కాజాల్లాంటి బాజాలు-116: చింకిచేటమొహం మిస్.

5
7

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఈ[/dropcap]మధ్య కొన్ని కథల్లోనూ, సినిమాల్లోనూ కాలంతో ప్రయాణించడమనే ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఒక గొప్ప సైంటిస్ట్ కాలంతోపాటు ముందుకీ, వెనక్కీ నడిచే మెషిన్ లాంటిది కనిపెట్టడం, అందులో ప్రయాణించి ఆ కథలోనూ, సినిమాలోనూ పాత్రలు వారికి కావల్సిన కాలానికి వెళ్ళిపోవడం, అలా వెళ్ళడం వలన వాళ్లకి కలిగిన అనుభవాలన్నీ చాలా ఆకర్షణీయంగా చిత్రించి చూపిస్తుంటే నిజంగా అలా కాలంతో ప్రయాణిస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన వచ్చింది.

ఆలోచన వస్తే సరిపోదుకదా.. దానికి కావల్సిన టైమ్ మెషిన్ కావద్దూ! అదెక్కడుంటుందో.. అంత గొప్ప సైంటిస్ట్‌ని ఎలా పట్టుకోవాలో, అందుకోసం ఎన్ని లక్షలూ కోట్లూ ఖర్చవుతాయో అనుకుని నీరసపడిపోయేను. కానీ మళ్ళీ అంతలోనే నాకు నేనే నచ్చ చెప్పుకున్నాను. నిజంగా టైమ్ మెషిన్‌లో ప్రయాణిస్తే కదా ఖర్చయేదీ! నా ఊహల్లో నేను కాలంతో ముందుకీ, వెనక్కీ వెళ్ళొచ్చు కదా.. కాణీ ఖర్చుండదు.. ఆహా.. ఎంత గొప్ప ఆలోచన.. నన్ను నేనే మెచ్చేసుకుని ఎటు వెడదామా అనే ఆలోచనలో పడిపోయేను.

మొన్న చూసిన ఒక సినిమాలో హీరో టైమ్ మెషిన్‌లో కాలంతో పాటు వెనక్కి తన చిన్నతనాని కెళ్ళిపోయి వాళ్ల అమ్మని మళ్ళీ చూసుకుని తెగ సంబరపడిపోతాడు. నన్ను కూడా ఆ మధ్యన ఎవరో అడిగినట్టు గుర్తు.. ‘మీ చిన్నతనం మళ్ళీ వస్తే మీరేం చేస్తారూ’ అని. అప్పుడు ఆలోచించలేదు కానీ ఇప్పుడు నెమ్మదిగా ఆలోచిస్తుంటే మళ్ళీ నా చిన్నతనాని కెళ్ళి అప్పుడు చెయ్యలేని పనులు ఇప్పుడు చేసేసినట్టు అనుకుంటే.. అనిపించింది. అలా అనిపించిందే ఆలస్యం.. ఇప్పటికీ బాగా గుర్తుండిపోయిన చిన్నప్పటి సంఘటనలు ఏమిటా అని గుర్తు చేసుకుంటూంటే మెరుపులా గుర్తొచ్చింది ‘చింకిచేటమొహం మిస్’. హ. అవును.. నా కోపం, కసీ తీర్చుకుందుకు ఆవిడకి నేను పెట్టుకున్న పేరు ‘చింకిచేటమొహం మిస్’. ఎందుకంటే తనకి నచ్చని వాళ్ళెవరి గురించైనా చెప్పాలనుకున్నప్పుడు మా పెద్దమ్మగారు ‘ఆ చింకిచేటమొహందీ..’ అనేవారు. అందుకే నాకు నచ్చని ఆ టీచర్‌కి ఆ పేరే పెట్టేసుకున్నాను. నేను చదివిన ఆ స్కూల్లో టీచర్స్‌ని ‘మిస్’ అనేవారు. అందుకని నా తప్పు లేకుండా నాకు శిక్ష వేసిన ఆ టీచర్‌కి నేను ‘చింకిచేటమొహం మిస్’ అని పేరు పెట్టేసుకున్నాను.

