చిరుజల్లు-121

0
7

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

నేను బాగానే ఉన్నాను

[dropcap]అ[/dropcap]మ్మా,

ఎలా ఉన్నావు? ఈ మధ్య నేను కొంచెం బిజీ. కొంచెం అందుకే నీతో మాట్లాడటం కొంచెం లేట్ అయింది.

నిన్ను చూడాలని ఉంటుంది ఎప్పుడూ. నీ దగ్గరే ఉండిపోవాలనీ, లేదా నువ్వు నా దగ్గర ఉండిపోవాలని ఉంటుంది. కానీ కుదరదు కదా. నీతో ఎన్నో విషయాలు చెప్పాలని అనిపిస్తుంది. అందులో ఏవి చెప్పవచ్చో, ఏవి చెప్పకూడదో తెలియదు.

నీ ఆరోగ్యం ఎలా ఉంది? ప్రిన్సిపాల్ అయినందుకు సంతోషం. స్టూడెంట్స్‌ని బాగా భయపెడుతున్నావా? నువ్వు ఎప్పుడూ ఎంతో గంభీరంగా, గుంభనంగా ఉంటావు. ఎంత సీరియస్‌గా ఉన్నా, ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే తీసిపారేస్తావు. అందుకే నువ్వంటే నాకు గొప్ప ఆరాధనా భావం. గొప్ప ఆడ్మిరేషన్. ఏదైనా కొంచెం న్యూనతాభావం కలిగినప్పుడు, నిన్ను తల్చుకుంటాను. నీలా ఉండాలనుకుంటాను. కొండంత ధైర్యం వస్తుంది.

నేను బాగానే ఉన్నాను. కాలం రొటీన్‍గా గడిచిపోతోంది. తెల్లవారి లేస్తే చుట్టూ ఎంతోమంది యాంత్రికంగా తిరుగుతుంటారు. ఎదురు పడితే ఒక చిరునవ్వు నవ్వేసి వెళ్లిపోతారు. అంతే. నిజమైన ప్రేమ, ఆదరణ, ఆప్యాయతా ఎక్కడా కనిపించవు. వేరే ‘మరమనుష్యుల’ను, రోబోలను కనిపెట్టటం ఎందుకు? ఇప్పుడున్న వాళ్లంతా, ప్రేమాభిమానాలు వూర్తిగా ఇంకిపోయిన మరమనుష్యుల లాగానే కనిపిస్తున్నారు. వీళ్ల మధ్య ఏదో కనిపించని పోటీ. చదువుల్లో, ఉద్యోగాల్లో, సంపాదనల్లో ఒకరిని మించి మరొకరు, వీలుంటే ఒకరిని పక్కకు తోసేసి మరొకరు ముందుకు పోవాలన్న తపన, ఆరాటం, పోరాటం. ఈ పరుగు పందెంలో ఎక్కడో, ఏదో పోగొట్టుకుంటున్నామన్న బాధ,

గృహమే కదా స్వర్గ సీమ అన్నారు. కానీ చిన్న చిన్న విషయాలు కూడా ఎంత చికాకు కలిగిస్తాయో. వేడి నూనె చింది చేతిమీద పడి బొబ్బ ఎక్కినప్పుడు, నీకు ఆ విషయం చెప్పనందుకు నువ్వు గుర్తొచ్చావు. నీ దగ్గర ఉన్నప్పుడు వంట చేయనిచ్చావు కాదు. ఇప్పుడు నేర్చుకుంటున్నాను.

‘మా అమ్మ గుర్తు వచ్చినప్పుడు, కూరలో కారం ఎక్కువ అవుతుంది, మీ అమ్మ గుర్తు వచ్చినప్పుడు తీపి ఎక్కువ అవుతుంద’ని – ఆయన దెప్పుతుంటారు. అది వ్యంగ్యమే అయినా అందులో నన్ను దెప్పిపొడిచినట్లు అనిపిస్తుంది. నిజానికి నాకా వ్యత్యాసం లేదు మరి.

