చిరుజల్లు-111

0
7

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

బంగారు పంజరం

[dropcap]ఒ[/dropcap]కటో తారీఖు వచ్చిందంటే గంగకు చిరాకు, కోపం వచ్చేస్తాయి.

భర్త మీద కోపం –

భర్త తెచ్చే చాలీచాలని జీతం మీద కోపం –

ఎన్నాళ్లకీ మార్పురాని జీవితం మీద కోపం –

కానీ శివప్రసాద్‌కి మాత్రం చీమ కుట్టినట్లు అయినా ఉండదు. జీతం డబ్బులు భార్య చేతిలో పెట్టి, నిశ్చింతగా సిగరెట్టు కాల్చుకుంటూ కూర్చుంటాడు.

గంగ నోట్లు లెక్కపెడుతుంది. తప్పు లెక్కపెట్టానా అని మళ్లీ లెక్కపెడుతుంది “ఇంతేనా?” అని అడుగుతుంది.

“ఏమిటీ? కొత్తగా అడుగుతావు?” అని అంటాడతను టీవీ చూస్తూ.

“ఈ సంసారం చెయ్యటం నా వల్ల కాదు. నేను పుట్టింటికి వెళ్లిపోతాను” అంటుంది.

“ఎప్పుడూ?” అని అడుగుతాడు తాపీగా.

“అంటే నేనెప్పుడు పోతానా అని ఎదురు చూస్తున్నారన్నమాట. నేను గడప దాటగానే మీ వెధవ వేషాలు మొదలు పెడతారు” అంటుంది.

శివప్రసాద్ దగ్గరకొచ్చి ప్రేమగా అడుగుతాడు “ఎందుకే అంత కోపం?” అని. ఆమె భుజాల మీద చేతులు వేస్తాడు.

“నాతో మాట్లాడకండి. చాలీచాలని జీతం డబ్బులు తెచ్చి నా మొహాన కొడతారు. వేళకు అన్నీ అమిరిపోవాలి. ఎక్కడి నుంచి తేవాలి. నేను? బయట బజార్లో ధరలు ఎలా మండిపోతున్నాయో తెల్సా?” అని నిలదీస్తుంది.

“ధరలు తగ్గించటం నా చేతిలో ఉందా చెప్పు?”

“మరి అలాంటప్పుడు ఆదాయం పెంచుకోవాలి.”

“అది నా చేతిలో ఉందా చెప్పు?”

“అలాంటప్పుడు ఖర్చు తగ్గించుకోవాలి”

“అది నా చేతుల్లో ఉందా చెప్పు”

ఇది ఎంతకీ తెమిలే సమస్య కాదు.

ఇంతలో పనిమనిషి తగులుకుంటుంది “అమ్మగారూ పైసలు” అంటూ.

“ఉండవే, నువ్వొకదానివి, ఊపిరాడ నివ్వవు” అని విసుక్కుంటుంది.

“అమ్మగారూ పైసల్” అంటాడు పాలవాడు.

“ఇస్తాం లేవయ్యా? నువ్వు పోసే నీళ్ల పాలకు కూడా తొందర” అని చిరాకు పడుతుంది.

మధ్యాహ్నం పుట్టింటికి వెళ్తుంది. తన సోది తల్లితో వెళ్లబోసుకుంటుంది.

“ఏం చేస్తామే? ఈ మగాళ్లందరిదీ ఒకటే తంతు. ఇంటి పెత్తనం వాళ్లకి ఇస్తే, అప్పుడు తెలుస్తుంది వాళ్లకు కూడా” అని సముదాయిస్తుంది తల్లి.

గంగ నిట్టూరుస్తుంది. భవానీ గుర్తుకొస్తుంది. దానిది అదృష్ట జాతకం. భర్తకు బోలెడు జీతం. లంకంత కొంప, కారు, నౌకర్లు, ఫోన్లు, టీవీలు, సోఫాలు, కార్పెట్లు..

భవానీ జీవితం వడ్డించిన విస్తరి. పూల బాటన నడుస్తోంది.

“చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత. కిందటి జన్మలోని పుణ్యం చేసుకుంది. ఈ జన్మలో అనుభవిస్తోంది.” అన్నది తల్లి.

సాయంత్రం శివప్రసాద్ స్వీట్స్ కొనుకొచ్చాడు. మల్లెపూలు తెచ్చాడు.