అసలు జరిగిందేంటంటే అప్పుడు నేను ఆరో క్లాసు చదువుతున్నాను. ఆ ‘చింకిచేటమొహం మిస్’ మాకు ఇంగ్లీషు చెప్పేవారు. ఆ స్కూల్లో ఇంగ్లీషుకి టెక్స్ట్ బుక్‌తో పాటు గ్రామర్ బాగా రావడానికి వర్క్ బుక్ అని కూడా ఉండేది. ఆ వర్క్ బుక్ వారానికో రోజు క్లాసులోనే ఆన్సర్ చెయ్యాలి. ఇంటికి పట్టికెళ్ళకూడదు. అలాగే ఆరోజు కూడా అందరం వర్క్ బుక్‌లో ఒక ఎక్సర్ సైజు క్లాసులోనే ఆన్సరు చేసి, పుస్తకాలన్నీ టీచరు ముందు టేబుల్ మీద పెట్టేసాం. ఆ తర్వాత వారం టీచరు అవన్నీ దిద్ది, ఎవరికి ఎన్ని మార్కు లొచ్చాయో చెపుతూ స్టూడెంట్స్‌కి ఆ పుస్తకాలు ఇచ్చేవారు. అలా ఇస్తున్నప్పుడు ఏమయిందో మరి నా పుస్తకం రాలేదు. దాంతో టీచర్ నేను పుస్తకం ఇంటికి తీసికెళ్ళేనని నా మీద అభాండం వేసింది. క్లాసులో ఇచ్చిన పుస్తకాన్ని ఇంటికి ఎందుకు తీసికెడతానంటాను, నేను. ఇంటికి తీసికెళ్ళి అన్నీ కరెక్ట్ జవాబులు రాసి తీసుకురావడానికని ఆ ‘చింకిచేటమొహం మిస్’ నామీద చెయ్యని నేరం మోపింది. నేనూరుకోకుండా పుస్తకం ఆవిడే ఎక్కడో పడేసేరని నేనూ గట్టిగానే అన్నాను..

నా ఎదురు సమాధానానికి ఆ ‘చింకిచేటమొహం మిస్’కి కోపం వచ్చి నాకు పనిష్మెంటు ఇచ్చింది. ఆ స్కూల్లో పనిష్మెంటు అంటే ఏంటంటే క్లాసయ్యేదాకా క్లాసు బయట వరండాలో నిలబడడం. టీచర్ నన్ను అలాగే క్లాసులోంచి బైటకి పంపేసింది. బైటకి పంపినందుకు నాకేం బాధ లేదు కానీ అలా వరండాలో నిల్చుంటే మొత్తం స్కూల్లో ఉన్న క్లాసుల్లో వాళ్ళందరికీ మనం స్పష్టంగా కనపడతాం. అలా కనపడితే మనమేదో ఘోరమైన తప్పు చేస్తే టీచర్ మనని శిక్షించిందని స్కూల్ మొత్తం అనుకుంటారు కదా! హెంత అవమానం. నా తప్పు లేకుండా అందరిముందూ దోషిలా నిలబడాలా! అయినా తప్పదుకదా!

బైటకెళ్ళి నిలబడ్డాను. నాకు కడుపు ఉడికిపోతోంది. దుఃఖం ఉబికుబికి వచ్చేస్తోంది. ఇంక రేపట్నించి ఈ స్కూల్లో పిల్లలందరూ నన్ను చూసి నవ్వుకుంటారని తల్చుకుంటేనే నాకు ఏడుపొచ్చేస్తోంది. నాకు తల తీసికెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో తెలీలేదు.

