా!

అందరితోనూ అతనిది అదే ధోరణి!

ఎవ్వరూ లేని, అతని గుండెల్లో ఎంత అవ్యాజానురాగం అందరి పట్లా నిక్షిప్తం చేశాడో, ఆ దైవం, ఆశ్చర్యంగా ఉండేది చూసిన వారికి!

ఒక లోటును, ఆ పైవాడు, ఇంకో చోట పూరిస్తాడేమో బహుశా!

ప్రతి వేసవికి, ఉన్న నాలుగు మామిడిచెట్లూ కాపు రాగానే, సాంబయ్యను పిలిచి, కాయలు కొట్టించటం, భద్రంగా బుట్టల్లో పెట్టటం, లెక్క చూసి ఖచ్చితంగా ఒక్కో చెట్టు ఎన్ని కాయలిచ్చిందో చెప్పటం అతనికి రివాజు!

అది సరదా కూడా.

“అమ్మగారూ! మూలమీది చెట్టు, గతేడాది కంటే పాతిక కాయ తక్కువిచ్చిందమ్మా! ఏం లోపం చేశామో, ఏం కోపంవచ్చిందో జాగ్రత్తగా చూసుకోవాలి తల్లోయ్”, అనేవాడు, లెక్క ముగించి ఫలసాయపు వివరాలు చెప్తూ తులనాత్మక పరిశీలన, చేస్తూ!

కామేశ్వరమ్మ గారు నవ్వి ఊరుకునేవారు.

మర్నాడు, కాస్త కొత్త ఆవకాయ ఎక్కువ వేసి, ఝారీ మరింత వంచి, నేయి ఎక్కువ జార్చి, ఆప్యాయంగా వడ్డించేవారు.

మొదటినుంచి అతను ఇంట్లో వాడే!

వంటింట్లో మర్యాదపూర్వకంగా, పీట మీద కూర్చునే అతని భోజనం!

ఇదేమి వింత అన్నట్టే ఉండేది ఆ బంధం! ఎందుకు, ఎలా ఏర్పడ్డదో చెప్పలేం, అంతే!

ఏదో దైవికంగా ఉండేది ఆ నిసర్గమైన ఆదరణ భావం!

ఆ మామిడి చిగురంత లేతగా, ఆ పూతంత స్వచ్ఛంగా, ఆ కాపంత సమృధ్ధిగా, ఆ వృక్షరాజమంత నిండుగా!!

ఒక యేడాది, సాంబయ్య ఇట్లాగే కాయలు కోస్తున్నాడు.

బాగా పైనున్న కొమ్మ మీద కెక్కి, గడకర్రతో కాయను ఒడుపుగా బట్ట సంచిలో పడేట్టు చేసి కిందికి వంపితే, అవి కింద సీతాపతి పట్టుకోవటం, బస్తాలో వేయటం!

ఇదీ క్రమం.!

చివరి చెట్టు వరకు సజావుగా నడిచింది పైన కాయల కోతా, కింద చేతులతో పట్టడమూ!

చిట్టచివర్లో ఒక కాయ పైనుంచి కాస్త విసురుగా దులిపేటప్పటికి కిందకు వస్తూ, మధ్యలో ఒక కొమ్మకు తగిలి వేగంగా తన దారి మార్చి వచ్చి సీతాపతి ఎడమ కంటి పైన ఠపీమని తగిలి, కింద నేలమీద పడి పచ్చడి అయింది.

అంతా తృటిలో జరిగిపోయింది.

కన్ను, మొహం అంతా వాచి నాలుగు రోజులు సీతాపతి ఎంత బాధపడ్డాడో, ఆ ఇల్లాలు అంతకు నాల్గు రెట్లు తాను బాధపడింది, అంతా తన వల్లే జరిగిందంటూ!

