చిరుజల్లు-126

0
10

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

నక్షత్రం రాలింది

[dropcap]స[/dropcap]ముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నయి. పున్నమి వెన్నెల మిడిసి పడుతున్నది.

చీకటి పడింది. ఒడ్డున కూర్చున్న వాడొక్కడూ దేనికో కన్నీరు తుడుచుకుంటున్నాడు.

యవ్వనంలో ఉన్నంత కాలం మొండిగా తిరిగాడు సిద్దయ్య. అందరితో లాగానే కాలం నిష్కారణంగా అతనితో కలహమాడింది. సిద్ధయ్య వృద్ధుడై పోయాడు. వంగిపోయాడు. ఇదివరకటి లాగా తిరగలేక పోతున్నాడు. తిరగకుండా ఉండలేక పోతున్నాడు. బారెడు కర్ర చేతికి అండగా ఉండగా, ఇంటినిండా దారిద్ర్యం తాండవిస్తున్నది.

కన్ను పొడుచుకున్నా కానరాక పోయినా సరే, కర్ర పొడుచుకుంటూ సముద్రపు ఒడ్డుకు వస్తాడు. చాలా పొద్దుపొయ్యేదాకా అక్కడే ఉంటాడు. సిద్దయ్యకు వేరే పొద్దుపోయే మార్గమే లేదు. అతడేమైనా సినిమాలు చూస్తాడా? పేపర్లు చదువుతాడా? అతను చేయగలిగినదల్లా ఈ అద్భుతాలు చేస్తున్న మనుష్యుల వంక విస్తుపోతూ చూడటమే. ఈ లోకం ఎంత మారిపోయినా అన్నీ ఉన్నవాళ్ల దగ్గరికే చేరుతున్నయిగానే లేనోళ్ల దగ్గరకు ఏమన్నా వస్తున్నాయా? ప్రపంచంలో ప్రతిదీ పై నుంచి కిందకు జారుతుంది గానీ ఒక్క డబ్బు మాత్రం కిందనుంచి పైకి ఎగబాకుతుందని సిద్దయ్య నమ్మకం.

కొడుకు పోయిన దగ్గర నుంచీ మరీ క్రుంగిపోయాడు సిద్దయ్య. విల్లంబు బద్దలా వంగి పోయాడు. చేతికి అక్కరకొచ్చిన చెట్టంత కొడుకు చచ్చిపోతే హృదయం వ్రయ్యలుగా విచ్చిపోతే, నిభాయించుకుని నిలబడగల సామర్థ్యం సిద్దయ్యకు ఎక్కడిది? రెల్లు గడ్డిమంటలా గుండెలు భగ్గున మండిపోయినా కిమ్మనకుండా గుడ్ల నీరు కుక్కుకుంటూ నిస్సహాయంగా ఉండిపోయినాడు.

మూడు పాతికల వయస్సు నిండిన తనే తట్టుకోలేకపోతే, నిండా పాతికేళ్లు నిండని కోడలు సీతమ్మ తల్లి దుఃఖాన్ని దిగమించి బ్రతుకుతోంది. దాని పేగు తెంచుకుని పుట్టినవాడా గుంటడు, కన్న తండ్రిని పోగొట్టుకుని మిన్నకుండి పోయినాడు.

ఈ ముసలితనంలో ఇలా దేవుల్లాడుతూ బతకటం కన్నా, ఈ కడలి కడుపులో కలిసిపోవటం నయం అని సిద్దయ్య అనుకోని రోజు లేదు. రాత్రి ఎనిమిది గంటలు అయింది. సిద్దయ్య నెమ్మదిగా లేచి ఇంటి ముహం పట్టాడు.

మనవడెంతో మంచివాడు. చిన్నవాడు గనుక కొంపలు ముంచే ఆలోచన లేవీ లేవు. కోడలు సీతమ్మతల్లి ఎంతో బుద్ధిమంతురాలు. కొడుకు పోయినా ఎటువంటి దుర్బుద్ధి లేకుండా, తనకింత ముద్ద తెచ్చి పెడుతోంది.

పేరులో తప్ప ఇంకెక్కడా బంగారం లేని బంగారయ్య కూతురిగా పుట్టింది. ఒక సిద్ధిని గాని ప్రసిద్ధినిగాని పొందని సిద్దయ్య కొడుకు మెడలో పూలమాల వేసింది. తొమ్మిది నెలలు ఓపిగ్గా మోసి, ఒక బడుద్ధాయిని భూమి మీదకు లాక్కొచ్చింది. వాడికి పాలిచ్చి, వాడిని కన్నవాడికి మంచి నీళ్లు ఇచ్చి, వాడిని కన్న ముసలాడికి గ్లాసెడు గంజి నీళ్లు ఇచ్చి ఎట్లాగో ఎగువకు ఎగబ్రాకుతున్న ఒంటెద్దు బండిని బరువుగా లాక్కేస్తున్న సమయంలో, యాక్సిడెంటు అయి అసలు ఎద్దు కాస్తా చచ్చింది. వీళ్ల అదృష్టం పుచ్చింది.

