చిరుజల్లు-108

0
9

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

గాజు వంటి హృదయం

[dropcap]పె[/dropcap]ళ్లి ఇల్లు సందడిగా ఉంది. ఇంటి నిండా బంధువులంతా బిలబిలమంటూ తిరుగుతున్నారు. గలగలమని మాట్లాడుతున్నారు. అతిథులంతా కార్లల్లో నుంచి, ఆటోల్లో నుంచి దిగుతున్నారు.

చంద్రశేఖరరావు ముఖానికి చిరునవ్వు పులుముకొని అందరికీ ఆహ్వానం పలుకుతున్నాడు. ఆయన భార్య మాత్రం ఆ దరిదాపుల్లో ఎక్కడా కనిపించటం లేదు. ఆమె మేడ మీద గదిలోనుంచి బయటకు రావటం లేదు.

“ఇంతవరకూ పెళ్లివాళ్లు రాలేదు. పెళ్లికొడుకు జాడ తెలియదు. గట్టిగా రెండు గంటలు టైం కూడా లేదు. ఈ పెళ్లి జరుగుతుందన్న నమ్మకం లేదు. ఇంత జరిగాక ఈ పెళ్ళి ఆగిపోతే, ఇంటిల్లపాదీ విషం తాగి చావటం తప్ప మరో మార్గం లేదు” అంటున్నది సీతామహాలక్ష్మి తోడికోడలు సరస్వతితో.

“ఊరుకో అక్కా, శుభమా అని పెళ్లి జరుగుతుంటే, ఏమిట మాటలు? అన్నీ సవ్యంగా జరిగిపోతాయి. మంచీ మర్యాదా మనకేనా? వాళ్లకు మాత్రం లేవూ? వస్తార్లే. నువ్వు తొందరగా రెడీ అవు” అంటోంది సరస్వతి.

పక్క గదిలో పెళ్ళికూతురు గాయత్రికి ముస్తాబు చేస్తున్నారు.

“ఏమర్రా? ముస్తాబు పూర్తి అయిందా? ఆవతల పురోహితుడు ముహుర్తానికి టైం అయిందని తొందర చేస్తున్నారు. తెమలండి” అంటూ హెచ్చరిస్తోంది సరస్వతి.

“ముస్తాబు చేయటం అయిపోయింది. పెళ్ళికొడుకు ఇంకా రాలేదట. అందరూ అతని కోసమే ఎదురు చూస్తున్నారు” అని అన్నదో అమ్మాయి గాయత్రి తలలో పూల చెండు తురుముతూ.

“వచ్చేస్తాడు. మీరు కానివ్వండి” అంటూ ఆమె హడావుడిగా వెళ్ళిపోయింది. కిందనుంచి సన్నాయి మేళం వినిపిస్తోంది.

“అసలు బయల్దేరారా? ఫోన్ అయినా చేయవచ్చుగదా” అన్నది మరొక ఆమె.

“అదొక పల్లెటూరు అట. అక్కడ ఫోన్లూ, వైర్‍లెస్‌లూ, ఇంటర్నెట్లూ ఉన్నాయో, లేదో” అన్నది మరో అమ్మాయి.

“ఇంకో రౌండు కూల్ డ్రింక్స్ తాగుతారా ఎవరైనా?” అంటూ డ్రింక్స్‌తో వచ్చాడో అబ్బాయి.

గాయత్రికి వాళ్ళ మాటలేమీ వినిపించటం లేదు.

ఇంతమంది ఇన్ని సందేహాలూ, అనుమానాలూ వ్యక్తం చేస్తున్నా, ఆమెకు మాత్రం గట్టి నమ్మకం ఉంది. ‘ప్రదీప్ సంగతి వీళ్లకు తెలియక అలా మాట్లాడుతున్నారు. మారు కోసం ప్రాణం ఇచ్చే మనిషి అతను’ అనుకున్నదామె.

వీడియో అతను వచ్చి, గాయత్రి చుట్టూ తిరుగుతూ, వీడియో తీస్తున్నాడు. పట్టు చీరలూ, జరీ అంచులూ సవరించుకుంటూ నిలబడుతున్నారు అందరూ.

