స్త్రీ పురుష ప్రేమను ప్రాక్టికల్‌గా విశ్లేషించిన సినిమా ‘చిలకమ్మ చెప్పింది’

3
9

[dropcap]ప్ర[/dropcap]తి ఒక్కరికి భవిష్యత్తులో తమ జీవితంలోకి వచ్చే భాగస్వామిపై చాలా కలలు ఉంటాయి. ఇది స్త్రీ పురుషులిద్దరిలోనూ సహజంగా ఉండే లక్షణం, అయితే కుటుంబం వరకే పరిమితమైన స్త్రీలో ఆ లక్షణం ఇంకాస్త ఎక్కువ. తనకు రాబోయే జీవిత భాగస్వామి ఆధారంగానే తన భవిష్యత్తు ఉంటుందని అతని పైనే తన వ్యక్తిగత, సామాజిక, కుటుంబ ఎదుగుదల ఆధాపరపడి ఉంటుందనే ఆలోచనతోనే మనం సమాజంలో స్త్రీని ట్యూన్ చేస్తాం. అందుకే పెళ్ళి గురించి ఒప్పటి తరంలో ఆడపిల్లలు ఎన్నో ఊహలతో ఉండేవారు. రాబోయే భర్త ఒక హీరో అని ముందే ఊహించుకుంటారు. అమ్మాయి అదృష్టం అంతా మంచి భర్తపైనే ఆధారపడి ఉంటుందన్న నమ్మకంతోనే ఆడపిల్లలను పెంచేవారు ఈ దేశంలో తల్లి తండ్రులు. పేదరికం నుంచి, కష్టాలనుంచి పెళ్ళి మాత్రమే విముక్తి ఇస్తుందని అందుకని అలాంటి శక్తి సామర్ధ్యాలు ఉన్న భర్త రావాలని ఆడపిల్లలు కలలు కంటుంటారు. భర్తలో వారు కోరుకునే లక్షణాలు ఏంటి అంటే, అందగాడు, ఆర్థికంగా ఉన్న వాడూ సమర్థుడు, కార్యదక్షుడు. అంటే ఇప్పటి భాషలో చెప్పాలంటే DARING AND DASHING ఉన్నవాడే తన భర్త అవ్వాలని ప్రతి ఆడపిల్ల అనుకుంటూ ఉంటుంది. ఆ క్రమంలో ఆమె కలల రాకుమారుడిపై కొన్ని ఊహలు ఏర్పరుచుకుంటుంది.