ఆయనకు తన తల్లి మీద, చెల్లి మీద ప్రేమ ఉండొచ్చు. అభిమానం ఉండొచ్చు. కానీ ప్రతి నిముషం వాళ్లను గుర్తు చేసి, నన్ను వాళ్లతో పోల్చటం ఏమిటి? ఎవరి గొప్ప వాళ్లవి. అలాగే ఆయనా ఫ్రెండ్స్ అంతా మేధావులు, పండితులు అన్నట్లు మాట్లాడుతారు. స్నేహితుల భార్యలు, అబ్బో, ఎంత గొప్పవారో ఆయన నోటంటనే వినాలి.

ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది డబ్బు విషయం. ఆయన చేసే ఖర్చులన్నీ నిత్యావసరాలు. నేను చేసే ఖర్చులన్నీ దుబారాలే. ఏదన్నా కావాలంటే, ఆయన ఏమంటారోనని, పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. చివరకు చాలావరకు నా సరదాలన్నీ మానుకున్నాను.

నెలకో, రెండు నెలలలో ఎక్కడో ఒక చోట, ఎవరింట్లోనో, ఏదో ఒక నెపంతో పార్టీ ఉంటుంది. ఆ పార్టీకి వెళ్లబోయే ముందు ఖచ్చితంగా ఏదో ఒక వంక ఇంట్లో పెద్ద యుద్ధం చేస్తారు. వెళ్లేముందు మూడ్ పాడు చేయటం ఆయన ఏకైక లక్ష్యం. ఆయన మాత్రమే సంతోషంగా ఉండాలి. నేను నిత్యం నిరుత్సాహంతో క్రుంగిపోతుండాలి. ఆలా క్రుంగదీయడంలో ఆయన ఆరితేరారు. నేను చేసే, ప్రతి పనినీ విమర్శిస్తునే ఉంటారు. నేనొక తెలివితక్కువ దాన్ని అన్న అభిప్రాయం నాకు కలగాలన్నదే ఆయన ఆశయం.

శలవు రోజు వస్తే ఉదయమే యుద్ధం ఆరంభమవుతుంది. ఆ రోజంతా అది కొనసాగుతునే ఉంటుంది. నాకు అంటూ ప్రత్యేకంగా ఎవరూ స్నేహితురాండ్రు ఉండకూడదు. నా బాధ చెప్పుకోవటానికి ఒక మనిషి ఉండకూడదు. దీన్ని ఏమంటారు? శాడిజం కదా.

ఆఫీసు విషయానికి వస్తే, అదోక జనారణ్యం. అందరూ నవ్వుతూనే ఉంటారు. కరచాలనం చేస్తూనే ఉంటారు. అందించిన చేతితో కిందకు లాగిపారెయ్యాలని చూస్తుంటారు. ఎత్తులకు పై ఎత్తులు. నేను చేసిన ప్రాజెక్ట్ వర్క్‌ను, తాము చేసినట్లుగా పై వాళ్లకు చూపించి ప్రశంసలు, ప్రమోషన్లు పొందాలని చూస్తారు. ఎప్పటికీ ఒక ప్రమోషన్ ఛాన్స్ వస్తే దాన్ని డేగలా తన్నుకు పాడవటంలో సిద్ధహస్తులు. మేము పై ఆఫీసర్లను కలవనివ్వకుండా, చూస్తుంటారు. మా మీద ఎన్నో కామెంట్స్ చేసి, పితూరీలు చెప్పి, మేము చేతగానివాళ్లం అన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంటారు. ఇక్కడ ఒక రూలు. న్యాయం అంటూ ఏమీ ఉండవు. పైవాడి ప్రాపకం ఉంటే పైకి ప్రాకిపోవచ్చు. ఈ పరమపద సోపాన పఠంలో కొందరు ఎప్పుడూ నిచ్చెనలు ఎక్కుతుంటారు. నాలాంటి వాళ్లం ఎప్పుడో పాము నోట్లో పడి కిందకు పడిపోతుంటాం. అయినా నేను బాగానే ఉన్నాను.

