చిరుజల్లు-131

0
7

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

కన్న కలలన్నీ ఏం కావాలి?

[dropcap]సి[/dropcap]నిమా డైరెక్టర్ గురు చరణ్ రెండు సినిమాలు తీశాడు.

ఒకటి హిట్ అయింది. మరొకటి అనుకున్నంత విజయవంతం కాలేదు. అందుచేత ఆరు నెలల నుంచీ ఖాళీగానే ఉన్నాడు.

అయినా ఆయన ఆశావాది. ఎప్పుడు ఏ నిర్మాత ఎక్కడ తగులుతాడో తెలియదు గనుక, సినిమా స్టోరీలను సిద్ధం చేసి పెట్టుకునే పనిలో ఉన్నాడు.

ఇలా ఉండగా, ఇదివరలో ఆయన సినిమాలో నటించిన ఒక నటి ఆయనకు ఫోన్ చేసింది.

“ఒక అమ్మాయి మిమ్మల్ని కలవాలనుకుంటోంది. పంపించమంటారా?”

“దేనికి కలవాలనుకుంటోంది?” అని అడిగాడు.

“అది ఆ అమ్మాయినే అడగండి..” అన్నదామె.

అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వచ్చి తలుపు తడుతుందో తెలియదని అనుకుంటూ పంపించమన్నాడు.

మర్నాడు ఉదయం పది గంటల సమయంలో పాతికేళ్ల అమ్మాయి ఆయన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆయన పాదాలకు నమస్కరించింది.

ఎదురుగా కూర్చుంది. చామనచాయగా ఉన్నా, సిరిగల ముహం. విశాల నేత్రాలు ఆమెకు పెట్టని ఆభరణాలు. చిరునవ్వు తోనే పలకరింపులు చిలకరిస్తోంది.

“చెప్పమ్మా, దేనికి వచ్చావు?” అని అడిగాడు గురుచరణ్.

“సర్. నా పేరు ప్రతిమ. మాది రామచంద్రాపురం. గ్రాడ్యుయేషన్ చేశాను. మీ సినిమాలు చూశాను. మీకు వీరాభిమానిని అయ్యాను. డైరెక్షన్ నా పాషన్. మీ దగ్గర పని చేయాలనే కోరికతో వచ్చాను..” అన్నది ప్రతిమ.

“కానీ ఇప్పుడు నాకే పని లేదు. ఖాళీగా ఉన్నాను..” అన్నాడు గురు చరణ్.

“ఇవాళ పని లేక పోవచ్చు. కానీ ఎప్పుడూ ఇలాగే ఉండరు. మీ ప్రతిభకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తయి. అందుకని మీ దగ్గర అసిస్టెంట్‍గా పని చేయాలని వచ్చాను.”

“కానీ నీకు నేను ఏమీ రెమ్యూనరేషన్ ఇవ్వలేను.”

“మీరేమీ ఇవ్వవద్దు. రోజూ వచ్చి కాసేపు మీ ముందు కూర్చుంటాను. సత్పురుషుల దర్శనం, సత్సాంగత్యం ఇవి అందరికీ లభించని వరాలు” అన్నది ప్రతిమ.

“మాటలతోనే మత్తుమందు జల్లుతున్నావు” అన్నాడు గురుచరణ్.

“అయ్యో, ఎంత మాట? నాకు మీ శిష్యరికం లభిస్తే నా కలలన్నీ నెరవేరినట్లే” అన్నది ప్రతిమ.

మర్నాటి నుంచీ ప్రతిమ రోజంతా గురు చరణ్ ఇంట్లోనే ఉంటూ, సినిమా డైరెక్షన్ లోని సాధక బాధకాలన్నీ ఆయన వివరంగా చెబుతుంటే ప్రతిమ ఇంతింత కన్నులు చేసుకుని వింటూ ఉంది.

ఆయన తయారు చేస్తున్న సినిమా కథ గురించి ప్రతిమతో చర్చిస్తున్నాడు. ఆయన రాసిన చిత్త ప్రతులన్నీ ప్రతిమ తిరగ రాస్తోంది.

“చిన్న సందేహం గురువుగారూ” అంటూనే ఆ కథలోని లోటుపాట్లను ఎత్తి చూపేది.

“అవును సుమా, నువ్వు చెప్పింది కరెక్ట్” అని ఆయన సవరించేవాడు.

కాఫీలు, టిఫిన్లూ, మధ్యాహ్నం భోజనాలు ఆయనతోనే ప్రతిమకూ అమరుతున్నయి. అందుచేత ప్రతిమ ఆయన భార్యకూ చేరువ అయింది. ఆమెకు వంటలో సాయం చేస్తోంది. రెండు మూడు నెలల్లో వాళ్ల ఇంట్లో మనిషిలా మారింది.

