చిలకలు వాలని చెట్టు

0
14

[డా. చెంగల్వ రామలక్ష్మి రచించిన ‘చిలకలు వాలని చెట్టు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఇ[/dropcap]దివరకు దాదాపు నలభయ్యేళ్ళ క్రితం అనుకోండి, మా ఇల్లు అనే చెట్టు పచ్చగా ఎప్పుడూ కళకళ లాడుతువుండేది. అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు, అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు, ఆడపడుచులు, మరుదులు వాళ్ళ పిల్లల తరచూ రాక పోకలతో నిత్య వసంతంలా ఉండేది. పిల్లల ఆటపాటలు పక్షుల కిలకిలారావాల్లా మధుర గానంలా సమ్మోహన పరిచేవి.

శనాదివారాలు సెలవలు వచ్చాయంటే చాలు, బిల బిల వచ్చేసేవారు. పడుకోవటానికి ఇల్లు చాలదు, ఇబ్బంది ఇటువంటి ఆలోచనలే ఎప్పుడూ రాలేదు. ఇంతమందికి వంటెలా చెయ్యాలి అనే ఊహే రాలేదు. అందరూ తలో చెయ్యి వేసేసేవారు. కబుర్లతో ఎప్పుడు వండామో, ఎన్ని రకాలు చేసామో తెలియకుండా పని అయిపోయేది. అప్పుడు ఇన్ని రకాల టిఫిన్లెక్కడున్నాయి? బైట నుంచి తెచ్చుకునే స్తోమత లేదు. ఎప్పుడైనా ఒక్కసారి మగవాళ్ళు బైట నుంచి వేడి వేడి బజ్జీలు తెస్తే అదే పెద్ద సంబరం పిల్లలకి, పెద్దలకీను! అన్నంలో ఆవకాయ కలిపి పదిమంది పిల్లలకి తలో కాస్తా పెడితే అదే వాళ్ళకి పెద్ద విందు భోజనం! కలిసి తినటంలో ఆనందం అది! సెలవలయి వెళ్లేముందు పిల్లలందరికి తలో పది రూపాయలు చేతిలో పెడితే అదే అపురూపంగా చూసుకుంటూ, ఆ డబ్బుఎలా ఖర్చు చెయ్యాలో పెద్ద పెద్ద ప్రణాళికలు! ఆ లేమిలో అంత నిండుతనం! అంత మమత! అంత అనుబంధం!

పిల్లలంతా వదిన, బావ, అక్క వరసలతో పిలుచుకుంటూ కూర్చుని ఆడే ఆటలు, ఇంటి సందులో పరుగులు పెడుతూ ఆడే ఆటలలో తెలుగుతనం ఉట్టిపడేది. మా చిన్న ఇల్లొక పెద్ద కుటుంబమయిపోయేది. అక్క చెల్లెళ్ళు, ఆడపడుచులు మా వైపు వాళ్ళు, వాళ్ళ వాళ్ళు అనే తేడాలు లేకుండా కలిసిపోయేవారు. పెళ్లి అనేది ఇరు పక్షాల బంధువర్గాన్ని ఒకటి చేసే గొప్ప సందర్భం అని నేను ఎపుడూ నమ్ముతాను.

మాకేం లోటు, మాకింత మంది పిల్లలు, నా కడుపున పుట్టక పోతేనేం అని మురిసిపోయేదాన్ని. ఇప్పుడు ఆ పిల్లలంతా ఎదిగారు. పెళ్లిళ్లయి పిల్లలతో దేశాంతరాలలో, ఖండాంతరాలలో ఉన్నారు. పిల్లల ద్వారా తల్లిదండ్రులు ఎదిగారు. అక్క చెల్లెళ్ళు, ఆడపడుచులు ఆరు నెలలు విదేశాలలో, ఆరు నెలలలో స్వదేశంలో నివాసం చేస్తూ మనవల ముద్దు ముచ్చట్లు తలపోసుకుంటూ ఆనందంగా గడిపేస్తున్నారు. మేమూ పెద్దవాళ్ళమయిపోయాం. ఇప్పుడు మేం అనారోగ్యాలతో సావాసం చేస్తున్నాం. మానసికంగా క్రుంగిపోతూ, బాధకు గత జ్ఞాపకాల లేపనాన్ని పూస్తూ రోజులను నెడుతున్నాము.

అప్పుడు బస్సుల కోసం పడిగాపులు పడుతూ, ఆ రద్దీలో నిల్చుని, రైళ్లయితే జనరల్ బోగీలో సీటు లేకపోయినా అదో అవస్థ అనుకోకుండా, అందరం కలుస్తామనే ఆనందంతో మా ఇంటికి వచ్చేసేవారు. మేమూ అలాగే వాళ్ళ ఇళ్లకు వెళ్ళేవాళ్ళం. వాళ్ళింటికి మేమైనా, మా ఇంటికి వాళ్ళయినా, రిక్షా ఇంటి సందులోకి తిరుగుతుంటే పెదవులపై చిరు దరహాసం లాస్యం చేసేది. మనసు ఆనందంతో ముందే పరుగులెత్తేది. అప్పటి రోజుల ప్రయాణం ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. గగన కుసుమం అనుకున్న ఆకాశ వీధిలో ప్రయాణం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఒళ్ళు కందకుండా, చెమట చిందకుండా చల్లని ప్రయాణం సాధ్యం అవుతోంది. అయినా, ఇప్పుడు ఈ ఇంటికి ఎవరూ రాలేరు. ఇప్పుడిది వాళ్లకు ఇరుకు ఇల్లు. ఏ సౌకర్యాలు లేని పాత ఇల్లు. కళను కోల్పోయిన చెట్టులా ఈ ఇల్లు.

ఇల్లంటే నాలుగు గోడలు, తలుపులేనా! ఈ ఇంటికి ఒక మధురమైన చరిత్ర ఉంది. నలభై ఏళ్ల నాటి చెరిగిపోని జ్ఞాపకాలకు ఆనవాలు ఈ ఇల్లు! మరి, వాళ్ళు ఎప్పుడైనా కలుసుకున్నప్పుడైనా ఈ ఇంటి జ్ఞాపకాలను తలచుకుంటారా!

రెండు కాళ్ళు ఆపరేషన్‌తో నడవలేని, బైటకు వెళ్లలేని నేను, గుండె బలహీనంతో ఆయన ఈ నిశ్శబ్ద గృహంలో ఒంటరి పక్షుల్లా మేం ఇద్దరం! ఇప్పుడిది చిలకలు వాలని చెట్టు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here