[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
రౌండ్ ఫిగర్
[dropcap]“ఏ[/dropcap]రా, బస్‌స్టాండ్ కెళ్లి అమ్మమ్మను తీసుకొచ్చావా?” అని విజయ వైజాగ్ నుంచి ఫోన్ చేసింది తెనాలి – నుంచీ బస్సులో రావల్సిన అమ్మమ్మ కోసం.
“అక్కా, ఇరవయ్యో తారీఖున అమ్మమ్మ వచ్చేది” అన్నాడు వేణు.
“ఇవాళే ఇరవై. అమ్మమ్మ వచ్చేసి ఉంటుంది. నువ్వు బస్‌స్టాప్‌కి వెళ్లలేదా?” అని అడిగింది.
అప్పుడు కాలెండర్ చూసుకుని, టైం చూసుకుని బస్‌స్టాండ్‌కి హడావుడిగా పరుగెత్తాడు. కానీ అప్పటికే ఎనిమిది గంటలు అయింది. ఉదయం పూట వచ్చే బస్సులన్నీ వచ్చేశాయి. వచ్చిన వాళ్లంతా ఇళ్లకు వెళ్లిపోయారు. బస్‍స్టాండ్ ఖాళీ చేసిన విడిది ఇల్లులా ఉంది. ఎక్కడ వెతికినా అమ్మమ్మ కనిపించలేదు. ఎంక్వయిరీలో అడిగితే తెనాలి బస్సు వచ్చి రెండు గంటలు అయిందని చెప్పారు.
అమ్మమ్మ హైదరాబాదు ఇంతకు ముందు వచ్చిందిగానీ ఎప్పటికప్పుడు కొత్త. ఎదురు చూసి ఆటో చేసుకొని ఇంటికి వెళ్లి ఉంటుందని, సమయానికి ఇంట్లోనూ లేకపోతే కంగారు పడుతుందని ఇంటికి బయల్దేరాడు.
ఫోన్ మోగింది.
“హలో”
“ఏరా వేణు, ఎక్కడున్నావ్. నేను చైతన్యపురిలో ఉన్నాను. ఈ అమ్మాయి ఆడ్రసు చెబుతుంది. ఇక్కడికి రా” అన్నది అమ్మమ్మ.
అరగంట తర్వాత వేణు ఆ ఇంటికి చేరుకున్నాడు. అమ్మమ్మ నవ్వుతూ ఎదురొచ్చింది.
“రాత్రి బస్సులో నాతో పాటే వచ్చారు బామ్మగారు. రాత్రే పరిచయం అయ్యారు. ఆమె కూడా మాతో పాటే కురుక్షేత్ర యాత్రకు వస్తున్నారు.. ఒకరి కొకరం తోడు.. నువ్వు రాకపొయ్యేసరికి, బామ్మగారితో పాటు తీసుకొచ్చింది ఈ అమ్మాయి..” అంటూ లావణ్యను పరిచయం చేసింది.
“హాయ్..” అని పలకరించింది లావణ్య.
“థాంక్స్ అండీ..” అన్నాడు వేణు.
“పర్లేదు లెండి.. “ అన్నది లావణ్య.
“ఆటో డబ్బులు ఇచ్చెయ్” అన్నది అమ్మమ్మ.
ఆటో వంద రూపాయలు అయింది. ముగ్గురు వచ్చారు గనుక, మూడో వంతు ముప్పయి మూడు రూపాయలు..
“ముప్ఫయి ఇచ్చెయ్యండి.. రౌండ్ ఫిగర్..” అన్నది లావణ్య.
“నాకూ రౌండ్ ఫిగర్ ఓ.కే. అండి..” అన్నాడు వేణు మూడు పదులు ఇస్తూ. లావణ్య నొసలు చిట్లించి చిరుకోపం ప్రదర్శించింది.
అమ్మమ్మ బయల్దేరింది. లావణ్య బామ్మగారు పూజలో ఉన్నారు. ‘రాత్రికి రైల్లో కల్సుకుందాం’ – అనుకుని అమ్మమ్మ వేణుతో వచ్చేసింది.
పదిరోజుల పాటు కురుక్షేత్ర యాత్రకు అరవైమంది వెళ్తున్నారు. అన్ని ఊళ్లవాళ్లూ అందులో ఉన్నారు. అన్ని వయసుల వాళ్లూ ఉన్నారు.