మొగుడు చచ్చాడనీ కొన్నాళ్లు, తాను చావలేదనీ కొన్నాళ్లు, కొన్నాళ్లు కొంప జరగటం లేదనీ రకరకాలుగా ఏడ్చింది. కడవల కొద్దీ కన్నీరు కార్చింది.

అవన్నీ అయ్యాక, ఇప్పుడు ఉన్నవాళ్ల నలుగురి చూసుకుంది. కన్నం వేయటానికి కాదు. అంట్లు తోమటానికి, వారి కరుణా కటాక్ష వీక్షణాల వల్ల లభించే కొద్ది పాటి డబ్బువల్ల, రెండు పెద్ద టిక్కెట్లకీ, ఒక చిన్న టికెట్టుకీ ఇంత కూడు దొరుకుతోంది.

సిద్దయ్య నడుస్తూ పైకి తలఎత్తి చూశాడు. తెల్లని నక్షత్రాలతో నిండిన నల్లని ఆకాశం రంభ ఆరేసుకున్న జరీబుటాలున్న ఖరీదైన చీరలా ఉందని గానీ, ఊర్వశి మెడలోని హారం లేని చెల్లాచెదరాయిన ముత్యాల్లాగానీ సిద్దయ్యకు అనిపించలేదు. అవన్నీ ఎవరో పారబోసుకున్న బియ్యపు గింజల్లా కనబడ్డాయి.

అలా ఆకాశం వంక చూస్తుండగానే ఒక నక్షత్రం రాలింది. చుక్క రాలటం అంటే మాటలా? అది పల్లకీ ఎక్కి ఊరేగుతున్న పాలకులకు కీడు అని సిద్దయ్యకు తెల్సు. జరగకూడనిది ఏదో జరగబోతోందని అనుకున్నాడు.

సిద్దయ్య, చేతి కర్ర ఆసరాతో నెమ్మదిగా నడుస్తున్నాడు. కాలం మారుతుంది. చుక్క రాలింది. రేపో మాపో ఇప్పుడున్న రాజు పోయి, మరో మహారాజు వస్తాడు. సిద్దయ్యకి ఇప్పుడున్న రాజు ఎవరో, మంత్రి ఎవరో తెలియదు. కనబడుతున్న అరాచకమే తప్ప, ఇప్పుడున్న రాజకీయం గురించి సిద్దయ్యకు ఏమీ తెలియదు.

సిద్దయ్య పార్క్ దాటి, సినిమా టాకీసు దాటి, హైస్కూలు గేటు దగ్గరకొచ్చాడు. ఆ గేటు దగ్గర క్షణం ఆగి ఎంతో కుతూహలంగా అటువైపు చూశాడు. ఆ గేటు దగ్గరీ తన జీవితాన్ని అంతా గడిపాడు. శరీరాన్ని అలసత్వం ఆవహించేదాకా ఎంతో నమ్మకంగా ఆ దగ్గర కాపలా కాశాడు. తను స్టూలు వేసుకుని కూర్చునే మూల వంక ఆప్యాయంగా ఊచూశాడు.

మరో రెండు మలుపులు మురికివాడలోకి వచ్చాడు. పూర్తి గుడిసెల మధ్య జీవ నదుల్లా పొంగి పొర్లుతుండే మురికి కాలువలు దాటాడు. ఇదివరకు ఈ గుడిసెల్లో ఉండే మగవాళ్ళంతా పగలంతా కష్టపడి ఒళ్లు విరుచుకుని కష్టపడి సంపాదించి పట్టుకొచ్చిపెడితే, ఆడాళ్లు అందరూ కాలు కదపకుండా కూర్చుని తినేవారు. రానురాను పిదపకాలం వచ్చి పడింది. దరిద్రం హెచ్చింది. ఇప్పుడు ఆడాళ్ళు రాత్రంతా ఒళ్ళు అమ్ముకొని సంపాదిస్తుంటే, మగవాళ్ళంతా కాలు కదపకుండా కూర్చుని తింటున్నారు.

సిగ్గూ, శరమూ లేకుండా పోయింది.

తన గుడిసె దగ్గరకు చేరుకున్నాడు. సీతమ్మ తల్లి వయసులోన ఉన్నా నిప్పులాంటిది. దానికి అలాంటి ఆలోచనలు రావు. ఈ ముసలాడు, ఆ రెక్కలు రాని పిల్లోడు తప్ప దానికింక మరో లోకమే లేదు.