“నా మీద కారమ్స్, మిరియమ్స్ నూరుతున్నావు గదాని, స్వీట్స్ తెచ్చాను. నా ఖర్చులు చాలా వరకు తగ్గించుకుంటున్నాను. హోటలు, సిగరెట్లు అన్నీ బంద్” అన్నాడు శివప్రసాద్.

“మీరు ఖర్చులు తగ్గించుకోవాలి. ఆదాయం పెంచుకోవాలి. లేదంటే, ఈ సంసారం నా వల్ల కాదు. వెళ్లి ఏ గుళ్లోనో కూర్చుంటాను. ఇంత ప్రసాదం పెడితే తిని పడుకుంటాను” అన్నది తెచ్చిపెట్టుకున్న కోపంతో.

మర్నాడు పక్కింటి రాజీతో కల్సి బజారుకు వెళ్లింది. రాజీ కొనుక్కుంటుంటే, తనూ చీర కొనుక్కుంది.

హోటల్లో తిని, సినిమా చూశారు.

ఇదంతా అదనపు ఖర్చు అని గంగకు తెల్సు. కానీ ఈ మాత్రం సరదాలకు అయినా నోచుకోకపోతే, లైఫ్‌లో ఎంజాయ్‌మెంటు ఏముంటుంది? అని తనకు తానే నచ్చ చెప్పుకుంది.

భవానీతో పోల్చుకుంటే, ఈ ఎంజాయ్‌మెంట్ ఏ పాటిది? భవానీదీ, తనదీ ఒకటే వయస్సు. చిన్నప్పటి నుంచీ అన్నిట్లో ఇద్దరికీ పోటీ. అందంలో తనే దాని కంటే బెటర్. చదువులో తానే ముందు ఉండేది. దాని ఫామిలీ కన్నా, తన ఫామిలీయే మెరుగ్గా ఉండేది. ఏ విధంగా చూసినా తన కన్నా తక్కువ స్థాయిలో ఉండే భవానీకి పెళ్లి కావటంతో దశ తిరిగిపోయింది.

మంచి సంబంధం దొరికింది. పెద్దగా కన్నాలూ, కానుకలూ లేకుండానే భవానీని చేసుకున్నారు. దాని భర్తకు మంచి ఉద్యోగం. ఆస్తిపాస్తులకు కొదవలేదు. ఇంటినిండా బోలెడు మంది జనం.

ఒకసారి భవానీని చూసి రావలన్న కోరిక కలిగింది గంగకు.

దాని ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళింది.

పెద్ద కాంపౌండు. ఇంటి ముందు పోర్టికోలోన కారు.. పూల మొక్కలు, కుక్క పిల్లలూ… హంగులన్నీ ఉన్నాయి.

గేటు దగ్గర పనిమనిషి ఎదురై ఎవరు కావాలని అడిగాడు.

అతను లోపలికి వెళ్లి చెప్పాడు. ఇంకెవరో వచ్చి అడిగారు. అలా అరడజను మంది ఈ వచ్చిన వ్యక్తి గురించి ఆరా తీశాక, ఇంటి వెనక వైపుకు వెళ్లమన్నారు.

తీరా వెనక వైపుకు వెళ్లి చూస్తే భవానీ, పనివాళ్లలో ఒక పనిమనిషిలా కనిపించింది. జుట్టు చెదిరిపోయింది. సాదా సీదా నేత చీరతో రంగు వెలిసిన బొమ్మలా కనిపించింది.

“ఏమిటిలా సడెన్‌గా వచ్చావు?” అంటూ వెనక వైపు మెట్ల మీద నుంచి లోపలికి తీసుకెళ్ళింది.

“ఆప్తులు, ఆత్మీయులు కరువై పోతున్న సమయంలో నన్ను గుర్తుపెట్టుకొని ఇంతదూరం వచ్చావు. ఇంతకంటే కావల్సింది ఏముంది?” అని కళా విహీనంగా నవ్వింది..

“అదేమిటే నీకు చాలామంచి సంబంధం దొరికిందనీ, నువ్వు అత్తారింట్లో భోగభాగ్యాలతో తులతూగి పోతున్నావనీ మేమంతా అనుకుంటూ ఉంటే?”

