చిరుజల్లు-106

0
9

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

శ్రుతి తప్పిన జీవన రాగం

[dropcap]సా[/dropcap]యంత్రం ఆరు గంటలు అయింది.

ఎగ్జిబిషన్ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. క్రమక్రమంగా రద్దీ పెరిగి పోతోంది. జనంతో పాటే ముందుకు కదులుతున్నారు పల్లవి, అమర్. ఆమె కనిషించిన వన్నీ బేరం చేస్తోంది. అతను విసుక్కుంటున్నాడు.

పల్లవి శాలువా బేరం చేస్తుంటే, అమర్ కొద్దిదూరంలోన నిలబడి నిండు నదిలా నెమ్మదిగా కదిలి పోతున్న జన ప్రవాహాన్ని చూస్తున్నాడు. ఎవరో అతన్ని వెనక నుంచి ఢీ కొట్టారు. తీరా చూస్తే అతను ఒకప్పటి ఫ్రెండ్ రాజేంద్ర.

“ఇన్నేళ్ల తరువాత కల్సుకుంటే మాత్రం, ఇదా పద్ధతి? మీద పడిపోతావా?” అన్నాడు అమర్ నవ్వుతూనే.

“యాక్సిడెంటల్‍గా కల్సినప్పుడు, ఇదే పద్ధతి మరి” అన్నాడు రాజేంద్ర కూడా నవ్వుతూ.

పల్లవి వాళ్ల దగ్గరకు వచ్చింది. అమర్ పరిచయం చేశాడు. “నా శ్రీమతి. పేరు పల్లవి. కానీ మా ఇంట్లో, పల్లవి, చరణం – అన్నీ ఆమే. ఇక్కడ కూడా కనిపించిన వన్నీ అడుగుతూ – వేలంపాట పాడేస్తోంది”

“ఏంటండీ, అలా అంటారు? బయటి కొచ్చాక, మార్కెట్ సర్వే చేయవద్దూ” అన్నది పల్లవి.

జనం రద్దీ ఎక్కువైనందు వల్ల ముందుకు కదిలారు. పల్లవి అడుగడుగునా ఆగిపోతుంటే, వాళ్లూ ఆగి, తమ చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటున్నారు.

పల్లవి చివరకు ఒక శాలువా కొని, భర్త భుజం మీద వేసింది. “బావుందా?” అని అడిగింది.

“ప్రేమనగర్‌లో నాగేశ్వరరావులా ఉన్నాను” అన్నాడు అమర్.

“లేదురా, చాలా బాగుంది” అన్నాడు రాజేంద్ర.

ఆమె వద్దంటున్నా రాజేంద్ర ముగ్గురుకీ ఐస్ క్రీం తీసుకొచ్చాడు. ఇంకో గంటసేపు కాలక్షేపం చేశాక, విడిపోయే ముందు పల్లవి రాజేంద్రతో అన్నది “వచ్చే ఆదివారం మా ఇంటికి లంచ్‌కి రండి, ఫామిలీతో రండి” అని. అతను నవ్వడం చూసి, “ఏమిటి నవ్వుతున్నారు?” అంది.

“‘నాకు పెళ్లి కాలేదు. ఎవరి ఫామిలీతో రావాలి?”

“చదువూ, సంపాదనా, అన్నీ ఉండి పెళ్లి ఎందుకు చేసుకోలేదు?” అని ఆసక్తిగా అడిగింది.

“కొన్నిటికి కారణాలు ఉండవు” అన్నాడు రాజేంద్ర జీవం లేని నవ్వుతో.

“నచ్చిన పిల్ల దొరకలేదేమో” అన్నాడు అమర్.

“అవునా? నచ్చిన మనిషి దొరకనప్పుడు, దొరికిన మనిషితో అడ్జస్ట్ కావాలి. రాజీపడలేని వాళ్లు జీవితంలో సుఖపడలేరు” అన్నది పల్లవి.

ఆ తరువాత అప్పటికి విడిపోయారు.

అదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాజేంద్ర, అమర్ ఇంటికి వచ్చాడు. అమర్ ఆహ్వానించాడు. పల్లవి వంటింట్లో నుంచి వచ్చి నవ్వుతూ పలకరించింది. ఆమె వెనకాలే తలుపు అవతల నిలబడ్డ గీతను తీసుకొచ్చి పరిచయం చేసింది.

“మా బంధువుల అమ్మాయి గీత.”

గీత నమస్కారం చేసింది.

“ఏం చేస్తున్నారు?” అని అడిగాడు రాజేంద్ర

“ప్రస్తుతం వంట చేస్తోందిరా. మా ఆవిడకు సాయం చేస్తోంది” అన్నాడు అమర్.

కరెంటు పోయింది. ఫాన్ ఆగిపోయింది.