సిద్దయ్య రావటం చూసి చాప మీద పడుకున్న సీతమ్మ లేచి నిలబడింది.

కుండలోని నీళ్లు ముంచి సత్తు గ్లాసుతో నీళ్లు అందించింది. కుక్కిమంచం బయట వేసింది.

“సెందరాయి యాడికి బోయినాడు సీతమ్మా?” అని అడిగాడు సిద్దయ్య.

“నాకు జెప్పలే. ఈడనే, యాడనో తిరుగుతుంటాడు” అన్నది సీతమ్మ,

తన మనవడు అలా పొద్దుపోయిన తరువాత కూడా చుట్టుపక్కల తిరగడం సిద్దయ్యకు నచ్చలేదు.

ఎక్కడి నుంచి వచ్చాడో చంద్రాయి హుషారుగా ఎగురుకుంటూ వచ్చాడు. తాత మంచం మీద కూర్చుని పొట్లం విప్పాడు.

“తాతా, ఇదుగో” అన్నాడు చంద్రాయి గర్వంగా.

“ఏంది రా?”

“జిలేబి”

“యాడిదిరా?”

“సంపాయిచ్చాన్లే”

“నీకు సంపాదన ఏందిరా? ఇవరంగ జెప్పు” అని సీతమ్మ దగ్గర కొచ్చింది.

చంద్రాయి నెమ్మదిగా అన్నాడు “సుబ్బమ్మ ఇరవై రూపాయలు ఇచ్చింది”

“ఎందుకిచ్చిందిరా?”

“ఆ రోడ్డు మీన లైటు స్తంభం కాడ నిలబడి ఎవల్లన్న ఒంటరిగా ఎల్తుంటే పిల్ల గావాలా అని అడగమంది. ఎవురయినా సూపియ్యమంటే తన కాడికి తీసుకు రమ్మంది. నేను తీసుకొచ్చినా, అందుకు ఇరవై రూపాయలు ఇచ్చింది” అన్నాడు చంద్రాయి.

సీతమ్మకు కోపం వచ్చి శివమెత్తి పోయింది. కొడుకును చెడామడా తిట్టి చావగొట్టింది. జుట్టు పట్టుకుని వంచి వీవున ఫెడీఫెడీ మని గుద్దింది.

సిద్దయ్య అడ్డు పడ్డాడు.

“సిన్నోడు గదా. వాడ్ని ఎందుకమ్మా అట్టా సావగొడతావు” అన్నాడు.

“సిన్నోడు ఏంది మావా. వాడు చేసిన పనేంది? ఇదే అలవాటు అయితే వాడు ఏమై పోతాడు?” అన్నది కన్నీళ్ళు తుడుచుకుంటూ.

“మంచీ సెడూ వాడికేం తెల్సమ్మా?” అని నచ్చ చెప్పబోయాడు సిద్దయ్య.

“డబ్బులు రుచి మరిగాక, రేపు ఇంకోణ్ణి నా ఇంటికే తీసుకొస్తే?” అన్న సీతమ్మ మాటలు విన్నాక నిలవలేకపోయాడు.

కోడలు చెప్పిన దాంట్లో ఉన్న నిప్పు లాంటి నిజాన్ని విన్నాక ముసలాడు గూడా భయపడ్డాడు.

‘సెందరాయి తప్ప పుట్టాడు గానీ, ఉన్నోళ్ళ కొంపలో పుట్టి ఉంటే కలెక్టరో, డాక్టరో, యాక్టరో అయ్యేటోడు. ఆడికన్ని తెలివి తేటలున్నయి. ఒకళ్ళు సెప్పకుండానే అన్నీ సూసి తెల్సుకుంటాడు; మనవణ్ణి ఒక మార్గంలో పెట్టేది ఎలాగ?’ అని చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు సిద్దయ్య,

సిద్దయ్య నౌకరీ చేసే రోజుల్లో చాలా శ్రద్ధగా కాపలా కాసేవాడు. ఒకసారి ఏమైందంటే – అప్పన్న దొర గారి కారు స్కూలు ముందు ఆగింది. అందులో నుంచి దిగి దొర గారి అబ్బాయి రోడ్డు దాటి తన వైపుకు వచ్చేస్తున్నాడు. ఇంతలో ఎవడో తాగుబోతు వెధవ లారీ దూకుడుగా నడుపుతూ దడదడ లాడిస్తూ వచ్చేస్తున్నాడు. అప్పుడు సిద్దయ్య రెండు అంగల్లో రోడ్డు మీదకు ఉరికి, అబ్బాయిగారి రెక్క పుచ్చుకుని పక్కకు లాగేశాడు. తనూ మెరుపులా తప్పించు కాబోయాడు గానీ లారీ అతన్ని ఒక్క తాపు తన్నేసింది. అంత దూరంలో పడ్డాడు.