ఇన్ని నిరాశా, నిస్పృహల మధ్య, విస్వార్థంగా ప్రేమించేది, అడగకుండానే, మనసులోని కోరికలను తీర్చేది అమ్మ ఒక్కతే. అమ్మ ఉంటే, అమ్మవారు పక్కన ఉన్నట్లే.

***

భార్గవీ,

నువ్వు ఈ రెండేళ్లల్లో ఎంతో మారిపోయి ఉంటావనుకున్నాను. కానీ ఏమీ మారలేదు. నేను బాగానే ఉన్నాను అని అంటూనే, ఏమేమి బాధలు పడుతున్నావో చెప్పావు. కొన్ని విషయాలు చిన్నప్పుడే ఎందుకు చెప్పలేదంటూ నిలదీశావు. సిలబస్ లేని విషయాలపై పరీక్ష పేపర్లో ప్రశ్నలు వస్తే ఆ తప్పు ఎవరిది? టీచర్‍ది కాదు గదా. మామూలుగా చదువుతున్నప్పుడు ముందు పాఠాలు చెప్పి, తరువాత పరీక్షలు పెడతారు. కానీ జీవితం మాత్రం, ముందు పరీక్ష పెట్టి తరువాత పాఠం నేర్పుతుంది. జీవిత పర్యంతం ఎన్నో విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. అమ్మ ఎన్ని అని నేర్పుతుంది? చిన్నప్పుడు అమ్మ అహర్నిశలూ నిన్ను కనిపెట్టుకుని పక్కనే ఉంటుంది. కొన్నేళ్ల తరువాత రోజూ కొంతసేపు మాత్రమే నిన్ను కనిపెట్టుకుని ఉంటుంది. పెళ్లి అయి వెళ్లిపోయాక, ఎక్కడో దూరాన ఉంటుది. మరి కొన్ని ఏళ్లకు పిలిచినా పలకనంత దూరం వెళ్లిపోతుంది. మేం కొంత వరకే నీతో వస్తాం. కొన్ని విషయాలే మీకు నేర్పుతాం. నడక, నడత, పద్ధతులు, మంచి చెడులు మాత్రమే చెబుతాం. భాష నేర్పగలం గానీ, జీవితం పొడుగునా, మాట్లాడే ప్రతిమాటా వెనక నుండి నేర్పలేం కదా!

నీ మీద నీకు నమ్మకాన్ని కలిగించగలం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరించ గల ధైర్యాన్ని ఇవ్వగలం. అమ్మ ఇచ్చేది ట్రయినింగ్ మాత్రమే. దాన్ని ఆధారంగా చేసుకుని ఎవరి జీవన పోరాటాన్ని వారు కొనసాగించాలి.

అసలు ఆడపిల్లల పెంపకంలో కొన్ని లోపాలు ఉన్నాయి.. చిన్నప్పటి నుంచీ గిల్టీ ఫీలింగ్ నూరిపోస్తారు. ఈ గిల్టీ ఫీలింగ్ జీవితమంతా వెంటాడుతూనే ఉంటుంది. ఆడపిల్ల అంటేనే నిరసన భావం. మంచి మార్కులు తెచ్చుకుంటే, ఒక బాధ. తెచ్చుకోకపోతే ఒక బాధ. పొడుగ్గా ఉంటే ఒక బాధ, పొట్టిగా ఉంటే ఒక బాధ, సన్నగా ఉంటే ఒక బాధ. లావుగా ఉంటే ఒక బాధ, ఎవడన్నా ప్రేమిస్తే ఒక బాధ, ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోకపోతే ఒక బాధ. కట్నం ఇస్తే చాలదని బాధ. ఇవ్వకపోతే, ఇవ్వలేదన్న బాధ. ఉద్యోగం చేస్తే ఒక బాధ. చెయ్యకపోతే ఒక బాధ, మగపిల్లలు ఇవేమీ పట్టించుకోరు. ఎలా ఉన్నా జీవితంలో ముందుకు దూసుకు పోయే ప్రయత్నం చేస్తారు. ఆడపిల్లలు అంత అత్మస్థయిర్యంతో ఎందుకు ఉండరు? ఎంతో మంది ఎన్నో ఘనకార్యాలు సాధిస్తున్నారు. వాళ్లకు సమస్యలు లేవా అంటే, ఉంటాయి. వాటికి ఎంత ప్రాధాన్యత నివ్వాలో అంతవరకే ఇస్తారు.