“ఇందాక కరెంటు పోయింది. వంట ఎలా అవుతుందిరా భగవంతుడా అనుకున్నాను. గీత ఇంట్లో అడుగు పెట్టిందో లేదో, కరెంటు వచ్చింది. గీత రాగానే ఇంట్లో దీపాలన్నీ వెలిగాయి. మా అమ్మాయి అని గొప్ప చెప్పుకోవటం కాదుగానీ, అది ఏ ఇంట్లో అడుగుపెడితే, ఆ ఇంట్లో వేరే దీపం పెట్టనవసరం లేదు” అని చెప్పుకుపోతున్నది పల్లవి.

భోజనాలు చేస్తున్నప్పుడు పల్లని దగ్గరుండి వడ్డించింది. భర్తను మాత్రం కంట్రోలు చేస్తూనే ఉంది.

“నువ్వు అదృష్టవంతుడివిరా నిన్ను ఇలా తిండి దగ్గర కంట్రోలు చేసే మనిషి లేదు” అన్నాడు అమర్.

పల్లవి టాపిక్ మార్చింది. వంట ఎలా ఉంది అని అడిగింది, ‘సూపర్’ అని అన్నాడు రాజేంద్ర.

“ప్రిపరేషన్స్ అన్నీ గీత చేసినవే. మా అమ్మాయి ఆని గొప్ప చెప్పుకోవటం కాదు గానీ అది చదువులో బ్రిల్లియంట్, వంటలో ఎక్స్‌పర్ట్. పాటలు పాడుతుంది. కుట్లు, అల్లికలూ అన్నీ వచ్చు. వినయం, విధేయత, అణుకువ ఉన్న పిల్ల” అని పల్లని చెప్పేస్తోంది.

“చాలా మంచి విషయాలు చెప్పావు” అన్నాడు అమర్ వ్యంగ్యంగా.

“మీరు ఉండండి. గీతను ఎవరు చేసుకుంటారో గానీ, నిజంగా అంత అదృష్టవంతుడు, లక్ష్కీ ఫెలో మరొకడు ఉండడు” అన్నది పల్లవి నెయ్యి వడ్డిస్తూ.

“చాలు, చాలు” అన్నాడు రాజేంద్ర చెయ్యి అడ్డం పెడుతూ.

“మొహంలో లక్ష్మీకళ ఉట్టి పడుతుంది. దాన్ని చేసుకున్న వాడి ఇంట సిరిసంపదలు పొంగి పొరలుతాయి” అన్నది పల్లవి.

భోజనాలు అయ్యాయి. ఇంకో గంట తరువాత రాజేంద్ర వెళ్లిపోయాడు.

వీలున్నప్పుడల్లా వచ్చిపోతూనే ఉన్నాడు. వచ్చినప్పుడల్లా గీత గురించి గొప్పగా చెబుతూనే ఉంది.

ఒకరోజు పల్లవి అడిగింది.

“నువ్వు గీతను పెళ్లి చేసుకుంటే బావుంటుంది. అన్ని విధాలా యోగ్యురాలు. ఆమెకు ఉన్న ఒకే ఒక్క లోపం పేదరికం. తల్లిదండ్రులు పెద్దగా కన్నాలూ కానుకలూ ఇచ్చుకోలేక పోవచ్చు. కానీ పెళ్లి అయ్యాక బాగా కల్సి వస్తుంది.” అని పల్లవి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది.

“సెంటిమెంటు మీద తరువాత ప్లే చేద్దువుగాని. ఒక్క విషయం చెప్పు. అయిదేళ్ల కిందట నేను నీ వెంటపడి, నీ వెనకాల తిరిగిన రోజుల్లో, నువ్వు నన్ను ప్రేమించి కూడా ఎందుకు దూరం అయ్యావు?” అని అడిగాడు రాజేంద్ర.

“అప్పుడూ ఇదే సమస్య. మేం పేదవాళ్లు. మీరు ఉన్నవాళ్లు”

“కానీ నాకా అభ్యంతరం లేదు. నీకా విషయం తెల్సు!”

“తెల్సు.. కానీ మీ వాళ్లు ఒప్పుకోరు. నా కోసం మీ వాళ్ళకు దూరమయి, నాకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తావు. అందువల్ల నీ చదువు దెబ్బ తింటుంది. నీ భవిష్యత్తు దెబ్బ తింటుంది. నా కోసం, నువ్వు ఆస్తి, ఐశ్వర్యం అన్నీ పోగొట్టుకొని, అయిన వాళ్లందరికీ దూరమై తిండికి గడవక, డబ్బు అవసరాలు మెడమీద తన్నుతుంటే, రెక్కలు ముక్కలు చేసుకుంటూ.. నా వల్ల నీకు కష్టాలూ, కన్నీళ్లు మిగలటం నేను భరించలేని విషయం.. అందుకే నీకు దూరమయ్యాను..” అన్నది పల్లవి.

“ప్రేమించిన మనిషి కోసం ఆ మాత్రం..”

