చిరుజల్లు-109

0
11

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

నిద్రలేచిన మహిళ

[dropcap]యా[/dropcap]దమ్మ కుళాయి దగ్గర గిన్నెలు కడుగుతోంది.

అరుంధతి హడావిడి పడుతోంది. యాదమ్మను పని ముగించమని తొందర పెడుతోంది.

“అవతల మానవ హారానికి టైం అవుతోంది. తొందరగా తెములు” అంటోంది అరుంధతి.

మానవహారం అంటే ఏమిటో యాదమ్మకు తెలియదు. కానీ అమ్మగారు బయటకు వెళ్లటానికి తొందరపడుతున్నారని మాత్రం అర్థమైంది. గిన్నెలు కడిగి వంటింట్లో పెట్టి తడి చెయ్యి తుడుచుకుంది. అమ్మగారు ఇచ్చిన చాయ్ తాగింది.

అరుంధతి తలుపులు వేసేస్తూ టైం చూసుకుంటోంది. ఇంటికి తాళం వేస్తూ యాదమ్మతో అన్నది –

“నువ్వు కూడా రాకూడదూ?” అని

“యాడికమ్మ గారూ?”

“మానవ హారానికి..”

“అంటే ఏందమ్మ?” అని అడిగింది.

“ఇప్పుడు టైం లేదు. తరువాత చెబుతాను పద..” అన్నది అరుంధతి.

ఆమెతో పాటు యాదమ్మ కూడా మెయిన్ రోడ్డు మీదకు వచ్చింది. అక్కడ కొన్ని వందలమంది మహిళలు ఒకరి చెయ్యి మరొకరు పట్టుకొని నిలబడ్డారు. వాళ్లంతా అలా ఎందుకు నిలబడ్డారో తెలియక పోయినా, అదేదో కొత్తగా, వింతగా ఉంది. కాసేపు అదో ఆటలా అనిపించింది.

“ఏందమ్మా ఇది? ఎందుకెట్లు నిలబడ్డారు?” అని పక్కనున్న ఒకామెను అడిగింది..

“అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతున్నది లేదా.. అందుకని..” అని చెప్పిందామె.

చిన్నా, పెద్దా, బీదా బిక్కీ అన్న తేడాలు లేకుండా అందరూ చేతులు పట్టుకొని నిలబడటం యాదమ్మకు వింతగా ఉంది.

గంట తరువాత ఇంటికెళ్లింది. వంట చేసుకుంది. మధ్యాహ్నం మళ్లీ అందరి ఇళ్లల్లో గిన్నెలు తోమటానికి వెళ్ళింది. రాత్రికి అమ్మగారి ఇంటి నుంచి తెచ్చుకున్న అన్నం తినేసింది. మొగుడికి మాత్రం అన్నం వండింది. అమ్మగారు ఇచ్చిన కొబ్బరి పచ్చడి, చారు మొగుడి కోసం ఉంచింది.

“ఈడు ఎప్పుడొస్తాడో, ఏంటో” అంటూ గుడిసె ముందు చాప పరుచుకుని దాని మీద పడుకుంది. పగలంతా చాకిరీ చేసినందు వల్ల ఒళ్లు తెలియ నిద్రపట్టేసింది.

అ సమయంలో యాదమ్మ మొగుడు నర్సిమ్మ కల్లు కాంపౌండులో జంగయ్యతో కల్సి తాగుతున్నాడు. తాగినప్పుడు నోటి కాచ్చినట్లు వాగుతుంటాడు.

ఆ కాంపౌండ్ అంతా అదో రకమైన వాసనతో నిండి ఉంది. ఇద్దరేసి, ముగ్గురేసి ఒక చోట కూర్చుని వాళ్ల ధ్యాసలో సంధి ప్రేలాపనలో ఉన్నారు. అదొక పిచ్చివాళ్ల స్వర్గంలా ఉంది.

“లే.. నేనేమంటున్నా.. ఇయ్యాలరేపు ఈ దునియా ఎట్లున్నడంటే, ఇట్లున్నదని చెప్పేదానికి లేకుండా ఉన్నది.. ఇన్నవా..” అని అడిగాడు నర్సిమ్మ.