ప్రయాణానికి కావల్సినవన్నీ అమ్మమ్మ తెచ్చుకుంది. మరికొన్ని వేణు తెచ్చి ఇచ్చాడు. మధ్యాహ్నం భోజనం చేస్తుండగా అమ్మమ్మ అడిగింది. “ఆ అమ్మాయి ఎలా ఉంది రా?”
“ఎవరూ, రౌండ్ ఫిగరా? బానే ఉంది.. ఏం?” అని అడిగాడు వేణు.
“రాత్రంతా ఆ పిల్ల బామ్మ నీ గురించి గుచ్చి గుచ్చి అడిగింది లే.. ఒకవేళ సంబంధాలు చూస్తున్నారేమో.. ఈ పది రోజుల్లో అసలు విషయం కూపీ లాగేస్తానే.. నువ్వు మాత్రం ఆ పిల్లతో అంటీ ముట్టనట్లుండు..” అన్నది అమ్మమ్మ.
“ఒకవేళ ఆ పిల్లే అంటుకుని, ముట్టుకుని ఉంటుంటే ఏం చెయ్యాలే..” అని అడిగాడు వేణు.
“నువ్వు దూరంగా ఉండు, ఈ మధ్య ఆడపిల్లలు వల విసిరి, మగపిల్లల్ని బుట్టలో వేసుకుంటున్నారు. ఈ వెధవలు కుక్కల్లా వెంటబడుతుంటే, వాళ్లు లక్షలు లక్షలు కట్నాలు ఎగ్గొట్టేస్తున్నారు..” అన్నది అమ్మమ్మ జాగ్రత్తలు చెబుతూ.
“అలాగలాగే..” అన్నాడు వేణు.
ఆ రాత్రి రైలు బయల్దేరటానికి సిద్ధంగా ఉంది. ఒక కంపార్ట్‌మెంట్ అంతా యాత్రికులతో నిండిపోయింది. అమ్మమ్మ, బామ్మ సామాను సర్దుకుని ఒక బెర్త్ మీద కూర్చున్నారు. లావణ్య, వేణు వాళ్లకు ఎదురుగా కూర్చున్నారు.
నలుగురూ కాఫీ తాగారు, వేణు డబ్బులిచ్చాడు. లావణ్య తమ వంతు ఇవ్వబోయింది. చిల్లర సమస్య.
“నాకు రౌండ్ ఫిగర్ ఓ.కే. నండీ..” అన్నాడు వేణు. ఈసారి లావణ్య కోపంగా చూడలేదు. పైగా నవ్వింది అందంగా, డబ్బు ఇచ్చేటప్పుడి చేతివేళ్లు తగిలాయి – మహదానందంగా.
“మామ్మగారూ, ఇంకేమన్నా కావాలా మీకు?” అని చొరవగా బామ్మగారిని అడిగాడు.
“రోజూ ఫోన్లు చేస్తుంటాంలే..”
“సెల్‌ఫోన్ ఉందా మీ దగ్గర?” అని అడిగాడు వేణు.
“ఆ, ఉందిగాని, ఎక్కడన్నా మర్చిపోతానేమోనని ఇంట్లో పెట్టేసి వచ్చాను. నీ ఫోన్ ఇస్తావేమిటి? రాగానే తిరిగి ఇచ్చేస్తాను..” అన్నది బామ్మ.
“దానికేం భాగ్యం తీసుకోండి..” అంటూ సెల్‌ఫోన్ ఆమెకు ఇచ్చాడు.
“నీకు ఏమన్నా ఇబ్బందా?” అంటూనే అతని దగ్గరి నుంచి సెల్‌పోన్ తీసుకుంది బామ్మగారు.
“ఇంతమంది వెళ్తున్నారు. ఎన్ని వసతులున్నా అందరికీ అందుతాయో లేదో..” అన్నాడు వేణు.
“కాస్త హుషారుగా తిరిగే వాడ్ని పిల్చి, కూచోబెట్టి నాలుగు కబుర్లు చెప్పి, నీలాంటి వాడిని నేనింతవరకూ చూడలేదయ్యా – అంటూ రోజుకోసారి భుజం తట్టాననుకో.. ఇంకవాడు మాకు బాత్రూంలో నీళ్ల దగ్గరి నుంచీ తిండీ తిప్పలూ, నీళ్లూ నిప్పులూ, పడకలూ పవళింపుసేవలూ – అన్నీ ఓపిగ్గా చూసుకోడటయ్యా. ఇలాంటివన్నీ నాకు అలవాటే..” అన్నది బామ్మగారు.