నేను బాగానే ఉన్నాను అంటూ ఎన్ని మూగ బాధలు ఉన్నాయో వల్లె వేశావు. ఊహించుకున్నదానికీ, వాస్తవానికీ ఎంతో తేడా ఉంటుంది. అణుకువగానే ఉండాలి. అందరితోనూ, వాళ్లు ఎలాంటి వాళ్లు అయినా సరే, నువ్వు స్నేహం గానే ఉండాలి. అయితే ఈ స్నేహం ఎవరితో ఎంతమేరకు ఉండాలో కూడా తెలియాలి. భర్తనూ, అత్తనూ, మామనూ, ఫ్రెండ్స్‌నూ అందరినీ ఆదరించినట్లే ఉండాలి. తిరిగి వాళ్లు నిన్నుఆదరించటం, ఆదరించక పోవటం వాళ్ల వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో మంచివాళ్ల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. చెడ్డవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇల్లు అయినా, ఇరుగు పొరుగు అయినా, ఆఫీసు అయినా ఇదే పరిస్థితి. అందరూ నిన్ను మెచ్చుకోవాలనీ, పొగడాలనీ రూలు ఏమీ లేదు. కోట్లాదిమంది సాధారణ మనుషుల్లో నీవు ఒక దానివి. నువ్వంటే గిట్టని వాళ్లు ప్రతిచోటా ఉంటారు. ఒక్కసారి లొంగినట్లు కనిపించాలి – గెలవటం కోసం.

వోల్టేర్ అనే ఒక ఫ్రాన్స్ దేశపు రచయిత కొంత కాలం బ్రిటన్‍లో ఉండాల్సి వచ్చింది. అప్పట్లో ఫ్రాన్స్ దేశస్థులను, బ్రిటన్ దేశస్థులు బాగా అసహ్యించుకునేవారు. ఒక రోజు వోల్టేర్‌ను కొందరు చుట్టుముట్టి చంపబోయారు.

అప్పుడాయన తెలివిగా ‘చంపెయ్యండి. నేను బ్రిటన్‌లో పుట్టనందుకు బాధ పడుతున్నాను. వచ్చే జన్మలోనైనా బ్రిటన్‍లో పుడతాను. చంపెయ్యండి’ అన్నాడు. అప్పుడు వాళ్లు శాంతించి ఆయనను వదిలి వెయ్యటమే గాక ఆయనకు స్నేహితులైనారు.

ప్రతివాళ్ల తోనూ ఘర్షణ పడితే మన జీవితం దుర్భరం అయిపోతుంది. చాలా విషయాల్లో చాలా మందితో రాజీపడాల్సి వస్తుంది. ఇందుకు ముందు మనం మారి, ఎదుటి వారితో ఏకీభవిస్తూనే, మన ప్రత్యేకతను నిలబెట్టుకోవాలి.

పుట్టినప్పుడు ఎవరికీ మంచి అలవాట్లూ, చెడు అలవాట్లూ అంటూ ఉండవు. ఒక పనిని, గానీ, ఒక ఆలోచనను గానీ పదేపదే చేయటం వల్ల అతను దానికి బానిస అవుతాడు. మంచి చెడులు అనేవి మనిషి తనకు తాను సముపార్జించుకున్నవేగానీ, పుట్టుకతో వచ్చినవి కావు. అవతలి వ్యక్తి చర్యకు, మన ప్రతిచర్య కూడా మనకు మనం అలవరుచుకున్నదే. ఈ చర్యలనూ, ప్రతి చర్యలను మనకు ఎలా అనుకూలంగా మార్చుకోవాలో తెల్సుకోవాలి. ఆ తెల్సుకోవటాన్నే తెలివి అంటారు.

