చిరుజల్లు-110

0
12

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

ఇల్లు – ఇల్లాలు

[dropcap]ఇం[/dropcap]టి ముందు ఆటో దిగి సూట్‍కేస్‌తో లోపలికి వచ్చిన అపర్ణ వంక ఆశ్చర్యంగా చూశాడు ప్రసాదరావు.

“సుందరి ఉన్నదా?” అని అడిగింది అపర్ణ.

“ఉన్నది. ఏమేవ్, ఎవరో వచ్చారు చూడు” అన్నాడు ప్రసాదరావు మళ్లీ పేపర్లో తలదూరుస్తూ.

వంటింట్లో నుంచి వచ్చిన సుందరి ముఖం విప్పారింది.

“ఏమిటేవ్, ఇంత అకస్మాత్తుగా ఇలా వచ్చావు?” అని అడిగింది నవ్వుతూ.

“నిన్ను చూద్దామనిపించి వచ్చాను” అన్నది అపర్ణ నవ్వుతూ.

“ఇంకా నేను గుర్తున్నానన్నమాట. ఫర్వాలేదు” అంటూ అపర్ణను తన భర్తకు పరిచయం చేసింది.

“ఇదీ, నేనూ కల్సి చదువుకున్నామండి. అప్పుడు కొంచెం సన్నగా, పొడుగ్గా ఉండేది. ఇప్పుడు కొంచెం లావు అయినట్లు కనిపిస్తోంది. ఏమిటీ, ఒక్కదానివే వచ్చావా? పెళ్లి అయిందా? పిల్లలు ఎంతమంది?” అని ప్రశ్నల వర్షం కురిపించేసింది సుందరి.

“అదేమిటే, ఆవిడను గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడేస్తున్నావు. లోపలికి రానివ్వు” అన్నాడు ప్రసాదరావు.

అప్పుటికి గాని సుందరికి గుర్తురాలేదు, తాము గేటు దగ్గరే నిలబడి ఉన్నామని. లోపలికి వచ్చాకా మళ్లీ ప్రశ్నల బాణాలు సంధించింది. కాలేజీ చదువు పూర్తి అయ్యాక, విడిపోయారు. ఇరవై ఏళ్ల తరువాత ఇప్పుడు కల్సుకున్నారు.

“నీ పెళ్లికి నన్ను పిలవలేదేం?” అని అడిగింది అపర్ణ.

“అప్పట్లో నీ అడ్రసు దొరకలేదే” అన్నది సుందరి.

“ఇప్పుడు తెల్సింది గదా. ఈసారి పిలువు” అన్నది అపర్ణ.

“అలాగే” అన్నది సుందరి.

ఇద్దరూ నవ్వుకున్నారు.

సుందరి తన కొడుకు ప్రవీణ్‌ను, కూతురు ప్రత్యూషను పరిచయం చేసింది.

“హలో ఆంటీ” అంటూ ముక్తసరిగా పలకరించి వెళ్లిపోయారు. కాఫీలు తాగుతుండగా అపర్ణ సుందరితో అన్నది.

“నాకు ఇక్కడికి ట్రాన్సఫర్ అయింది. రేపు వెళ్లి జాయిన్ అవ్వాలి. ఇక్కడ ఎవరూ తెలిసినవాళ్లు లేరు. అందుకని కొద్ది రోజులు మీ ఇంట్లో పేయింగ్ గెస్ట్‌గా ఉందామని వచ్చాను. నీకూ, మీ వారికి పిల్లలకీ అభ్యంతరం లేకపోతే..”

“మా ఇంట్లో నీ అంతటి గొప్ప వ్యక్తి వచ్చి ఉండటమే విశేషం. అందుచేత మాకేం అభ్యంతరం ఉంటుంది?” అని నవ్వింది సుందరి.

మర్నాడు అపర్ణ ఆఫీసుకు వెళ్ళింది. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి ఆరుగంటలు అయింది.

“ఎక్కడన్నా ఒక ఫామిలీ పోర్షన్ చూడమని ఇద్దరు ముగ్గురికి చెప్పాను. దొరకగానే వెళ్లిపోతాను” అన్నది అపర్ణ.

ఇద్దరూ కూరలు కొనటానికి వెళ్లారు. చిన్ననాటి కబుర్లు చెప్పుకున్నారు.

ఒకసారి కాలేజీ కుర్రాడు కావాలని సైకిల్ మీద నుంచి సుందరి మీద పడ్డాడు. అప్పుడు సుందరి అతన్ని కొట్టిన దెబ్బకు కాలేజ్ అంతా మారుమ్రోగిపోయింది.

