చిరుజల్లు 13

1
7

నగవే వెలలేని నగ

[dropcap]B[/dropcap]righten the corner where you are

అద్దంకిలో ఉండే పెద్ద మోతుబరి రైతు అమెరికా బయల్దేరాడు. అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి. చిన్న సమస్య ఏమిటంటే, ఆయనకు తెలుగు తప్ప, ఇంకో భాష రాదు. విమానం ఎక్కాలంటే, చెకిన్‌లూ, సెక్యూరిటీ చెకిన్‌లూ, బోర్డుంగ్ పాసులూ గట్రా వంటి అనేక విషయాల్లో ఇంగ్లీషులో అడుగుతారు గదా. ఎలా అన్న చిన్న సందేహం ఉన్నా, ఇప్పుడు చాలా మంది ఏమీ రాకపోయినా, ఏమీ లేకపోయినా, విమానాలు ఎక్కేస్తూనే ఉన్నారన్న ధైర్యంతోనే పంపించారు.

అమెరికాలో దిగాక కొడుకు అడిగాడు “ఇంగ్లీషు రాదు గదా. ఏమన్నా ఇబ్బంది పడ్డావా?” అని. అందుకు ఆంజనేయులు ధైర్యంగా సమాధానం చెప్పాడు. “నేనేం ఇబ్బంది పడలేదురా. నేను చెప్పేది అర్థం కాక, వాళ్లే ఇబ్బంది పడ్డారు” అని. ఇది నిజమే అయినా, వినగానే మనకు నవ్వొస్తుంది. ఎందుకనీ అంటే మనం ఆశించే సమాధానం ఒకటి, ఆయన దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఒకటి.

కొన్ని చోట్ల హాస్యం అలా అనుకోకుండా, అయాచితంగానే, మాటవరసకు మాట్లాడినా, దొర్లుతుంది. ఒకామె “మా ఆయన ఒట్టి పుస్తకాల పురుగు” అంటే, పక్కింటామె “మా ఆయన ఒట్టి పురుగే” అంటుంది. ఆమె ఉద్దేశం ఆయన పుస్తకాలు పట్టుకుని కూర్చోడని చెప్పటం. కానీ మొదటి ఆమె చెప్పిన దాని నుంచి, ఆమె అందుకున్న మాటే మనకు నవ్వు తెప్పిస్తుంది.

హాస్యాన్ని ఇదమిత్థంగా నిర్వచించటం కష్టం. అనేక సమయాల్లో అనేక రకాలుగా హాస్యం వెల్లడవుతుంటుంది. దానికి నిబంధనలు లేవు. నియమాలు లేవు. పరిధులు లేవు. పరిమితులు లేవు. ఎప్పుడైనా, ఎవరి నుంచి అయినా, ఏ రూపంలో అయినా హాస్యం వెల్లడి కావచ్చు.

నిజానికి హాస్యం అనేది దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం. కోపం, ద్వేషం, పగ, అసూయ వంటి వాటితో రగిలి పొగలైపోయే సమయంలోనూ ఒక చతురోక్తి, అక్కడి ఉద్రిక్త వాతావరణంలో మార్పు తీసుకురావచ్చు.

భర్త చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. భార్య ఏడుస్తూ కళ్లు తుడుచుకుంటోంది. భర్త “అప్పుడే రిహార్సల్స్ మొదలెట్టావా?” అని అంటే, అంత విషాదంలోనూ, రవ్వంత నవ్వు తొంగిచూడక మానదు.

ఒక కార్డూనిస్టు ఒక కార్టూన్‌లో కుక్కను తాడుతో కట్టేస్తాడు. అది విడిపించుకొనిపోతుంది. భార్య అంటుంది “మూడు ముళ్లు వేయకపోయారా? చచ్చినట్లు పడి ఉంటుంది” అని. ఇందులో హాస్యం కన్నా ఎక్కువగా ఇల్లాలి బాధ అవ్యక్తంగా వ్యక్తమవుతుంది.

