చిరుజల్లు-128

0
11

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

వంచన

[dropcap]గో[/dropcap]పాల్ జైలునుంచి విడుదల అయినాడు.

రోడ్డు మీదకు వచ్చి నిరామయంగా నిలబడ్డాడు.

ఇప్పుడు ఎక్కడికి పోవాలో, ఏం చెయ్యాలో తెలియటం లేదు. జైలుకు వెళ్లక ముందు గోపాల్ గడిపిన జీవితం వేరు. ఎంతో నిశ్చంతగా, ఎంతో గౌరవంగా, మరెంతో గర్వంగా రోజులు గడిపాడు. ఇకముందు అలా గడవదు. లోకం దృష్టిలో తనో నేరస్థుడు. జైలు శిక్ష అనుభవించిన ద్రోహి.

జైలులో ఉన్నప్పుడు సాటి ఖైదీల కథలు ఎన్నో విన్నాడు. అందులో నేరం చేసిన వాళ్లు ఉన్నారు. వేరెవరో చేసిన నేరాలకు బలి అయిన వారూ ఉన్నారు.

జైలుకు వెళ్లకముందు తను ఒక ఇంట్లో అద్దెకు ఉండేవాడు. ఇంటి యజమానురాలు తనను సొంత కొడుకులా చూసేది. ఇప్పుడూ అలాగే ఆదరిస్తుందేమోనన్న ఆశతో, ఆ ఇంటికి వెళ్లాడు. గుమ్మం తలుపు తట్టాడు.

ఇతడ్ని చూడగానే తెరిచి ఉంచిన తలుపును సగం మూసి ‘ఏం కావాలి?” అని అడిగింది.

“అమ్మా, నేను మీ గోపాల్‍ని. ఇదివరకు మీ ఇంట్లో అద్దెకు ఉండేవాడిని. నా సామాను మీ ఇంట్లో ఉంది..” అన్నాడు గోపాల్.

“నీ సామాను ఏం లేదు. ఎప్పుడో బయట పారేశాం. ఏవో రెండు జతల బట్టలు, ఏవో పేపర్లూ ఉన్నట్లున్నయి..” అంటూ ఒక బ్యాగ్ వీధిలోకి విసిరేసి తలుపు వేసుకుంది.

ఇంత నిరాదరణ ఎదురవుతుందని అనుకోలేదు గోపాల్. ఎంతో ఆప్యాయంగా, ఇంట్లో సొంత మనిషిలా చూసే సావిత్రమ్మ ఇలా అసహ్యించుకుంటుందని అనుకోలేదు.

బ్యాగ్‍ లోని కాగితాలు తీసి చూసుకుంటే అందులో ఒకప్పటి బ్యాంక్ పాస్‌బుక్ కనిపించింది. అందులో ఏమన్నా డబ్బు బ్యాలెన్స్ ఉందేమోనని ఆ బ్యాంక్‌కు వెళ్లాడు.

కౌంటర్ లోని ఆమె ముహం చిట్లించింది. “దీన్ని డెడ్ అకౌంట్‌లో వేశాం. వెళ్లి మేనేజర్‍ను చూడు” అన్నది.

ఆయన ఏం లాభం లేదన్నాడు. అకౌంట్ క్లోజ్ చేయమని అప్లికేషన్ రాసిస్తే, అందులో ఉన్న రెండువేలూ ఇస్తామన్నాడు. చేయగలిగింది ఏమీ లేదు గనుక, ఆ రెండువేలూ తీసుకొని బయటపడ్డాడు.

గోపాల్ మరీ అంత గతి లేని వాడేం కాదు. అతనికి స్వగ్రామంలో రెండు ఎకరాల పొలం ఉంది. ఆ ఊళ్ళో చిన్న ఇల్లు ఉంది. వాటిని చూడాలనుకున్నాడు.

బస్ లోనుంచి దిగి, ఊళ్లోకి నడిచాడు. అవన్నీ ఇది వరకు తనకు బాగా పరిచయం ఉన్న ప్రదేశాలు. ఆడి పాడిన ప్రదేశాలు.

ఆ ఊళ్ళోని వాళ్లందరూ తనకు ఆప్తులూ, బంధువులూ. ఇప్పుడు అతన్ని ఒక దయ్యాన్ని చూసినట్లు వింతగా చూశారు. ఎవరూ పలకరించలేదు. గోపాల్ పలకరించినా, ఎగాదిగా చూశారు గానీ, బదులు చెప్పలేదు.

