చిరుజల్లు-134

0
10

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

పగలే వెన్నెలా

[dropcap]నా[/dropcap]లుగేళ్ల క్రిందట ప్రపంచ దేశాలను కుదిపేసిన కరోనా వ్యాధి చాలా కుటుంబాల పరిస్థితులను తారుమారు చేసింది. కోలుకోలేని చావు దెబ్బతిన్న మనుష్యులు ఇప్పుడిప్పుడే – మురికి నీటిలోని మురికి అడుగుకు చేరి, తేట నీరు పైకి తేరుకున్నట్లు – బాధలను దిగమింగుకుని, మళ్ళీ రొటీన్ జీవితంతో రాజీ పడుతున్నారు.

గలగల పారే సెలయేరు లాగా ఎప్పుడూ కిలకిలా నవ్వుతూ, బొంగరంలా ఇల్లంతా తిరుగుతూ, వెలుగులు విరజిమ్మే విశాలాక్షి కరోనాకు బలి అయిపోయింది. ఆమె భర్త చంద్రశేఖర్, కొడుకు శశాంక ఆ షాక్ నుంచి తేరుకుని, పరిస్థితులతో రాజీ పడుతున్నారు.

చంద్రశేఖర్ పెద్ద వయసు మళ్లినవాడేమీ కాదు. నిండా నలభై అయిదు కూడా దాటలేదు. కొడుకు శశాంకకు కిందటి నెలలోనే ఇరవై రెండు నిండినయి. వయసుకు చిన్నవాడే అయినా, అతని ఆలోచనలు మాత్రం ఎంతో అర్థవంతంగా, అద్భుతంగా ఉంటాయి.

దేవతలాంటి తల్లి పోయినందుకు పడే బాధ కన్నా, సామ్రాజ్యాలు పోగొట్టుకుని కానల పాలైన మహారాజు లాగా, తండ్రి అనుభవిస్తున్న ఒంటరితనం శశాంకను అమితంగా కలచి వేస్తున్నది. జరిగిన నష్టాన్ని, రోజంతా కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్న వెలితినీ, లోటునూ భర్తీ చేయాలి అని శశాంక ఆలోచిస్తున్నాడు. తండ్రిది ఏమంత ముదిరిపోయిన వయసు కాదు. ముదిమి ముంచుకు రావటానికి ఇంకా కనీసం. పాతికేళ్లు పడుతుంది. అందుకని తండ్రికి ఎలాగైనా మళ్లీ పెళ్లి చేయాలనీ, అది తన వల్ల మాత్రమే అవుతుందని శశాంక ఒక నిశ్చయానికి వచ్చాడు.

ఇక చంద్రశేఖర్ ఆలోచన వేరే విధంగా ఉంది. ఇంటికి దీపం ఇల్లాలే – అన్నారు. అది పూరి గుడిసె అయినా మహారాజుల పాలెస్ ఆయినా, స్త్రీమూర్తి ఇంట్లో తిరుగుతుంటేనే, కళగా ఉంటుంది. తన జీవితం ఎలాగూ పశ్చిమం వైపు మళ్లుతోంది. అదీ గాక చనిపోయిన విశాలాక్షి లాంటి మనిషి ఈ సువిశాల ప్రపంచంలో మరొకరు దొరకరు. కనుక కొడుకుకు వీలైనంత త్వరగా పెళ్లి చేస్తే, కోడలు పిల్ల ఆయినా ఇంట్లో తిరుగుతుంటే, పోయిన కళాకాంతులు ఇంటికి తిరిగొస్తాయని ఆయన ఆలోచిస్తున్నాడు. తగిన అమ్మాయి కోసం ఆయన కళ్లు కనపడిన ప్రతి ఆడపిల్లలోనూ వెదుకుతున్నాయి.

