చిరుజల్లు-137

0
11

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

ఎవరివో.. నీవెవరివో?

[dropcap]పె[/dropcap]ళ్లి వేడుకలన్నీ ముగిశాయి. ఇప్పుడింక చివరి వేడుక రిసెప్షన్ జరుగుతోంది.

అంతా తీరికగా ఉన్నారు. ఆనందంగా ఉన్నారు. అందుచేత ఆ రిసెప్షన్ ఏదో మొక్కుబడిగా, తెచ్చిన బహుమతులు ఇచ్చేసి, తిని పోవటం లాగా కాకుండా, కొత్త జంటను వేదిక మీద కూర్చోబెట్టి ఒక్కొక్కరే వచ్చి, నూతన దంపతుల గురించి తమకు తెల్సిన విషయాలు చెబుతున్నారు. ముందు పెళ్లికూతురు తాతగారు, పెళ్లికొడుకు తాతగారు మాట్లాడారు. వాళ్ల చిన్నప్పటి విషయాలు గుర్తు చేశారు. తరువాత వియ్యంకుళ్లు మాట్లాడారు. మరికొంత ప్రముఖులూ మాట్లాడారు.

ఇన్‍కమ్ టాక్స్ ఆఫీసర్ రమణారావు మాట్లాడుతూ, సరదాగా ఒక ప్రశ్న వేశారు.

“మీరిద్దరూ ఇక ముందు ఒకటే బ్యాంక్ ఎకౌంట్ కలిగి ఉంటారా, ఒక ఎవరి ఎకౌంట్ వాళ్లదేనా?” అని పెళ్లికొడుకును అడిగారు.

“ఒకటే ఎకౌంట్ “అన్నాడు పెళ్లికొడుకు.

“ఆయన డిపాజిట్ చేస్తుంటారు, నేను విత్‌డ్రా చేస్తుంటాను” అన్నది పెళ్లికూతురు.

“మా ఆవిడ కూడా ఇదే పని చేస్తుంది లే” అని నవ్వాడు ఆయన.

దానితో అక్కడ ఉన్నవాళ్లందరి దృష్టి రమణారావు భార్య వైపు మళ్లింది. ఆమె నవ్వుతూ అందరి వంకా చూసింది కించిత్ సిగ్గుతో.

తరువాత వచ్చి మాట్లాడిన వ్యక్తి వేదిక మీద ఉన్న కొత్త జంటను వదిలి, రమణారావునీ, ఆయన భార్య గురించి ఎక్కువగా మాట్లాడాడు.

“మీలాంటి వాళ్లే, ఇలాంటి వాళ్లకు ఆదర్శప్రాయం. ఆలుమగలు అన్నాక, ఒకరి భోగభాగ్యాలే మరొకరి భోగభాగ్యాలుగా, ఒకరి మాటయే మాటగా జంట కవుల వలె ఎల్లప్పుడూ అంటుకు తిరగాలి. రమణారావు గారి దంపతుల మీద కొద్ది సేపటి కింద కురిసింది పువ్వుల నవ్వుల వాన చూడ వేడుకగా. ఆమెను చూడండి, నిండు చంద్రుని బోలు వెల లేని కళలతో వెలయాడు నెమ్మోము, ఆమె ఎక్కడ ఉంటే అక్కడ మాణిక్య దీపముల్ వెలుగు చోటు..” అంటూ మాట్లాడుతుంటే, ఆమె మొహం కోపంతో రగిలి పోయింది.

భోజనాలు చేస్తున్నప్పుడు కూడా ఆమె ప్రసన్నం కాలేదు.

“ఎవడేవాడు?” అని పెళ్లికూతురు తల్లిని అడిగింది.

“వాడా? పెళ్లికొడుకు తరపు వాడంట. ఏవో కథలు, కావ్యాలూ రాస్తానంటూ తిరుగుతుంటాడట గానీ, వీడి కథలు వీడి మొహం లాగానే ఉంటాయిట” అన్నదామె.

రమణరావు భార్య సత్యభామ నిజంగానే గొప్ప సౌందర్యరాశి. ఆమె ఎంతమందిలో ఉన్నా చుక్కల్లో చంద్రుడిలా మెరిసి పోతూనే ఉంటుంది. అందుకామెకు కించిత్ గర్వమూ ఉంది.

