చిరుజల్లు-132

0
9

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

ఎగరనీ ఎగరనీ జెండా

[dropcap]ఆ[/dropcap] కాలనీ రెసిడెన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, మరో నలుగురు సభ్యులూ కల్సి సుందరరామయ్య ఇంటికి వచ్చారు.

ఆయన వాళ్లందరికీ ఆహ్వానం పలికి “ఏమిటి అంతా ఒక్కసారే కట్టగట్టుకుని వచ్చారు?” అని అడిగాడు.

“మీకు తెలియనిదేం ఉంది? ఇంకో నాలుగు రోజుల్లో స్వతంత్ర దినోత్సవం వస్తోంది గదా. మీరు పతాకావిష్కరణ చేయాలి. ఆ విషయం చెబుదామనే వచ్చాం” అన్నాడు అసోసియేషన్ అధ్యక్షుడు.

“మన ఎమ్మెల్లే గారి చేతనో, లేదా ఎవరైనా మంత్రిగారి చేతనో ఆ కార్యక్రమం చేయిస్తే బావుంటుంది గదా” అని సుందరరామయ్య సూచించాడు.

“వాళ్లు ఎవరూ, ఏ విధంగా చూసినా మీకన్నా గొప్పవాళ్లు కాదు. మీరు ఈ కాలనీలో ఉండటం మా అదృష్టం. అందుచేత ఇంకొకరి గురించి ఆలోచించే ప్రసక్తే లేదు” అన్నారు అసోసియేషన్ సభ్యులంతా ముక్త కంఠంతో.

‘సరే, అలాగే కానివ్వండి. నాకు కూడా అంతకన్నా కావల్సింది ఏముంది?” అన్నాడు సుందరరామయ్య.

వాళ్ళంతా ఆయన దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయారు.

అధికార పార్టీలో ఇప్పుడు మంత్రులుగానూ, వివిధ స్థాయిలలో ఇతరత్రా అధికారం చెలాయిస్తున్న చాలామంది కన్నా ఆయన బాగా సీనియర్ నాయకులు. అదీగాక, పాలనాధికారం ఒక పార్టీనుంచి మరొక పార్టీకి మారినప్పుడల్లా, వాళ్లంతా ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి దూకిన వాళ్లే. కానీ సుందరరామయ్య అలా కాదు. ఆందున మొదటి నుంచీ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న మనిషి. పైగా పదవుల కోసం ప్రాకులాడటం, పైరవీలు చేయటం వంటివి ఆయనకు గిట్టవు. అందుచేత ఆయన నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరు. ముఖ్యమంత్రి దగ్గర నుంచీ ఆయన ఆశీస్సుల కోసం వచ్చి, పాదాభివందనం చేసి వెళ్తుంటారు.

ఇప్పుడు ఆ నియోజక వర్గం ఎమ్మెల్లేగా ఉన్న రఘపతి ఒకనాటి ఆయన అనుచరుడే. అనుకోకుండా రఘుపతి ఆయన ఇంటికి వచ్చి ఆయన కాళ్లకు నమస్కారం చేశాడు.

“ఏంటి, రఘపతీ ఇవాళ ఇటు గాలి మళ్లింది?” అని అడిగాడు సుందరరామయ్య.

“ఏం లేదు సర్. మిమ్మల్ని చూడాలనిపించింది. అందుకని చూడటానికి వచ్చాను” అన్నాడు వినయంగా సోఫా అంచున కూర్చుని.

“నువ్వు చూడాలనుకునే వాళ్లు, నిన్న చూడాలనుకునే వాళ్లు చాలామంది ఉన్నారు గదా. మొన్న ఏదో సభలో ఎవరో హీరోయిన్ పక్కన చేరి మంతనాలు ఆడుతున్నావ్. టి.వీ.లో చూశాను” అన్నాడు సుందరరామయ్య నవ్వుతూ.

“మంతనాలు ఏమీ లేవు సర్. వాళ్లు మనల్ని ఉపయోగించుకుండామని చూస్తుంటారు. మనం వాళ్ళను ఉపయోగించుకోవాలని చూస్తుంటాం.. ఇదంతా ఒక గేమ్ సర్..”

“అదే నేను అనేది కూడా. వాళ్ళను బాగా ఉపయోగించుకుంటున్నావా అని” అన్నాడు సుందరరామయ్య.

రఘపతి పగలబడి నవ్వాడు.