***

వాళ్ళ ఇంటికి ఒక మైలు దూరంలో చెరువు ఉంది. ఆ చెరువు గట్టు అచ్చం టాంక్‌బండ్‌లా ఉంటుంది. ఇంకా తెల్లవారకముందే చెట్ల కొమ్మల మీద పక్షులు కళ్లు తెరిచి కిలకిలారావాలు చేయక ముందే, ఆ చెరువు గట్టుమీద పొగమంచు తెరల మధ్య నడకకు వచ్చే వాళ్లల్లో శశాంక కూడా ఉంటాడు. చిన్న పరుగులాంటి నడకతో చెరువు గట్టున ఈ చివరి నుంచీ ఆ చివర దాకా, అందర్నీ దాటుకుంటూ వెళ్తుంటాడు. వయసు మీరిన జంటలతో పాటు వయసు రాకపోయినా సన్నగా, నాజూకుగా కనపడాలనుకునే ఊబకాయులైన అబ్బాయిలూ, అమ్మాయిలూ, ఇంకా అటూ ఇటూ కాని మధ్యవయసువాళ్లూ – రకరకాల వాళ్ళు బిజీగా తిరుగుతుంటారు.

ఏడు గంటల సమయంలో తిరుగుముఖం పడతారు. శశాంక ఇంటికి వచ్చే దారిలో, అతనికి కొంచెం మందుగా నడిచివెళ్ళే ఒక స్త్రీ అతని పట్ల పరకాయించి చూసేది. అతనూ ఆమె పట్ల చూసి చూడనట్లు చూస్తుండేవాడు.

ఒక రోజు ఆమె నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద వెళ్తోంది. కొంచెం దూరంలో శశాంక వస్తున్నాడు.

ఒక ద్విచక్రవాహనం మీద ఇద్దరు ఆమె దగ్గరకు వచ్చారు. ఆమె మెడలోని గొలుసు ఒకడు లాగాడు. ఆమె గట్టిగా గొలుసు పట్టుకుంది. అయినా సరే బలం చాలలేదు. వాడు దిగి ఆమెతో పెనుగులాడి, గొలుసు లాక్కున్నాడు. కొంచెం దూరం నుంచి వస్తున్న శశాంక, పరుగు పరుగున వచ్చి బండి మీద వాడిని కిందకు తోశాడు. వాడు, బండితోపాటు కింద పడిపోయాడు. వాడు లేచే లోపల రెండోవాడిని గట్టిగా వాటేసి పట్టుకున్నాడు. వాడు విడిపించుకునేందుకు రెండు చేతులలో పెనుగులాడాడు. గొలుసు కింద పడిపోయింది.

ఆమె గొలుసు తీసేసుకుంది. వాళ్ళు పారిపోయారు.

అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో శశాంకతో పాటు ఆమె కూడా తేరుకోవడానికి కొంత సమయం పట్టింది.

“దేవుడిలా వచ్చి కాపాడావు. వాళ్లు దేనికైనా తెగించినవాళ్ళు. మనిషిని చంపటానికి వెనుకాడరు” అన్నదామె.

“మీ ఇంటి దాకా తోడుగా వస్తాను. పదండి” అన్నాడు శశాంక్.

ఆమె ఇంటి ముందుకు వచ్చాక, శశాంకను లోపలికి రమ్మన్నది. వెళ్ళాడు. కాఫీ ఇచ్చింది. తాగాడు.

ఆమె ఆరచేయి, మెడ దగ్గర చర్మం కొంచెం కమిలి పోయింది. “ఏదన్నా ఆయింట్‌మెంటు రాయండి “ అని సలహా ఇచ్చాడు.

“అలాగే” అన్నదామె.

మర్నాడు మార్నింగ్ వాక్‌కి ఆమె రాలేదు. ఎందుకు రాలేదో కనుక్కుందామని ఆమె ఇంటికి వెళ్లాడు.

“కొంచెం బద్ధకించాను” అని నవ్వింది.

కాఫీ ఇచ్చింది.

“ఎన్నాళ్లయిందో ఇంత మంచి కాఫీ తాగి”

“అదేం భాగ్యం. రోజూ రండి. ఇస్తాను” అన్నదామె.

“మీకన్నా చిన్నవాడిని. అండీ అనకండి. నాకు ఆయుష్ క్షీణం” అని నవ్వాడు శశాంక.

“అండీ, అంటే అయుష్ క్షీణం అయితే, ఒరే అంటే ఆయుష్షు పెరుగుతుందా?” అని నవ్పింది.