ఆ నాల్గు రోజులు కూడా, శరీరంలో బాధ ఉన్నా, ఏమీ కానట్టే కంటికి ఒక కట్టు, కప్పు వేసుకుని మామూలుగా తిరిగాడు అతను, “ఒంటి కంటి రాకాసితో పెట్టుకోకండి, జాగ్రత్త”, అంటూ అందరినీ నవ్విస్తూ!

***

ఎదురింటి వారికి రెండు ఆవులు ఉండేవి, ఒకటి యమున, రెండోది భాగీరథి!

రెండూ పుష్కలంగా పాలిచ్చేవి, మామిడి నీడలో కూచునే సీతాపతి పల్కరింపులు, ఊసులు వాటితో, వాటిని చూసుకునే ఆ ఇంటి వాళ్ళతో!

ఎప్పుడైనా అవసరం పడితే, తానే వెళ్ళి కొట్టం అంతా శుభ్రం చేసి, పాల పని పూర్తి చేసి బావి దగ్గర కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని ముగించేవాడు కూడా!

అతనికి ఇది ఇష్టం, అది అయిష్టం అని ఏమీ ఉన్నట్టు అనిపించేది కాదు, చూసేవారికి!

ఏది చేసినా, ఆ పని మీద అంత శ్రద్ధ, చేసిన తరువాత, అంత నిర్లిప్తత!

రూపాయి డబ్బు తీసుకోడు, ఇంటివారు ఎంత బతిమాలినా!

ఒకసారి, వీరింటిలో దూడకి చిన్న ముల్లు గుచ్చుకుని, అది బాధ పడుతుంటే, ఆ తువ్వాయిని దగ్గర తీసి ఎంత మాలిమితో ఒడుపుగా ఆ ముల్లు తీసేసి, దాని బాధ పోగొట్టాడో! “డాక్టర్ ఎందుకమ్మా దీనికి, చిన్న ప్రాణానికి నెప్పి ఎక్కువైతుంది, వాళ్ళ పద్ధతికి”, అని వారించి మరీ!

ఆ అనునయించే మాట సరళికి, అవతలివారు అసలు కాదనలేరేమో అన్నట్టు ఉండేది ఆ ధోరణి!

***

అట్లాగే ఒకసారి కుంభవృష్టి కురుస్తుంటే, ఒక మేక పిల్ల రెండు దుంగల సందులో కాలు ఇరుక్కు పోయి నానా యాతన పడుతోంది, అందరూ వింటున్నవే దాని అరుపులు. కాలు బయట పెట్టటం దుర్భరమైన ఆ జడివానలో, సీతాపతి ఒక్కడే తలకు తుండు చుట్టేసుకుని వెళ్ళి, దాన్ని లాఘవంగా బయటకు తీసి, బ్రతికించాడు!

అతని గుండెలో ఎంత దయాగుణం గూడుకట్టుకుని ఉండేదో అని ఆర్ద్రమై పోయేది మనస్సు విన్న, చూసిన వారికి!

***

“వీడు, ఎవరో యోగి మన ఇంటికి వచ్చాడే, శ్యామలా”, అని కామేశ్వరమ్మ గారు కూతురితో అపుడపుడూ అనటం, అతనిలో ఇట్లాంటి, భూతదయ, ‘నిర్వికారత’, చూసేనేమో!

***

ఇక రాములవారి గుళ్ళో రామనవమి నాళ్ళలో, కామేశ్వరమ్మ గారు చెప్పించే పురాణంతో హాలు నిండిపోయేది.

ఆసాంతం, శ్రధ్ధగా విన్న సీతాపతే చివర్లో దక్షిణ పళ్ళెం పట్టడం.

భక్తి పూర్వకంగా రాములవారి సేవలో ఉన్న ఆంజనేయుడు తానే నన్న భావంతో, ఆ పని చేసి, ధర్మకర్త సీతారాముడు గారికి అప్పజెప్పేవాడు, సొమ్ముని.

ఆయన నవ్వుతూ పౌరాణికులు, పుష్పవనం శ్రీరామాచార్యులు గారికి అందించేవారు చివర్లో!