‘వామ్మో, ఇది గడుసు పిండమే’ అనుకున్నాడు వేణు. అతను ఏమన్నా అనుకుంటాడేమోనని లావణ్య కొంచెం సిగ్గుపడింది.
చెప్పవల్సిన అప్పగింతలన్నీ అయ్యాక రైలు బయల్దేరింది. వేణు లావణ్య ఫ్లాట్‌ఫాం మీద నడుస్తున్నారు.
“వీళ్లకు హిందీ రాదు. ఏం అవస్థ పడతారో ఏమో..” అన్నది లావణ్య- అతనితో మాట కలపటం కోసం.
“అందుకే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ముఖ్యంగా మనలాంటి యూత్..” అన్నాడు వేణు.
“అంటే ఇంగ్లీషేగా?”
“ఇంగ్లీషు కొన్ని దేశాల్లోనే పనికొస్తుంది.. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అలా కాదు. ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా.. ఆదుకుంటుంది..”
“అలాంటి లాంగ్వేజ్ ఒకటి ఉందని నాకు తెలియదు” అన్నది లావణ్య
“చాలా మందికి తెలియదు. కానీ ఇది నేర్చుకోవటం చాలా తేలిక. నాలుగు రోజుల్లో నేర్చుకోవచ్చు..”
“అవునా? నాలుగు రోజుల్లోనా?” అని ఆశ్చర్యపోయింది.
“అదీ, రోజుకో గంట స్పేర్ చేస్తే చాలు..”
“అంత తేలికా?”
“మరి? మీకు కావాలంటే నేర్పుతాను..”
“తప్పకుండా నేర్చుకుంటాను..”
“ఇందులోని గొప్పదనం ఏమిటంటే.. ఇందులో ‘హ్యుమన్ ఇన్‌స్టింక్ట్’ ఇమిడి ఉంది. ఇది అన్ని దేశాల వారికీ, అన్ని భాషలవారికీ కామన్..”
“నాకు నేర్పరా?” అని లాలనగా అడిగింది లావణ్య-
“అదేం భాగ్యం.. రేపే మొదలెడదాం.. సాయంత్రం ఆరింటికి నెక్లెస్ రోడ్‌కి వచ్చెయండి..” అన్నాడు వేణు.
మర్నాడు సాయంత్రం ఆమె వచ్చింది..
తెల్లని పాలనురుగ లాంటి పల్చని చీరెలో, మిసమిసలాడే మేనుతో, ముసిముసి నవ్వులతో, మురిపెంబు నడకలతో, నడయాడు బంగారు బొమ్మలా మణికిరీటం లేని యువరాణిలా వచ్చి, పచ్చిక బయలులో అతనికి అభిముఖంగా కూర్చుంది. ముట్టుకుంటే మాసిపోతుందేమోనన్నంత సుకుమారంగా, నిన్నటి కన్నా నును లేతగా, కొత్త సొగసును సంతరించుకున్న కొంజిగురుటాకులా ఉంది. వస్తూవస్తూ అంతులేని నవ జీవన వసంతోత్సవాన్ని మోసుకొచ్చింది – రెప్ప అల్లారుస్తూ.
“చెప్పండి మరి..” అన్నది దరహాస వదనంతో.
“చెప్పటం అంటూ ఉండదు. చూసి నేర్చుకోవటమే..”
“పోనీ చూపించండి..”
గాలికి అమె పయ్యెద కదిలింది. ఆమె సొగసు అతనికి నేత్రోత్సవంగా కనిపిస్తోంది.
“ఇంటర్నేషనల్ లాగ్వేజ్ చెప్తానన్నారు..” అని అడిగింది.
“ఇప్పుడు నేను చూస్తున్నదే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్.. భాష కందని భావం ఉంది.. అందులో..”
“నాకేం కనిపించటం లేదే?..”
“తొందరేముంది? ఇంకా మూడు రోజుల టైం ఉందిగదా..”
“రావాలి గదా?..” అన్నది కన్నులు ఇంత చేసుకుని.