“ఇన్నగానీ, నువ్వు తాపుతవా, లేదా.. గది జెప్పరాదు ముందు” అంటున్నాడు జంగయ్య, తాగినది చాలక.

“అరే, నీకు తాపియ్యకుండ ఉంటనా.. రేయ్.. చోటే” అని పిల్చాడు నర్సిమ్మ.

“గదీ మాటంటే.. షాన్ మే ఫరక్ నై ఆనా.. అదీ మన పైసల తోని మనం తాగుతున్నం. తప్పేముందిరా బయ్.. అమెరికా వోడు కూడా తాగుతుండు. ఏమంటవ్?” అన్నాడు జంగయ్య.

“అరే. అమెరికా వోడి సంగతి జెప్పకు.. సచ్చేటోడ్ని బతికిస్తుడు.. బతికినోడ్ని జంపేస్తడు. గిదేందిర బయ్…?” అన్నాడు నర్సిమ్మ.

అరగంట తరువాత ఇద్దరూ ఇంటి దోవ పట్టారు. ఒకడ్ని పట్టుకుని మరొకడు నడుస్తున్నారు. ఇద్దరూ తూలుతున్నారు.

వీళ్లిద్దర్నీ చూసి వీధి కుక్కలు వెంటబడి అరుస్తుంటే ఆగిపోయారు.

“కుక్క కరుసుద్దిరా బయ్, వాపస్ పోదాం” అన్నాడు నర్సిమ్మ.

“అరే, కర్వనియ్యరా, నిన్ను కర్సినంక అది బతికి ఉంటదిరా” అన్నాడు జంగయ్య నెమ్మదిగా వాటి పక్కనుంచి దారి చేసుకుంటూ.

గుడిసెల దగ్గర కొచ్చారు. ఆరుబయట పడుకున్నవాళ్లు కాళ్లు తొక్కారు. నిద్రలో ఉన్నవాళ్లు కెవ్వుమని అరుస్తూ లేచారు.

“నమస్సే అన్నా మంచిగున్నవా? అని అడుగుతున్న” అంటూ కొట్టటానికి వచ్చిన వాడికి దణ్ణాలు పెట్టారు.

తప్పతాగిన తరువాత వీధికుక్కల్ని చూసి భయపడేవాడు, కనిపించిన వాడికల్లా దణ్ణాలు పెట్టేవాడు – ఇంటికి వచ్చాక, పెళ్లాన్ని చూడగానే పులిలాగా మారిపోతాడు. పెళ్లాం అంటే, కొట్టినా, తిట్టినా చచ్చినట్లు పడి ఉంటుంది. అందుకని అలుసు. ఊళ్లో వాళ్లందరి మీది కోపమూ భార్య మీదకు మళ్లుతుంది. మగవాడి చేతగానితనాన్ని, దౌర్జన్వాన్ని ఓపికగా భరించే జీవి పేరే ‘పెళ్లాం’.

నర్సిమ్మ గుమ్మం ముందు పడుకున్న భార్యను కాలితో తన్నాడు. ఉలిక్కిపడి లేచింది యాదమ్మ.

‘సచ్చినోడు ఒచ్చిండు’ అని గొణుక్కుంటూ లేచి కూర్చుంది. మొగుడు తన్నినందువల్ల, మోచేయి రాయికి తగిలి గీరుకు పోయింది. రెండో చేత్తో రుద్దుకుంటోంది.

“నేనెవల్? నేనెవలున్న?” అని అడుగుతున్నాడు నర్సిమ్మ.

“దినాం తాగుడు, పిచ్చి వాగుడు. ఇదే పని” అని గొణుక్కుంది యాదమ్మ.

“నేను దినామంత కష్టం జేసి ఒచ్చిన. నువ్వేం జెయ్యాల మల్ల?” అని అడుగుతున్నాడు.

‘నిన్ను కాష్టంల బెట్టాల’ అనుకుంటూ గుడిసెలోకి వెళ్లింది. నర్ఫిమ్మ కూడా లోపలికి వెళ్లాడు.