కోర్డులో జడ్జిగారు అడుగుతాడు “నువ్వు కోర్టుకు నివేదించుకునేది ఏమైనా ఉందా?” అని. “అయ్యా, నేను అంతా లాయరుగారికే నివేదించుకున్నానయ్యా?” అని పార్టీ అంటాడు. ఇక్కడ చెప్పకోవల్సింది అంతా లాయరుకే చెప్పుకున్నాను – అనేదానితో పాటు, ఉన్న డబ్బు అంతా ఆయనకే ఇచ్చుకున్నానన్నబాధ కూడా వ్యక్తమవుతుంది.

మనిషి అన్న ప్రతి వాడూ ఆలోచించకుండా ఉండడు. ఆలోచనలు అన్నాక మంచివీ ఉంటాయి. చెడ్డవీ ఉంటాయి. బలహీనతలు ఉంటాయి.

ట్యూషన్ చెప్పే అమ్మాయి, ఒక ఇంట్లో పిల్లాడికి ట్యూషన్ చెప్పటం మానేసింది. ఎందుకు మానేశావంటే – “వాళ్లింట్లో కొడుకు బ్యాక్‌వార్డ్, తండ్రి ఫార్వార్డ్” – అని చెప్పంది. కొడుకు ఒట్టి చదువురాని మొద్దు. ఇదొక కారణం అయితే, ఆ కుర్రాడి తండ్రి ఆమె మీద వల విసరటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది బలమైన కారణం.

సమాజంలో ఎదురయ్యే అనేక బలహీనతలనూ, రుగ్మతలనూ కూడా హాస్యం వ్యక్తపరుస్తుంది అవ్యక్తంగానే.

పెళ్లికూతురు తలొంచుకొని కూర్చున్నదేం? అని ఒకరంటే “వీడిని ఇంత డబ్బు పోసి కొనుక్కుంటున్నందుకు సిగ్గుతో తలొంచుకున్నది” అని ఎవరో అంటాడు. కట్నాల వేట ఎంత దారుణంగా ఉందో ఈ జోక్ మనకు చెప్పకనే చెబుతుంది.

భార్యాభర్తలు సరసమాడుకుంటారు. భర్త పూజలు చేస్తాడు. భార్యకు వంట పనితో సరిపోతుంది. “నువ్వు పూజ చెయ్యవా?” అని ఎవరైనా అడిగితే, “మగవాళ్లు స్వర్గానికి వెళ్తే, వాళ్ల కోసం అక్కడ రంభా, ఊర్వశిలు ఉండారు. మాకు ఎవరుంటారు?” అని అంటుంది ఇల్లాలు. ఇక్కడ వంట పనితోనే సరిపోతోందన్న బాధతో పాటు, కొంత సరస సల్లాపమూ కనిపిస్తుంది.

కడుపులో అల్సర్‌తో బాధపడే రోగి డాక్డరు దగ్గరకు వెళ్తాడు. డాక్టర్ రోగికి ధైర్యం చెప్పటానికి అంటాడు “పదేళ్ల కిందట నేనూ ఇదే జబ్బుతో బాధపడ్డాను… భయపడకు” అని. రోగి వెంటనే అంటాడు “మీకు నయం చేసిన డాక్టరు వేరే ఆయన కదా సార్” అని. డాక్టరు సామర్థ్యం మీద రోగికి నమ్మకం లేదన్న విషయం ఈ సమాధానం తెలియజేస్తుంది.

కొన్ని సందర్భాలలో చెప్పిన కొన్ని మాటలను మరో సందర్భంలో చెబితే హాస్యం ఉత్పన్నమవుతుంది.

ఒక విందు కార్యక్రమంలో బఫె భోజనాలు ఏర్పాటు చేశారు. ఒక వృద్ధుడికి అందరిలాగా నిలబడి తినటానికి ఇబ్బందిగా ఉంటుంది. “మన సాంప్రదాయ పద్ధతిలో భోజనాలు ఏర్పాటు చేయకపోయారా?” అంటాడాయన. “చేయవచ్చు. కానీ కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు గద – అందుకని నిలబడి తినేలా చేశాం” అంటాడు ఇంటాయన. ఆ సామెత అర్థం వేరు అయినా, దాన్ని ఇక్కడ వాడుకోవడంతో హాస్యం తొంగి చూస్తుంది.