“వచ్చావు గదా.. నీకు సరిలేరు సతులెవ్వరూ అంటూ.. కొలను అంచున సంచరించు రాయంచ నంటూ.. “
“ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటూ తెలుగులో మాట్లాడుతున్నారేం?” అని అడిగింది అమాయకంగా మొహం పెట్టి.
“అలివేణి చిరుత నవ్వులకూ, కంటికొసల నుంచి జారిపడే కాంక్షలకూ – గుండెను వలపు తూగుటుయ్యాల లూగించు సయ్యాటలకూ -భాషా బేధం లేదు భామినీ..” అన్నాడు వేణు నవ్వి.
‘ఏమిటో.. ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు..” అన్నది లావణ్య నిండు చందమామలా నవ్వి.
“మొదట్లో ప్రతిదీ అర్థం అయినట్లూ, కానట్టూ.. ఎట్టెట్లో.. తినేది.. అది పెసరట్టో.. మినపట్టో.. తెలియనట్టు.. కొంచెం అయోమయంగానే ఉంటుంది – పోను పోను నీకే తెలుస్తుంది.. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు..”
“ఏంటండీ.. తెలుగులో చెబుతారు… ఇంటర్నేషనల్ అన్నారు..”
“నాలుగు దశలున్నయి లావణ్యా.. రోజుకో దశ దాటాలి గదా.. నాలుగో రోజునగాని నీకు పూర్తిగా అర్థం కాదు.. ఇంకో చిన్న విషయం, రేపు నా పుట్టిన రోజు.. నీకో చిన్నపార్టీ ఇవ్వాలనుకుంటున్నాను.. నువ్వు కాదనకూడదు..” అన్నాడు.
“అలా ముందు కాళ్లకు బంధం వేస్తే ఎలా?” అని నవ్వింది లావణ్య,
“ముందు అలా కాళ్లకు బంధం వేస్తే.. నెమ్మదిగా చేతులకూ బంధం వెయ్యవచ్చు.. ఎక్కడికీ పోలేవు గదా మరి..” అన్నాడు వేణు కూడా నవ్వుతూ.
మర్నాడు రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇద్దరూ బ్లూ ఫాక్స్ హోటల్లో ఓ మూల టేబులు దగ్గర ఎదురెదురుగా కూర్చున్నారు.
“మీకు చిన్న గిఫ్ట్..” అంటూ లావణ్య అతనికి సెల్‌ఫోన్ బాక్స్ ఇచ్చింది.
తీసి చూసుకున్నాడు. “ఎందుకింత ఖరీదు పెట్టి కొన్నావు? చాక్లెట్ ఇస్తే సరిపోను గదా..” అన్నాడు.
“చాక్లెట్లు చిన్నపిల్లలకు కదా ఇస్తారు?..”
“పెద్దవాళ్లకిచ్చే చాక్లెట్లూ ఉన్నయిగదా..”
“ఏమిటవి?” అని అడిగింది ఆశ్చర్యంగా.
“చాక్లెట్లు దేనికిస్తారు? నోరు తీపి చెయ్యటానికేగదా.. పిల్లల కయినా.. పెద్దల కయినా.. అధరాల మధురామృతం చాలదా.. వయస్సులో ఉన్నవాళ్లకిచ్చే ఆ చాక్లెట్లు ఎన్నాళ్లు చప్పరించినా, తరగదు గదా..” అన్నాడు వేణు.
లావణ్య.. కొంచెం సిగ్గు పడింది. కొంచెం నవ్వింది. “పూలు పూజకు పనికొచ్చేవి కొన్ని ఉంటాయి.. తలలో పెట్టుకునేవి కొన్ని ఉంటాయి.. విలాసాలకు వాడేవి కొన్ని ఉంటాయి..”
“దేవుడికి ఇచ్చినవి, ఆయనే మెచ్చి, తలలో గుచ్చితే..”
“అంత అదృష్టం కలగటం.. ఎవరికో గానీ సాధ్యంకాదు..”
“ఇవాళ బుధవారం.. నేను పుట్టిన రోజు..”
“అదేమిటి? సంవత్సరానికోసారి గదా పుట్టిన రోజు పండుగ చేసుకుంటారు? మీరు ప్రతి బుధవారమూ చేసుకుంటారా?” అని ఆశ్చర్యంగా అడిగింది.