“తప్పకుండా. మీ ఆశీస్సులు ఉంటే..”

“నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే, దొంగలు రాకుండా కాపాడుతావు గదా..”

‘దొంగలే కాదు, దొరలొచ్చినా సరే, మీ మీద ఈగ వాలనివ్వను” అన్నాడు శశాంక.

‘ఈగలు లేవులే. నాకు పరిశుభ్రత ఎక్కువ” అన్నదామె,

ఒకరికొకరు పరిచయాలు చేసుకున్నారు.

ఆమె పేరు అమృతవల్లి. వయసు దగ్గర దగ్గర నలభైదాకా ఉండవచ్చు. ప్రైవేటు స్కూలులో టీచర్‍గా పని చేస్తోంది.

“ఇంట్లో ఒక్కరే కనిపిస్తున్నారు. ఎవరూ లేరా?” అని అడిగాడు శశాంక.

“ఈ ప్రపంచంలోకి ఒంటరిగానే వస్తాం. ఒంటరిగానే లోకం నుంచి నిష్క్రమిస్తాం. మధ్యలోనే అనుబంధాలు పెంచుకుంటాం. తనువుతో కలుగు బాంధవ్యము లెల్ల తనవుతో నశియించునని గీతాకారుడు చెప్పాడు కదా” అని నీరసంగా నవ్వింది.

“రాకపోకలు ఎవరివి వాళ్ళవే అయినా, రైలు ప్రయాణం లాంటి జీవితంలో ఒకరికొకరు తోడూ నీడగా ఉంటే, ఆ తృప్తి, ఆ ధైర్యం వేరు. తన కోసం తను బ్రతకటం కాదు, తన వాళ్ల కోసం బ్రతకటంలో ఉన్న ఆనందం అంతా ఇంతా కాదు. ఒకరినొకరు ప్రేమించుకోవటాన్ని మించిన పరమావధి ఇంకేం ఉంటుంది? ప్రేమ అనే ఇరుసు మీద ఆధారపడి భూమి తన చుట్టూ తాను తిరుగుతోం.. ది వరల్డ్ లవ్స్ లవర్స్..” అన్నాడు శశాంక.

అమృత మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ ఎటో చూస్తూ ఉండిపోయింది.

“ఎందుకో చిన్నప్పటి నుంచీ నాకు ఈ పెళ్లి, పిల్లలు, లంపటాలు – ఇవంటే పెద్దగా ఇష్టమూ లేదు. అయిష్టమూ లేదు. నాకంటూ ఉన్నవాళ్లు తల్లి, తండ్రీ ఏడాది తేడాతో వెళ్లిపోయారు. ఒంటరిగా మిగిలిపోయాను. చాలామంది ‘ఐ లవ్ యూ’ అనేవాళ్ళు. కానీ నిజంగా ఆ మాటలకు అర్థం వాళ్లకు తెలియదు అని అనిపించేది. ఆ నాలుగు అక్షరాల వెనుక ఎంత బరువు, బాధ్యతలు ఉన్నాయో చాలామందికి తెలియదు..” అన్నది అమృత.

“అదీ నిజమే” అన్నాడు శశాంక.

“ఎదురింట్లో ఆర్ముగం అని ఒకడున్నాడు. వాడికి తెలుగు రాదు, ‘దేవుడికి ఒక్క ముక్కు ముక్కినావంటే, ఏమైనా ఇచ్చి పూడుస్తాడు’ అని అంటాడు. మా స్కూల్లో ఒకడు నెల్లూరి యాసలో ‘సుబ్బారెడ్డి బొమ్మ కాడ ఇసారించినా?’ అని అంటాడు. మరొకడు గోదావరి జిల్లా వాడు ‘ఆరు ఏటి సెప్తున్నాతో ఇనుకుంతున్నావా?’ అంటాడు. ఇలాంటి బఫూన్లతో జీవితాంతం గడపాలంటే ఎంత ఏవగింపు?” అని ఆగింది అమృత.

“అందరూ అలాగే ఉండరు గదా” అన్నాడు శశాంక.

“నిజమే. నాకు దొరికిన వాళ్లంతా ఇలాంటి వారే. ఆ ఎదురింటి ఆర్ముగం రోజూ వచ్చి ఒంటి కాలిమీద లేస్తాడు” అన్నది అమృత.