పళ్ళెంలో అన్నం, పచ్చడి వేసి ముందు పెట్టింది. కంచం ముందు కూర్చొన్నాడు.

“గిదేందే? నేను పగలంతా కష్టంజేసి ఒస్తే, కారం మెతుకులు పెడతావా? నువ్వు మస్తుగ దినోస్తవ్. నాకు చట్నీ ఏస్తవ్, లే? నేను దినన్” తిన్నాడు కంచం పక్కకు నెట్టి.

“అర్ధరాత్రి ఒచ్చి ఏం యాగీ జేస్తవ్?” అని అడిగింది యాదమ్మ.

“యాగీ అంటావే? నేను మొగుడున్న, నువ్వు పెళ్లాం ఉన్నవ్. నువు సెకెన్ దింటావ్, నాకు చట్నీ ఏస్తవ్‌లే? నాకు ఇప్పుడు సికెన్ గావాల?”

“గిప్పుడు సికెన్ యాడికెళ్లి దేవాల?” అని అడిగించి యాదమ్మ

“గది నాకు దెల్వదు. నాకయితే సికెన్ గావాల. తెస్తవా, లేదా?”

“తేను”

“తేనంటావే?” అంటూ యాదమ్మను వంగదీసి వీపు మీద రెండు చేతులతో కొడుతుంటే ముందుకు పడిపోయింది. నేల మీద కుప్పకూలిన భార్యను కాలితో తన్నుతుంటే, యాదమ్మ చేసిన ఆక్రందం ఆ గుడిసెలో నుంచి బయటకొచ్చి చీకట్లో, గాలిలో కలిసి పోయింది.

పక్కగుడిసెల్లోని వాళ్లకు అ ఏడుపులు వినిపించినా, విననట్లే పక్కకు మళ్లి పడుకున్నారు. ఒక స్త్రీ నిస్సహాయంగా రోదిస్తుంటే, అదేదో రోజూ వినే జోలపాట అయినట్లు మెలకువలో నుంచి నిద్రలోకి జారుకున్నారు.

తెల్లవారింది. యాదమ్మ మొగుడితో మాట్లాడలేదు. నర్సిమ్మ కాసేపు చూసి పెళ్లాన్ని పలకరించాడు.

“అరే, ఏమైందే? రాత్రి గిట్ల పరేషాన్ జేసిన్రా?” అని అడిగాడు.

రాత్రి భార్యను చావగొట్టిన విషయం నర్సిమ్మకు లీలగా కూడా గుర్తులేదు. భార్యకు కాళ్లూ చేతులూ విరిగినా ఏమీ కానట్లే, భర్తకు సేవలు చేయాలి. అదీ నర్సిమ్మ ఆశించేది.

“చాయ్ తాపియ్యవా?” అని అడిగాడు.

యాదమ్మ మాట్లాడలేదు. రాత్రి డొక్కలో తన్నాడు. కడుపులో నొప్పి, చెయ్యి లేవట్లేదు. జబ్బ నొప్పి.

పదిగంటలు అయినాక దరఖానాకు పోయింది. ఏవో గోలీలు ఇచ్చాడు డాక్టర్. అవి వేసుకుని పడుకుంది. మధ్యాహ్నానికి నొప్పి కొద్దిగా తగ్గింది. నాలుగు గంటలకు అమ్మగారింటికి వెళ్ళింది. గిన్నెలు తోముతుంటే, అరుంధతి అడిగింది – “పొద్దున్న రాలేదేం?” అని

‘మొగుడు తన్నాడు’ అని చెప్పలేకపోయింది.

“బీమార్ అయిందమ్మా” అన్నది యాదమ్మ.

అరుంధతి మీటింగ్‌కు వెళ్లే హడావుడిలో ఉంది. పని పూర్తి చేసిన యాదమ్మ అడిగింది. “అమ్మగారూ, నేను గూడా మీతో వస్తానండి” అని.

అరుంధతి యాదమ్మను మీటింగ్‍కు తీసుకువెళ్లింది. అక్కడకి గొప్పవాళ్లు మేధావులు, ఉద్యమకారులు అనేక మంది వచ్చారు.