గోపాల్ తమ పొలం కౌలుకు చేసున్న శాయన్న ఇంటికి వెళ్ళాడు. శాయన్న బయటకు వచ్చి, గోపాల్‍ని చూసి ఆశ్చర్యపోయాడు.

“బాగున్నావా, శాయన్నా?” అని అడిగాడు గోపాల్.

“బానే ఉన్నానండీ. మీరు జైలుకెళ్ళిన కాడ్నించి మీకు రావల్సినవన్నీ ముకుందంగారే వచ్చి వసూలు చేసుకుంటున్నారండీ. మీరాయనకు రాసిచ్చారంట గదా” అన్నాడు శాయన్న.

గోపాల్‌కి ఇంక ఏం మాట్లాడాలో తెలియలేదు.

నెమ్మదిగా వెనుదిరిగాడు. తను పుట్టి పెరిగిన ఇంటిని చూడాలని అనిపించింది. ఆ ఇంటి ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. ఇప్పుడా ఇంట్లో ఎవరుంటున్నారో తెలియదు..

తలుపు తడితే ఒక ముసలాయన కర్ర ఊతంతో బయటకు వచ్చాడు. “మీరెవరు?” అని అడిగాడు.

నిజానికి అది గోపాల్ అడగాల్సిన ప్రశ్న. “ఈ ఇల్లు మాదే” అన్నాడు గోపాల్.

“మిమ్ముల్ని మేం ఎప్పుడూ సూడలేదే” అన్నాడా ముసలాయన.

“నేను సిటీలో ఉంటున్నాను” అన్నాడు గోపాల్.

“ఈ ఇంటాయన జైలు కెళ్ళారని అన్నారు.”

“ఎవరన్నారు?”

“ఊళ్ళో అందరూ..”

గోపాల్‌కి ఇంక ఏం మాట్లాడాలో తోచలేదు. ఆ ఊళ్ళో అతన్ని బాగా ఇష్టపడిన వ్యక్తి బలరామయ్యగారు. ఆయన పైస్కూలు టీచరు. ఆయన దగ్గర చదువుకున్నాడు. ఉద్యోగంలో చేరిన తరువాత ఒకటి రెండు సార్లు ఈ ఊరు వచ్చినప్పుడు ఆయన్ను కల్సుకునేవాడు. అందుకాయన సంతోషించేవాడు.

ఇప్పుడూ బలరామయ్య ఇంటికి వెళ్ళాడు గోపాల్. చూడగానే ఇదివరకటి లాగానే ఆప్యాయంగా నవ్వుతూ ఆహ్వానించాడు. ఎదురుగా కూర్చోబెట్టుకుని యోగక్షేమాలు అడిగాడు.

“నాకు ఏ పాపం తెలియదు మాష్టారూ. నేను పని చేసిన డిపార్ట్‌మెంటులో గవర్నమెంటు ఫండ్స్ దుర్వినియోగం అయినయి. అప్పటి మంత్రి, ఉన్నతాధికారులూ ఎవరికి తోచినంత వాళ్లు తినేశారు. తీరా ఎంక్వయిరీలు, కేసులూ వచ్చేటప్పటికి క్రింది ఉద్యోగినైన నాపైన నెట్టేశారు. అన్ని కోట్లు నిజంగా నేను తిని ఉంటే, ఆ డబ్బుతోనే కేసు నుంచి నేర్పుగా తప్పించుకునే వాడ్ని. చిన్నప్పుడు మీరు నూరిపోసిన న్యాయం, ధర్మం, అణువణువునా జీర్ణించుకు పోయినవాడ్ని. ఇవాళ ఆ న్యాయానికీ, ధర్మానికీ నిలువనీడ లేకుండా పోయింది మాస్టారూ!…” అన్నాడు గోపాల్ ఆవేదనగా.