నిమిషం గడిచింది క్లాసు వైపు చూసాను. తలవంచుకుని దీక్షగా రాస్తున్నారు అమ్మాయిలు. బెంచీల మధ్యగా తిరుగుతూ వాళ్ళని పర్యవేక్షిస్తోంది ‘చింకిచేటమొహం మిస్’. నెమ్మదిగా ఆవిడ కళ్ళపడకుండా గోడవైపు జరిగాను. అలా గోడవైపే ఉండి నక్కుతూ బిల్డింగ్ దాటి కాంపౌండ్ వాల్ వైపు వచ్చేసేను. అక్కడ గేట్ కీపర్ గేటు మూసేసి, ఎవరూ బైటకి వెళ్ళకుండా అక్కడే స్టూల్ మీద కూర్చుని కాపలా కాస్తున్నాడు. స్కూల్ ముగిసి, లాంగ్ బెల్ కొడితే కానీ వాడు గేటు తియ్యడు.. చీమనైనా ఇట్నించటూ, అట్నించిటూ వెళ్ళనీయడు. ఏం చెయ్యాలా అని ఆలోచించి, ఒక్క గెంతున కాంపౌండ్ వాల్ ఎక్కేసి, బైటకి దూకేసి, పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చేసాను. నిఝం.. అలాగే వచ్చేసాను

ఇంటి కొచ్చి నేనింక ఆ స్కూల్‌కి వెళ్ళనని ఖచ్చితంగా చెప్పేసాను.మా అమ్మగారు కోప్పడ్డారు. మా నాన్నగారు నచ్చచెప్పారు. అలా రెండువారాలు గడిచాక నా అదృష్టం బాగుండి మా నాన్నగారికి వేరే ఊరు బదిలీ అయింది. మళ్ళీ ఆ స్కూల్ మొహం చూడలేదు నేను. క్లాసులో వదిలేసిన నా పుస్తకాల బేగ్ ఆ మర్నాడు నా ఫ్రెండ్ మా ఇంటికి తెచ్చిచ్చింది.

ఇంతకీ ఈ విషయమంతా ఎందుకు చెపుతున్నానంటే ఇప్పుడు కనక నేను టైమ్ మెషిన్‌లో ప్రయాణం చేసి ఆ కాలానికి వెడితే, ఆ ‘చింకిచేటమొహం మిస్’ అలా నాకు పనిష్మెంట్ ఇస్తే, నేను అలా గోడ దూకి ఇంటికి వచ్చెయ్యకుండా ఆ ‘చింకిచేటమొహం మిస్’ ని ఏం చెయ్యాలీ.. అని.

రెండుమూడు రకాల ఆలోచనలొచ్చేయి కానీ అందులో ఒకటి నాకు బాగా నచ్చేసింది. అదేంటంటే నన్ను ‘చింకిచేటమొహం మిస్’ అలా బైటకి వెళ్ళి నిలబడ మనగానే నేను ఆవిడ టేబుల్ దగ్గరికి వెళ్ళి, రెండు చేతులూ నడుం మీద పెట్టుకుని, సూటిగా ఆవిడ కళ్ళలోకి చూస్తూ, ‘చింకిచేటమొహందానా.. పుస్తకం నువ్వెక్కడో పడేసి నన్ను బైటకెళ్ళమంటావేంటే.. రాక్షసీ, వెళ్ళు నువ్వే వెళ్ళు. వెళ్ళి బైట నిలబడు. స్కూలంతా నిన్ను చూసి నవ్వుతుంటే నేనెంచక్క చప్పట్లు కొడతాను..” అనేస్తానన్న మాట.

అబ్బ.. తల్చుకుంటేనే ఎంత బాగుందీ.. ఆనందం పొంగుకొచ్చేస్తోంది. నిజంగా అలా జరిగినా జరక్కపోయినా ఆ ఊహే ఎంత సంతోషాన్నిస్తోందో.. నా మనసు దూదిపింజంత తేలికైపోయింది.

చూసేరా.. మనం లక్షలూ, కోట్లూ ఖర్చు పెట్టి టైమ్ మెషిన్‌లో ప్రయాణం చెయ్యక్కర్లేదు. మన ఊహల్లో, ఆలోచనల్లో మనం నిజాయితీగా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో! మీరూ ప్రయత్నించండి మరి!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here