ఇదివరలో గురు చరణ్ దగ్గర పని చేసిన సాగర్ కూడా వీలున్నప్పుడల్లా వస్తున్నాడు. ఇప్పుడు సాగర్ ఏదో టీ.వీ. సీరియల్‍కు పని చేస్తున్నాడు.

“నువ్వు కూడా టీ.వీ. సీరియల్లో పని చేయరాదూ, కొంత కాలక్షేపం అవుతుంది” అన్నాడు గురు చరణ్.

“ఆ తుమ్మబంక సీరియల్లో ఎవడు పని చేస్తాడు సార్?” అన్నది ప్రతిమ.

“అయితే నేను తుమ్మబంక అంటావ్?” అన్నాడు సాగర్.

“అని వేరే చెప్పాలా ఏంటి? నా డ్రీమ్ వేరు. ఎప్పటికైనా సరే, సినిమా చరిత్రలో వందేళ్ళపాటు నిలిచిపోయే డూపర్ సూపర్ సినిమా తీయాలనేది నా జీవితాశయం. అందుకే గురువు గారి శిష్యరికం చేస్తున్నాను” అన్నది ప్రతిమ.

“నీకన్నా ముందు నుంచీ గురువుగారి శిష్యరికం చేస్తున్నాను ఇక్కడ” అన్నాడు సాగర్,

“ఏం లాభం? సీరియల్స్‌లో పడ్డావు గదా..”

“ఏదో కాలక్షేపం కోసం. పాకెట్ మనీ కోసం..” అన్నాడు సాగర్.

“పోన్లే. నాకు పాకెట్ కూడా లేదు” అని నవ్వింది ప్రతిమ.

రోజులు గడుస్తున్నయి. సాగర్, ప్రతిమల మధ్య మాటలజోరు పెరుగుతూనే ఉంది.

జోకులు వేసుకుంటున్నారు. నవ్వుల పువ్వులు రువ్వుకొంటున్నారు. వచ్చిన ప్రతి సినిమాకు కల్సి వెళ్తున్నారు. అటునుంచి అటే హోటల్స్‌కీ వెళ్తున్నారు.

రోజంతా జంటకవుల వలె అంటుకు తిరుగుతున్నారు. గురు చరణ్ అంతా గమనిస్తూనే ఉన్నాడు.

“ఏమిటి విషయం?” అని అడిగాడు ఒకరోజు.

“ప్రతిమను ప్రేమిస్తున్నాను సర్. పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. మీరే మమ్మల్ని కలిపి పుణ్యం కట్టుకోవాలి” అన్నాడు సాగర్.

ఆయన ప్రతిమను అడిగి చూశాడు.

“ఆ తుమ్మబంక గాడిలో నాకు ప్రేమ ఏంటండీ? ప్రేమ అంటే యవ్వనం వనంలో తారసపడిన వాడితోనే కోరికలు తీర్చుకోవటం కాదండీ! ప్రేమ అనేది ఒక జీవన రాగం. అది ఉచ్ఛ్వాస నిశ్వాసలంత సహజంగా ఏర్పడాలి. అయినా నేను ఎక్కడ? ఈ ఆవారా గాడు ఎక్కడ? మా తాతగారు ఒకప్పుడు మంత్రి పదవిని అలంకరించారు. మా నాన్నగారు రెండుసార్లు ఎం.ఎల్.ఏ.గా ఎన్నికైనారు. బోలెడంత పలుకుబడీ, ఆస్తిపాస్తులున్న దానిని. ఈ టుమ్రీ గాడిని చేసుకుంటే, నేను కన్న కలలన్నీ ఏం కావాలి? నా జీవిత లక్ష్యం వేరు. నా ఆశయం వేరు, రంగుల హరివిల్లు మీద నడుస్తున్న దానిని, బురదలో జారిపడుతున్న వాడిమీద జాలిపడతానే తప్ప, ప్రేమ అనే ఊబిలో పడిన గంగిగోవును కాలేను సర్..” అన్నది ప్రతిమ.

ప్రేమ, పెళ్లి కన్నా సినిమా డైరెక్టర్‌గా పేరు తెచ్చుకోవాలన్నదే ఆమె ఆశయం అని గ్రహించాక, గురు చరణ్ కూడా ఇంక ఆమె ముందు పెళ్ళి ప్రస్తావన తీసుకురాలేదు.

***

ఏడాది గడిచి పోయింది. ఎందుకనో ఈమధ్య ప్రతిమ గురు చరణ్ ఇంటికి రావటం తగ్గించింది. కొన్నాళ్ళకు అసలు రావటం మానేసింది.

సినిమా డైరెక్టర్ కావాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూ అవకాశాలు రాక, కొన్ని సినిమాలకు అసోసియేట్‍గా పని చేసిన అశోక్‌తో ఆమె కల్సి తిరుగుతున్నట్లు సాగర్ చెప్పాడు.,

కొన్ని రోజుల తరువాత ప్రతిమ గురు చరణ్ దగ్గరకు వచ్చి, అశోక్‌తో కల్సి సొంతంగా ఒక సినిమా తీయబోతున్నాననీ, షూటింగ్ ప్రారంభం రోజు స్టూడియోకి వచ్చి ఆశీర్వదించాలనీ కోరింది.