అయితే ఈ లక్షణాలున్న వ్యక్తి పైకి ఎంత హుందాగా కనిపిస్తాడు అనుకుంటుంది స్త్రీ. అక్కడే మోసపోతుంది. జీవితంలో అన్ని సద్గుణాలున్న వ్యక్తి సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉండాల్సిన అవసరం లేదు. సమాజంలో మంచి పొజిషన్లో ఉన్నవాడికి మంచి లక్షణాలుండాలన్న నియమం లేదు. ఇది అర్థం కావాలంటే కొన్ని అనుభవాలు తప్పని సరి. అటువంటి అనుభవాన్ని ఇచ్చే సినిమా 1977లో వచ్చిన “చిలకమ్మ చెప్పింది”. 1969లో మళయాళంలో వచ్చిన అడిమకల్ అనే సినిమా అధారంగా తీసిన సినిమా ఇది. బాలచందర్ గారు తరవాత 1978లో నిజల్ నిజమాగిరధు అని తమిళంలో ఈ సినిమాను తీసారు. ఆ తరువాత ఇదే కథాంశంతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ‘పదహారేళ్ళ వయసు’ కూడా ఇంచుమించి ఇదే కాన్సెప్ట్‌తో తీసారు కాని ‘చిలకమ్మ చెప్పింది’ సినిమా ఈ సమస్యను విస్తారంగా చర్చించినట్లు ‘పదహారేళ్ళ వయసు’ చర్చించలేదు. ‘చిలకమ్మ చెప్పింది’లో రెండు రకాల స్త్రీలను చూస్తాం. భర్తలో హీరోయిజం ఉండాలని కలలు కని, వాస్తవికతను మరచి, మోసపోయే ఒక స్త్రీ మల్లి అయితే, జీవితంలో జరిగిన ఒక ఘటన ఆధారంగా పురుషులందరినీ ద్వేషించి తనలోని సహజ ప్రేమను కోరికలను ఆ ద్వేషం చాటున దాచుకుని జీవితాన్ని సమస్యల మయం చేసుకునే మరో స్త్రీ భారతి. ఇద్దరూ కూడా తమ ఆలోచనా ధోరణితోనే జీవితంలో ఇబ్బంది పడతారు. ఇద్దరివి భిన్న అనుభవాలు. అయితే ఈ రెండు సమస్యలను ఒకే ప్రేమ్ మీద ఈ సినిమా చాలా గొప్పగా చూపించింది. అందుకే ‘పదహారేళ్ళ వయసు’ సినిమా కన్నా కూడా ఇది స్త్రీ మనసును, ఆమెలోని సంఘర్షణను ఇంకా గొప్పగా చూపిన సినిమా అని చెప్పగలను. కాని ఇప్పటి తరానికి ‘పదహారేళ్ళ వయసు’ సినిమా గుర్తున్నట్లు ఈ సినిమా గుర్తులేదు. అందుకే ‘చిలకమ్మ చెప్పింది’ సినిమాను ఈ రోజు పరిచయం చేస్తున్నాను

మల్లి పేద ఇంటి ఆడపిల్ల. తండ్రి లేడు. ఒక చెల్లెలు. పెళ్ళి గురించి ఆమెకు ఎన్నో ఊహలు. అందంగా ఉంటుంది కాబట్టి చక్కగా అలంకరించుకోవాలను ఆమె కోరిక. తల్లి తన స్థాయిలో అయినా అబ్బాయిని చూసి పెళ్ళి చేసే శక్తి కూడా లేని అశక్తురాలు. చిలక జోస్యం చెప్పించుకుంటే మల్లికి స్థాన మార్పు ఉంటుందని, పెద్ద అందగాడు యోగ్యుడు కోరి ఆమెను వివాహం చేసుకుంటాడని చిలక చెబుతుంది. దాంతో తనకో అందమైన భవిష్యత్తు ఉందని, ఒక రాకుమారుడు తన కోసం వేచి చూస్తున్నాడని బలంగా నమ్ముతుంది మల్లి. మల్లి తండ్రి స్నేహితుడు ఆ కుటుంబం ఇబ్బంది గమనించి మల్లిని పట్నంలో భారతి అనే ఒక డాన్స్ టీచర్ ఇంట్లో పనికి పెడతాడు. తనకు పెళ్ళి సంబంధం చూస్తున్నారని ఆశపడే మల్లికి తల్లి తమ పరిస్థితి వివరిస్తూ, పట్నంలో కనీసం మంచి తిండి దొరుకుతుందని అందుకని ఆమెను పనికి పంపడం తప్పట్లేదని చెబుతుంది. మల్లికి ఇది నిరాశ కలిగించినా పట్నం వాతావరణం సంతోషం కలిగిస్తుంది. భారతికి మధు అనే తమ్ముడు ఉంటాడు. అందగాడు మంచి ఉద్యోగి. మల్లి లోని అమాయకత్వం మధుని ఆకర్షిస్తుంది. ఆమెను శారీరికంగా లొంగదీసుకుంటాడు. అతనిలో తన కలల రాకుమారుడు కనిపించి మల్లి కూడా అతని మత్తులో పడిపోతుంది.