“త్యాగాలూ, సాహసాలు అని అందమైన పేర్లు పెట్టుకుని మనకు మనం తృప్తి పడినంత మాత్రాన కన్నీరు, పన్నీరుగా మారదు.. అంటే అందని ప్రేమ ఎప్పుడూ అందంగానే ఉంటుంది. దాన్ని అలాగే ఉండనీ..” అని చెప్పింది పల్లవి.

రాజేంద్ర నిట్టూర్చాడు.

పల్లవి రాజేంద్ర పెళ్లి విషయం భర్తతో సంప్రదించింది.

“గీత అన్ని విధాలా తగిన అమ్మాయే కావచ్చు. కానీ వాళ్లు పెళ్లి ఖర్పులు కూడా భరించలేని స్థితిలో ఉన్నారు. వాడేమో మంచి పొజిషన్లో ఉన్నాడు. బలగమూ ఎక్కువే. వాళ్లకు మర్యాదలు జరిపించే స్థితిలో కూడా వీళ్లు లేరు గదా మరి” అన్నాడు అమర్.

“నిజమేననుకోండి. మనమే పెద్దరికం వహించి జరిపిద్దాం” అన్నది పల్లవి.

“మనం మాత్రం అంత బరువు ఎత్తుకోగలమా?”

“దేవుడికి గుళ్లు గోపురాలు కట్టిస్తే, పుణ్యం వస్తుందో రాదో గానీ, ఒక అడపిల్ల జీవితాన్ని నిలబెడితే, భగవంతుడు తప్పక హర్షిస్తాడు. మీరు వెళ్లి మాట్లాడి రండి. మంచి పని చేస్తున్నప్పుడు అన్నీ కలసివస్తాయి. నాకా నమ్మకం ఉంది” అన్నది పల్లవి.

అమర్ వెళ్లి రాజేంద్రతో మాట్లాడాడు. అతను గీతను చేసుకోవటానికి అంగీకరించాడు.

కట్నాలూ కానుకలూ వద్దన్నాడు.

“కొండంత దేవునికి కొండంత పత్రిని తేలేము. కానీ ఈ కొద్దిపాటి లాంచనాలూ స్వీకరించు.. పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే కదా చేసుకుంటాం” అన్నది పల్లవి.

పెళ్లి జరిగిన తరువాత గీత, పల్లవి కాళ్లకు నమస్కారం చేసి, “నీ రుణం నేనెలా తీర్చుకోగలను అక్కా” అని అడిగింది.

“ఎవరికి ఎవరు రుణపడి ఉన్నారో మనకేం తెలుసు? కిందటి జన్మలో నేనే నీకు రుణపడి ఈ జన్మలో ఆ రుణం ఇలా తీర్చుకున్నానేమో” అన్నది పల్లవి.

పెళ్లి అయిన నెలరోజులకి అమర్ అడిగాడు “నీ నెక్లెస్ కనిపించటం లేదేం?” అని.

“అల్మారాలో పెట్టానండీ. ఈ సందడిలో ఏమైందో? కనిపించటం లేదు” అన్నది పల్లవి.

ఏడాది గడిచింది. అమర్ ఆరోగ్యం క్షీణించింది. హార్ట్ ఎన్‌లార్జ్‌మెంట్, ఏ డాక్టరూ నయం చేయలేని రోగం.

ఓ రోజు సాయంత్రం అమర్ తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు.

నెలరోజుల తరువాత మరణించిన భర్తకు రావాల్సిన డబ్బు తీసుకొచ్చి రాజేంద్ర ఆమె చేతికి ఇచ్చినప్పుడు ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది.

“చాలామంచి విషయాలు చెప్పావంటూ ఎప్పుడూ నాతో సరసాలు ఆడే మనిషి ఇంక కనపించడు. ఇంక ఆయన స్మృతులు మాత్రమే వెన్నంటి వస్తుంటయి. ఆయన్ని కాపాడుకునేందుకు నేను మొక్కని దేవుడు లేడు. చేయని పూజులు లేవు.. నేను దొరకలేదని నువ్వు అవివాహితుడివిగా ఉండిపోయావు. బహుశా ఆ ఉసురు తగిలి.. నా బ్రతుకు ఇలా అయిపోయిందేమో.. అందుకే పట్టుబట్టి నీ పెళ్లి చేశాను. నేనొక సెంటిమెంటల్ ఫూల్ అనుకున్నా సరే.. నా నమ్మకాలు నావి. సెంటిమెంట్ లేని మానవ జీవన కథ ఏదైనా ఉందా? బ్రతుకుటెడారిలో నువ్వు కట్టుకున్న జ్ఞాపకాల మందిరంలో దీపం వెలిగిస్తే, ఆ కాంతి నా గుమ్మం ముందు పడకపోతుందా అని ఆశపడ్డాను. ఆశపడటానికి కూడా అర్హత ఉండాలని తెల్సి వచ్చింది” అంటూ కన్నీరు తుడుచుకుంది పల్లవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here