ఇంటికి వెళ్తున్నప్పుడూ దారి పొడుగునా మొగుడిని సతాయిస్తూనే ఉంది.

“ఎవడా పనికి మాలిన వెధవ? నా గురించి పిచ్చి వాగుడు వాగాడు. రేపు వాడికో వార్నింగ్ ఇవ్వండి” అన్నది సత్యభామ.

“ఎవడో పిచ్చి వెధవ, పోనియ్” అని రమణారావు అన్నా, ఆమె వదలలేదు.

మర్నాడు రమణారావు వాడి ఫోన్ నెంబరు సేకరించి వాడితో “నిన్న నువ్వు అందరిలో అలా అనటం ఏం బాగోలేదు” అన్నాడు.

“అవునా? అయితే నన్ను క్షమించండి. జరిగిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను” అన్నాడు.

“నీ పేరేంటి?”

“ఏకలవ్యుడు సర్”

“భలే పేరు పెట్టుకున్నావయ్యా. ఏం చేస్తుంటావ్?”

“ఏం లేదండీ. నిరుద్యోగిని సర్. చల్లగాలిని, చందమామనీ, గులాబీపువ్వునీ, సుందరమైన ప్రదేశాన్ని చూసినప్పుడు దాన్ని మెచ్చుకోకుండా ఉండలేం గదా సర్..”

“అవన్నీ ప్రాణంలేనివి. వాటిని నీ నోటికొచ్చినట్లు మెచ్చుకో. కానీ మనుషుల విషయంలో అలా కుదరదు గదా..” అన్నాడు రమణరావు.

“నిజమేనండి. ఫైన్ కడతా నండి” అన్నాడు ఏకలవ్యుడు.

రమణారావు నవ్వేసి ఊరుకున్నాడు.

రెండు నెలల తరువాత ఒక ప్రముఖ వారపత్రిక నుంచి, సత్యభామకు ఒక లెటర్ వచ్చింది. సారాంశం ఏమిటంటే, కథల పోటీకి ఆమె పంపిన కథకు మొదటి బహుమతి వచ్చిందంటూ, పది వేల రూపాయల చెక్ పంపించారు.

సత్యభామ ఆశ్చర్యానికి అంతులేదు.

తను కథ రాసి పంపటం ఏమిటి? దానికి బహమతి రావటం ఏమిటి? భర్తతో ఈ విషయం చెబితే ఆయన అన్నాడు.

“ఆ పిచ్చోడు రాసి నీ పేరున పంపించి ఉంటాడు.”

“వాడు రాసి, నా పేరుతో పంపించటం ఏమిటి?”

“పిచ్చోడని చెప్పాను గదా. ఇలాంటి పిచ్చి పనులే చేస్తుంటాడు. పోన్లే, పదివేలు వచ్చాయి గదా. ఇంక వదిలెయ్” అన్నాడు .

కథతో పాటు చివర ఆమె ఫోన్ నెంబర్ కూడా పత్రికలో ప్రచురించటంతో, తెల్సినవాళ్లు, తెలియని వాళ్లూ ప్రముఖ సాహితీవేత్తలు కూడా ఆమెకు ఫోన్ చేసి ప్రశంసల వర్షం కురిపించేశారు.

“ఇది కథా సాహిత్యంలోనే చిరస్థాయిగా నిల్చిపోయే కథ. ఇంత గొప్ప కథ రాసినందుకు అభినందనలు” అంటూ ప్రముఖ రచయితలూ, రచయిత్రులూ ఆమెను ఆకాశానికి ఎత్తేశారు.

పొగడ పూల పరిమళాల వంటి పొగడ్తలతో సత్యభామ ఉక్కిరి బిక్కిరి అయింది.

ఆమె ఏకలవ్యుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నది.

“కష్టపడి రాశావు. నీ పేరునే పంపించుకోవచ్చు గదా. నా పేరుతో ఎందుకు పంపించావు?” అని అడిగింది.

“అమ్మా, రెండేళ్ల కిందట, ఇదే పత్రికకు, ఇదే కథను పంపితే, ప్రచురణకు కూడా తీసుకోలేదు. తిప్పి పంపించారు.