అదే ఇంట్లో కాశిపతి అనే ఒక చెవిటి పనివాడు ఉంటాడు. అతను మల్లిని చాలా ఇష్టపడతాడు. తన గుండెపై ఆమె పేరు పచ్చ బొట్టు పొడిపించుకుంటాడు. మల్లిని సంతోష పెట్టడానికి ఏదైనా చేయడానికి సిద్ధం అన్నట్లున్న అతను మల్లిని ఆకర్షించలేకపోతాడు. మధు ఆకర్షణలో పడి కొట్టుకుంటున్న మల్లికి కాశి ఒక మనిషిగా కూడా కనిపించడు. గర్భవతి అయిన మల్లిని స్వీకరించడానికి మధు సిద్దపడడు. భారతికి సంగతి తెలియక మల్లిని ఊరు పంపించేయాలనుకుంటుంది.

రవి, మధు స్నేహితుడు. మంచివాడు, సూటిగా మాట్లాడే తత్వం ఉన్నవాడు. అతను మొదటి సారి ఇంటికి వచ్చినప్పుడు భారతి అతని చొరవను అసహ్యించుకుంటుంది. ఆమె జీవితంలో అంతకు ముందు చూసిన మగవారి కారణంగా ఆమెకు మగవారంటేనే అసహ్యం. అందుకే పెళ్ళి కూడా చేసుకోకూడదనుకుంటుంది. కనిపించిన ప్రతి మగవాణ్ణి అనుమానంగా చూడడం ఆమె నైజం. రవిని ఆమె ఇష్టపడ్డా అతన్ని ఒక దుర్మార్గుడిగానే చూడటం అలవాటు చేసుకుంటుంది. మల్లి గర్బానికి రవికి సంబంధం ఉందని కూడా అనుకుంటుంది. మల్లి ఊరికి వెళ్ళడానికి ఇష్టపడకపోతే రవి ఆమెకు ఒక చిన్న ఇల్లు చూసి కాశిని ఆమె బాగోగులు చూసుకొమ్మని చెబుతాడు. కాశి మల్లిని ప్రేమించాడని రవికి తెలుసు. అతని వద్దే ఆమె సురక్షితంగా ఉంటుందని నమ్ముతాడు. కాశి మల్లి కోసం అందరిని వదిలి ఆమె సౌకర్యంగా ఉండాలని కష్టపడుతూ ఉంటాడు. ఆమెను తప్పు దృష్టితో చూసే వారిపై గొడవకు దిగుతాదు. తల్లిని మందలించి మల్లికి రక్షణగా నిలుస్తాడు. మల్లిని ప్రతి క్షణం కాపాడుతూ ఉంటాడు. మల్లికి ఒక కొడుకు పుడితే ఆ ఇద్దరి కోసం ఇంకా కష్టపడతాడు కాశి. అంతే కాక మధుని కలిసి మల్లి గురించి ఆమె బిడ్డ గురించి చెబుతూ అతన్ని మార్చే ప్రయత్నం కూడా చేస్తాడు. తాను అవమానాలు పడతాడు కాని మల్లిని మాత్రం కంటికి రెప్పలా కాపాడుతాడు.

చివరకు రవి చొరవతో మధు తాను మల్లి బిడ్డకు తండ్రిని అని అంగీకరిస్తాడు. భారతీ కూడా ఆశ్చర్యపోతుంది. అప్పటిదాకా రవి ఆ గర్భానికి కారణం అనుకున్న ఆమె తన తమ్ముడే ఈ పని చేసాడని తెలిసి బాధపడుతుంది. రవి మధుని, భారతిని తీసుకుని మల్లి దగ్గరకు వెళతాడు. తాను మల్లిని స్వీకరిస్తానని మధు చెప్పినప్పుడు మల్లి దానికి ఒప్పుకోదు. తనను అన్ని బాధలలో ఆదుకున్న కాశితోనే తాను ఉండిపోతానని. ఆ తళుకు బెళుకుల జీవితంలోని మోసానికి తాను ఇక లోంగనని చెప్పి కాశి ప్రేమను అంగీకరించి మధుని అందరి సమక్షంలో నిరాకరిస్తుంది మల్లి. ఆ నిర్ణయాన్ని రవి సమర్థిస్తాడు కూడా. ఎవరి వల్ల గర్బం దాలిస్తే అతన్ని వరించడమే తప్ప మరోరకంగా స్త్రీ జీవించడం సాధ్యం కానది చెప్పే ఆ రోజుల్లో ఈ సినిమా లో మల్లి నిర్ణయం చాలా గొప్పగా అనిపిస్తుంది.