“పెళ్లికూతురు తల్లికి జ్వరం. ఒళ్లు కాలిపోతోంది” అంటూ ఒకామె కబురు పట్టుకొచ్చింది.

“టెన్షన్, టెన్షన్ ఫీలవుతోంది ఆమె. అంతకన్నా మరేం లేదు.” అంటూ కొందరు ఆమెను పరామర్శించటానికి పక్క గదిలోకి కెళ్లారు.

గాయత్రి కూడా లేచి తల్లి దగ్గరకు వెళ్ళబోయింది గానీ మనసొప్పలేదు.

సోఫాలో కూలబడి కళ్లు మూసుకుంది. ఆలోచనలో పడిపోయింది.

అమ్మకు టెన్షనూ, ఫీవరూ, బి.పి. అన్నే తన మూలంగానే. నిన్నటి నుండి ఆమెకు కోపం క్షణక్షణానికి పెరిగిపోతోంది. తిట్టి పోస్తోంది. ఆమె దగ్గరకు వెళ్లాలంటేనే గిల్టీగా ఉంది. ‘ఏం ఫర్వాలేదు. అంతా సవ్యంగా జరిగిపోతుంద’ని చెప్పినా వినటంలేదు. బర్రున చీదేస్తునే ఉంది. అందుకు కారణం ఉంది. ఆమెకు నచ్చిన సంబంధాన్ని తను కాదన్నది. తను చేసుకుంటున్నసంబందం ఆమెకు ఎంత మాత్రం నచ్చలేదు.

‘ప్రదీప్‌కు ఇవాళ ఆస్తి లేకపోవచ్చు. అంతస్తు లేకపోవచ్చు. కానీ అతను జీనియస్. ఎంత తెలివిగలవాడో, అంత మంచివాడు. ప్రస్తుతానికి నివురు గప్పిన నిప్పులా ఉన్నా అతను తప్పకుండా పైకివస్తాడు. ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదుగుతాడు. అలాంటి మేధావిని దూరం చేసుకోవటం అంత తెలివితక్కువ తనం మరొకటి లేదు.  ఇవాళ అతనికి ఉన్న సోషల్ స్టేటస్ మాత్రమే చూస్తున్నారు. ఇక్కడే మిగిలిన వాళ్లకూ తనకూ పొంతన కుదరటం లేదు’.

ఈ విషయంలో ప్రదీప్ కూడా తనను హెచ్చరించాడు. ‘భవిష్యత్తు మీద అంత భరోసా పనికి రాదు. అనుకున్న దేవీ జరగకపోతే, నిరాశలో కృంగిపోవాల్సి వస్తుంది. కనుక ఇవాళ్టి పరిస్తితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి’ – అని.

పదేపదే చెప్పాడు. అతని మాటలకు బదులు చెప్పింది. “మా అమ్మ తమ్ముడ్ని చేసుకుంటే, ఆమెకు తృప్తిగా ఉంటుంది. కానీ అతని నేలబారు ఆలోచనలూ, కుతంత్రాలూ, కుత్సితాలు నాకు నచ్చవు. అలాంటి మనిషితో జీవించటం కన్నా, పెద్ద శిక్ష ఏముంటుంది? నిన్ను ప్రేమించాను. వర్షంలాగా, నెన్నెల లాగా ఈ ప్రేమలూ, అభిమానాలూ సహజంగా ఏర్పడాలి గానీ ఫలానావాడిని ప్రేమించు, కల్పి జీవించం అని శాసించటం కంటే పెద్ద శిక్ష  ఏముంటుంది” – అని అతనికి చెప్పింది.