ఇక ఆఫీసులో ప్రతిభా విశేషాలు కనబరచాలంటే, సాధనమున పనులు సమకూరును. ప్రతి మనిషిలోనూ కొన్ని శక్తులు ఆజ్ఞాతంగా ఉంటాయి. నీకు అవసరమైనప్పుడు వాటిని వినియోగించాలి. ఇంటా, బయటా అంతటా సూపర్ వుమన్‍లా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. అక్కర్లేని విషయాల గురించీ, సోది కబుర్ల గురించీ సమయం వృథా చేయవద్దు. యద్భావం తద్భవతి. మన ఆలోచనలే మనల్ని తీర్చిదిద్దుతాయి.

నిన్ను నీవు శాసించుకోగలిగితే, ప్రపంచాన్ని శాసించగలవు. ఒక ముసలివాడు, రోజూ పార్క్‌కి వెళ్లి కొద్దిపాటి వ్యాయామం చేసి చిరునవ్వుతో అందరినీ పలకరించి వెళ్తాడు. ఆది అతని అలవాటు. మానసిక శక్తి వల్లనే ఆ అలవాటు అబ్బింది. శరీరానికి ఆరోగ్యం మందుల వల్ల కాక, మన మానసిక పరిస్థితి వల్లనే చేకూరుతుంది. ఇప్పుడు డాక్టర్లు కూడా అంగీకరిస్తున్నారు.

ఇతరులతో మన అనుబంధాలు బాగుండాలంటే, కమ్యూనికేషన్స్ కూడా బాగుండాలి. స్నేహం చేయటం వల్ల లాభాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనలో స్నేహ భావం, సేవాతత్పరత ఎంతో కొంత అయినా ఉండాలి. నువ్వు బ్రతికినందుకు ఎవరికైనా కొంచెం అయినా ప్రయోజనం చేకూరితే, జీవితం ధన్యమైనట్లే.

క్షమాగుణం, దయాగుణం ఇవే ముఖ్యమైనవి. వీటివల్ల నీకు చేకూరే తృప్తి వల్ల, ఇతరులకు, నీకూ కూడా మేలు కలుగుతుంది. ధనాన్ని ఎవరైనా, ఎలాగైనా సంపాదించవచ్చు. కానీ మంచివాళ్లు అన్న పేరు సంపాదించటం అందరికీ సాధ్యం కాదు.

పరువు, ప్రతిష్ఠ అనేవి ప్రతివాళ్లకూ ఎంతో అవసరం. గాలి పీల్చినంతసేపూ దాని విలువ తెలియదు. గాలి పీల్చలేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. అలాగే పరువు, ప్రతిష్ఠలు ఉన్నంతసేపూ వాటి విలువ తెలియదు. ఒకసారి వాటిని పోగొట్టుకుంటే, మళ్లీ సంపాదించుకోవడం సాధ్యం కాదు.

జీవితం అంటేనే మార్పు. మారటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఒక గమ్యం నుంచి మరో గమ్యానికి చేసే ప్రయాణమే జీవనయానం.

ఇక్కడ నేనూ బాగానే ఉన్నాను. నాకూ సమస్యలున్నాయి. కానీ ఒకరితో చెప్పుకుని కుమిలిపోయేంత పెద్ద సమస్యలు కావు. నాలుగు రోజులు పోతే, నీకూ ఇదే అభిప్రాయం కలుగుతుంది. కాలం అన్నీ నేర్పుతుంది. ఆ రోజు త్వరగా రావాలని ఆశిస్తూ,

అమ్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here