భావ సాంద్రత నిండిన కవితలు ‘చిన్నీలు’

0
10

[dropcap]శ్రీ[/dropcap]మతి లలితా భాస్కరదేవ్ వృత్తిరీత్యా న్యాయవాది. ప్రవృత్తి రీత్యా కవయిత్రి. సాహితీ రంగంలో ప్రవేశం ఉన్నా, మలి అడుగు ఆలస్యంగా వేసినా ఆవిడ కవిత్వంలో విశేష ప్రతిభ కనబరిచారు. సాహిత్య సమూహాలలో సభ్యురాలిగా చేరి తమ అభివ్యక్తికి మెరుగులు దిద్దుకున్నారు. సిరికోన వాక్‌స్థలి సమూహంలో – బృందంలోని వారు తాము రచించిన మినీ కవితలను పంచుకుంటున్నప్పుడు తట్టిన ఆలోచనతో ‘చిన్నీలు’ పేరిట ఆవిర్భవించిన కవితలు ఇవి. సరళమైన భాషలో అలతి పదాలతో అల్లిన కవితలివి. కవయిత్రి తమ ముగ్గురు పిల్లలకు కానుకగా ఇచ్చిన చిరు పొత్తం ఇది.

***

ఈ పుస్తకానికి వ్రాసిన ‘ముందుమాట’లో – “చిన్ని చిన్న మాటలతోనే చక్కని భావ సాంద్రత పలికిస్తారు. చాలా వాటిల్లో తాత్త్వికత ఒదిగి ఉన్నట్లుంది.” అని వ్యాఖ్యానించారు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ. “వీటిని కేవలం కవితల కోసం చూడకండి… ఓ తల్లి మనసు, బిడ్డ కిచ్చే అక్షరోపాయనంలో పొందే ఆనందం కోసం చూడండి..” అన్నారాయన.

***

“లలితకుమారి గారి కవితల్లో వాస్తవికత పెనవేసుకుని ఉండటం, ఒక గంభీరతత్వం అల్లుకుని ఉండటం మనం గమనించవచ్చు” అన్నారు శ్రీ విశ్వర్షి వాసిలి తమ ముందుమాట ‘గువ్వకబుర్ల లలితకవితలు’లో. “ఇటువంటి చిట్టిపొట్టి కవితలను గురించి ఎక్కువ వస్తువివేచన చేయకుంటేనే మేలు… వాటి గట్టితనం అంత చిక్కగానూ ఆసక్తిగల పఠితలకు అందుతుంది” అని పేర్కొన్నారు.

***

కలిమి కలిగినప్పుడే అందరూ వెంట ఉంటారనీ, సంపద మాయమైనప్పుడు మాయమవుతారనే సూక్తిని ‘వెలుగులో ఉన్నప్పుడే తోడెవరైనా/చీకటి పడ్డదా దరిచేరదు నీ నీడైనా’ అనే పదాలలో చెప్తారు కవయిత్రి. ‘వెలుగుతూ వెలుగు పంచుతూన్నప్పుడే ఏ బ్రతుకైనా’ గొప్పది అంటారు.

ఏదైనా మన వద్ద ఉన్నప్పుడు వాటి విలువని గుర్తించమనీ, పోగొట్టుకున్నాకా వాటి విలువ తెలుస్తుందని చెప్తారు – ‘ఉన్నప్పుడు తెలియదు/అమ్మ ఒడి విలువ/చదువుకొంటున్నప్పుడు తెలియదు బడి విలువ’ అంటారో కవితలో.

భజనపరులూ, స్థితిమంతులదే సమాజంలో రాజ్యం అంటారు ‘చెక్క భజన చేతకాని వారు/చెక్కు బుక్కు లేని వారు/చుక్కలు లెక్కపెడుతూ/చెక్కర్లు కొట్టాల్సిందే’ అనే కవితలో.

తాటి చెట్టు గురించి అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు ఓ కవితలో. దాని గొప్పతనాన్నీ, నిరుపయోగాన్నీ నాలుగు పాదాలలో చక్కగా చెప్పారు – ‘తాటి చెట్టు ఎంత గొప్పది/అంత ఎత్తు ఎదిగినందుకు/తాటి చెట్టు ఎంత చిన్నది/ఇంత నీడ ఇవ్వనందుకు’ అనే కవితలో.

జీవితంలో మనకెలాంటి ఘటనలు ఎదురవుతాయో, ఎలా నడుచుకోవాలో – ‘వద్దన్నా వదలనివి ఎన్నో/వదుల్చుకోవలసినవి మరి ఎన్నో/వదలి వదలక వున్నవి ఎన్నో/వద్దు వద్దన్నా వెంట పడేవి మరెన్నో’ అన్న కవితలో చెప్తారు.

‘అన్నీ తెలిసినా/ఏమీ తెలియని వాళ్ళం/ఏమీ తెలియనితనాన్ని ఒప్పుకోక/అన్నీ తెలుస నుకునేవాళ్ళం!’ అంటూ మానవ స్వభావాన్ని అద్భుతంగా వివరిస్తారీ కవితలో.

జ్ఞానమెంతున్నా, మౌలికమైన బుద్ధులను మాత్రం మార్చుకోలేం అని అంటారు – ‘భాష్యాలకు భాష్యం చెప్పగలం/భావాలకు అర్థం తెలుసులేం/బుర్ర బద్దలు కొట్టుకున్నా/బుద్ధులు మార్చుకోలేం’ అనే కవితలో.