ఆ రోజు ఆచార్యులు వారు చెప్పింది, ఉత్తర రామాయణ ఘట్టం!

కంకంటి వారివి, భవభూతి ఉత్తర రామచరిత లోనివి మధ్య మధ్య ఉటంకిస్తూ సీతాదేవి కష్టానికి పాషాణమైనా కరిగే రీతిలో వ్రాసిన ఆ మహాకవుల వాణిని, వారు తమ శ్రావ్యమైన కంఠంతో పాడి వివరణ ఇచ్చారు.

సర్వ ప్రకృతే నివ్వెరపోయింది అన్నారు, అడవులలో విడిచి రావాలనే అన్నగారి ఆజ్ఞ లక్ష్మణుడు సీతాదేవికి చెప్పగానే! తృణాంకురాలు కొరుకుతున్న జింకలు ఆ పని మానివేసి, అట్టె నిలబడి పోయినై అని చెప్పారు.

కరుణ రసమే ఉప్పొంగి గంగానదిగా మారినట్టు వర్ణించి చెప్పారు!

లక్ష్మణా, నా ప్రభువుకు మాట రానీయను, ఆయనను అయినా సుఖంగా ఉండమను, అపవాద దూషిత అయిన నన్ను విడిచి, అని సీతమ్మ వెక్కివెక్కి ఏడ్చినట్లు చెప్పారు.

ఇక నా సంగతి వదిలేయ్ నాయనా, ఎట్లా అవ్వాలో అట్లా అవుతుంది, ఏదీ సహాయానికి రాకపోతే, ఎదురుగానే గంగ ఉన్నది కదా, ఆ తల్లి మాత్రం నిరాకరించదులే, నన్ను తనలో కలుపుకోవటానికి అని విషణ్ణవదనయై అంటే సౌమిత్రి మాట పెగలక, నిల్చుండిపోయాడని వివరించారు.

చివరికి,”అమ్మా, జానకీ దేవీ, సెలవు తల్లీ”, అని లక్ష్మణుడి రథం సాగిపోతుంటే, ఒంటరిగా, అసహాయయై, నిందితగా,

ఆ అడవిలో నుంచుని, ముందు రథ చక్రాలను, రథచక్రాలతో పై కెగసిన పరాగాన్ని, ఆ తరువాత కేతనాన్ని, చిట్టచివరకు ఖాళీ బయలును చూస్తూ నిలబడిపోయింది రామ పట్టమహిషి సీతామహాసాధ్వి యని సెలవిచ్చారు.

ఆ రోజు పురాణం అయిన అయిదు నిమిషాలు చీమ చిటుక్కమన్నా వినిపించేంత నిశ్శబ్దం, సుమారు 200 మంది కూచున్న ఆ ప్రాంగణంలో!

ఒక్కరు లేవలేదు. చివరికి ఆచార్యులు వారే మొదట తేరుకుని, “శ్రీమద్రమారమణ గోవిందో హరి.. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః” అని ఎలుగెత్తి అన్నారు!

అప్పుడు కాస్త అందరూ ఈ లోకం లోకి మళ్ళీ వచ్చినట్టై లేచి ఇళ్ళదారి పట్టారు, తీర్థప్రసాదాలు తీసుకుని!

అంతా అయిన తరువాత, గుడి బయటి తలుపులు తాళం వేసి, అర్చకుల వారికి ఇచ్చి, ఇంటికి మరలాడు, సీతాపతి, ఏదో దిగులుగా, మనస్సు ఎంతో కలత చెందిన వాడిలాగా!

***

అంతా అయిన నాలుగు రోజులకు,”చాలా కష్టపడ్డదమ్మా చాలా కష్టపడ్డది, ఆ తల్లి”అన్నాడు కామేశ్వరమ్మ గారితో, సీతాపతి, గద్గదికంగా!