గత మాభై ఏళ్లల్లో మహిళ సాధించిన పురోభివృద్ధి గురించి వివరంగా చెప్పారు.

“బ్రిటన్ లాంటి దేశాల్లో కూడా ఒకప్పుడు మహిళకు ఓటు హక్కు ఉండేది కాదు. ఆస్తి హక్కు ఉండేది కాదు. చదువుకునే అవకాశం, సంపాదించుకునే అవకాశం ఉండేది కాదు. ఆ స్థాయి నుంచి ఇప్పుడు అసెంబ్లీలో, పార్లమెంట్‌లో శాసనాలు చేసే స్థితికి వచ్చాం. సగానికి సగం, యాభై శాతం సీట్లు మనకు రిజర్వ్ చేయమని అడుగుతున్నాం. అలా రిజర్వ్ చేసే రోజు ఎంతో దూరంలో లేదు” అంటూ అరుంధతి ఆవేశంగా ఉపన్యసిస్తుంటే, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు.

ఇంటికి వస్తున్నప్పుడు అమ్మగారు యాదమ్మతో అదే చెప్పింది –

“మగవాళ్లూ, ఆడవాళ్లు అందరూ సమానమే. మగవాళ్లు అన్యాయం చేస్తే, ఊరుకునే రోజులు పోయాయి. మనం నిలదీయాలి. అన్యాయాన్ని ఎదిరించాలి”

రాత్రి పది గంటలకు నర్సిమ్మ, జంగయ్య తాగుతున్నారు.

“అన్నా. నాకు దుఃఖమొస్తుందన్నా. సచ్చిపోదామనుకొంటున్న”

“ఏమట్ల?”

“పైసల్ లేవు. పరేషాన్ ఉన్న, పైసల్ లేకున్నాక ఏంటికి బతకాలన్న?”

“నేను లేనుర, బయ్.. తాగు.. ఎంత తాగుతవో అంత తాపిస్త. ఆరే దోస్త్ అన్నాక, తాపించ లేనురా?” అన్నాడు నర్సిమ్మ.

పదకొండు గంటలకు కుక్కలు స్వాగతం పలుకుతుంటే, తూలుకుంటూ ఇంటికొచ్చాడు.

యాదమ్మ నిద్రపోతోంది. “లే, నీయమ్మ” అంటూ మొదలుపెట్టాడు.

యాదమ్మ నిద్ర లేచింది. ఎడమ కాలితో తన్నింది. నర్సిమ్మ కింద పడ్డాడు. చొక్కా పట్టుకుని పైకి లేపింది.

“దినాం తాగొచ్చి, నన్ను తంతావురా” అంటూ యాదమ్మ మొగుడ్ని పిడిగుద్దులు గుద్దుతుంటే, నర్సిమ్మ పెద్దగా కేకలు పెట్టాడు..

రోజూ యాదమ్మక్కలు వినపడేవి. జోలపాడినట్లు హాయిగా విని పక్కకు తిరిగి పడుకునే ఇరుగుపొరుగు వాళ్ళు, ఇవాళ నర్సిమ్మ కేకలు విని పరుగెత్తు కొచ్చారు.

నర్సిమ్మ నోట్లో నుంచి రక్తం వస్తోంది. అందరూ కల్సి అస్పత్రికి తీసుకు పోయారు.

రెండు రోజుల తరువాత నర్సిమ్మ ఆస్పత్రినుంచి ఇంటికి వచ్చాడు. ఆ సాయంత్రం జంగయ్య, నర్సిమ్మను “తాపిస్తా, రా” అన్నాడు.

“ఇంక ఎప్పటికీ తాగ” అన్నాడు నర్సిమ్మ, యాదమ్మ కోసం మల్లెపూలు తెచ్చాడు. ద్రాక్షపళ్ళు తెచ్చాడు.

పక్కగుడిసెలోని బాలయ్య పెళ్ళానికి చెబుతున్నాడు. “ఇండ్ల కొత్త ఏమున్నదీ? సత్తెభామ శ్రీకృష్ణుడిని ఎడమ కాలితో తన్నలే?” అని.

నర్సిమ్మ, యాదమ్మ కోసం ఎదురు చూస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here