“నిజమేరా! ఈ లోకానికి నువ్వు జైలు శిక్ష అనుభవించటం ఒక్కటే తెలుస్తుంది గానీ ఈ లోగుట్టు వ్యవహారాలు ఎవరికీ తెలియవు. అలా అని ఆ నీచపు పని మనం చేయలేం. మనసు ఒప్పదు. ఎవరి ఇంట్లోనన్నా మంచి నీళ్ళు తాగినా, వాళ్ళకు రుణపడిపోయామనుకునే మనకూ, చేతికి అందినంత వరకూ అడ్డగోలుగా తినేసేవాళ్ళకూ పోలికే లేదు. ఎక్కడ చూసినా అన్యాయానిదే పై చెయ్యి అయిపోయింది. నీవు జైలుకు వెళ్ళాక ముకుందంకు నీ ఆస్తి మీద కన్ను పడింది. దాన్ని వాడు స్వంతం చేసుకున్నాడు. వెళ్ళి ముకుందంతో మాట్లాడి చూడు. తరువాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం” అన్నాడు బలరామయ్య.

ఆ పూట ఆయనతో పాటే భోంచేశాడు. సిటీలో ముకుందం ఎక్కడ ఉంటున్నాడో తెల్సుకుని అడ్రసు సంపాదించాడు.

మర్నాడు మధ్యాహ్నానికి సిటీలో ఉన్న ముకుందం ఇంటికి వెళ్ళాడు గోపాల్.

ముకుందం ఆదరించాడు. “నేనే జైలుకు వచ్చి నిన్ను ఇంటికి తీసుకు రావాలనుకున్నాను. కానీ నువ్వు విడుదల అయ్యే తేదీ గుర్తులేక రాలేకపోయాను..” అన్నాడు.

“ఫరవాలేదు లెండి” అన్నాడు గోపాల్.

“ఇప్పుడింక ఏం చేద్దామనుకుంటున్నావు?” అని అడిగాడు.

“నాకు ఎవరూ ఏ ఉద్యోగమూ ఇవ్వరు. మన ఊరు వెళ్ళి అక్కడే ఉంటాను. ఉండటానికి ఇల్లు ఉంది. పొలం ఉంది.. నా అన్నది ఇంకేం మిగిలింది?” అన్నాడు గోపాల్.

“నిజమేననుకో. ఆ పల్లెటూరిలో ఉండలేకనే గదా, సిటీలోకి వచ్చాం. పైగా ఇప్పుడు నీవు ఉన్న పరిస్థితుల్లో నిన్ను మరింత చులకనగా చూస్తారు. అందుచేత ఇక్కడే నా దగ్గరే ఉండు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. పరిస్థితులు మారిన తరువాత ఆలోచిద్దాం” అన్నాడు.

గోపాల్‌కి గత్యంతరం లేదు. విడిగా ఉండాలన్నా, ఏదో ఒక ఆదాయం ఉండాలి. తనని ఎవరూ దగ్గరుకు కూడా రానివ్వని పరిస్థితుల్లో ఎక్కడన్నా, ఏదన్నా చిన్నపాటి పని దొరకటమూ కష్టమే గనుక ముకుందం ఇంట్లోనే మకాం పెట్టాడు.

ముకుందం ఎండుమిరపకాయల హోల్‍సేల్ వ్యాపారం చేస్తాడు. మండీలో చిన్న షాపు ఉంది. ఉదయం తొమ్మిదింటికి వెళ్తే, రాత్రి పది గంటలకు ఇల్లు చేరుతాడు.

ముకుందం భార్య చనిపోయింది. ఎలా చనిపోయిందీ అన్న దానిమీద నలుగురూ నాలుగు రకాలుగా చెప్పుకున్నారు. ఆరు నెలల తరువాత ఒక బీద ఇంటి అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు.

పరిస్థితులు బాగా లేనందువల్ల తిండికి లోటు లేదుగదాని ముకుందం దగ్గరకు వచ్చి ఉంటోంది ఉదయ. తనను పెళ్ళి చేసుకోమని ఎంత బలవంత పెట్టినా ససేమిరా అంటోంది.

గోపాల్ ఆ ఇంట్లో చేరినప్పటి నుంచీ, అతని ముందు చెడ్డవాడు కావటం ఇష్టంలేక ముకుందం, ఉదయని వేధించటం మానేసి, ప్రేమగానే చూస్తున్నాడు.

తనను నిత్యం అనేక రకాలుగా తిట్టి, కొట్టి హింసించే ముకుందంలో మార్పు రావటానికి గోపాల్ కారణం గనుక, ఉదయ్ కూడా గోపాల్‍ను బాగానే చూసుకుంటోంది.

వేళకు రెండు పూటలా భోజనం వడ్డిస్తోంది. కాఫీలు, టిఫిన్లూ అందించసాగింది.

