వర్షమై కురిసిన అక్షరాలు

0
8

[dropcap]చి[/dropcap]నుకు తాకిన నేల ఎలా ఉంటుంది… కమ్మని మట్టి పరిమళాలు వెదజల్లుతూ, రాబోయే చిన్ని మొలక ఆగమనాన్ని స్వాగతిస్తూ….!

శ్రీమతి శాంతికృష్ణ మానసం కూడా అలాగే ‘చినుకు తాకిన నేల’… అందుకే అది కవితా సౌరభాలకు ఆలవాలమైన తెలుగు సాహిత్య పూలతోట అయ్యింది. రసరమ్య కావ్య ఫలాలను ఇచ్చే తరువులకు నిలయమయ్యింది. ఈ ‘చినుకు తాకిన నేల’  కవితా సంపుటి లో ప్రతి కవిత ప్రత్యేకమైనదే. తనదైన శైలిలో భావ సుమమై భారతీదేవి పద పీఠికను అలంకరించి అందంగా ఒదిగిపోయేదే….

అమ్మ, నాన్న కనిపించే దైవాలు. దైవంలాంటి నాన్న గురువై నడకతో పాటుగా నడతను నేర్పితే ఆ వ్యక్తి చేరుకునే స్థాయి హిమనగం అంటూ ‘గురువంటే నాన్నే’ అని తండ్రికి ప్రణమిల్లి తన గౌరవాన్ని ప్రకటించారు కవయిత్రి.

సంద్రంతో ముడిపడిన గంగపుత్రుల జీవన చిత్రాన్ని కనులముందు అచ్ఛంగా ఆవిష్కరించారు తన “సంద్రం పిలుపు” కవితలో.

అటు మగ ఇటు ఆడ కాకుండా అర్ధనారీశ్వర తత్వం కలిగిన ధర్డ్ జెండర్ గురించి… అమ్మకు దూరమై, చీకటిలో పులుముకున్న కృత్రిమ పరిమళాలను, సువాసన వెదజల్లినా పూజకు పనికిరాని మొగలిపూవులా నిరర్ధకమైన వారి జీవితాల గురించి అద్దం పట్టిన కవిత “మొగలి రేకులు”… గుండెల్లో ములుకులా గుచ్చి కన్నీరు తెప్పించి తీరుతుంది.

కృత్రిమత్వం, భేషజాలు, అవినీతి, ఆడంబరాలు, పటాటోపాలు లేని అందమైన ప్రపంచం కవయిత్రి పూవంటి మనసులో లలితంగా రూపు దిద్దుకుని మన మదిలో అందంగా ఆవిష్క్రతం అవుతుంది… “చూడాలని ఉంది సరికొత్త బంగారు లోకాన్ని ఒక్కసారి”అంటారు ఒకచోట ఎంతో ఆశగా…

“వనమాలివే… నీవు నా స్నేహ వనానికి” అని మనసును పెనవేసుకున్న నేస్తాన్ని కలవరిస్తూనే.. కలవరింతలు రానీయక నిషేధాజ్ఞలు విధించావు అంటూ తనతో అల్లుకుపోయిన ప్రేమ క్షణాలు వెన్నెలలా పరచుకున్న ఆ తరుణం కాలం ఆగిపోవాలి అని గాఢంగా కోరుకుంటారు.

వీధిబాలల జీవన సంగ్రామం తొలిపొద్దు క్షణాలనుండి మలిపొద్దు నిమిషం వరకు ఎలా సాగుతుందో చెప్తారు తన “వెలుగుపువ్వు” కవితలో. చీకటి మరకల్ని తుడిచే వెలుగుపువ్వు తూరుపు కొండల్లో పుష్పించింది అంటూ, తిరిగి రేపటి జీవితాన ఆశలు కలిగించే అదే ఉదయంకోసం రాత్రి కలల లోకంలో జారుకునే బాలల బతుకు చిత్రణ మదిలో సానుభూతిని కలిగించక మానదు.

ఒక స్త్రీగా, అమ్మగా, సమాజాన్ని ప్రశ్నించే స్త్రీవాద రచయిత్రిగా ఆమె మనసు అద్దం పట్టే కవితలు ఎన్నో….! “వెన్నెల కూన” నీవంటూ ముద్దుల పసిపాపాయిని ఆత్మీయంగా హత్తుకోవాలి అంటూనే, అపురూపంగా చూసుకోవలసిన పసిప్రాయపు మొగ్గలను చిదిమేస్తున్న పశు ప్రవృత్తి చూపే అధములను ఖండ ఖండాలుగా నరికివేయి దేశమా అంటూ ఆగ్రహిస్తారు. “మృగాడు” అంటే మృగాలు నిరసిస్తాయి అంటూ, అనుమతి లేనిదే సీతపై గోరు కూడా తాకించని రావణుడు అతనికన్న నయం అని ఛీత్కరిస్తూ, అట్టి నీచుని మోసే ఉరికొయ్య కూడా మరణిస్తుంది అని ఏహ్యతను ప్రకటిస్తారు. “చిన్నారిని నాన్నా..” అంటూ పసిగుడ్డుగా చిదిమేస్తావా నన్ను…. బతకనివ్వు నాకు భరోసా ఇవ్వు అని ప్రాధేయపడే చిన్నారి గళాన్ని ఎద ఎదలో ప్రతిధ్వనింపజేసి మానవతను మేల్కొలిపే ప్రయత్నం చేసారు.