ఇక భారతి తన లోని అహాన్ని, అపోహలను అధిగమించి, ప్రేమించిన వ్యక్తిని కోరుకుని అతనికి తనను తానుగా ఇచ్చుకోవడం ప్రేమను గౌరవించడం అనే విషయాన్ని అర్థం చేసుకుంటుంది. పురుషులందరూ స్వార్థపరులు కారని, వ్యక్తులను విడిగా చూడాలి తప్ప ఒకరు చేసిన తప్పుతో మొత్తం జాతిని ద్వేషించడం తప్పని తెలుసుకుని తన ప్రేమను ఒప్పుకుని రవిని భర్తగా స్వీకరిస్తుంది. అంతులేని కోరికలతో కలలతో జీవితంలోని వాస్తవాన్ని చూడలేని మల్లి సాధారణ స్త్రీ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తే, చదువుకుని, ఆర్థికంగా ఎవరిమీద ఆధారపడక్కరలేని స్థితికి చేరుకుని వివాహం అంటే పురుషుని అహానికి తల వంచడం అనే భావజాలంతో ప్రేమను సహజంగా అంగీకరించలేని భారతి ఆధునిక స్త్రీకి ప్రతిరూపం. ఇద్దరి దారులు కూడా పరిపక్వత లేని ఆలోచనలతో వారిని ఒంటరిని చేసేవే. మల్లి పురుషునిలో గుణాన్ని అతని వ్యక్తిత్వం ఆధారంగా నిర్ధారించుకుని సమజంలోని జిలుగుల లోనించి మనుష్యులను చూసి ఎంచడం తప్పని తెలుసుకుంటుంది. అలాగే ఒక అనుభవం ఆధారంగా అందరినీ ద్వేషించి స్త్రీ సహజమైన సున్నితత్వానికి దూరం కావడం తప్పని భారతి అర్థం చేసుకుంటుంది. ఈ రెండు భిన్న దృవాల స్త్రీల మనస్తత్వాన్ని ఒకే సినిమాలో చూపించగలిగారు దర్శకులు. తరువాత ఎన్ని సినిమాలు వచ్చినా ఇలాంటి కాంబినేషన్‌తో వచ్చినవి కనపడవు.

ఈ సినిమాకు దర్శకుడు ఈరంకి శర్మ. మంచి చిత్రాలను తెలుగులో తీసిన వ్యక్తి. ఆయన. వీరి గురించి కూడా ప్రస్తుత తరానికి తెలిసింది చాలా తక్కువ. 1978లో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ మన దేశంలో జరిగినప్పుడు ఈ సినిమాను ప్రదర్శించారు. ఎమ్.ఎస్. విశ్వనాధన్ చక్కని సంగీతం అందించారు. మల్లిగా శ్రీప్రియ, భారతిగా సంగీత, కాశిగా నారాయణరావు, మధుగా లక్ష్మీకాంత్ నటించారు. ఒక అతిథి పాత్రలో పి.యల్. నారాయణ గారు కూడా కనిపిస్తారు. ఈ సినిమా పాటలు అప్పట్లో మంచి ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు అవి వినిపించట్లేదు కాని ఆత్రేయ, వేటూరి గారి సాహిత్యం తెలుగు ప్రేమికులను ఆకట్టుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here