క్రమంగా ఇద్దరి మధ్యనున్న ఏకాంతం వల్ల, చనువు కూడా ఏర్పడింది. సాయంత్రం పూట ఇద్దరూ కల్పి బయటకు, పార్క్‌కి వెళ్ళి వస్తున్నారు.

“లోకం అంతా నన్ను ఒక దుర్మార్గుడిగా భావించి, వెలివేసింది. నువ్వెందుకు నన్ను ఇంత ఆదరంగా చూస్తున్నావు?” అని అడిగాడు గోపాల్.

“ఏమో నాకూ తెలియదు. నిజానికి నాకు మాత్రం ఎవరున్నారు? కడుపునిండా తిండికి, ఒంటినిండా బట్టకు కూడా నోచుకోని నిరుపేదని. తప్పనిసరి పరిస్థితుల్లో ముకుందంతో వచ్చాను. నన్ను పెళ్ళి చేసుకోవాలని ఆశ పడుతున్నాడు. కానీ ముకుందం అంటే నాకు పరమ అసహ్యం..”

“ఎందుకని?”

“మనిషి ఎంత వికృతంగా ఉంటాడో అతని మనసూ అంత వికృతంగానూ ఉంటుంది. నీ మీద ప్రేమతో నిన్ను చేరదీయలేదు. ఏదో ఒక రకంగా, పల్లెటూరిలో ఉన్న నీ ఇల్లు, పొలం స్వంతం చేసుకునే ఆలోచనలో ఉన్నాడు. నిన్ను వశపరుచుకునేందుకు నన్ను ప్రయత్నించమని రహస్యంగా చెప్పాడు..”

“నన్ను వశపరుచు కోవటం అంటే?” అని అమాయకంగా అడిగాడు గోపాల్.

“ఏమో, నాకూ తెలియదు” అన్నది ఉదయ సమ్మోహనం చూస్తూ.

ఉదయ గోపాల్‍ని నిజంగానే ప్రేమిస్తోంది. ఊరికూరికే కిలకిలా నవ్వుతోంది. కళ్ళతోనే గాలమేసి లాగుతోంది. అనవసరంగా అతని మీద చెయ్యి వేస్తోంది. వీపు రుద్ది తలంటి స్నానం చేయిస్తోంది. ముద్దలు కలిపి పెడుతుంది. వెన్నెల్లో ముద్దులు పెడుతోంది.

“నీ జీవితంలో ఇంతగా వెల్లువలా ముంచెత్తిన ప్రేమను నేను ఎరుగను. నా పట్ల నువ్వు చూపిస్తున్న ఈ దయ, ఆదరణకు నేను ఏ విధంగా ప్రత్యుపకారం చేయగలను?” అని అడిగాడు గోపాల్.

“మీరే కాదు, నేనూ ఇంత సన్నిహితంగా వచ్చి, మనసులో తిష్ఠవేసిన మనిషిని ఎరుగను, మనం ఎటైనా వెళ్ళి పెళ్ళి చేసుకుందాం” అన్నది ఉదయ.

గోపాల్ మాట్లాడలేదు.

ఆమెను పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన అతనికీ వచ్చినా ఇదంతా తనను వశపరుచుకునేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నమేమోనన్న సందేహం కలిగింది.

జీవితంలో అడుగడుగునా అన్యాయం జరిగింది. దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది.

నిర్దోషి అయిన తనను దోషిగా నిలబెట్టింది ఈ లోకం. ఉదయ కూడా తన గుండెల మీద తన్ని ఆస్తి చేజిక్కించుకుని వెళ్ళిపోతే, తట్టుకోలేడు.

కానీ ఈ కొద్దికాలం ఇంత ప్రేమను కురిపించినందుకు, అతనికి ఉన్న ఇల్లు, పొలం ఉదయ పేరు మీద రిజిస్టరు చేశాడు.

నిద్రిస్తున్న సమయంలో ఆ కాగితాలు ఆమె పక్కన ఉంచి వెళ్ళిపోయాడు.

“క్షమించు. ఇకముందు ఏ చిన్న దెబ్బ తగిలినా ఈ గుండె తట్టుకోలేదు. వంచనకే గానీ, మంచికి చోటు లేని ఈ లోకంలో నేను నిలువలేను” అన్న చీటీ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here