“పెరిగిన చెరుకు తోటలో పడి మరదలితో సరసమాడేవారికీ, పన్నీటి సరస్సులో జవరాండ్రతో కల్సి జలకాలాడేవాడి.. నిత్యవసంతమే గదా ప్రతి రోజూ పండగే..”
“అంటే మీరిప్పుడు..”
“నేనిప్పుడు అంబారీ ఏనుగు నెక్కి ఊరేగుతున్నాను.. ఊహల మేఘాలలోన” – అన్నాడు వేణు పకపకా నవ్వి.
“ఓహో.. ఏ మదృష్టం..?”
“నా పక్కన ఇంకొక్కరికి చోటు ఉంది -”
“మీకూ.. మీ అంబారీకి ఓ నమస్కారం.. నన్నిలా వదిలెయ్యండి” అన్నది లావణ్య చేతులు జోడించి.
చైనీస్ ఫుడ్ వచ్చింది. తిన్నారు. ఫ్రూట్ సలాడ్ కూడా.. చెరిసగం.. పంచుకున్నారు.
“జీవితంలో పంచుకోవటంలో ఉన్న ఆనందం ఇంకెక్కడుంది?” అని అన్నాడు.
“మరి బిల్లు చెరిసగం పంచుకుందామా?” అని అడిగింది లావణ్య.
“ఈ రోజు నువ్వు నాకు అతిథి.. నేను నీకు అతిథి అయిన రోజున నువ్వు బిల్లు ఇవ్వు..”
“ఇది మరీ బావుంది. అంటే నేనిప్పుడు బాకీ పడ్డానా?”
“నాకు నువ్వు.. నీకు నేను.. ఇది తీరని బాకీ.. తనివి తీరని దాహం.. ఎల్ల లెరుగని మోహం.. జన్మ జన్మాంతరాల రుణం.. కనుకనే ఇలా తలవని తలపుగా కల్సుకున్నాం..”
లావణ్య ఎందుకో మాట్లాడలేదు. ఆమె మౌనంలో సముద్ర గర్భమంత లోతైన గాంభీర్యం ఉంది. అతనే మళ్లీ అన్నాడు.
“నాదొక చిన్న రిక్వెస్ట్ లావణ్య.. మనసులోని మాట పెదవి దాట లేని సందర్భాలెన్నో ఉంటాయి. అందుకని రేపు మనం కల్సుకున్నప్పుడు.. ఒకరి అభిప్రాయాలను మరొకరికి కాగితం మీద రాసి చూపిద్దాం..” అన్నాడు వేణు. ఆమెకు మౌనమే శరణ్యం అయింది.
మర్నాడు సాయంత్రం మేడమీద కూర్చుని ఉన్నారు. వేణు తను రాసిన కాగితాన్ని ఆమెకు ఇచ్చాడు. ఆమె తను రాసిన కాగితాన్ని అతనికి ఇచ్చింది. ముందు అతను రాసిన దాన్ని ఆమె చదివింది.
‘నువ్వు కిలకిలా నవ్వినప్పుడే కాదు, వలవలా విలపించినప్పుడు నీకు నేను తోడు నీడై ఉంటాను. పరిమళాలు వీడని వాడని పొగడపూలదండలు అల్లుతున్నప్పుడు నీ కుడి చేతిని తోరణంలా చుట్టుకునే ఉంటాను. నువ్వు దిగంతాల కావల పైపుకు దిగులుగా దృష్టిసారించినప్పుడే కాదు, మహోజ్వల భవిష్యత్తు గురించి కలలు కంటున్నప్పుడూ, నేను నీ కంటి చూపునై ఉంటాను. ఆశాసౌధాల సోపానాలు ఎక్కుతున్నప్పుడే కాదు, పర్వత శ్రేణుల నుంచి జారిపడుతున్నప్పుడూ, నేను నీ బిగబట్టిన గుండెల చప్పుడునై ఉంటాను. జరరుజామరణాల దుర్గమారణ్యాలలో నీవు నడుస్తున్నప్పుడు, నేను నీ కాలి అందియనై ఉంటాను. విధి నిర్దయగా ఇద్దరినీ చెంచ ఉత్తర దక్షిణ ధృవాలకు విసిరేసినప్పుడూ, నిలువెల్ల మంచులో కూరుకుపోతూ, నీ నామ జపమే చేస్తుంటాను. కంటి పాపలో నీ రూపాన్నే నిలుపుకునే ప్రయత్నం చేస్తుంటాను.. నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను..’