ఇది విన్న దొరగారు పుత్రభిక్ష పెట్టినందుకు సిద్దయ్యను ఎంతగానో మెచ్చుకున్నాడు. ఏ అవసరం వచ్చినా తన దగ్గరకు వచ్చి అడగమని అప్పట్లో దొరగారు అన్నారు.

ఇప్పుడా దొరగారి అబ్బాయి చాలా పెద్దవారయి పోయారు. రాజకీయాల్లోకి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు.

సిద్దయ్యకు గతమంతా కళ్ళముందు కదిలింది. తనెప్పుడూ వారి వద్దకు వెళ్ళ ఏమీ అడగలేదు. కానీ ఇప్పుడీ మనవడి చెయ్యి దాటి పోతున్నాడు. వీడికో పని చూపించటం ఆయనకో పెద్ద పని కాదు.

చివరికో నిశ్చయానికి వచ్చాడు.

మర్నాడు సిద్దయ్య మనవడ్ని తీసుకుని దొరవారి బంగళాకు వెళ్ళాడు. రెండు రోజులు తిరిగాకగానీ దొరవార్ని చూడలేకపోయాడు. సిద్దయ్య కళ్ళకు దొరవారు కూర్చున్న కుర్చీ రాజుగారి సింహాసనం లాగాను, ఆయన అచ్చం రాజుగారి లాగాను కనబడ్డారు.

అప్పుడెప్పుడో తాను చేసిన సేవను గుర్తు చేసి తనకు వచ్చిన కష్టం చెప్పుకున్నాడు.

రేపొద్దున కుర్రాడ్ని పంపించమని దొరవారు సెలవిచ్చారు.

ఆ ఒక్కమాట సిద్దయ్యకు సంజీవినిలా పనిచేసింది.

మర్నాడు కుర్రాడ్ని పంపాడు. సాయంత్రం తిరిగొచ్చాడు.

దొరగారు ఏదో ఉద్యమం చేయిస్తున్నారు. రోజంతా డువున్, డవున్ అని అరుస్తూ అందరితోపాటు తిరిగినందుకు వంద రూపాయలు ఇచ్చారు.

“నీ కొడుకు వొజ్జరం లాంటోడే” అని తృప్తిగా మనవడి తల నిమురుతూ ఉండి పోయాడు.

మర్నాడు మధ్యాహ్నానికి పిడుగు లాంటి వార్త వచ్చింది. ఊరంతా అట్టుడికి పోయింది. ఊర్లోకి పోలీసు పటాలాన్ని దించారు. గాంధీ చౌక్ కాడ కాల్పులు జరిపారు. ఎనిమిది మంది చనిపోయారు. అందులో చెందరాయి కూడా ఉన్నాడు.

సీతమ్మ వెర్రిగా అరుస్తూ గాంధీ చౌక్ వైపు పరుగెత్తింది. ఊరంతా కంగారుగా ఉంది. రోడ్డు మీద కనిపించిన వాళ్ళందర్నీ కాల్చి పారేస్తున్నారు.

గాంధీ చౌక్‌లో ఇంకా జనానికీ, పోలీసులకీ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. జనంలో నుంచి రాళ్ళు సోడా బుడ్లు విసురుతున్నారు. అటు నుంచి తుపాకులు మ్రోగుతున్నాయి.

ఆ రాత్రి సీతమ్మ ఇంటికి రాలేదు.

ఊరంతా కర్ఫ్యూ. చాలామంది చాలా చోట్ల చిక్కకుపోయారు.

“ఆయాల నేను సావుకి సిద్ధపడి, నీ కొడుకు ప్రాణాలు కాపాడితే, నువ్వు సేసిన ఉపకారం ఏంటి? నా మనవడ్ని కోడల్ని సంపించినావు? నీకిది న్యాయమేనా? నువ్వు దోరవేనా?” అని సిద్దయ్య కనపడని దొరని నిలదీస్తున్నాడు.

అక్కడ దొరవారు చిద్విలాసంగా నవ్వుకుంటూ, మీసం దువ్వుకుంటూ, భజనపరులను వెంట పెట్టుకుని కూర్చున్నారు.

మర్నాడు చంద్రాయి, సీతమ్మ శవాలను చుట్టుపక్కల గుడిసెల్లోని వాళ్ళంతా గుర్తు పట్టారు. కర్ర పొగుచుకుంటూ కన్ను పొడుచుకుంటూ సిద్దయ్య సముద్రపు ఒడ్డుకు పోతున్నాడు కోపంగా తిట్టుకుంటూ.

భూమ్మీద సిద్దయ్యని కట్టి పడేసిన బంధాలన్నీ తెగిపోయినయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here