గురు చరణ్ వివరాలు ఏమీ అడగలేదు. షూటింగ్ ప్రారంభం రాజు వెళ్లి కొబ్బరికాయ కొట్టి వచ్చాడు.

ఆ సందర్భంలోనే ప్రతిమను పెళ్లి చేసుకోబోతున్నట్లు అశోక్ ప్రకటించటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తి వేసింది. ప్రతిమకు నిండా ముప్ఫయి ఏళ్లు నిండలేదు. అశోక్ యాభై ఏళ్లకు దగ్గరలో ఉన్నాడు. ఆయనకు ఇదివరకే వివాహం అంటుంది. పిల్లలు ఉన్నారు. ఈ విషయం అందరికీ తెల్సు.

ప్రతిమ సినిమా చాలా భారీ ఎత్తున తీస్తున్నది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతిమ ఈ సినిమాకు నిర్మాత కూడా. ప్రముఖ హీరో, హీరోయిన్స్, సాంకేతిక నిపుణులను బుక్ చేసింది.

సినిమా వినీలాకాశంలో ప్రతిమ ఒక్కసారిగా చంద్రబింబంలా వెలుగులోకి వచ్చింది. అందరూ ఆమె గురించే చెప్పుకుంటున్నారు.

అనుకున్నట్లుగానే ప్రతిమ, ఆశోక్ సినిమా సగంలో ఉండగానే వివాహం చేసుకున్నారు.

రిసెప్షన్‌కు గురుచరణ్ వెళ్ళాడు. సాగర్‍కి కూడా ఆహ్వానం అందింది.

పరిశ్రమలోని పెద్ద పెద్ద నిర్మాతలూ, హీరోలు, హీరోయిన్స్ అంతా వచ్చి ఆశీర్వదించారు.

సినిమా నిర్మాణం సగంలో ఉండగా, కారణాంతర వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది.

ప్రతిమ గర్భవతి అయింది. మగపిల్లవాడు కలిగాడు. సినిమా నిర్మాణం అనుకున్న దానికన్నా బాగా ఆలస్యం అవుతూ వచ్చింది.

ఏదో ఒక సందర్భంలో ప్రతిమ, గురు చరణ్‍కు తారసపడింది. ఆమే చొరవ తీసుకుని మాట్లాడింది. ఆమెలో ఇది వరకటి ధీమా, అత్మవిశ్వాసం, ఆశయం, ఇదేవీ ఇప్పుడు కనబడలేదు. ఏదో తెలియని నిస్సహాయత ఆమెను ఆవరించింది.

“తెలివైన వాళ్లకు కూడా తెలివైన సలహాలు ఇవ్వగల తెలివైన దానివి. నువ్వు కన్న కలలన్నీ ఏమైనయి?”

“కలలలోనే బ్రతకలేమని బ్రతుకు పాఠం నేర్పింది సర్” అన్నది.

“ఊబిలో కూరుకుపోయే గంగిగోవును కాలేను అని అన్నావు.. మరి ఇదేమిటి?” అని అడిగాడు.

“అలలు దూరం నుంచి చూసినప్పుడు ఎంతో అందంగా కనిపిస్తయి. తీరా వాటిలో దూరితే, ఎటు లాక్కుపోతామో, ఎటు విసిరేస్తాయో కూడా తెల్సుకోలేం. ఏదీ మనం అనుకున్నట్లు జరగదు.. అప్పుల్లో కూరుకుపోయాను. మా ఊళ్లల్లోని ఆస్తులు అమ్మేశాను. అయినా ఈ సినిమా ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియదు..”

“అశోక్ ముందు, బడ్జెట్ గురించి చెప్పలేదా?” అని అడిగాడు గురు చరణ్.

“చెప్పాడు. నిజమేనని నమ్మాను. మనిషిని నమ్మటమే నేను చేసిన పెద్ద పొరపాటు” అన్నది ప్రతిమ.

ఇదిలా ఉండగానే, సాగర్ చాలా చిన్న బడ్జెట్‍లో తీసిన సినిమా పెద్ద హిట్ అయింది. సినిమా పరిశ్రమను ఊపేస్తోంది.

వంద రోజులు ఆడింది. సాగర్ ప్రతిమను ఫంక్షన్‍కు ఆహ్వానించాడు.

“అభినందనలు సాగర్. ఫంక్షన్‌కి నేను రాలేను సార్. ఏమీ అనుకోకు” అంది.

“ఏమి?”

“నేనిప్పుడు ఊబిలో దిగిన గంగిగోవును” అన్నది ప్రతిమ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here