ఒకాయనకు బ్రెయిన్ ట్యూమర్ ఉందేమోనని అన్ని పరీక్షలూ చేయించారు. ట్యూమర్ లేదని తేలింది. “ఆయన బ్రెయిన్‌లో ఏమీ లేదమ్మా” అని డాక్టరు అంటే “దానికి ఇన్ని పరీక్షలు చేయాలా, నన్ను అడిగితే, నేను చెప్పేదాన్ని కదా…” అతని భార్య అంటుంది. ఆమె ఉద్దేశం వేరు. కానీ చెప్పిన దాన్ని బట్టి వెల్లడి అయ్యే భావం వేరు.

చెప్పదల్చుకున్న ఉద్దేశం వేరు. చెప్పింది వేరు. ద్వందార్థాలూ ఒక్కోసారి నవ్వు తెప్పిస్తాయి.

ఆమె భర్తను మార్చాలని ప్రయత్నిస్తోంది – అంటే, భర్తలో పరివర్తన తీసుకొచ్చి దుర్గుణాలను పోగొట్టాలన్న అభిప్రాయం ఆమెకు ఉండొచ్చు. కానీ భర్తను మార్చి, మరొక భర్తను తెచ్చుకోవాలన్న అభిప్రాయమూ ఉన్నట్లు అందులో ధ్వనిస్తుంది.

సిగరెట్లు తాగటం మంచిది కాదు. ఆ అలవాటు మానెయ్యమంటే, నేను చాలా సార్లు మానేశాను అంటాడు. ఇక్కడ మానేశాను అన్నమాటకు అర్థమే మారిపోయి నవ్వొస్తుంది.

కొందరు మహానుభావులు ప్రతిదానికీ విపరీతార్థాలు తీస్తుంటారు. ఇందులో నుంచి హాస్యం ఉత్పత్తి అవుతుంది.

కవే సమ్మేళనంలో అధ్యక్షుల వారు ఆ కవిగారిని కవిపుంగవుడు, కవిపుంగవుడు అని ఒకటికి రెండు సార్లు పొగుడుతాడు. కవి గారు పొంగిపోతాడు. ఆ తరువాత ఒక విమర్శకుడు కవిని అడిగాడు “ఆయన నిన్ను అన్ని సార్లు తిడితే ఊరుకున్నావేం?” అని. “ఏం తిట్టలేదే?” అని కవి అంటే “కవిపుంగవుడు అన్నాడు గదా. పుంగవుడు అంటే ఎద్దులాంటి వాడని అర్థం. కవులల్లో నువ్వొక ఎద్దులాంటి వాడివని తిట్టాడు గదా?” అని విపరీతార్థం తీస్తాడు.

ఒకోసారి అచ్చుతప్పులు, స్పెల్లింగ్ తప్పులు కూడా నవ్వు తెప్పిస్తుంటాయి. “లెక్కలూ, ఇంగ్లీషూ బోధించగల టీచరు స్త్రీ అయినా, పురుషుడు అయినా కావలెను” అని పత్రికలో ప్రకటిస్తే, “సర్, మీరు చెప్పిన రెండూ అయి ఉన్నాను” అని సమాధానం వచ్చింది.

మాట నేర్పు లేకపోవటం వల్ల అపార్థం వచ్చే అవకాశం ఉంది. అందులో నుంచి హాస్యం తొణికిసలాడవచ్చు.

ఒక స్కూలు టీచరు వివాహం చేసుకొని, హానీమూన్ వెళ్తూ రెండు వారాలు సెలవు పట్టింది. స్కూల్లో ఆమె స్థానం మరొక లేడీ టీచరుతో భర్తీ చేశారు. నెల రోజుల తరువాత ఒక పార్టీలో అంతా కల్సుకున్నారు. ఆ లేడీ టీచరు తనని పరిచయం చేసుకోబోయింది. అతను హాడావుడిగా అన్నాడు. “తెల్సు హానీమూన్‌కి వెళ్లినప్పుడు మా ఆవిడ ప్లేస్‌లో మీరు వచ్చారు గదా…” అని.

కొందరి అలవాట్లు చిత్రంగా ఉంటాయి. అవీ హాస్యాన్ని పండిస్తాయి.

“మీ ఇంటికి చుట్టాలు వస్తుంటారా?” అని అడిగితే “వస్తుంటారు. చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ల డబ్బులతోనే పాలు, పెరుగు, కూరలు, పంచదార, కాఫీ పొడి తెప్పిస్తుంటాం…” అంటుందామె. అందకని ఒకసారి వచ్చిన చుట్టం రెండోసారి రాడు.