“ఆడపిల్లా ఆశపడకు”అంటూ అనుక్షణం కత్తులపై నడక లాంటి జీవితం గడపలేవు అంటూ అమ్మ గర్భంలో విచిన్నమైపో, రక్తపు సెలయేరై బయటకు వెళ్లిపో అని ఆక్రోశంతో రాసిన వాక్యాలు మనసున్న ప్రతి వ్యక్తి కనులను అశ్రువులతో తడిపేస్తుంది. విధి కాటుకు బలై మతిభ్రమించిన కొందరి జీవితాలను “పగిలిన మనసుల నవ్వులు”గా అభివర్ణించారు.

“పాలవెల్లి” కవితలో స్త్రీ ఔన్నత్యాన్ని ఆమెకు గుర్తు చేస్తూ ఆత్మవిశ్వాసంతో కదిలి మానవత్వపు పరిమళాలు కల నవసమాజాన్ని నీవే నిర్మించుకో అని పిలుపునిస్తారు.

పుడమితల్లికి అందాల పచ్చచీర నేసే రైతన్న శ్రమను “పుడమి తనయుడు”గా, దేశ రక్షణకు జీవితాన్ని అంకితం చేసిన సైనికుని ధీరతను “ఓ సైనికా”అంటూ కీర్తించి దేశానికి ఆధారమైన వీరిరువురిని జై జవాన్,జై కిసాన్ అంటూ గౌరవించి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

“ఏడబోయిందో నా పల్లె” అంటూ ఒకనాటి అందమైన పల్లెసీమలను వెతుకుతూ సాగే ఆమె మనసుతో జతగా పరుగులు పెట్టని మనసులు ఉండవు…. ఆమె కవిత చదువుతూ మట్టితో అద్భుత కళా ఖండాలు సృష్టించిన కుమ్మరి పనితనపు “అపురూప దృశ్యాలు” గుర్తు చేసుకుంటూ అంతరించిపోతున్న కులవృత్తులకు అండగా నిలవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు.

తెలుగు సంప్రదాయ ప్రతీకలుగా బంగారు తంగేడు, మేఘాల బోనాలు అందంగా కనులముందు నిలిపి ఆ సంబరాలలో పాఠకులను భాగస్వాములను చేస్తారు.

అందమైన కదంబమాల ఈ పుస్తకం. నందివర్ధనం అందాలను, వాన అంటే నిర్వచనాన్ని, ప్రేమ పరిమళాలను, నేస్తమై పుస్తకం ఇచ్చే హామీలను, అమ్మతనపు కమ్మదనాన్ని, మంచు బిందువుల చల్లదనం నింపుకున్న పచ్చగడ్డి పరకల ఆత్మీయ స్పర్శను, ఆర్తులకు సహకరించి వారి జీవితాన మనం వెన్నెల వాగు అవుదాం అనే ఆకాంక్షను, స్నేహం ఇలా ఉండాలి అనే వివరణను, చుక్కల్లో చందమామగా చేరిన చిట్టి తమ్మునికి పంపే రాఖీలో సోదరి ప్రేమను, జడివానలో మూలపడ్డ గూడు రిక్షాను, ప్లాస్టిక్ వాడవద్దనే హితవును, రాయలసీమను రక్తగడ్డగా చూపవద్దని హెచ్చరికను, అవని సిగలో పూవైన అడవిని నరికి వైధవ్యం ఆపాదించవద్దు అనే వినతిని…. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కవయిత్రి స్పృశియించని కోణం లేదేమో అని అనిపిస్తుంది.

సూర్యునికి ప్రేమలేఖ రాసిన ఈమె విశ్వకవి రవీంద్రుని భావకవితా సొగసులను, స్త్రీ నాయకత్వ ప్రతిభ ఇందిరాగాంధీ ధీరత్వాన్ని, అభ్యుదయ కవితా ధారల శ్రీశ్రీ అంతరంగాన్ని, విలక్షణ లక్ష్య సంపన్నుడు దామోదరం సంజీవయ్య వ్యక్తిత్వాన్ని అక్షరీకరించి వారిపై గౌరవాన్ని చాటుకున్నారు.

తెలుగు భాషా అధ్యాపకులు అయిన వీరు “తెలుగు అంటే వెలుగు” అని భాషపై అభిమానాన్ని చాటుకుంటూ, వ్యావహారిక భాషోద్యమకారులు “తెలుగు వారి వెలుగు రేడు గిడుగు” అని ప్రణమిల్లుతారు.

ఆసాంతం ఏక బిగిన చదివించగల భాషా పటిమ, వస్తు వైరుధ్యం, భావ వ్యక్తీకరణ లోని ప్రత్యేకత ఈ పుస్తకాన్ని తప్పక చదివి భద్రపరచుకొనగల మంచి నేస్తంగా తీర్చిదిద్దాయి అని అభిప్రాయపడుతూ ఇటువంటి మరెన్నో ఆణి ముత్యాలను  శాంతికృష్ణ కలము నుండి ఆశిస్తూ సాహితీ ఆకాశంలో ఒక ధృవతారగా ఆమె స్థిరపడాలి అని తోటి మహిళగా, కవయిత్రిగా, ఉపాధ్యాయురాలిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెను అభినందిస్తున్నాను.

***

చినుకు తాకిన నేల (కవిత్వం)
రచన: శాంతి కృష్ణ,
పేజీలు: 144, వెల: రూ. 120/-
ప్రతులకు:
శ్రీమతి శాంతి కృష్ణ
9502236670, santhikrishnanellore@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here