చిగుళ్ళను కోల్పోవడం..!

0
15

[శ్రీ గోపగాని రవీందర్ రచించిన ‘చిగుళ్ళను కోల్పోవడం..!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]రం[/dropcap]గమేదైన కానీవ్వండి
ఒకరు నిష్క్రమించడమంటే
కేవలం ఆ ఒక్కరిని మాత్రమే
కోల్పోవడం కాదు
ఆత్మీయమైన అనుబంధాల
చిగుళ్ళను కోల్పోవడమే..!

అతడు ఆకాంక్షించిన
స్వప్నాలను వదలకుండానే
ఆచరణకు పూనుకోవడం
అతడు సృష్టించిన
మానవీయమైన కట్టడాలను
అమోఘమైన రక్షణ కవచాలతో
కళ్ళ ముందు నిలుపుకోవడం
అతడు మనకందించిన
చైతన్యపు కాగడాలను ఆరిపోకుండా
అప్రమత్తంగా కాపాడుకోవడం..!

అతడు వదిలిపోయిన
అక్షరాల సృజనలే శాశ్వతం
అతని వినూత్నమైన వ్యక్తీకరణలు
క్రాంతి దారులను నిర్మిస్తాయి
అతని తేజోమయమమైన రచనలు
గుండె గూటిలో సేదతీరుతాయి
అతని తోనున్న జ్ఞాపకాలు
మార్గదర్శిలా దారి చూపుతాయి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here