చిగురు

0
9

[dropcap]ర[/dropcap]వి స్కూలు అయిపోయాక రోజూ తన స్నేహితులతో గంటా రెండు గంటలు స్కూలు మైదానంలో ఆడుకుని ఇంటికి చేరేవాడు. కానీ యివేళ ఎందుకో తొందరగా రావడమే కాకుండా, స్కూలు బ్యాగు ఓ పక్కన పడేసి తల్లి దగ్గరకు వచ్చి “అమ్మా! నువ్వు నాతో యిప్పుడే మా స్కూలు ఆటల మైదానానికి రావాలి” అని అడిగాడు.

“మీ స్కూలు మైదానానికి నేనెందుకు రావాలి? అది కూడా ఈ వేళలో. ఇంకా రాత్రి వంట కూడా చెయ్యాలిరా!” అని చెప్పినా రవి తల్లిని వదలకుండా తనతో రమ్మని మారాం చేస్తూనే వుండడంతో ఎందుకు యింత పట్టుదలగా వున్నాడో అని ఆలోచిస్తూ ఎందుకైనా మంచిదని తయారవుతూండగా అనుమానమొచ్చి రవితో “ఎవరితోనైనా ఆటల మైదానంలో గొడవపడ్డావా? నిన్ను ఎవరైనా కొట్టారా?” అని అడిగింది.

రవి వెంటనే “అలాంటిదేమీ జరగలేదమ్మా! నువ్వు వచ్చి చూస్తే నీకే తెలుస్తుంది” అన్నాడు. సీత రవితో “కనీసం కాళ్ళూ చేతులూ కడుక్కుని స్కూలు బట్టలైనా మార్చుకో” అంది. రవి మాత్రం “నువ్వు తొందరగా రా అమ్మా!” అని అలానే కూర్చుండిపోయాడు. చేసేదిలేక కాస్త కంగారు పడుతూనే రవితో పాటు బయలుదేరింది.

స్కూలు మైదానం చేరగానే రవి తల్లి చేయి లాగుతూ ఓ మూలకి తీసుకువెళ్ళి ఒక చిన్న చెట్టును చూడమన్నాడు. సీత రవి చెప్పిన వైపే చూశాక ఒక్క ఆకూలేని చిన్న చెట్టు కాండానికి చివరలో ఒక గుడ్డ ముడివేసి మూటలా వుండడం కనిపించింది. సీతకి కొడుకు ఏం చూడమంటున్నాడో అర్థం కాలేదు. ప్రశ్నార్దకంగా రవికేసి చూస్తూ “ఏం చూడాలిరా?” అని అడిగింది.

“ఆ గుడ్డమూటపై భాగంలో మట్టి కనిపిస్తోంది కదా! అక్కడ చూడు” అన్నాడు రవి.

సీత జాగ్రత్తగా ఆ మూటపై భాగంలో చూస్తే చిన్న చిన్న చిగుళ్ళు కనిపించాయి. చెట్టుకి అక్కడ నుంచి ఆకులూ కొమ్మలూ వచ్చేలా వున్నాయే అని మనసులో అనుకుంటూనే తళుక్కున ఈ పని తన కొడుకే చేశాడేమో అనిపించగానే “నువ్వే చెట్టుకి కట్టు కట్టావా?” అని అడిగింది. తల్లి ఆ ప్రశ్న అడగగానే రవి కళ్ళు మిలమిలా మెరిశాయి. వాడు తలూపుతూ “అవునమ్మా!” అన్నాడు.

సీత వాడి తల నిమురుతూ “నీకెలా ఈ ఆలోచన వచ్చిందిరా?” అడిగేసరికి రవి అమాయకంగా “నాకు ఆటల్లో చిన్న దెబ్బలు తగిలితే నువ్వు మందు రాసి కట్టుకడతావు కదా! ఈ చెట్టు పువ్వులు నాకెంతో ఇష్టం. కొద్ది రోజుల క్రితం ఎవరో విరిచేశారు. నేను గుడ్డతో మట్టిముద్ద కట్టి నీళ్లు రెండు మూడు సార్లు పోసాను.” అన్నాడు.

కళ్ళలో ఆనందం బాష్పాలు కారుతుంటే వాడి రెండు బుగ్గలమీద ముద్దులు పెడుతూ “చాలా మంచి పని చేశావు కన్నా” అని “ఈ చెట్టు మళ్ళీ పువ్వులు పూస్తుందిలే! పద యింటికి వెళ్దాం” అంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here