సీతాదేవి గురించి అంటున్నాడని తెలిసిన ఆమె,”రాములవారూ సుఖ పడ్డది లేదురా నాయనా, రాజధర్మం, ప్రేమహృదయం- రెంటి మధ్య నలిగిపోయాడురా ఆ ధర్మ ప్రభువు” అన్నది సమాధానంగా!

అవునూ, కాదు అన్నట్టు తల ఊపి, కాస్సేపు మౌనంగా ఉండి, నెమ్మదిగా లేచి వెళ్ళిపోయాడు, మనస్వి, ఆంతరమౌని, సీతాపతి!

***

ఆ రోజు పగలంతా మామూలుగా తన పని పూర్తి చేసుకుని,సాయంకాలం జాజి పందిరి అంతా సరి జూసి,మొక్కలన్నిటికీ నీళ్ళు పోసి స్నానం చేసి వచ్చాడు.

రాత్రి  మేడపైన అమ్మగారి చేతి భోజనం పూర్తి చేసుకొని,”సరేనమ్మా వస్తాను”, అని తల్లికీ, అక్కడే ఉన్న శ్యామలాంబకూ చెప్పి, మెట్లు దిగి మామిడి చెట్టు నీడలో తన మంచం వాల్చుకుని పడుకోబోయాడు, సీతాపతి.

అంతలో మళ్ళీ పైకి వెళ్ళి, ఇద్దరితో “జాగ్రత్తమ్మా, జాగ్రత్త” అని రెండు సార్లు అస్పష్టంగా అని కిందికి వచ్చి పడుకున్నాడు.

ఏవిఁటీ, ఇవాళ ఈ వింత ప్రవర్తన అనుకున్నారు తల్లీ కూతుళ్ళు!

***

సీతాపతి, మామిడి కొమ్మల మధ్యగా కనిపిస్తున్న నిండు చంద్రుణ్ణి చూస్తూ పడుకున్నాడు.

ప్రతిదీ కనిపెట్టి చూసే కామేశ్వరమ్మ గారు, అర్ధరాత్రి పూట మధ్యలో ఒకసారి పై నుంచే చూశారు కూడా!

చేతులు పైకి ఎత్తి ,ఊపుతూ తనలో తనే, “ఆహాహా, ఎంత బాగున్నది, ఎంత గొప్ప, ఓహోహో” అని కింద పడుకున్న సీతాపతి సన్నగా అనుకోవడం విన్నారు కూడా!

సరే ఇది అతనికి మామూలే కదా, అనుకొని ఆమెగారు మళ్ళీ నిద్రలోకి జారుకున్నారు.

***

కింద, అతనూ నిద్ర లోకే జారుకున్నది, కానీ ఏ బ్రాహ్మీ ముహూర్త సమయానికో, ఎప్పుడు జారుకున్నాడో, కావిటినీళ్ళ సీతాపతి, శాశ్వత నిద్రలోకే జారుకున్నాడు.

తెల్లవారక ముందే ఠంచనుగా నిద్ర లేచే అతను, ఆ రోజు ఆ పని చేయలేకపోయాడు!

***

“ఏ భవానీ దేవి అతనికి ఏం చెప్పిందో, కాస్త ముందుగానే ఆ రాత్రి – మళ్ళీ మెట్లు ఎక్కి వచ్చి మరీ “జాగ్రత్తమ్మా, జాగ్రత్త” అని చెప్పి వెళ్ళాడు,” అని తెల్లవారగానే పూల కోసం కిందికి  వచ్చిన కామేశ్వరమ్మ గారు, ఇది చూసి అనుకున్నారు, పొంగి వస్తున్న దుఃఖం ఆపుకుంటూ!

శ్యామలాంబ నోట ఒక్క మాట రాలేదు, సీతాపతిని ఆ స్థితిలో చూసి!

***

“చిదానంద రూప శ్శివోహం శ్శివోహం” అంటూ రేడియోలో భక్తిరంజని గీతం గాలి తరగల పై తేలుతూ రాసాగింది.