“అదేం లేదు సర్. ఆ హీరోయిన్‍కి ఒక వెయ్యి గజాల స్థలం కావాలంట, ఎక్కడన్నా చౌకగా ఇప్పించమంది. ఇల్లు కట్టుకుంటుందట..”

“ఇంకే మరి. ఆమెను ఒక ఇంటి దాన్ని చెయ్యి.. నీ రుణం ఏదో విధంగా తీర్చుకోకుండా ఉండదులే..” అని నవ్వాడు సుందరరామయ్య,

“తెల్లారి లేస్తే వాళ్ళు నాలాంటి వాళ్లను వందమందిని చూస్తుంటారు సర్.. కనపడ్డ వాడికల్లా ఒక రాయి విసురుతుంటారు, తగులుతుందేమోనని.. అంతే..” అన్నాడు రఘుపతి.

కాసేపు ఈమాటా, ఆ మాటా అయ్యాక రఘుపతి అసలు విషయం బయటపెట్టాడు.

“సర్, ఈ నెలలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. నాకూ ఒక ఛాన్స్ ఇప్పించండి సర్. మీరు ఒక మాట చెబితే సి.యం.గారు కాదనరు..” అని విన్నవించుకున్నాడు.

“అదా అసలు విషయం. చూద్దాం..” అన్నాడు సుందరరామయ్య.

“మీరు చూద్దాం అంటే, అయిపోయినట్లే సర్” అంటూ వంగి ఆయన కాళ్లకు దండం పెట్టి వెళ్లిపోయాడు.

మర్నాడు పొద్దున సుందరరామయ్య టిఫిన్ చేస్తుండగా అనసూయ వచ్చింది. ఆమె సుందరరామయ్యకు దూరపు చుట్టం. అసలు చుట్టం అవునో కాదో కూడా ఆయనకు తెలియదు. కానీ అవసరం ఉన్నప్పుడల్లా వస్తుంటుంది. అవసరం ఉన్నప్పుడల్లా దూరపు చుట్టాలు దగ్గరవుతుంటారు. అవసరం తీరాక దగ్గర చుట్టాలే దూరం అవుతుంటారు.

“రా, ఆనసూయా రా, సమయానికి వచ్చావు. టిఫిన్ చేద్దువు గాని రా..” అన్నాడు సుందర రామయ్య.

“సమయానికే వచ్చాను. అంటే ఇప్పుడు తప్ప మీరు నాకు చిక్కరుగదా.. అందుకని” అని నవ్వింది అనసూయ ఆయన పక్కన కూర్చుని.

“నేను నీకు చిక్కక పోవటం ఏమిటి?” అని సరసమాడాడు.

“మిమ్మల్ని పట్టుకోవటం కష్టం..” అన్నది అనసూయ.

“ఏం కష్టం లేదు. ఇప్పుడు పట్టుకో. నేను కాదనను” అంటూ ఆమె వైపు భుజం జరిపాడు.

అనసూయ నవ్వుతూనే ఆయన భుజం మీద ఎడమ చెయ్యి వేసింది. “ఏమనుకోకండి. కుడిచేయితో తింటున్నాను. ఎంగిలి చెయ్యి అని ఎడమ చెయ్యి వేశాను..”

“నువ్వు ఎడమ చెయ్యి కాదు, ఎడమ కాలు వేసినా నేను ఏమీ అనుకోను. ఇంతకీ నన్ను ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నావు?” అని అడిగాడు.

“మా అందునకు డైరెక్టరు పోస్టు రావాలి. కానీ ఆయనుకు ప్రమోషన్ రాకుండా ఎవరో అడ్డుపడుతున్నారు. మీరు మంత్రిగారికి ఒక మాట చెబితే సరిపోతుంది” అన్నది అనసూయ.

“ఒక మాట చెబితే సరిపోతుందా? మనలో మాట, ఏమిటా మాట?” అని అమాయకంగా అడిగాడు.

“మీరు ఏం చెబుతారో, ఏం చేస్తారో నాకు తెలియదు. మిమ్మల్ని పట్టుకుంటే పని అయిపోతుందని వచ్చాను. పట్టుకున్నాను. అంతే” అన్నది అనసూయ.

“నిజమే గానీ, ఎడమ చేత్తో పట్టుకున్నావే” అన్నాడు సుందరరామయ్య.

“పని అయిపోతే, మిమ్మల్ని వదులుతానా? రెండు చేతులతోనూ పట్టుకుంటాను” అన్నది అనసూయ.