ఇంకోసారి ఎవడో “నిన్ను పెళ్లి చేసుకుంటాను. నాతో వస్తావా?” అని ఆడిగాడు.

“గడ్డం గీసుకోలేని వెధవ్వి. నీకు పెళ్లి ఎందుకురా?” అని అడిగింది. అవన్నీ గుర్తు చేసుకున్నారు.

రాత్రి ఎనిమిది గంటలకు సుందరి అపర్ణకు అన్నం వడ్డించింది. అందరూ వచ్చేదాకా ఉంటానన్న వినలేదు.

రాత్రి తొమ్మిది గంటలకు ప్రత్యూష వచ్చింది. అన్నం సరిగ్గా వండలేదని తల్లి మీద విసుక్కుంది. పది గంటలకు కొడుకు ప్రవీణ్ వచ్చాడు. లుంగీ కనిపించ లేదని తల్లి మీద మండిపడ్డాడు.

పదకొండు గంటలకు ప్రసాదరావు వచ్చాడు. వస్తూనే ఆటో వాడితో లడాయి వేసుకున్నాడు.

అంతా సర్దుమణిగి సుందరి పడుకునేటప్పటికి రాత్రి పన్నెండుగంటలు అయింది.

తెల్లవారి లేస్తూనే, బ్రష్ అరిగిపోయిందని కొడుకు, సబ్బు అరిగిపోయిందని కూతురు, కాఫీ వేడిగా లేదని భర్త.. ఒకరి తరువాత మరొకరు సుందరి మీద ధ్వజం ఎత్తుతునే ఉన్నారు.

శలవు రోజు వచ్చింది. పిల్లలు ఇద్దరు ఎటో ఎగిరిపోయారు. ప్రసాదరావు ముందు గదిలో ఫ్రెండ్స్‌తో  పేకాడుతూ కూర్చున్నాడు. గంట గంటకూ సుందరికి అందరికీ కాఫీలు అందించటంతోనే సరిపోయింది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు సుందరి ఆడబిడ్డ వచ్చి, ‘శలవు రోజున బిర్యానీ అయినా వండలేదా’ అని వ్యాఖ్యానాలు గుప్పించింది.

“ఏమిటే, ఈ ఇంట్లో ప్రతివాళ్లకూ నీ మీద ఏదో హక్కు ఉన్నట్లు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు?” అని అడిగింది అపర్ణ.

“వాళ్లంతా పరాయి వాళ్లు కాదు గదా” అన్నది సుందరి.

“నిజమే. నువ్వు వాళ్ల పట్ల చూపే ప్రేమలో వందో వంతు అయినా వాళ్లకు నీ మీద లేదు. అదే బాధ” అన్నది అపర్ణ.

నాలుగు రోజుల తరువాత అపర్ణ వేరే ఇల్లు చూసుకొని వెళ్లిపోయింది. ఆమె వెళ్ళిన రెండు రోజులకు సుందరి మాయమైంది. తెల్సిన వాళ్లు వెళ్లు అన్నీ వెతికారు. కనిపించలేదు. పోలీసు రిపోర్ట్ కూడా ఇచ్చారు.

ఇంకొక వారం తరువాత అపర్ణ ఆ ఇంటికి వెళ్ళింది.

ప్రసాదరావు వంట చేస్తున్నాడు. ప్రవీణ్ బట్టలు వాషింగ్ మిషన్‌లో వేస్తున్నాడు. ప్రత్యూష ఇల్లు ఊడుస్తోంది.

“సుందరి లేదా?” అని అడిగింది అపర్ణ.

“ఎక్కడికో చెప్పకుండా వెళ్లిపోయింది. అందరి ఇళ్లు వెతికాం, తెలిసిన వాళ్లకు ఫోన్ చేశాం. అయినా ఆచూకీ తెలియలేదు” అన్నాడు ప్రసాదరావు.

“సుందరి ఉన్నంత కాలం, మీరు అడిగే అడగక ముందే అన్నీ అందిస్తున్నంత కాలం మీకు మనిషి విలువ తెలియలేదు. అందుకే, విసుగెత్తి వెళ్లిపోయింది. ఇప్పుడు తెల్సిందా ఇల్లాలు విలువ ఏమిటో?” అని అడిగింది.

“సుందరి ఎక్కడుందో మీకు తెల్సా?” అని అడిగాడు ప్రసాదరావు.

అపర్ణ నవ్వింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here