రామారావుకి ఒక స్నేహితుడు ఎదురుపడ్డాడు. “ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగాడు. “ఇదే ప్రశ్న మా అమ్మ ఇరవై ఏళ్లు అడిగింది, మా ఆవిడ ముప్ఫయి ఏళ్లు అడిగింది. మా పిల్లలు పదేళ్ల నుంచి అడుగుతున్నారు…” అన్నాడు రామారావు. “ఇంకో నాలుగురోజులు పోయాక, నిన్ను మోసుకుపోతూ ఇంకో నలుగురు కూడా ఇదే అడుగుతార్లే…” అన్నాడు ఆ ఫ్రెండ్ వెళ్తూ.

ఒక ప్రియురాలు ప్రియునికి గుడ్ బై చెబుతోంది. “ఇంక మనం కేవలం ఫ్రెండ్స్‌గా మాత్రమే ఉండాలి. నేను నా మైండ్ మార్చుకున్నాను” అంటంది. “పోన్లే ఇక నైనా నీ మైండ్ పని చేస్తుందేమో చూద్దాం” అంటాడు ఆ ప్రియుడు నిరాశగా.

పేపర్లల్లో వచ్చే అచ్చుతప్పులూ కొల్లలుగా ఉంటాయి. హాస్యాన్ని కుమ్మరిస్తుంటాయి.

ఫలానా బ్యాంకులో “ఇక నుంచీ సింగిల్ విండో ఏర్పాటు చేశారు” అనటానికి బదులుగా “సింగిల్ విడో ఏర్పాటు చేశారు” అని అచ్చవుతుంటుంది.

ఫలానా వారి ఫలానా దేవాలయంలో నిన్న తెల్లవారుఝామున సినీనటి అంగ ప్రదర్శన చేసారు… అనీ వార్త వస్తే, ఆశ్చర్యపోవటం పాఠకుడి వంతు.

ఒక మంత్రిగారు మాట్లాడుతూ మన దేశంలో చదువుకున్న వారికన్నా, చదువురాని వారే ఎక్కువ ఉన్నారు. అందుచేత వచ్చేవారం నుంచి అక్షరాస్యతా నిర్మూలన ఉద్యమం ప్రారంభించబోతున్నాం… అంటారు.

ఇన్‌కం టాక్స్ వాళ్ల దగ్గర నుంచి లెటరు వస్తుంది. మీరు పన్ను కట్టకపోతే, చర్యలు ప్రారంభిస్తాం… ఇదే చివరి నోటీసు… అని అతను ఆదరాబాదరా వెళ్లి టాక్స్ కట్టేస్తాడు. “సారీ అండీ, ఇంతకుముందు మీరు పంపిన లెటర్లు అందలేదు” అంటే “మేం ఇంతకు ముందు లెటర్లు ఏమీ పంపలేదు. మొదటి నుంచీ ఇదే చివరి సారి అని నోటీసు ఇస్తాం” అంటారు ఆ ఆఫీసువాళ్లు.

కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు నవ్వు తెప్పిస్తుంటాయి. అతను నిన్నటి నుంచీ గొంతు నొప్పితో బాధపడుతున్నాడు, మాట పెగలటం లేదు. గొంతు రాసుకుపోయి, ఎంత పెద్దగా చెప్పినా, రహస్యం చెప్పినట్లే వినిపిస్తోంది. డాక్టరు దగ్గరకు వెళ్లాడు. నర్సును అడిగాడు “డాక్టరు గారు ఉన్నారా?” అని. ఆమె అంతే రహస్యంగా చెప్పంది “డాక్టరు గారు లేరు. లోపలికి రండి” అని.

ఆన్‌లైన్‌లో కవిసమ్మేళం జరుగుతోంది. కవిగారు మాట్లాడేది వినపడటం లేదు. “అయ్యా, మీరు మ్యూట్‌లో ఉన్నారు. చూడండి” అని ఇంకొకరు ఎవరో అంటారు. “వారి భార్య పక్కనే ఉన్నారు” అని మరొకరు వ్యాఖ్యానిస్తారు. అంటే వారి భార్య పక్కన ఉంటే, ఆయన మ్యూట్‌లో ఉంటారన్న భావం ధ్వనిస్తుంది.