తను ఆ ఆఫీసులో ఉద్యోగంలో చేరిన మొదటి రోజునే వర్క్ నేర్చుకోమని అతని దగ్గరకు పంపించారు. ఇదేం బ్రహ్మవిద్య కాదంటూనే ఎన్నో విషయాలు నేర్పాడు. ప్రతి విషయాన్నీ అతను విశ్లేషించే పద్ధతి, అవగాహన చేసుకునే తీరు భిన్నంగా ఉండేవి. ఆఫీసు పనితో పాటు మరెన్నో విషయాలు అతని దగ్గర నేర్చుకుంది. అతని తెలివితేటలకు ఆ ఉద్యోగం చాలా చిన్నదనిపించింది. ఆ మాట అంటే, తనకన్నా తెలివిగల వాళ్లు ఎంతోమంది ఇంతకన్నా చిన్న ఉద్యోగాలలో ఉన్నారన్నాడు. ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు. జీవితాంతం కష్టపడి పరిశోధనలు చేసి గొప్పవిషయం కనుగొన్నాడు. ప్రపంచం అంతా అతన్ని జీనియస్ అని పొగిడింది. అతను మాత్రం సవినయంగా, తనకన్నా ముందు ఎందరో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు తనకెంతో ఉపయోగపడినయి, వీళ్లందరి భుజాల మీద ఎక్కి తను గొప్పవాడిని అయినానని అన్నాడట. ప్రతిదీ మనం ఆలోచించే కోణం మీద ఆధారపడి ఉంటుందని అన్నాడట ఆ శాస్త్రజ్ఞుడు.

ప్రదీప్‌ను తండ్రికి పరిచయం చేసింది. ఆయనకు ప్రదీప్ అందరి కుర్రాళ్లలాగానే కనిపించాడు. అతనికి ఆస్తి లేదు. ముసలి తల్లీ తండ్రీ ఉన్నారు. పెళ్లి కావల్సిన చెల్లెలు ఉంది. బాధ్యతలు ఉన్నాయి. ఏం చూసి అతన్ని చేసుకుంటావని తండ్రి అడిగాడు.

ఎవరు ఎన్నిసార్లు ఎన్ని చెప్పినా అతన్ని తప్ప మరొకడిని తన భర్తగా ఊహించుకోలేకపోయింది.

ఇంతలో ప్రదీప్‌కు ఇంతకన్నా మంచి ఉద్యోగం వచ్చింది. చెన్నయ్ వెళ్లిపోయాడు.

“పీడా వదిలింది” అన్నది తల్లి. “నాలుగు రోజులుంటే వాళ్లే మర్చిపోతారు” అని తండ్రి అన్నాడు.

నాలుగు రోజులు కాదు, నలభై జన్మలెత్తినా ఆమె ప్రదీప్‍ను మర్చిపోలేదు. వెళ్లిన కొత్తలో తరచూ మాట్లాడేవాడు. క్రమంగా దూరమైనాడు.

కొద్దిరోజుల తరువాత అతన్ని వెతుక్కుంటూ వెళ్లింది. అకస్మాత్తుగా ప్రత్యక్షమైన ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. “ఎలా ఉన్నావు?” అని నవ్వుతూ అడిగాడు. కలల్లో కనిపించి, కళ్లు తెరవగానే మాయమై పోయే అతని కోసం వెతుకుతూ, కలతలూ, కలవరింతలూ, కన్నీళ్లూ కలహాలతో తిరుగుతున్నానని చెప్పింది.

సముద్రం ఒడ్డున కూర్చుని ఎద లోని సొదను వినిపించింది. “నాది గాజు వంటి హృదయం. దాన్ని బద్దలు కొట్టి వెళ్లిపోతావా?” అని అడిగింది.

“తప్పు నాది కాదు. దేవుడిది. ఈ మధ్య నా ఆరోగ్యం బాగా లేదు. అప్పుడప్పుడు ఫిట్స్ వస్తున్నాయి. ఇది ఎటు దారి తీస్తుందో లేదా తెలియదు. నేను ఏమై పోయినా పర్వాలేదు. కానీ నా మూలంగా నీకు సమస్యలు రాకూడదు.” అన్నాడు.

అతనికి ఫిట్స్ వస్తున్నాయంటే నమ్మలేకపోతోంది. ఆతనితో పాటు ఒకరిద్దరు డాక్టర్ల దగ్గరకు వెళ్ళింది. మానసిక ఒత్తిడి తగ్గితే, అన్నీ తగ్గిపోతాయని చెప్పారు. అతనికి చిన్నప్పటి నుంచీ ఆ జబ్బులేదు. అతిగా ఆలోచించటం, మానసికంగా బాధపడటం అతనికి అలవాటే. దీన్ని నివారించడం తన చేతిలో పనే అని అర్థం చేసుకుంది.