అదే కథను, అదే పత్రికకు మీ పేరుతో పంపితే మొదటి బహుమతి ఇచ్చారు. దీన్నిబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కథలు రాయటమే కాదు, వాటిని వెలుగులోకి తెచ్చుకునే సామర్థ్యం కూడా ఉండాలని. నాకా సామర్థ్యం లేదు గనుక మీ పేరుతో పంపాను. పేరు ఎవరిదైతేనేం అమ్మా. నేను రాసిన కథను ఇన్నివేల మంది చదివారు. ఆ తృప్తి చాలు నాకు” అన్నాడు ఏకలవ్యుడు.

“పోనీ చెక్ పంపిన డబ్బు అయినా తీసుకో” అన్నది సత్యభామ.

“అమ్మా, నోచిన వారి సొమ్ములవి, నోచని వారికి దక్కునే” అన్నాడు ఏకలవ్యుడు.

“పోనీ భోజనం చేసి వెళ్ళు..” అంటూ భోజనానికి పిల్చిది.

భోజనం చేశాక ఏకలవ్యుడు అన్నాడు – “ఇంతమంచి విందు భోజనం నా జన్మలో తినలేదు. ఈ రుణం ఎలా తీర్చుకోను అమ్మా, నాకు చేతనైన విద్య తెల్ల కాగితాలు నల్లగా చేయటమే. మీరు అనుమతిస్తే, ఈసారి మీ పేరు మీద ఒక నవల పంపిస్తాను” అన్నాడు ఏకలవ్వుడు.

“అసలు నువ్వు ఎవరు? మీది ఏ ఊరు? ఏం చదివావు?” అని అడిగింది సత్యభామ.

“ఎక్కడో ఒక మారు మూల పల్లెటూరిలో పుట్టి పెరిగాను. ఆస్తిపాస్తులు లేవు. అయిన వాళ్లూ లేరు. అతికష్టం మీద డిగ్రీ వరకూ చదివాను. ఆ రోజుల్లోనే ఈ కథలు రాయటం అనే జబ్బు తగులుకుంది. దొరికినదల్లా చదవటం, రోజూ నాలుగు గంటలు తోచినదల్లా రాయటం అలవాటైంది. తాగుడు అలవాటు అయిన వాడు తాగకుండా.. ఎలా ఉండలేదో అలాగే రాయటం అలవాటు అయినవాడు రాయకుండా ఉండదు అనటానికి నేనే నిదర్శనం.. ఏ పత్రిక వాడూ, ఎవడూ నేను పంపినవి వేయక పోయినా, నేను రాస్తునే ఉన్నాను. వందల కథలు రాశాను. కొన్ని నవలలూ రాశాను. ఎవరికీ అక్కర్లేదు. నేనే అప్పుడప్పుడూ తీసి చదువుకుంటూ ఉంటాను. అవన్నీ సీతాకోక చిలుకల్లాంటి అందమైన ఊహలు. అక్షరాల ఉడుపులు ధరించిన మధురమైన అలోచనా తరంగాలు. నేను సృష్టించిన పాత్రలన్నీ సౌందర్యానికీ, సచ్ఛీలానికీ కట్టుబడి నిలిచేవే. అయినా, ‘ఏ గతి రచించిన సమకాలము వారు మెచ్చరు గదా’ అని చేమకూర వెంకటకవి అంతటి వాడు వాపోయాడు. ఇంక నేనేపాటి? నా యీ మేధ అనే సాగర మథనంలో నుంచి ఆవిర్భవించిన కథలనూ, నవలనూ, నలుగురి దృష్టికి తీసుకు వెళ్ళగలిగే శక్తి నాకు లేదు. మీరు రవ్వంత చేయూతనిచ్చి, మీ పేరు మీద అచ్చులోకి తీసుకురాగలిగితే, జన్మ జన్మాంతరాలకూ మీకు రుణపడి ఉంటాను” అన్నాడు ఏకలవ్యుడు.

“ఈ రోజుల్లోనే సినిమాల వాళ్ళూ, ఓటీటీల వాళ్లూ ఎంతో మంది ఘోస్ట్ రచయితల చేత రాయించుకుంటున్నారు. వాళ్ళను ఎవరినీ సంప్రదించ లేదా?” అని అడిగింది సత్యభామ.