“ఆ ఒంటి కాలు లేవకుండా నేను చేయనా?” అన్నాడు శశాంక నవ్వుతూ.

అన్నట్లుగానే మర్నాడు ఉదయమే ఆర్ముగం గుమ్మం దాటి వస్తూ జారిపడ్డాడు. తొంటి ఎముక ఇరిగింది. గురువారెడ్డి ఆస్పత్రిలో చేరాడు.

“నువ్వు చెప్పినట్లే జరిగింది” అన్నది అమృత నవ్వుతూ.

ఆ రాత్రి వాడి గుమ్మం ముందు కొబ్బరి నూనె ఒలకబోసిన విషయం ఆమెకు చెప్పలేదు శశాంక.

రోజూ ఉదయం, సాయంత్రం శశాంక అమృత దగ్గరకు వస్తున్నాడు. ఇద్దరూ కల్సి సూపర్ బజారుకెళ్లి కావల్సిన సరుకులు తెచ్చుకుంటున్నారు. కూరగాయలు తెచ్చుకుంటున్నారు. టీ.వి.లో సినిమాలు చూస్తున్నారు. రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు.

పండుగ వస్తే షాపింగ్‌కి వెళ్తున్నారు. ఆమెకు ఎలాంటి చీరలు బాగుంటాయో శశాంక చెబుతుంటే ఆమె వింటోంది – ఆటోలో ఇద్దరూ కల్సి వస్తున్నప్పుడు.

పండగపూట ఆమె ఇంట్లోనే భోజనం చేస్తున్నాడు.

ఆరు నెలలలో బాగా సాన్నిహిత్యం ఏర్పడింది.

“మా అమ్మ లేని లోటు తీరుస్తున్నావు. మా అమ్మ స్థానంలో మా ఇంటికి వస్తావా?” అని అడిగాడు శశాంక.

“సవతి తల్లి పగవాడికి కూడా రాకూడదని అందరూ అనుకుంటారు. నువ్వేమిటీ సవతి తల్లి కావాలని కోరుకుంటున్నావు?” అన్నది అమృత.

“నన్ను సవతి కొడుకు లాగానే చూడు. ఫర్వాలేదు. నేను మీ దగ్గర ఉండేది కొద్దిరోజులే. కానీ నువ్వు మా నాన్నకి అసలు సిసలైన అర్ధాంగివి అయితే – అది చాలు నాకు” అన్నాడు శశాంక.

“నిన్ను విడిచి నేనూ ఉండలేనురా” ఉన్నది అమృత, శశాంక జుట్టులోకి ఈ చెయ్యి దూర్చి, తలనిమురూ, కన్నీళ్లు తుడుచుకుంటూ.

***

త్యాగరాజ గాన సభలో నృత్య కార్యక్రమం జరుగుతోంది. చంద్రశేఖర్ మూడో వరసలో కూర్చున్నాడు. అతని పక్క సీటు ఖాళీగా ఉంది. ఒకమ్మాయి వచ్చి అడిగింది.

“అంకుల్, నేను ఇక్కడ కూర్చోవచ్చా?”

“కూర్చోమ్మా, నా పర్మిషన్ ఎందుకు?” అన్నాడు చంద్రశేఖర్.

“డాన్స్ చేస్తున్న వాళ్లల్లో మా పక్కింటి వాళ్ల అమ్మాయి కూడా ఉంది. అందుకని చూడటానికి వచ్చాను” అన్నది ఆ అమ్మాయి.

ప్రోగ్రాం జరుగుతున్నంత సేపూ వసపిట్టలా వాగుతునే ఉంది.

సెల్‍ఫోన్‍లో ఫొటోలు తీస్తూనే ఉంది.

“అంకుల్, మిమ్మల్ని కూడా ఫోటో తీస్తాను” అన్నది.

“తియ్యి అమ్మా, నా పర్మిషన్ ఎందుకు?” అన్నాడు చంద్రశేఖర్.

“ఏం చేస్తున్నావమ్మా?”అని అడిగాడు చంద్రశేఖర్.