“మరదలా, చెరకు గడలా పెరిగావు. కానీ నేను వయస్సులో ఉన్నప్పుడు దొరికి ఉంటే బావుండేది..” అన్నాడు సుందరరామయ్య,

“ఇప్పుడు మీకు ఏమంత వయస్సు అయిందనీ?” అన్నది అనసూయ.

అంతటితో ఆ సంభాషణ ముగిసిపోయింది.

సాయంత్రం ఆ కాలనీ లోనే వెనక వీధిలో ఉండే సుబ్బారావు ఇంకొక ఆతన్ని వెంట బెట్టుకువచ్చాడు.

పరిచయం చేశాడు సుబ్బారావు.

“సర్, వీడు నేను మా బావమరిది. మున్సిపల్ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ సెక్షన్‍లో పని చేస్తున్నాడు. ఏవో అపార్ట్‌మెంట్స్ శాంక్షన్ కోసం వచ్చారు. వీడి తప్పు ఏమీ లేకపోయినా ఏసిబి వాళ్ల చేత పట్టించారు. సస్పెండ్ చేశారు. వీడి తప్పు ఏమీ లేదు. లంచం అడగనే లేదు. కావాలని పట్టించారు. మీరు కాస్త పైవాళ్లతో ఒక మాట చెబితే, పని అయిపోతుంది సర్” అంటూ సుబ్బారావు నోట్ల కట్ట తీసి టీపాయ్ మీద పెట్టాడు.

“లంచం అడగకపోయినా ఏసిబీ వాళ్ల చేత పట్టించారా. గమ్మత్తుగా ఉందే?” అన్నాడు సుందరరామయ్య,

“అక్కడ, ఆఫీసులో పాలిటిక్స్ సర్, కావాలని చేశారు సర్. మీరే కాపాడాలి సర్. మావాడు ఇన్నోసెంట్..”

“అలాగా?” అన్నాడు సుందర రామయ్య

పది నిముషాల తరువాత వాళ్లు వెళ్లిపోతుంటే వెనక్కి పిలిచాడు.

“ఈ డబ్బు పట్టుకెళ్ళండి” అన్నాడు .

“పర్లేదు సర్..” అన్నాడు సుబ్బారావు.

“తర్వాత చూద్దాం. పట్టుకెళ్ళండి” అన్నాడు సుందరరామయ్య,

తరువాత రోజు పార్టీ ఆఫీసులో మీటింగ్ ఉంటే సుందరరామయ్య కూడా వెళ్లాడు. ముఖ్యమంత్రి ఆయనను పక్కన కూర్చోబెట్టుకున్నాడు.

ఒంటరిగా కాసేపు మాట్లాడాడు.

“మీరు మా అందరికన్నా సీనియర్ నాయకులు. నాకు గురుతుల్యులు. ఈ పదవులన్నీ మీకు చాలా చిన్నవి. మీ స్థాయికి తగినవి కావు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే, మీరు కేంద్రంలో ఏ ప్రధానమంత్రో అయి ఉండేవాళ్లు. అయినా, మీకు నేను చేయగలిగినది ఏమన్నా ఉంటే చెప్పండి. చేస్తాను” అన్నాడు ముఖ్యమంత్రి.

సుందరరామయ్య నవ్వాడు. “నన్ను పిలిచి, గౌరవించి, నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు. ఇంతకన్నా ఇంకేం కావాలి?” అని సున్నితంగా ఆయన అభ్యర్థనను త్రోసిపుచ్చాడు.

***

సుందరరామయ్య కాలనీలో పతాక ఆవిష్కరణ చేశాడు. తరువాత క్లుప్తంగా మాట్లాడాడు.

“ఈ జెండా మన దేశ గౌరవానికి, ప్రతిష్ఠకి ప్రతీక. దానికి మనం సెల్యూట్ చేస్తున్నాం. మనలో ప్రతివాళ్లకీ ఎన్నో కోరికలూ, అశలూ, ఆశయాలూ ఉంటాయి. అవి సక్రమం అయినవా, కాదా అని మనకు మనమే ఆత్మ పరీక్ష చేసుకోవాలి. ఆత్మసాక్షిగా మనం మసులుకున్నప్పుడే, మన గౌరవాన్నీ, జాతి గౌరవాన్నీ నిలుపుకుంటాం..” అన్నాడు సుందరరామయ్య.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here