ఆమె ఇంట్లో ఈ విషయంలో హోరాహోరీ పోరాటం జరిగేది. “రేపు వాడికి ఏదన్నా అయితే ఏం చేస్తావు?” అని తండ్రి అడిగాడు. “నా నుదుట ఎలా రాసి ఉంటే, అలా జరుగుతుంది” అని చెప్పింది.

చివరకు తండ్రి అయిష్టంగానే ఒప్పుకున్నాడు. తల్లి మాత్రం “పీటల మీద కూర్చోను” అని ఖచ్చితంగా చెప్పేసింది. ఉన్న ఒక్క కూతురి పెళ్ల సలక్షణంగా జరిపించక, ఈ పంతాలూ, పట్టింపులూ ఏమిటిని బంధువులందరూ నచ్చచెప్పినా ఆమె వినలేదు.

ప్రదీప్ తల్లిదండ్రులూ ఈ సంబంధానికి ఒప్పుకోలేదు. అతని మానసిక ఒత్తిడికి అదే అసలు కారణం.

ఎవరికీ ఇష్టం లేని పెళ్ళి, అందరితో యుద్ధాలు చేసి, ఆమె కావాలని చేసుకుంటున్న వివాహం ఇది. ఏ మాత్రం పొరపాటు జరిగినా అందరూ ఆమెనే నిందిస్తారు. అసలు ఈ పెళ్ళి జరగదని కొందరు పందేలు వేసుకున్నారు. ఇది ఆగిపోతే, ఆమె తల్లీ తండ్రీ ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. పరువు కోసం ప్రాణాలు ఇచ్చే మనుష్యులు ఈ షాక్ నుంచి తీరుకోలేరు – అనుకుంటూ గాయత్రి కిటికీ లోనుంచి గేటు వైపే చూస్తోంది.

వచ్చిన అతిథులందరూ పెళ్లి ఆగిపోయిందని నిర్ధారించుకుని తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు.

ఇక మూహుర్తానికి అయిదు నిముషాలే ఉంది. ఒక్కో క్షణం గడిచేకొద్దీ గాయత్రికి కన్నీరు పెల్లుబుకుతోంది.

ఇంతలో ఇంటి ముందు ఆగింది. కన్నీటి పొరల్లోనుంచి చూసింది. ప్రదీప్ ఆటో దిగటంతో పరుగు పరుగున కిందకు వెళ్లింది. అతని గుండెల మీద వాలిపోయి ఏడ్చేసింది.

“పెళ్లి కూతురు ఏడవకూడదు. నవ్వాలి” అంటూ కన్నీరు తుడిచాడు.

“ముహుర్తానికి మూడు నిముషాలే ఉంది” అంటూ గుర్తుచేశాడు పురోహితుడు.

ప్రదీప్ అందరికీ క్షమాపణలు చెప్పాడు. “నేను అయిదారు గంటల ముందే రావల్సింది. బస్సుకు యాక్సిడెంటు అయింది. నా అదృష్టవశాత్తూ నేను చిన్న గాయాలతో బయట పడిపోయాను. రావటానికి వేరే వాహనం దొరకలేదు. అతి కష్టం మీద ముహుర్తం వేళకు రాగలిగానూ అంటే ఇది గాయత్రి చలవే. ఇంత సేపు మిమ్మల్ని టెన్షన్లో ఉంచినందుకు క్షమించాలి..” అన్నాడు..

ప్రదీప్ చేతికి ఉన్న కట్టు చూసి గాయత్రి అడిగింది. “దెబ్బ బాగా తగిలిందా?” అని.

“దీనిదేముంది? రెండు రోజుల్లో మానిపోతుంది. టైంకు రాకపోయి ఉంటే, గాజు వంటి నీ హృదయానికి పెద్ద దెబ్బ తగిలి ఉండేది” అన్నాడు నవ్వుతూ.

గాయత్రి నిట్టూర్చింది.

అతను మంగళసూత్రం అందుకున్నాడు. ఆమె కళ్ల ముందు ఉజ్వల భవిష్యత్తు కదలాడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here