“లేదండీ.. వాళ్లు దేనినీ, నేను రాసింది రాసినట్లుగా ఉంచరు. వాళ్ల ఇష్టానుసారంగా మారుస్తారు. అదేమంటే, ఏదో ఫార్ములా అంటారు. హీరోలు ఒప్పుకోరు అంటారు. ఫాన్స్ ఒప్పుకోరు అంటారు. మొత్తం మీద నేను రాసినది ఏదీ రాసినట్లుగా అక్కడ ఉండదు. ఇంక నేను రాసి ప్రయోజనం ఏమిటి?” అని అన్నాడు ఏకలవ్యుడు.

సత్యభామ కొంచెంసేపు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. తరువాత అడిగింది – “మరి, ఏ పనీ చేయకుండా ఎలా బ్రతుకుతావు? బ్రతకటానికి డబ్బు కావాలి గదా..”

“కావాలి. అందుకని ఏవో చిల్లర పనులు చేసేవాడిని. కొన్నాళ్ళు ఒక టైలరింగ్ షాప్‌లో బట్టలు కుట్టేవాడిని.. ఒక సినిమా హాల్లో టిక్కెట్లు బుకింగ్‌లో టికెట్లు అమ్మాను. ఒక మాల్లో సేల్స్‌మన్ పనిచేశాను. దేని మీదా శ్రద్ధ లేదు. అందుకని ఎక్కడా కుదురులేదు.  ఏదో అసహనం ఎప్పుడూ నన్ను నిలకడగా ఉండనిచ్చేది కాదు..” అన్నాడు ఏకలవ్యుడు.

నెలరోజుల తరువాత సత్యభామ పేరుతో ఒక ప్రముఖ పత్రికలో ఒక నవల ప్రచురణ ప్రారంభం అయింది. మొదటి వారం లోనే అది పాఠకులను విశేషంగా ఆదరించింది. నవల పూర్తి కాకముందే, నలుగురు సినిమా నిర్మాతలు ఆ నవలను సినిమాగా తీయటానికి ఆసక్తి చూపించారు. మొదటి నవల తోనే సత్యభామ ప్రముఖ రచయిత్రులలో మొదటి స్థానానికి చేరుకుంది. ఇదంతా ఏకలవ్యుడి ప్రతిభని ఆమెకు తప్ప మరెవరికి తెలియదు.

రమణారావుకి ఢిల్లీకి బదిలీ అయింది. ఆయన అక్కడికి వెళ్లిపోయాడు.

సత్యభామ తండ్రి జనార్దన్ రావు వృద్ధాప్యంలో ఉన్నారు. ఆయన తన ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళటానికి ఇష్టపడలేదు. అందుచేత ఆయనతో పాటే సత్యభామ కూడా ఆ లంకంత కొంపలో ఉండి పోవాల్సి వచ్చింది.

సత్యభామకు తండ్రి అంటే వల్లమాలిన ప్రేమ. ఆమె ఏకలవ్యుడితో అన్నది “నువ్వు నీ సాహితీ సంపదను నాకు అప్పగించాలనుకుంటున్నావు. ఇది ఏ జన్మలోని రుణమో తెలియదు. మా నాన్న.. ఆయనా తన జీవితాన్ని అతి తక్కువ స్థాయి నుంచి ప్రారంభించి, ఇవాళ ఒక ప్రముఖ వ్యక్తిగా ఎదిగాడు. ఆయన సంపాదనంతా నాకు ఇచ్చివేశాడు..”

ఆమె ఉద్వేగంతో మాట్లాడలేకపోయింది.

“మీ తండ్రీ కూతుళ్ల అనుబంధాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ఒక నవల రాస్తాను..” అన్నాడు ఏకలవ్యుడు.

“రాయి. అది నేను మా నాన్నకు అంకితం ఇస్తాను. అంతకన్నా ఆయనకు నేను ఇవ్వగల కానుక ఏమీ ఉండదు” అన్నది సత్యభామ.

అతను వెళ్లబోయే ముందు ఆమె ఒక కోరిక కోరింది.