“ఐ.టి. కంపెనీలో పని చేస్తున్నాను.”

“మా అబ్బాయి కూడా ఐ.టి. కంపెనీలో పని చేస్తున్నాడు.”

“అవునా? ఏ కంపెనీ?”

“కాగ్నిజెంట్”

“ఐసీ.. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంకుల్. మీ ఫోటోలు పంపిస్తాను” అన్నది ఆ ఆమ్మాయి.

చంద్రశేఖర్ తన ఫోన్ నెంబర్ చెప్పాడు.

“నీ పేరేమిటమ్మా?”

“దివ్య, అంకుల్.”

“దివ్యంగా ఉన్నావమ్మా, నీ పేరు లాగానే.”

“థాంక్స్ అంకుల్” అన్నది దివ్య,

రెండు రోజులు గడిచి పోయాయి. చంద్రశేఖర్ దివ్యకు ఫోన్ చేసి చెప్పాడు.

“నేను నా ఫోన్‍లో యూట్యూబ్ నుంచి వాట్సప్‌లో ఒక కీర్తన పోస్ట్ చేసుకోవాలనుకున్నాను. ఎలా జరిగిందో తెలియదు. పొరపాటున ఏదో నొక్కినట్లున్నాను, వాట్సప్‍లో నీకు ఒకటి ఏదో పనికిరాని వీడియో పోస్ట్ అయింది. సెల్ ఫోన్‍లతో ఇదే గొడవ. ఇది వరకూ ఒకటి రెండు సార్లు ఇలాగే అయింది. ఎలా డిలీట్ చేయాలో కూడా తెలియదు. పొరపాటు చేసినందుకు – వయసులో చిన్నదానివైనా, విద్యలో పెద్దదానివి గనుక పెద్ద మనసుతో క్షమించు తల్లీ..” అన్నాడు చంద్రశేఖర్.

“అయ్యో అంతమాట అన్నారేంటి అంకుల్..”

“తప్పు చేశాను కదమ్మా..”

“తప్పులు తప్పకుండా చెయ్యాలి. అప్పుడే అని ఎలా చేయకూడదో కూడా తెలుస్తుంది. థామస్ ఎడిసన్ ఎలక్ట్రికల్ బల్బ్ కనిపెట్టే ముందు తొంభై తొమ్మిది సార్లు తప్పులు చేశాడు. ఆ తప్పులు దిద్దుకుంటూ పోతేనే నూరోసారి విజయం సాధించాడు” అన్నది దివ్య.

“అలాగా, ఆయనెవరో ఈసారి కనిపిస్తే, నాకు సెల్‌ఫోన్‌లో అన్నీ ఎలా వాడాలో నేర్పుతాడేమో అడుగు తల్లీ” అన్నాడు చంద్రశేఖర్.

“అలాగే అంకుల్, ఇక్కడే తిరుగుతుంటాడు. ఈసారి కనిపిస్తే పంపిస్తాను” అన్నది పక పకా నవ్వుతూ.

“మళ్లీ ఎవరూ డాన్స్ చేయటం లేదా? మరేం లేదు, నిన్ను చూద్దామని..”

“నన్ను చూడటానికి అంత పెద్ద ప్రోగ్రాం ఎందుకు? మీకు ఖాళీ ఎప్పుడో చెప్పండి. ఏదన్నా హోటల్లో కల్సి డిన్నర్ చేద్దాం..” అన్నది దివ్య

“ఖాళీ ఎప్పుడు – అని కాదు, ఖాళీ లేనిదెపుడు అని అడుగు.”

“వచ్చే శనివారం నా బర్త్‌డే. కేక్‍లూ, కోకలూ ఏమీ వద్దు, మనిద్దరమే డిన్నర్ చేద్దాం రండి” అన్నది దివ్య.

శనివారం నాడు ఇద్దరూ హోటల్లో కల్సి భోజనం చేశారు.

చంద్రశేఖర్ దివ్యకు ఒక చేతివాచీ బహుమతిగా ఇచ్చాడు.

“ఏమీ వద్దన్నాను గదా అంకుల్..”

“నువ్వు నన్ను అంకుల్ అన్నందుకు అన్నా ఇవ్వచ్చు గదరా అమ్మా” అన్నాడు చంద్రశేఖర్.