“అదంతా నిజమే. కంటి ముందు కనిపించే సిరిసంపదలు లేవని ఎలా అనగలను? కాకపోతే సమాజంలో రెండు రకాల వాళ్లు ఉంటారు. ఉన్నవాళ్లు, లేనివాళ్ళు.. నేను ఉండీ లేనిదానిని..” అన్నది భవానీ.

“నువ్వు చెప్పింది నాకేమీ అర్థం కాలేదు” అన్నది గంగ.

“నా భర్తకు హోదా ఉంది. అందం ఉంది. సంపాదన ఉంది. మేడలూ, కార్లూ, బ్యాంక్ బాలెన్స్‌లూ, పలుకుబడి, గౌరవం అన్నీ ఉన్నాయి. అవన్నీ ఆయనికే పరిమితం. నేను ఈ ఇంట్లో ఒక నమ్మకమైన పనిమనిషిని. నీ భర్త కొద్దో గొప్పో తన సంపాదన తెచ్చి నీ చేతికిస్తాడు. ఆ కాస్త సంపాదనను నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకునే హక్కు నీకు ఉంటుంది. ఆ డబ్బు ఏం చేశావని గాని, దేనికి ఎంత ఖర్చు అయిందని గానీ జమాఖర్చుల లెక్కలు అడిగేవారు ఉండరు. నా భర్తకు లక్షల డబ్బు బ్యాంకులో మూలుగుతున్నా, నేను ఆయన్ని అడగాలి కొద్దిగా డబ్బు కావాలని. ఆయన అడుగుతాడు ‘దేనికి?’ అని. కారణం చెబుతాను. ఆయన ‘అక్కర్లేదు’ అంటూ ఒక్క ముక్కలో త్రోసిపుచ్చుతారు. నాకు డబ్బు ఎలాగూ లేదు. సొంత అభిప్రాయాలూ ఉండటానికి వీల్లేదు. నీ ఫ్రెండ్‌తో సరదాగా బయటకువెళ్తావు. ఒక చీర కొనుక్కుంటావు. ఒక సినిమాకు వెళ్ళావు. ఆ స్వేచ్ఛ నీకు ఉంది. నా భర్త పర్మిషన్ లేకుండా, నా అత్త పర్మిషన్ లేకుండా నేను ఎక్కడికీ వెళ్ళకూడదు. గడప దాటితే పెద్ద గొడవ జరిగిపోతుంది. నేను ఎప్పుడు నిద్రలేవాలి, ఎప్పుడెప్పుడు ఏయే పనులు చేయాలి అన్నీ ఆయన చెప్పినట్లే, ఆమె చెప్పినట్లే జరగాలి. ఈ మేడలో యథేచ్ఛగా తిరగలేనప్పుడు, ఇది నాది ఎలా అవుతుంది? ఆ కారులో నేను బయటకు వెళ్లలేనప్పుడు అది నా కారు ఎలా అవుతుంది? అందుకే నేను అన్నీ ఉన్నా, ఏమీ లేనిదానినే..” అన్నది భవానీ.

భవానీ చెప్పటం ఆపింది. ముందు గదిలోకి వెళ్లి “రాందాసూ, కాఫీ పట్రావా?” అని అడిగింది.

రాందాసు వచ్చి చెప్పాడు “పాలు లేవంటమ్మా” అని.

“ఇప్పుడు నాకేమి వద్దు భవానీ” అన్నది గంగ.

“ఇక్కడ ఏదీ నాది కాదు. నాకు దేనికీ స్వేచ్ఛ లేదు” అన్నది భవాని బాధపడుతూ.

“బాధపడకు. వస్తాను” అంటూ లేచింది గంగ.

ఆ రోజంతా గంగ – భవానీ గురించే ఆలోచించింది. రాత్రి పదకొండు గంటలకు శివప్రసాద్ వచ్చాడు.

అతనికి భోజనం చేసిన తరువాత సిగరెట్టు తాగటం అలవాటు. రెండు సిగరెట్లు ఉన్నాయి. కానీ తాగటం లేదు.

ఏం తోచక పచార్లు చేస్తుంటే, గంగ సిగరెట్టు అందించింది.

“ఇదేమిటి?” అని అడిగాడు.

“చిన్నచిన్న సరదాలు మానుకోవద్దు”

“నువ్వు గంగవేనా”

“అవును. గంగనే, శివుడు గంగను ఎప్పుడూ నెత్తిన పెట్టుకుని చూస్తాడు గదా” అని నవ్వింది గంగ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here