వచ్చి, ఏదో బోధ చేసి మేల్కొలిపి వెళ్ళినట్టైంది, వారిద్దరికీ,ఆ క్షణంలో!

***

“కరుణ, పై నున్న నారాయణుడు ఒకటే రన్నా హరి మారు రూపే మనిషి ధర, వినరోరన్న!” అని సాగే ఎప్పుడో విన్న తత్వ గీతం ఆ రోజంతా, కామేశ్వరమ్మ గారి మదిలో మెదులుతూనే ఉంది!

సీతాపతి లాంటి వాళ్ళ గురించే నేమో ఇట్లాంటి మాటలు, పాటలు పుడ్తాయనీ ఆమె అనుకుంటూనే ఉన్నది, చాలా కాలం వరకు!

***

నెల రోజులు ఎక్కడికీ, ఏదో చెప్పలేని లోటుతో కామేశ్వరమ్మ గారు గుళ్ళోకి కూడా వెళ్ళలేదు.

ఆ రోజు పురాణం అయిన తరువాత, ఉండబట్టలేక, ఆచార్యుల వారిని అడిగిందామె,”అయ్యా ఇదేమి న్యాయం, చీమకు కూడా అపకారం చేయని సీతాపతిని ఇంత హఠాత్తుగా పట్టుకు పోవటం ఏమిటి, ఆకళింపు కావట్లేదు ఈ నిజం”, అని!

దానికి ఆయన నవ్వి, “అందరమూ మన ప్రారబ్ధాల సంచితో వస్తామమ్మా, ఈ భూమ్మీదకు. వాడు వాళ్ళమ్మ తాలూకు జ్ఞాపకాలు, ఆమె గారి భర్త ఆమెను పెట్టిన బాధలు చూసి చలించి పోయాడమ్మా చిన్నతనంలో! అమ్మంటే దైవమే వాడికి! ఆ దైవమే దుఃఖిస్తున్న దృశ్యాలు చిన్నప్పుడు చూసి చూసి ముద్రించుకుపోయినాయి, వాడి మదిలో! తరువాత వారిద్దరూ పోయాక ఈ ఊరొచ్చేసి ఊరివాడైపోయాడు!

మొన్న సీతాదేవి కష్టాల గాథ విని  ఆ పాతవన్నీ మదిలో మెదిలినట్టున్నాయి, కల్మషం లేని వాడు కావటంతో తట్టుకోలేక పోయాడు.

శుధ్ధ సత్త్వం అమ్మా వాడి గుణం!

అందరి పట్లా, అన్ని జీవుల పట్లా ‘దయ’ అనే గుణమే వాడిని నడిపించింది. తద్భిన్నమైనది వాడి సహజ ప్రకృతి తీసుకోలేదు, ఇముడ్చుకోలేదు, అంగీకరించదు. సీతాదేవీ, వాడికి స్వయంగా తెలిసి వాళ్ళమ్మా, పడిన బాధలకు – వాడి మనస్సు ఏ కోశానా సమాధాన పడలేక పోయింది.  ఆ దుఃఖమే లోపల ఉప్పెనై, వాడిని అకస్మాత్తుగా తీసికెళ్ళి పోయినట్టుంది, మనకి దూరంగా!

ఇది శారీరికం కాదు, ఏ డాక్టరుకీ అందేదీ కాదు! హృదయసంబంధి!

వాడిని ఆ దైవం, ‘ఇంక చాల్లేరా, వచ్చేయ్’, అన్నట్టున్నాడు, మనందరినీ వదిలి తరలి పోయాడు, ఆ పరమాత్మ లోకే,అంతే”,అన్నారు భారమైన గుండెతో!

ఇద్దరూ మౌనంగా ఇళ్ళ దారి పట్టారు, ఏ ఆలోచనా లేని, ఏదో గౌరవం భావంతో, కావిడి నీళ్ళ సీతాపతి పట్ల!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here