అరచేతుల్లో ఉన్న కాగితంలో మొహం దాచుకుని కన్నులు వర్షం కురిపిస్తూ వెక్కి వెక్కి ఏడ్చింది లావణ్య.
ఆమె రాసిన కాగితం విప్పి చూశాడు వేణు. ఒకే ఒక వాక్యం ‘నాకు చనిపోవాలని ఉంది..’.
చాలాసేపటి దాకా లావణ్య ఏడుస్తూనే ఉంది. హృదయ భారం అంతా తీరాక వేణు ఆడిగాడు.
“ఏమైంది లావణ్యా?..”
“ఇంత ప్రేమని నాపై కురిగించిన వాళ్లు ఎవరూ లేరు.. మా ఇంట్లో అమ్మా నాన్న ఎప్పుడూ నిష్కారణంగా తిట్టుకుంటుంటారు. ప్రతి క్షణమూ పోట్లాడుకుంటుంటారు. నరనరాల్లో నెత్తురుతో పాటు ద్వేషమూ ప్రవహిస్తుంటుంది. తల్లి తండ్రీ నిత్యం సాగించే యుద్ధరంగంలో తిట్ల ఫిరంగి ధ్వనుల మధ్య పుట్టి పెరిగిన నేను.. ఇంతటి అపార కరుణారస వృష్టిని తట్టుకోలేక పోతున్నాను..” అంటున్నప్పుడు ఆమె కళ్ల వెంట గంగా గోదావరీ జీవ నదులే పొంగి పొర్లుతున్నాయి.
మర్నాడు వేణు, లావణ్య చీకట్లో చెట్లనీడల మధ్య చెట్టాపట్టాలుగా చేతులు పట్టుకుని నడుస్తున్నారు. వేణు చెబుతున్నాడు. ఆమె ‘ఊ’ కొడుతున్నది. అదో రకమైన మైకంలో.. ప్రేమ మైకంలో మమేకం అయి..
“ప్రపంచంలో ఎన్ని భాషలున్నా అన్ని భాషల్లోనూ ప్రేమ ప్రధానమైన దినుసు, దానితోనే సృష్టి యావత్తూ నిర్మితమైంది. మనిషిని మనిషి ప్రేమించటం తోనే సృష్టికి అంకారార్పణ జరుగుతుంది. ప్రేమ మానవ నైజం. విశ్వజనీనమైనది. నీలో నాలో చీమలో దోమలో అన్నిటిలో నిండి ఉన్నది.. గాలి లాగా.. జాలి లాగా… ప్రేమ ఎప్పుడు ఎగువ నుంచి దిగువకు జారుతుంటుంది. అందుకనే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించినంతగా, పిల్లలు తల్లిదండ్రుల్ని ప్రేమించరు. భగవంతుడు మనిషిని ప్రేమించినంతగా, మనిషి భగవంతుడ్ని ప్రేమించడు..”
ఒకచోట ఆగారు. ఇద్దరు అనుకునే ఉన్నారు. అతని భుజం మీద చిన్న చీమ పాకుతోంది. దాన్ని తోసెయ్యటం కోసం ఆమె తన చేతిని అతనికి చేరువగా తీసుకెళ్ళింది – ఆమె ఆంతర్యం అర్థమైందన్నట్లు అతను ఆమె బాహు బంధాల్లో బంధించాడు.
పక్కన నడుస్తున్న వాళ్లంతా ఆగి – చూసి – వెళ్తున్న విషయం వాళ్లకు తెలియదు.
వారం తర్వాత ముసలాళ్లు ఇద్దరూ తీర్థయాత్రనుంచి వచ్చారు.
“ఇది కుదిరే సంబంధం కాదు” అన్నది అమ్మమ్మ.
ఆ రాత్రి వేణు లావణ్య వేణు పక్కన ఒంటరిగా కూర్చున్నారు.
“మీ అమ్మమ్మ ఏమంది?” అని అడిగింది లావణ్య.
“ఆమెకు చిల్లర మీద మక్కువ ఎక్కువ..”
“మీకు?”
“రౌండ్ ఫిగర్ మీద..”
లావణ్య వేణు గుండెలమీద తలవాల్చింది. అతను ఆమెను రెండు చేతులతో చుట్టేశాడు. లావణ్య గువ్వపిట్టలా ఒదిగిపోయింది.