కాలం గలగలా పారే ఏరులా సాగిపోయింది. దివ్య చంద్రశేఖర్

అప్పుడప్పుడూ కలుస్తునే ఉన్నారు.

ఒక రోజు మధ్యాహ్నం దివ్య ఫోన్ చేసింది.

“అంకుల్, నాకు చిన్న సాయం చేయగలరా?”

“చెప్పరా అమ్మా” అన్నాడు చంద్రశేఖర్.

“నిన్న మా అమ్మ మెట్ల మీద నుంచి దిగుతూ కాలు జారి పడిపోయింది. తలకు గాయం అయింది. ఏడు కుట్లు వేశారు..”

“ఇప్పుడెక్కడున్నారు?”

“కిమ్స్‌లో..”

చంద్రశేఖర్ అరగంటలో అక్కడకు చేరుకున్నాడు. డాక్టర్లతో మాట్లాడాడు. హాస్పటల్ బిల్లు తన కార్డు మీద ఛార్జ్ చేశాడు. దివ్య తల్లిని ఇంటికి తీసుకు వెళ్లేదాకా అక్కడే నిలబడ్డాడు. ఇంటికి వెళ్లాక దివ్య అన్నది..

“నిజంగా హాస్పటల్ బిల్లు కట్టే డబ్బు లేదు. ఏం చేయాలో తోచక భయపడ్డాను. ఆ సమయంలో మీరే గుర్తొచ్చారు. కొండంత అండగా నిలబడ్డారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను?” అన్నది దివ్య.

ఇంకా ఆమె మొహం మబ్బు పట్టిన ఆకాశంలా ఉంది. వర్షించబోయే మేఘంలా ఉంది.

“నువ్వు నాకో సాయం చేసి పెట్టాలి”

“చెప్పండి అంకుల్”

“నాకు తెల్సిన అబ్బాయి ఒకడున్నాడు. వాడికి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంది. నీకు తెల్సినంతలో ఒక మంచి పిల్లను చూసి పెట్టు”

“అర్థమైంది అంకుల్. రేపు మీ అబ్బాయిని పంపించండి. మూడు నిముషాల్లో మీ వాడిని ఒక ఇంటివాడిని చేస్తాను” అన్నది, రెండు మేఘాలు ఒరుసుకున్నప్పుడు తళుక్కున మెరిసిన మెరుపు లాంటి నవ్వుతో.

***

మూడు నిముషాల్లో అన్నది గానీ, నిజానికి మూడు నెలల తరువాత ముహూర్తాలు పెట్టుకున్నారు.

చంద్రశేఖర్‌కి అమృతకి వివాహం అయిన నెల రోజుల తరువాత, శశాంకకు దివ్యకు వివాహానికి ముహుర్తం పెట్టారు.

సోమాజిగూడాలో జి.ఆర్.టి. నగల షాప్‌లో మొదటి అంతస్తులో నగలు చూస్తున్నారు.

“అత్తయ్యా మీకీ డైమండ్ నెక్లెస్ చాలా బావుంటుంది, తీసుకోండి” అన్నది దివ్య.

“నీకు ఇది బావుంటుంది తీసుకో” అన్నది అమృత. ఇద్దరూ ఇంటికి వచ్చి నెక్లెస్‍లు పెట్టుకుని అద్దంలో చూసుకుంటున్నారు.

“ఇంటికి దీపం ఇల్లాలే అన్నారు. ఇప్పుడు మా ఇంట్లో రెండు దీపాలున్నయి” అన్నాడు చంద్రశేఖర్.

“ఎందుకుండవు? మీరు చంద్రశేఖర్. మీ కొడుకు కళంకం లేని శశాంక. రెండు చందమామలు చెరో పక్కనా ఉంటే, ఇంక చెప్పేదేముంది?” అన్నది అమృత.

“ఇంక పగలే వెన్నెలా” అన్నది దివ్య.

అందరి ముఖాలమీద, నిండు జాబిల్లి నాటి వెన్నెల వెల్లివిరుస్తుంటే, హృదయాలు ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాల్లా ఉన్నయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here