ఒక్కోసారి ఒక్కో వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నందున, నవ్వు వస్తుంది. ఆమెకు దగ్గుగా ఉంది. మందు తెచ్చుకొని తాగుతోంది. కానీ పిల్లల నుంచి దూరం, దూరంగా తప్పుకొని తిరుగుతోంది. ఎందుకలా ఎడంగా తిరుగుతున్నావంటే, మందు సీసా చూపించింది. దాని మీద “కీప్ ఎవే ఫ్రం చిల్డ్రన్” అని ఉంది.

హాస్యం ఎప్పడు ఏ విధంగా తొంగిచూస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటికప్పుడు అనేకానేకమైన కారణాల వల్ల నవ్వు వస్తుంటుంది. నవ్వునూ, పరిష్వంగాన్నీ, తేనెనూ ఆస్వాదించాలే గానీ విశ్లేషించకూడదని ఒక అనుభవజ్ఞుడు వాక్రుచ్చాడు.

అనాది నుంచీ, నేటి దాకా ఎందుకో ఒకందుకు మనిషి నవ్వుతూనే ఉన్నాడు. నవ్వుతూనే ఉంటాడు. ఎందుకంటే, ఆనందమే జీవిత మకరందం. ఆనందం నవ్వు ద్వారానే వ్యక్తమవుతుంది.

ఆరుద్ర, తాపీ ధర్మారావుగారు స్నేహితులు. జంటకవుల్లా తిరుగుతుండేవారు. చూసిన వారు మాత్రం, ఒకరు ఆదుర్దా, ఒక తాపీ – అని వ్యాఖ్యానిస్తుండేవారు.

శ్రీశ్రీకి కూడా ఆరుద్రతో దోస్తీ ఉండేది. “మీ శిష్యరత్నం ఎలా ఉన్నాడండీ?” అని శ్రీశ్రీని అడిగితే, “శిష్యుడంటే వాడొప్పుకోడు, రత్నం అంటే, నేనొప్పుకోను” అన్నది శ్రీశ్రీ సమాధానం.

మంచి హాస్యధోరణి అనేది మనిషి ధరించే ఉడుపుల లాంటిది. అతను ఎంత మందిలో ఉన్నా తన్నొక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెడుతుంది.

చిరునవ్వు, దరహాసం, హసం, వికటాట్టహసం – ఇవన్నీ నవ్వుకి ప్రతిరూపాలే.

“నన్ను చూసి ఒకామె నవ్వింది…” అంటాడు ఒకడు. “నిన్ను చూస్తే ఎవరైనా నవ్వుతారు” అని ఇంకొకడు అంటాడు.

హాస్యం అనేది ఇరుసున కందెన లాండిది. ఎలాంటి గంభీరమైన సమయంలో అయినా, ఉద్రిక్తత తగ్గించి, తేలిక పరుస్తుంది.

చిరునవ్వు ఒకరి నుంచి మరొకరికి సునాయాసంగా వ్యాపిస్తుంది. చిరునవ్వు నీ ప్రగతికి నిదర్శనం. అంతే కాదు అది అనేక హృద్రోగ్రాలను దూరం చేస్తుంది.

జర్మనీలో చిన్న పిల్లలకు చికిత్స చేయటానికే డాక్టర్లు కూడా చిలిపి చేష్టలు చేస్తూ వారిని ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారట. మనిషి నవ్వితే, గుండె కూడా నవ్వుతుంది. గుండె నవ్వుతూ ఉంటే రక్తం చిక్కబడదు. గడ్డకట్టదు. ఇవన్నీ పరిశోధనలో వెల్లడి అయిన విషయాలు. పసివాడి బోసి నవ్వు, ముసలివాడి బోసి నవ్వు ఇద్దరికీ ఆరోగ్య ప్రదమైనవే – పుట్టుక నుంచీ, గిట్టుట వరకూ నవ్వును మించిన నగ లేదు.

వృద్ధాప్యం వల్ల ఎవరూ నవ్వటం మానెయ్యరు. కానీ నవ్వటం మానేసినందువల్ల వృద్ధాప్యం వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here