‘ప్రపంచమే ఒక మాయాబజారు/అన్నీ చూసేవో బహు బేజారు/కొన్నిటికి కావాలి తరాజు/అన్నింటికీ వుంటుంది ఒక రివాజు’ అనే కవితలో మార్కెట్ మాయాజాలంలో పడవద్దని, విచక్షణ ఉపయోగించమని సూచిస్తారు.

వస్తు వ్యామోహంలో పడద్దని చెబుతూ – ‘కనిపించేవన్నీ కొనలేము/కొన్నవాటి మీద మోజు లేదు/లేని దాని చింత వద్దు/ఉన్నదాన్ని ఉద్ధరించు’ అంటారు. అర్థం చేసుకోగలిగితే గొప్ప నీతి ఉందీ కవితలో.

ఎంత ఎదిగినా మన అస్తిత్వాన్ని కోల్పోకూడదంటారు – ‘నువ్వొక బిందువు/బిందువై విస్తరిస్తూ బింబమై పోయావు/నీ బింబమే ప్రతిబింబమై పరిణామం/చెందుతుంటే పరిణామ వికర్షణలో నువ్వే/కనిపించనంత/నీ అస్తిత్వాన్ని కోల్పోకు’ అనే కవితలో.

మారే విలువలని బట్టి మనం కాలం మారిందనుకుంటామని చెపుతూ ‘కాలమెపుడు మంచిదే/కాకుంటే విలువలే మారుతుంట/విషయ మెపుడు విపణి వీధిలోనే/మంచి చెడుల గోల ఎవరికంట’ అంటారు.

‘భావాలు మారిపోతున్నాయి/భేషజాలు పెరుగుతున్నాయి/బ్రతుకు అర్థాలు వ్యర్థ మవుతుంటే/అనుబంధాల మాటెక్కడ’ అనే ఈ కవితలో మనుషుల మధ్య అనుబంధాలు ఎందుకు లోపిస్తున్నారో వివరిస్తారు.

కలిమి లేములు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయనీ, కలిమి కలిగినాడు గర్వించకూడదని, లేమిలో క్రుంగిపోకూడదని అంటారు – ‘కలిమి కొలిమిలో దిగినా/చెలిమి విలువను మరువకు/కలిమి లేములు ఎప్పుడూ కలిసినది లేదు/కొలచి చూసిన నిలిచినది లేదు!’ అనే కవితలో.

మధ్య తరగతి ప్రజల జీవితాలలోని సంఘర్షణకు – ‘మంచిగా వుండ లేక/చెడ్డగా బ్రతక లేక/వున్నది చెప్పలేక/కాలం హరణం చేసే/జీవచ్ఛవాలు ఎందరో’ అనే ఈ కవిత అద్దం పడుతుంది.

మనకి తెలిసింది గోరంత, తెలుసుకోవాల్సింది కొండంత అనే నానుడిని – ‘ఏమీ తెలియనంత కాలం/అన్నీ తెలుసనే భావం/తెలుసుకోవడం మొదలెట్టాక/తెలిసిందే లేదనే ఖేదం/తెలిసి తెలియని తనంతో/బ్రతుకు తెల్లారి పోతోందే’ అనే కవిత మరోసారి గుర్తు చేస్తుంది.

గూగుల్ ఉపయోగాల గురించి – ‘గూగుల్ అమ్మ చెంత వుంటే/చింత మనకేల/చేయి చాపుతే/చెంతనే ప్రపంచమంతా’ అనే కవితలో సూక్ష్మంగా చెప్పారు.

నమ్మకం లోపిస్తే ఏం జరుగుతుందో – ‘నమ్మకం ఉంటే మౌనం/కూడా మధురమే/లేకుంటే మంచి మాటైనా/మారణాస్త్రం!’ అనే కవితలో అద్భుతంగా చెప్పారు కవయిత్రి.

‘మెచ్చుకునే వాళ్ళు వుంటే/తోచిన చెత్త అంతా రాసేయ్/ఆపై ఎఫ్.బి.లో పెట్టేయ్/వచ్చిన లైక్‌లన్నీ లెక్కెట్టేయ్’ అనే ఈ కవిత నేటి దుస్థితికి మచ్చుతునక.

‘మాటలేగా మనుషులను కలిపేది/మాటలేగా మనసులను విరిచేది/మాటలతోనేగా మహినెల్ల గెలిచేది/మాట విలువ నే మాటల్లో పలికేది?’ అనే కవితలో మాట విలువను హృద్యంగా చెప్పారు.

కాలం విలువను గొప్పగా చెప్పిన కవిత – ‘కాలం గంట కొడుతూ/నీ వెన్నంటే వుంటుంది/తెలుసుకొని మసలక పోతే/తప్పు నీదేనంటుంది’.

అక్షరాల గురించి, కరోనా గురించి చక్కని కవితలున్నాయి ఈ సంపుటిలో. కొన్ని కవితలలో పైకి భౌతికవాద ఛాయలు అనిపించినా అంతర్లీనంగా ఆధ్యాత్మిక భావాలు గోచరిస్తాయి.

హాయిగా చదివిస్తాయి, ఆలోచింపజేస్తాయి ఈ సంపుటిలోని కవితలు.

***

చిన్నీలు (కవితా సంపుటి)
రచన: లలితా భాస్కరదేవ్
ప్రచురణ: శివచైతన్య, USA.
పేజీలు: 66
వెల: ₹ 100/-
ప్రతులకు:
లలితా భాస్కరదేవ్
ఈస్ట్ గాంధీ నగర్,
4-87/15/3, ప్లాట్ నెం 69,…
నాగారం, హైదరాబాదు 500083…
9885552922.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here