“నీకు సంసారం లాంటి లంపటాలు ఏమీ లేవంటున్నావుగదా. ఇప్పుడు మా ఆయనా ఇంట్లో లేడు. మా నాన్న, నేనూ.. ఈ ఇంట్లో ఎన్నో గదులు ఖాళీగా ఉన్నయి. వచ్చి మాతో పాటే ఇక్కడే ఉండు. మానాన్నతో పాటే నిన్నూ చూసుకుంటాను..”

ఏకలవ్యుడు కొంచెం ఇబ్బంది పడ్డాడు.

“ఉదయం నుంచీ సాయంత్రం వరకూ వచ్చిమీ ఇంట్లోనే ముందు గదిలో కూర్చుని నా రచనా వ్యాసంగం కొనసాగిస్తాను. కానీ సాయంత్రాలు నాకు వదిలెయ్యండి” అన్నాడు.

“అర్థమైంది. సరే. అలాగే కానివ్వు” అన్నది సత్యభామ.

నెల రోజుల్లో ఏకలవ్యుడు తండ్రీ కూతుళ్ల ప్రేమానుబంధం మీద ఇంతవరకూ సాహిత్యంలో రానంత గొప్ప నవల రాశాడు.

‘..కూతురు ఎలా జీవించాలో తండ్రి నోటితో చెప్పడు. తాను అలా జీవించి చూపిస్తాడు. ఎలాంటి ప్రతిఫలాపేక్షా లేని ప్రేమ కూతురి పట్ల తండ్రికి ఉండే ప్రేమ. కొడుకు మీద ఎంతో కొంత భారాన్ని మోపినా, కూతురి మీద మాత్రం ఈగ కూడా వాలనివ్వడు తండ్రి. తనకున్న భయాలనూ, కన్నీటినీ ప్రేమ అనే పొర చాటునే దాచుకుని, కూతురి ముందు ఒక ధ్వజస్తంభంలా నిశ్చలంగా నిలబడేవాడు తండ్రి ఒక్కడే.  కూతురు ఎంత ఎత్తుకు ఎదిగినా తండ్రి వైపు చూడాలంటే, తల ఎత్తి ఆ ధ్వజస్తంభంపై వైపు చూడాల్సిందే. అందుకనే ఆడపిల్లకు తండ్రిని మించిన హీరో ఎవరూ కూతురు ప్రపంచంలో ఉండరు. ఆయనను ఆదర్శంగా పెట్టుకునే, పురుషులందరి వంక చూస్తుంది..’

అంటూ ఏకలవ్యుడు నవల రాశాడు. అది ఆశించనంత అతి పెద్ద ఆదరణను పొందింది.

ఈ సరికొత్త నవలతో సత్యభామ అత్యున్నత శిఖరాలకు చేరుకుంది.

పెద్ద సభను ఏర్పాటు చేసి, సత్యభామ ఆ నవలను తండ్రికి అంకితం ఇచ్చింది. దానికి వచ్చిన అవార్డులు అన్నీ ఇన్నీ కావు.

మరో నాలుగు అయిదు సంవత్సరాలు గడిచేటప్పటికీ, సత్యభామ పాతిక నవలలు రాసింది.

ఆమెకు పద్మశ్రీ అవార్డు లభించింది.

ఒక పక్క ఆ సంతోషంలో ఉండగానే, ఏకలవ్యుడి ఆరోగ్యం క్షీణించింది. అతనికి కారా కిళ్ళీలు, సిగరెట్లు, తాగుడు – ఉండవలసిన అలవాట్లు అన్నీ ఉన్నాయి.

తీరా డాక్టర్ పరీక్షలు చేయించే సమయానికే కాన్సర్ బాగా ముదిరిపోయింది.

ఆమె సరిగ్గా అవార్డు అందుకునే సమయంలోనే, ఏకలవ్యుడు ఇంక తను వచ్చిన పని పూర్తి అయిందన్నట్లు తుదిశ్వాస విడిచాడు.

మర్నాడు అతను చితిమంటలో కాలిపోతున్నప్పుడు, చెంపల మీద కారిపోతున్న కన్నీటి కాలువలతో చూస్తూ దీర్ఘంగా శ్వాస విడిచి అనుకున్నది.

‘ఎవరు నీవు? నా తల మీద ఈ కీర్తి కిరీటాలను, భుజాల మీద భుజకీర్తులనూ తగిలించి, వెళ్లిపోతున్న నీవు ఎవరు? నేను ఎవరు??’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here